సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 426వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • దారి చూపడానికి బాబాయే వచ్చారా!

సాయిభక్తుడు ఆయుష్‌ధార్ తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! ఎన్నో అనుభవాలతో ఎంతో నేర్చుకుంటూ సాగే సద్గురు సాయితో ప్రయాణం అద్భుతమైనది. ఎల్లప్పుడూ నాతో ఉంటున్నందుకు ముందుగా నేను బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను జమ్మూ నగరానికి చెందినవాడిని. నేను నా గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ మహారాష్ట్రలో పూర్తిచేశాను. నేనిప్పుడు చెప్పబోయేది చాలా ఆసక్తికరమైన అనుభవం.

"నేను ఎప్పుడూ నా భక్తుల సంక్షేమాన్ని చూసుకుంటాను", "పిచ్చుక కాలికి దారంకట్టి ఈడ్చునట్లు నా భక్తులను నా వద్దకు లాక్కుంటాను" అని బాబా చెప్పారు. 2017, జులైలో నా అడ్మిషన్ అనే ఒక చిన్న సాకుతో నన్ను, నా తల్లిదండ్రులను శిరిడీ రప్పించుకున్నారు బాబా. నేను, మా అమ్మ, నాన్న మరియు మా కజిన్ కలిసి ఒక అర్థరాత్రి కారులో శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నాము. అంతకుముందు మేమెప్పుడూ మా సొంత కారులో శిరిడీ వెళ్లనందున ఆ మార్గం గురించి మాకు ఖచ్చితంగా తెలియదు. అయితే మా కజిన్, "ఆందోళన చెందడానికి ఏమీలేదు, మనం GPS సహాయం తీసుకుందామ"ని చెప్పారు. సరేనని మేము నవీ ముంబాయి నుండి రాత్రి 9 గంటలకు బయలుదేరాము. ఆ సమయంలో భారీవర్షం పడుతోంది. మేము, "బాబా! మమ్మల్ని సురక్షితంగా శిరిడీ చేర్చండి" అని బాబాను ప్రార్థిస్తూ ప్రయాణం సాగిస్తున్నాము. మూడు, నాలుగు గంటల పాటు మా ప్రయాణం సజావుగా సాగింది. ఆ తరువాత నుంచి మేము శిరిడీ చేరుకోవాల్సిన సమయం పెరగడం మొదలైంది. మాకు అంతా అయోమయంగా తోచింది. మేము GPSను అనుసరిస్తూ భయానక ప్రదేశాలగుండా ప్రయాణిస్తున్నాము. కానీ గత్యంతరం లేక GPSను అనుసరిస్తూనే, బాబాను స్మరిస్తూ ఉన్నాము. మేము ప్రయాణించాల్సిన దూరం తగ్గడం లేదు. దాదాపు మేము శిరిడీ నుండి ఒక గంట ప్రయాణ దూరంలో ఉన్నప్పుడు GPS సరైన మార్గాన్ని చూపించడం మానేసింది. గుంతలు నిండిన ఇరుకైన మార్గంలో, ఎక్కడా ఏ మాత్రం వెలుగు కనపడటం లేదు, వాహనాల కదలిక లేదు. అటువంటి ప్రదేశంలో మేము చిక్కుకున్నాము. అప్పుడు సమయం తెల్లవారుఝామున 4 గంటలైంది. నిజానికి మేము కాకడ ఆరతికి హాజరవ్వాలని అనుకున్నాము. కానీ మేమింకా దారిలోనే ఉన్నాము. దిక్కుతోచని ఆ స్థితిలో ఏమి చేయాలో అర్థంకాక సహాయం కోసం బాబాను ప్రార్థిస్తూ, సురక్షితంగా తన దర్బారుకు చేర్చుకోమని సాయితల్లి పేరును గట్టిగా జపిస్తున్నాము. కొన్ని నిమిషాల తరువాత ఎదురుగా ఒక కాంతి కనిపించింది. అది ఒక ద్విచక్రవాహనం. క్షణాల్లో ఆ వాహనం మమ్మల్ని సమీపించింది. దానిపై తెల్లని షర్ట్, ప్యాంట్, తలకు గాంధీటోపీ ధరించిన ఒక వృద్ధుడు ఉన్నాడు. అతను, "మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు?" అని అడిగారు. నా కజిన్, “శిరిడీ సమాధిమందిరానికి వెళ్ళాలి, దయచేసి మీరు మాకు మార్గం చూపించగలరా?" అని అంది. అందుకతను, "ఒహ్హ్! చింతించకండి. మీరు దారితప్పారు. కారు వెనక్కి తిప్పి ఈ రహదారి వెంబడి తిన్నగా 5 కిలోమీటర్లు వెళ్ళండి. ఈ మార్గం మిమ్మల్ని బాబా మందిరానికి చేరుస్తుంది. కావాలంటే మీరు నన్ను అనుసరించవచ్చు, నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. నేను మందిర ప్రాంగణంలో ప్యూనుగా పనిచేస్తున్నాను" అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే నా మనస్సుకు 'స్వయంగా బాబాయే మాకు సహాయం చేయడానికి వచ్చార'ని అనిపించింది. మేము అతనిని అనుసరించడం మొదలుపెట్టాము. అతను చాలా వేగంగా వెళ్తున్నాడు. మేము అతని వేగాన్ని అస్సలు అందుకోలేకపోతున్నాము. ఎలాగో మొత్తానికి మేము శిరిడీలోకి ప్రవేశించాము. ఒక్కసారి అతను వెనక్కి తిరిగి చూశాడు. మేము అతనిని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ మధ్యలో ఉన్న దూరాన్ని అధిగమించేలోపు అతను మరి కనిపించలేదు. అంతలోనే గాలిలో కలిసిపోయినట్లు అతనెలా అదృశ్యమైపోయారు? వావ్! ఏమా అనుభవం! మేము ఆశ్చర్యపోయాము. బాబా చూపిన కృపకు అతిశయించిన ఆనందంతో ధన్యవాదాలు తెలుపుకున్నాము.

మొత్తానికి బాబా కృపతో మేము సుమారు 5 గంటలకు శిరిడీ చేరుకున్నాము. ఆరతికి హాజరై, బాబా దర్శనం చేసుకుని సాయంత్రం శిరిడీ నుండి సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యాము. నాసిక్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో ఆ మార్గాన్ని మూసేశారు. అందువలన మేము మరో మార్గం పట్టుకోవలసి వచ్చింది. ఆ ప్రయత్నంలో మేము మళ్ళీ దారి తప్పిపోయాము. వెనక్కి తిరిగి వస్తూ బాబాను సహాయం కోసం ప్రార్థిస్తూ, ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఎవరినైనా సహాయం అడుగుదామని అనుకున్నాము. అప్పుడు రాత్రి 12 అయింది. పెట్రోల్ బంక్ దగ్గర ఎవరూ లేరు. ఏమి చేయాలో అర్థంకాక బాబాను తలచుకుంటూ ఉండగా హఠాత్తుగా ఒక ట్రక్ వచ్చి ఆగింది. అతను మా సమస్యను విని, "చింతించకండి. నేను భీవండి వెళ్తున్నాను. మీరు నన్ను అనుసరించండి. నేను మిమ్మల్ని జాతీయ రహదారి వరకు తీసుకెళ్తాను. అక్కడనుండి మీరు ఎడమవైపు తీసుకుని ముంబాయి చేరుకోవచ్చు” అని చెప్పాడు. బాబా మళ్ళీ మాకు తమ సహాయాన్ని అందిస్తున్నారని గ్రహించి మా కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి. మేము దారితప్పిన రెండు సందర్భాలలోనూ గమ్యం చేరుకోవడంలో ఆయన మాకు సహాయం చేశారు. ఆయన దయవల్ల ఆ గ్రామీణ రహదారులపై మేము ఏ దురదృష్టకర పరిస్థితి ఎదుర్కోకుండా బయటపడ్డాము. బాబా తన భక్తులను శిరిడీకి రప్పించుకున్నప్పుడు, వారి క్షేమాన్ని కూడా ఆయన చూసుకుంటారు. ఇలాంటి దైవిక అనుభవాలు నాకు చాలా ఉన్నాయి, వాటిని ఇంకోసారి మీతో పంచుకుంటాను. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి".

source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2613.html?m=0


సాయి అనుగ్రహసుమాలు - 384వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - పద్దెనిమిదవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

శిరిడీలో నేను సుదీర్ఘకాలం ఉన్నాను. బాబా ప్రసంగవశాత్తూ నన్ను దక్షిణ అడుగుతుండేవారు. నా దగ్గర డబ్బులున్నంత వరకూ నేను వారికి ఇస్తూనే ఉండేవాణ్ణి. చాలాసార్లు వైకుంఠని అడిగి డబ్బు తెప్పించుకోవలసి వచ్చేది. అప్పుడతను, “బాబా దక్షిణ ఎందుకు అడుగుతారు?" అని అడిగేవాడు. నా డబ్బులోనుంచే అతను నాకు డబ్బు పంపించేవాడు. అయినప్పటికీ అతని మనసుకి దుఃఖం కలిగేది. బాబా ఎవరినైనా పంపించి, నన్ను తమ వద్దకు పిలిపించి దక్షిణ అడిగేవారు. అంతేకాదు, వేరే వ్యక్తుల పేర్లు చెప్పి వారినుంచి దక్షిణ తెచ్చే పనిని నాకప్పజెప్పేవారు. ఆ తరువాత ప్రతిరోజూ అలాగే జరిగేది. అప్పటినుంచి బాబా నన్ను 'బాబు' అని పిలవటం మొదలుపెట్టారు. అలాగే చివరిదాకా నన్ను ఆ పేరుతోనే పిలిచేవారు.

ఒకసారి నేను లోపలిగదిలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నప్పుడు మస్తిష్కం పైభాగంలోని ద్వారం తెరచుకుని సహస్రారచక్రమార్గం తెరుచుకున్నట్లు నాకనిపించింది. అప్పుడు డా౹౹పిళ్ళేగారు ఉపాసనీ మహారాజుని, "వామనరావుని బాబా ఎందుకు వెళ్ళనీయటంలేద"ని అడిగాడు. శ్రీఉపాసనీ మహారాజు అతనితో, “బాబా అతని చక్రం మరొకటి తెరిపించవలసి ఉంది" అని చెప్పారు. అది విని నాకు, “లలాటంలో ఉన్న ఏదో ద్వారాన్ని తెరచి బాబా నాపై కృప చూపించారు” అన్న విశ్వాసం కలిగింది.

ఆరోజుల్లో నేను వశిష్ఠగీతను చదువుతున్నాను. ఒకరోజు అందులో ప్రాణాయామ విశిష్టతను గురించి చదివి నేను ప్రాణాయామం చేస్తూ కూర్చున్నాను. ఇంతలో బాబా ఒక వ్యక్తిని పంపించి నన్ను పిలిపిస్తే నేనక్కడకు వెళ్ళాను. బాబా ఏమీ చెప్పకుండా నన్ను ఒక గంటసేపు అలాగే కూర్చోపెట్టారు. తరువాత కొందరి భక్తుల నుంచి దక్షిణ తెమ్మని నన్ను పంపించారు. రెండవసారి ప్రాణాయామం ప్రారంభించబోతున్నప్పుడు బాబా మళ్ళీ పిలిపించారు. నాకు వినిపించలేదేమో అనుకుని రాధాకృష్ణమాయి నా తలుపు తట్టి నన్ను బయటకు పిలిచి బాబా వద్దకు పంపించింది. అప్పుడు కూడా బాబా నన్ను చాలాసేవు ఉంచేశారు. దాంతో 'ప్రాణాయామక్రియ నాకోసం కాద'ని బాబా నాకు సూచించాలనుకుంటున్నారని నాకు అర్థమైంది.

ఈ రోజుల్లోనే ఒకనాటి మధ్యాహ్నం బాబా పాత ధోవతిని వెడల్పాటి పీలికలుగా చించి తమకోసం ఒక నాడా తయారు చేసుకున్నారు. ఒకటి, రెండుసార్లు దర్జీవాడిని పిలిపించి 18 గజాల ముతక వస్త్రాన్ని తెప్పించి, "కఫ్నీ కుట్టమ"ని ఆజ్ఞాపించారు. అతను ఆ ముతక వస్త్రాన్ని మడతపెట్టి రెండు మడతలలో కఫ్నీని తయారుచేశాడు. తలకు కట్టుకోవటానికి రెండున్నర గజాల (అయిదు మూరలు) ముక్కను కూడా తెప్పించేవారు బాబా. ఒకసారి బాబా నాతో, “మొదట్లో నేను పల్చని వస్త్రాన్ని వాడేవాడిని. అందువల్ల ప్రజలు నన్ను దూరంగా పెట్టేశారు. అందుకని నేను ముతక వస్త్రం వాడాలని నిశ్చయించుకున్నాను" అన్నారు.

ఒకసారి ధుని దగ్గర ఉండే నల్ల స్తంభం వైపు వేలుపెట్టి చూపిస్తూ నాతో, "మొదట ఇక్కడ ఒక గుహ ఉండేది. నేను రోజంతా ఇక్కడే కూర్చొని ఉండేవాడిని. అప్పుడు నాకు జడలూ, గడ్డమూ పెరిగాయి. నా గడ్డం ఎంత పొడవుగా పెరిగిందంటే అది భూమిని తాకుతూండేది. నేను బయటకు వెళ్ళినప్పుడు అది చీపురులా భూమిని శుభ్రం చేసేది. నేను ఎప్పుడో ఒకసారి ఈ గుహ నుండి బయటకు వచ్చేవాడిని. ఎవరైనా సత్యవంతుడూ, పుణ్యమూర్తీ వస్తే బయటకొచ్చి రెండు మూడు మాటలు అతనితో మాట్లాడేవాడిని. అప్పట్లో నేను కాఫీ త్రాగేవాణ్ణి. కానీ దాన్ని తయారుచేసే పద్ధతి వేరుగా ఉండేది. సగం నీరూ, సగం పాలూ తీసుకుని దాన్లో శొంఠిని వేసి కాఫీ చేసి త్రాగేవాణ్ణి. అలాగే నేను రకరకాలుగా కూరలు కూడా వండేవాణ్ణి. లేత పచ్చికలో ఉల్లిపాయ, మసాలా వేసి ఒకరకమైన కూరను వండేవాణ్ణి” అన్నారు.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 425వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బ్రతుకు భారమైనవేళ అండగా నిలిచి నడిపిస్తున్న బాబా 
  2. ఊదీ మహిమ

బ్రతుకు భారమైనవేళ అండగా నిలిచి నడిపిస్తున్న బాబా 

ప్రియమైన సాయిభక్తులకు నమస్కారం. నేను సాయిభక్తుడిని. కొన్ని కారణాల వలన నా పేరు తెలియజేయాలని అనుకోవడం లేదు. నేను మహాపారాయణ గ్రూపులో సభ్యుడిని. ఎమ్.పి 9425, సంకల్ప సాయి గ్రూపు క్లాస్ టీచర్ని. నేను నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకోవాలని దీనిని వ్రాస్తున్నాను.

నేను నా తల్లిదండ్రులననుసరించి దేవతలందరినీ ప్రార్థిస్తుండేవాడిని. 2018, డిసెంబరులో నేను ప్రేమించిన అమ్మాయితో నాకు నిశ్చితార్థం అయింది. అయితే నా చెడు కర్మ కారణంగా 2019, జనవరిలో అమ్మాయి కుటుంబం వాళ్ళు ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. వాళ్ళనుండి నేను చాలా నిందలను ఎదుర్కొన్నాను. చివరికి నేను ప్రేమించిన అమ్మాయి కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకొని నన్ను చాలా నిరాశకు గురిచేసింది. సమస్యను పరిష్కరించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ నాకు కాలం కలిసి రాలేదు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరమవడంతో నేను పడ్డ బాధ, అనుభవించిన వ్యధ వర్ణనాతీతం. తను లేని బ్రతుకు భారంగా అనిపించి మనసులో ఏవేవో చెడు తలంపులు. అయినా నా తల్లిదండ్రులకోసం నా మనసును దృఢపరచుకున్నాను. 

అటువంటి పరిస్థితుల్లో స్నేహితులు, కుటుంబసభ్యుల సలహా మేరకు నేను జ్యోతిష్కుల వద్దకు వెళ్ళాను. ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వాళ్ళు చెప్పిన అనేక పూజలు, ఇతర కార్యక్రమాలు చేశాను. ఆ అవసరాలకోసం స్నేహితులు, బంధువులు, మరియు బ్యాంకు ద్వారా అప్పుగా 8 లక్షల రూపాయలు తీసుకున్నాను. నాకు కుజదోషం, కాలసర్పదోషం ఉన్నాయని చాలామంది చెప్పారు. మరికొంతమంది మేమంటే గిట్టనివారు మామీద క్షుద్రపూజలు చేశారని చెప్పారు. అందువలన నా కుటుంబంలో ఎవరికీ ఏమి కాకూడదని, ప్రేమించిన అమ్మాయితో వివాహమై మా ఇంట సంతోషం వెల్లివిరియాలని అంత డబ్బు ఖర్చు పెట్టాను. కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు. దాంతో ఏమి చేసినా నా తలరాత మారడం లేదని నేను చాలా నిరాశకు గురయ్యాను.

ఇలా ఉండగా 2019, ఏప్రిల్ నెలలో ఒకరోజు మా మావయ్య నాతో బాబాను ప్రార్థించమని చెప్పారు. అప్పటినుండి నేను బాబాను నమ్మడం మొదలుపెట్టాను. 2019, మే నుండి సాయిసచ్చరిత్ర చదవడం మొదలుపెట్టాను. మహాపారాయణలో కూడా చేరాను. బాబా ఆశీర్వాదంతో ఒక మహాపారాయణ గ్రూపుకి టీచర్ని కూడా అయ్యాను. ఆ తరువాత నెమ్మదిగా నా జీవితంలో మార్పులు మొదలయ్యాయి. జ్యోతిష్యులు చెప్పింది నిజమో, కాదో తెలియకపోయినా మంచి జరుగుతుందన్న గుడ్డినమ్మకంతో తీసుకున్న అప్పులన్నీ బాబా ఆశీస్సులతో తీర్చగలిగాను. కేవలం బాబా కృపవలన ఈరోజు నాపై ఎటువంటి ఆర్థిక భారం లేదన్న నిశ్చింతతో సంతోషంగా ఉన్నాను. "బాబా! అంతపెద్ద భారాన్ని తొలగించిన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జీవితంలో నాకున్న కోరికను నెరవేర్చమని మీ పాదాల వద్ద నా శిరస్సు ఉంచి వేడుకుంటున్నాను".

ఎన్ని చేసినా నా తలరాత మారలేదు. నా జీవితంలోకి ఆమె మళ్ళీ రాలేదు. ఇక రాదు కూడా. ఏ జన్మ పాపమో ఇప్పుడు అనుభవిస్తున్నాను. అయినా అన్నీ వదిలేసి బాబా, గురువుగారి మీద భారం వేసి బ్రతుకుతున్నాను. ప్రస్తుతం గురువుగారితో భక్తులు తమకు గల అనుభవాలు రోజూ పంచుకుంటుంటే వాటిని వింటూ కొంచెం కొంచెం ధైర్యం తెచ్చుకుంటున్నాను. బాబా కోరిన శ్రద్ధ, సబూరీలను అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నిజంగా బాబా లేకపోతే నేనేమైపోయేవాడినో నాకు తెలియదు. ఆయన నాకు అండగా ఉంటూ నన్ను నడిపిస్తున్నారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".

చివరిగా బాబా, గురువుగారిని అడిగేది ఒకటే - "నా మీద పడ్డ నిందలు తొలగిపోవాలి. వీలయితే ఆ అమ్మాయిని, నన్ను కలపండి. మీ కృప ఉంటే నా కోరిక నెరవేరవచ్చని, మీరు తలచుకుంటే నా తలరాత మరొచ్చునేమోనని చిన్న ఆశ. ఈ ఆశ కూడా ఒక భక్తుని అనుభవం విన్నపుడు కలిగింది. ఇక మీ దయ".

ఊదీ మహిమ

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు. నేను ఇదివరకు ఒక అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇటీవల జరిగిన మరో చిన్న అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 

మూడురోజుల క్రితం, అంటే 2020 మే నెల మూడవ వారంలో హఠాత్తుగా మా అమ్మగారి కుడిచేయి పటుత్వం కోల్పోయింది. ఏ వస్తువు పట్టుకోవాలన్నా తన చేతకాలేదు. ఏ కష్టం వచ్చినా పిలిచినంతనే అండగా నిలిచే బాబాకి అమ్మ నమస్కరించుకుని ఊదీని చేతికి రాసుకుంది. నేను కూడా అమ్మకి నయమవ్వాలని బాబాను ప్రార్థించి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాను. నాలుగైదుసార్లు ఊదీ రాసుకున్నాక బాబా కృపతో గుణం కనిపించింది. ఇప్పుడు అమ్మకి కాస్త బాగానే వుంది. త్వరలోనే అమ్మకి పూర్తిగా నయమయ్యేలా బాబా చేస్తారని ఆశిస్తున్నాను. "బాబా! మీకు ధన్యవాదాలు. నా తప్పులు ఏవైనా ఉంటే మన్నించండి. ఈ కొరోనా నుంచి అందర్నీ కాపాడండి బాబా".


సాయి అనుగ్రహసుమాలు - 383వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - పదిహేడవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఒకసారి నేను బాబాకి సమీపంలో కట్టడాకి వెలుపల నేలమీద కూర్చొని ఉన్నాను. ఆ సమయంలో నాకొక ఆలోచన వచ్చింది, “అరె, ఈ నశ్వరమైన శరీరం కోసం బాగా కష్టపడి కఠినమైన సొలిసిటర్ పరీక్షను ఉత్తీర్ణుడినైనా సంపాదనకోసం మళ్ళీ కష్టాలు పడాలి. ఇదంతా ఎవరికోసం? ఇతరుల్లాగా కాకుండా నా కడుపునైతే కొద్ది కష్టంతోటే నింపుకోవచ్చు. భుక్తి సహజంగానే దొరకుతుంది" అని. మరుక్షణంలో బాబా, “చేయవలసినదంతా మిగతా వారికోసమే. మనకోసం ఏమీ చేయనవసరం లేదు" అని అన్నారు.


న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన

నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి

- (3వ అధ్యాయం - 22శ్లో)

బాబా శ్రీమద్భగవద్గీతలోని తృతీయ అధ్యాయం యొక్క సారాంశాన్ని ప్రకటం చేయడానికి పైన చెప్పిన శ్లోకాన్ని చెప్పారు. ఇప్పుడనిపిస్తోంది, “నా స్వార్థ భావం కంటే అర్జునుడి భావం ఎంత ఉదాత్తంగా ఉంది! అతను గీత ప్రథమ అధ్యాయంలో భగవంతునితో చెపుతాడు కదా, "ఈ రాజ్య విలాసాలతోనూ, సుఖాలతోనూ నేనేం చేయాలి? ఇదంతా ఎవరికోసం చేయాలో వారందరూ ఆచార్యులూ, సోదరులూ, పుత్రులూ, పెద్దవారూ, మామలూ, బాబాయిలూ, మనుమలే. వారు వారి ప్రాణాలపైనా, ధనంపైనా ఆశను వదులుకొని యుద్ధం కోసం నా ఎదుట నిలబడి ఉన్నారు”. (శ్లో 33, 34) అర్జునుని ఈ విచారం ఎంత గొప్పదంటే ప్రాప్తించిందంతా కేవలం తన సుఖానికి కాదు, ఇతరుల సుఖం కోసమే. రాజ్య పదవిని వదిలిపెట్టి, భిక్షతో లభించే ఆహారంపై జీవిస్తానన్న అర్జునుని వైరాగ్యమూ, పరహితాలను సాధించాలన్న అభిలాషా ఎంతటివి! అందుకే పరమాత్మ కూడా అతన్ని అనేక పేర్లతో సంబోధిస్తూ ఉండేవాడు".


“భక్తో సిమే సఖా చేతీ, మే ప్రియోసి”

ఒకనాటి మధ్యాహ్నం వేళ, "మిగతావారంతా నిత్యమూ బాబాను పూజిస్తుంటారు. కానీ నేను ఏదో ఒక శుభప్రదమైన రోజు మాత్రమే ఆయన్ను పూజిస్తున్నాను. నేను కూడా రోజూ ఎందుకు పూజించకూడదు?" అన్న ఆలోచన నా మనస్సులో మెదిలింది. దాంతో పూజాసామగ్రి తీసుకొని బాబా వద్దకు వెళ్లి ఆయనకి చందనం అద్దే సమయంలో, “ఈరోజు నేను బాబాను పూజిస్తున్నాను, ఇదెంత మంచి పని!" అన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే, బాబా దేహాన్ని విడిచిన తరువాత వారున్న సమయంలో వారిని పూజించలేకపోయానన్న పశ్చాత్తాపం కలగకుండా ఉండటానికే. ఈ ఆలోచన నా మనసులోకి రాగానే బాబా నవ్వుతూ, "అరే! నేను కేవలం ఈ శరీరాన్నేనా? నేను ఎప్పటికీ ఉంటాను. నేను ఉండనన్న చింతను ఎందుకు పెట్టుకుంటావు?" అన్నారు.

బాబా అప్పుడప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఒకసారి నేను ఆయనకు కొద్ది దూరంలో కూర్చున్నాను. అప్పుడు ఆయన నా టోపీ మీద తాంబూలం వేశారు. అప్పుడప్పుడు అత్యంత ప్రేమపూర్వకంగా దగ్గరకు తీసుకునేవారు. కొన్నిసార్లు చెక్కిలిని గిల్లేవారు. చెప్పలేనంత ప్రేమతో ప్రసాదం ఇచ్చేవారు. అందువల్ల భక్తులకు కూడా నామీద సద్భావం ఏర్పడింది.

మొదట్లో బాబా లెండీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు కట్టడాకి వెలుపల టార్పాలిన్ మీదగానీనేల మీదగానీ నేను కూర్చొని ఉండేవాడిని. అప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. ఒక 14, 15 ఏళ్ళ అమ్మాయి రంగురంగుల పూలతో పూలగుత్తిని తయారుచేసి రోజూ బాబాకు ఇచ్చేది. దాన్ని తీసుకుని వాసన చూసి బాబా వెంటనే నాకు ఇచ్చేవారు. నేను దాన్ని తీసుకుని నా బసకు వెళుతూ ఉండేవాడిని. అక్కడ ఒక 7, 8 ఏళ్ళ పిల్ల ఆ గుత్తి ఇమ్మని నన్ను అడుగుతుండేది. ఆమెకు నేను దానిని ఇస్తుండేవాడిని. ఈ విధంగా 7, 8 రోజులు జరిగిన తరువాత, "బాబా ఇచ్చిన వస్తువును నేను గౌరవించటం లేదుదాన్ని ఎవరడిగితే వారికిచ్చేస్తున్నాను. అది తప్పు. బాబా చేతినుంచి వస్తువు ఎప్పుడూ లభించదు" అన్న ఆలోచన వచ్చింది నాకు. మర్నాడు బాబా వానన చూసి ఇచ్చిన పూలగుత్తిని నేను ఆమెకివ్వకుండా ఒక డబ్బాలో పెట్టాను. అది బాబాకి నచ్చలేదనుకుంటావారు మరుసటిరోజు నుంచి పూలగుత్తి నాకివ్వటం ఆపేశారు. ఆ పూలగుత్తినీబాబాగారి విరిగిన చిలుంనూ (దాన్ని బాబా 'నా నౌరంగీ చిలుంఅనేవారు) నేను చాలారోజుల వరకూ ఆ డబ్బాలో వారి జ్ఞాపకచిహ్నంగా భద్రంగా ఉంచుకున్నాను. ఈ సంఘటనతో నేనొకటి నేర్చుకున్నాను, 'బాబా ఏ అందమైన వస్తువును ఇచ్చినా దాన్ని దాచిపెట్టుకోకూడదు. ప్రేమతో అడిగిన వారికి సందేహించకుండా ఇచ్చేయాలి' అని.

బాబాకి పూజ చేసేటప్పుడు ఆయన పాదాలకు అద్దిన చందనం అంగవస్త్రానికి చాలా అంటుకుంటుండేది. బాబా ప్రసాదంగా భావించి దాన్ని నేను నావద్ద ఉంచుకోవాలని నిశ్చయించుకున్నాను. అయితే ఆ అంగవస్త్రాన్ని రాధాకృష్ణమాయి అడిగితే ఆవిడకిచ్చేశాను.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 424వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి నామస్మరణతో ఆరోగ్యం
  2. సాయిపాదాలు తాకినమీదట పరిమళభరితమవుతున్న నా చేతులు 

సాయి నామస్మరణతో ఆరోగ్యం

ఓం సాయిరామ్! జై సాయిరామ్! నేను సాయిభక్తురాలిని, నా పేరు స్వాతి. బాబా కరుణతో నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఇది బాబాతో నాకున్న అనుభవాల నుండి నేను మీతో పంచుకుంటున్న రెండవ అనుభవం. కొన్నిరోజులుగా నా శరీరంలో వేడి పెరుగుతూ వుంది. అది 'జ్వరమా?' అంటే జ్వరం కాదు. కాళ్ళు కూడా లాగుతూ ఉండేవి. బాత్‌రూమ్‌కి వెళ్ళి వచ్చినా కాళ్లు లాగడం, పొట్టనొప్పి రావడం జరుగుతూ ఉండేది. ఎక్కువగా నీళ్లు త్రాగితే సమస్య సమసిపోతుందేమో అనిపించి మంచినీళ్లు ఎక్కువగా త్రాగుతుండేదాన్ని. కానీ ఏ మాత్రమూ ఉపశమనం కలగలేదు. దాంతో మావారు హాస్పటల్‌కి వెళదామని అన్నారు. నేను అందుకు ఒప్పుకోలేదు. బాబాపై ఉన్న నమ్మకంతో బాబాను ప్రార్థించి, ఆయన మీద భారం వేశాను. నా మనసులో, "బాబా! మీరే కదా అన్నారు, 'నా భక్తులకోసం పరుగిడి వస్తానని, విశ్వాసంతో పిలిస్తే వస్తానని, మా బాధ తీరుస్తానని'. మరి నేనిలా బాధపడుతుంటే, నా ఆరోగ్యాన్ని మీరే సరిచేయాలి కదా! బాబా! 'మీ శరణు వేడిన వారిని మీరు కాపాడతారని, వారి భారాన్ని మోస్తాన'ని అన్నారు. ఆ నమ్మకంతో నేను మీ నామస్మరణ చేస్తాను. మీ నామస్మరణే నాకు ఔషధం కావాలి" అని బాబాతో చెప్పుకొన్నాను. తరువాత ఆ రోజంతా 'ఓం శ్రీసాయినాథాయ నమః' అనే మంత్రాన్ని స్మరిస్తూ గడిపాను. ఆ మంత్రాన్ని స్మరిస్తూ నా శరీరంలోని ప్రతి అణువులోకి ఆ మంత్రశక్తి ప్రసరిస్తున్నట్లు, నా ఆరోగ్యాన్ని సరిచేస్తున్నట్టు అనుభూతి చెందాను. దాంతో నా ఆరోగ్యం చాలావరకు కుదుటపడింది. బాబా కృపతో నా ఆరోగ్యం త్వరలో పూర్తిగా నయమైపోతుందని ఆశిస్తున్నాను. ఆయన తలచుకుంటే జరగనిదేముంది? అందుకే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తారనే నమ్మకంతో ఈ అనుభవాన్ని ముందుగానే బ్లాగులో పంచుకుంటున్నాను. బాబా ప్రేమాస్వరూపులు, చాలా దయగలవారు. ఆయన మననుంచి ఏమీ ఆశించరు, మన ప్రేమను తప్ప. అప్పుడప్పుడు మన విశ్వాసాన్ని మరియు ఆయన మాటలను గుర్తుంచుకొని ఆవిధంగా మనం నడుచుకుంటున్నామా లేదా అని పరీక్షిస్తారు. మనం చేయవలసింది ఒక్కటే, ఆయనపై విశ్వాసంతో ఆయన చూపిన మార్గంలో నడవడం. బాబాను మీరు ఏమైనా అడిగినప్పుడు ఆయన ఇవ్వకపోతే సహనాన్ని కోల్పోయి ఆయనను నిందించకండి. అటువంటి సమయాలలో మనకు శ్రేయస్సునిచ్చేదైతే బాబా తప్పక ఇస్తారని మరియు ఆయన అద్భుతశక్తిని మననం చేసుకుంటూ పదే పదే ఆయనను ప్రార్థించండి. మనసులోనే బాబాతో మాట్లాడండి. ఆయన కరుణ ఖచ్చితంగా మీపై ఉంటుంది. కరుణామయుడైన బాబాకు నా మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ... 

సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!

సాయి పాదాలు తాకిన మీదట పరిమళభరితమవుతున్న నా చేతులు 

ఓం సాయిరామ్! నా పేరు మల్లూరు చంద్రశేఖర్. నేను ఖమ్మం జిల్లా, వేంసూర్ మండలం, మర్లపాడు గ్రామ నివాసిని. నేను సాయిభక్తుడిని. దేవుడంటే నమ్మకమే లేని నన్ను పూర్తిగా తమను విశ్వసించేలా బాబా అనుగ్రహించారు. నేనొక సోషల్ వర్కర్‌ని. సోషల్ వర్క్‌కి సంబంధించి నేను చేసే ప్రతి పనినీ ముందుగా సద్గురు సాయిని స్మరించుకుని ప్రారంభిస్తాను. ఆ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనేది బాబానే నా మనసుకు స్ఫురింపజేస్తారు. ఆయన అనుగ్రహంతో కార్యక్రమాలన్నీ విజయవంతమవుతున్నాయి. నిస్వార్థంగా తమను నమ్ముకున్న భక్తుల మనసులో తామెల్లప్పుడూ కొలువై వుంటామనే సత్యాన్ని బాబా ప్రతిరోజూ నాకు చూపిస్తూ వున్నారు. ఇకపోతే, ఇదివరకు నా అనుభవాలను మీతో పంచుకున్నాను. చాలాకాలం తరువాత మళ్ళీ బాబా నాకు ప్రసాదించిన మరో అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు ద్వారా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

ప్రియమైన సాయిబంధువులారా! ఈ మధ్యకాలంలో నేను తరచూ ఉదయాన్నే సాయి మందిరానికి వెళ్తున్నాను. ఒక గురువారం ఉదయం బాబాకు అభిషేకం, పూజ ముగిశాక, అక్కడున్న పటంలోని బాబా పాదాలను నా రెండు చేతులతో స్పృశించి 'నీ చరణం శరణం' అని స్మరించుకున్న తరువాత నా చేతులను కళ్ళకు అద్దుకోగానే గుప్పుమని పరిమళభరితమైన సువాసన వచ్చింది. ఒకసారి నా చేతులను వాసన చూడమని నా భార్యాబిడ్డలతో చెప్పాను. వాళ్ళకి కూడా పరిమళాల వాసన వచ్చింది. ఆశ్చర్యమేమిటంటే, నా చేతుల వాసన చూసినప్పుడే వాళ్ళకి సువాసన వస్తోంది. అదే వాళ్ళు నేరుగా బాబా పటాన్ని తాకితే రావడం లేదు. కేవలం నాకు మాత్రమే ఆ అనుభూతి కలుగుతోంది. నాకు చాలా ఆశ్చర్యమేసింది. బాబా నన్ను ఈ రీతిన అనుగ్రహిస్తున్నారని నేను చాలా సంతోషించాను. ఇది ఏదో ఒకరోజు జరిగిన అనుభవం కాదు. గత ఐదు నెలలుగా నేను అనుభూతి చెందుతున్న బాబా ఆశీర్వాదం. ఈరోజు(2020, మే 21) ఉదయం కూడా నేను ఈ సాయిలీలను ఆస్వాదించాను. "బాబా! మీకు నా ప్రణామాలు. మీ అనుగ్రహం ఎప్పుడూ ఇలాగే నాపై, నా కుటుంబంపై, మీ బిడ్డలందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను". 

ఓం సాయిరామ్!

సాయినాథ చరణం శరణం.


సాయి అనుగ్రహసుమాలు - 382వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - పదహారవ భాగం 

నిన్నటి తరువాయిభాగం.....

ఒకసారి ఉదయం 8-30 గంటలకో లేక మధ్యాహ్నం 2 గంటలకో నేనూ, శ్రీబాలకరాం మాన్కర్ కూర్చొని ఉన్నప్పుడు బాబా, “బాలకరామూ, వీడూ ఒకప్పుడు ఒక గుహలో ఎదురెదురుగా కూర్చొని తపస్సు చేసుకునేవారు” అన్నారు. ఆరోజో లేక ఆ మర్నాటి రాత్రో నేను స్వప్నంలో ఒక గుహలో కూర్చొని తపస్సు చేస్తుండటాన్ని చూశాను. అప్పుడు ఒక రాత్రి ఒక స్త్రీ రావటం వల్ల నేను పతనమైపోయాను. "మనం ఇతరుల గుణదోషాలను తెలుసుకున్నప్పటికీ కూడా వారికి వారి దోషాలను చెప్పకుండా మంచినే చెప్పాలి" అని నేను తెలుసుకున్నాను.

ఒకరాత్రి బాబా, "ఒక రూపాయి తీసుకెళ్ళి చిల్లర పట్టుకురా" అన్నారు. నేను ఎంతమందినో అడిగాను కానీ, చిల్లర దొరకలేదు. తరువాత ఒక వ్యక్తి, “బయ్యాజీ దగ్గరకు వెళ్ళు. అతని దగ్గర దొరుకుతుంది” అన్నాడు. ఆయన ఇంటిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి అతనిచ్చిన చిల్లర తీసుకొచ్చి బాబాకిచ్చాను. దాని రహస్యం ఏమిటంటే, బాబా నాకు ఏకత్వం (ఏకాత్మత), అంటే తాదాత్మ్యం అనే రూపాయినిచ్చారు. అయితే నేను ఆయనకు ఏమి అర్పించాలి? - “చిల్లర!" విడగొట్టి, విడగొట్టి ఒక్కొక్క భాగాన్ని విడివిడిగా చేస్తూ చేస్తూ మాయాపూరితమైన ఈ ఆటను సమాప్తం చేసి దాని భేదాన్ని తెలుసుకుని వారి చరణాలకు అర్పణ చేయాలి. “ఆసనం వేసుకుని ప్రశాంతంగా కూర్చోకుండానే మాయ తత్వాన్ని విడిగా పట్టుకుని అందులోని ఒక పరమతత్వాన్ని తెలుసుకొని దాన్ని బాబాకు అర్పించాలి” అని చెబుతుంది - “అహం బ్రహ్మాస్మి". "చిల్లర అంటే ఏమిటి?" - మాయను ఛేదించగల సర్వశ్రేష్ఠ సాక్షి అయిన పరమాత్మతో తాదాత్మ్యం చెందే స్థితి. 

ఒకసారి నా మనసులో, “ఎన్ని భాషలను నేర్చుకోవాలి? ఇంగ్లీషు, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ అయితే నాకు తెలును. అయితే సంస్కృతం, మరాఠీల్లో పాండిత్యం నాకు చాలా తక్కువ. దానికోసం ఇప్పుడు అవి నేర్చుకోవటం అనే తలనొప్పి ఎందుకు తెచ్చుకోవాలి?” అన్న ఆలోచన వచ్చింది. అప్పుడు బాబా, "అరె! నాలుగు మెట్లు దిగాలి! ఇందులో తల బద్దలుకొట్టుకునే ప్రశ్న ఎందుకు వస్తుంది?” అన్నారు. దాని అర్థం చతుర్విధ వాణి అని ఇప్పుడు తెలుస్తోంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరులు పరమేశ్వరుడివి. హిరణ్యగర్భకి లేక మానవుడికి ఈ నాలుగు వర్ణాలతో ఉన్న తారతమ్యాన్ని తెలుసుకొని కార్యంలో ప్రవృత్తమవటం నేర్చుకోవాలి. శృతి, స్మృతి, పురాణాలు, మహనీయుల వచనాలు అని ఇవి నాలుగు రకాలైన వాణులు. వీటిని ప్రమాణంగా తీసుకుని నిత్యానిత్యాలను వివేచించాలి. అంతేకాక విష్ణుసహస్రనామంలో కూడా చతురాత్మా, చతుర్వ్యూహ, చతుర్దంష్ట్ర, చతుర్భుజ అని నాలుగు రకాల విశిష్టత ప్రతిపాదించబడింది. ఈ ప్రకారంగా 'నాలుగు' యొక్క విశిష్టత క్రింద వ్రాయబడిన శ్లోకంలో వస్తుంది.

“చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహ శ్చతుర్గతి చతురాత్మా చతుర్భావ చతుర్వేద విదేకపాత్”

చతుర్మూర్తి అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, నీవు - నేను. ఇవన్నీ నా పనులే. అప్పుడు ఈ నాలుగు, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, నీవు ఇవన్నీ నేనే అని తెలుసుకో.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ

సాయిభక్తుల అనుభవమాలిక 423వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఒక్కరోజులోనే నయమయ్యేలా చేసిన బాబా
  2. అండగా ఉన్న బాబా

ఒక్కరోజులోనే నయమయ్యేలా చేసిన బాబా

అఖిలాండకోటి బ్రహ్మాడనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్సుమాంజలి. మీరు చేస్తున్న ఈ సాయిసేవకి మేము మీకు ఋణపడివున్నాము. ఈమధ్య మా చుట్టాలబ్బాయి కాలికి దెబ్బ తగిలి బాగా ఇబ్బందిపడుతుంటే, డాక్టర్ పరిశీలించి ఆపరేషన్ చేయాలని అన్నారు. కరోనా కారణంగా పేషెంట్ కి తోడుగా ఎవరైనా ఉండటానికి గాని, చూడటానికి గాని వెళ్ళడానికి వీలులేని పరిస్థితులు. అందువలన నేను, “ఈ కొరోనా సమయంలో తనవాళ్ళెవరూ తన దగ్గర లేరు బాబా. మీరే ఆ అబ్బాయిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. తనకి త్వరగా నయమైతే ఈ అనుభవాన్ని నేను బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను మనసారా ప్రార్థించాను. ఆశ్చర్యంగా డాక్టర్ ఒక్కరోజులోనే ఆ అబ్బాయికి నయం చేసి పంపించారు. బాబానే ఆ డాక్టర్ స్థానంలో ఉండి ఆ అబ్బాయికి నయం చేశారని ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. “బాబా! ఎల్లవేళలా మీ భక్తులను ఇలాగే కాపాడండి. మేము మీకు ఎన్ని కోట్ల నమస్కారాలు సమర్పించినా మీ ప్రేమ ముందు అవి తక్కువే. మీ భక్తకోటిలో నేను ఒక చిన్న భక్తురాలిని. బాబా! మా కుటుంబ బాధ్యత మీరు తీసుకున్నందుకు చాలా సంతోషం తండ్రీ!”.

జై సాయిరాం!

అండగా ఉన్న బాబా

హైదరాబాదు నుండి సాయిభక్తుడు శివ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

బాబా భక్తులందరికీ నా నమస్సుమాంజలి. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నా పేరు శివ. మేము హైదరాబాదులో ఉంటాము. మాకు ఇద్దరు పిల్లలు. మేము శిరిడీ సాయిబాబా భక్తులం. 2020, ఫిబ్రవరి 2వ తారీఖున పన్నెండేళ్ళ వయసున్న మా రెండవ అబ్బాయి ఉన్నట్టుండి ఫిట్స్ లాగా వచ్చి కోమాలోకి వెళ్ళిపోయాడు. అంతకు రెండురోజుల ముందునుండి తను ఆయాసంతో బాగా ఇబ్బంది పడుతున్నాడు. మేము వెంటనే బాబుని విక్రంపురిలో ఉన్న రెయిన్‌బో ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాము. అక్కడ మా బాబుకి పరీక్షలు చేసి, "రెండు కిడ్నీలూ పూర్తిగా డామేజ్ అయ్యాయ"ని చెప్పారు. అంతేకాదు, "బాబుకి ఫిట్స్ వచ్చిన సమయానికి కిడ్నీలు పనిచేయకపోవటం వల్ల బీపీ బాగా పెరిగింది. ఆ కారణంగా ఊపిరితిత్తులలోకి ఫ్లూయిడ్స్ చేరి ఇన్ఫెక్షన్ అయ్యింది. ఇంకా గుండెలో కొంతభాగంలో కొద్దిగా వాపులా వచ్చి గుండె కాస్త వ్యాకోచించింది. రక్తంలో కూడా ఇన్ఫెక్షన్ ఏర్పడింది. బాబుకి వెంటనే డయాలిసిస్ చేయాలి, మీరు బాబుని బంజారాహిల్స్ లోని రెయిన్‌బో హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళండి” అని చెప్పారు. మళ్ళీ అంతలోనే, “బాబు కండిషన్ చాలా క్రిటికల్‌గా వుంది, మేము తన జీవితానికి భరోసా ఇవ్వలేము” అని చెప్పారు. చేసేది లేక డాక్టర్లు చెప్పినదానికి అంగీకరించి బాబుని అంబులెన్సులో తీసుకొని వెళ్ళటానికి సిద్ధమయ్యాము. హాస్పిటల్ నుండి బయటకి రాగానే సాయిబాబా బండి అంబులెన్సుకి ఎదురు వచ్చింది. మేము అంబులెన్స్ దిగి, బాబాకి నమస్కారం చేసుకుని, "బాబును కాపాడమ"ని ఆర్తిగా వేడుకుని, బాబాకు దక్షిణ సమర్పించాము. తరువాత మా అంబులెన్సు వెనకాలే సాయిబాబా బండి కూడా మెయిన్‌రోడ్డు దాకా వచ్చింది. మేము ఏ ప్రమాదం లేకుండా బంజారాహిల్స్ హాస్పిటల్‌కి చేరుకున్నాము. బాబా దయవల్ల బాబుని వెంటనే ICU కి షిఫ్ట్ చేసి ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారు. మా బాబు 13 రోజులు ICU లో వున్నాడు.

మా బాబు ICU లో ఉన్నప్పుడు, మా బంధువు ఒకావిడ శిరిడీ నుండి బాబా ఊదీ తీసుకొచ్చి మాకు ఇచ్చారు. మాపై దయతో బాబానే స్వయంగా మాకోసం ఊదీ పంపినట్లు భావించాము. బాబాను ప్రార్థించి, ఊదీని మా బాబుకి పెట్టాము. బాబా అనుగ్రహంతో మా బాబు కోమా నుండి బయటకి వచ్చాడు. (సుమారుగా 13 రోజులు కోమాలో వున్నాడు.) కిడ్నీలు తప్ప మిగతా అవయవాలన్నీ సాధారణస్థితికి వచ్చాయి. ICU నుండి రూముకి షిఫ్ట్ చేసిన రెండు రోజుల తరువాత చిన్న సర్జరీ కోసం బాబుని ఆపరేషన్ థియేటర్‌కి తీసుకొని వెళ్లారు. అక్కడ ఉన్నట్టుండి ఒక సమస్య వచ్చి తనకి కార్డియాక్ అరెస్ట్ అయింది. కానీ, బాబా దయవల్ల డాక్టర్స్ దగ్గరే వున్నారు కాబట్టి వెంటనే హార్ట్ పంప్ చేసి మళ్ళీ సాధారణస్థితికి తీసుకొని వచ్చారు. ఆరోజు రాత్రి బాబు మాకు దక్కుతాడని అనుకోలేదు. బాబానే డాక్టర్స్ రూపంలో దగ్గరుండి బాబుని కాపాడారు.

ప్రస్తుతం బాబు ఆరోగ్యం కుదుటపడింది. కిడ్నీలకు ప్రతిరోజూ డయాలిసిస్ జరుగుతోంది. మా బాబుకి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించమని బాబాను ప్రార్థిస్తూ నా భార్య ఇప్పటివరకు తొమ్మిదిసార్లు సాయిసచ్చరిత్ర పారాయణ చేసింది. బాబా అనుగ్రహంతో త్వరలోనే మా బాబు సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని ఆశిస్తున్నాము. “బాబా! మీరే మాకు అండ. మా బాబుకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రీ!”.


సాయి అనుగ్రహసుమాలు - 381వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - పదిహేనవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

"ఇక్కడ చేయవలసిందంతా ఇతరుల కోసమే చేయాలి"

వాసుదేవ్ అనే పేరుగల పూణేకి చెందిన ఒక బ్రాహ్మణుడు శిరిడీలో భోజనశాల నడిపిస్తూ ఉండేవాడు. అతని దగ్గర శ్రీసగుణరావు ఉంటుండేవాడు. వర్తమానంలో (అంటే 1913లో) సగుణరావు ఉంటున్న ఇంటికి వెనుకభాగంలో శ్రీవాసుదేవ్ ఉంటుండేవాడు. బయట ఓ అరుగు ఉండేది. ఇప్పుడు ఆ ప్రదేశంలో సగుణరావు దుకాణం ఉంది. ఆ అరుగు మీద కూర్చొని హోటలుకొచ్చే వారందరూ తేనీరు, ఉదయ ఫలహారం మొదలైనవి తీసుకుంటుండేవారు. ఇరవై రూపాయలకు వాసుకాకా దగ్గర నా భోజనానికి ఏర్పాటయింది. ద్వాదశిరోజున అప్పుడప్పుడు పొద్దునపూట వాసుకాకా రవ్వకేసరి తెస్తుండేవాడు. అది ఒకవేళ బాబా ఉదయ ఫలహారానికి ముందు తయారైతే ఆ రవ్వకేసరి సరాసరి బాబా దగ్గరకు కూడా పంపబడుతుండేది. అయితే ఒకరోజు అది ఆలస్యంగా లభించటంవల్ల నేనే దాన్ని పూర్తిగా తినేశాను. అదేరోజు బాబా నన్ను అగ్గిపెట్టె కొనుక్కురమ్మని పంపించారు. బాబా ఎప్పుడూ రెండు పైసలకు మూడు అగ్గిపెట్టెలు తెప్పిస్తుండేవారు. కానీ నేను బేరం చేయకుండా ఒక పైసాకు ఒక అగ్గిపెట్టెను తీసుకొచ్చాను. అప్పుడు బాబా నాతో, "ఏం, కల్లూ గిల్లూ ఏమీ తాగి రాలేదు కదా?!" అన్నారు. ఆరోజు నుంచి ఉపవాసానికి తరువాతరోజు పారణ (అంటే వ్రత సమాప్తి) సమయంలో రవ్వకేసరి తయారు కాబడుతూ ఉండేది. దాన్ని తినే సమయం గురించి ఇప్పటికీ నేను భయపడతాను.

ఒకరోజు స్వప్నంలో, “నీకు శంకరుని ఆశీర్వాదం ఉంది” అని బాబా నా శిరస్సుపై తమ వరదహస్తాన్నుంచారు. ఈ స్వప్నం వచ్చిన కొద్దిరోజులకు స్వప్నంలో లాగానే ఇంచుమించు ఐదునిమిషాలు బాబా నా తలమీద చేయి పెట్టారు. ఆ యోగంతో నా శరీరంలో దివ్యమైన శక్తి సంచారం జరిగింది. అలా స్వప్నంలో ఇచ్చినటువంటి జ్ఞానాన్ననుసరించి 'ఒప్పచెప్పబడ్డ పని నీ చేత్తో అవవలసి ఉంద'నే సూచన లభించింది.

తరువాత అందరూ కూర్చొని ఉన్నప్పుడు బాబా, "వీడు చిన్నగా ఎలుకంత ఉన్నప్పటినుంచి నేను వీడిని ఎరుగుదును” అన్నారు. బాబా నోటినుంచి వెలువడిన ఈ మాటలను నేను మా అమ్మతో చెప్పినప్పుడు ఆమె నాతో ఒక వాస్తవం చెప్పింది. చిన్నప్పుడు నేను చాలా బలహీనంగా ఉండేవాణ్ణట. మాటిమాటికీ నాకు అనారోగ్యం వస్తుండేదట. నాకు ఇంచుమించు ఐదుసంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్నగారు ధారానణాలో ఉప్పు గోడౌన్లో ఉద్యోగం చేస్తుండేవారట. అప్పుడు మేము ఓ డేరాలో ఉంటుండేవాళ్ళమట. కొన్నినెలలపాటు నాకు బంక విరోచనాలు, అతిసారం, వికారంతో వాంతులు అవుతుండేవట. నేను బ్రతుకుతాననే ఆశను అందరూ వదులుకున్నారట. ఓ సాయంత్రం మా అమ్మ నన్ను తీసుకుని ఇంటి ప్రాంగణంలో కూర్చొని ఉన్నప్పుడు హఠాత్తుగా అక్కడకొక ఫకీరు వచ్చి ఆమెతో, "మీ కొడుకు చాలా అదృష్టవంతుడు" అన్నాడట. మా అమ్మ, "ఏమదృష్టవంతుడు? వీడికి నీళ్ళు విరోచనాలు పట్టుకుని వదలటం లేదు. వీడు మాతో మరో నాలుగు రోజులుంటే అదే గొప్ప అనిపిస్తోంది” అన్నదట. ఫకీరు, "లేదు, లేదు, అలా అనొద్దు, ఇతను చాలా అదృష్టవంతుడు. ఇతని కుడిచంకలోనూ, కుడిభుజంమీదా కూడా పుట్టుమచ్చలున్నాయి” అన్నాడట. మా అమ్మ నా ఒంటిమీద కప్పిన దుప్పటిని నాకు తొడిగిన చొక్కానీ పైకెత్తి చూసిందిట. అప్పుడు ఫకీరు చెప్పిన ప్రదేశాల్లో నిజంగానే ఆ గుర్తులు కనిపించాయట. దాన్ని చూసి మా అమ్మ, “మీరు చెప్పిన గుర్తులయితే ఉన్నాయి, బాగానే ఉంది, మరి వీడి అనారోగ్యం గురించి ఏం చేయాలి?" అన్నదట. ఆ ఫకీరు, "ఈ విభూది తీసుకుని అతని నోట్లో వేస్తే అంతా బాగయిపోతుంది" అన్నాడట. దాని తరువాత ఎటువంటి వైద్యమూ లేకుండానే నేను స్వస్తుడ్ని కావటం మొదలుపెట్టానట. అప్పుడు అందరి విచారమూ దూరమైపోయిందట. ఈ వాస్తవంతో, బాబా నా చిన్నప్పటినుంచి నన్ను జాగ్రత్తగా చూస్తూ నన్ను రక్షిస్తున్నారన్న విశ్వాసం నాకు కలిగింది.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 422వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. దయగల దేవుడు మన బాబా
  2. బాబా కురిపిస్తున్న ఆశీస్సులు

దయగల దేవుడు మన బాబా

సాయిరామ్! సాయిభక్తులందరికీ నా వందనాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులందరికీ సాయి ఆశీస్సులు. నా పేరు సునీత. ఇది నేను మీతో పంచుకుంటున్న నా మూడవ అనుభవం. ఒకసారి మావారికి చాలా తీవ్రంగా చెయ్యినొప్పి వచ్చింది. మూడు రోజుల పాటు ఆ నొప్పితో ఆయన విలవిల్లాడిపోయారు. ఆయన బాధను మేము చూడలేకపోయాము. అప్పుడు నేను, “బాబా! మావారికి చెయ్యినొప్పి చాలా ఎక్కువగా ఉంది. ఆ నొప్పితో తను పడుతున్న బాధను చూడలేకపోతున్నాను. ఆయన నొప్పిని నాకు ఇవ్వండి, నేను భరిస్తాను” అని బాబాను చాలా ఆర్తిగా వేడుకున్నాను. ఆ రాత్రి అందరం నిద్రపోయాము. తెల్లవారేసరికల్లా బాబా అనుగ్రహంతో మావారి చెయ్యినొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఎంతో సంతోషంతో బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మరో విషయం, నేను ఆ నొప్పిని నాకివ్వమని ప్రార్థించినప్పటికీ బాబా ఆ నొప్పిని నాకు ఇవ్వలేదు. అంతటి దయగల దేవుడు మన బాబా. ఆర్తితో నిస్వార్థంగా ఏది అడిగినా బాబా వెంటనే చేస్తారని నేను పూర్తిగా నమ్ముతాను. “నా బిడ్డలని కాపాడు బాబా! అందరికీ సాయం చేయండి బాబా! నా బిడ్డల కోరికలను తీర్చి, ఆ అనుభవాలను కూడా నేను బ్లాగులో పంచుకునే అవకాశం నాకు ఇవ్వు బాబా”.

ధన్యవాదములు.

బాబా కురిపిస్తున్న ఆశీస్సులు

యు.ఎస్.ఏ నుండి సాయిభక్తురాలు శ్రీమతి యశ్వంతి తన రీసెంట్ అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! సాయిభక్తులందరికీ హాయ్! నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని, ఆయన నాపై కురిపించిన ఆశీస్సులను మీతో పంచుకుంటాను.

11 సంవత్సరాల వయసులో మొదటిసారి నేను శిరిడీ దర్శించాను. అదే బాబాతో నా మొదటి అనుభవం. అప్పటినుండి బాబా సదా నాపై తమ అనుగ్రహాన్ని కురిపిస్తుండేవారు. అయితే బాబా నా విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్నప్పటికీ నేను ఆయనకు అంత ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని కాదు. సంవత్సరాలు దొర్లిపోయాయి. నాకు వివాహమైంది. మా అత్తగారు గొప్ప సాయిభక్తురాలు. ఆమె ఎంతగానో బాబాని ఆరాధించినప్పటికీ మా మామగారు, బావగారు హఠాత్తుగా చనిపోయారు. తరువాత నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. దాంతో కలత చెంది బాబాను పూర్తిగా విస్మరించాను.

కొన్నిరోజుల తరువాత ఒకరోజు నేను బాబా పటాన్ని చూసి గతంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాను. నెమ్మదిగా నా మనసు బాబా వైపుకు మళ్లింది. నాకు వివాహమై ఐదు సంవత్సరాలు అయినా పిల్లలు లేరు. గతంలో మేము పిల్లలకోసం అంతగా ఆలోచించలేదు. కానీ కుటుంబసభ్యుల నుండి వస్తున్న ఒత్తిడి కారణంగా 6 నెలలుగా మేము పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. రోజులు గడుస్తున్నా నేను గర్భం దాల్చకపోయేసరికి నాలో భయం మొదలైంది. ఆ విషయమై ఒకరోజు నేను క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో బాబాను అడిగాను. అప్పుడు, "అబ్బాయి పుడతాడు. ఒక నెలలో మీకు తెలుస్తుంది" అని వచ్చింది. బాబా మాట అక్షర సత్యమైంది. నేను గర్భవతినయ్యాను. నాకు దిగులుగా అనిపించినప్పుడల్లా నేను క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో బాబాను అడుగుతుండేదాన్ని. ఒకసారి అలా అడిగినప్పుడు, "4వ నెల నుంచి 7వ నెల వరకు మీరు సమస్యలు ఎదుర్కొంటారు" అని వచ్చింది. అప్పుడు నాకేమీ అర్థం కాలేదు. కానీ 4వ నెల వచ్చాక డాక్టరు పరీక్షించి, "మావికి సంబంధించిన సమస్య ఉందని, మావి పరిమాణం తక్కువగా ఉంద"ని చెప్పారు. రక్తస్రావం జరిగినా, నొప్పిగా ఉన్నా వెంటనే అత్యవసర పరిస్థితి క్రింద హాస్పిటల్లో చేరమని కూడా చెప్పారు. ఈ సమస్య 7వ నెల వరకు పరిష్కారం కాలేదు. "అది పరిష్కరింపబడకపోతే సిజేరియన్ చేయాల్సి ఉంటుంద"ని డాక్టరు చెప్పారు. అసలే కరోనా సమయం కావడంతో మా అమ్మ యు.ఎస్.ఏ కి రాలేని పరిస్థితి. అందువలన నేను చాలా ఆందోళన చెందాను. అయితే 8వ నెల వచ్చాక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయిస్తే, మావి సాధారణ స్థితికి వచ్చింది. కానీ నా బిడ్డ బ్రెయిన్ యొక్క వెంట్రికల్స్‌లో ఒకటి పెద్దదిగా ఉందని తెలిసింది. అలా ఉంటే శిశువు యొక్క సెరెబ్రోస్పానియల్ ద్రవాన్ని క్రిందకు మళ్లించాలని, ఇది శిశువు ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని తెలిసింది. అది తెలిసి నేను నిర్ఘాంతపోయాను, చాలా బాధపడ్డాను. అప్పుడు నేను బాబాను ప్రార్థించి, "ఈ సమస్యను పరిష్కరించండి బాబా. అది పరిష్కారమై ఈసారి రిపోర్టులు నార్మల్‌గా వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. నిన్న (2020, మే 14) నేను అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళాను. బాబా దయవలన వెంట్రికల్స్ స్థితిలో మార్పు వచ్చింది. డాక్టర్ రిపోర్టులు చూసి, "ఇప్పుడు సాధారణంగా ఉంది" అని చెప్పారు. నా జన్యు పరీక్షల రిపోర్టులు కూడా నార్మల్ అని వచ్చాయి. బాబా ఆశీర్వాదం వలన ఇక ఏ సమస్యా లేదు. "బాబా! మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ఆశీస్సులతో నార్మల్ డెలివరీ అవుతుందని ఆశిస్తున్నాను. అమ్మ నాకు తోడుగా ఉండటానికి ఇక్కడికి వచ్చేలా, తన ప్రయాణం సురక్షితంగా సాగేలా మరియు బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా ఆశీర్వదించండి బాబా". మీకో ముఖ్య విషయం చెప్పాలి, 'బాబా చెప్పినట్లే నా కడుపులో ఉన్నది మగబిడ్డ'. ఆయన మాట అక్షరం కూడా పొల్లుపోదు.

ఓం సాయిరామ్!


సాయి అనుగ్రహసుమాలు - 380 వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - పద్నాల్గవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

మరుసటి సంవత్సరం, అంటే 1913 ఫాల్గుణ శుద్ధ షష్ఠి ఉదయం బ్రహ్మీముహూర్తంలో మా నాన్నగారు పరమపదించారు. చివరి సమయం వరకూ వారి వద్దనే వారిని కనిపెట్టుకుని ఉన్న మా పినతండ్రిగారైన రామగోవింద్ మా నాన్నగారు తమ అంతిమ క్షణం వరకూ నన్నే తలుచుకున్నారని చెప్పారు. వారికి దుఃఖాతిరేకం ఎక్కువైనప్పుడు ఆవేదనతో, ''నేను నా జీవితపర్యంతమూ ఎవరితోనూ పేచీ పెట్టుకోలేదు. ఎవరికీ నేను కష్టం కలిగించలేదు. మరి నాకీ పరిస్థితి ఎందుకొచ్చిందో?" అనేవారట. నిష్కపటీ, ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలిగించనివాడూ, నిరాడంబరుడూ, ధర్మపరుడూ అయి ధార్మిక జీవనాన్ని గడిపే మా నాన్నగారు తన అంతిమ సమయంలో కలిగిన దుఃఖాన్ని గురించి అన్న మాటలు వారి జీవన విధానంతో పరిచయమున్న వ్యక్తులకి సరైనవే అనిపించాయి. అంతిమ సమయంలో ఊదీ ఇవ్వటంతో ఆయనకి సాయి దర్శనం గురించి గుర్తుకు వచ్చింది. వెంటనే ఊదీ ప్రభావంతో ఆయనకు దుఃఖం నుండి ముక్తి లభించింది. ఈ సంఘటనతో, "సాధారణ జీవితాన్ని జీవిస్తూ, ఎవరికీ ఎటువంటి కష్టమూ కలిగించని మంచిమనిషి జీవితానికి ఈశ్వరుడి దగ్గర మూల్యం ఇంతేనా?” అని నా మనసులో మాటిమాటికీ అనిపించేది. తరువాత బాగా ఆలోచించాక ఒక సంగతి స్ఫురణకు వచ్చింది. 

నాన్నగారి జీవితం నిరాడంబరమూ, పాపరహితమూ, ఎవరికీ ఏ హానీ తలపెట్టనిదన్నది నిజమే. అయితే ఇదొక్కటే చాలదు. సత్కర్మాచరణ ద్వారా పుణ్యాన్ని సంపాదించటం కూడా అవసరం. ఇది నాన్నగారి జీవితంలో లోపించింది. మా బాబాయిలాగా ఆయన ఎటువంటి వ్రతాలూ, త్యాగాలూ చేయలేదు. కేవలం అధర్మాచరణకు దూరంగా ఉండటం మాత్రమేకాక ధర్మాచరణ, పుణ్యకర్మలు చేస్తేనే ఈ జీవుడు మానవదేహంలోకి వచ్చినందుకు తగిన సార్ధకతా, ఈశ్వరుడి కృపా లభిస్తాయి. ఎవరికీ కష్టం కలిగించని నాన్నగారి సాత్విక జీవనం వారికేమీ ఉపకరించలేదుగానీ, తమ అంతిమ సమయంలో వారికి లభించిన శ్రీసాయిబాబా దర్శనం వారికి పనికొచ్చిందని నేను తెలుసుకున్నాను.

వేసవిరోజుల్లో నేను శిరిడీ వెళ్ళినప్పుడు సగుణరావు ద్వారా లభించిన అక్కల్‌కోట స్వామి చరిత్ర పారాయణ నాన్నగారి సూతకం రోజుల్లో చేశాను. ఆ పారాయణ గ్రంథం మోతా గ్రామానికి తీసుకెళ్ళి అక్కడ దాన్ని పూర్తిచేశాను. శ్రాద్ధకర్మలు పూర్తి చేసుకొని నేను పార్లే తిరిగి వచ్చాను. అమ్మ మోతా గ్రామంలోనే ఆగిపోయారు. మోమీ అక్కయ్య, రామకృష్ణ బావగారూ మా ఇంట్లో ఉండేందుకు వచ్చారు. 

రామకృష్ణ బావగారి వల్ల కాకాసాహెబ్ ఇంటికి రాకపోకలు మొదలయ్యాయి. కాకాసాహెబ్ నాకు నాభాజీ విరచిత "భక్త మాల"ను చదివేందుకిచ్చారు. అందులో మహనీయుల జీవితాలను చదివి చాలా సంతోషించాను. శ్రీ“ఎమ్” రాసిన "గోస్పెల్ ఆఫ్ రామకృష్ణ” ప్రథమ భాగం తెప్పించుకున్నాను. అదికూడా భక్తమాల చదివే సమయంలోనే లభించింది. అది చదివి ఎంతో నచ్చటం మూలాన మళ్ళీ మళ్ళీ దాన్ని పారాయణ చేయటం మొదలుపెట్టాను. తరువాతి కాలంలో గాంధీ మహాత్ముడికి కార్యదర్శిగా పనిచేసిన మహదేవ్ దేశాయ్ గారు సిస్టర్ నివేదిత రాసిన "మై మాస్టర్ యాజ్ ఐ సా” అనే పుస్తకమిచ్చి, దాన్ని గుజరాతీలోకి అనువదించమని చెప్పారు. 

శ్రీమనూభాయి సుబేదారు (స్వామి సాయిశరణానందుల వారికి ఎల్ఫిన్‌స్టన్ కాలేజీలో సహాధ్యాయులు) నాతోనే ఉన్నారు. తరువాత ఆయన అర్థశాస్త్రంలో నిపుణులుగా పురస్కారం పొంది, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కాంగ్రెసు టిక్కెట్టు మీద గెలిచి అసెంబ్లీ సభ్యులయ్యారు. ఆయన మాటపై నేను "ఇన్ ట్యూన్ విత్ ది ఇన్‌ఫినిట్”, మిస్ ఎలెన్ వ్రాసిన “ఔట్ ఫ్రం ది హార్ట్” అనే రెండు పుస్తకాలూ చదివాను. తరువాత "ఔట్ ఫ్రం ది హార్ట్" తర్జుమా చేశాను కానీ, అది ప్రచురించబడలేదు. 'ఇన్ ట్యూన్ విత్ ది ఇన్‌ఫినిట్' అనువాదం పూర్తి చేయలేకపోయాను. మహదేవ్ గారిచ్చిన పుస్తకం చదివి, దాని అనువాదం ప్రారంభించాను. అలాగే మే నెలలో కోర్టు సెలవుల సమయంలో శ్రీగులాబ్‌భాయి వద్ద సెలవు తీసుకుని శిరిడీ వెళ్ళాను. ఈ యాత్రలో మనూభాయి సుబేదార్ ఇచ్చిన రెండు పుస్తకాలూ, వశిష్ఠ గీత, జ్ఞానేశ్వరి, దాసబోధ మొదలైన గ్రంథాలను చదివేందుకు శిరిడీ పట్టుకువెళ్ళాను.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 421వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ప్రసాదించిన తొలి అనుభవం
  2. మనసు మార్చి సమస్యను పరిష్కరించిన బాబా

బాబా ప్రసాదించిన తొలి అనుభవం

నా పేరు సాయి. ముందుగా, ఎంతోమంది సాయిభక్తులకి ప్రతిరోజూ బాబా ప్రసాదించిన అనుభవాల గురించి తెలుసుకునే అవకాశం కల్పింస్తున్న ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాయినాథ్ మహరాజ్‌కి తన భక్తుల పట్ల ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. అది అనుభపూర్వకంగా తెలుసుకుంటేనే అర్థమవుతుంది. మాకు మొదటిసారి బాబా దర్శనభాగ్యం ఎలా కలిగిందో నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

చాలా సంవత్సరాల క్రిందట నేను ఐదవ తరగతిలో ఉన్నప్పుడు మేము శిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మేము అప్పట్లో పల్లెటూరులో ఉండటం వలన శిరిడీ ఎలా వెళ్ళాలో మాకు అస్సలు తెలియదు. మా నాన్నగారు తనకు తెలిసినవాళ్ళని కనుక్కుని వివరాలన్నీ తెలుసుకున్నారు. తరువాత బస్సులో శిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకుని, ఒకరోజు ఉదయాన్నే మా ఊరినుండి బయలుదేరి హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్‌స్టాండుకి చేరుకున్నాం. మేము శిరిడీ వెళ్ళే బస్సుకోసం ఎదురుచూస్తూ ఉన్నాము. అలా చాలాసేపు ఎదురుచూశాము. నేను చాలా చిన్నపిల్లని కావటంవల్ల నాకు అంత బాగా గుర్తులేదు కానీ చాలాసేపు ఎదురుచూశాక, మా నాన్నగారు బస్సు గురించి డిపోలో వాకబు చేసారు. వాళ్ళు ‘బస్సు వెళ్ళిపోయింద’ని చెప్పారు. దాంతో అమ్మానాన్నలు ఎంతో బాధపడటం నేను చూశాను. ఇంటినుండి ఎంతో సంతోషంగా వచ్చాం, తీరా వచ్చాక బస్సు కాస్తా వెళ్ళిపోయేసరికి ఎంతో బాధతో బస్‌స్టాండు నుండి బయటికి నడిచాం. బస్‌స్టాండు బయట చాలా ఆటోలు ఆగివున్నాయి. నిజానికి ఎలా జరిగిందీ గుర్తులేదుగానీ, ఒక ఆటో అతను మమ్మల్ని పిలిచి, “శిరిడీకి వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇక్కడికి దగ్గర్లో నుండే బయలుదేరుతుంద”ని చెప్పాడు. ఆ మాట వినగానే అమ్మానాన్నల్లో మళ్ళీ ఆశ చిగురించింది. మేము వెంటనే ఆ ఆటో ఎక్కేశాము.

మాకు హైదరాబాదు సరిగా తెలియదు. ఆటో అతను ఎటు తీసుకెళ్తున్నాడో అసలు తెలియదు. కొంతదూరం వెళ్ళాక ఆటో అతను మమ్మల్ని ఒకచోట దింపి నాన్నతో ఏదో చెప్పారు. నాన్న మమ్మల్ని ఒక ప్రక్కన ఉండమని చెప్పి ఒక చిన్న ఆఫీసులాంటి రూంలోకి వెళ్లారు. కాసేపట్లో టికెట్లతో బయటికి వచ్చారు. కానీ రెండే సీట్లు ఉన్నాయి ఆ బస్సులో. సరిగ్గా పది నిమిషాల్లో బస్సు బయలుదేరింది. బాబా మహత్యం వల్ల హాఫ్ టికెట్టుతో ప్రయాణించాల్సిన నేను శిరిడీకి ఉచితంగా ప్రయాణించాను

అసలు ఎవరో ఒక ఆటో అతను మమ్మల్ని పిలవగానే మేము ఆటో ఎక్కేసి వెళ్లడం ఏంటి? కేవలం రెండు టికెట్లతో ముగ్గురం వెళ్లగలగడం ఏంటి? నాకు అప్పుడు తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది. టికెట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కానీ బాబా అనుకుంటే ఏదైనా చేయగలరు. మరుసటిరోజు ఉదయం శిరిడీ చేరుకున్నాం. బాబా దర్శనం కూడా చక్కగా అయ్యింది.

మైనతాయి ప్రసవ సమయంలో బాపూగిర్ కోసం గుర్రపుటాంగాతో బాబా వచ్చినట్టే, మాకోసం ఆటోతో వచ్చారు నా బాబా. ఇప్పటికీ ఆ ప్రయాణం గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. “మమ్మల్ని అంత ప్రేమగా శిరిడీకి పిలిపించుకుని మీ ఆశీస్సులు ప్రసాదించినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీ ప్రేమని పొందే అదృష్టం మాకు కలిగినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ ప్రేమ, ఆశీస్సులు మీ భక్తులందరి మీదా ఎప్పటికీ ఉంటాయని నాకు తెలుసు బాబా!”

నేను పూర్తిగా బాబా భక్తురాలిగా మారిన విషయం తదుపరి అనుభవంలో మీతో పంచుకుంటాను.

ఓం శ్రీ సాయినాథయ నమః.

మనసు మార్చి సమస్యను పరిష్కరించిన బాబా

సాటి సాయిభక్తులకు మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. ఈ సాయి భక్తకోటిలో నేనొక చిన్న భక్తురాలిని. గత 27 సంవత్సరాలుగా శ్రీసాయిని ప్రగాఢంగా నమ్ముతున్నాను. బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. ఈమధ్య మా అద్దె ఇంటి విషయంలో మా కుటుంబమంతా చాలా ఆందోళనపడ్డాము. ఆ సమస్యను బాబా ఎలా పరిష్కరించారో నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మేము ఒక సొంత ఇంటి నిర్మాణం చేపట్టాం. కానీ కొన్ని కారణాల వల్ల ఇంటి నిర్మాణం ఆలస్యమైంది. క్రొత్త ఇంటికి మారడానికి కనీసం మరో రెండు నెలల సమయం పడుతుంది. ఇంతలో మా అద్దె ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని మాపై ఒత్తిడి తెచ్చారు. ఆయనని మేము ఒకటి రెండు నెలలు గడువు కావాలని కోరాము. ఎందుకంటే, వేరే ఇల్లు వెతుక్కుందామనుకున్నా ఒకటి రెండు నెలలకు ఎవ్వరూ ఇల్లు అద్దెకు ఇవ్వరు. అందులోనూ మావారికి గుండె ఆపరేషన్ అవ్వడం వల్ల ఇల్లు మారడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఒకటి రెండు నెలలు గడువిమ్మని మా ఇంటి యజమానిని చాలా బ్రతిమాలాము. ఆయన ఒప్పుకోలేదు సరికదా మాపై పోలీసు కేసు పెడతానని గొడవ చేశారు. మా అబ్బాయి కూడా ఫోన్ చేసి చాలా బ్రతిమాలాడు. అయినా మా అద్దె ఇంటి యజమాని ఏమీ చెప్పకుండా కోపంగా కాల్ కట్ చేశారు. దీంతో నా పరిస్థితిని బాబాకు చెప్పుకుని, “మా సమస్యని పరిష్కరించండి బాబా! మా సమస్య తీరితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాని వేడుకున్నాను. బాబా కృప వల్ల నాలుగు రోజుల తరువాత ఇంటి యజమాని మాకు ఫోన్ చేసి మాకు అనుకూలంగా స్పందించారు. మరో రెండు నెలల పాటు మేము ఆ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నారు. మా సమస్యను తీర్చినందుకు ఎంతో ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము. బాబాకు మాట ఇచ్చినట్లు నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. మా కుటుంబంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా బాబా త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తూ, బాబా కృపాకటాక్షాలు ఎల్లవేళలా మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. బాబా చాలా విషయాల్లో నన్ను ఆదుకున్నారు. అన్నివేళలా బాబా మనల్ని కాపాడతారని ఆశిస్తూ... 

ఓ చిన్న సాయిభక్తురాలు.


సాయి అనుగ్రహసుమాలు - 379వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - పదమూడవ భాగం

నిన్నటి తరువాయి భాగం....

ఈ మధ్యకాలంలో స్వామి వివేకానందగారి కంప్లీట్ వర్క్స్ (మాయావతి ఎడిషన్) నా చేతిలోకి వచ్చింది. అందులోని జ్ఞానయోగాన్ని పఠించటం మొదలుపెట్టి, శిరిడీకి వెళ్ళేటప్పుడు దాన్ని నాతో తీసుకెళ్ళి అక్కడ కూడా చదవటం కొనసాగించాను. జ్ఞానయోగంలో కొన్ని భాగాలు కఠినంగా అనిపించేవి. అవి అర్థం కానప్పుడు నేను ద్వారకామాయికి వెళ్ళొచ్చేవాడిని. అది బాబాని కలిసే సమయం కాకపోతే, నేను దూరంనుంచే వారి దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ తిరిగి చదివేవాడిని. దానివల్ల అర్థంకాకపోవటమనేది దూరమయ్యేది. ఈ సమయంలో నేను రచించిన పద్యాలు సాయిలీలా పత్రికలో ప్రచురించబడ్డాయి. వాటిలో "ఓ నాలుకా! నీవు సాయి నామం పలుకు. వేరే పని నీకేముంది?" అన్న పద్యం కాకాసాహెబ్‌కి వ్రాసి పంపాను. అలాగే ఇంగ్లీషులో బాబాపై రాసిన ఒక కవితను కాకాసాహెబ్‌కి పంపాను. దాని భావాన్ని ఆయన బాబాకి చెప్పారు. నేను స్వయంగా బాబాకి ఎదురుగా, "నా హృదయం సదా శుష్కవాదాలతో ఉంది" అను అర్థంతో ఉన్న మరో కవితనూ, అంతేకాక మరో కావ్యాన్ని కూడా పాడి వినిపించాను.

బాబాను రెండోసారో మూడోసారో కలిసినప్పుడు బాబా నన్ను, “ఎక్కడనుంచి వచ్చావ"ని ప్రశ్నించారు. దానికి నేను “బొంబాయి" నుండి వస్తున్నానని యథాలాపంగా చెప్పాను. అయితే తరువాత ఆలోచిస్తే, "ఎక్కడనుంచి వచ్చాం? ఎక్కడికి వెళ్ళాలి?" అన్న ప్రశ్నకి చక్కని పారమార్థిక దృష్టితో బాబా ఒక్కరే సరైన సమాధానం చెప్పగలవారు అనిపించింది. అందుకోసం శిరిడీలో వెంటనే ఒక కవితను రచించి బాబాకి వినిపించాను. బాబా ఏమీ అనకుండా కేవలం ధ్యానపూర్వకంగా విన్నారంతే. ఈ దర్శనంలోనే దాసగణుగారి నాలుగు అధ్యాయాల అనువాదాన్ని నా వెంట తీసుకొచ్చాను. ఈ విషయం గురించి కాకాసాహెబ్‌తో చర్చించాను. కాకాసాహెబ్ దీక్షిత్ దాని గురించి బాబాతో మాట్లాడుతూ వాటి చేవ్రాలు ప్రతిని బాబా చేతిలో పెట్టారు. ఆయన దానిపై తమ దృష్టిని సారించి పేజీలు తిప్పుతూ, “మంచిది, ప్రచురించు" అన్నారు.

ఈ సమయంలోనే నేను శ్రీనానాసాహెబ్ చందోర్కర్‌తో వారి అనుభవాలను చెప్పమని అర్థించాను. అందుకాయన ఒక షరతుపై అంగీకరించారు. అదేమిటంటే, ఆయన చెప్పే అనుభవాలను వ్రాసి మొదట వారికి చూపాలనీ, దానిపై ఆయన చేసిన సవరణలతో ప్రచురించాలనీ అన్నారు. ఆయన చెప్పిన షరతుకి నేను అంగీకరించాక, ఒకసారి నేను పార్లేనో లేక బాంద్రానో వెళ్ళే సమయంలో మూడవ తరగతి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన టౌన్ హాల్లో జరిగే డిపార్టుమెంట్ పరీక్ష పని మీద వెళుతూ కనిపించి, నాతో కూర్చొని రెండు గంటలు తమ అనుభవాలను చెప్పారు. అవి వ్రాసి నేను వారికి పంపాను. కానీ వారికా జాబు నచ్చలేదు. శ్రీదాసగణు వ్రాసిన నాలుగు అధ్యాయాల్లో నేను వ్రాసిన గుజరాతీ తర్జుమాలో కొన్ని వ్యాకరణ దోషాలున్నాయని కూడా వారు కాకాసాహెబ్ దీక్షిత్‌తో అన్నారట. ఈ కారణం వల్ల ఆ అధ్యాయాలను ప్రచురించే ఆలోచన వెనకపడిపోయింది. అదేకాక దాన్ని ముద్రించటానికి అయ్యే ఖర్చుకోసం నాకు ఎటువంటి ఆదాయమూ లేనందున ఆ పనిని చేపట్టకూడదని అనుకున్నాను. అయినా కూడా వైకుంఠ్ ఆ నాలుగు అధ్యాయాలకూ ప్రతులు వ్రాసి దాన్ని పారాయణ చేయటం మొదలుపెట్టాడు. 

ఆ తరువాత భక్తులైన తన స్నేహితులకు ఆ వ్రాతప్రతులను చూపించాడు. అదలా ఉంటే, ఒకసారి బాబా నాకు స్వప్న దర్శనమిచ్చి, “అరె! ఈ పొలానికి కంచె లేకపోతే మేకలు లోపలకు వచ్చి ధ్వంసం చేస్తాయి" అన్నారు. తరువాత నేను దాసగణు వ్రాసిన నాలుగు అధ్యాయాలూ చదవటం మొదలైనప్పటికీ బాబా అన్న ఆ మాటకి అర్థం నాకు అప్పట్లో బోధపడలేదు. కానీ "ఆధ్యాత్మిక మార్గంలో సాధకునికి వచ్చే పుణ్యానికి వ్రతనియమాలనే కంచెను వేసుకుని కాపాడుకోలేకపోతే మనలోని అహంకారమనే మేకలు భయంకరంగా అరుస్తూ ఆ పుణ్యాన్ని కబళించి వేస్తాయనీ, మనం ఇదివరకు లాగానే అజ్ఞానంలో ఉండిపోతామ"న్నది బాబా మాటలకర్ధమని ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే వ్రతనియమాలనే కంచెను వేసుకోవటం అత్యవసరం.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 420వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. నైవేద్యాన్ని స్వీకరించినట్లుగా బాబా ఇచ్చిన నిర్ధారణ
  2. ప్రార్థించినంతనే అపాయం నుండి బయటపడేసిన బాబా 

నైవేద్యాన్ని స్వీకరించినట్లుగా బాబా ఇచ్చిన నిర్ధారణ

నా పేరు అంజలి. బాబా నాకు ప్రసాదించిన లీలలను గత కొద్దిరోజులుగా మీ అందరితో పంచుకుంటున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను మీతో పంచుకుంటాను.

30.04.2020న నేను గురుచరిత్ర సప్తాహపారాయణ ప్రారంభించాను. బాబా దయవలన పారాయణ చాలా బాగా జరిగింది. 7వ రోజు బుధవారంనాడు నెయ్యితో గోధుమహల్వా తయారుచేసి దత్తాత్రేయస్వామికి నివేదించాను. తరువాత పారాయణ చేయటం ప్రారంభించాను. పారాయణ మధ్యలో నాకు నెయ్యి వాసన వచ్చింది. స్వామికి నివేదించిన ప్రసాదం నాకు ఒక అడుగు దూరంలో ఉంది. కానీ ఆ వాసన ఎలా వస్తోందంటే, ఎవరైనా నాకు బాగా దగ్గరగా వచ్చి తింటుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. కాసేపటికి నెయ్యి వాసన పోయింది. నేను పారాయణ చేసుకుంటూ, 'అదంతా నా భ్రమేమో' అనుకున్నాను. అలా అనుకున్న ఒక నిమిషం తరువాత మరలా నెయ్యి వాసన వచ్చింది. కళ్ళు మూసుకుంటే, దత్తాత్రేయస్వామి నేను సమర్పించిన నైవేద్యాన్ని తింటున్నట్లుగా నాకు దర్శనం అయింది. ఎంతో ఆనందంతో నా ఒళ్ళంతా పులకరించింది.

మరో అనుభవం:

07.05.2020, గురువారంనాడు బాబాకు ఇష్టమని కిచిడీ తయారుచేసి బాబాకు నివేదించి, “బాబా! నేను సమర్పించిన నైవేద్యాన్ని మీరు స్వీకరించినట్లు నాకు నిదర్శనం కావాలి” అని బాబాను ప్రార్థించాను. మేము వుండే అపార్టుమెంటులో పనిచేసే వాచ్‌మన్‌కి 9 నెలల బాబు ఉన్నాడు. బాబాకు నివేదించిన కిచిడీని ఆ బాబుకి పెట్టమని వాళ్ళ అమ్మకి ఇచ్చి పంపాను. చిన్నపిల్లలు దేవుని స్వరూపం అంటారు కదా! 'ఆ బాబు నేనిచ్చిన బాబా ప్రసాదం తింటే బాబా స్వయంగా స్వీకరించినట్లే' అని అనుకున్నాను. శుక్రవారం వాచ్‌మన్ భార్య వాళ్ళ బాబుని తీసుకుని మా ఇంటికి వచ్చింది. కిచిడీ ప్రసాదాన్ని బాబు చాలా ఇష్టంగా తిన్నాడని చెప్పింది. చాలా సంతోషంగా అనిపించింది. బాబా నాకు ఎలా నిదర్శనం ఇచ్చారని అనుకుంటున్నారా? బాబానే ఆ బాబు రూపంలో మా ఇంటికి వచ్చారు. ఎందుకంటే ఆ బాబు పుట్టి తొమ్మిది నెలలు అవుతోంది. ఆ చిన్న బాబుని ఆమె ఎప్పుడూ ఎవరింటికీ తీసుకొని వెళ్ళలేదు. మొదటిసారిగా ఆరోజే బాబుని మా ఇంటికి తీసుకుని వచ్చింది. అంటే బాబానే ఆ బాబు రూపంలో మా ఇంటికి వచ్చి,నువ్వు పంపిన ప్రసాదాన్ని స్వీకరించానుఅని బాబు తల్లి ద్వారా నాకు తెలియజేశారు. ఆయన లీలలకు అంతం లేదు. భక్తుల కోసం ఆయన ఏమయినా చేస్తారు. “ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకోవటం కొంచెం ఆలస్యం అయింది. ఈ దీనురాలిని క్షమించండి బాబా. ఎప్పుడూ అందరినీ చల్లగా వుండేలా దీవించండి బాబా!” 

ఓం సాయిరాం!

ప్రార్థించినంతనే అపాయం నుండి బయటపడేసిన బాబా  

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికీ నమస్కారం. ఇటీవలే బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని సాటి సాయిభక్తులందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.

2020, మే రెండవ వారంలో నాకు తెలియకుండానే నేనొక అపాయంలో(అది ఏమిటనేది నేను మీతో వివరించలేను) పడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ సంఘటనతో నేను కలత చెంది, “బాబా! దయచేసి ఈ అపాయం నుండి నన్ను గట్టెక్కించండి. మీ అనుగ్రహంతో ఈ అపాయం నుండి బయటపడితే నా అనుభవాన్ని వెంటనే బ్లాగులో పంచుకుంటాను” అని ఎంతో ఆర్తితో బాబాను ప్రార్థించాను. అలా ప్రార్థించిన తరువాత రోజే బాబా చాలా సులువుగా ఆ అపాయం నుండి నన్ను బయటపడేశారు. నాకు తెలియకుండానే పెద్ద అపాయంలో పడిపోయిన నన్ను బాబా ఎంతో దయతో రక్షించారు. బాబా ఉంటే అసాధ్యమంటూ ఏమీ లేదు. ఆయన చాలా దయగలవారు, పిలిచిన వెంటనే రక్షణనిస్తారు. “థాంక్యూ సో మచ్ బాబా! నన్ను ఎల్లప్పుడూ ఇలాగే రక్షించండి. మీ భక్తులందరికి కూడా ఇలాగే రక్షణనిస్తూ చల్లగా చూడండి. నా జీవితంలో నాకు ఒక మంచి మార్గం చూపించండి బాబా, ప్లీజ్. మరోసారి చాలా చాలా ధన్యవాదాలు బాబా!”.

ఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమః.


సాయి అనుగ్రహసుమాలు - 378వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - పన్నెండవ భాగం

నిన్నటి తరువాయిభాగం.....

ప్రతి వస్తువులోనూ బాబా దర్శనం

వేసవిలో కాంగ్రెస్ మహాసభలు ముంబాయిలో జరగనున్నాయి. వేసవి కారణంగా కోర్టులు పూర్తిగా మూసివేసేవారు. అందువలన కాకాసాహెబ్ దీక్షిత్ శిరిడీలో ఉన్నారు. ఆయన ద్వారా నేను బాబాను, "నేను కాంగ్రెస్ మహాసభలకి హాజరవనా? లేక మీ దగ్గరకొచ్చి ఒక నాలుగు రోజులు ఉండనా?” అని అడిగించాను. ప్రశ్న మాత్రం సామాన్యంగానే ఉన్నా దాని వెనకాల బాబా నా జీవిత లక్ష్యాన్ని నిర్దేశించాలనే అభ్యర్ధన ఉంది. నేను జీవితంలో రెండు విభిన్న మార్గాల కూడలిలో ఉన్నాను. నేనొక రాజకీయవేత్తగా ఉండటమా? లేక కేవలం ఒక మతాన్ని అంటిపెట్టుకొనే మనిషిలాగా ఉండాలా? అన్న విషయంపై శ్రీసాయిబాబా నిర్ణయాన్ని ఆశించాను. "వేసవిరోజుల్లో ఇక్కడికి రమ్మని వాడితో చెప్పు” అని బాబా జవాబు వ్రాయించారు. దాంతో నేను శిరిడీ వెళ్ళాను. ఇది జరగడానికి ముందు ప్రేమానంద భారతీ విరచిత "లైట్ ఆన్ లైఫ్" అనే చిన్న పుస్తకాన్ని నేను చదవటం తటస్థించింది. అలాగే గుజరాతీ ప్రెస్ ప్రచురించిన శ్రీరామకృష్ణ బోధామృతం కూడా 50 పైసలకి లభించగా అది కూడా చదివాను.

శిరిడీ చేరుకున్న తరువాత అంతవరకు నేను చేస్తున్న బాబా సగుణ ధ్యానానికి బదులు వారి నిర్గుణ రూపాన్ని ధ్యానించటం మొదలుపెట్టాను. ఒక సాయంత్రం ఎవరో జామపళ్ళను నైవేద్యంగా బాబాకి అర్పించారు. బాబా వాటిలో కొన్ని నాకిచ్చి, “తీసుకో, పైకి ఇవి పచ్చిగా ఉన్నట్లనిపించినా లోపల మధురంగా ఉంటాయి” అన్నారు. నిజానికి ఆ జామపళ్ళు ఎవర్నైనా సందిగ్ధంలో పెట్టేలాగానే ఉన్నాయి. అయితే బాబా చెప్పిన ఉపమానం ఎలా ఉందంటే, “నా నిర్గుణోపాసన ప్రారంభంలో పచ్చిగానే కనిపించినప్పటికీ దాని పరిణామం మాత్రం మధురంగానూ, శాంతిని ప్రసాదించేదిగానూ ఉంటుంది" అనిపించింది. ఆయన చెప్పిన మాట బహుశా వారి ఆశయం కావొచ్చుననుకొని, నేను బాబాకి అత్యంత పురాతన భక్తుడు మాత్రమేకాక, ఆయనతో రోజూ మశీదులో శయనించే మహల్సాపతి గారింటికి ఒక గృహస్థుని వెంటబెట్టుకొని వెళ్ళి బాబా మాటలకి అర్థమేమిటని వారిని అడిగాను. ఆయనతో చర్చించాక నా అనుమానం నిజమేననిపించింది. అనుమానం నివారణ చేసుకున్నాక అది బాబా నాకిచ్చిన ఆదేశంగా తలచాను.

వేసవికాలం పూర్తయ్యాక అనుకుంటాను, ఒక రాత్రివేళ బాబా నాకు దర్శనమిచ్చి, "అరే! గుఱ్ఱం, గుఱ్ఱం అంటూ ఉండు. గుఱ్ఱం మీద కూర్చోవటం రావాలి" అని అన్నారు. నా బుద్ధికి తోచిన ప్రకారం, గుఱ్ఱం అనే శబ్దోచ్ఛారణతో మంత్రాన్ని జపించాలనుకుని శిరిడీలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా ఆ విషయం గురించి బాబాని అడిగించాను. అప్పుడు బాబా దీక్షిత్ ద్వారా తమ ఆశీస్సులు పంపారు. ఇక నేను ఆ మంత్రాన్నే జపమాలతో జపించటం మొదలుపెట్టాను. ఆ మంత్రాన్ని జపిస్తుండటం వల్ల బాబా రూపం పదే పదే కనిపించటం మొదలైంది. క్రమక్రమంగా నీటిలోనూ, భూమిపైనా, అగ్నిలోనూ, ఒకటేమిటి? ప్రతి వస్తువులోనూ బాబా రూపం గోచరమయ్యేది. దానితో బాబా సర్వవ్యాపకత్వం నాకు బోధపడింది.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 419వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • జ్యోతిష్యశాస్త్ర నిర్ణయాన్ని తారుమారు చేసిన బాబా

సాయిబాబా లీలలు అద్భుతమైనవి. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలంగా లేవని వాస్తవాన్ని అంగీకరించడానికి మనం మన ఆశలను, ధైర్యాన్ని వదులుకోవడానికి సిద్ధపడతాం. సరిగ్గా అప్పుడే బాబా మనం కోరుకున్నట్లుగా పరిస్థితులను మారుస్తారు. సాయిభక్తుడు శ్రీనివాసులు జీవితంలో ఇదే అనుభవమైంది. ఆ అనుభవాన్నే అతను మనతో పంచుకుంటున్నారు.

నాకు మా మేనమామ కూతురినిచ్చి వివాహం చేయాలని మా చిన్నతనం నుండి ఇరు కుటుంబాల వాళ్ళు అనుకుంటుండేవారు. 2005, డిసెంబరులో మా మేనమామతో, "మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి వివాహం చేసి మా ఇంటి కోడలిగా పంపమ"ని అడిగింది మా అమ్మ. అందుకు ఆయన అంగీకరించాడు. మేమంతా చాలా సంతోషించాము. నేను మా మేనమామ కూతురికి ఫోన్ చేసి మాట్లాడాను. క్రమంగా ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాను.

2006 ప్రారంభంలో పెద్దవాళ్ళు పెళ్లిపనులు మొదలుపెట్టారు. అందులో భాగంగా వాళ్ళు ఒక జ్యోతిష్కుడి వద్దకు వెళ్లారు. ఆ జ్యోతిష్కుడు మా జాతకాలు చూసి, మా ఇద్దరికీ పెళ్లి చేయకూడదని, ఒకవేళ చేస్తే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలు వస్తాయని చెప్పాడు. అప్పుడు ఇరు కుటుంబాల వాళ్ళు చర్చించుకుని పెళ్లి ఆపివేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయం తెలిసి మేమిద్దరం కన్నీళ్లు పెట్టుకున్నాము. మేము మా తల్లిదండ్రులను ఎంతగానో అభ్యర్థించాము. కానీ వాళ్ళు, "జ్యోతిష్కుడు చాలా అనుభవజ్ఞుడు. పైగా మనకు బంధువు. అతను బాగా పరీశీలించి మరీ చెప్పాడు. కాబట్టి ఈ పెళ్లి జరగద"ని నిష్కర్షగా చెప్పేశారు.

నేను చాలా చాలా బాధపడి హైదరాబాదు వెళ్లి మరో జ్యోతిష్కుడిని సంప్రదించాను. అతను మా జాతకాలు పరిశీలించి, "జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మీరు వివాహం చేసుకోవచ్చు" అని చెప్పాడు. నేను అతను వేసిన కుండలినిని మా అమ్మకి పంపి పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించాను. మా అమ్మావాళ్ళు దాన్ని తీసుకుని మొదటి జ్యోతిష్కుడి వద్దకు వెళ్లారు. అతను రెండవ జ్యోతిష్కుడు చెప్పిన వాటిలో కొన్ని తప్పులను ఎత్తిచూపి, "నేను బాగా పరిశీలించే ఈ పెళ్లి జరగకూడదని చెప్పాను. కాబట్టి ఈ విషయంలో మీరు ఎవరి ద్వారానూ ముందుకు పోవద్దు, పెళ్లి చేయవద్దు" అని చెప్పాడు. దాంతో పెద్దవాళ్ళు మా పెళ్లి గురించి ఇక మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు.

నేను చాలా బాధపడుతూ జరిగినదంతా నా స్నేహితుడితో పంచుకున్నాను. తను నవ్వి, "మన సాయిబాబా ఉండగా నువ్వెందుకు ఆందోళన చెందుతున్నావు? నువ్వు సాయి సచ్చరిత్ర పారాయణ చేయి, అప్పుడు బాబా చేసే అద్భుతాన్ని చూడు" అని చెప్పాడు. దాంతో నేను సాయి సచ్చరిత్ర పారాయణ చేయడం ప్రారంభించాను. మొదటిరోజు పారాయణ పూర్తయింది, రెండవరోజు, మూడవరోజు, నాల్గవరోజు పారాయణ కూడా పూర్తయింది. ఐదవరోజు సాయంత్రం 8 గంటలకు నేను పారాయణ చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. హఠాత్తుగా కొన్ని సెకన్లు “గుర్ర్...”మంటూ ఒక శబ్దం వినిపించింది. అది ఎక్కడినుండి వస్తుందో నాకు అర్థం కాలేదు. ఏమిటోలే అని మళ్ళీ నేను చదవడం మొదలుపెట్టాను. ఐదు నిమిషాల తరువాత “గుర్ర్...”మంటూ అదే శబ్దం. ఈసారి నేను భయపడ్డాను. అంతా వెతికాను. కానీ ఏమీ కనపడలేదు. మళ్ళీ చదవడం ప్రారంభించాను. మళ్ళీ ఐదు నిమిషాల్లో అదే శబ్దం. ఈసారి అది ఫోన్ వైబ్రేషన్ శబ్దం అని కనుగొనగలిగాను. అప్పుడు ఫోన్‌ లిఫ్ట్ చేసి మాట్లాడాను. ఆ ఫోన్ చేసింది మరెవరో కాదు, మా అత్తయ్య. ఆమె, "2006, మార్చి 3న మీ నిశ్చితార్థం. మే 11న వివాహం" అని చెప్పింది. ఆ అద్భుతానికి ఆశ్చర్యపోతూ, "ఇది ఎలా జరిగింద"ని ఆమెను అడిగాను. అందుకామె, "(మొదటి) జ్యోతిష్కుడు మా ఇంటికి వచ్చి, 'ఇద్దరి నక్షత్రాలు జెమినియే. ఆ నక్షత్రం ఉన్నవాళ్ళకి ఆ నక్షత్రం వాళ్లతోనే వివాహం చేయాలి కాబట్టి ఈ ఇద్దరికీ వివాహం జరిపించాలి' అని చెప్పాడు. అందువల్లనే మేము ముహూర్తాలు పెట్టాము" అని చెప్పింది. ఇక నా ఆనందానికి అవధులులేవు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

నాకు ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. అందులో ఇది ముఖ్యమైనది. సాయిబాబా మామూలు మానవుడు కాదు. ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపం. శ్రీసాయినాథుడు మన దైవం. కాబట్టి దేనికోసమూ చింతించకండి. సాయి నామం జపించండి. ఏ సమస్యలు లేకుండా మీ జీవితాలు హాయిగా సాగిపోతాయి.

source:http://www.shirdisaibabaexperiences.org/2012/02/my-experience-with-my-god-sai-devotee.html


సాయి అనుగ్రహసుమాలు - 377వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - పదకొండవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

నేను సాయిబాబాను పూజించటం మా అమ్మగారికి ఇష్టముండేదికాదు. రాత్రిపూట భోజనాలయ్యాక నేను, అన్నయ్య, అమ్మ కలసి కూర్చునేవాళ్ళం. ఆ సమయంలో నేను సాధు సత్పురుషుల చరిత్రలు చదువుతుంటే అమ్మ ప్రేమతో వింటూండేవారు. అయితే ఆవిడకు భక్తుల పేదరికపు జీవితం నచ్చేదికాదు. పేదరికం అనేది ఈశ్వరుడి కరుణకు లక్షణం కాదనీ, భక్తిమార్గంలో వ్యాకులత చెందుతూ పేదరికాన్ని కోరుకుంటూండటం కాక, తమ ఉద్యోగ ధర్మాన్నీ, కర్తవ్య నిర్వహణనూ చేస్తూ భగవంతుడి స్మరణ చేయాలని ఆవిడ భావించేది. ఒకసారి ఆమె నాతో, “నీ పూజలు వ్యర్థం. నీ మొహంలో ప్రతిఫలించే వర్చస్సు ఏమయిపోయిందో? నీ మొహం విచారంగా ఉంటోంది, నువ్వు ఖిన్నుడవైనట్లు కనిపిస్తున్నావు" అన్నారు. తరువాత ఆవిడ హాల్లో పెట్టిన శ్రీసాయిబాబా ఫోటోని తీసి దాచేసింది.

పైన చెప్పిన సంఘటన జరగకముందు నాన్నగారు ధంధుకా వెళ్ళి ఉన్నారు. అక్కడ బాగా జబ్బుపడటం వల్ల మోతా గ్రామం వెళ్ళి అక్కడ వారు పరమపదించారు. నాన్నగారి అస్వస్థత కారణంగా మా అమ్మగారు మోతా గ్రామం వెళ్ళి నాన్నగారి మరణానంతరం అక్కడే ఉండిపోయారు. మేము కూడా వైద్యగారి బంగళా ఖాళీ చేసి, రెండు గదుల అద్దె ఇంట్లో ఉండటం మొదలుపెట్టాం. కొద్దిరోజుల తరువాత అక్కడ ఉండటానికి మా పెద్దక్క, బావగారూ వచ్చారు. అక్కడ నాకు మంచి ఆధ్యాత్మికోన్నతి కలిగింది. నా నిత్యపూజలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన శ్రీదాసగణు గారి నాలుగు అధ్యాయాల పఠనం ఉండేది. ఇంట్లో నాలాగా మరాఠీ అర్థం చేసుకొనేవారెవరూ లేరు. నా మరాఠీ కూడా అంతంత మాత్రమే. మా తమ్ముడు వైకుంఠ్‌కి నా మీద చాలా గౌరవం ఉండి, నేను చేసే పనులంటే అభిరుచి ఉండేది. శ్రీదాసగణుగారి నాలుగు అధ్యాయాల గురించి నేను ప్రశంసాపూర్వకంగా చెప్తే, అది గుజరాతీలో ఉంటే బాగుండుననుకొనేవాడు అతను. తన మనశ్శాంతి కోసం నా సలహాలను పాటించి, నా మాటలు ప్రేమపూర్వకంగా స్వీకరించేవాడు. అతను కోరుకున్నదాన్ని అతనికి ప్రసాదింపచేసే ఒక కావ్యాన్ని నేనతనికి ఇచ్చాను. దాని రెండో కాపీ నా వద్ద ఇప్పుడు లేదు. మా అక్క, తమ్ముళ్ళకోసం ఆరతులను గుజరాతీలోకి అనువదించాను. వైకుంఠ్ ప్రతిరోజూ ఈ పద్యానువాదాలను చదివేవాడు. వాడికి అవి కంఠస్తమైపోయాయి.

ఒకసారి బాబా నా స్వప్నంలో దర్శనమిచ్చారు. అందులో వారు తమ మహాసమాధికి సిద్ధమవుతున్నట్లు అనిపించింది. అందుకని నేను ఆదివారంనాడు వారి దర్శనం చేసుకుందామనే ఉద్దేశ్యంతో ఒక శనివారంనాడు ముంబాయి నుండి బయలుదేరి శిరిడీ వెళ్ళాను. ఆరోజు సాయంత్రం నాలుగ్గంటలకి తిరిగి ప్రయాణానికి బాబా వద్ద అనుమతి తీసుకొనేటప్పుడు, “బాబా వెళ్ళిపోయాక ఈశ్వరుడి దర్శనం నాకు ఎవరు ప్రసాదిస్తార”నే విచారం నా మనస్సులో కలిగింది. అప్పుడు బాబా, "భగవంతుడే యజమాని. ఆయన అంతా మంచే చేస్తారు” అని మాత్రం అన్నారు. వారన్న ఆ మాటకి నేను పూర్తిగా సంతృప్తి చెందానని కాదు కానీ, నేనేం జవాబు చెప్పగలను? అందుకే మౌనంగా ఉండిపోయాను. బాబా నాకు ఊదీ ఇచ్చారు. అది తీసుకొని నేను బయలుదేరి మర్నాడు ఆఫీసులో హాజరయ్యాను.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo