సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

జి.జి.నార్కే - రెండవ భాగం




1914 ప్రాంతంలో హార్దా నుండి శ్రీమంతుడైన ఒక వృద్ధుడు ఒకామెతో కలిసి శిరిడీ వచ్చాడు. అతను క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. నెలరోజుల్లో అతని ఆరోగ్యం చాలావరకు మెరుగుపడినట్లు కనిపించింది. అందుచేత అతను శిరిడీనే తన నివాసంగా చేసుకున్నాడు. కానీ రెండవ నెల చివర్లో అతని పరిస్థితి విషమించి మృత్యువు సమీపించినట్లు అనిపించింది. అప్పుడొకరోజు ఆ ఇంటి ఆడవాళ్లు మరియు వాళ్ళ స్నేహితులు నాతో, "పరిస్థితి విషమంగా ఉంది. బాబా దగ్గరకు వెళ్ళి సహాయం కోరేందుకు ఇంట్లో మగదిక్కు ఎవరూ లేరు. కాబట్టి బాబా వద్దకు వెళ్లి, బాబానడిగి ఊదీ తెచ్చిపెట్టమ"ని నన్ను అభ్యర్థించారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఊదీ అడిగాను. బాబా, “ఆ వృద్ధుడు ఈ ప్రపంచాన్ని వదలివెళ్ళడమే మంచిది. అతనికి ఊదీ ఏమి చేయగలదు? అయినా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి తీసుకెళ్ళు” అని అన్నారు. నేను ఊదీ తీసుకుని వాళ్ళకిచ్చాను. కానీ బాబా చెప్పిన విషయాలేమీ వాళ్ళకు చెప్పలేదు. తరువాత అతని పరిస్థితి మరింత విషమించింది. అప్పుడు శ్యామా బాబాను దర్శించి, "ఆ వృద్ధునికి అంతిమ ఘడియలు సమీపించాయ"ని చెప్పాడు. బాబా, “అతనెలా చనిపోగలడు? రేపు ఉదయానికల్లా ప్రాణం పోసుకుంటాడు” అని అన్నట్లున్నారు. ఆ మాటలను బట్టి ఆ వృద్ధుడు చనిపోడని అంతా అనుకున్నారు. కానీ ఆ వృద్ధుడు ఆ రాత్రి మరణించాడు. అయినా వాళ్ళు శవం చుట్టూ దీపాలు వెలిగించి మరుసటిరోజు మధ్యాహ్నం వరకు వేచి చూశారు. కానీ అతనిలో చలనం కనపడలేదు. ఇక ఆశ వదులుకుని అంత్యక్రియలు జరిపించారు. వృద్ధుని బంధువులు, బాబా లేనిపోని ఆశలు కల్పించి తమను నిరాశపరిచారని భావించి శిరిడీ నుండి వెళ్ళిపోయారు. మూడు సంవత్సరాలపాటు వాళ్ళు శిరిడీకి రాలేదు. 

తరువాత ఒకరోజు వృద్ధుని బంధువొకతనికి బాబా కలలో కనిపించారు. బాబా శరీరంపై చనిపోయిన వృద్ధుని తల ఉంది. బాబా కుళ్ళిపోయి ఉన్న వృద్ధుని ఊపిరితిత్తులను అతనికి  చూపించి, ‘ఇంతటి బాధనుండి నేను ఆ వృద్ధుణ్ణి విముక్తుణ్ణి చేశాను” అని చెప్పారు. అతను తన కల విషయం అందరికీ చెప్పాడు. అప్పటినుండి వృద్ధుని బంధువులు తిరిగి శిరిడీకి రావడం ప్రారంభించారు. “అతడెలా చనిపోగలడు? తిరిగి ప్రాణం పోసుకుంటాడు” అన్న బాబా మాటలు ప్రాణం శిథిలమైన శరీరాన్ని విడిచి, మరొక కొత్త శరీరాన్ని ధరిస్తుందనే అర్థంతో(జన్మ పరంపర) చెప్పబడిందని మనం గ్రహించాలి.

బాబా ఒకరాత్రి మశీదులో, ఒకరాత్రి చావడిలో నిద్రిస్తుండేవారు. ఆయన ప్రాతఃసమయంలో ధుని దగ్గర కూర్చుని, గతరాత్రి ఏయే సుదూర ప్రదేశాలకు తాము వెళ్ళిందీ, అక్కడ ఏమి చేసిందీ భక్తులతో చెప్తుండేవారు. రాత్రంతా ఆయనతోపాటు నిద్రించిన భక్తులు అది విని, 'భౌతికంగా తమ కళ్ళెదుటే ఉన్న బాబా, దూరప్రాంతాలకు వెళ్ళడమేమిట'ని ఆశ్చర్యపోతుండేవారు. కానీ బాబా మాటలు అక్షరసత్యాలు. భక్తులు అప్పుడప్పుడు వాటిలోని నిజానిజాలను పరీక్షించేవారు. అప్పుడు వారి మాటలు నిజమని ఋజువులు దొరికేవి.

బాబా అదృశ్యరూపంలో విశ్వాంతరాళాలలో పర్యటించి అక్కడి విషయాలను నియంత్రించేవారు. తరచుగా వారు ఇతర లోకాలకు సంబంధించిన దృశ్యాల గురించి వివరిస్తుండేవారు. మరణానంతర విషయాల గురించి కూడా చెప్తుండేవారు. ఉదాహరణకు, ఒకసారి శిరిడీ వాస్తవ్యుడైన ఒక మార్వాడీ బాలుడు జబ్బునపడి మరణించాడు. అంత్యక్రియలు ముగిశాక విషాదవదనంతో భక్తులు మశీదుకు వచ్చారు. వారితో బాబా, "ఆ పిల్లవాడు ఇప్పుడే నదికి చేరువయ్యాడు, దాటుతున్నాడు" అని అన్నారు. బాబా 'నది' అని 'వైతరిణి'ని సూచిస్తున్నారు. పైలోకాలకు వెళ్లే క్రమంలో ఆత్మలు 'వైతరిణి'ని దాటుతాయని పురాణాలలో చెప్పబడింది.

శ్రీసాయిబాబా ఈ లోకంలోనూ, ఇతర లోకాలలోనూ తాము నిర్వహించే విధులను గూర్చి అరుదుగా చెబుతుండేవారు. అంతేగాక, గతించినవారి ఆత్మల స్థితిగతులను కూడా అదుపాజ్ఞలలో ఉంచుకున్నానని చెప్పడం ద్వారా ఈ జగత్తుపై తమకు గల ఆధిపత్యాన్ని తెలియజేశారు. బాబా ఎప్పుడూ అసత్యం పలికేవారు కాదు. అర్థరహితంగా మాట్లాడేవారు కాదు. వారి పద్ధతులను గురించి బాబాను ఎరిగినవారు మాత్రమే వారి మాటలను చర్యలను అర్థం చేసుకోగలిగేవారు. అది కూడా ఎవరిని ఉద్దేశించి పలికారో వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. 

బాబా ఒక్కొక్కసారి, "నీవెక్కడున్నావు? నేనెక్కడున్నాను? ఈ ప్రపంచం ఎక్కడుంది?" అని పలికేవారు. అప్పుడప్పుడు బాబా తమ దేహాన్ని చూపిస్తూ, లేదా ఉద్దేశిస్తూ, "ఇది నా ఇల్లు, నేనిక్కడలేను! నా ముర్షద్(గురువు) నన్ను ఈ దేహం నుండి ఏనాడో విడుదల చేశాడు" అని అనేవారు. భౌతికదేహంతో శిరిడీలో సంచరిస్తున్నప్పుడు కూడా వారు ఆ దేహానికి పరిమితులై లేరు. వారి గురించి నిజం చెప్పాలంటే, "సాయిబాబా సజీవంగా ఉన్నారు. వారు అప్పుడున్న చోటే ఇప్పుడూ ఉన్నారు. ఇప్పుడున్న చోటే అప్పుడూ ఉన్నారు".

బాబా ఎంతోమంది భక్తులకు వాళ్ళ గత జన్మల గురించి, ఆ జన్మలలో జరిగిన సంఘటనల గురించి చెప్పేవారు. ఒకసారి నా గత నాలుగు జన్మలలో జరిగిన విషయాలు భక్తులందరి సమక్షంలో చెప్పారు. కానీ బాబా చెప్పిన విషయాలు నాకు సంబంధించినవని ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేదు, చేసుకోలేరు కూడా. బాబా ఒక విషయాన్ని ఒకరికి చెప్పదలిస్తే దాన్ని అందరి సమక్షంలో బాహాటంగానే చెప్పేవారు. చిత్రమేమిటంటే, ఆ విషయం ఎవరిని ఉద్దేశించి చెప్పబడిందో వారికి మాత్రమే అర్థమయ్యేలా చెప్పడం బాబాలో ఉన్న ప్రత్యేకమైన కళ. మిగతావారికి బాబా మాట్లాడినవేవీ అర్థమయ్యేవి కావు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, చిన్న చిన్న మాటలు, చర్యలతో బాబా ఒకేసారి అనేకమంది భక్తులకు ప్రయోజనాన్ని చేకూర్చగలరు. దీనిని బట్టి భూతభవిష్యత్తులను స్పష్టంగా తెలుసుకోగలిగే వారి నిజతత్వాన్ని ఊహించవచ్చు.

నార్కే చెప్పిన దానికి ఉదాహరణగా సాయిశరణానంద రచించిన 'శ్రీ సాయిబాబా' బుక్ లోని వివరాలు: 

1913-1914లో నార్కే శిరిడీలో కొంతకాలం ఉన్నప్పుడు ఒకరోజు అతనికొక కల వచ్చింది. ఆ కలలో బాబా అతనికి దర్శనమిచ్చారు. బాబాకు సమీపంలో కూలివానివలె ఉన్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. బాబా అతనిని చూపిస్తూ నార్కేతో, "నీ గతజన్మలోని ఈ స్నేహితుని చూడు! కర్మానుసారం పరిస్థితి మారుతుంది" అని అన్నారు. కొన్నిరోజుల తరువాత ఒకరోజు ఉదయం నార్కే సాయిబాబా చెంత కూర్చొని ఉన్నప్పుడు తలపై కట్టెలమోపుతో ఒక కూలివాడు వచ్చాడు. ఆ కూలివానిని చూస్తూనే నార్కే, "ఇతను అచ్చం నేను కలలో చూసిన కూలివానివలె వున్నాడు. ఇతను గతజన్మలో నా స్నేహితుడా!" అని ఆశ్చర్యపోయాడు. వెంటనే బాబా నార్కేతో, "వెళ్లి నీ స్నేహితుడు తెచ్చిన కట్టెలకు రెండు రూపాయలివ్వు" అని అన్నారు. 'ఆ కట్టెలమోపుకు అంత ఎక్కువా?' అనే సందేహం నార్కే మనసులో తలెత్తింది. అప్పుడు బాబా, "ఇది మన పూర్వజన్మకు సంబంధించినదని మనకు తెలిసింది కదా!" అని అన్నారు. అంతటితో నార్కేకి 'కట్టెలు తెచ్చిన ఆ కూలివాడు, కలలో తన స్నేహితుడిగా బాబా పరిచయం చేసిన వ్యక్తి ఒకరే' అని నమ్మకం కుదిరి, మనసులోని ఆలోచనలు శాంతించాయి. 

సాయిశరణానందకి కూడా ఇదే అనుభవం అయింది. ఒకసారి అతనికి కలలో ఒక కన్ను అంధత్వంతో ఉన్న ఒక స్త్రీ కనిపించింది. తరువాత ఒకరోజు అతను బాబా చెంత కూర్చొని ఉండగా కలలో తనకు కనిపించిన స్త్రీని పోలిన ఒక స్త్రీ మసీదుకి  వచ్చింది. బాబా శరణానంద జేబులో నుండి రెండు రూపాయలను ఆమెకిచ్చి అతనితో, "ఈమె గతజన్మలో నీ పరిచయస్థురాలు" అని అన్నారు.

ఉపదేశం, మంత్రం, తంత్రం, మొదలైనవి:

సాయిబాబా ఎన్నడూ నాకు మంత్రం, తంత్రం, ఉపదేశం వంటివి ఇవ్వలేదు. నాకు తెలిసినంతవరకు వాటిని ఇంకెవరికీ ఇవ్వలేదు. మాధవరావు దేశ్‌పాండే ఈ క్రింది సంఘటన గురించి నాతో చెప్పారు.

రాధాబాయి దేశ్‌ముఖ్ అనే భక్తురాలు బాబాను దర్శించి వారినుండి ఉపదేశం పొందాలని శిరిడీ వచ్చింది. కొంతకాలం వేచిచూసినప్పటికీ బాబా ఏమీ ఉపదేశించకపోవడంతో ఆమె బాబా తనకు ఉపదేశమిచ్చేంతవరకు నిరాహారిగా ఉండాలని నిశ్చయించుకుని ఆహారాన్ని తీసుకోవడం మానేసి సత్యాగ్రహాన్ని ప్రారంభించింది. నాల్గవరోజు మాధవరావు ఆమె పరిస్థితిని చూసి జాలిపడి, బాబా దగ్గరకు వెళ్లి ఆమె గురించి చెప్పి, "ఆమెకేదైనా దేవుని పేరు చెప్పండి. దానిని ఆమె మంత్రోపదేశంగా భావించి జపం చేసుకుంటుంది" అని చెప్పాడు. బాబా ఆమెను పిలిపించి, "అమ్మా! నా గురువు నాకు ఏ మంత్రమూ ఉపదేశించలేదు. అలాంటప్పుడు నేను నీకేమి ఉపదేశించగలను? ఉపదేశమివ్వడం నా అధీనంలో లేదు. నేను అనుసరించే నా గురువు యొక్క సంప్రదాయాలు వేరు. నా గురువు ఎంతటి శక్తిమంతుడంటే వారి ముందు నిలబడడానికి కూడా నేను వణికిపోయేవాణ్ణి! వారు అందించే సహాయం అదృశ్యంగానూ, నిగూఢంగానూ ఉండేది. అది వాచా బోధించినది కాదు. మేము చెవిలో ఏదీ ఉపదేశించము (మీ కానాలా ఇసణారా గురు నవ్హే). మా సంప్రదాయం వేరు (ఆమ్‌చా ఘరాణే నిరాళే అహేత్)" అని చెప్పారు.

సాయిబాబా ఎన్నడూ ఉపన్యాసాలు, ప్రవచనాలు చేయలేదు. ఎప్పుడైనా సందర్భానుసారం వారు ఇచ్చే సూచనలు ఒకటి, రెండు పదాలలో నర్మగర్భితంగా ఉండేవి. బాబా పలికిన ఆ కొద్ది మాటలను పరిశీలనా దృష్టి గల భక్తులు వారికి తోచిన విధంగా సిద్ధాంతీకరించుకునేవారు. అందువల్ల బాబా సిద్ధాంతం, పద్ధతి మొదలైనవి ఏమిటని అడిగితే, ఇదీ అని మొండిగా వాదించడం కష్టం. ఆ విషయంలో లెక్కలేనన్ని అభిప్రాయాలు వెలువడతాయి.

జీవిత లక్ష్యం - పురుషార్థం

'సాయిబాబా మోక్షమే లక్ష్యమని భక్తులకు చెప్పారా? పోనీ, వివేక-వైరాగ్యాలను అలవర్చుకోమని చెప్పారా?' అని అంటే, అలాంటి మాటలు బాబా పలుకగా నేనెప్పుడూ వినలేదు. "భగవంతుడిని చేరుకోవడమే లక్ష్యం" అని వారు చెప్పారు. "సప్తసముద్రాలను, లోకాలను దాటి దేవుని చేరుకోవాలి (అల్లా మిళణారా సప్తసముద్ర నిహలా కరణ), భవబంధాలను దాటిపోవాలి (బేడా పార్ కర్ నా)" అని కూడా అనేవారు. నాకు తెలిసినంతవరకు బాబా ఎప్పుడూ 'మాయ',  'ప్రపంచం మిథ్య' వంటి సిద్ధాంతాల గురించి మాట్లాడలేదు. ఇహపరలోకాలు సత్యాలని గ్రహించి, ఆ రెండింటిలోనూ సాధ్యమైనంత లబ్దిపొందాలని చెప్పేవారు.

కర్మ - పునర్జన్మ

కర్మ సిద్ధాంతం, పునర్జన్మల గురించి బాబా తరచూ ప్రస్తావిస్తుండేవారు. "మంచి విత్తనం నాటితే ఈ జన్మలోనూ, మరుజన్మలోనూ మంచి ఫలాన్ని పొందుతాము" అన్న సత్యం బాబా చెప్పే అనేక కథలలో అంతర్లీనంగా ఉండేది. ఆయన తరచూ భక్తుల గత జన్మల వృత్తాంతాలనూ, అప్పుడప్పుడు కొందరి భక్తుల భవిష్యత్ జన్మల గురించి చెప్పేవారు. బాబాతో ఉన్నవారికెవ్వరికీ మరణానంతరం తమ అస్తిత్వం గురించిగానీ, పరలోకాల ఉనికి గురించి గానీ, ఆయా లోకాలలో అనుభవించాల్సిన (ఈ జన్మలో చేసిన) పాపపుణ్యాల ఫలితాల గురించి గానీ ఎట్టి సందేహమూ ఉండేది కాదు. ఇవన్నీ హిందూ మత విశ్వాసాలకు, సిద్ధాంతాలకు సంబంధించిన విషయాలు.

ఇకపోతే బాబా ఏ మతానికి చెందినవారన్న విషయానికొస్తే, నాకు తెలిసినంతవరకూ బాబా తాము ఏ మతానికి, కులానికి, జాతికి చెందినవారమని ఎప్పుడూ వెల్లడించలేదు. బాబా వీటన్నింటికీ అతీతులు. కానీ, బాబా ప్రస్తావించిన విషయాలు, ఆయన చర్యలు ఆయనకు హిందూ మతంతో గల సంబంధాన్ని తెలియపరుస్తున్నాయి. "మా గురువు బ్రాహ్మణుడు (మాఝా గురు బ్రహ్మణ్ ఆహే)" అని బాబా చెప్పడం నేను విన్నాను.

హిందూ మతం - బ్రాహ్మణుల పట్ల బాబా వైఖరి

శ్రీరాముడు, శ్రీకృష్ణుడంటే బాబాకు ఎంతో గౌరవం. భగవద్గీత, భావార్థరామాయణం, ఏకనాథ భాగవతం, పంచదశి, యోగవాశిష్ఠం, పురాణాలు మొదలైన వాటిపై బాబాకు చాలా గౌరవముండేది. జ్ఞానేశ్వర్, తుకారాం వంటి మహాత్ముల పట్ల వారికెంతో గౌరవం ఉండేది. ఆయన తమ మాటలలో పై గ్రంథాలలోని విషయాలను తరచుగా ప్రస్తావిస్తుండేవారు. జ్ఞానదేవుని ఆరతి మొదలైన వెంటనే బాబా సావధానులై కూర్చుని, భక్తితో తమ చేతులు జోడించి కళ్ళు మూసుకునేవారు. ఒకసారి పంచదశి గురించి ఖపర్దేతో, "ఇది మా ఖజానా (యే తో హమారా ఖజానా హై)" అని బాబా చెప్పడం నేను విన్నాను. అంటే, మన ఆధ్యాత్మిక వికాసానికి అవసరమైన విలువైన విషయాలు అందులో ఉన్నాయని వారి భావమై ఉండవచ్చు. యోగవాశిష్ఠం పట్ల బాబాకున్న గౌరవం వ్యక్తిగతంగా నాకు తెలుసు. 

నేను బాబా దగ్గరకు వచ్చిన తొలిరోజుల్లో, అంటే 1914లో బాబా నన్ను 15 రూపాయల దక్షిణ ఇమ్మని అనేకమార్లు అడిగారు. నా దగ్గర డబ్బు లేదని ఆయనకు బాగా తెలుసు. ఒకసారి బాబా సమక్షంలో నేను ఒక్కడినే ఉన్నప్పుడు, "బాబా! నా దగ్గర డబ్బు లేదని మీకు తెలుసు. అయినా 15 రూపాయల దక్షిణ ఇవ్వమని అడుగుతారెందుకు?" అని అడిగాను. దానికి బాబా, "నీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు. కానీ, నీవు ఇప్పుడు యోగవాశిష్ఠం చదువుతున్నావు కదా! అందులో నీవిప్పుడు చదువుతున్న భాగం చాలా ముఖ్యమైనది. అందులో నుండి 15 రూపాయల దక్షిణ నాకివ్వు" అని అన్నారు. నిజంగానే నేను ఆ సమయంలో యోగవాశిష్ఠం చదువుతున్నాను. ఆ గ్రంథం నుండి డబ్బు తీసుకోవడమంటే దానినుండి విలువైన బోధను గ్రహించడమన్నమాట. అందులో నుండి తీసుకున్న పైకాన్ని బాబాకు దక్షిణగా ఇవ్వడమంటే, వాటిని హృదయగతం చేసుకోవడం ద్వారా నా హృదయంలో అంతర్యామిగా కొలువై ఉన్న బాబాకు సమర్పించడమే!
 
Source: Devotees' Experiences of Sri Sai Baba  by Sri.B.V.Narasimha Swamiji) 
http://bonjanrao.blogspot.com/2012/10/prof-g-g-narke.html 

 


ముందు భాగం కోసం

బాబా పాదుకలు తాకండి.




నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం

బాబా పాదాలు తాకండి.

 

 

 


8 comments:

  1. 🙏🌷🙏 ఓం సాయిరాం 🙏🌷🙏

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాధయ నమః
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  4. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయకం నమః
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo