సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 370వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నాలుగవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

బాబా లెండీబాగ్ నుంచి తిరిగి వచ్చాక బాలాభావు పట్టు బట్టలను  ధరించి, నాతోపాటు దర్శనం కోసం వచ్చాడు. అతను నానాసాహెబ్ చందోర్కర్ సూచన మేరకు శిరిడీలో భోజనశాలను నడుపుతుండేవాడు. అతనెప్పుడూ ఆ భోజనశాల వద్దే ఉండేవాడు. కానీ నేను తెచ్చిన లేఖను గౌరవించి మొదటిసారిగా అతను బాబా దర్శనం కోసం వచ్చాడు. మేము బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు టాంగాలో మాతోపాటు వచ్చిన వేశ్య బాబా వద్ద కూర్చుని, “నా వ్యాపారం ఈమధ్య నడవడం లేద"ని ఫిర్యాదు చేస్తోంది. అప్పుడు బాబా నవ్వుతూ, "మంచి దుస్తులు ధరించి, అందంగా తయారై కూర్చుంటే మనుషులు వస్తారు. భగవంతుడు మంచి చేస్తాడు" అని సమాధానమిస్తున్నారు. తరువాత బాలాభావు బాబాకి నమస్కరించి, చందోర్కర్‌చే వ్రాయించి మా నాన్న నాతో పంపించిన ఆ లేఖను గురించి ఏం చెప్పారో, ఎందుకు చెప్పారో అవేమీ నాకిప్పుడు గుర్తులేవు. కానీ నైవేద్యం కోసం తెచ్చిన పళ్ళను ఆయనకు అర్పించినప్పుడు బాబా 'దక్ష' అని ఒకే ఒక్కమాట అన్నారు. నేను ఆలోచనలో పడిపోయాను. బాలాభావుకు కూడా ఏమీ అర్థం కాలేదు.

మేము ఊదీ తీసుకుని తిరిగి వస్తున్నప్పుడు బాలాభావు నాతో, "మధ్యాహ్న భోజన సమయానికి వచ్చేసెయ్” అని చెప్పాడు. నేను బసకి వెళ్లి, వేరే పనేమీ లేకపోవటం వలన మరల మశీదు వైపుకి వెళ్ళాను. టాంగాలో నాతో వచ్చిన మార్వాడీ దారిలో నన్ను కలిశాడు. మేమిద్దరం మశీదు చేరుకున్నాం. మేం అక్కడ కూర్చోగానే బాబా ఉగ్రరూపం ధరించి మమ్మల్నిద్దర్నీ బయటకు తరిమేశారు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ సాధారణంగా బాబా గురువారంనాడు ఉగ్రరూపాన్ని ధరించి ఇలాగే వ్యవహరిస్తుంటారని అన్నారు. తరువాత మేము అక్కడా, ఇక్కడా తిరుగుతుండగా ఆరతి పాటలు వినిపించాయి. మార్వాడీ నాతో, "పద, మనం మశీదుకు వెళ్దాం" అన్నాడు. అందుకు, "నేను రాను. బాబా మనపై కోపంగా ఉన్నారు" అని అన్నాను. అప్పుడు మార్వాడీ, "మంచిది. బాబాకి పరమ భక్తురాలైన స్త్రీ ఒకావిడ ఉంది. మనం ఆమె వద్దకు వెళదాం” అన్నాడు. సరేనని ఇద్దరం అక్కడికి వెళ్ళాము. 

అక్కడ ఒక పీటపై చక్కగా అలంకరించబడిన కృష్ణుడి విగ్రహం ముందు ఒక స్త్రీ తన శిరోజాలను విరబోసుకుని, కళ్ళు మూసుకుని, చేతిలో జపమాల పట్టుకొని జపం చేస్తూ కూర్చొని ఉంది. ఆమె పేరు రాధాకృష్ణమాయీ(అమ్మ). బాబా ఆమెను “రామకృష్ణీ" అని పిలిచేవారు. ఆమె దర్శనాన్ని చేసుకొని మేము వెంటనే తిరిగి వచ్చేశాం. తరువాత ఆమెతో మాకు పరిచయం పెరిగింది.

మధ్యాహ్నం ఒక చిన్న కునుకు తీసి లేచాక, బాబా రూపాన్ని ఇంతకుముందెప్పుడో చూసినట్లు అనిపించి నాకో విషయం గుర్తొచ్చింది. నేను ఏడేళ్ళ పిల్లవాడిగా ఉన్నప్పుడు మా బాబాయి గ్రామపెద్దగా, అంటే సెక్రటరీగా ఉండేవాడు. మా అమ్మ, అక్క కార్తీక మాస స్నానం చేసి సోమనాథ్ మహాదేవుడి దర్శనం కోసం వెళ్తుండేవారు. అక్కడ మాకెప్పుడూ కనిపించే ఒక ఫకీరులానే ఉంది బాబా స్వరూపం. ఆ ఫకీరుకు ఒక గుజరాతీ స్కూలు ఉండేది. అక్కడ ఆయన తరచుగా కనిపిస్తూండేవాడు. ఆయన నన్ను చాలా ఆటపట్టిస్తూండేవాడు. ఒకసారి నేను మా అమ్మ, అక్కలతో కలిసి సోమనాథ్ దర్శనం నుంచి తిరిగొస్తూ వాళ్ళతో ఆ ఫకీరు నన్ను హేళన చేస్తూంటాడని చెప్పాను. మా అమ్మ, అక్క ఆయనతో ఏం చెప్పారో నాకు తెలీదుగానీ ఆ ఫకీరు నవ్వుతూ - "నిన్ను చూస్తే నాకు సంతోషం కలుగుతుంది. అందుకే నిన్ను ఆటపట్టిస్తుంటాను” అన్నాడు. ఆ ఫకీరును నేనే అని బాబా ఎప్పుడూ నాతో అనలేదనుకోండి.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo