సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 416వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • కోరిన కోరికలు అనుగ్రహించే శ్రీసాయి

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు సంహిత. ముందుగా ‘సాయి మహారాజ్ సన్నిధి’ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి అనేక కృతజ్ఞతలు. ఈ బ్లాగ్ ద్వారా మీరు సాయిబంధువులను బాబాకు మరింత దగ్గర చేస్తున్నారు. ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాలను కొన్నిటిని మీతో పంచుకున్నాను. వాటి లింక్స్ కింద జతపరుస్తున్నాను, ఎవరైనా వాటిని చదవాలనుకుంటే ఆ లింకు ద్వారా వాటిని చదవవచ్చు.

మొదటి అనుభవం:

బాబా తరచూ నాకు స్వప్నదర్శనం ఇస్తూ ఉంటారు. బాబా అలా దర్శనమిచ్చిన ప్రతిసారీ నేను ముందుగా మా అమ్మతో పంచుకుంటాను. అవి విన్న ఆమె, ‘బాబా నాతో ఉన్నారనీ, నన్ను నడిపిస్తున్నారనీ’ ఎంతో ఆనందించేది. అయితే ఒక్కసారైనా బాబా తనకి స్వప్నదర్శనం ఇవ్వని కారణంగా ఆమె, "నేను ఇన్నిసార్లు శిరిడీ వెళ్తున్నా ఒక్కసారి కూడా బాబా నాకు స్వప్నదర్శనం ఇవ్వలేదు. నాకు కూడా దర్శనమిచ్చి నన్ను తన భక్తురాలిగా బాబా స్వీకరించాలి” అని మనసులో ఎప్పుడూ దిగులుపడుతుండేది. నేను తనని ఓదారుస్తూ, “అదేం లేదమ్మా! నీకు శిరిడీ దర్శనం ప్రసాదిస్తున్నారంటేనే బాబా నిన్ను తన బిడ్డలా స్వీకరించారని అర్థం. అందుకే మనం ఇన్నిసార్లు శిరిడీకి వెళ్ళగలుగుతున్నాం. బాబా నీకు తప్పకుండా స్వప్నదర్శనం ప్రసాదిస్తారమ్మా” అని చెప్పేదాన్ని. 

2008 నుంచి మేము ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండుసార్లు ఖచ్చితంగా శిరిడీ వెళ్తున్నాము. ఒక్కోసారి నాన్న తాను రాలేనని, అమ్మను, నన్ను మాత్రమే శిరిడీ పంపిస్తుండేవారు. అలాగే 2019వ సంవత్సరంలో నేను, అమ్మ శిరిడీ వెళ్లాము. కార్తీక పౌర్ణమి రోజున మేమిద్దరం శిరిడీలో ఉన్నాం. దీపాలు వెలిగించి లెండీబాగ్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు నేను అమ్మతో, ‘బాబాకు, నాకు మధ్య గల 18 జన్మల సంబంధం’ గురించి బాబా కలలో చెప్పిన విషయం చెప్పాను. కాసేపటి తరువాత నాకున్న ఒక సమస్య గురించి తనతో మాట్లాతున్నప్పుడు అమ్మ నాతో, “బాబా నీతో 18 జన్మల నుంచి ఉన్నారు, ఆయనే నిన్ను చూసుకుంటారు. బాధపడకు” అని ఓదార్చింది. ఆరోజు రాత్రి పడుకోబోయే ముందు అమ్మ బాబాతో, “బాబా, ఇన్నిసార్లు శిరిడీ వస్తున్నాం కదా! మీరు ఒక్కసారి కూడా నాకు స్వప్నదర్శనం ఇవ్వలేదు” అని చెప్పుకుని పడుకుంది. ఆరోజు కూడా బాబా స్వప్నదర్శనం ప్రసాదించలేదు. కానీ, ఆ మరుసటిరోజు రాత్రి అమ్మకి ఒక కల వచ్చింది. ఆ కలలో, మా అమ్మ గురుస్థాన్ దగ్గర నిల్చొని ఉండగా ఒకాయన వచ్చి, “ఇదిగో తీసుకో!” అంటూ అమ్మ చేతిలో ఒక ఊదీ ప్యాకెట్ పెట్టి వెళ్లిపోయారు. ఆ కల గురించి అమ్మ నాతో తిరుగు ప్రయాణంలో మేము ట్రైన్ లో ఉన్నప్పుడు చెప్పింది. అప్పుడు నేను, “అమ్మా! బాబా వచ్చారు, నీకు ఊదీ కూడా ఇచ్చారు” అని అంటే, తను ఆశ్చర్యంతో, “నిజంగా బాబా వచ్చారా? నేనసలు నమ్మలేకపోతున్నాను” అని అన్నది. అప్పుడు నేను, “నిజం అమ్మా, నీ ఆరోగ్యం బాగాలేదు కదా, అందుకే బాబా నీకు ఊదీ ఇచ్చారు. బాబా దయతో ఇంక అంతా బాగైపోతుంది” అని చెప్పాను. అయితే అమ్మ నా మాటలను అస్సలు నమ్మలేదు. 

శిరిడీ నుంచి ఇంటికి వచ్చాక నేను ఒక యాప్ చూస్తుంటే, “నా ఊదీనే మీకు సమాధానం” అనే సందేశంతో కూడిన దిగువ ఇవ్వబడిన బాబా ఫోటో ఒకటి కనిపించింది. అది చూడగానే నాకు చాలా సంతోషంగా అనిపించి, వెంటనే మా అమ్మతో, “చూశావా అమ్మా! నీ స్వప్నంలో వచ్చింది ఇంకెవరో కాదు, తానే అని బాబా మళ్ళీ నీకు నిర్ధారణ ఇస్తున్నారు. ఇదిగో ఈ  ఫోటో చూడు” అని ఆ ఫోటోని చూపించాను. అది చూసి అమ్మ ఎంతో సంతోషించింది. “మీ స్వప్నదర్శనాన్ని ప్రసాదించి అమ్మకు ఆనందాన్నిచ్చారు, థాంక్యూ సో మచ్ బాబా!”



రెండో అనుభవం:

అలాగే నా అనుభవం కూడా ఒకటి పంచుకుంటాను. 2019లో నేను నా స్నేహితులతో కలసి శిరిడీ వెళ్ళాను. మేము శిరిడీలో రెండు రోజులు ఉన్నాము. మొదటిరోజు బాబా దర్శనం చేసుకున్న తరువాత నాకు రెండు ఊదీ ప్యాకెట్లు లభించాయి. తరువాత నేను కొంత డబ్బు శిరిడీ సంస్థాన్కు డొనేట్ చెయ్యగా, మూడు ఊదీ ప్యాకెట్లు ఇచ్చారు. నేను మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. శిరిడీ వెళ్లిన ప్రతిసారీ నాకు ఒక ఊదీ ప్యాకెట్ గురుస్థాన్ దగ్గర తప్పనిసరిగా దొరుకుతుంటుంది. దానికి ఒక కారణం ఉంది. మొదట్లో నేను, “నేను శిరిడీ వచ్చినప్పుడు మీరు నాకొక ఊదీ ప్యాకెట్ అదనంగా ఇవ్వాలి. అలా ఇస్తేనే నేను శిరిడీ వచ్చినందుకు మీరు కూడా సంతోషించారని భావిస్తాను. లేకుంటే నేను రావడం మీకు ఇష్టంలేదని అనుకుంటాను” అని బాబాను ప్రార్థించాను. అప్పటినుండి బాబా అనుగ్రహంతో ఏదో ఒక విధంగా ప్రతిసారీ నాకు అదనంగా ఒక ఊదీ ప్యాకెట్ లభిస్తూనే ఉంది. ఈసారి కూడా గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక ఊదీ ప్యాకెట్ లభించింది. అప్పుడు నేను, 'మరుసటిరోజు ఉదయం బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు మరో ఊదీ ప్యాకెట్ ఇస్తారు. దాంతో మొత్తం 7 ఊదీ ప్యాకెట్లు వచ్చినట్లవుతుంది. కానీ 7 అనే అంకె నాకు ఇష్టం ఉండదు' అని ఆలోచిస్తూ, “బాబా! నాకు 7 అంకె అంటే ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా, అయినా మీరు ఈసారి నాకు 7 ఊదీ ప్యాకెట్లను ఇస్తున్నారు” అని చెప్పుకొని ఇక ఆ విషయం గురించి మర్చిపోయాను.

మరునాడు మేము దర్శనానికి వెళ్ళినప్పుడు, దర్శనానంతరం నాకు ఒక ఊదీ ప్యాకెట్ ఇచ్చారు. అప్పుడు నేను నా మనసులో “బాబా, నాకు 7 అంకె నచ్చదు” అని చెప్పుకున్నాను. ఆ తరువాత మేము పారాయణ చేసుకుందామని పారాయణ హాలుకి వెళ్ళాము. అక్కడ కూర్చోవడానికి కేవలం రెండు సీట్లే ఖాళీగా ఉన్నాయి. ఒక సీటేమో కుడివైపు గోడకి దగ్గరగానూ, రెండవ సీటు ద్వారానికి దగ్గరగానూ ఉన్నాయి. నేను 'ఎక్కడ కూర్చోవాలా?' అని ఆలోచిస్తూ అటూ ఇటూ తచ్చాడుతున్నంతలో నా స్నేహితురాలు వెళ్లి గోడకి దగ్గరగా ఉన్న సీట్లో కూర్చుంది. ఇక మిగిలింది ఒక సీటు. అక్కడ కూర్చొని పారాయణ మొదలుపెట్టగానే, ఒకామె తన పారాయణ పూర్తిచేసి బాబా ప్రసాదంగా స్వీట్లు పంచడం మొదలుపెట్టింది. ఆమె నాకు స్వీట్ ఇచ్చి వెళ్తున్నప్పుడు ఏదో కింద పడిన శబ్దం వినిపించింది. నేను స్వీట్ ప్యాకెట్ ఏమైనా క్రిందపడిందేమో అనుకున్నాను కానీ, అదేంటో నేను గమనించలేదు. నేను పారాయణ చేసుకుంటున్నాను. భక్తులు లోపలికి వస్తున్నారు, వెళ్తున్నారు. ఒక ఆంటీ క్రింద పడి ఉన్న ప్యాకెట్ తీసి నా చేతిలో పెట్టి వెళ్ళింది. అద్భుతం!!! అది బాబా ఊదీ ప్యాకెట్. అంతకుముందు క్రింద పడింది - ‘ఊదీ ప్యాకెట్!’ అని నాకప్పుడు అర్థమై నేను చాలా ఆశ్చర్యపోయాను. తరువాత తేరుకుని బాబా చూపిన ప్రేమకు ఎంతో సంతోషించాను. బాబా నా కోరికను మన్నించి నాకు మొత్తం 8 ఊదీ ప్యాకెట్లు కానుకగా ఇచ్చారు. “చాలా చాలా కృతజ్ఞతలు బాబా! మీరు సదా నా వెన్నంటే ఉండి నన్ను కాపాడండి. ఈ ప్రపంచాన్ని నడిపించేది మీరే. దయచేసి ఈ కొరోనా మహమ్మారి నుంచి మమ్మల్నందరినీ కాపాడండి బాబా!”.

ఇదివరకటి నా అనుభవాల లింక్స్:

 స్వప్నంలో బాబా అడిగిన దక్షిణ  https://saimaharajsannidhi.blogspot.com/2020/04/376.html?m=1
 ‘బాబాది, నాది 18 జన్మల సంబంధం’ https://saimaharajsannidhi.blogspot.com/2020/04/386.html?m=1
 ఈ సంవత్సరం బాబా నాపై కురిపించిన అనుగ్రహం https://saimaharajsannidhi.blogspot.com/2019/12/248.html?m=1



6 comments:

  1. verynice experience ienjoyed it.baba gives udi packets tohis devotees.omsairam

    ReplyDelete
  2. om sairam
    sai always be with me

    ReplyDelete
  3. sairam
    natinchalekapotunnanu sairam
    please help me
    chaala chaala bhayamga undi sai
    do some thing

    ReplyDelete
  4. Om Sri sairam tatayya 🙏🌹🙏🙏🌹🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo