సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఆదం దలాలి


ఆదం దలాలి బాంద్రాలోని ఎస్టేట్ బ్రోకర్. అతడు పూర్తిగా లౌకికమైన ప్రయోజనాల కోసం బాబాను ఆశ్రయించాడు. అతను ఖురాన్ ఎన్నడూ చదవలేదు, బాబాను కూడా ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాలలో సలహా కోరలేదు. అతనికి చాలామంది కుమారులు ఉన్నారు. ప్రతిసారీ వీరిలో ఒకరి వివాహం చేయవలసిన సందర్భంలో దలాలికి నిధుల సమస్య వచ్చేది. ముస్లిం సంప్రదాయం ప్రకారం, పెళ్లికొడుకు తండ్రి నిధులను అందించాలి. కాబట్టి ప్రతి కుమారుని వివాహం సమయంలో సహాయం కోసం అతను బాబా వద్దకు వెళ్తుండేవాడు. ప్రతి సందర్భంలోనూ బాబా అతనిని, "ఇప్పుడు వెళ్ళి, మీరు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు" అని ఆశీర్వదించేవారు. తిరిగి వచ్చాక వివాహం కోసం అతనికి మంచి బ్రోకరేజ్ లభించేది. కాబట్టి, ప్రతి కుమారుని వివాహ సందర్భంలో బాబా యొక్క ఆశీర్వాదాలు అతనికి అవసరమైన నిధులు ఇచ్చాయి.

ఒకసారి ఆదం దలాలి తన కుమారుని పెళ్లి చేసేందుకు ఎన్నోసార్లు బాబా అనుమతి అడిగాడు. అతడు అడిగిన ప్రతిసారి “అల్లా మాలిక్ హై” అని మాత్రమే బాబా సమాధానం ఇచ్చేవారు.  చివరికి 3 సంవత్సరాలు గడిచిన తరువాత 1913-14 లో పెళ్ళికి అనుమతినివ్వడమే కాక, తేదిని కూడా నిర్ణయించి ఆరోజున వివాహం జరిపించమని బాబా ఆదేశించారు. వారి కృపవలన సరిగ్గా అదే ముహుర్తానికి వివాహం జరిగింది.

ఒకప్పుడు తనఖా భవనం యొక్క విక్రయంలో ఒక బ్రోకర్ గా పనిచేయడంతో అతనిపై ఒక క్రిమినల్ కేసు పెట్టబడింది. ఆ భవంతి తాలూకు పట్టా కాగితాలు నకిలీవి కావటం వలన ఆ కేసు పెట్టారు. పోలీసులు నిందితులలో మొట్టమొదట వ్యక్తిగా దలాలిని పేర్కొన్నారు. నిజానికి అతనికి ఆ పత్రాల గురించి ఏమీ తెలియదు. దలాలి బాబా దగ్గరకు వెళ్లి ఆయన సహాయాన్ని అర్థించాడు. బాబా "భయపడకు, అంతా సవ్యంగా జరుగుతుంది" అన్నారు. అతడు టెండూల్కర్ మరియు శ్రీమతి టెండూల్కర్ ని కలసి తన తరఫున బాబాని ప్రార్థించమని వేడుకున్నాడు. ఆ తర్వాత బాబా దయవలన దలాలి ఆ కేసు నుండి బయటపడ్డాడు.

బాబా అప్పుడప్పుడు ఇతర రూపాల్లో ఆయన వద్దకు వచ్చి అతనిని పరీక్షించేవారు. ఒకసారి సాయి బ్రాహ్మణ రూపంలో దలాలి వద్దకు వచ్చి దక్షిణ అడిగితే, అతడు రెండు అణాలు ఇచ్చాడు. మరోసారి బాబా ఒక మర్వాడిలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు. అప్పుడు దలాలి అతనికి నాలుగు అణాలు ఇచ్చి, మార్వాడి హోటల్ కు వెళ్లి భోజనం చేయమని చెప్పాడు. తరువాత అతను షిర్డీకి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నప్పుడు, బాబా అక్కడ ఉన్న భక్తులతో, "నేను ఇతని దగ్గరకి వెళ్ళినప్పుడు మార్వాడి హోటల్ కి వెళ్లి భోజనం చేయమన్నాడు" అన్నారు.

ముస్లింలు వారి ఆచారం ప్రకారం ఫోటోలను, విగ్రహాలను పూజించనప్పటికీ, అదం దలాలి తన ఇంటిలో బాబా యొక్క ఫోటోను పెట్టుకొని రోజూ అగరువత్తులు వెలిగించి పూజించేవారు.


ద్వారకామాయిలో అడుగుపెట్టి బాబా భక్తురాలినయ్యాను


సాయి బంధువు శ్రావణి గారు బాబా తనకు ప్రసాదించిన అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మన సాయి బంధువులందరితో పంచుకోవాలని పంపించారు. ఆ లీలల ద్వారా బాబా ఆమెకు ప్రసాదించిన ఆనందాన్ని, ప్రేమను చదివి ఆస్వాదించండి. అందరికీ సాయిరామ్.

ద్వారకామాయిలో అడుగుపెట్టి బాబా భక్తురాలినయ్యాను

నా పేరు శ్రావణి. నేను ద్వారకామాయిలో అడుగు పెట్టేవరకు బాబా భక్తురాలినే కాదు. ఏదో నార్మల్ గా గుడికి వెళ్లడం, రావడం అంతే! కానీ, 2017 జనవరి 18న మొదటిసారి షిరిడీ వెళ్లి ద్వారకామాయి, చావడి, ఇంకా మ్యూజియం చూసాను. అప్పటినుండి నాలో ఏదో మార్పు వచ్చింది. అసలు షిర్డీ నుండి రావాలి అనిపించలేదు.

నేను గత సంవత్సరం కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను. అపుడు శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టదలిచాను. అప్పటికి నా దగ్గర ఇంగ్లీష్ సచ్చరిత్ర మాత్రమే ఉంది. అది కూడా తెలిసినవాళ్లు ఒకరు పెళ్లి శుభలేఖతోపాటు ఇచ్చారు. తీరా వెతుకుతూ ఉంటే, తెలుగు సచ్చరిత్ర దొరికింది(ఇంగ్లీష్ సచ్చరిత్ర ఇప్పటికీ దొరకలేదు). నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అది బాబా లీల! సచ్చరిత్ర ప్రతిరోజూ ఒక అధ్యాయం చదవడం మొదలుపెట్టాను. క్రమంగా బాబా నాలో ధైర్యం పెంచారు.

నాకు కొంచెం బ్రీతింగ్ ప్రోబ్లం ఉండేది. ఒక హాస్పిటల్ లో X-ray తీసి, పరీక్షలు నిర్వహించి హార్ట్ పెరిగింది, ప్రీ ఆస్త్మా(ఆస్త్మా ముందు దశ) అని చెప్పారు. చాలా భయపడ్డాను, ఏడ్చాను. మా నాన్నగారు మా ఫ్యామిలీ డాక్టర్ గారి దగ్గరకి నా రిపోర్ట్స్ తీసుకెళ్లారు. ఆ రిపోర్ట్స్ కవర్ లో నేను ఒక బాబా ఫోటో పెట్టాను. అక్కడ ఆయన X-ray చూసి, ఇది అంతా తప్పు రిపోర్ట్, ఎందుకైనా మంచిది అని కార్డియోకి పంపారు. అప్పుడు అక్కడ అన్నీ నార్మల్ అని రిపోర్ట్స్ వచ్చాయి. ప్రతి విషయంలో నేను బాబానే నమ్ముకున్నాను. నా రిపోర్ట్స్ బాబానే మార్చేశారు. బాబా నాతోనే ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం. బాబాని నేను మరువలేను. బాబాయే నా సర్వస్వం.

నేను మొన్న గురువారం అంటే తేది. ఏప్రిల్ 5, 2018 నుండి నవ గురువార వ్రతం చేస్తున్నాను. ప్రారంభించి ఒక వారం కూడా కాలేదు, నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. నా భర్తకి కొత్త జాబ్ వచ్చింది, ఆయన గత ఆరు నెలలుగా జాబు కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నా రాలేదు. ఇంకొక విషయం ఏమిటంటే, నిన్న(ఏప్రిల్ 12) మేము మా బంధువుల ఇంటికి వెళ్ళాము. అక్కడ అడుగుపెట్టగానే నాకోసం ఎదురుచూస్తున్నట్టుగా వెళ్ళగానే షిరిడీ ప్రసాదం ప్యాకెట్, ఇంకా షిరిడీ నుండి తెచ్చిన గాజులు ఇచ్చారు. నాకు సరిపడే సైజు గాజులు నాకే ఒక్కోసారి దొరకవు, అలాంటిది అవి నాకు సరిపోయాయి. ఎవరో షిరిడీ నుండి తెచ్చి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఎవరు వస్తారా అని ఎదురు చూసి నాకు ఇవ్వడం అంతా బాబా లీల!

సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

తుఫాను నుండి రక్షించిన బాబా


2007లో మావారు గౌహతిలో పనిచేసేవారు. మేము అక్కడ ఒక పెద్ద బంగ్లాలో క్రింది రూములో ఉండేవాళ్ళం. మూడు సంవత్సరాల తరువాత మావారికి అక్కడినుండి ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ అయింది. మేము చాలా సంతోషంగా ఢిల్లీ వెళ్ళిపోవాలని అనుకున్నాం, ఎందుకంటే మా ఊరు ఢిల్లీనే. ఆ సమయంలో ఒకరోజు రాత్రి నాకు నిద్రలో, గౌహతి పూర్తిగా నీళ్ళలో మునిగిపోతుందిఅని ఒక దివ్యస్వరం వినబడింది. నేను ఆ స్వరం విన్న వెంటనే, "ఎవరు అలా చెప్తున్నారా?" అని నిద్రనుండి లేచాను. ఎవరూ కనపడలేదు. ఆ రోజులలో గౌహతిలో వాతావరణం కూడా మామూలుగానే ఉండేది. బాగా ఎండగా ఉండేది. బ్రహ్మపుత్ర నది కూడా మామూలుగానే ఉంది. అందువలన నేను 'ఏదో కలలే' అనుకుని ఆ విషయం మర్చిపోయాను. 10 రోజుల తరువాత మళ్ళీ అలాగే రాత్రి నిద్రలో, గౌహతి పూర్తిగా నీటిలో మునిగిపోతుంది అని అదే స్వరం వినబడింది. ఈసారి ఇలా వినబడుతోందని మావారికి చెప్పాను. ఎలాగూ ఢిల్లీ వెళ్లిపోతాము కదా అని మా సామాన్లు ట్రక్కులో లోడ్ చేశాం. ట్రక్కు ఢిల్లీకి రవాణా కూడా అయిపోయింది. కొన్ని సామాన్లు మాత్రం మా దగ్గర పెట్టుకున్నాము. గౌహతి నుండి ఢిల్లీకి ట్రైనులో 5 రోజుల తరువాత వెళ్ళబోతున్నాము. ఆరోజుకు మాకు టికెట్లు ఉన్నాయి. 

అంతలో అకస్మాత్తుగా గౌహతిలో మేఘాలు కమ్ముకొని, ఆగకుండా వాన కురవడం మొదలయింది. మేము వాన ఆగిపోతుందిలే అనుకున్నాము, కానీ అస్సలు ఆగలేదు. నెమ్మదిగా టౌన్ మొత్తం తుఫానులో చిక్కుకుపోయింది. ఇటువంటి పరిస్థితిలో ఎలా వెళ్ళగలమని నేను చాలా వేదనలో ఉన్నాను. అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. సాయిబాబా నా దగ్గరకు వచ్చి,నేను గౌహతిలో తుఫాను వస్తుందని నీకు రెండుసార్లు చెప్పాను కదా! వెంటనే రైల్వేస్టేషన్‌కి వెళ్ళిపొండి, అక్కడ రూమ్ తీసుకొని ఉండండి అని చెప్పారు. బాబాకు మనస్సులో నమస్కరించుకొని వెంటనే మావద్దనున్న కొద్ది సామాన్లు తీసుకొని రైల్వేస్టేషన్‌కి వెళ్లిపోయాము. వెంటనే టికెట్ తీసుకొని రాజధాని ట్రైన్‌లో ఢిల్లీ వెళ్లిపోయాము. ఢిల్లీ చేరుకున్న తరువాత గౌహతిలోని మా పక్కింటివాళ్ళకు ఫోన్ చేసి, "ఎలా ఉన్నారు? మేము వెంటనే ఢిల్లీకి రావాల్సి వచ్చింద"ని చెప్పాము. అప్పుడు వాళ్ళు, "మీరు వెళ్ళడం మంచిదయింది. మీ బంగ్లాలో మీరు ఉన్న రూమ్స్ అన్నీ జలమయం అయిపోయినాయి. గౌహతి పూర్తిగా తుఫానులో చిక్కుకుంది. అంతా అస్తవ్యస్తం అయింది. ఆ భగవంతుడు మిమ్మల్ని రక్షించాడు" అని చెప్పారు.

ఇదంతా విన్నాక, గౌహతి పూర్తిగా నీళ్ళలో మునుగుతుందిఅన్న సాయిబాబా దివ్యస్వరం మళ్ళీ నా చెవులలో ధ్వనించింది. అప్పుడు అనుకున్నాను, 'తననే నమ్మిన వాళ్ళకు బాబా ఎలా సహాయాన్ని అందిస్తారో' అని. స్వయంగా నా దగ్గరకు వచ్చి ఆయన స్వరం ద్వారా సంకేతాన్ని ఇచ్చి మమ్మల్ని రక్షించారు. మమ్మల్ని కృతార్థులను చేశారు. ఆ కరుణామయునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ‌, హే సాయినాథా! నీవు నీ భక్తుల గురించి ఎంత చింతన చేస్తావు! నా సంపూర్ణ జీవితాన్ని నీకే అర్పిస్తున్నాను అని మనసులోనే అనుకున్నాను.

సంధ్యాచౌదరి,
నోయిడా.

శ్రీసాయిసచ్చరిత్ర - సాయి విశ్వవిద్యాలయం


చంద్రాబాయి బోర్కర్ మనుమరాలైన ఉజ్వలా బోర్కర్ కూడా ఎన్నో సాయి అద్భుతాలను అనుభవించారు. సాయి అద్భుతాలలో ఒకటి శ్రీసాయిసచ్చరిత్ర. అది సాయి విశ్వవిద్యాలయం, సాయిబాబానే దాని ఛాన్సలర్!

ఉజ్వలా బోర్కర్ మాట్లాడుతూ, "మాధవరావు దేశ్‌పాండే, బయజాబాయితాత్యాకోతేపాటిల్, లక్ష్మీబాయిషిండే, కాకాసాహెబ్ దీక్షిత్, చంద్రాబాయి బోర్కర్ మరియు ఇతర సాయిభక్తులు వారి వారి జీవితాల్లో ఎలా పురోగతి సాధించారో తెలుసుకొని నేను గోవిందరావు దభోల్కర్ రచించిన 'శ్రీసాయిసచ్చరిత్ర' అనే విశ్వవిద్యాలయంలో  మే 18, 1974న ప్రవేశం పొందాలని నిర్ణయించుకున్నాను."

ఈ విశ్వవిద్యాలయం స్థాపించడానికి బాబా దభోల్కర్‌ను ప్రోత్సహించారు. ఇది 53 తరగతి గదులను (అధ్యాయాలు) కలిగి ఉంది. ఆశ్చర్యకరంగా, ఈ విశ్వవిద్యాలయం నిర్మాతైన దభోల్కర్ మొదట్లో బాబాను ఈ విశ్వవిద్యాలయం యొక్క ఛాన్సలర్ (కులపతి)గా అంగీకరించడానికి సిద్ధంగా లేడు. అతను నేర్చుకున్న దానిని బట్టి 'ఏవైనా ఫలితాలను స్వంత ప్రయత్నాల ద్వారా పొందవచ్చ'ని నమ్మేవాడు. అతని మనస్సు అహంతో నిండివుండేది. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్, భాటే మరియు నూల్కర్ - ఈ విద్యార్థులు దభోల్కర్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఈ విద్యార్థులు మట్టిరోడ్డు మీద కూడా బాబాకు సాష్టాంగనమస్కారం చేస్తారు. ఇదంతా చూస్తూ అతను ఆశ్చర్యపోయాడు, కానీ ప్రభావితం కాలేదు. దీక్షిత్ ప్రపంచాన్ని పర్యటించారు, ప్రపంచ సాహిత్యాన్ని చదివారు. అయినా అతను ఎందుకు ఇంత దిగజారాడు?” అని అనుకున్నాడు. "ఈ ఫకీరులో ఈ తెలివైన వ్యక్తులు ఏమి చూసి గురువుగా ఆయనను అంగీకరించారు?" అని అనుకునేవాడు.

కానీ ఒకసారి బాబా తిరగలిలో గోధుమపిండిని విసరటం చూశాడు. గ్రామశివార్లలో చల్లిన పిండి గ్రామంలో వ్యాపించిన కలరా వ్యాప్తిని అడ్డుకుంది. ఈ సంఘటన అతనికి ఒక మలుపు. అదే 'శ్రీసాయిసచ్చరిత్ర' అనే విశ్వవిద్యాలయ స్థాపనకు పునాదిరాయి వేసింది. దానితో అతనిలో బాబా పట్ల విశ్వాసం పెరిగింది. తరువాత బాబా తమ వరదహస్తాన్ని దభోల్కర్ తలపై ఉంచి శ్రీసాయిసచ్చరిత్ర రూపంలో సాయి విశ్వవిద్యాలయాన్ని నిర్మించటానికి అనుమతి ఇచ్చారు.

ఈ విశ్వవిద్యాలయంలోని కొన్ని పాఠాలు: 
1) విశ్వాసము మరియు పట్టుదల ఎల్లప్పుడూ మీతో ఉండనివ్వండి.
2) మీరు శాంతితో జీవించాలని అనుకుంటే క్రమంగా మీ నిర్బంధ కోరికలను తగ్గించండి. ఇతరులకి సంబంధించిన వాటిని దొంగిలించవద్దు. కష్టపడండి. మీరు ఏ విత్తు వేస్తే అదే దక్కుతుంది. అది మాత్రమే మిమ్మల్ని మంచి స్థితిలో నిలబెడుతుంది.
3) ఒక వ్యక్తి పని చేస్తాడు, ఇతరులు ఫలితాలను పొందుతారు. ఇది ఇక్కడ ఎలా సాధ్యమవుతుందిఇంట్లో కూర్చుని సుఖాన్ని అనుభవిస్తూ లంచం ఇవ్వటం ద్వారా లబ్ధి పొందాలనుకుంటే, ఈ విశ్వవిద్యాలయంలో మీరు మొదటి తరగతి పొందలేరు. ఛాన్సలర్(సాయిబాబా) మార్గనిర్దేశంలో అధ్యయనం చేసేవారు వారి ప్రశ్నలకు సరైన సమాధానాలను పొందుతారు.
4) మీ అహాన్ని వదిలేయండి. ఎవరు కోరికలను విడనాడలేరో వారు బ్రహ్మజ్ఞానం పొందలేరు.

ఈ విశ్వవిద్యాలయంలో ఏ వ్యయం లేదా ప్రవేశరుసుము లేకుండా ఎవరైనా ప్రవేశాన్ని పొందుతారు. పగలు, రాత్రి గడియారంతో పనిలేకుండా పనిచేయడం ఈ విశ్వవిద్యాలయం యొక్క ప్రత్యేకత. ఇందులో నేర్చుకున్న వాటిని ఆచరించే ప్రదేశం - జీవితం.

ఇక్కడ ప్రతి విద్యార్థీ ప్రత్యేకమైనవారే. ప్రతి ఒక్కరి కోసం, వారికి తగిన విధంగా ఇక్కడి ఛాన్సలర్ అప్రమత్తంగా పనిచేస్తారు. కొందరికి కలలు లేదా ఇతర మార్గాల ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. ఛాన్సలర్ శ్రీసాయి, "నేను ఇక్కడ ఉన్నప్పటికీ, మీరు సప్తమహాసముద్రాల అవతల ఉన్నప్పటికీ, మీరు చేసే ప్రతిదీ ఇక్కడ నాకు తెలిస్తుంది" అంటారు.

యూనివర్సిటీలో అనేక ఆసక్తికరమైన సంఘటనలు నేర్చుకోవడానికి ఉదాహరణలుగా ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ ఒక పరీక్ష ఎదుర్కొన్నారు. అది 'గురువు ఆజ్ఞలకు శిష్యులు విధేయులేనా, కాదా?' అని నిర్ధారించే పరీక్ష. స్వచ్ఛమైన బంగారం కూడా అగ్ని ద్వారా పరీక్షింపబడాలి. ఒక బ్రాహ్మణుడైనప్పటికీ, ఒక ఆయుధం తీసుకుని కాకాసాహెబ్ దీక్షిత్ ఏ సంకోచమూ లేకుండా మేకను చంపడానికి సిద్ధపడి సాయి ఛాన్సలర్ యొక్క పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఈ యూనివర్సిటీలో నేను, నాది అనే మనస్తత్వాన్ని యూనివర్శిటీ ఛాన్సలర్ సాయి యొక్క పాదాల వద్ద సమర్పించాలి. మీ కర్మల యొక్క కర్తృత్వాన్ని అర్పించాలి. గురువు ఆదేశాలచే ఏర్పాటు చేయబడిన యూనివర్సిటీ నియమాల ప్రకారం నడుచుకోవాలి.

అహం లేకుండా చర్య జరిగితే, పరిపూర్ణతకు ఎక్కువ సమయం పట్టదు. ఒక విద్యార్థి అయిన పుండలీకరావు, "మీ వైఖరిలో అహంకారం లేనట్లయితే, మీరు ఆత్మజ్ఞానం సాధించడానికి అర్హులు. మీరు సులభంగా జీవితసాగరాన్ని దాటగలరు" అని సలహా ఇచ్చాడు. ఈ యూనివర్సిటీ ఛాన్సలర్ సాయి విద్యార్థులకు వాగ్దానం చేశారు - అధ్యయనం చేసేవారు వారి సామర్థ్యం ప్రకారం విజయవంతం అవుతారు. ప్రతి ఒక్కరూ తమ అర్హతను బట్టి వారు అడిగేది పొందుతారు. అందరూ ఈ విశ్వవిద్యాలయంలో సహాయం పొందుతారు. ఇతరులతో మీ పురోగతిని పోల్చవద్దు. మోసం అనుమతించబడదు. ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అంకితభావం మరియు స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. నియమాలను అనుసరించేవారు సులభంగా విజయాన్ని పొందుతారు.

బిలియన్ డాలర్లను ఖర్చుచేసిన తరువాత కూడా పొందలేని ఆనందాన్ని, మనశ్శాంతిని ఎలా సాధించాలో ఈ యూనివర్సిటీలో  నేర్చుకుంటారు.

గత జన్మ కర్మఫలాల వలన ప్రస్తుతం కలిగే సుఖదుఃఖాలను ఎవరూ నివారించలేరు. ప్రార్థన మరియు భగవంతుని యొక్క నామం స్మరించుకోవడం వారి సంబంధిత తరగతిలో విజయం తెస్తుంది. 

(ఫోటో & ఆర్టికల్ కౌన్సిల్: శంషాద్ అలీబేగ్, జర్నలిస్ట్, నవీ ముంబై).

ఏకకాలంలో వేర్వేరు ప్రదేశాలలో ఉన్న అన్నాచెల్లెళ్ళని అనుగ్రహించిన బాబా లీల..


1980వ సంవత్సరంలో, తిరుపతిలో ఉన్న శ్రీమతి నాయుడు తన పూజ గదిలో భక్తిపూర్వకంగా పూజలో నిమగ్నమై ఉండగా తల మీద పెద్ద జడలు కలిగి ఉన్న ఒక సత్పురుషుడు ఆమె ఎదురుగా దర్శనం ఇచ్చాడు.  "నీకు నన్ను చూస్తే భయం వేయడం లేదా?" అని ఆయన అడిగాడు. అందుకు ఆమె, "లేదు భగవాన్, మీరు ఎవరు?" అని అడిగింది.  అంతే! ఆయన తన కడుపులో నుండి ప్రేగులు బయటకి తీసి, మళ్ళీ మ్రింగేసాడు. తరువాత తన ఖాళీ చేతులలో నుండి తీర్ధాన్ని తీసి ఆమెకు ఇచ్చాడు. తరువాత ఆమెను, "దక్షిణ ఏమైనా ఇస్తావా?" అని అడిగాడు. ఆమె దక్షిణ కోసం డబ్బులు వెతుకుతూ ఉండగా, ఆ సత్పురుషుడు "ఆ అల్మారా లో చిల్లర పెట్టావు, తీసి ఇవ్వు" అన్నారు. "ధోతీ ధరించి, దక్షిణ అడిగిన ఆ సత్పురుషుడు సాయిబాబా కాక ఇంకెవరై ఉంటారు?" అని ఆమె ఆశ్చర్యంలో మునిగిపోయింది.

అంతకన్నా ఆశ్చర్యం చదవండి:

అదేసమయంలో నెల్లూరులో ఉంటున్న ఆమె అన్న శ్రీ వెంకటనాయుడు, కాఫీ త్రాగడానికి తన స్నేహితులతో కలిసి ఒక హోటల్ కి వెళ్ళాడు. అక్కడ అందరు దేవి, దేవతల చిత్రపటాల మధ్యలో, ఒక శిల మీద కూర్చొని, ఆశీర్వాదముద్రలో, తలకు బట్ట చుట్టుకొని, అశేష కృపాదృష్టితో చూస్తూ ఉన్న సాయిబాబా ఫోటో కూడా ఉంది. నాయుడు గారి దృష్టి అన్ని చిత్రపటాల మధ్య ఉన్న సాయిబాబా వారి మీద పడింది. అలా చూస్తూ ఉండగా అతని మనస్సు ఏకాగ్రం అయింది. స్నేహితులందరూ కాఫీ త్రాగి వెళ్ళిపోయారు. నాయుడు మాత్రం అలా బాబాను చూస్తూ అక్కడ కూర్చున్నాడు. "ఈయన ఏ ధర్మానికి చెందినవాడు? ముస్లింలాగా కనపడుతున్నాడు, కానీ ముఖంలో ఆ  పరబ్రహ్మ స్వరూపం కొట్టొచ్చినట్లు ఉంది. ఎవరు ఈయన?" అని మనసులో అనుకుంటూ మదినిండా ఆయన స్వరూపాన్ని నింపుకొని వెళ్తున్నాడు. మనసంతా ఆయన మీద లగ్నం అయి ఉంది కానీ, మనసులో, 'ఎవరు ఈయన?' అని ఒకటే వేదన. అంతలో సాయంత్రం వాళ్ళ స్నేహితుడిని బజారులో కలిసాడు. అతను, "రా! మా ఇంటికి వెళ్దాం" అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు.

అతని స్నేహితుని భార్య, "మేము మొన్న షిర్డీ వెళ్లి వచ్చాము.ఇదిగోండి బాబా ప్రసాదం" అంటూ, ప్రసాదంతోపాటు బాబా ఫోటో ఒకటి నాయుడు గారి చేతికి ఇచ్చింది. ఆ ఫోటోను చూడగానే ఆనందంతో అతని కళ్ళలో నీరు ఆగలేదు. "ఓహో! ఈరోజు పొద్దున నుండి నన్ను వెంటాడుతున్న ఈ సంత్ మహారాజ్ షిరిడీ సాయినాథుడా!" అనుకున్నాడు. వెంటనే ఇంటికి వెళ్లి గురువారం ఆ ఫోటో పూజ గదిలో పెట్టుకొని, అప్పటినుండి రోజూ సాయి సచ్చరిత్ర పారాయణ, భజన, సత్సంగం చేసుకుంటూ ఉన్నారు.

"ఆరోజు కలలో సాయినాథుని సమాధి చూసాను.  మొత్తం సమాధి అగరుబత్తి  సువాసనలతో నిండి ఉంది. తరువాత గురువారం సాయిబాబానే కలలో వచ్చారు. నన్ను శిరిడీకి రమ్మన్నారు. నా ఇష్టదైవం శ్రీరామచంద్రుడు. ఒకరోజు కలలో శ్రీ రామచంద్రుడిని చూసాను. వెంటనే ఆ స్థానంలో సాయినాథుడు కనిపించారు. తరువాత  నా కుటుంబంతో షిర్డీ వెళ్ళాను. అబ్దుల్ బాబా కుటీరంలో నాకు సాయినాథుడు స్వయంగా దర్శనం ఇచ్చి, సమాధి మందిరానికి తీసుకెళ్ళారు. "ఇంక నీ జీవితం మొత్తం నీకు సహాయంగా ఉంటాను" అన్నారు. ఇలా నాకు అన్నివేళలా సహాయకంగా ఉండి, నా బాగోగులు చూస్తున్నారు. నాకు వున్న సంసారిక బంధాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చివరి ఉపిరి ఉన్నంత వరకు ఆయన స్మరణ, ఆయన ధ్యాస, ఆయన ధ్యానం, అంతే!

అసలు విషయం చెప్పలేదు కదూ! మా చెల్లికి ఎప్పుడైతే వాళ్ళ బాబా ఇంట్లో కనపడ్డారో, అప్పుడే హోటల్ లో నన్ను తన వైపుకు లాక్కున్నారు. తరువాత రెండు రోజులకు మేము కలిసినప్పుడు మా అనుభవాలను పంచుకొని ఆశ్చర్యచకితులయినాము."

- వెంకటనాయుడు
 నెల్లూరు.

తెలుగు అనువాదం: శ్రీమతి మాధవి, భువనేశ్వర్.

నీ భక్తికి మెచ్చి వచ్చాను

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
                     
చాలా సంవత్సరాల క్రితం సుభద్రచోరి అనే సాయిభక్తురాలు శిరిడీకి వెళ్లింది. ఒకరోజు మధ్యాహ్నం ఆమె ద్వారకామాయిలో కూర్చొని ఎంతో భక్తిభావంతో బాబా నామజపం చేస్తూ, 'పూర్వం బాబా సశరీరులుగా ఉన్న రోజులలో ఇక్కడ ఎలా ఉండేదా!?' అని ఆలోచిస్తూ ఆశ్చర్యానికి లోనయ్యింది. "అపుడు బాబా ఎలా ఉండేవారు? నాకు ఎప్పుటికైనా అప్పటి రూపంతో బాబా దర్శనం ఇస్తారో లేదో కదా?" అనుకుంది.

తరువాత ఆమె శిరిడీలోని అన్ని ప్రదేశాలు దర్శించుకొని శేజ్ ఆరతికి సమాధిమందిరానికి వెళ్లింది. కానీ ఆరతికి ఇంకా అరగంట సమయం ఉన్నందున రాత్రివేళ ద్వారకామాయి ఎలా వెలిగిపోతుందో చూడాలనుకుని ఆమె మళ్ళీ ద్వారకామాయికి వెళ్లింది. ఆ సమయంలో ద్వారకామాయి నూనెదీపాల కాంతులతో, మండుతున్న ధునిమాయితో దేదీప్యమానంగా కోటిసూర్యప్రభాకాంతులతో వెలిగిపోతోంది. ఇంతలో అక్కడ బాబా తెల్లని కఫినీ ధరించి హుందాగా చేతులు వెనక్కి పెట్టుకొని నిల్చొని ఉండడం చూసి ఆశ్చర్యంతో, "బాబా, నువ్వేనా?" అని అడిగింది. అందుకు బాబా, రా తల్లీ, నీ కోసమే ఎదురుచూస్తున్నాను. నువ్వు నన్ను, ద్వారకామాయిని చూడాలనుకున్నావు కదా! అన్నారు. సుభద్ర భక్తితో బాబా పాదాలకి సాష్టాంగనమస్కారం చేసింది. బాబా తమ దివ్యహస్తాలతో ఆమెని పైకి లేపి, “తల్లీ, నీ భక్తికి మెచ్చాను. మీ ఇంటిలో ఉండే ప్రతి ఫోటోలోనూ నేనున్నానని తెలుసుకో! నా భక్తులు వారి నమ్మకం కొద్దీ నా దగ్గరకి వస్తారు. వారి ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా నువ్వు మౌనం వహించు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. చాలామంది నా గురించి కూడా చెడుగా మాట్లాడతారు. నాఫై ఎప్పుడూ విశ్వాసముంచు” అని చెప్పారు. శేజ్ ఆరతి మొదలవుతుందనగా బాబా వెళ్ళిపోతూ, “రేపు లెండీవనంలో కలుద్దాం” అన్నారు. 

మరుసటి ఉదయం ఆమె లెండీవనంలో ఉన్న బావి దగ్గరకి వెళ్ళింది. అక్కడ బాబా ఆమె కోసం ఎదురుచూస్తూ బావి అంచుపై కూర్చొని ఉన్నారు. బాబా ఆమెతో, "తల్లీ! ఈ బావి అన్ని ప్రధాన నదులకి కేంద్రబిందువు. కానీ దీనికి ఒక్కరు కూడా టెంకాయ సమర్పించరు. మరి నేను ప్రజలకి నీళ్ళు ఎలా ఇస్తాను? కొద్దిరోజులకి దీంట్లో నీళ్ళు కనపడవు, ఎండిపోతుంది. ఈ రావిచెట్టుని పూజించడం ఎన్నటికీ మరువకు. ఇంకా ఆ ఔదుంబర వృక్షం కింద దత్తాత్రేయుడు కొలువై ఉంటాడు అని చెప్పారు. తరువాత బాబా ఆమెకి కొన్ని ముఖ్యమైన విషయాలు, మందులు మరియు నివారణలు వంటి చాలా విషయాలు చెప్పి, "వాటిని నా అనుమతి లేకుండా ఎవరికీ చెప్పవద్దు" అని చెప్పారు. అంతేకాకుండా, ఆ విషయాలను రహస్యంగా ఉంచుతానని ఆమె వద్దనుండి మాట కూడా తీసుకున్నారు. 

తరువాత బాబా గురుస్థాన్ వైపు నడుస్తుంటే ఆమె బాబాని అనుసరిస్తూ వెళ్లారు. చివరిగా బాబా ఆమెతో, నువ్వు ఈసారి నా ప్రసాదంతో రావాలి అని చెప్పి అంతర్థానమయ్యారు. ఆమె మూడు సంవత్సరాల తరువాత తన బాబు 'చందన్ ప్రసాద్'తో కలిసి శిరిడీ వెళ్లి బాబుని బాబా పాదాలపై ఉంచింది. ఈ సంఘటన ద్వారా బాబా శిరిడీ ప్రాముఖ్యతను తెలియజేశారు.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!          


షిర్డీ సాయి ఆరతుల గురించి సమగ్ర సమాచారం - 2వ భాగం.....

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై


బాబా దేహదారిగా యుండగా రోజు జరిగిన ఆరతులు మూడే. మధ్యహ్న ఆరతి ఒక్కటే మశీదులో జరిగేది. రోజు మర్చి రోజు బాబా చావడిలో పరుండు రోజు శేజారతి, మరుసటి రోజు కాకడ ఆరతి చావడిలో నిర్వహించబడేవి. సాయింత్రం ఆరతి మొదటిలో సాఠెవాడలో జరిగేడిది. తరువాత గురుస్థానములో కూడా జి. కే. దీక్షీత్ అను వారు సాయింత్రం ఆరతి చేసెడివారు. అటు తరువాత దీక్షిత్ వాడలో కూడా సాయింత్రం ఆరతి జరిగేడిది. ఖపర్డే మొదలగు భక్తులు ఇందులో పాల్గొనుట ఖపర్డే డైరీ లో చూడవచ్చు. 

బాబా దేహనంతరం నాలుగు వేళల జరుగు ఈ ఆరతులు బూటివాడాలోని బాబా సమాధి వద్ద నిర్వహించబడుచున్నవి. ఉదయం గం. 4.30 నిమషాలకి కాకడ ఆరతి, మధ్యాహ్నం గం. 12.00 లకి మధ్యాహ్న ఆరతి, సూర్యాస్త సమయమున సంధ్య ఆరతి, రాత్రి గం. 10. 30 నిమషాలకి శేజరతి జరుగుచున్నవి. సంధ్య ఆరతికి ఒక వత్తితోను, మిగిలిన మూడు అరతులకు ఐదు వత్తులతో ఆరతి ఇవ్వబడుచున్నవి. అరతులకు ముందు బాబాకు మరియు ఆయన సమాధిపై వస్త్రములు మార్చుదురు. నాలుగు వేళల ధూపం వేయుదురు. కాకడ ఆరతికి వెన్న నైవేద్యం, మధ్యహ్న ఆరతికి భోజనం మరియు రొట్టెల నైవేద్యం, సాయింత్రం మిఠాయిలు నైవేద్యం, శేజారతికి చపాతీలు నైవేద్యం పెట్టెదరు. అవి ప్రసాదముగా భక్తులకు పంచెదరు.

ఒకప్పుడు బాబా భీష్మను ఐదు లడ్డులు ఇవ్వాలి అని అడిగారు. అతనికి ఏమి అర్ధం కాలేదు. మరుగోజు తెల్లవారగానే అతని హృదయంలో కవిత పెల్లుబికి వెంటనే రెండు పాటలు వ్రాసారు. కాని ఆ పై ఒక్కటి గూడా నడవలేదు. వాటిని బాబాకు సమర్పించగానే అతనినే పడి విన్పించామన్నారు. అతడు పాడక అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. అతనికి మళ్ళి స్పుర్తి కలిగి మరి మూడు పాటలు వ్రాసి ఆయనకు వినిపించారు. అందుకే భావమెరిగి వాటిని పాడుకోవడం ఎంతో శ్రేయస్సుకరం. అవే మొదటి షిర్డీ హారతులు. సాయి ఇలా కోరి, తమ తపశ్శక్తి దారపోసి వ్రాయించుకుని దక్షిణగా తీసుకున్నవి. తర్వాత దాసగణు, మాధవ్ లు మరికొన్ని పాటలు చేర్చి నేటి షిర్డీ ఆరతులు కూర్చారు.

శ్రీ సాయినాథ సగుణోపాసన పుస్తకంలో శ్రీ సాయిబాబాకి చెందిన ఆరతులలో పాడుతున్న పాటలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, మంత్ర పుష్పమ్, శ్రీ లక్ష్మీఅష్టోత్తరం వంటి హిందూ మత సంప్రదాయాల నుండి కొన్ని సంప్రదాయ శ్లోకాలు ఉన్నాయి. భక్తుల రోజువారీ ఆరాధన కోసం శ్రీ జి.ఎస్.ఖపర్దే 1922 వరకు ప్రచురణ యొక్క అన్ని ఖర్చులను భరించారు. బాబా మహాసమాధి తరువాత, ఈ పుస్తకం సమాధి మందిరంలో అధికారిక 'ది బుక్ ఆఫ్ డైలీ వర్షిప్' గా రూపాంతరం చెందింది. శ్రీ సాయిబాబా సంస్థాన్ 1923 నుండి సవరించిన ప్రచురణను చేపట్టింది. 

శిరిడీ ఆరతి పుస్తకంలో మొత్తం ముప్పై పద్యాలు ఉన్నాయి. ఆ ముప్పైలో, కేవలం పదహారు మాత్రమే శ్రీ సాయిబాబా మీద కూర్చబడినవి. వేద శ్లోకం తప్ప మిగిలిన పద్నాలుగు సంప్రదాయ ఆరతి పాటలు మధ్యయుగానికి చెందిన మహారాష్ట్ర కవులు, సత్పురుషులు రచించినవి. పద్నాలుగు సాంప్రదాయ పాటలలో ఐదు సంత్ తుకారమ్ మహారాజ్; సంత్ నామదేవ్ మరియు సంత్ జానబాయిలు ఒక్కొక్కరు రెండు పాటలు; శ్రీ రామజనార్ధన్ స్వామి మరియు శ్రీ రామేశ్వర్ భట్ ఇద్దరు చెరొక పాట; మిగిలిన మూడింటిలో, ఒక వేద శ్లోకం మరియు రెండు ఇతర సంప్రదాయ ప్రార్థనలు ఉన్నాయి. శ్రీ సాయిబాబా పై ప్రత్యేకంగా వ్రాయబడిన పదహారు పాటలలో- తొమ్మిది, శ్రీ K.J. భీష్మ రచించినవి, మూడు శ్రీ దాసగణు మహారాజ్ వ్రాయగా మిగిలిన వాటిని శ్రీఉపసాని మహరాజ్, శ్రీమాధవ్ అడ్కర్, శ్రీమోహినిరాజ్ మరియు శ్రీB.V. దేవ్ ఒక్కొక్కటి రచించారు. భాషాపరంగా ముప్పై అరతి పాటలలో ఇరవై ఐదు మరాఠీలో, హిందీలో రెండు, సంస్కృతంలో రెండు మరియు ఒక పాట మరాఠీ, సంస్కృత ద్విభాషా సంపుటిలోని ప్రార్థన ఉన్నాయి.

ఇందులో బాబాను గురించి వ్రాయబడిన 16 పాటలు:

భీష్మ గారు వ్రాసినవి 9 పాటలు:

   కాకడారతిలోని
  • 1.      3వ పాట ఉఠా ఉఠా శ్రీ సాయినాథ గురు చరణ కమలదావా
  • 2.      5వ పాట ఘేఉని పంచారతీ కరూ బాబాంచి ఆరతి.
  • 3.      6వ పాట కాకడా ఆరతి కరీతో సాయినాధ దేవా.
  • 4.      9వ పాట పభాతసమయీ నభా శుభరవి ప్రభా ఫాకలి.
  • 5.      13వ పాట శ్రీ సద్గురుబాబాసాయి.
  • మధ్యాహ్న అరతిలోనివి
  • 6.      3వ పాట జయదేవ జయదేవ దత్తా అవధూత.
  • శేజహరతి లోనివి
  • 7.      4వ పాట జై జై సాయినాధ ఆతాపహుదావేమందిరీ హో.
  • 8.      5వ పాట ఆతాస్వామి సుఖే నిద్రా కరా అవధూతా
  • 9.      8వ పాట సాయినాధమహారాజ్ అతనా కృపాకరోగురు రాజా. (ప్రస్తుతం ఇది శేజారతి లో లేదు)

  • దాసగాణు మహారాజు గారు వ్రాసిన 3 పాటలు
  • 10.  సాయి రహమ్ నజర్ కరనా
  • 11.  రహమ్ నజర్ కరో అబ్ మోర్ సాయి
  • 12.  షిర్డీ మాఝే పండరీపుర సాయిబాబా రామావర
  • ఉపాసనీ మహారాజ్ గారు వ్రాసిన ఒక పాట
  • 13.  సదాసత్స్వరూపం (1911 లో వ్రాయబడినది)
  • మాధవ్ అడ్కర్ గారు వ్రాసిన ఒక పాట
  • 14.  ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార జీవా
  • మోహిని రాజా గారు వ్రాసిన ఒక పాట
  • 15.  అనంత తులాతే కసేరేస్తవావే
  • బి. వి. దేవ్ గారు వ్రాసిన ఒక పాట
  • 16.  రూసో మమ ప్రియంబికా
ఇతరులు వ్రాసిన 14 పాటలు
  • తుకారం వ్రాసిన 5 పాటలు
  • 1.      జోడునియా కర చరణి
  • 2.      భక్తీచియా పోటీ బోద్ కాకడా జ్యోతి
  • 3.       శేజారతి లో ఓవాళు ఆరతి మాఝ్యా సద్గురునాధ
  • 4.      పాహే ప్రసాదా చీవాట
  • 5.      పావలా ప్రసాద ఆతా విఠో నిజావే
  • నామదేవ్ ప్రాసిన 2 పాటలు
  • 6.      ఉఠా పాండురంగా ఆతా దర్శనద్యాసకళా
  • 7.      ఉఠా ఉఠా సాధు సంత సదా అపులాలేహిత
  • జానాబాయి వ్రాసిన రెండు పాటలు
  • 8.      ఉఠాపాండురంగా ప్రభాత సమయోపాతలా
  • 9.      తుజకాయ దేఉ సావళ్యా మిభాయాతరీయో
  • రామజనార్ధన గారి ఒక పాట
  • 10.  ఆరతి జ్ఞాన రాజా మహా కైవల్య తేజా
  • రామేశ్వర భట్ వ్రాసిన ఒక పాట
  • 11.  ఆరతి తుకారమా స్వామి సద్గురుధామా
  • మిగిలిన పాటలు
  • 12.  వేద సంబంధమైన మంత్రపుష్పం
  • 13.  సంప్రదాయ ఆరతి పాటలు – భజన మొదలగు ఇతర పాటలు (హరేరామ రామరామ హరే, కర చరణ మొదలైనవి.)

పై పాటలన్ని సాయి ఆరతుల పుస్తకం సాయి సగుణోపాసన లో ప్రచురించబడినవి. ఈ సగుణోపాసనకు మూలకర్త శ్రీ కృష్ణ జోగేశ్వర భీష్మ. ఈ హరతులకు భీష్మ రూపకల్పన చేయగా, వాటిని సక్రమంగా నిర్వహించుటకు కృషి చేసిన వారు రాధాకృష్ణమాయి. సాయిని సేవించుటకు సాయి తత్త్వంలో ఈ అరతులకు మించినదిలేదు. సాయి భక్తులు, సాయి మందిర నిర్వాహకులు ఈ అరతులకు ప్రాధాన్యతను గుర్తించి వాటిలో పాల్గొని సాయి కృపకు పాత్రులగుదురుగాక!

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

బాబా ఎప్పుడూ నన్ను కాపాడుతూనే ఉంటారు


సాయి బంధువు కళ్యాణ్ గారు తన అనుభవాలు ఇలా చెప్తునారు. నేను కంప్యూటర్ సైన్సు విభాగంలో అధ్యాపకునిగా పని చెస్తున్నాను. జీవితంలో అన్నింటి కంటే నాకు సాయిబాబా  అంటే అమితమైన ప్రేమ, అయనపై అపార నమ్మకం. నా జీవితంలో నన్ను బాబా రెండు విషయాలలో కాపాడారు. వాటిని ఇప్పుడు మీతో పంచుకుంటాను.

నా చిన్నతనంలో ఒకసారి నేను సైకిల్ ఫై నుండి కింద పడిపోయాను. అప్పుడు సైకిల్ హేండిల్ నా పక్కటెముకలకి బలంగా తగిలి నాకు ఊపిరి అందలేదు. ఆ సమయంలో శ్వాస తీసుకోలేక ఎవరు అయిన సహాయం చేస్తారా అని ఎదురు చూస్తునాను. ఆశ్చర్యంగా అక్కడ తెల్లని వస్త్రములు ధరించి ఉన్న ఒక పెద్ద మనిషి నన్ను ఏమి జరిగింది అని అడుగుతున్నారు. నేను సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాను. అప్పుడు అతను సరే పర్వాలేదు, ఏమి కాదు. ఒకసారి కింద పడుకొని లేచి అప్పుడు కూర్చో అని ధైర్యం చెప్పారు. వెంటనే నేను అలా చేసిన, తరువాత శ్వాస తెసుకోగాలిగాను. నేను కృతజ్ఞతలు తెలుపుదామంటే అతను లేరు. ఎంత వెతికినా కనపడలేదు. చాలా ఆశ్చర్యం అనిపిచింది. ఆరోజు అలా వచ్చినది నా బాబా నే. ఆరోజు బాబా అలా రాకుంటే ఈరోజు నేను లేను.
  
నేను ఇప్పుడు విదేశాలలో ఉంటునానుఈమధ్య ఒకసారి నా టాక్సీ వెనక భాగాన్ని ఇంకొక వాహనం గట్టిగా డీకోట్టింది, ఆ ఫోర్సు కి నా టాక్సీ రెండుసార్లు చుట్టూ తిరిగి ఆగిపోయినది. నేను ఆ వాహనంలో ఉన్నా కూడా నాకు ఒక్క గాయం కూడా కాలేదు. ఇది కూడా బాబా లీలే. బాబా రక్షణ లేకుంటే అంత నాకు ఒక్క గాయం అయిన కాకుండా ఉంటుందా?  ఇలా నేను చాలా మార్లు ప్రమాదంలో ఉన్నపుడు బాబానే నన్నునా కుటుంబన్ని కాపాడారు. 

ఒకసారి మా అమ్మ గారికి డెంగ్యు జ్వరం వచ్చి  ప్లేట్ లేట్ కౌంట్ బాగా తగ్గిపోయింది. నేను అప్పుడు బాబాని తనకి నయం చేస్తే నాతో పాటు షిరిడీ తీసుకొని వస్తాను అని  ప్రార్ధించాను. మరుక్షణం ఒక ముస్లిం విద్యార్ధి అక్కడికి వచ్చాడు. నా బార్య కూడా బాబా భక్తురాలు. ఆమె ఆ ముస్లిం అబ్బాయిని విషయం చెప్పి సహాయం కోరింది. అతడు అందుకు సమ్మతించి రక్తదానం చేసాడు. క్రమంగా ప్లేట్ లేట్ కౌంట్ పెరుగుతూ వచ్చింది. అంతకుముందు కూడా కొందరు రక్తదానం చేసారు కానీ, ప్లేట్ లేట్ కౌంట్ పెరగలేదు. కాని ఈ కుర్రవాడు చేయగానే పరిస్థితి మరిపోయంది. అలా బాబా నా తల్లిని కాపాడారు. మేము అంతా షిరిడీ వెళ్లి ఆ కరుణామయిని దర్శించుకున్నాము.

బాబా లీలలు ఎన్నని చెప్పను. వారి దయకు అంతం లేదు. బాబా నన్ను ఓటమి నుంచి బయటకి తీసి గెలుపుని చూపించారు. నాకు మంచి బార్యపిల్లలుఉద్యోగంమంచి జీతంసమాజంలో పేరు, జీవితంలో అవసరమైన అన్ని బాబానే ఇచ్చారు. బాబా లేని నా జీవితాన్ని ఉహించుకోలేను.

నేను ఇంజనీరింగ్ లో మొదటి సారి ఫెయిల్ అయినపుడు నా స్నేహితుడు నన్ను బాబా మందిరంకు తీసుకోని వెళ్ళాడు. అప్పటినుండి బాబా నాకు ఏది కావాలన్నా అది ఇచ్చారు. బాబా ఎప్పుడు నాతోనే ఉన్నారు. నన్ను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ ముందుకి నడిపిస్తునారు. బాబా నాకు సహాయం చేయడం, దైర్యంగా ఉండడం అన్ని నేర్పారు. నా జీవితం బాబా పాదాలకే అంకితం. నేను బాబాని వేడుకునేది ఒక్కటే నేను చేసిన తప్పులకి మన్నించు అని, నా చెయ్యి విడువకు అని. నేను నీ బిడ్డని, నాకు తెలుసు మీకు నేను అంటే ఇష్టం అని.


ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : శ్రీమతి శ్రావణి, నెల్లూరు.

షిర్డీ సాయి ఆరతుల గురించి సమగ్ర సమాచారం - 1వ భాగం.....


షిర్డిలో ఆరతుల తేది 10. 12. 1910న ప్రారంభం:

ఈ హారతులు ఎప్పటి నుండి ప్రారంభించినది, ఏవిధంగా ఇచ్చేది సరియైన తేది. సమాచారం తెలియుటలేదు. సాయి సచ్చరిత్రననుసరించి తేది 10. 12. 1910న చావడిలో హారతులు పారంభామైనవని తెలియుచున్నది. దాదాసాహెబ్ ఖపర్డే గారు మొదటిసారిగా తేది 05. 12. 1910న షిర్డీ వచ్చి తేది 12. 12. 1910 వరకు ఉన్నారు. అప్పుడు షిర్డీ లో ఉన్నప్పటి తన దినచర్య డైరీలలో వ్రాసుకున్నారు. దానిలో తేది 06. 12. 1910న బాబా చావడికి వెళ్ళినట్లు, అలా వెళ్ళినప్పుడు ఊరేగింపుతో గొడుగు, వెండికర్ర చామరములు మొదలగు వాటితో వెళ్ళారని, రాధాకృష్ణమాయి దీపములతో వచ్చినదని, ఆమెను కొంచం దూరంలో తాను చూచానని, చావడి బాగా అందంగా అలంకరించబదినదని” వ్రాసియున్నారు. కనుక అప్పటికి చావడి ఉత్సవం, బాబా రోజు విడిచి రోజు చావడిలో నిద్రించుట జరుగుచున్నట్లు స్పష్టమైనది. కాని అక్కడ రాత్రి, ఉదయం హరతి జరిగినట్లులేదు. అతను డైరీ లో తేది 10. 12. 1910న చావడిలో హారతులు పారంభామైనట్లు ప్రస్తావించలేదు. కనుక ఈ ఆరతులు ఆ తేది తరువాతనే ప్రారంభమయియుండాలి. మళ్ళి తేది 06. 12. 1911న ఖపర్డే షిర్డీ వచ్చినప్పుడు తేది 07. 12. 1911 రాత్రి శేజారతి, తేది 08. 12. 1911 ఉదయం కాకడారతి పాల్గొన్నట్లు వ్రాసియున్నారు.

బాబాకు ప్రధమముగా ఆరతి ఇచ్చినవారు తాత్యాసాహేబ్ నూల్కర్:

తాత్యాసాహేబ్ నూల్కర్ 1909లో మొదటిసారి షిర్డీ వచ్చారు. బాబా సముఖములో మొట్టమొదటి ఆరతి ఇచ్చినది నూల్కరే. ఈ విషయం శ్రీ సాయి శరణానంద ఇలా చెప్పారు. “మహాల్సాపతి, నానాసాహేబ్ చందోర్కర్ కుమారడు మహాదేవ్ మాత్రమే బాబాను పూజించేవారు. తరువాత ఆరతి ఇచ్చు పద్దతి ప్రారంభమైనది.  ఉదయం కాకడ హారతి, రాత్రి శేజ ఆరతి చావడిలో నిర్వహించబడేవి. ద్వారకామాయిలో మధ్యాహ్న ఆరతి మాత్రం ఇవ్వబడుచుండేది. నూల్కర్ గారు మొట్ట మొదటగా ఈ అరతులను ఇచ్చుట ప్రారంభించిరి.”  అదేవిధంగా దీక్షిత్ గారు కూడా “తాత్యాసాహెబ్ నూల్కర్ మొదటిసారి బాబాకు ఆరతి ఇచ్చారు. అంతకు ముందు ఎవరు ఇవ్వలేదు” అని చెప్పిరి. కనుక షిర్డిలో బాబా సముఖములో మొదటగా ఆరతి ఇచ్చినది తాత్యాసాహెబ్ నూల్కర్ అనునది స్పష్టం. ఇతను ఎంతో భక్తీ ప్రపత్తులతో ఆరతి ఇచ్చేవారు.

బాబా సముఖంలో ఆరతులు ఇచ్చినవారు:-

1.  తాత్యాసాహెబ్ నూల్కర్:- సరియేనా తేది తెలియనప్పటికీ 10.12.1910 తరువాతనే తాత్యాసాహెబ్ నూల్కర్ మొదటగా అరతులను ప్రారంభించారు. 1911 మార్చిలో ఆయన చనిపోయేవరకు ఈ ఆరతులు కొనసాగించారు.

2. మేఘ శ్యాముడు:- నూల్కర్ మరణానంతరం ఇతను బాబా సముఖంలో ఆరతులు ఇవ్వడం ప్రారభించాడు. 19.03.1911 నుండి అతను దేహత్యాగం చేసిన 1912 జనవరి 19 కి మూడు రోజుల ముందు వరకు ఇచ్చాడు. ఇతను ఆరతి ఇచ్చే సమయమున ఒంటి కాలుపై నుంచుని, తల కదలించకుండా ఆరతి ఇచ్చేవాడు. 19.01.1912న తెల్లవారుజామున 4 గంటలకు మేఘుడు చనిపోయాడు. మూడు రోజుల ముందు మేఘుడు ఆరతి ఇస్తుంటే ఇదే మేఘుని చివరి ఆరతి అని బాబా చెప్పారు.

17.01.1912న కాకడ ఆరతి బాపుసాహేబ్ జోగ్ ఇచ్చాడు.

18.01.1912న మధ్యాహ్న ఆరతి సీతారామ్ ఇచ్చాడు. అదేరోజు శేజ ఆరతి కూడా సీతారామ్ ఇచ్చాడు.

3.    19.01.1912న కాకడ ఆరతి బాపుసాహేబ్ జోగ్ ఇచ్చాడు. ఆరోజు జోగ్ ఆరతి ఇవ్వటం ప్రారంభించి బాబా         దేహనంతరం వరకు ఇతనే ఆరతులు ఇస్తూ ఉండేవాడు.

4.   బాబా 15.10.1918 మంగళవారం దేహత్యాగం చేసిరి. బుధవారం ఉదయం షిర్డీ నివాసి శ్యామా మేనమామయగు లక్ష్మణమామాజోషి కి బాబా స్వప్న దర్శనమిచ్చి చేయిపట్టుకొని లాగి “త్వరగా లెమ్ము జోగ్ నేను మరణించానని అనుకుంటున్నాడు. అందుకే ఆరతి ఇవ్వడానికి రాదు. అందువలన నీవు వచ్చి పూజచేసి కాకడ అరతినిమ్ము” అని చెప్పిరి. వెంటనే లక్ష్మణమామాజోషి బాబా చెప్పినట్లు పూజ ద్రవ్యములతో మశీదుకు వచ్చి అక్కడ ఎవరు అడ్డు చెప్పిన లెక్కించక బాబా దేహానికి పూజ, ఆరతి చేసినాడు. ఆరోజు మధ్యాహ్న ఆరతి ఎప్పటి వలె జోగ్ పూజ ద్రవ్యములతో అందరితో కలిసి వచ్చి ఆరతి ఇచ్చినాడు.

ఇచ్చట గుర్తించవలసినది ఏమిటంటే, ఆయన తన దేహం త్యజించుట వలన తమ అవతార సమాప్తి కాదని అది ఇంకా కొనసాగించబడుచునే ఉన్నాడని, అరతులను ఆపవలసిన పని లేదని గుర్తింపు చేసి ఆచటి వారి అనుమానములను తొలగించిరి.

బాబా దేహదారిగా ఉన్నంతవరకు ద్వారకామాయిలో మధ్యాహ్న ఆరతి ఒక్కటే జరుగుచుండేడిది. ముందుగా మశీదులో గంట మ్రోగేడిది. అప్పుడు భక్తులందరూ మశీదులో చేరేడివారు మొదటగా బాబాను గంధాక్షతలతో పుజించేడివారు. బాబా తమ ఆసనంపై చిలుం గొట్టంతో కూర్చొని యుండేడివారు. మశీదు లోపల స్త్రీలు నిలిచి యుండేడివారు. పురుషులు మశీదు ముందు ఖాళీ స్థలంలో నిలిచేడివారు. అప్పుడు జోగ్ బాబా ఎదుట నిల్చుని భక్తీ ప్రపత్తులతో కుడి చేతిలో ఐదు వత్తుల అరతిని పట్టుకొని ఆరతి ఇచ్చుచు, ఎడమ చేతిలో ఒక గంటను పట్టుకొని మ్రోగించు చుండేడివాడు. ఆరతి పాటలను పాల్గొన్న భక్తులందరూ పెద్దగా క్రమపద్దతిలో కలిసి పాడెడివారు. ఆరతి పూర్తీ అగు సమయమున పాల్గొన్న వారందరూ ఉచ్చ స్వరంతో “శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహారాజ్ కీ జై” అని ఎలుగెత్తి చాటేవారు. చివరిగా జోగ్ బాబాకు కర్పూర ఆరతి ఇచ్చి బాబాకు పటిక బెల్లమును నైవేద్యంగా పెట్టేవారు. బాబా చేయి చాపగా జోగ్ ఆ పటిక బెల్లంలో కొంత భాగం బాబా చేతిలో పెట్టి, మిగిలినది అచట ఉన్న వారందరికి ప్రసాదముగా పంచి పెట్టవాడు.

మధ్యహ్న ఆరతి అయిన పిమ్మట బాబా మశీదు బయటకు వచ్చి మశీదు ముందు గోడ ప్రక్కన నిలబడి ప్రేమతో భక్తులకు ఊధి ప్రసాదము పంచి పెట్టేడివారు. బాబా భక్తుల చేతులలో పిడికెళ్ళతో ఊధి పోయుచు, వారి నుదుట తమ చేతులతో ఊధి ని పెట్టిడివారు. “అన్నా! మధ్యాహ్న భోజనమునకు పొమ్ము!”, “బాబా! బసకుపో!” “బాపూ! భోజనము చేయుము” అని ప్రతి భక్తుని సాయి ఆదరముతో పలుకరించి ఇంటికి పంపేవారు. బాబా గోడ పక్కన నిల్చున్న స్థానములో ఇప్పుడు గుర్తుగా క్రింద మరియు 4 అడుగుల ఎత్తుగా గోడ కట్టి ఆగోడపై చిన్న బాబా పాదుకలు భక్తులు నమస్కరించుకోవడానికి అనువుగా అమర్చారు.

ఈ మధ్యాహ్న ఆరతి జరుగుచున్నప్పుడు మశీదు ముందు ఇప్పుడు కూర్మ చిహ్నం ఉన్న చోట అందంగా అలంకరించబడిన శ్యామ కర్ణ గుఱ్ఱం కాళ్ళకు గజ్జలతో నిలబడి ఆరతి పాటకు అనుగుణంగా లయానుసారముగా శిరస్సు నూపుచు కాళ్ళను అడించేడిది. ఆరతి పూర్తీ కాగానే ద్వారకామాయి మెట్లపై తన ముందు కళ్ళు యుంచి బాబాకు వంగి నమస్కరించేది. బాబా ముందుగా దాని నొసటన ఊధి పెట్టి దీవించిన తరువాతనే ఇతరులకు బాబా ఊధి ఇచ్చేవారు. ఈవిధంగా అప్పటి ఆరతులు జరుగుచుండేవి. దీనిని గురించి చదువుతుంటేనే ఒళ్ళు గగుర్పోడుచుచుంటే అప్పుడు అందులో పాల్గొన్న భక్తుల ఆనందం వర్ణనాతీతము కదా!

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo