సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 152వ భాగం....


ఈరోజు భాగంలో:
  • నూనె లేని దీపాలు వెలిగించడం గురించి బాబా వివరణ

2002, జూలై 24న పవిత్రమైన గురుపూర్ణిమ పండుగ వచ్చింది. ఆరోజు తెల్లవారుఝామున మేఘశ్రీ కామత్ సాయిబాబా మందిరాన్ని దర్శించి పండ్లు, మిఠాయిలు బాబాకు సమర్పించుకున్నారు. తరువాత ఆమె విజయ్ హజారేగారి ఇంటికి వెళ్ళి బాబా లీలల గురించి మాట్లాడుకుంటూ సమయాన్ని అర్థవంతంగా గడిపారు. రాత్రి తన అలవాటు ప్రకారం బాబా నామం స్మరించుకుంటూ ఆమె నిద్రలోకి జారుకున్నారు. కాసేపటికి తన జీవితాన్ని మార్చేసే అద్భుతమైన కల వచ్చింది.

కలలో ద్వారకామాయి కనిపించింది. బాబా తమ ప్రక్కన ఉన్న కఠడాపై ఎడమ మోచేయి ఆనించుకుని తమ సహజరీతిన కూర్చుని ఉన్నారు. మేఘ గబగబా ద్వారకామాయి మెట్లెక్కి బాబా పాదాలను పట్టుకుని, తన తలను ఆయన పాదాలపై ఉంచారు. బాబా తమ దివ్యహస్తాలను ఆమె తలమీద ఉంచి, "అల్లా మాలిక్" అని ఆశీర్వదించి, కొంచెం ఊదీ ఆమె నుదుటిమీద పెట్టారు. ఆమె బాబా ముందు కూర్చుని, "బాబా! మీరెందుకు మట్టి ప్రమిదలలో నీళ్లు పోసి దీపాలు వెలిగించారు?" అని అడిగింది. బాబా కాసేపు మౌనంగా ఉండి, "నేను నూనె లేకుండా దీపాలు వెలిగించేది నా భక్తులందరి మేలు కోసం. ప్రతి ఒక్క భక్తుని కోసం నా హృదయం ప్రేమ, దయ, జాలి, కరుణతో పొంగిపొర్లుతోంది. అయినప్పటికీ, మనుషుల దుర్మార్గపు ధోరణులను చూసి నాకు దుఃఖం కలుగుతుంది. దురదృష్టవశాత్తు, అది విస్తృతంగా వ్యాపించి నాలుగుదిశలలో అదే కనిపిస్తూ నన్ను బాధిస్తుంది" అని అన్నారు. వెంటనే ఆమె, "బాబా! ఎలాంటి దుర్మార్గపు ధోరణులు?" అని అడిగింది. అందుకు బాబా తల ఆడిస్తూ, "చాలామంది జనులు రోజూ ప్రమిదలలో నూనె పోసి దీపాలు వెలిగిస్తారు. వాళ్ళు వాటిని తమ పూజగదిలో దేవుని ముందు, బయట ద్వారం వద్ద, తులసి బృందావనం వద్ద పెడతారు. ఆచారపూర్వకంగా కొంతమంది రోజుకు నాలుగుసార్లు దీపాలు పెడతారు. ఇంకొంతమంది పూజగదిలో 'అఖండ జ్యోతి' పెడతారు. అయినా వాళ్ళు ద్వేషపూరితంగా, హానికరంగా, సాటి మనుషుల పట్ల అమానుషంగా ఉంటారు. వాళ్ళ హృదయంలో సాటి మనుషుల పట్ల సానుభూతి, మానవత్వం, ప్రేమ లోపించాయి. ప్రేమ, దయ లేకుండా దీపాలు వెలిగిస్తే అది వ్యర్థం. అది నూనె లేకుండా దీపాలు వెలిగించడంతో సమానం. అలా ఎందుకు దీపాలు వెలిగించడం? రోజూ దీపాలు వెలిగించి, బయటికి వెళ్ళి ఇతరుల విషయంలో మోసాలు, కుట్రలు చేస్తారు. తరువాత మీ భక్తిని ప్రదర్శించుకోవడానికి అధిక మొత్తంలో డబ్బులు, ధూపాలు, పూలు, నైవేద్యాలు నాకు సమర్పిస్తారు. ఆ మనిషి ఆడైనా, మగైనా, సోదరసోదరీమణులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, ఏ బంధువులైనా కావచ్చు, కానీ ప్రేమలేని ఆ అనుబంధాలు వ్యర్థమైనవి. వాళ్లంతా రక్తసంబంధీకులు అయినందున కర్మసంబంధంగా తలచి అర్థాంగీకారంతోనే ఆ సంబంధాలను భరిస్తారు. దురదృష్టంకొలది అత్త తన కోడలిని సొంత కూతురిలా భావించదు. అన్న భార్య తమ్ముడి భార్యని సోదరీభావంతో ప్రేమ చూపించదు. మీ బుద్ధిలో, హృదయంలో తీవ్రమైన అంధకారం గూడుకట్టుకోవడం నేను గమనిస్తున్నాను. వాస్తవానికి మీలో కొంతమంది మానవత్వం, దయ కలిగి సరైన మార్గంలో జీవించేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివాళ్ళు ఈ ప్రపంచంలో మనుగడ సాగించడం చాలా కష్టం. మీ మనస్సునందు, హృదయమునందు ప్రేమ లేనిచో దీపాలు వెలిగించడం గురించి ఆలోచించవద్దు. ఎవరి హృదయం ఇతరులపట్ల చెడుతలంపులు లేకుండా స్వచ్ఛంగా ఉంటుందో ఆ వ్యక్తే దీపాలు వెలిగించాలి, అప్పుడే అది అంధకారాన్ని పారద్రోలుతుంది. అప్పుడే నిజమైన జ్యోతి వెలుగుతుంది. ఇతరులపట్ల మంచి సంకల్పం లేకపోతే నా ఊదీకాని, ధ్యానంకాని మీకు సహాయపడవు. ఎప్పుడైతే మీరు ప్రేమ, కరుణలను అలవరచుకుంటారో అప్పుడు అంధకారం మాయమైపోతుంది. నా చుట్టూ ఉన్న తీవ్రమైన అంధకారాన్ని చూసి నాకు బాధ కలుగుతుంది. బేటా! నీవు దీపాలు నీటితో వెలిగించడం గురించి ప్రశ్నించావు. అందుకే నేను ఇవన్నీ నీకు చెప్పాను. నేను ఏదైతే చెప్పానో దానిగురించి నీవు ఎంతమంది భక్తులకు వీలైతే అంతమందికి తెలియచేసి, అవగాహన కలిగిస్తే, అది మీ అందరికీ చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. నా సందేశాన్ని స్వీకరించి వారి చెడు మార్గాలను మార్చుకున్నంతవరకు వాళ్ళు నా లీలలు, చరిత్ర చదవకపోయినా, నాకు ఆరతులు చేయకపోయినా ఫరవాలేదు. బేటా! నువ్వు ఇది నాకోసం చేస్తావా?" అని చెప్పి కన్నీళ్లు నిండిన కళ్ళతో బాబా తమ చేతిని మేఘ తలపై ఉంచి ఆశీర్వదించారు. మరుక్షణం ఆమెకు మెలకువ వచ్చి, తాను కలగన్నానని గ్రహించింది. ఆ క్షణంనుంచి తాను కలుసుకున్న ప్రతి భక్తునికి ఆ ప్రత్యేకమైన బాబా సందేశాన్ని తెలియజేయడమే తన జీవితధ్యేయంగా మారిపోయింది.

మనం మన కర్మల ద్వారా సృష్టించుకున్న అంధకారాన్ని తొలగించడానికి బాబా తనదైన ప్రత్యేకశైలిలో మనకి సహాయం చేస్తారు. ఆయన ఈ లీల ద్వారా ఆత్మజ్యోతి(ఆత్మ సాక్షాత్కారం) వెలిగించడానికి ప్రతిఒక్కరూ సాధన చేయాలని సందేశాన్నిస్తున్నారు.

Ref.: Sai Prasad, Deepavali vissesh ank, 2002.
Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri.

1 comment:

  1. Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏💖💖💖💖🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo