సాయిబంధువు కల్పన గారు తన అనుభవాలని మనతో ఇలా పంచుకుంటున్నారు.
నేను బాబా భక్తురాలిని. ఇంతకంటే గొప్పగా నా గురించి పరిచయం చేసుకోలేనేమో. నాకు సాయితో చాలా అనుభవాలు ఉన్నాయి. వాటిలో రెండు సాయి లీలలను ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.
నా మొదటి అనుభవం :
2013వ సంవత్సరంలో నాకు వరుసగా మూడుసార్లు గర్భస్రావం జరిగింది. దానితో నేను శారీరకంగా బలహీనంగా అయిపోవడమే కాకుండా మానసికంగా చాలా కృంగిపోయాను. బయట ఎక్కడ పిల్లల్ని చూసినా నాకు తెలీకుండానే ఏడుపు వచ్చేసేది. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? అని నా మదిలో చాలా ప్రశ్నలు మెదిలేవి. "ఎందుకు బాబా, నేనేం చేసాను, నన్ను ఇంతలా శిక్షిస్తున్నావ్?" అని సాయిని తరచూ అడిగేదాన్ని; కానీ ఎప్పుడు సమయం దొరికినా సచ్చరిత్ర పారాయణ చేసేదాన్ని.
నవంబర్ లో నేను మళ్ళీ గర్భం దాల్చాను. అప్పుడు బాబా నన్ను మా పుట్టింటికి వెళ్లి, అక్కడే డాక్టర్ కి చూపించుకోమని చెప్పారు. నేను బాబా చెప్పినట్లుగానే చేశాను. ఆ డాక్టర్ కి 80 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఆయనని చూస్తే నన్ను, నా బిడ్డని చూసుకోవడానికి బాబానే స్వయంగా వచ్చారా అనిపించేది. డాక్టర్ ఇచ్చిన సలహాలు అన్నీ జాగ్రత్తగా పాటించేదాన్ని. ఆయన 9నెలలపాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. అందువలన నాకు ఉన్న ఒకే ఒక్క పని - రోజూ సచ్చరిత్ర పారాయణం చేయడం. అలానే డెలివరీ అయ్యే లోపల నేను 36 సార్లు పారాయణ చేసాను. కాని ఈసారైనా నా బిడ్డ క్షేమంగా బయటకు వస్తుందా, ఏమైనా అవంతుందా? అని పలురకాల ఆలోచనలతో చాలా ఆందోళనగా ఉండేది. కానీ బాబా నాకు ఎప్పుడూ కలలో కనిపించి మాట్లాడేవారు. ఒకసారి కలలో, బాబా నాకు తమ చేతులతో బిడ్డను ఇస్తున్నారు. అప్పటి బాబా భంగిమ నా కళ్ళలో ఇప్పటికీ కదలాడుతుంది. నా డెలివరీ చాలా సునాయాసంగా, బాబా ముందే కుదిర్చినట్టే అయిపోయింది.
ఆగష్టు 13వ తేదీన గర్భంలో కొంచెం ఎక్కువగా కదలికలు తెలిసాయి, కానీ నాకు నొప్పి ఏమీ లేదు. ఎందుకైనా మంచిదని డాక్టర్ ని కలిసాము. స్కాన్ తీసి, బేబీ మెడకి బొడ్డు తాడు చుట్టుకొని ఉందని, ఆలస్యం చేస్తే బిడ్డకి ప్రమాదం అని చెప్పారు. అందువలన వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను. మరుసటి రోజు ఆగష్టు 14, 2014 గురువారం ఉదయం గం. 9.04ని.లకి పాప పుట్టింది. ఇదంతా జరిగిన 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వ్రాస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. బాబాయే నన్ను తొమ్మిది నెలలు జాగ్రత్తగా చూసుకుంటూ, డెలివరీకి కాస్త టైం ఉన్నప్పటికీ, లోపల బేబీకి ఉన్న సమస్య గురించి ముందుగా సూచించి, తగిన సమయంలో నాకు పాపని ఇచ్చి నా బాధను దూరం చేసేసారు. బాబా అటువంటి అద్భుతమైన దైవం. అప్పుడు బాబా లేకుంటే నాకు, నా బిడ్డకి ఏమయ్యేదో నేను అసలు ఊహించలేను కూడా. బాబాయే మాకు అన్నీ. అందుకే మా పాపకి “ధన్వి సహస్ర సాయి” అని పేరు పెట్టుకున్నాము. సాయికి కృతజ్ఞతగా పాపని “సాయి” అని పిలుచుకుంటాము. ఇంతకన్నా మనము ఏమి ఇచ్చి సాయి ఋణం తీర్చుకోగలము?
నా రెండవ అనుభవం :
2016 జూలైలో నేను మళ్ళీ గర్భవతిని అయ్యాను. మొదటి మూడు నెలలు బాగానే ఉన్నా తరువాత ఒకరోజు ఒక్కసారిగా పొత్తి కడుపులో చాలా ఎక్కువగా నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరకి వెళ్తే ఇదివరకు మూడుసార్లు గర్భస్రావం జరగడం వలన గర్భసంచి పొర మందం బాగా తగ్గిపోయిందని, కాబట్టి ఏడవ నెల దాక కొనసాగించి, అటు పిమ్మట కష్టం అని చెప్పారు. ఆ సమయంలో మాత్రమే బేబీని జాగ్రత్తగా బయటకు తీయగలం అని చెప్పారు. ఆ లోగా ఏదైనా జరగరానిది జరిగితే తల్లిని కాపాడటం కష్టం అని చెప్పారు. అటువంటి దుర్బరమైన పరిస్థితిలో నేను సాయిపై పూర్తి నమ్మకంతో భారమంతా ఆయనపై వేసాను. ఇంటి నుండే ఆఫీస్ వర్క్ చూసుకుంటూ, ఇంటి పనులు కూడా చూసుకుంటూ రోజుకు సత్చరిత్రలో ఒక అధ్యాయం పారాయణ చేసేదాన్ని. 7వ నెల వచ్చేసరికి గర్భసంచి మందం కొంచెం పెరిగింది, కానీ ఇంకా రెస్ట్ ఉండాలని చెప్పారు. ఇంక ఆఫీస్ కి లీవ్ పెట్టి, ముందులాగే సత్చరిత్ర పారాయణ ప్రారంభించాను. ఈసారి 6 సార్లు పారాయణ పూర్తి చేయగలిగాను.
బాబు రూపంలో బాబాని చూసుకోవాలని ఈసారి నాకు బాబు కావాలని బాబాని అడిగాను. ఆరోజు రానే వచ్చింది, నేను కోరినట్లుగానే నాకు బాబు పుట్టాడు. కానీ బాబుకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని వేరే ఇంకొక చిన్న పిల్లల హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు. నేను ఒక హాస్పిటల్లో, నా బాబు ఇంకో హాస్పిటల్లో, వాడికి పాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. డెలివరీ అయిన వెంటనే మత్తు వల్ల నేను బాబుని సరిగా చూడను కూడా చూడలేదు అని చాలా ఏడ్చాను. అలా మూడు రోజులు నరకం చూసాను. అప్పుడు నేను పడిన వేదన సాయికి మాత్రమే తెలుసు. నాకు ఉన్న ఒక్క ఆశల్లా - సాయిని తల్చుకోడం, సాయీ! నా బిడ్డని కాపాడు! అని ప్రార్ధించడం. ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో సాయి నన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలనే లేదు. నాకు తోడుగానే ఉన్నారు. జీవితంలో ప్రతిక్షణం సాయి నాతోనే ఉన్నారు. నా ప్రతి కదలిక సాయి వల్లనే అని దృఢంగా విశ్వసిస్తున్నాను. అందుకే బాబాయే నాకు అన్నీ. సాయికి కృతజ్ఞతగా మా బాబుకి “ధార్మిక్ శబరి సాయిరామ్“ అని పేరు పెట్టుకున్నాం. అంతకంటే మనము ఏమి ఇవ్వగలము? 'సాయి' 'సాయి' 'సాయి' అని జపించడం తప్ప.
No comments:
Post a Comment