శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
వృత్తిరీత్యా చిన్నపిల్లల డాక్టర్ అయిన
విన్నీ చిట్లూరి గారు ప్రముఖ సాయిభక్తులు. శ్రీసాయిబాబాపై
ఎన్నో అమూల్యమైన గ్రంథాలను రచించి ప్రచురించారు. ఆమె రచించిన గ్రంథాలలో “Ambrosia
in Shirdi” ప్రముఖమైనది. ప్రస్తుతము
శిరిడీలో నివసిస్తున్న ఆమె శ్రీసాయిబాబాతో గల తమ స్వంత అనుభవాన్నిఇలా
తెలియచేస్తున్నారు.
అది 1984 సంవత్సరం. ఒక గురువారం నాడు
ఎప్పటిలాగే రోగులను చూడటానికి ఒక గంట ముందుగా క్లినిక్ కు వెళ్ళాను. నా టేబుల్ పైన, మసీదులో ధుని ముందు కూర్చొని ఉన్న బాబా ఫోటో ఉండేది. ఆ గంటసేపు బాబాను ప్రార్థించడం నాకు అలవాటు. ఆ రోజు నా వద్దకు వచ్చే ప్రతి రోగికి సహాయం
చేయమని బాబాను ప్రార్ధిస్తుండేదాన్ని. ఆరోజు కూడా అలా ప్రార్ధన చేస్తుండగా, అకస్మాత్తుగా నర్స్ తలుపు తట్టి నా గదిలోకి
ప్రవేశించి నాతో, “ఈ సమయంలో
మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని నాకు తెలుసు, కాని 3 నెలల వయస్సున్న ఒక పిల్లవాడు శ్వాసక్రియకు సంబందించిన అనారోగ్యంతో చాలా బాధపడుతున్నాడు. ఆ బిడ్డని మీరు వెంటనే పరీక్షించాలి" అని చెప్పింది. వెంటనే రోగులను పరీక్షించే గదికి వెళ్తున్నంతలో, నేను ఆమెను అతిసారం, వాంతులు, జ్వరం, ఇంకా అతిగా మందులు వాడటం మొదలైన ప్రశ్నలు అడిగాను. ఆమె అవేమీ లేవని చెప్పింది.
నేను ఆ పిల్లవాడిని పరీక్షించి, డిహైడ్రేషన్ మరియు వేగంగా శ్వాసతీసుకోవటంగా
నిర్ధారించుకున్నాను. అంతకుమించి ఎటువంటి రోగనిర్ధారణకు రాలేకపోవటంతో, దిక్కుతోచక వెంటనే బాబాను ప్రార్థించాను. అప్పుడు బాబా, "డయాబెటిక్ కీటోఅసిడోసిస్" అని బిగ్గరగా అనటం విని నేను నిశ్చేష్టురాలినయ్యాను. నేను బాబా మాటలు వచ్చిన వైపు తిరిగి, "ఏమిటి బాబా, ఈ బాబుకు ఇంకా మూడు నెలలే" అని అన్నాను. కానీ బాబా మాత్రం ఆ బాబు రోగాన్ని నిర్ధారిస్తూ మూడుసార్లు
అదే చెప్పారు. వెంటనే నేను ఆ
బాబు రక్తం మరియు మూత్రం తీసి పరీక్షకు పంపించాను. కొన్ని నిమిషాల్లోనే, రక్తంలో గ్లూకోజ్ 250 మరియు మూత్రంలో
కీటోన్స్ ఉన్నట్లు
రిపోర్ట్స్ వచ్చాయి. లాబ్ టెక్నీషియన్
తో అ బాబు వయస్సు 3 నెలలు అంటే నమ్మక, బాబు వయస్సు కనీసం 3 సంవత్సరాలైనా ఉంటుందని చెప్పి, నాతోపాటు ఆ
బాబును చూడటానికి వచ్చాడు.
ఇదంతా జరుగుతుండగా, ఆ పిల్లవాడి పరిస్థితి వేగంగా క్షీణించసాగింది. నేను ఒక ఇంజక్షన్ తెమ్మని నర్సును అడిగాను. కానీ బాలుడి నరాలు దొరకడం కష్టమయింది. ఈ లోపల బాలుడు
అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. నేను మొట్టమొదటి
ప్రయత్నంలోనే సఫలమవ్వాలని, మందు సూచించమని
మళ్లీ బాబాని అడిగాను. ఈసారి బాబా, "పిల్లవాడిని ఇప్పుడు చిన్నపిల్లల
ఆసుపత్రికి పంపించు" అన్నారు.
నేను నర్సుకు 911కు ఫోను చేసి, పిల్లవాడిని
పిల్లల ఆసుపత్రికి పంపించమని చెప్పాను. కొద్దిసేపట్లో
అంబులెన్స్ (హెలికాప్టర్) వచ్చింది. మామూలుగా
అంబులెన్స్ వాళ్ళు ముందుగా సమీపంలో ఉండే ఆసుపత్రికి తీసుకువెళ్ళి, ఆ తరువాత అవసరమైతే వేరే ఆసుపత్రికి తీసుకొని వెళతారు. కానీ దగ్గరలో
ఉన్న ఆసుపత్రిలో, చిన్నపిల్లల
వైద్య విభాగం లేదు. అయితే అంబులెన్స్
కెప్టెన్ గా వచ్చిన రోడ్రిగ్స్ తన జట్టుతో వచ్చి పిల్లవాడిని చూసాడు. పిల్లవాడికి డయాబెటిస్ ఉన్నందువల్ల ముందుగా పిల్లల
ఆసుపత్రికి తీసుకు వెళ్ళాల్సిందిగా నేను వారిని అభ్యర్థించాను. అసాధారణంగా, కెప్టెన్ తక్షణమే అంగీకరించాడు. పిల్లవాడి
పరిస్థితి విషమంగా ఉన్నందున, వెంటనే
హెలికాప్టర్ లో పిల్లల ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
వెంటనే నేను నా ఆఫీసులోకి వెళ్లి, తలుపులు మూసేసి, తనివితీరా ఏడ్చిన
తరువాత బాబా చూపిన కరుణకు కృతజ్ఞతలు తెలిపాను. చివరిగా నేను నవ్వుకొని బాబాతో, "బాబా, మీకు సర్వమూ తెలుసుననే విషయం నాకు తెలుసు, కాని మీరు ‘ship the child’ అని అమెరికన్
ఇంగ్లీషులో మాట్లాడతారని నాకు తెలియదు.
నేను ఒక గంట తరువాత ఆసుపత్రికి ఫోన్
చేయగా, CT స్కాన్, ఇంకా ఇతర పరీక్షలు చేసిన తరువాత పిల్లవాడి
పరిస్థితి స్థిరంగా ఉందని నాకు చెప్పారు. తరువాత అక్కడి
డాక్టర్ నన్ను, "డాక్టర్, మీరు ఆ పిల్లవాడికి డయాబెటిస్ అని మీరు ఎలా
నిర్ధారించారు?" అని అడిగింది. నేను, "ఓ! అదా! అది దైవ(బాబా) సందేశం" అని చెప్పాను. ఆమె నన్ను వెర్రిదానిగా భావింఛి, ఫోన్ పెట్టేసింది. సీనియర్ వైద్యులు
కూడా నన్ను అదే ప్రశ్న అడిగారు. ప్రతిసారీ నేను అదే జవాబు (దైవ సందేశం) చెప్పేదాన్ని. దాంతో వాళ్ళు ఫోన్ పెట్టేసేవారు.
చివరగా నేను పిల్లవాడిని ఆసుపత్రికి
తీసుకు వెళ్ళిన ఫైర్ డిపార్టుమెంటుకి ఫోన్ చేసి, కృతజ్ఞతలు
చెప్పాలని కెప్టెన్ రోడ్రిగ్జ్ వాకబు చేయగా, వాళ్ళు "అవును, మేమే పిల్లవాడిని
ఆసుపత్రికి తీసుకు వెళ్ళాం, కానీ కెప్టెన్
రోడ్రిగ్స్ పేరుతో ఎవరూ లేరు" అని చెప్పారు. కానీ నేను అతని పేరు ట్యాగును చూశాను, చార్టులో కూడా అతని పేరు వ్రాయటం చూసాను. అందువలన నేను నర్సుని పిలిచి అడిగాను. ఆమె కూడా కెప్టెన్ రోడ్రిగ్స్ అని ధృవీకరించింది. బాబానే కెప్టెన్ రోడ్రిగ్స్ గా వచ్చి పిల్లాడిని, నన్నూ కాపాడారని అప్పుడు నేను గ్రహించాను. తరువాత ఆ పిల్లవాడికి పూర్తిగా నయమయి డిశ్చార్జ్ చెయ్యబడ్డాడు. ఈ కేసు గురించి చాలా వార్తాపత్రికలలో
ప్రచురించబడింది. కానీ ఆ
గొప్పతనమంతా బాబాకు చెందుతుంది.
Om Sairam
ReplyDeleteSai always be with me