సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 132వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:
  • భక్తుడు రాంభావుకు ఋజువు చూపిన బాబా

సుమారు 1954లో పూణే వాస్తవ్యుడైన రాంభావు కాకడే కడుపునొప్పితో బాధపడేవాడు. తన డాక్టర్ pleurisy (పార్శ్వశూల) గా అనుమానించి యాంటీ బయాటిక్స్ వాడుతూ బెడ్ రెస్ట్ తీసుకోమని సూచించారు. రాంభావు సాయిబాబాను, స్వామిసమర్థులను పూజించేవాడు. ఒక మధ్యాహ్నం మంచంమీద పడుకుని ఉన్న సమయంలో అతని ఆలోచనలు తీసుకునే ఆహారానికి సంబంధించిన ముడిసరుకుల మీదకి వెళ్లాయి. అతని ఆలోచన ఏమిటంటే - మనం తీసుకునే ఆహారం మన మనస్సు మీద, శరీరం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి అందుకవసరమైన ముడిసరుకులు ఎక్కడనుండి వస్తున్నాయి? వాటిని మనం ఎవరి వద్దనుండి కొనుగోలు చేస్తున్నాము? అనే వివరాలు తెలుసుకోవాలి. వాటిని మనమెలా తీసుకొస్తున్నాము? ఎవరు తీసుకొస్తున్నారు? అనే విషయాలపట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. దానితోపాటు ఎవరు వంట చేస్తున్నారు? ఎలా వండుతున్నారు? అన్న వాటి మీద కూడా శ్రద్ధ వహించాలి. ఈ విషయాలన్నింటి మీద ఆలోచన చెయ్యాలి - అని. ఇలా అతడు దీర్ఘాలోచన చేస్తుండగా బాబా అతని ముందు ప్రత్యక్షమై, "అరె! ఆహార పదార్థాలు నారాయణ్ నుండి తెచ్చుకో!" అని చెప్పి అదృశ్యమైపోయారు. నారాయణ్ అనే కిరాణా దుకాణాదారుని దుకాణం అతని ఇంటికి దగ్గరలో ఉంది. ఆ క్షణంనుండి బాబా సలహా ప్రకారం రాంభావు కిరాణా సరుకులన్నీ నారాయణ్ దుకాణం నుండి తెప్పించుకోసాగాడు. అప్పటినుండి అతని ఆరోగ్యం మెరుగుపడటం మొదలై తొందరలోనే పూర్తిగా కోలుకున్నాడు.

1960లో రాంభావుకొక అద్భుతమైన అనుభవం కలిగింది. ప్రతిరోజు వేకువఝామున లేచి కొంతసమయం ధ్యానంలో గడపటం అతనికి అలవాటు. ఒకరోజు తెల్లవారుఝామున సుమారు 4 గంటల సమయంలో రాంభావు ధ్యానం చేస్తున్నాడు. ఆ సమయంలో స్వామి సమర్థుని దివ్యదర్శనమైంది. అతడు తాను చూస్తున్నది నమ్మలేకపోయాడు. 'ఇది కల కాదు కదా!' అని ఆశ్చర్యచకితుడయ్యాడు. మేలుకుని ఉన్నానా లేదా అని తెలుసుకోవడానికై తనని తాను గిల్లుకున్నాడు. అతను పూర్తి జాగ్రదావస్థలోనే ఉన్నాడు. ఇంతలో స్వామి సమర్థులు అతనితో మాట్లాడటం మొదలుపెట్టారు. అయినా అతను తన కళ్ళముందు జరుగుతున్న దాన్ని నమ్మలేకపోతున్నాడు. ఇంతలో బాబా ప్రత్యక్షమై, "అరె! నీకు ఇంకా అనుమానాలున్నాయా? నన్ను నమ్ము! ఈయన స్వామి సమర్థ" అని చెప్పారు. అతడు, "బాబా! నాకు ఒక అనుభవం లేదా ఋజువు ఇవ్వండి. లేకపోతే నేనెలా నమ్మేది?" అని అన్నాడు. అప్పుడు బాబా, "నీకు ఋజువు కావాలి, అవునా? ఈ ఉదయం నీకు బాసుంది ఇస్తాను. అప్పుడు నన్ను నమ్ముతావా?" అని అన్నారు. అందుకతను, "నాకు ఋజువు దొరికితే, ఖచ్చితంగా నమ్ముతాను" అని అన్నాడు. తరువాత అతడు ధ్యానస్థితి నుండి బయటకి వచ్చాడు.

ప్రతి ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో మారుతి మందిరానికి వెళ్లడం రాంభావుకి అలవాటు. ఆరోజు అతడు మందిరంలోకి ప్రవేశిస్తుండగా ఒక అపరిచితవ్యక్తి అతనిని పిలిచి, "నేను ఈరోజు దేవునికి సమర్పిద్దామని బాసుంది తయారుచేశాను. ఈ ప్రసాదాన్ని నేను ఎవరైనా నైతిక విలువలున్న వ్యక్తికి ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు గుర్తుకు వచ్చావు. ఈ వెండిగ్లాసులో ప్రసాదం ఉంది. దయచేసి ఇది స్వీకరించు!" అన్నాడు. రాంభావు అతనిని గుర్తుపట్టలేదుగాని, "నేను ఎంతోమందితో మాట్లాడుతుంటాను. వాళ్లలో ఈయన ఒకరు అయివుండవచ్చు" అని అనుకున్నాడు. తరువాత అతను బాసుంది స్వీకరించి కొద్దిగా నోట్లో వేసుకున్నాడు. అది చాలా రుచికరంగా ఉంది. అంతవరకూ అతనెప్పుడూ అంత రుచికరమైన బాసుంది తినివుండలేదు. తరువాత అతడు మారుతి ముందర సాష్టాంగపడి, ఆ మూర్తి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాడు. ఆ క్షణాన బాబా చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. సరిగ్గా బాబా చెప్పినట్లుగానే జరిగింది. "ఆ అపరిచితవ్యక్తి వేరెవరో కాదు, నాకు ఋజువు చూపిస్తానని వాగ్దానం చేసిన బాబానే!" అని అనుకుని వెంటనే మందిరం వెలుపలికి పరుగుపెట్టి ఆ అపరిచితవ్యక్తి కోసం వెతికాడు, కానీ ఆ వ్యక్తి ఎక్కడా కనపడలేదు.

Ref: Prasad, Volume 33, No. 9, August 1979.
Source: Baba’s Divine Manifestations  compiled by Vinny Chitluri

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo