దివ్యదర్శనం
తాత్యాసాహెబ్ అనారోగ్యం రానురాను తీవ్రతరమైంది. ఆయన దేహంపై మొత్తం పదకొండు రాచకురుపులు తేలాయి. వీటిని కోసి కట్టుకట్టడం, రోజూ కట్టువిప్పి మందువేసి చికిత్స చేయడం వల్ల భరించరాని బాధ అనుభవించవలసివచ్చేది. కానీ నూల్కర్ ఈ బాధనంతా ఎంతో ఓర్పుతో సహిస్తూ వచ్చాడు. కనీసం బాధను ఓర్చుకుంటున్నట్లు తెలిపే భావప్రకటన కూడ ముఖంలో కనుపరిచేవాడు కాదు. తనకే కోరికలు లేక నిర్లిప్తంగా గడపసాగాడు. చివరకు తన జబ్బు నయమైపోవాలని కూడా బాబాను కోరలేదు. నిరంతరం బాబా నామాన్నే జపిస్తూ గడపసాగాడు. మశీదునుండి వచ్చిన భక్తులను అక్కడ ఏమి జరిగింది, బాబా ఏమేమి మాట్లాడింది మొదలైన విషయాలు అడిగి వారు చెప్పినదానిని ఆసక్తితో వినేవాడు. అసలు బాబా విషయాలు తప్ప మరే విషయాలు వినేదానికి ఇష్టపడేవాడు కాదు. నూల్కర్ పడకపైవుండి కదలలేని పరిస్థితి ఏర్పడడంతో బాబా దర్శనంలేక తపించి పోయాడు.
బాబా రోజుకు రెండుమార్లు ఒకేమార్గంలో నడిచి లెండీ తోటకు వెళ్ళివచ్చేవారు. ఈ మార్గం సాఠేవాడా వెనుకనవుండేది. మశీదుకు వెళ్ళలేని భక్తులు సాఠేవాడా వెనుక తలుపు తెరుచుకొని బాబా దర్శనం చేసుకునేవారు. నూల్కర్ కదలలేనందువల్ల ఆయన అందుకు కూడ నోచుకోలేదు. బాబా సగుణరూపం దర్శించాలనే కోరికతో తపించిపోయాడు. ఒకరోజు తన పెద్దకుమారుడైన వామనరావును పిలిచి, బాబాకు తన కోరిక విన్నవించమని చెప్పాడు. వామనరావు మశీదుకు బయలుదేరాడు. బాబాకు పిల్లలంటే ఎంతో మక్కువ. వీలు చిక్కినప్పుడల్లా పిల్లలతో ఆడుతూ కులాసాగా గడిపేవారు. వారికి తమాషా కబుర్లు చెప్పి నవ్విస్తూవుండేవారు. వామనరావు మశీదుకెళ్ళేటప్పటికి శ్యామా మేనమామ అయిన లక్ష్మణ్ మామా కుమారుడు బప్పాజీతో (ఏడెనిమిదేళ్ళవాడు) బాబా ఆడుకుంటున్నారు. వామనరావు బాబాకు నమస్కరించి తన తండ్రి కోరిక చెప్పాడు.
బాబా “అలాగే, అతనికి దర్శనం లభిస్తుంది, అల్లా అచ్ఛాకరేగా!” అని చెప్పి తిరిగి బప్పాజీతో ఆడుకోసాగారు. వాడికేవేవో కబుర్లుచెప్పి నవ్విస్తున్నారు. ప్రేమతో వాడి బుగ్గగిల్లి ముద్దు పెట్టుకుంటున్నారు. అప్పుడు నెత్తిమీద మూటపెట్టుకొని బట్టలమ్ముతూ ఒకతను ఆ దారిన వెళుతున్నాడు. అతని చేతిలో పూలు అల్లిన అందమైన రుమాళ్ళున్నాయి. వాటిలో ఎర్రటిరుమాలొకటి బప్పాజీనాకర్షించింది. “బాబా, ఆ ఎర్రరుమాలు నే తీసికోనా?” అని అడిగాడు. బాబా "తీసుకో!” అన్నారు. బప్పాజీ ఆ ఎర్రరుమాలును తీసుకొని మడత పెట్టి తన తలకు చుట్టుకొని బాబా పాదాలకు నమస్కరించాడు. బాబా ప్రేమతో వాడిబుగ్గ గిల్లారు. వాడు తర్వాత రుమాలును తన తలనుండి తీసి బాబా తలమీద పెట్టి పకపకా నవ్వాడు. బాబా అభ్యంతరమేమీ చెప్పలేదు. ఆ రుమాలు కిరీటమైనట్లు, తాము రాజైనట్లు నటిస్తూ ఆ ఠీవి, దర్పం ప్రదర్శిస్తూ చిరునవ్వు నవ్వారు. బప్పాజీ చప్పట్లు చరుస్తూ పకపకా నవ్వాడు. బాబా తర్వాత ఆ రుమాలును తీసి బప్పాజీ తలపై పెట్టారు. బప్పాజీ దానిని తిరిగి బాబా తలపై పెట్టాడు. బాబా తిరిగి దానిని బప్పాజీ తలపై పెట్టి ఇక ఆ ఆట చాలన్నట్లు వాడి బుగ్గ చిదిమి అనునయించారు. ఇదంతా గమనిస్తున్న వామనరావు తర్వాత మశీదు విడిచి వెళ్ళిపోయాడు.
వామనరావు తన తండ్రి కోరిక బాబాకు విన్నవించినట్లు, వారు తన తండ్రికి దర్శనం లభిస్తుందని అన్నారని చెప్పాడు. నూల్కర్ మశీదులో జరిగిన విషయాలన్నీ చెప్పమన్నాడు. ప్రత్యేకంగా చెప్పతగినవేమీ లేవన్నాడు వామనరావు. నూల్కర్ తృప్తి చెందక వామనరావు మశీదుకెళ్ళిన తర్వాత జరిగిన ప్రతివిషయమూ వివరించమని పట్టుబట్టాడు. అప్పుడు వామనరావు మశీదులో బాబా బప్పాజీలమధ్య జరిగిన కేళీవినోదాన్ని వివరించసాగాడు. అది వింటున్నప్పుడు నూల్కర్ సంభ్రమాశ్చర్యాలకు లోనై విచేష్టితుడయ్యాడు. బాబా తనపై చూపిన కరుణకు అతని హృదయం ద్రవించి కంటినుండి నీరు ప్రవహించసాగింది. తండ్రి శోకిస్తున్నందుకు వామనరావు నివ్వెరపోయి కారణ మడిగాడు. నూల్కర్ తను శోకించడంలేదని, బాబా తనపై చూపిన కరుణకు తన కళ్ళు చెమ్మగిల్లాయని అన్నాడు. బాబా తనకు అద్భుతరీతిలో అడిగినదే తడవుగా సాక్షాత్కారం ప్రసాదించారని కూడా చెప్పాడు. వామనరావు ఆశ్చర్యపోతూ బాబా వారికి ఎప్పుడు ఏవిధంగా దర్శనమిచ్చారో తెలుపమన్నాడు. నూల్కర్ పరవశంతో వివరించసాగాడు.
వామనరావు మశీదుకెళ్ళిన తర్వాత తనకు ముందు మశీదు ప్రాంగణం మొత్తం కనిపించిందని, తర్వాత బాబా తమ ఆసనంపై కూర్చునివుండగా ఒక పిల్లవాడు తలపై పెద్దజాస్వండీ పుష్పం పెట్టుకొని (ఎర్రరుమాలు జాస్వండీ పుష్పంలా కనిపించింది) బాబా పాదాలకు నమస్కరిస్తున్నట్లు గోచరించిందని, బాబా ప్రేమతో ఆ పిల్లవాడి బుగ్గ చిదిమి అలరించారు. ఆ పిల్లవాడు తనని తల పైనున్న పుష్పాన్ని బాబా తల పైవుంచి పకపక నవ్వాడు. బాబా దానిని కాసేపు వుంచుకొని తిరిగి దానిని పిల్లవాడి తలపై వుంచారు. పిల్లవాడు దానిని తిరిగి బాబా తలపై ఉంచాడు. బాబా మళ్ళీ దానిని పిల్లవాడి తలపై పెట్టి వాడి బుగ్గగిల్లి మురిపించారు. ఈవిధంగా వామనరావు మశీదులో చూచిన బాబా కేళీవినోదాన్ని మొత్తం తనకు వాడాలోనే సాక్షాత్కరింపజేశారని వారి కరుణ అపారమని నూల్కర్ ఉద్వేగంగా చెప్పాడు. ఈ లీల విన్న భక్తులందరు ముగ్ధులయ్యారు.
సోర్స్: సాయిపథం ప్రధమ సంపుటము
ఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDelete