సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 123వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. అమ్మకి కంటిచూపు ప్రసాదించిన సాయి
  2. ఇష్టంలేని వివాహంనుండి బాబా నన్ను రక్షించారు

అమ్మకి కంటిచూపు ప్రసాదించిన సాయి

సాయిభక్తులకు నమస్కారం. నా పేరు గాయత్రి. నా నివాసం మంగుళూరు. బాబా మాపై చూపుతున్న కరుణను బ్లాగు ద్వారా సాయిభక్తులతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

మా కుటుంబసభ్యులందరికీ సాయిబాబా అడుగడుగునా అండగా ఉంటూ ఆపదలనుండి కాపాడుతున్నారు. పది సంవత్సరాల క్రితం 2009లో మా అమ్మగారు తీవ్రమైన షుగర్ వ్యాధితో, వీపుమీద పెద్ద పుండుతో చాలా అస్వస్థతకు గురయ్యారు. దానివలన రకరకాల ఆపరేషన్లు జరిగి ఆమె చాలా కష్టాన్ని అనుభవించారు. అంతటి కష్టంనుండి కేవలం బాబా దయతోనే మా అమ్మగారు మాకు తిరిగి దక్కారు. అప్పటినుండి మా అమ్మకి, అత్తయ్యకి ఏ చిన్న ఆరోగ్యసమస్య వచ్చినా మాపై దయతో బాబానే అన్నిటినీ తగ్గిస్తూ మాకు తోడుగా నిలబడుతున్నారు.

ఇటీవల మా అమ్మగారికి కంటి రెటీనా సమస్య వచ్చి కంటిచూపు మందగించింది. ఆ కారణంగా ఆమెకు ఏదీ సరిగా కనపడక చాలా ఇబ్బంది పడుతుండేవారు. 'ఆమె మళ్లీ స్పష్టంగా చూడగలదా?' అని మేమంతా చాలా భయపడ్డాము. అటువంటి సమయంలో మా అన్నయ్య మాతో, "ఈ వయసులో, పైగా షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్న అమ్మకి వచ్చిన రెటీనా సమస్యను తగ్గించడం కేవలం బాబా వల్ల మాత్రమే అవుతుంది. ఆయన దయతోనే వేసిన మందులు సరిగా పనిచేసి అమ్మకి చూపు తిరిగి రాగలదు" అని చెప్పాడు. తనలా చెప్పాక మేమంతా, "బాబా! ఎలాగైనా అమ్మకి కంటిచూపును తిరిగి ప్రసాదించండి" అని హృదయపూర్వకంగా ప్రార్థించాము. అప్పటినుండి ప్రతిరోజు మందులతోపాటు బాబా ఊదీ అమ్మ కంటికి రాస్తూ వస్తున్నాము. ఊదీ మహిమ ఎంతని చెప్పగలం! ప్రతి గురువారానికి ఆమె దృష్టిలో కొంత మార్పు కనబడుతూ ఇప్పటికి 80 శాతం వరకు కంటిచూపు తిరిగి వచ్చింది. బాబా చల్లని దయతో మిగిలిన ఆ చూపు కూడా త్వరలోనే వచ్చేస్తుందని మా నమ్మకం. బాబాని నమ్మి, ఆయన పాదాల చెంత మన సమస్యను సమర్పించుకుని సర్వమూ ఆయనకే వదిలేస్తే, ఆయన మనల్ని తప్పక కాపాడతారు. ఇలాంటి అనుభవాలు మా జీవితాల్లో చాలా ఉన్నాయి. ఆయనెప్పుడూ మా కుటుంబంపై అపారమైన కరుణ చూపుతున్నారు. నా వివాహం సక్రమంగా జరిగి ఈరోజు నేను ఇంత ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నానంటే అది బాబా కరుణే! అయితే కొన్ని కారణాల వల్ల మా అన్నయ్య వివాహం ఆలస్యమవుతూ వస్తోంది. త్వరలోనే బాబా దయతో తనకి మంచి సంబంధం కుదిరి వివాహమవుతుందని నా ఆశ. బాబా ఎప్పుడూ నాకు, మా అన్నయ్యకి, అమ్మకి, అత్తకి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే, తనను నమ్మినవాళ్లకి బాబా సదా అండగా ఉంటూ, వాళ్ల కర్మలని నివృత్తి చేసి, వారి జీవితాలని సరైన మార్గంలో  నడిపిస్తారని నాకు తెలుసు.

ఇష్టంలేని వివాహంనుండి బాబా నన్ను రక్షించారు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం శ్రీసాయినాథాయ నమః.

నేనిప్పుడు చెప్పబోయే అనుభవం జరగడానికి ముందు నేను సాయిభక్తురాలిని కాదు. ఈ అనుభవంతో ఆయన ఉనికిపట్ల నాకు గట్టి నమ్మకం ఏర్పడింది.

కొన్నినెలల క్రితం నాకు మా బంధువుల తరఫు నుండి వివాహ ప్రతిపాదన వచ్చింది. అన్నీ బాగున్నప్పటికీ నాకు ఆ అబ్బాయి నచ్చలేదు. నేను పెరిగిన వాతావరణంలో నా అభిప్రాయం గురించి గొంతెత్తి మాట్లాడేందుకు నాకు అవకాశం లేదు. ఆ కారణంగా నా ఇష్టానికి వ్యతిరేకంగా నా వివాహం నిశ్చయమయింది. అది నా మనస్సును చాలా అస్థిరపరచింది. అందరిలాగే నేను వివాహం గురించి చాలా కలలు కన్నాను. కానీ జరిగిన పరిణామాలతో నా మనస్సు ముక్కలైపోయింది.

అలాంటి సమయంలో ఒకరోజు నా ఫ్రెండ్ నాతో బాబా గురించి చెప్పింది. అప్పుడు నేను బాబా గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఆ ప్రయత్నంలో నాకు హేతల్ గారి ఇంగ్లీష్ బ్లాగు కనిపించింది. ఆ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతుంటే సాయిబాబా పట్ల నాకు విశ్వాసం ఏర్పడి సచ్చరిత్ర పారాయణ చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నా పరిస్థితి నుండి బయటపడే మార్గం చూపినట్లైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాను ప్రార్థించి పారాయణ మొదలుపెట్టాను. రోజులు గడుస్తూ సచ్చరిత్ర ముగింపుదశకు వచ్చేసరికి బాబా అద్భుతం చూపించారు. కొన్ని కారణాల దృష్ట్యా నా తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేశారు. జీవిత సమస్య నుండి బాబా నన్ను బయటపడేసారు. నా ఆనందానికి అవధుల్లేవు. శ్రద్ధ, సహనం కలిగి స్వచ్ఛమైన మనస్సుతో బాబాను ప్రార్థిస్తే మన కోరిక తప్పక నెరవేరుతుందని తెలుసుకున్నాను. "చాలా ధన్యవాదాలు బాబా! నా అనుభవాన్ని ఎలా వివరించాలో తెలియక చాలా ఆలస్యంగా తోటి సాయిభక్తులతో పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా! ఎల్లప్పుడూ మీరు నాకు తోడుగా ఉండి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కోవటానికి అవసరమైన ధైర్యం, బలం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో మీరు చూపే అద్భుతాలు అనేకం అనుభవించాలని ఆశిస్తున్నాను". బ్లాగు ద్వారా అనుభవాలు పంచుకుంటున్న వారందరికీ నా ధన్యవాదాలు.


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo