శిరిడీ నివాసి కేశవ్ అనంత్ కులకర్ణి అలియాస్ అప్పాకులకర్ణి బాబా భక్తుడు. అతను ‘ఆత్మారామ్ కులకర్ణి’గా కూడా పిలువబడేవాడు. అతను సత్యవాది, ఎప్పుడూ సత్యాన్ని పలికేవాడు. కానీ అతను గొప్ప అహంభావి. అతనికి బాబాపట్ల ఎంతో విశ్వాసం. కానీ పూర్వజన్మ పాపాలు అతనిని వెంటాడుతున్నందువలన చాలా బాధలకు గురయ్యాడు. అతడు శిరిడీ గ్రామ కరణంగా పనిచేస్తుండేవాడు. ఒకసారి, ప్రభుత్వ వ్యవహారాలలో డబ్బు దుర్వినియోగం చేశాడనే ఆరోపణ అతనిపై మోపబడింది. నిజానిజాలు నిర్ధారణ కాకముందే, ‘అప్పాకులకర్ణి ఒక మోసగాడు, అవినీతిపరుడు, అతను ప్రభుత్వ ధనాన్ని కాజేశాడ’నే పుకారు గ్రామంలో చాలా వేగంగా వ్యాప్తి చెందసాగింది. అంతేకాదు, అతనిపై పోలీసు కేసు దాఖలు కాబోతుందని కూడా చర్చ సాగింది. ఆ పుకార్లు విని, సాయిమహరాజుకు కూడా తనపై అదే భావం కలిగిందేమోనని అప్పా మనసు కలవరపడింది. ఇంతలో ఆ ప్రాంతీయ ప్రభుత్వాధికారి అతనిని ఆ కేసు విచారణకు రమ్మని సమన్లు జరీ చేశాడు. దాంతో, విచారణలో ఏం జరుగుతుందో ఏమోనని భయభ్రాంతుడైన అప్పాకులకర్ణి తనకు తిరిగి శిరిడీ వచ్చే యోగం ఉందో లేదోనని భావించి, విచారణకు వెళ్ళే ముందు మశీదుకు వెళ్లి బాబాకు నమస్కరించి ఎంతో ఆర్తితో, “బాబా! నీవు సాధుసత్పురుషుడవు. సాక్షాత్తూ భగవంతుడివి. నాకు పెద్ద కష్టకాలం దాపురించింది. బాబా! నీవు కాలాన్నే శాసించగలవని నాకు తెలుసు. నా మీద వచ్చిన అపవాదు సత్యమో అసత్యమో నీకు తెలుసు. నీవు త్రికాలవేత్తవు. నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను. నాకు చెడు జరిగితే అది నీకే చెడ్డపేరు. ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని నా కష్టాన్ని తొలగించు. బాబా! నేను నీ పాదాలనే ఆశ్రయించాను. నీవే నా తల్లివి, తండ్రివి. నన్నీ ఆపదనుండి కాపాడు. ఈ ఆపద తొలగితే జనులు ఇదంతా నీ మహిమేనని కొనియాడుతారు. నాకు ఏదైనా శిక్షపడితే అది నీ కీర్తికే కళంకం. సాయీ! నా మీద కృప చూపించు! నా పరువు ఇక నీవే కాపాడాలి!" అని దీనాతిదీనంగా వేడుకుంటూ బాబా పాదాలను కౌగిలించుకుని వెక్కివెక్కి ఏడ్వసాగాడు. దీనుడైన అప్పా మాటలు విని సాయిబాబా హృదయం ద్రవించింది. ఆయన అప్పాతో, “నీవేం భయపడాల్సిన పనిలేదు. నాపై భరోసా ఉంచు! ఇక్కడి నుండి నేరుగా నేవాసా గ్రామం వెళ్ళు. అక్కడ ప్రవరానదీ తీరాన జగన్నాటక సూత్రధారియైన పరమేశ్వరుడు మోహినీరూపం దాల్చివున్నాడు. ‘భావార్థ దీపిక’ (జ్ఞానేశ్వరీ భగవద్గీత) రచించే సమయంలో ఎవరికైతే ఆ జ్ఞానదేవుడు నమస్కరించాడో ఆ అల్లా-ఇ-లాహీ తత్త్వమే మూఢజీవులను ఉద్ధరించటానికి సగుణరూపుడయ్యాడు. అతనికి నమస్కరించి నీ అధికారి వద్దకు పో! నిన్ను అన్నివిధాలా ఆ అల్లాయే కాపాడుతాడు. ఏమీ భయం లేదు” అని ఆనతిచ్చారు. బాబా ఆజ్ఞానుసారం అప్పాకులకర్ణి ముందుగా ప్రవరానదీ తీరాన గల మోహినీరాజ్‌కు నమస్కరించి, తదుపరి కచేరికి వెళ్ళాడు. మనస్సులో బాబాను స్మరించుకుంటూ విచారణలో అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చాడు. కేసు పరీక్షించిన ఆ ప్రాంతీయ రెవెన్యూ అధికారి అప్పాతో, “నీవేం డబ్బు తినలేదని నాకు నమ్మకం కుదిరింది. అందుకే నిన్ను వదిలిపెడుతున్నాను. నీవిక వెళ్ళవచ్చు!” అని చెప్పాడు. ఆ అధికారి మాటలు విని అప్పా ఎంతో ఆనందంతో తనను ఈ కేసు నుండి కాపాడి తన పరువు నిలిపిన బాబాకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. రెండవరోజు అప్పా శిరిడీ తిరిగి వచ్చి సాయిబాబా పాదాలకు నమస్కరించి జరిగినదంతా వివరించాడు. అప్పా మాటలు విని బాబా, “చేసేవాడు, చేయించేవాడూ అన్నీ ఆ పరమేశ్వరుడే! ఆయన తలచుకుంటే అసంభవాలు కూడా సంభవాలవుతాయి!” అని అన్నారు.
బాబా ఒకరోజు అప్పాతో, “మన ఊరికి దొంగలొచ్చారు! వీళ్ళు మామూలు దొంగలు కారు. వీళ్ళ తీరే వేరు. వాళ్ళు ఇంటింటికి పోయి ఒకసారి అంతా కలయజూసి, ఇంటినంతా దోచేయకుండా, అత్యంత విలువగల వస్తువులను మాత్రం తస్కరించి తీసుకుపోతారు. అసలు దొంగతనం చేశారన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు. వారు అంత నేర్పరులు! వాళ్ళు మొట్టమొదట నీ ఇంటికే వస్తారు. నీవు పోయి కావలసిన బందోబస్తు చేసుకో!" అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థం అప్పాకు అర్థం కాలేదు. భిల్లులను ఇంటికి కాపలా పెట్టి తానూ ఆ రాత్రి గస్తీ తిరగసాగాడు. ఒక ఝాము దాటాక హఠాత్తుగా అప్పాకు వాంతులు, విరేచనాలు కాసాగాయి. అతనికి కలరా సోకింది! శరీరం చల్లబడి మెలికలు తిరగసాగింది. కళ్ళు తేలేశాడు. నాడి అందటం లేదు. ఆ స్థితిలో అప్పాను చూచి గ్రామస్థులు బాధతో తల్లడిల్లారు. అప్పా భార్య తన భర్త పరిస్థితి చూచి భయపడి మసీదుకు పరుగెత్తుకుని వెళ్ళి బాబా కాళ్ళమీద పడి, “బాబా! నా భర్త అవసానదశలో ఉన్నారు. కొంచెం ఊదీ ఇవ్వండి. దాంతో తప్పక వారికి స్వస్థత చేకూరుతుంది. నా మాంగల్యాన్ని కాపాడండి!" అని భోరున ఏడ్వసాగింది. బాబా ఆమెతో, “అమ్మా! దుఃఖించవద్దు! పుట్టినవారు ఏదో ఒక రోజున గిట్టక తప్పదు. జననమరణాలు ఈశ్వరాధీనాలు. ఆయనే అంతటా నిండివున్నాడు. ఆయన చేతలు మార్చటం మన చేతుల్లో లేదు. పుట్టేదెవరు? గిట్టేదెవరు? జ్ఞాననేత్రంతో చూడు! నీకు కూడా ఈ విషయం బోధపడుతుంది. కట్టుకొన్న గుడ్డ చినిగిపోతే తీసి పారేస్తాము కదా! దానిమీద ఇష్టం కూడా నశిస్తుంది. అలాగే దైవం ఈ శరీరమనే వస్త్రాన్ని ప్రాణానికి కప్పాడు. ఆ ప్రాణమే ఈశ్వరుడు. జీర్ణవస్త్రం వంటి దేహం గురించి తాపత్రయపడి, దానికిప్పుడు బూడిద రాసి, మరణాన్ని ఎలాగైనా తప్పించాలని చూడకు. అప్పా దారికి అడొచ్చి అతణ్ణి కష్టపెట్టొద్దు. అతని గమ్యాన్ని అతణ్ణి చేరుకోనీ! ఇప్పుడు నేను నీకీ మాటలు చెప్పే సమయానికే అతడు తన శరీరమనే వస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఇక నీవు అడ్డం రావద్దు. అప్పాకు సద్గతి కలుగుతుంది. ఇది చర్మచక్షువులకు కనిపించదు! జరగవలసినది జరగనీ" అని అనునయంగా బోధించి, ఆమెను ఇంటికి పంపారు. ఆమె ఇల్లు చేరేసరికి అప్పా మరణించి ఉన్నాడు!
రెండవరోజు ఊళ్లో ఇలాంటి సంఘటనలు ఇంకొక రెండు మూడు జరిగాయి. దాంతో జనులు భయభీతులయ్యారు. అందరూ మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి, “బాబా, ఊరిలో మహమ్మారి (కలరా) తాండవిస్తున్నది. దానికేదైనా విరుగుడు చెయ్యండి. లేకపోతే మీరుండి మాత్రం మాకేం ప్రయోజనం?" అని ప్రార్థించారు. అప్పుడు బాబా, "ఊర్లో ఏడుగురు మాత్రం చనిపోతారు. ఆ తరువాత ఈ మహమ్మారి శిరిడీ వదిలి వెళ్ళిపోతుంది!" అన్నారు. బాబా మాటలు అక్షరాలా నిజమయ్యాయి. శిరిడీలో మొత్తం ఏడుగురు మాత్రం మరణించారు. బాబా సామర్థ్యమెంత గొప్పది! ఆయన చెప్పింది జరుగుతుంది.
source: శ్రీసాయి గురుచరిత్ర
Very nice om sai ram. Baba's devotees are very lucky.They trust sai only.
ReplyDeleteOm Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
ఓం సాయిరాం!
ReplyDeleteOm sai ram baba please bless us thandri
ReplyDeleteఅప్పా కులకర్ణి article చాలా బాగుంది సాయి.
ReplyDelete🕉 sai Ram
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDelete