సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 355వ భాగం


ఖపర్డే డైరీ - నలభయ్యవ భాగం

దాదాసాహెబ్ ఖపర్డే డైరీ గురించి మరికాస్త - వి.బి.ఖేర్ గారి రచన

1985 ఆగస్టు నుంచి గౌరవనీయులైన గణేష్ శ్రీకృష్ణ ఖపర్డే డైరీ శ్రీసాయిలీలా పత్రికలో ప్రతినెలా ప్రచురించబడేది. మొట్టమొదట శిరిడీ డైరీ సాయిలీలా పత్రికలో 1924-25లో ప్రచురించబడింది. నేను కావాలనే అప్పట్లో ప్రచురించబడిన సంకలనాలను చూశాను. ఎందుకంటే శిరిడీ డైరీ అనేది ఇంతవరకూ పూర్తిగా ప్రచురింపబడలేదనీ, గుప్తంగా ఉందనీ నాకనిపించింది. శిరిడీ డైరీ మొదటిసారిగా సాయిలీలలో ధారావాహికంగా ప్రచురిస్తున్న సమయంలోనే, మహాత్మాగాంధీ రాజకీయరంగంలో ఉజ్వలంగా ప్రకాశించి అప్పటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌నూ, సామాన్య ప్రజలనూ ప్రభావితం చేయడం వలన కీ.శే.లోకమాన్య తిలక్‌కి కుడిభుజం లాంటివాడైన జి.యస్.ఖపర్డే రాజకీయ జీవితం నుంచి వైదొలగాడు. అప్పటికే తన ఆధ్యాత్మిక గురువైనటువంటి సద్గురు శ్రీసాయిబాబా సమాధి చెందటం వలన ఖపర్డే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఒక చురుకైన నాయకుడిలా హడావుడిగా ఉండే తన రాజకీయ జీవితంలో తన అభిరుచులని ఫలవంతం చేసుకోలేకపోయిన ఖపర్డేకి, జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవటానికి, తన అభిరుచులని గురించి ఆలోచించటానికి కావలసినంత సమయం అప్పుడు దొరికింది. అందుకని అతని అనుమతితోనే, అతనికి తెలిసే శిరిడీ డైరీ 1924-25 లోనే, అంటే శ్రీ సాయిలీలా పత్రిక ప్రారంభించబడిన తొలిరోజుల్లోనే ప్రచురించబడింది. ఏ ఆధారంతో నేనిలా చెబుతున్నానని పాఠకులకు సందేహం కలగవచ్చు. అలా కలగటం కూడా న్యాయమే. ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చేందుకే నాకు లభించిన సమాచారాన్ని పాఠకుల ముందు ఉంచుతున్నాను. 

మనందరి అదృష్టం కొద్దీ బాలక్రిష్ణ ఎలియాస్ బాబాసాహెబ్ ఖపర్డే, అంటే ఖపర్డే పెద్దకొడుకు - తన తండ్రి జీవిత చరిత్రను గ్రంథస్థం చేశాడు. మరాఠీలో వ్రాయబడిన ఈ గ్రంథం 1962లో మొట్టమొదటిసారిగా ప్రచురించబడింది. (బాలకృష్ణ గణేష్ తథా బాబాసాహెబ్ ఖపర్డే, 'శ్రీదాదాసాహెబ్ ఖపర్డేయాంచే చరిత్ర ప్రసాద్ ప్రకాశన్, సదాశివపేట, పూణే, 1962) ముందుమాటల్లో రచయిత, "ఇది జీవిత చరిత్రగాదు, జీవిత చరిత్రకోసం దాదాసాహెబ్ ఖపర్డే డైరీలనుంచి సంకలనం చేసి సమకూర్చబడింది" అని మొదటే స్పష్టంగా చెప్పాడు. ఇందులోని కథానాయకుడు 1854, ఆగస్టు 27వ తారీఖున, వినాయకచవితి రోజున జన్మించటం వల్ల ఆయనకి ఆ గణనాథుని పేరే పెట్టబడింది. గణేష్ బాల్యజీవితాన్ని గురించి ఎక్కువ విశేషాలు తెలీవు. ఈయన తండ్రిగారైన శ్రీకృష్ణ నరహరి ఎలియాస్ బాపూసాహెబ్ తన బాల్యంలో పేదరికాన్ని అనుభవించాడు. తన తెలివితేటలతో కష్టపడి పనిచేసి, బ్రిటిష్ సామ్రాజ్యంలోని సి.పి.బేరర్ ప్రావిన్స్‌ తహసీల్దారు (మామ్లేదారు) స్థాయికి ఎదిగాడు. 

గణేష్ తన ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసాన్ని నాగపూరులోనూ, ఆమ్రావతిలోనూ పూర్తిచేశాడు. పాఠ్యాంశాలకన్నా ఎక్కువగా ఇతనికి వేరే సబ్జెక్టులలోనూ, వేరే పుస్తకాలు చదవటంలోనూ అభిరుచి ఉండటం వల్ల ఇతను మెట్రిక్యులేషన్ రెండుసార్లు తప్పాడు. అంతేకాక, అతను గణితశాస్త్రంలో వెనుకబడి ఉండేవాడు. 1872లో మెట్రిక్యులేషన్ అయిపోయిన తరువాత అతను బొంబాయి ఎల్ఫిన్‌స్టన్ కళాశాలలో చేరాడు. సంస్కృతం ప్రొఫెసరయిన డా.రామకృష్ణ భండార్కర్‌కి ఇతను ప్రియశిష్యుడు. అకోలాలో చిన్నప్పుడు ఒక శాస్త్రిగారి వద్ద సంస్కృతం సాంప్రదాయ పద్ధతిలో చాలా లోతుగా అధ్యయనం చేయటం వల్ల గణేష్‌కి సంస్కృతం చాలా అద్భుతంగా అభ్యాసమైంది. పైగా అతను సంస్కృత సాహిత్యాన్ని విపరీతంగా చదువుతుండేవాడు. ఎల్ఫిన్‌స్టన్ కాలేజీలో చేరకముందే బాణుడి కాదంబరీ, భవభూతి ఉత్తర రామచరిత్ర చదివేశాడు. అందుకని కాలేజీలో చెప్పే సంస్కృతం చిన్నపిల్లల ఆటలా ఉండేదతనికి. అతను ఇంగ్లీషు సాహిత్యాన్ని కూడా చాలా ఆనందంగా చదివేవాడు. ఇంగ్లీషు భాషలో ప్రసిద్ధి చెందిన ప్రకృతి కవి విలియమ్ వర్డ్స్‌వర్త్ మనుమడైన ప్రొఫెసర్ వర్డ్స్‌వర్త్ అతనికి ఇంగ్లీషు బోధించేవాడు. ఈ ఇద్దరి ప్రొఫెసర్ల వద్దా అతను ఈ రెండు భాషల్లో అద్భుతమైన పాండిత్యాన్ని గడించాడు. నిజానికి అతని సంస్కృత పరిజ్ఞానం చాలా గొప్పది, కనుకనే ఆర్యసమాజ వ్యవస్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి ఎల్ఫిన్‌స్టన్ కాలేజీకి వచ్చినప్పుడు ఆయనతో సంస్కృతంలో వాదించటానికి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. అతను చేసిన అద్భుతమైన వాదనకి గణేష్‌ని స్వామి ప్రశంసించటంలో ఆశ్చర్యం ఏమీలేదు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

2 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo