సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీ దాజీ వామనరావు చిదంబర్


ఒకప్పుడు ఒక గ్రామ పాఠశాల నుండి శిరిడీ ప్రాథమిక పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడు బదిలీ చేయబడ్డాడు. అతని పేరు దాజీ వామనరావు చిదంబర్. అతను తన విద్యార్థుల భవిష్యత్తుతో తన స్వంత భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు. ఏ విద్యార్థి అయినా అసాధారణ ఫలితాలను పొందినట్లయితే, ఉపాధ్యాయుడు ప్రశంసలు అందుకోవడంతోపాటు ప్రమోషన్ కూడా పొందుతాడు. అందువల్ల అతడు ఎప్పుడూ ఆ విధంగా ఆలోచిస్తూ, విద్యార్థులకు ఎంతో ఏకాగ్రతతో బోధిస్తుండేవాడు. కానీ మరోవైపు షిరిడీలో విద్యార్థుల పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది. ఎవరూ చదువులో శ్రద్ధ చూపేవారు కాదు. పైగా పిల్లలందరి పెదవులపై ఒకే మాట ఉండేది, అదేమిటంటే, "మేము సాయిబాబా ఆశీస్సులు పొందిన పిల్లలం, కాబట్టి చదవడం మరియు పరీక్షల గురించి ఆలోచించడం అవసరం లేదు" అని.

ఒకరోజు దాజీ చిదంబర్ కాకాసాహెబ్ దీక్షిత్ ముందు తన హృదయాన్ని తెరిచాడు. "కాకా! మీరు ఈ గ్రామంలో పెద్దవారు. ప్రజలందరూ మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. చదువుపై శ్రద్ధ చూపించడం వలన కలిగే ప్రాముఖ్యతను గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పడానికి దయచేసి మీరు ప్రయత్నించండి. వారి పిల్లలు పూర్తిగా బాబా మీద ఆధారపడుతున్నారు, వారు కష్టపడి చదవడంలేదు. ఇది ఇలాగే కొనసాగితే, నా ఉద్యోగ విధులలో పొందవలసిన మొత్తం కీర్తిని కోల్పోతాను. పిల్లలందరూ, "మేము పరీక్షల రోజున తొందరగా మేల్కొని బాబా దర్శనం చేసుకొని, ఊదీ ప్రసాదం తీసుకుని పరీక్ష వ్రాస్తాం. అలా చేసి మేము పరీక్షలో ఉత్తీర్ణులమవుతాము. అందువలన పరీక్షల గురించి, చదువు గురించి చింతించాల్సిన అవసరంలేదు" అని చెప్తున్నారు కాకా! షిర్డీలో ఇటువంటి విద్యార్థుల కారణంగా నా కృషి మరియు కీర్తి అన్నింటినీ పోగొట్టుకుంటానని చింతిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను” అంటూ తన బాధను వెళ్ళబోసుకున్నాడు.

కాకాసాహెబ్ సమాధానంగా, "దాజీ! సహనంతో ప్రశాంతంగా ఫలితాల కోసం వేచి ఉండండి. విద్యార్థులందరూ సాయిబాబా పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. బాబా కూడా వారిని ప్రేమిస్తున్నారు. ఆయన వారికి ఖచ్చితంగా సహాయం చేస్తారు. అంతేకాదు, మీకు ఆయన పట్ల విశ్వాసం ఉన్నా, లేకపోయినా, మీ గురించి కూడా ఆయన ఆందోళన చెందుతారు. అతను ప్రతిఒక్కరి సంక్షేమం కోసం ఆందోళన చెందుతూ అందరికి మంచి చేస్తారు" అని చెప్పారు.

దేశముఖ్ అనే ఇన్స్పెక్టర్ విద్యార్ధుల చదువు గురించి పరిశీలించడానికి షిర్డీ వచ్చారు. అతను తన వృత్తి పట్ల ఎంతో కఠినంగాను, అంకితభావంతోను ఉంటారని బాగా పేరు పొందాడు. ఈ విషయం తెలిసి ఒక్క నిమిషంలో దాజీ హృదయస్పందన రెట్టింపయింది. అతని శరీరం వణకడం ప్రారంభించింది. విద్యార్థులందరూ పూర్తి సంవత్సరం అధ్యయనం చేయలేదని ఆయనకు తెలుసు, కాబట్టి తన కృషి మరియు వృత్తిలో గౌరవప్రదమైన స్థానం సంపాదించడానికి చేసిన ప్రయత్నాలు పనికి రాకుండా పోతాయని, తన ఉద్యోగాన్ని కోల్పోతానని కూడా భయపడ్డాడు.

పిల్లల పరీక్షల ఫలితాలు వచ్చిన రోజు దాజీకి అత్యంత ఆశ్చర్యకరమైన రోజు. చదువులో వెనుకబడిన విద్యార్థులు సైతం మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అప్పుడు దాజీకి సాయిబాబా శక్తి, దయ అర్ధమైంది. అతను ద్వారకామాయికి వెళ్లి నేలపై పడి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అతను బాబాతో, "బాబా, నేను షిరిడీకి వచ్చి ఎంతో పొందాను. మీ దర్శనంతో ఎంతో సంతోషం కలిగింది. నా పాపాలు, దుఃఖం మరియు పేదరికం మీ ముందు ముగిసిపోయాయి. దేవుడు ఇచ్చిన నా గత జన్మలన్నింటి ఫలాలు నాకు షిర్డీ మార్గాన్ని చూపించాయి. నా అదృష్టం వలన పరలోకానికి మార్గం షిర్డీ నుండి లభించింది. ఓ దేవా సాయి, నాకు డబ్బుగాని, హోదాగాని లేదా మరేదైనాగాని నాకు అవసరం లేదు, కానీ, నా జీవితాంతం నేను షిర్డీలో గడిపేలా మరియు ఈ పవిత్ర భూమిలో నా మరణం సంభావించేలా నన్ను ఆశీర్వదించండి. నా చేతులు జోడించి వేడుకుంటున్నాను, నా ఈ ఒక్కగానొక్క కోరిక మన్నించండి" అని అన్నాడు. అప్పుడు దేవాదిదేవుడైన సాయిబాబా దాజీతో, "నీకు స్వచ్ఛమైన భక్తినిస్తాను, మోక్షానికి దారి చూపుతాను" అని మాట ఇచ్చారు.

కాలం గడిచే కొద్దీ, షిర్డీ పాఠశాలలో దాజీకి అనేక ప్రమోషన్లు వచ్చాయి. అతను షిర్డీలో సొంత ఇంటిని కొని, శాశ్వతంగా తన కుటుంబంతో షిర్డీలో నివాసం ఉండిపోయాడు. ఉద్యోగ విరమణ తరువాత, అతను సమయమంతా సాయిబాబా మీద ధ్యానం చేయడానికి ఉపయోగించాడు. బాబా కృపతో అతడు ఆయన పట్ల చాలా భక్తిని సంపాదించాడు. తన అదృష్టం వలన బాబా యొక్క అనేక లీలల్లో అతడు కూడా ఒక భాగమయ్యాడు. తన కోరిక ప్రకారం, షిర్డీ మట్టిపై చివరి శ్వాస పీల్చుకున్నాడు, పవిత్రమైన షిర్డీ మట్టిలో కలిసిపోయాడు.

(Source: www.shirdisaitrust.org)

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo