1915వ సంవత్సరంలో రేగే శిరిడీ వెళ్లి ఎప్పటివలె ఆయీ ఇంట్లో బసచేశాడు. ఒకనాటి మధ్యాహ్నం బాబా ఏకాంతంగా ఉన్న సమయంలో రేగేను పిలుచుకురమ్మని ఒక వ్యక్తిని పంపించారు. వాళ్లిద్దరూ మసీదుకు వెళ్ళగానే బాబా ఆ వ్యక్తిని పంపించేసి, రేగేను ఆప్యాయంగా దగ్గరకు పిలిచి కౌగిలించుకున్నారు. తరువాత తమ చెంత కూర్చుండబెట్టుకుని, "నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెడుతున్నాను. నీకేమి కావాలో కోరుకో! నెలకు 5 రూపాయలు లేదా 100 రూపాయలు నీ ఇష్టం. నీకేది కావాలన్నా ఇస్తాను" అని అన్నారు. అతనికి బాబా తనను ప్రలోభపెడుతున్నారేమోనని అనిపించింది. “అయినా నేను కోరుకోవాల్సిందేముంది? నాకేది మంచిదో, ఏది అవసరమో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో సర్వమూ సాయిబాబాకు తెలుసు” అని అనుకున్నాడు. అతడేమీ అడగదలుచుకోకపోవడం చూసి బాబా అతని గడ్డం పట్టుకుని బుజ్జగిస్తూ ఏదో ఒకటి అడగమన్నారు. అప్పుడతను, "బాబా! నేనేదడిగినా ఇస్తారా?" అని అన్నాడు. "ఇస్తాను" అని బదులిచ్చారు బాబా. అప్పుడతను, "ఈ జన్మలోనే కాక రాబోయే జన్మలన్నింటిలోనూ మీరు నన్ను విడిచివెళ్లకూడదు. మీరు ఎల్లప్పుడూ నాతో ఉండాలి" అని అన్నాడు. అప్పుడు బాబా ఆనందంతో అతనిని తడుతూ, "సరే, నువ్వెక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా నీ లోపల, వెలుపల ఎప్పుడూ నీతోనే ఉంటాను" అని అన్నారు. అతనికి అమితానందం కలిగింది. ఆ తరువాత అతనికెప్పుడూ బాబా తనతో ఉన్న అనుభూతి కలుగుతుండేది. అంతేకాదు, అప్పుడప్పుడు అతనికి భరోసా ఇవ్వడానికి, మార్గనిర్దేశం చేయడానికి బాబా సాక్షాత్కరిస్తుండేవారు కూడా. బాబా సమాధి చెందాక కూడా అతనికి అటువంటి అనుభవాలు కలగడం విశేషం.
కొన్ని సంవత్సరాల తరువాత చాలా కుటుంబాలు నివాసముంటున్న ఒక భవంతిలో నివాసముంటున్నప్పుడు రేగే కుమారుడు చనిపోయాడు. అతని భార్య, బిడ్డ మరణానికి చాలా కృంగిపోయి ఏడవసాగింది. అతను ఆమెతో, "బిడ్డను బాబానే తీసుకెళ్లారు. వారు మనకేది మంచిదో అది మాత్రమే చేస్తారు. కాబట్టి మనం శోకించకూడదు. పెద్దగా విలపిస్తే జనం గుమిగూడతారు" అని చెప్పాడు. బిడ్డ నిర్జీవ దేహాన్ని చూస్తూ తట్టుకోలేక ఆమె విలపిస్తుంటే, మరుసటి ఉదయం అంత్యక్రియలు జరిగే వరకు విశ్రాంతి తీసుకోమని ఆమెను ఓదార్చి బిడ్డను తన ఒడిలోకి తీసుకున్నాడు. ఆమె విశ్రాంతి తీసుకోవడానికి లోపలికి వెళ్ళింది. అతడు చనిపోయిన బిడ్డను ఒడిలో పెట్టుకుని కూర్చుని ఉండగా బాబా కనిపించి, అతన్ని బయటకు తీసుకెళ్ళి, "నీకు నేను కావాలో, చనిపోయిన బిడ్డ కావాలో తేల్చుకో! రెండూ కావాలంటే పొందలేవు. పిల్లవాడే కావాలనుకుంటే బ్రతికిస్తానుగానీ నేను నీతో ఉండను. ఈ బిడ్డను బ్రతికించుకోవాలని అనుకోకపోతే తరువాత నీకు ఎంతోమంది పిల్లలు పుడతారు" అన్నారు. అతను ఏ సంకోచం లేకుండా, "నాకు మీరే కావాలి" అని బదులిచ్చాడు. "అయితే దుఃఖించకు" అని చెప్పి బాబా అంతర్థానమయ్యారు. ఆ విధంగా అతనికి బాబా తమ ఉనికిని తెలియజేస్తూ తగినంత ధైర్యాన్నిస్తుండేవారు.
న్యాయమూర్తిగా మంచి హోదాలో ఉన్న రేగేకు పెద్ద సమస్యలేమీ ఉండేవి కాదు. అయితే పెరుగుతున్న కుటుంబభారంతో కొన్ని అవసరాలు, బాధ్యతలు పెరిగాయి. అయినా అతనెప్పుడూ లౌకిక విషయాల కోసం బాబాను ప్రార్థించి ఆయనను ఇబ్బందిపెట్టేవాడు కాదు. బాబా తనకు చేసిన ఏర్పాట్లతో సంతృప్తిగా ఉండేవాడు. ఎప్పుడైనా డబ్బు అవసరం ఏర్పడితే ఏదోవిధంగా ఆ డబ్బు సమకూరేది. బాబా కృపవలన అతనికి కావలసినవన్నీ నెరవేరుతూ దేనికీ లోటుండేది కాదు.
శ్రీసాయిబాబా ఎంతో ప్రేమతో రేగేను తమ చెంతకు చేర్చుకున్నారు. అతనికి కూడా బాబాపట్ల అంతే ప్రేమానురాగాలు ఉండేవి. వారి మధ్య ఉన్న ఆ అనుబంధం అతను ఇతర మహాత్ములను దర్శించినప్పుడు వారు అతనిని ఆదరించిన విధానంలో ప్రతిబింబించేది.
1923లో రేగే హజ్రత్ తాజుద్దీన్ బాబా అనే మహాత్ముల దర్శనానికి నాగపూర్ వెళ్ళాడు. బాధలలో ఉన్నవారిపై వారు చూపే కరుణకు, వారి అద్భుత శక్తులకు హిందూ, ముస్లిం తదితర మతస్థులందరూ ఆకర్షితులై వారిని ఆరాధిస్తుండేవారు. ఆ రోజులలో వారు రాజుగారి అంతఃపురంలో నివసిస్తుండటం వలన వారి దర్శనం లభించడమెంతో కష్టతరమయ్యేది. రేగే వారి దర్శనానికి వెళ్లినరోజు వేలాది జనం రాజభవనానికి ముందు ఉన్న తోటలో వారి దర్శనానికి వేచి ఉన్నారు. నాటి సాయంత్రం 4 గంటలకు రేగే రైలు ఎక్కాల్సి ఉండటం వలన 3 గంటలవరకు మాత్రమే వారి దర్శనం కోసం వేచి ఉండదలచాడు. ఆ గడువు కొద్ది నిమిషాలు ఉందనగా ఒక అద్భుతం జరిగింది. ఒక భక్తుడు అతని వద్దకొచ్చి హజ్రత్ తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా అతనిని రమ్మన్నారని చెప్పి వారి దర్శనానికి తీసుకుని వెళ్ళాడు. రేగే తృప్తిగా వారిని పదినిముషాలు దర్శించి వారి ఆశీస్సులు పొందాడు.
మరోసారి శ్రీ శీలనాథ్ మహరాజ్ ఆ ప్రాంతానికి వచ్చారని తెలిసి రేగే వారిని దర్శించి, వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆయన వెంటనే రేగే ఇల్లు చేరి సాయి పటానికి నమస్కరించారు. రేగే సమర్పించిన టీ కొంచెం త్రాగి కొంచెం ప్రసాదంగా అతనికి ఇచ్చారు. వేరొకప్పుడు ఖేడా నివాసియైన శ్రీ కేశవానందజీని, పూణే నివాసియైన హజ్రత్ బాబాజాన్ అనే సిద్ధురాలిని కూడా దర్శించాడు రేగే. ఆ ఇద్దరు మహాత్ములు అతనిని చూస్తూనే, “నీవు సాయిబాబా దర్బారుకు చెందినవాడవు” అని ఎంతో ఆదరించారు.
శ్రీ మాధవనాథ్ మహరాజ్ ఇండోర్‌లో ఎందరినో భక్తి మార్గంలో నడిపిన మహనీయులు. వీరికి బాబాపట్ల ఎంతో భక్తిశ్రద్ధలుండేవి. 1927లో రేగే ఆ మహనీయుని దర్శించాడు. రేగేను చూస్తూనే ఆయన, "నీవు సాయిబాబాకు చెందినవాడవు" అని చెప్పి, ప్రథమంగా అతడు సాయిని దర్శించినప్పటి సన్నివేశాన్ని వివరంగా వర్ణించి, "ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను" అన్నారు. తరువాత రేగే తిరిగి పూణే బయలుదేరుతుంటే ఆయన ఒక జాబును అతనికిచ్చి, “నీవు మొదట శిరిడీ దర్శించి, తర్వాత ఇంటికి వెళ్ళు. ఈ జాబు బాబాకు ఇవ్వు” అని అన్నారు. ఆ జాబులో దేవీసాక్షాత్కారం మొదలైన ఎన్నో విషయాల గురించి ఆయన వ్రాశారు. రేగే శిరిడీ చేరేసరికి అర్థరాత్రి అవటం వలన సమాధిమందిరం మూసివుంది. ఏమి చేయాలో తోచక అతడా జాబును ఒక కిటికీలో పెట్టి అక్కడే నిలబడ్డాడు. చిత్రంగా అతడు చూస్తుండగానే అతని కళ్ళ ఎదుట దృశ్యమంతా మారిపోయింది. అతని ఎదుట బాబా సమాధి ఉన్నది. దానిపైనున్న దోమతెర తొలగించబడి ఉన్నది. కుడిప్రక్కగా తాను, ఎడమవైపు ఒక పెద్ద పులి ఉండటం కనిపించింది. మరుక్షణమే ఎడమవైపున్న పులి స్థానంలో దేవీమూర్తి ఉన్నది. అది చూడగానే మాధవనాథులు జాబులో వ్రాసిన విషయం గుర్తొచ్చింది. దోమతెర లోపల సాయిబాబా చిలిం త్రాగుతూ కూర్చుని ఉన్నారు. ఆయన ఎదుట మాధవనాథులు కూర్చుని విచిత్రమైన పారవశ్యంతో అటూ ఇటూ ఊగిపోతున్నారు. ఈ దృశ్యం చాలాసేపు కొనసాగింది. అది స్వప్నమేమోనని రేగే శంకించాడుగానీ, చూచుకుంటే మెలకువే! ఆ జాబుతో మాధవనాథులు సూక్ష్మరూపంలో సాయిని దర్శించారు. వారి జాబుకు సమాధానంగా దేవీ దర్శనం, తమ సాన్నిధ్యానందం కూడా వారికి ప్రసాదించారు శ్రీసాయి.
శ్రీసాయిబాబా, శ్రీరామకృష్ణ పరమహంస ఒకే అంశలో అవతరించారని, వారిద్దరూ ఒకటేనని రేగే నమ్మకం. అతని నమ్మకానికి నిదర్శనమైన ఒక సంఘటన 1928వ సంవత్సరంలో జరిగింది. రేగే దక్షిణేశ్వరం వెళ్లి, అక్కడ చూడదగ్గ ప్రదేశాలను, దేవాలయాలను చూడటానికి ఒక గైడుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గైడు రామకృష్ణ పరమహంస పూజించిన కాళీమాత విగ్రహాన్ని, ఇంకా ఇతర మూర్తులను చూపించాడు. రామకృష్ణ పరమహంస ఆడుకొన్న ‘రాంలాల్’(బాల రాముడు) విగ్రహాన్ని చూపించమని రేగే అతన్ని అడిగాడు. అతను రేగేనొక దేవాలయానికి తీసుకుని వెళ్ళి, అక్కడున్న ఒక పెద్ద విగ్రహాన్ని చూపించి, "అదే రాంలాల్ విగ్రహం" అని చెప్పాడు. పరమహంస చరిత్రను క్షుణ్ణంగా చదివిన రేగే విస్తుబోతూ, "అది పరమహంస ఆడుకున్న ‘రాంలాల్’ చిన్న విగ్రహం అవడానికి ఆస్కారం లేద"ని అన్నాడు. దానికతను, "స్థానికుడనైన నాకు ఇక్కడున్న ప్రదేశాలు, వాటి చరిత్ర క్షుణ్ణంగా తెలుసు. క్రొత్తవారైన మీకెలా తెలుస్తాయి?" అని అన్నాడు. అందుకు రేగే, "నేను మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించండి" అని అన్నాడు.
అంతలో అనుకోకుండా ఒక పూజారి అక్కడికి వచ్చి, "దక్కన్ నుండి వచ్చింది మీరేనా?" అని రేగేను ప్రశ్నించాడు. అందుకు రేగే "అవున"ని బదులిచ్చాడు. అప్పుడతను, "కాళీ మందిరాన్ని, సమీపంలో ఉన్న ఇతర దేవతామూర్తులను దగ్గరుండి చూపించి, వాటి విశేషాలను కూడా వివరించి చెబుతాన"ని చెప్పాడు. "నేనవన్నీ ఇప్పుడే చూశాన"ని రేగే బదులిచ్చాడు. అతను మళ్ళీ ఆ ప్రదేశాలు చూడమని పట్టుబట్టి, అందుకు తనకు డబ్బేమీ ఇవ్వనవసరం లేదని చెప్పి, గతరాత్రి తనకు వచ్చిన కల గురించి రేగేతో చెప్పాడు. ఆ కలలో మరుసటిరోజు దక్కన్ నుండి ఒక భక్తుడు వస్తున్నాడని, దగ్గరుండి అతనికి అన్ని దేవతామూర్తులను చూపించి, పూజించేందుకు సహాయం చేయమని తనకి ఆదేశం అందిందని చెప్పి, తనతో రమ్మని కోరాడు. రేగే ఇక మారుమాట్లాడక అతనితో వెళ్ళాడు. పూజారి రేగేను వెంటబెట్టుకుని కాళీమాత ఆలయ గర్భగుడి లోనికి తీసుకుని వెళ్లి, ఆ దేవతను తాకి నచ్చిన విధంగా పూజించుకునేలా సహాయం చేశాడు. తరువాత అతను 'రాంలాల్'ను చూపిస్తానన్నాడు. "గైడు ఒక పెద్ద విగ్రహాన్ని చూపించి, ఇదే ‘రాంలాల్’ అని చెప్పాడ"ని రేగే అతనితో చెప్పాడు. పూజారి, "గైడు మిమ్మల్ని మోసం చేశాడ"ని చెప్పి, పరమహంస ఆడుకున్న ‘రాంలాల్' చిన్న విగ్రహాన్ని తెచ్చి రేగే ఒడిలో పెట్టాడు. రేగే ఆశించిన దానికంటే ఎక్కువగానే బాబా అతనికి ప్రసాదించారు. బాబా, రామకృష్ణ పరమహంస వేరు కాదు, ఒక్కరేనని రేగేకు అవగతమైంది.
బి.వి.నరసింహస్వామి సిసలైన సత్పురుషుని కోసం అన్వేషిస్తూ, 'సాయిబాబా నిజమైన సత్పురుషులు మాత్రమే కాదు, శిరిడీలో నడయాడిన దైవమ’న్న నమ్మకాన్ని పొంది శిరిడీ చేరుకున్నారు. రేగే ఆయనను సాదరంగా ఆహ్వానించి తన మిత్రుడైన పి.ఆర్.అవస్తేకి పరిచయం చేశాడు. రేగే, అవస్తేల సహకారంతో బి.వి.నరసింహస్వామి అప్పటికి సజీవులై ఉన్న బాబా అంకిత భక్తులందరినీ వ్యక్తిగతంగా కలిసి బాబాతో వారికున్న అనుభవాలను సేకరించారు. ఆ విధంగా సేకరించిన అనుభవాలను ఆయన ఆంగ్లంలో గ్రంథస్తం చేసి సాయిభక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయన ‘సాయిసుధ’ అనే పత్రికను కూడా ప్రారంభించారు. మద్రాసులోని ‘అఖిల భారత సాయి సమాజ్’ (All India Sai Samaj) స్థాపనకు ముఖ్యకారకులు కూడా ఆయనే.
శ్రీసాయిబాబా భౌతికదేహంతో ఉండగా వారిని దర్శించనప్పటికీ బాబా తత్త్వాన్ని, బోధనలను, అద్భుత మహిమలను భారతదేశమంతటా, ముఖ్యంగా దక్షిణాదిలో విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకుని రావడంలో, దేశవిదేశాలలో బాబా కీర్తిని ప్రసిద్ధ పరచడంలో బి.వి.నరసింహస్వామి కీలకపాత్ర పోషించారు. ఆయన చాలా గొప్ప సాయిభక్తులు. తన చివరిక్షణం వరకు ఎంతగానో సాయి సేవ చేసిన ఆయన 1956వ సంవత్సరంలో మరణించారు. పది సంవత్సరాల తరువాత 1966లో సమాధిమందిరంలో బి.వి.నరసింహస్వామి చిత్రపటాన్ని రేగే ఆవిష్కరించాడు. రెండేళ్ల తరువాత 1968లో అక్టోబరు 30న రేగే తుదిశ్వాస విడిచి సాయిలో ఐక్యమయ్యాడు.
Source: http://www.saiamrithadhara.com/mahabhakthas/m.b.rege.html
http://bonjanrao.blogspot.com/2012/10/j-u-s-t-i-c-e-m-b-r-e-g-e.html
Devotees' Experiences of Sri Sai Baba Sri.B.V.Narasimha Swamiji
Om Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
OM SAIRAM JAI SAIRAM
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sai Ram Jai Sai Master
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏