సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 412వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • మానసిక రుగ్మతకు బాబా చేసిన చికిత్స

సాయిభక్తురాలు దీప తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

"అగర్ బాబా నహీ ఆతే తో మై కభీ భీ ఠీక్ నహీ హో పాతీ"
(బాబా స్వయంగా రాకపోతే నాకు ఎప్పటికీ నయమయ్యేది కాదు.)

ప్రియమైన బాబా భక్తులారా! నేను ఏదైతే అనుభవించానో దాన్ని మాటల్లో వర్ణించలేను. బాబా స్వయంగా రాకపోతే, నాకు ఎప్పటికీ నయమయ్యేది కాదు. నా జీవితమంతా నిరాశతో జీవించేదాన్ని.

2008వ సంవత్సరం ఆరంభమవుతూనే నేను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాను. క్షణం కూడా నా మనస్సు స్థిరంగా ఉండేది కాదు. ఆ చంచలత్వంతో జీవితంపై నిరాశ కమ్ముకుంది. మనస్సు నియంత్రణలో లేనందున ఆ స్థితి నుండి బయటకు రావడం చాలా కష్టంగా మారింది. ప్రతిక్షణం బాధపడుతూ ఉండేదాన్ని. మానసిక సమస్యలతో బాధపడేవారు నా పరిస్థితి అర్థం చేసుకోగలరు. నేను సహాయం కోసం ఒక కౌన్సిలర్‌ను సంప్రదించి, ధ్యానం, నామస్మరణ చేస్తూ మందులు వాడాను. కానీ అవి నాకు చాలా స్వల్పకాలమే సహాయపడ్డాయి. ఏదీ నాకు పూర్తి ఉపశమనాన్ని ఇవ్వలేదు. నేను మానసికంగా బలహీనపడుతున్నందున నా తల్లిదండ్రులు, స్నేహితులు ఆందోళనచెందారు. నేనప్పుడు మా కుటుంబం (వారు భారతదేశంలో ఉన్నారు) నుండి దూరంగా బాబాకు అంకిత భక్తురాలైన మా అక్కతో విదేశంలో ఉన్నాను.

అక్క నాకు మంచి జరగాలని ప్రతిరోజూ సాయి సచ్చరిత్ర చదివి, ఒక చిన్న బాబా ఫోటోను బుక్‌మార్క్‌గా ఉంచుతుండేది. ఒకరోజు నా పరిస్థితి మరీ తీవ్రంగా మారింది. మానసిక ఆందోళనలో పూర్తిగా కూరుకుపోయాను. ఆరోజు అక్క నాకోసం బాబాను ప్రార్థించి సోఫాలో కూర్చుంది. హఠాత్తుగా సాయి సచ్చరిత్ర సోఫా మీద నుండి నేలపై పడిపోయింది. ఆమె దాన్ని అపశకునంగా భావించి, ఏదైనా చెడు జరుగుతుందేమోనని చాలా భయపడింది. ఆ గందరగోళంలో నేలమీద పడివున్న సచ్చరిత్రలోని తెరచుకుని ఉన్న పేజీని ఆమె గమనించలేదు. అయితే బాబా అప్పటికే ఏదో ప్రణాళిక చేసి ఉన్నారు. ఆ పేజీ ద్వారా మాకు సందేశం ఇస్తున్నారు.

ఇంట్లోని ప్రతి గదిలో బాబా ఫోటోలు ఉన్నాయి. నా పడకగదిలో కూడా నా మంచం వెనుక ఉన్న గోడకు బాబా ఫోటో ఉంది. అది నా మంచానికి సరిగ్గా మధ్యలో ఉంది. నేనెప్పుడూ మంచానికి ఎడమవైపు పడుకుంటాను. కానీ ఆరోజు రాత్రి నేను మానసిక ఒత్తిడి అనుభవిస్తూ, నాకు తెలియకుండానే బాబా ఫోటో క్రిందుగా మంచానికి మధ్యలో పడుకున్నాను. (అంతా బాబా ప్రణాళిక!) కాసేపటికి నాకు ఒక కల వచ్చింది. కలలో నేను ఒక ఇంట్లో ఎవరో ఒక మహిళ మరణించి ఉండటం చూశాను. ఇంట్లోవాళ్ళు చనిపోయిన ఆ మహిళ కోసం ఆచారపూర్వకంగా దహనసంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతలో నాకు చాలా భయంకరమైన నవ్వు వినిపించింది. ఆ శబ్దం నన్ను తీవ్రంగా భయపెట్టింది. ఎలా వర్ణించాలో తెలియడంలేదుగానీ, నేనలా భయపడుతూ ఉండగా ఎవరో వచ్చి నా శరీరాన్ని భౌతికంగా తాకినట్లు అనుభూతి కలిగి నాకు మెలకువ వచ్చింది. నేను నెమ్మదిగా కళ్ళు తెరుస్తున్నాను. నారింజరంగులో ఒక కాంతి కొన్ని సెకన్లపాటు నాపై తిరిగి అదృశ్యమైంది. నా కళ్ళు తెరవడం, కాంతి కనపడటం అన్నీ క్షణాల్లోనే జరిగాయి. అందువలన ప్రతిదీ గుర్తుంచుకోవడం నాకు చాలా కష్టమైన పని. అయితే నేను నా జీవితంలో అంతకుముందెన్నడూ అంత భయపడలేదు. ఆ భయం వలన లేస్తూనే నా మనస్సులోకి వచ్చిన మొదటి ఆలోచన ఏమిటంటే, ఏదో దుష్టశక్తి నన్ను తన స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని. మరుక్షణంలో నాకు బాబా గుర్తుకొచ్చారు. ఫోటో రూపంలో బాబా నా గదిలో ఉండగా, సరిగ్గా నేను ఆయన క్రింద ఉండగా దుష్టశక్తైనా ఎలా వస్తుంది అని అనుకున్నాను. కానీ నేను భయంతో వణికిపోతున్నాను, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. వెంటనే గట్టిగా అక్కను పిలిచాను. తను వచ్చి జరిగింది తెలుసుకుని, తను కూడా భయపడి నన్ను తన గదికి తీసుకువెళ్ళింది.

నేను వణికిపోతూ తన మంచం మీద పడుకుని, నన్ను కాపాడమని లోలోపల బాబాను స్మరిస్తున్నాను. అంతలో, 'అది దుష్టశక్తి అయితే నేనెలా బాబాను స్మరిస్తున్నాను?' అని నాకు అనిపించింది. దాని గురించి నేను అక్కతో చెప్పాను. తను "నారింజరంగు బాబాకు సంబంధించినది, కాబట్టి నిన్ను మేల్కొల్పినది ఏదో దుష్టశక్తి కాదు" అని చెప్పింది. అప్పుడు నాకు కాస్త ప్రశాంతంగా అనిపించి నిద్రపోయాను. కొద్దిసేపటికి మరొక కల వచ్చింది. ఈసారి కలలో నేను హనుమంతుడిని చూశాను. నా మనస్సు హనుమాన్ చాలీసా చదవమని చెప్పింది. తరువాత మెలకువ వచ్చింది. ఈసారి మేల్కొనేసరికి నాకు అస్సలు భయం లేదు. నేను వెంటనే మా ఇంట్లో ఉన్న పూజామందిరానికి వెళ్లి, నా చేతులతో బాబా విగ్రహాన్ని తాకాను. ఏమో తెలీదుగానీ నా మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది.

మరుసటిరోజు అక్క నన్ను పిలిచి, "నిన్న రాత్రి నిన్ను తాకింది మరెవరో కాదు, సాక్షాత్తూ బాబానే!" అని చెప్పింది. నేను తనని "ఎలా చెప్తున్నావు?" అని అడిగాను. అందుకు తాను "నిన్న రాత్రి సాయి సచ్చరిత్ర సోఫా మీద నుండి పడిపోయినప్పుడు తెరుచుకున్న పేజీ చదివాను. అది 6వ అధ్యాయంలోని మొదటి పేజీ. అక్కడ 'గురు కరస్పర్శ యొక్క ప్రభావం' గురించి చెప్పబడి ఉంది" అని చెప్పింది. అంటే, బాబా మొదట కలలో నన్ను భయపెట్టి, ఆపై తమ కరస్పర్శతో నన్ను మేల్కొలిపారు. కలలో నేను అనుభవించిన భయంతో ఇలలో నేను ఎన్నోరోజుల నుండి అనుభవిస్తున్న మానసిక ఆందోళనను, నిరాశను బాబా తొలగించారు. కలలో నేను చూసిన మరణం నా మానసిక ఆందోళన, నిరాశ మరియు చంచలతల యొక్క మరణం. బాబా అలా కలలో బాధను అనుభవించేలా చేసి తమ భక్తుల సమస్యలను తీర్చి స్వస్థత చేకూరుస్తారు. బాబా చేసిన అద్భుతాన్ని నేనస్సలు నమ్మలేకపోయాను. ఇప్పటికీ దాని గురించి ఆలోచించినప్పుడల్లా నేను కన్నీళ్లు పెట్టుకుంటాను. బాబా ప్రేమకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతాను. "మేరే దేవా, మేరే మాలిక్, మానసికంగా బాధను అనుభవిస్తున్న ఈ భక్తురాలికి నయం చేయడానికి మీరే వచ్చారు. మీరు నా చిన్న ఇంటికి వచ్చి, మీ పవిత్ర హస్తాలతో అపరిశుభ్రమైన నా చర్మాన్ని (ఆరోజు నేను స్నానం చేయలేదు) తాకారు. మీరు నా దగ్గరకు వచ్చినా నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను. నేను ఎంత మూర్ఖురాలినో!! మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు బాబా".

బాబా స్వయంగా వచ్చి నాకు నయం చేయకుంటే నేనెప్పటికీ ఆ మానసిక బాధ నుండి బయటపడేదాన్ని కాదు. నా జీవితమంతా నిరాశతో బాధపడుతుండేదాన్ని. ఆయన చేతి స్పర్శతో నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి. ఆరోజునుండి నా పరిస్థితి ఎటువంటి మందులుగానీ చికిత్సగానీ లేకుండా క్రమంగా మెరుగుపడటం ప్రారంభించింది. నేను ఉదయాన్నే హనుమాన్ చాలీసా జపిస్తూ, చిటికెడు బాబా ఊదీని నీళ్లలో కలిపి ఔషధంగా తీసుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడు నా మనస్సు ఎప్పుడూ లేనంత నిశ్చలతతో ప్రశాంతంగా మారింది.

మానసిక రుగ్మతలతో బాధపడుతున్న ఇతర భక్తులతో నా అనుభవాన్ని పంచుకోమని సాయిభక్తులందరికీ విన్నవించుకుంటున్నాను. ప్రతిరోజూ బాబా ఊదీని నీళ్లలో కలిపి తీసుకోమని, బాబాను ప్రార్థించమని వాళ్ళకి చెప్పండి. బాబా తమ దివ్య మహిమతో వారందరికీ నయం చేస్తారు. అంతటితో వారి బాధలు అంతమవుతాయి.

మనం బాబా గురించి మరచిపోవచ్చు, కానీ బాబా మన గురించి మరచిపోరు.

source: http://www.shirdisaibabaexperiences.org/2008/11/devotee-experience-deepa.html


4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo