సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 31వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం: 
  • పుట్టినరోజునాడు లభించిన బాబా దర్శనం

చెన్నైనుండి సాయిబంధువు 'శరణ్య సంబంధం' తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు:


నేను చిన్ననాటినుండి సాయిభక్తురాలిని. నేను చెన్నై నివాసిని. నేను తరచుగా మైలాపూరులో ఉన్న బాబా మందిరానికి వెళుతూ ఉండేదాన్ని. ఆ మందిరం అంటే నాకెంతో ఇష్టం. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా నా పుట్టినరోజునాడు అక్కడికి వెళ్లి పేదలకు అన్నదానం గానీ, ఇంకేదైనా కానీ దానం చేస్తూ ఉంటాను. 2009వ సంవత్సరంలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే నిమిత్తం చెన్నైనుండి దూరంగా ఉన్నాను. నా కాలేజీ తిరుచ్చి అవుట్‌స్కర్ట్స్‌లో తిరుచ్చి-తంజావూరు హైవేలో ఉండేది. అక్కడ వాతావరణం చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. ఏదైనా స్టేషనరీ వస్తువులు కావాలంటే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బిహెచ్‌ఇఎల్ టౌన్‌షిప్‌కి వెళ్లాల్సి వుండేది. 2009 జూలై 26న నా పుట్టినరోజు వచ్చింది. కానీ ఆరోజు నేను తిరుచ్చిలో ఉన్నందున మైలాపూర్ బాబా మందిరానికి వెళ్లలేకపోతున్నందుకు చాలా దిగులుగా ఉన్నాను. ఈ సంవత్సరం నేను బాబా దర్శనం పొందలేకపోతున్నాను, నేను చాలా దురదృష్టవంతురాలినని నా స్నేహితులతో చెప్పాను. మధ్యాహ్నానికి చెన్నైనుండి మా అమ్మ, మరికొందరు బంధువులు నన్ను చూడడానికి వచ్చారు. వాళ్లు దగ్గర్లో ఉన్న ఏదైనా మందిరానికి నన్ను తీసుకుని వెళ్తామని అన్నారు. నేను ఇక్కడ అటువంటివి ఏమీ ఉండవని చెప్పాను. కానీ వాళ్లు, "పద, దరిదాపుల్లో ఏదో ఒక మందిరం ఉంటుంది, చూద్దాం" అని బలవంతం చేశారు. సరేనని నేను వాళ్లతోపాటు బయలుదేరాను. దారిలో, "ఇక్కడ దగ్గరలో ఏదైనా మందిరం ఉందా?" అని వాళ్ళని వీళ్ళని అడుగుతూ వెళ్తుంటే, ఒక వ్యక్తి దగ్గరలో దుర్గాదేవి గుడి ఉందని దారి చూపించాడు. అది కేవలం 15 నిమిషాలు ప్రయాణం చేసేంత దూరంలో ఉంది. అక్కడి వాతావరణం చాలా ఏకాంతంగా ఉంది. "పుట్టినరోజునాడు బాబా దర్శనం చేసుకోలేకపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. మీరు లోపలకు వెళ్లి దర్శించుకుని రండి, నేను కారులోనే వేచి ఉంటాన"ని చెప్పాను. మా అమ్మ దర్శనం చేసుకుని వచ్చి పూలదుకాణం వద్ద ఉన్న చెప్పులు వేసుకోబోతుండగా ఆ పూలమ్మే అతను, "దగ్గరలో ఇంకో గుడి ఉంది, అక్కడికి వెళ్లి రండి" అన్నాడు. మా అమ్మ నా దగ్గరకు వచ్చి నన్ను కారు దిగి రమ్మంది. నేను సంశయిస్తుంటే, "కనీసం గుడి దగ్గర వరకు రా!" అంది. నేను కాస్త అయిష్టంగానే  కారు దిగి అమ్మతోపాటు గుడి వరకు వెళ్ళాను. ప్రవేశద్వారం వద్దనుండి బాబా విగ్రహం చూసి ఆశ్చర్యపోయాను. అది నా సాయిబాబా గుడి. నా కళ్ళనుండి కన్నీళ్లు వచ్చేసాయి, ఆపుకుందామన్నా ఆగట్లేదు. అది ఒక అందమైన అనుభూతి! దానిని నేను పదాలలో వర్ణించలేను. వెంటనే బాబా పాదాలపై వాలిపోయి, "నా పుట్టినరోజు బాబా, నన్ను ఆశీర్వదించండి!" అని వేడుకున్నాను. అక్కడ దగ్గరలోనే శివ, విష్ణు మందిరాలు కూడా ఉన్నాయి. కానీ ఆ పూలమ్మే అతను మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపాడు? ఎందుకు ఈ మందిరం గురించి మాత్రమే చెప్పాడు? అమ్మ "కనీసం మందిరం వరకైనా రా!" అని ఎందుకు నన్ను బలవంతపెట్టింది? వీటన్నిటికీ నేను సమాధానంగా ఏమీ చెప్పలేను. కానీ ఇదంతా ఖచ్చితంగా నా సాయిబాబా లీల. ఆయన అదృశ్యంగా అన్నీ నడుపుతూ ఉంటారు. ఈ అనుభవం జరిగిన తర్వాత నేను తిరుచ్చిలో ఉన్నన్నాళ్ళు ఈ మందిరానికి వెళ్తుండేదాన్ని. వెళ్లినప్పుడల్లా పుట్టినరోజునాడు నాకు బాబా దర్శనం చేయించిన ఆ పూలదుకాణం అతనిపట్ల కృతజ్ఞతాభావంతో అతని వద్ద ఒక కమలం తీసుకుని బాబాకు సమర్పించుకునేదాన్ని. చదువుతున్న మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, సాయిబాబా మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. మీరు ఏ స్థితిలో ఉన్నా ఆయన మీకు అండగా ఉంటారు. బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ.. 

ఓం సాయిరామ్!

సాయిభక్తుల అనుభవమాలిక 30వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం: 
  • నమ్మినంతనే బాబా నడిపించారు

శ్రీమతి గీత తనను శ్రీసాయికి అంకిత భక్తురాలిగా మార్చిన బాబా లీలను మనతో పంచుకుంటున్నారు.

మానవుడు తను పూర్వజన్మలో చేసిన చెడు కర్మల ఫలితాలను ఈ జన్మలో కష్టాల రూపంలో అనుభవిస్తాడని పెద్దలంటారు. ఆ కష్టం మా కుటుంబంలోకి మా అమ్మాయి అనారోగ్యం రూపంలో వచ్చింది. మా పాపకి 9ఏళ్ళు వచ్చేవరకు ఎంతో చురుకుగానూ, అన్నింటిలో ఎంతో ఉన్నతంగానూ రాణించేది. కానీ, తన పదవ ఏట ఒకసారి క్రిందపడి తన ఎడమ మోచేయి ఫ్రాక్చర్ అయింది. రెండు సర్జరీలు జరిగాయి. సర్జరీల తర్వాత అంతా బాగవుతుందని అందరం అనుకున్నాము. కానీ అక్కడే సమస్య మొదలైంది. మూడు నెలల్లో తన కీళ్ళన్నీ వాచిపోయాయి. మేము ఆసియాలోనే ఎంతో పేరున్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర తనకు ట్రీట్‌మెంట్ ఇప్పించాము. కానీ ఐదు సంవత్సరాల చికిత్స తరువాత కూడా తన బాధ తగ్గలేదు సరికదా పరిస్థితి ఇంకా విషమించింది. దాంతో తను తన మోకాళ్లను వంచితే గానీ నడవలేకపోయేది. మిగతా పిల్లలలాగా నేలమీద కూర్చోలేకపోయేది. దాంతో తను చదువు మీద కూడా శ్రద్ధపెట్టలేకపోయేది.

ఇలా ఉండగా ఒకరోజు నా స్నేహితురాలు నాకు 'శ్రీసాయిసచ్చరిత్ర' పుస్తకం ఇచ్చింది. కానీ నాకు బాబాను నమ్మాలని అనిపించక ఆ పుస్తకం చదవకుండా అలమరాలో పెట్టేసాను. నేను నా ఇష్టదైవమైన గురువాయురప్పన్ నే ఈ కష్టాల నుండి గట్టెక్కించమని ప్రార్థించసాగాను. ఇంతలో నా స్నేహితురాలి తండ్రి ఒకరోజు కిందపడి స్పృహకోల్పోయారు. దాంతో ఆయన్ను ఒక వారంరోజులపైనే హాస్పిటల్లో ఉంచారు. సీటీ స్కాన్ చేసిన డాక్టర్లు ఆయనకు బ్రెయిన్లో ట్యూమర్ ఉందని, దానికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు నా స్నేహితురాలు, తన కుటుంబసభ్యులంతా కలిసి ఆయన్ను కాపాడమని బాబాను ప్రార్థిస్తూ రాత్రి పగలు సాయి సచ్చరిత్ర పారాయణ చేశారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడితే శిరిడీకి వస్తామని బాబాకు మొక్కుకున్నారు. ఆయన స్పృహలో లేని స్థితిలో వున్నప్పుడు నేను కూడా ఆయనను చూడడానికి వెళ్ళాను. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన ఆరోగ్యం మెరుగుపడసాగింది. ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత డాక్టర్లు ఇంకోసారి సీటీ స్కాన్ చేసి, బ్రెయిన్ ట్యూమర్ ఉన్న లక్షణాలేవీ లేవని, మామూలు మందులతోనే ఆయన ఆరోగ్యం బాగవుతుందని చెప్పారు. ఆ తర్వాత నా స్నేహితురాలు నావద్దకు వచ్చి, తన తండ్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని, ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని, ఇదంతా బాబా తమ కుటుంబంపై చూపిన అనుగ్రహమేనని ఎంతో ఆనందంగా చెప్పింది. ఆ తరువాత నేను సాయిసచ్చరిత్ర చదవడం ప్రారంభించాను. పారాయణ పూర్తికాబోతుండగా మావారి స్నేహితుడైన గోపాలకృష్ణన్ మమ్మల్ని త్రివేండ్రంలో ఉన్న డాక్టర్ హరిహరన్ దగ్గరకు మా అమ్మాయిని తీసుకెళ్ళమని చెప్పారు. అప్పుడు నేను, ఈ డాక్టర్ ఇచ్చే ట్రీట్‌మెంట్‌తో మా పాప ఆరోగ్యం మెరుగుపడితే శిరిడీ వస్తామని బాబాకు మొక్కుకున్నాను. డాక్టర్ని సంప్రదించేముందు బాబాయే ఆ డాక్టర్ రూపంలో ఉన్నారని నాకు అనిపించింది. ఆశ్చర్యంగా, కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు, "నీకు ఏ దేవుడంటే బాగా ఇష్టం?" అని ఆ డాక్టర్ మా పాపని అడిగారు. తను, "నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం" అని చెప్పింది. డాక్టర్ ఎంతో సంతోషించారు, ఎందుకంటే ఆయన కూడా బాబా భక్తుడే. ఆయన మా పాపతో, బాబాపై నమ్మకాన్ని వదలద్దనీ, బాబా పాదాలు గట్టిగా పట్టుకోమనీ, ఆ కరుణామూర్తి తనను అనుగ్రహిస్తారనీ చెప్పారు. తర్వాత ఒక మందు ఇచ్చి, ఒక వారంలో పాప పరిస్థితి మెరుగవుతుందనీ, కానీ మరో 3 నెలలపాటు 2 మందులను మాత్రం (ఐరన్ టాబ్లెట్ + ఇంకొక టాబ్లెట్) క్రమం తప్పకుండా వాడాలనీ సూచించారు.

ఆ టాబ్లెట్ వాడటం మొదలుపెట్టిన మూడు రోజుల్లో మా పాప మామూలుగా నడవడం ప్రారంభించింది. అందరం ఎంతో సంతోషించాము. తర్వాత మేము శిరిడీకి వెళ్ళాము. ద్వారకామాయిలో మా పాప తన కాళ్ళని మడిచి నేలపై కూర్చోగలిగింది. నేను ఆనందంతో కన్నీటిపర్యంతమయ్యాను. మా పాప ద్వారకామాయిలో కూర్చున్నప్పటినుంచి తన కష్టాలు తీరిపోయాయని నాకు అనిపించింది. మేము చేసే అన్ని పనులలోనూ బాబా ఎప్పుడూ మా కుటుంబానికి తోడుగా ఉన్నారని నా నమ్మకం.

ఈమధ్య నేను మైలాపూర్(చెన్నె) లోని సాయిబాబా మందిరానికి వెళ్ళినప్పుడు కొంతమంది కొన్ని పాంప్లెట్లని అందరికీ పంచుతున్నారు. అందులో, ఒక భక్తుని ఇంటికి ఒక పాము వచ్చిందని, బాబాయే ఆ పాము రూపంలో వచ్చారని, ఈ వార్తని ఎవరైనా అందరికీ తెలియచేయకపోతే (ఇలా కాగితాలు పంచి) బాబా వాళ్లను శిక్షిస్తారని, వాళ్లు జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తారని ఉన్నది. ఎవరైనా అద్భుతమైన బాబా లీలలను అందరికీ పంచాలనుకుంటే, చక్కగా సాయి సచ్చరిత్ర పుస్తకం గానీ, బాబా లీలలను గానీ, లైఫ్ ఆఫ్ సాయిబాబా పుస్తకంగానీ పంచితే బాగుంటుందని నా అభిప్రాయం. బాబాయే తన భక్తులను తన వద్దకు రప్పించుకుంటారు. బాబా ఎవరినీ శిక్షించరు. తన భక్తుల క్షేమంకోసం ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో బాబాయే నిర్ణయిస్తారు. మనం శ్రద్ధ, సబూరీలతో ఉంటే చాలు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


సాయిభక్తుల అనుభవమాలిక 29వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం: 
  • చిన్న ప్రార్థనకు సైతం పలికే ఇలవేల్పు శ్రీసాయి

ఓం సాయిరాం. నా పేరు లక్ష్మి. మాది మచిలీపట్నం. ఎందరో సాటి సాయిబంధువులు సాయితో తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటే నాకు కూడా నా అనుభవాలను అందరితో పంచుకోవాలని ఆశ కలిగింది. 1991 నుండి శ్రీసాయితో నాకు అనుబంధం ఉంది. ఆయన నాకెన్నో అనుభవాలు ఇచ్చారు. వాటిలో కొన్నింటిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. మచిలీపట్నం దగ్గర ఉన్న గూడూరు నివాసి అయిన మా మావయ్యగారు శ్రీ రతన్ జీ గారు 'సాయిమహారాజ్' అనే పుస్తకం ప్రచురించేవాళ్లు. ఆయన ఒకసారి నాతో, "నీకు ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా లేక బాధ కలిగినా మనసారా బాబాని తలచుకో, తక్షణం ఆయన నీకు రక్షణనిస్తారు" అని చెప్పారు.

మేము అప్పట్లో ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం. మాకు ఒక చిన్నపాప ఉంది. ఒకరోజు రాత్రి కరెంటు పోయింది. రాత్రంతా పవర్ రాదన్నారు. నేను "పాప ఎలా పడుకుంటుందో ఏమిటో" అని చాలా భయపడ్డాను. అంతలోనే తను ఏడవటం మొదలుపెట్టింది. తననెలా నిద్రపుచ్చాలో అర్థం కాలేదు. ఆ సమయంలో రతన్ జీ మావయ్యగారు చెప్పిన మాట గుర్తుకు వచ్చి, "సాయి, సాయి" అనుకుంటూ కూర్చున్నాను. కొద్దిక్షణాల్లో రేపటివరకు రాదన్న పవర్ వచ్చేసింది. నాకు చాలా సంతోషం కలిగింది. మావయ్యగారికి ఫోన్ చేసి నా సంతోషాన్ని పంచుకున్నాను. ఆయన సాయిమహారాజ్ పుస్తకంలో నా అనుభవాన్ని ప్రింట్ చేసారు. 

నాలుగు రోజుల క్రిందట జరిగిన మరో చిన్న అనుభవాన్ని కూడా పంచుకుంటాను. 

ఈరోజు(2019, ఏప్రిల్ 24) ఉదయాన మా ఇంటి ఆవరణలోకి ఒక పిల్లి నాలుగు పిల్లలని తెచ్చి గోడకున్న కన్నంలో దాచిపెట్టింది. అది చూసిన మావారు చిరాకుగా వాటిని బయటకు తోలి, మళ్ళీ అక్కడ చేరకుండా ఆ కన్నంలో రాళ్ళు పెట్టారు. అయితే ఆ కన్నంలో ఒక పిల్లి పిల్ల ఉండిపోయిందేమోననే అనుమానంతో నాకు భయం, పాపభీతి కలిగాయి. దానితో చాలా టెన్షన్ పడ్డాను. సాయంత్రానికి తల్లిపిల్లి ఏడుస్తూ తిరుగుతుండటం కనిపించింది. దాన్నలా చూసి నాకు చాలా బాధగా అనిపించింది. చాలాసేపు 'పాపం పిల్లలు కదా' అని దిగులుపడి బాబాకు నమస్కరించుకుని, "పిల్లలు కనిపించేలా చేయి తండ్రీ, దాని పిల్లలు దానికి కనిపిస్తే దక్షిణ సమర్పించుకుంటాను" అని ప్రార్థించాను. ఆశ్చర్యం! గంట తరువాత తల్లిపిల్లి కేరింతలు కొడుతూ కనిపించింది. ఏమిటా అని చూస్తే దాని నాలుగు పిల్లలు పాలు త్రాగుతూ కనిపించాయి. అది చూసి నా మనసుకెంతో సంతోషంగా అనిపించింది. వెంటనే, "చాలా చాలా కృతజ్ఞతలు తండ్రీ!" అని బాబాకు చెప్పుకున్నాను. నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని వెంటనే బ్లాగుకు పంపించాను.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


సాయిభక్తుల అనుభవమాలిక 28వ భాగం....


ఈ భాగంలో అనుభవం: 
  • శ్రీసాయి కృప

పేరు వెల్లడించని సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

నేను గత తొమ్మిదేళ్లుగా బాబాని పూజిస్తున్నాను. ఆయన లేని నా జీవితం పరిపూర్ణం కాదు. మనం ఎలా ఉంటామంటే, ఆయన మన వంద కోరికలు తీర్చి, ఏదో ఒక కోరిక తీర్చకపోతే మనం ఆయనపై కోపగించుకుని అలుగుతాం. ఆయనను పూజించడం మానేస్తాం. కానీ ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టరు. నేను కూడా ఒకానొక కఠిన పరిస్థితిలో బాబాపై అలిగి ఆయనకు దూరంగా ఉన్నాను. కానీ తర్వాత నా తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాను. బాబా నాకు ఎంతగానో సహాయం చేశారు. నిజానికి మా నాన్నగారినుండి నాకు ఆర్థిక సహాయం లేనప్పటికీ నేను ఇంజనీరింగ్ పూర్తిచేయడానికి బాబా ఎన్నోవిధాల సహాయం చేశారు. ఆయన ఆశీస్సులతో  మంచి పర్సెంటేజ్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడమే కాకుండా కాలేజీ ప్లేస్‌మెంట్ లో ఉద్యోగం కూడా వచ్చింది. కానీ కొన్ని కారణాలవలన నేను ఉద్యోగాన్ని వదిలేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. బాబా ఇచ్చిన కొన్ని చిన్న చిన్న అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

1) 2018లో గురుపౌర్ణమి ముందురోజు నా ఫ్రెండుతో నేను మాటల సందర్భంలో, "గురుపౌర్ణమినాడు ఎవరైతే శిరిడీ దర్శిస్తారో వాళ్ళు నిజంగా బాబా ఆశీస్సులు పొందిన ధన్యాత్ములు" అన్నాను. అదేరోజు రాత్రి నాకొక కల వచ్చింది. కలలో నేను శిరిడీ సమాధిమందిరంలో హారతికి హాజరైవున్నాను. నేను సాయిబాబాకు ఎదురుగా నిల్చుని ఆయనను చాలా దగ్గరగా చూస్తున్నాను. హారతి తర్వాత అక్కడ పూజారి అందరికీ ప్రసాదం పంచుతూ నా చేతిలో కూడా ప్రసాదం పెట్టారు. నేను పొందిన ఆనందాన్ని, అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నాను. నేను పొందిన ఆ ఆనందం అన్నిటికన్నా ఎంతో అద్భుతమైనది. బాబాకు మన చిన్న చిన్న కోరికలతో సహా అన్నీ తెలుసు. ఆయన వాటిని నెరవేర్చి మనల్ని సంతృప్తి పరుస్తారు.

2) ఉద్యోగం విడిచిపెట్టాక, ఒకరోజు నేను సాయిబాబా సూక్తులు చదువుతున్నాను. అప్పుడే నాకు మొదటిసారి 'శ్రీసాయిసచ్చరిత్ర' గురించి తెలిసింది. వెంటనే ఆతృతగా ఇంటర్నెట్‌లో వెతికి సాఫ్ట్ కాపీ సంపాదించి చదవడం మొదలుపెట్టాను. మరుసటిరోజే నాకు   ట్యూషన్స్ చెప్పే ఉద్యోగాన్ని బాబా చూపించారు. ఆవిధంగా నేను బాబాను ఏమీ అడక్కుండానే నా ఆర్థిక సమస్యలు తీరిపోయాయి.

3) నా ఫ్రెండ్ తను చేస్తున్న ప్రాజెక్ట్ కంప్లీట్ కావడంతో ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. తను నోటీసు పీరియడ్‌లో ఉన్నాడు. అప్పుడు నేను తనకి, "సాయి సచ్చరిత్ర పారాయణ చేయమ"ని చెప్పాను. నేను చెప్పినట్లుగానే తను రెండుసార్లు సచ్చరిత్ర పారాయణ చేశాడు. ఇక రెండురోజుల్లో ఉద్యోగం వదిలిపెట్టాల్సి ఉందనగా ఒక పెద్ద కంపెనీలో 100% ఇంక్రిమెంటుతో తనకి చాలా మంచి ఉద్యోగం వచ్చింది.

4) నేనెప్పుడూ భోజనం చేసే ముందు బాబాకి సమర్పించి తరువాత తింటాను. అయితే ఒకరోజు ఏవో పనులలో బిజీగా ఉండి బాబాకి సమర్పించడం మర్చిపోయాను. వెంటనే నాకు ఎక్కిళ్ళు మొదలయ్యాయి. మరుక్షణం సాయిబాబాను తలుచుకున్నాను. అంతే! నన్ను నమ్మండి, ఒక్కసారి కూడా ఎక్కిళ్లు రాలేదు. బాబాను క్షమాపణ వేడుకున్నాను.

5) ఒకరోజు మానసిక ఒత్తిడి వలన రాత్రి 1:33 అవుతున్నా నాకు నిద్రపట్టక సాయిబాబా బ్లాగు చదువుతున్నాను. హఠాత్తుగా ఒక మెసేజ్ చూసి ఆశ్చర్యపోయాను. "నిద్రలేని రాత్రులు గడపకు. బిడ్డా! వెళ్లి పడుకో! నన్ను తలచుకుని నిద్రపో! అన్నీ సర్దుకుంటాయి. నాయందు విశ్వాసముంచు!" చూశారా, బాబా ఎంత దయార్ద్రహృదయులో!

ఇలా ఎన్నెన్నో అనుభవాలు. ఆయన తన భక్తులకు రకరకాల మార్గాల ద్వారా సహాయం చేస్తూ ఉంటారు. తన భక్తులు ఎక్కడున్నా, ఏ ఆపదలో ఉన్నా తక్షణం బాబా వారి చెంతనే వుండి రక్షణ ఇస్తారు. 

"బాబా! మీకన్నీ తెలుసు. నేను కష్టమైన రోజులని గడుపుతున్నాను. ఈ కష్టాలను ఎదుర్కోవడానికి తగిన శక్తినివ్వండి. మీరు నాతో ఉన్నారని నాకు తెలుసు. మీరు తోడుగా ఉంటే ఎంత పెద్ద కష్టమైనా అది అతిచిన్నదైపోతుంది. నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి. లవ్ యు బాబా! మా అందరినీ ఆశీర్వదించండి". బాబాకు ఏది ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. శ్రద్ధ, సహనం కలిగి ఉండటమే మనం చేయాల్సింది.

సాయిభక్తుల అనుభవమాలిక 27వ భాగం....


ఈ భాగంలో అనుభవం : 
  • బాబా కోపంగా చూసి కడుపులో ఉన్న రాళ్లను తొలగించిన లీల.


సాయిభక్తుడు సురేష్ తుకారాం తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

నాకు ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉండేది. 2007లో ఒకసారి నా దగ్గరకి శిరిడీ వెళ్ళడానికి 20 మంది ఒక గ్రూపుగా వచ్చారు. కానీ ఏదో కారణం వలన వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్లిపోయారు. దానితో ఆరోజు నేను శిరిడీ వెళ్లవలసిన ట్రిప్ రద్దయ్యింది. నా మనసొప్పక 'పోనీ నేనొక్కడినే శిరిడీ వెళ్ళివస్తా'నంటే నా భార్య అభ్యంతరం చెప్పింది. కానీ నేను ఊరుకోలేదు. తనని ఒప్పించి మా 3 సంవత్సరాల బాబును, నా భార్యను తీసుకుని శిరిడీకి ప్రయాణమయ్యాను. మేము ముగ్గురం దాదర్ నుంచి శిరిడీకి బయలుదేరాం. నాకప్పటికే 6 నెలల ముందు నుండి కడుపునొప్పి వుంది. డాక్టర్ దగ్గరకి వెళితే కొన్ని టెస్టులు చేయించమన్నారు. టెస్టులు చేస్తే, కడుపులో రాళ్ళు (చిన్నవి) ఉన్నాయని తెలిసి, డాక్టరు కొన్ని రోజుల తరువాత ఆపరేషన్ చేద్దామన్నారు. మేము రైల్లో కూర్చున్న కాసేపటికి నాకు కడుపునొప్పి మొదలై, కూర్చోవడం కూడా కష్టంగా అనిపించింది. రానురాను నొప్పి ఎక్కువైంది. అలాగే మొత్తానికి ఎలాగో శిరిడీ చేరుకున్నాము. నేను బ్యాగు కూడా ఎత్తలేని పరిస్థితిలో వున్నాను. మెల్లగా ఎలాగో బ్యాగు పట్టుకుని, రూమ్ తీసుకుని త్వరగా స్నానాలు ముగించుకుని నేను, నా భార్య, మా బాబు వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాం. తరువాత నా భార్య, "బాబా మహాప్రసాదం తిని చాలా సంవత్సరాలు అయింది, తిని వెళ్దా"మనడంతో ప్రసాదాలయానికి వెళ్లి మహాప్రసాదం తిని రూముకి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. కడుపులో నొప్పి అలానే వుంది. సాయంత్రం ద్వారకామాయికి వెళ్ళి కూర్చున్నాం. బాబా ఎప్పుడూ కూర్చునే రాయి దగ్గరకి వెళ్ళి, "బాబా! నా కడుపునొప్పి తగ్గడం లేదు" అనుకుంటూ బాబా పటంవైపు చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. బాబా గడ్డం, మీసాలు పెద్దవిగా అయినట్లు అనిపించింది. బాబా నావైపు కోపంగా చూస్తున్నారు. నాకు భయమేసి, "బాబా! నేనింక ఇక్కడికి రాను" అని అనుకుంటూ బయటికి వచ్చేసాము. నా భార్య లెండీబాగ్ వెళ్దామని అంటే, నేను, "వద్దు, నాకు టాయిలెట్ వస్తుంది, రూముకు వెళ్దామ"ని వెంటనే రూముకు వచ్చేశాము. నేను టాయిలెట్‌కి వెళ్దామని వెళ్తే టాయిలెట్‌లో రాళ్ళు పడిపోతున్నట్లనిపించింది. ఇంతకుముందు టాయిలెట్‌కి వెళ్ళినప్పుడు చాలా నొప్పి వేసేది. ఇప్పుడసలు నొప్పివేయడం లేదు. "హమ్మయ్య! ఈ నొప్పినుంచి విముక్తి బాబానే ఇచ్చారు" అనుకున్నాను. ఆరోజు నాకు మంచి నిద్ర పట్టింది. పొద్దున్నే లేచి బాబాను క్షమించమని అడిగాను. నాకప్పుడు శ్యామాను పాము కరిచిన కథ గుర్తుకొచ్చింది. ఆ కథలో బాబా శ్యామాని పైకెక్కవద్దని కోపగించుకుంటారు. కానీ నిజానికి ఆయన పైకెక్కవద్దని కసిరినది పాము విషాన్నే! అదేవిధంగా ఇప్పుడు బాబా కోపంగా చూసినది నన్ను కాదని, నా శరీరంలో ఉన్న రాళ్లనని నాకర్థమయ్యింది. "ఇలాగే మీ కృపాదృష్టి ఎప్పుడూ మా మీద ఉండనీ బాబా!" అనుకుంటూ ఇంటిదారి పట్టాము.

తెలుగు అనువాదం: శ్రీమతి మాధవి.

సాయిభక్తుడు తమ్మాజీ


తమ్మాజీ శిరిడీ నివాసి. యుక్తవయస్సులో ఉన్నప్పుడు కుస్తీలో ఖ్యాతిగాంచాలన్నది అతని ఆశయంగా ఉండేది. కానీ అతని తల్లిదండ్రులు ఆర్థికంగా పేదవారైనందున పాలు వంటి పౌష్ఠికాహారం అతనికి అందించలేకపోయేవారు. అటువంటి ఆహారం కఠినమైన శ్రమతో కూడుకున్న కుస్తీ పోటీలకు చాలా అవసరం. ఏది ఏమైనా తన లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉన్న అతడు, "ఎంతోమంది భక్తులకు బాబా చాలా డబ్బులు ఇస్తారు. నేను కూడా ఆయన దగ్గరకు వెళ్లి సహాయం చేయమని అడుగుతాను" అని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే బాబా దగ్గరకు వెళ్లి, గొప్ప మల్లయోధుడు కావాలన్న తన కోరికను చెప్పాడు. బాబా ఓపికగా అతను చెప్పినదంతా విని, "యోగుల, సాధువుల ధనం మీద ఆధారపడటం మంచిది కాదు. నీకు కొంత పొలం ఉంది కదా, పోయి దానిని జాగ్రత్తగా దున్ను. నీ పొలంలో కుండనిండా ఇత్తడి నాణాలున్నాయి" అన్నారు. బాబా మాటలను ప్రమాణంగా తీసుకుని, మర్నాడే తమ్మాజీ తన పొలాన్ని చాలా శ్రద్ధగా దున్నడం మొదలుపెట్టాడు. బాబా ఆశీస్సులతో తాను ఖచ్చితంగా చేస్తున్న పనిలో విజయం సాధిస్తానని తనకి తెలుసు. అందువలన మల్లయోధుడు కావాలన్న తన ఆలోచనను వదిలిపెట్టాడు. అయితే చెప్పినంత తేలిక కాదు చేయడం.

తనకు చాలా కొంచెం పొలం మాత్రమే మిగిలివుందని తమ్మాజీ గ్రహించాడు. ఋణదాతలు చాలావరకు తమ స్థలాన్ని జప్తు చేసుకున్నారు. ఆనాటి ప్రజలు చాలామంది బ్రిటిష్ పరిపాలన అందరికీ న్యాయపరమైనదని అనుకునేవారు. అయితే ఋణదాతలు రైతుల నిరక్షరాస్యతను ఆసరాగా తీసుకుని ఎక్కువ భూమికి సంతకాలు చేయించుకునేవారు. ఆవిధంగా వాళ్ళు విస్తారంగా భూములను ఆక్రమించుకునేవారు. అందువలన చాలీచాలని డబ్బులకోసం రైతులు తమ సొంత భూములలోనే పనిచేయాల్సి వచ్చేది. ఇదంతా గమనించిన తమ్మాజీ, రైతులు తెల్లవారింది మొదలు చీకటి పడేవరకు పనిచేసినా చాలా దయనీయమైన, పేదరికంలో మగ్గిపోతున్నారని అర్థం చేసుకుని తనకున్న తక్కువ పొలంలోనే మనస్ఫూర్తిగా శ్రద్ధపెట్టి పని చేసి మంచి దిగుబడి సాధించాడు. తరువాత ఋణదాతల వద్దనుండి మరికొంత భూమిని బాడుగకు తీసుకున్నాడు. ఆ పొలంలో తనతోపాటు తన కుటుంబమంతా రాత్రనక, పగలనక కష్టపడి పనిచేశారు. బాబా దయవలన గోదావరి నీళ్లు కాలువల ద్వారా శిరిడీ పొలిమేరల వరకు రావడంతో రైతులకు చాలా మేలు జరిగింది. దాని ఫలితంగా విస్తారమైన దిగుబడి వచ్చింది. అలా తమ్మాజీ పొలాలు బాగా అభివృద్ధి చెందాయి. దానితో అతితక్కువ కాలంలోనే ఇంకా ఎన్నో పొలాలు కొనుగోలు చేశాడు. అలా ఇంచుమించు 150 ఎకరాల భూమిని సంపాదించాడు. అతని కుటుంబం బాగా వృద్ధిచెంది ఐశ్వర్యవంతులైనారు.

"ఒకవేళ నేను ఆయన మాట లక్ష్యపెట్టకుండా ఉండివుంటే నాకు, నా కుటుంబానికి ఏమి జరిగి ఉండేదో నిజంగా నాకు తెలియదు. ఇదంతా బాబా ఆశీర్వాదాల వలనే సాధ్యమైంది. సరియైన మార్గం చూపినందుకు నేనెప్పుడూ ఆయనకు కృతజ్ఞుడనై ఉంటాను" అని అంటాడు తమ్మాజీ.

Ref: శిరిడీ చే మహాన్ సంత్ సాయిబాబా(రచన: పాండురంగ బాలాజీ కావడే).
సోర్స్: Baba's Divine Manifestations by విన్నీ చిట్లూరి.

సాయిభక్తుల అనుభవమాలిక 26వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. బాబాయే తోడుగా ఉండి నన్ను కాపాడారు
  2. సాయిస్మరణతో మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం.

బాబాయే తోడుగా ఉండి నన్ను కాపాడారు

యు.ఎస్.ఏ నుండి సాయిబంధువు సాయిశ్రీ తన అనుభవాన్ని మనతో పంచుకోవడానికి మెయిల్ ద్వారా పంపించారు. చదివి ఆనందించండి...

సాయిబంధువులందరికీ నమస్కారం.

బాబాకున్న అనేకమంది భక్తులలో నేనూ ఒకదాన్ని. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా సాయిభక్తులు తమ అనుభవాలు పంచుకునేందుకు అనుకూలంగా బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదములు.

నేను యు.ఎస్.ఏ లో నివసిస్తున్నాను. యు.ఎస్.ఏ లో వీసా కష్టాలు అందరికీ తెలిసినవే. అవి H1 స్టాంపింగ్ నియమాలు కఠినం చేసినందున వీసా సమస్యలు ఎక్కువగా ఉన్న రోజులు. అటువంటి సమయంలో మా చెల్లి పెళ్లి నిశ్చయం అయింది. అప్పటికి నేను ఇండియా వెళ్లి 4 సంవత్సరాలైంది. ఈ పెళ్లి ద్వారా నావాళ్ళందరినీ కలవాలి, అమ్మా వాళ్ళతో కాస్త సమయం గడపాలి, పెళ్ళిలో అన్నీ దగ్గరుండి చూసుకోవాలి అని నేను ఆశపడ్డాను. చెల్లి పెళ్లి చూసుకొని, అలాగే ఇండియాలో H1 స్టాంపింగ్ కూడా చేయించుకుని తిరిగి రావొచ్చని నేను అనుకున్నాను. అయితే నా భర్తకి నేను ఇండియా వెళ్లడం అస్సలు ఇష్టం లేదు. మా చెల్లి పెళ్ళికి వెళ్లడం అంతకంటే ఇష్టం లేదు. దాంతో చెల్లి పెళ్లికి వెళ్లాలని నాకెంతో ఆశగా ఉన్నా కూడా మావారికి ఇష్టం లేకుండా వెళ్ళలేనని అర్థమై చాలా నిరాశపడ్డాను. కానీ బాబా నా మనసులో మాట విన్నారనుకుంటా! ఏం జరిగిందో తెలీదు గానీ, మరుసటిరోజు మావారు తనంతట తానుగా నావద్దకొచ్చి, "పెళ్ళికి వెళ్తానంటే వెళ్లిరా! నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను" అన్నారు. అంతే! పట్టరాని ఆనందంతో మనసులోనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని, వీసా అవైలబుల్ డేట్స్ కోసం వెతకడం మొదలుపెట్టాను. అయితే నాకు అనుకూలంగా ఏ తేదీలూ లేవు. దాంతో మావారు, "వీసా డేట్ దొరక్కపోతే నువ్వు వెళ్ళేది లేద"ని ఖచ్చితంగా చెప్పేసారు. నేను, "ఎందుకు బాబా ఇండియా వెళ్తానని నాకు ఆశ కల్పించి, ఆనందపడేలోపే మళ్ళీ వీసా డేట్స్ లేవని చూపించావు?" అని బాధపడ్డాను. కానీ శ్రీసాయి కరుణామయుడు. మరుసటిరోజు వీసా స్లాట్స్ కోసం చూస్తుంటే నాక్కావాల్సిన తేదీలో నాకు అనుకూలమైన సిటీలో ఒకటే ఒక స్లాట్ అందుబాటులో ఉన్నట్లు కన్పించింది. నా సంతోషానికి అవధుల్లేవు. వెంటనే ఆ స్లాట్ బుక్ చేసుకున్నాను. అయితే,  డాక్యుమెంట్స్ అన్నీ సమయానికి వస్తాయో రావో అని భయం మొదలైంది. అందుకు తగ్గట్టే మా ఎంప్లోయర్, "డాక్యుమెంట్స్ అన్నీ రావడానికి ఆలస్యమవుతుంది" అని ఖచ్చితంగా చెప్పాడు. దాంతో నా భయం రెట్టింపై రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. ఇక నేను, "బాబా! నేను ఫ్లైట్ ఎక్కేలోగా అన్ని డాక్యుమెంట్స్ నా చేతికి అందేలా చూడండి, వీసాకి కావలసిన డాక్యుమెంట్స్ రాకపోతే నేను ఇండియా వెళ్ళలేను. ఖచ్చితంగా వీసా స్టాంపింగ్ చేయించాలి. నువ్వు ఒక్కడివే నాకు దిక్కు, నాకు వేరే ఏం తెలియదు. ఎలాగైనా నువ్వే డాకుమెంట్స్ సమయానికి అందేలా చేయాలి, నన్ను క్షేమంగా ఇండియా తీసుకెళ్లి, అంతే క్షేమంగా ఇక్కడికి తీసుకుని రావాలి" అని బాబాను వేడుకున్నాను. రెండురోజుల్లో తెల్లవారితే ఫ్లైట్ అనగా పోస్టులో డాక్యుమెంట్స్ వచ్చాయి. తరువాత క్షేమంగా ఇండియా చేరుకున్నాను. చెల్లి పెళ్లి నేను అనుకున్నట్టుగా ఘనంగా జరిగింది. చాలా రోజుల తరువాత నా కుటుంబంతో సమయం గడపడం చాలా సంతోషాన్నిచ్చింది. తరువాత వీసా డేట్ రానే వచ్చింది. భయంగా అనిపించినా, బాబా ఉన్నారనే ధైర్యంతో వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను. కష్టమైన ప్రశ్నలు ఏమాత్రం అడగకుండానే, 'వీసా అప్రూవ్డ్' అని చెప్పాడు ఆఫీసర్. మనసులోనే "బాబా! మీరే దగ్గరుండి వీసా ఇప్పించారు. జన్మజన్మలకి మీకు ఋణపడి ఉంటాను" అని బాబాకి సాష్టాంగ ప్రణామాలు అర్పించుకున్నాను. తరువాత సాయి క్షేమంగా నన్ను యు.ఎస్.ఏ చేర్చారు. వీసా స్టాంపింగ్ కాకపోయుంటే, మావారు 'వద్దంటున్నా వెళ్ళావు ఇండియాకి' అంటూ నన్ను మాటలతో గుచ్చిగుచ్చి చంపేవారు. అది తలచుకుంటే ఈరోజుకీ నాకు చాలా భయం వేస్తుంది. బాబాయే తోడుగా ఉండి నన్ను కాపాడారు. "థాంక్యూ సో మచ్ సాయీ! చాలా చాలా కృతజ్ఞతలు సాయీ! ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు". 

నా ఆనందాన్ని సాయిబంధువులందరితో ఇలా పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ నా ధన్యవాదములు.

సాయిస్మరణతో మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం

సాయిభక్తుడు సుశాంత్ తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

నేను పూణేలో నివాసముంటున్న సాయిబాబా భక్తుడిని. 2017వ సంవత్సరంలో కొన్ని పరిస్థితుల వలన నేను తీవ్రమైన మనస్తాపానికి గురై చాలా వేదనను అనుభవిస్తూ ఉండేవాడిని. అలాంటి సమయంలో ఒక అర్థరాత్రివేళ హఠాత్తుగా నా కాళ్లు వణికిపోవడం మొదలయ్యాయి. అప్పటికప్పుడే నేను చనిపోబోతున్నాననిపించింది. భయంతో ఆత్రంగా మా సిస్టర్ తో, "నాకెందుకో చాలా ఆందోళనగా ఉంద"ని చెప్పాను. ఆ మాటలు వింటూనే తను కూడా చాలా భయపడిపోయింది. కానీ వెంటనే, "సాయిరామ్, సాయిరామ్" అని స్మరించుకోమని చెప్పింది. నేను తను చెప్పినట్లే చేసాను. అంతే! మరుక్షణంలో నాకు ఉపశమనంగా అనిపించి మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను. మరుసటిరోజు నేను, మా సిస్టర్ కలిసి హాస్పిటల్‌ కి వెళ్లి, రాత్రి జరిగిన విషయం గురించి డాక్టరుతో చెప్పాము. ఆయన, మానసిక ఒత్తిడి వలన అలా జరిగిందని చెప్పి, కొన్ని మందులు వ్రాసిచ్చారు. కానీ ఆ మందుల వలన నాకు తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే కనిపిస్తూ ఉండేది. దాంతో, ఏం జరుగుతుందో ఏమోనన్న భయంతో, "బాబా! నేను ఈ స్థితిలో బ్రతకలేను. దయచేసి నాకు నయం చేయండి" అని రోజూ ప్రార్థిస్తూ ఉండేవాడిని. క్రమంగా నా పరిస్థితిలో మార్పు వచ్చింది. బాబా కృపవలన కొద్దిరోజుల్లో నేను ఆ స్థితి నుండి పూర్తిగా బయటపడ్డాను. ఎవరైతే మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారో వాళ్లు గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ మధనపడకుండా సదా సాయిస్మరణ చేస్తూ ఉంటే బాబా తప్పక అండగా నిలుస్తారు. మీ మానసిక పరిస్థితిలో మార్పు తీసుకువస్తారు.

సాయిభక్తుల అనుభవమాలిక 25వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు: 
  • నిద్రలేపి పారాయణ పూర్తిచేయించిన బాబా
  • వస్తుందో, రాదో అనుకున్న ప్రమోషన్ వచ్చేలా చేసారు బాబా

నిద్రలేపి పారాయణ పూర్తిచేయించిన బాబా

సాయిబంధువు శిరీషగారు తన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:

అందరికీ సాయిరాం! నేను పారాయణ పూర్తిచేయడంలో బాబా నాకు ఎలా సహాయం చేశారో ఇప్పుడు మీ అందరితో పంచుకుంటాను.

2018, మార్చి 7వ తేదీ రాత్రి నేను కొందరు సాయిభక్తులతో చాటింగ్ చేస్తూ, వారి అనుభవాలను వేర్వేరు గ్రూపులలో చదువుతూ ఉన్నాను. ఒక్కసారిగా ఎందుకో సమయం చూస్తే అప్పటికే అర్థరాత్రి ఒంటిగంట దాటింది. వెంటనే పడుకోవడానికి ప్రయత్నించాను గానీ, తీవ్రమైన కాలునొప్పి వలన నిద్రపట్టలేదు. సమయం చూస్తే 1.30 కూడా అయింది. గురువారం కావడం వలన వేకువఝామున 3 గంటలకే లేచి 'కిచిడీ పారాయణ'(కిచిడీ పారాయణ అంటే గురువారంనాడు వేకువఝామున 3 గంటలకు లేచి, వాళ్లకు కేటాయించిన సచ్చరిత్రలోని అధ్యాయాలు పారాయణచేసి బాబాకు కిచిడీ నైవేద్యం పెడతారు.) చేయవలసి ఉంది. వెంటనే, “బాబా! ఇప్పటికే అర్థరాత్రి 1.30 అయ్యింది. నేను 3 గంటలకు లేవడం అనేది అసాధ్యమేమో! అందువలన ఈరోజు నా పారాయణ పూర్తిచెయ్యలేనని అనిపిస్తోంది. కాబట్టి నేను నా సిస్టర్ సహాయం తీసుకోనా? బాబా! ఏమి చేయాలో తెలియడంలేదు. ఇప్పటిదాక నేను ఏరోజూ పారాయణ మిస్ చెయ్యలేదు. మూడు గంటలకి ఎలా లేవగలను బాబా?" అని చెప్పుకుని, అదే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను.

నేను నిద్రలో ఉండగా స్వప్నంలో బాబా నన్ను నిద్రలేపుతున్నారు. నేను బాబాతో, "నన్ను కాసేపు నిద్రపోనివ్వండి, నాకు చాలా నిద్రమత్తుగా ఉంది బాబా!" అని చెబుతున్నాను. బాబా వెంటనే ఒక గిన్నె తన చేతిలోకి తీసుకుని, “ఏమిటి? ఈరోజు నువ్వు నాకు కిచిడీ పెట్టవా?” అని అడుగుతున్నారు. ఆ మాటలు వినగానే నాకు మెలకువ వచ్చి సమయం చూస్తే 2.55am అయ్యింది. నన్ను నిద్రలేపినందుకు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. సమయానికి బాబా నన్ను మేలుకొలపడంతో కిచిడీ పారాయణతోపాటు సప్తాహపారాయణ, మహాపారాయణ అన్నీ నిరాటంకంగా పూర్తిచేసుకోగలిగాను. రాత్రి నిద్ర సరిగా లేకపోయినప్పటికీ రోజంతా నిద్రమత్తుగా అనిపించలేదు, ఇంకా కాలినొప్పి కూడా లేకుండా చాలా హుషారుగా ఉన్నాను.  

"చాలా చాలా ధన్యవాదాలు బాబా! నా జీవితంలో ఆరోజుని అందంగా మలచినందుకు, ఇంకా ఏ అలసటా తెలియనీయకుండా పారాయణలన్నీ పూర్తిచేయడంలో నాకు సహాయం చేసినందుకు. రోజంతా ఎప్పుడూ లేనంత ఉల్లాసంగా ఉండేలా చేసారు. ఆవిధంగా నన్ను ఆశీర్వదించినందుకు నా కృతజ్ఞతలు బాబా!" నా అనుభవాన్ని చదివిన మీకు కూడా నా ధన్యవాదాలు.

వస్తుందో, రాదో అనుకున్న ప్రమోషన్ వచ్చేలా చేసారు బాబా

పేరు వెల్లడించని ఒక సాయిబంధువు తన అనుభవాల్ని మనతో ఇలా పంచుకుంటున్నారు..

ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారికి నా ప్రణామాలు. ఇంటర్నెట్ లో సాయిభక్తుల అనుభవాలకు సంబంధించిన బ్లాగు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బ్లాగు లభించినప్పటినుండి నాలో బాబాపై ఉన్న భక్తి విశ్వాసాలు ఇంకా ఇంకా రెట్టింపు అయ్యాయి. సాయితో నాకు చాలా అనుభవాలున్నాయి. ఆయనెప్పుడూ నాకు తోడుగా ఉన్నారు. సంతోషం, బాధ ఏదైనా సాయితో చెప్పుకుంటూ ఉంటాను. అన్ని పరిస్థితులలో ఆయన నాకు తోడుగా ఉండి నా సమస్యలకి పరిష్కారం చూపిస్తూ, నాకు మార్గదర్శనం చేస్తూ ఉంటారు. ఈమధ్యకాలంలో బాబా నాకు ఇచ్చిన అనుభవాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను.

నేను బెంగళూరులోని ఒక పెద్ద సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాను. సాయి నాకు ప్రమోషన్ రావడంలో ఎలా సహాయం చేశారో మీ అందరికీ చెప్తాను. నాకు ప్రమోషన్ రావడానికి అన్ని అర్హతలూ వున్నాయి. మా మేనేజర్ కూడా ఖచ్చితంగా నాకు ప్రమోషన్ వస్తుందని హామీ ఇచ్చారు. కానీ ఈమధ్యలో మా సంస్థ ప్రమోషన్ విధానంలో కొత్తగా కొన్ని మార్పులు తీసుకుని వచ్చింది. కొత్త విధానంలో ప్రమోషన్ పొందేవారి సంఖ్యను 9కి కుదించేసారు. ఈ హఠాత్పరిణామంతో మా మేనేజర్ నాకు ఫోన్ చేసి, "నీకు ప్రమోషన్ వస్తుందో, రాదో అని అనుమానంగా ఉంది. నీ పొజిషన్ 10 లేక 11వ ర్యాంకులో ఉంది. చెప్పాలంటే, అదృష్టం కలిసివస్తే గానీ నీకు ప్రమోషన్ రాదు. అందుకోసం ఎదురుచూడు, మంచే జరుగుతుందని ఆశిద్దాం" అని చెప్పారు. ఆ మాట వినగానే నాకు చెప్పలేనంత బాధగా అనిపించి మనసులోనే సాయికి చెప్పుకున్నాను. సచ్చరిత్ర పారాయణ కూడా మొదలుపెట్టాను. శ్రద్ధ, సబూరీలతో నేను నా సమస్యని బాబా పాదాల వద్ద ఉంచి ప్రశాంతంగా ఉన్నాను. సచ్చరిత్ర రెండు పారాయణలు పూర్తిచేసి మూడవ పారాయణ మధ్యలో ఉండగా ప్రమోషన్ లిస్టు వెలువడింది. ఆశ్చర్యం! ఆ జాబితాలో నా పేరు కూడా ఉంది. సంస్థ నియమానుసారం 9 మందికి మాత్రమే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో 11 మందికి ప్రమోషన్స్ వచ్చాయి. ఇది బాబా కృపతోనే సాధ్యమైంది. ఆయన మనకోసం ఏదైనా మారుస్తారు. జీవితంలో మర్చిపోలేని మిరాకిల్ చేసారు బాబా. బాబాకి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఆయన నా వెన్నంటే ఉన్నారు.

ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!

సాయిభక్తుల అనుభవమాలిక 24వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  • చిన్న ఐటీ కంపెనీ స్థాపనలో బాబా అనుగ్రహం.
  • సమస్యను బాబాకు చెప్పుకోండి - ఆయన అంతా సజావుగా సాగేలా చూసుకుంటారు.

చిన్న ఐటీ కంపెనీ స్థాపనలో బాబా అనుగ్రహం.

సాయిబంధువు శైలజ గారు తమ అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నా జీవితంలో బాబా నా వెన్నంటి ఉండి నాకు సహాయం చేసిన అనుభవాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.

ఇటీవల మావారు ఒక చిన్న ఐటీ కంపెనీ ప్రారంభించి నన్ను కో-డైరెక్టర్ గా నియమించదలిచారు. అందుకోసం కంపెనీ నియమాల ప్రకారం నా డిజిటల్ సంతకం అవసరం ఉండటంతో కావలసిన పత్రాలన్నింటినీ సిద్ధంచేసి, సంబంధిత అధికారికి అందజేశాము. కానీ నా సంతకం నా పాన్‌ కార్డులో ఉండే సంతకంతో సరిపోకపోవడంతో పరిశ్రమల మంత్రిత్వశాఖ కార్యాలయం వాళ్ళు నా పత్రాలను తిరస్కరించారు. మళ్ళీ మావారు ఆ పత్రాలను ఇంటర్నెట్‌లో డౌన్లోడ్ చేసి, పాన్‌ కార్డులో ఉన్నట్టుగా సంతకం చేయమని నాకు చెప్పారు. నేనెంత శ్రద్ధగా ప్రయత్నించినప్పటికీ ఖచ్చితంగా పాన్‌ కార్డులో ఉన్నట్టు సంతకం చేయలేకపోయాను. దాంతో మావారికి చాలా కోపం వచ్చి వేరే పేపర్ మీద సంతకాన్ని ప్రాక్టీస్ చేయించారు. అయితే, ఆ పేపర్ల మీద నేను కరెక్టుగానే సంతకం పెడుతున్నా, అసలు పత్రాలపై పెట్టేసరికి సరిగ్గా వచ్చేది కాదు. చివరిగా మావారు రెండురోజులు సమయమిచ్చి పాన్ కార్డులో ఉన్నట్టుగా సంతకం పెట్టడం నేర్చుకోమని చెప్పారు. అయితే ఉన్నది ఉన్నట్లుగా సంతకం చేయడం నావల్ల కాదని నాకనిపించి నేను చాలా ఆందోళనపడ్డాను. రెండురోజుల తరువాత మావారు ఇంటినుంచి బయటకు వెళ్తూ తను వచ్చేసరికి ఆ పత్రాల్లో సంతకం చేసి ఉంచమని చెప్పి వెళ్లారు. నాకు ఏమి చేయాలో అర్థంకాక బాబా ముందు కూర్చుని ఏడుస్తూ, "బాబా! నాకు సహాయం చేయండి" అని ప్రార్థించి, కొంచెం ఊదీ ఆ పత్రాలకు పెట్టి, బాబా ముందరే ఆ పత్రాలలో సంతకం పెట్టాను. నేను పెట్టిన సంతకం పాన్ కార్డులో ఉన్నట్టుగానే ఉందని నాకనిపించింది. కానీ మావారు ఏమంటారోనన్న ఆందోళనతో, తను ఏమీ అనకుండా ఉండేలా చూడమని ఆపకుండా బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. కొంతసేపటికి మావారు వచ్చి సంతకం చూసి ఒక్క మాటైనా మాట్లాడకుండా వాటిని తీసుకుని వెళ్ళి సంబంధిత అధికారికి అందజేశారు. నేను, "బాబా! నా సంతకాన్ని ఆమోదింపజేసి, నాకు డిజిటల్ సంతకం వచ్చేలా చూడండి" అని బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను. బాబా ఖచ్చితంగా ఈసారి సహాయం చేస్తారని నా మనసుకు అనిపిస్తూ ఉంది. అదే నిజమైంది. ఆశ్చర్యం! బాబా అద్భుతమే చేశారని చెప్పాలి. నిజానికి పాన్ కార్డులోని సంతకంతో పోలిస్తే నా సంతకంలో చిన్న చిన్న తేడాలున్నాయి. అయినప్పటికీ బాబా అనుగ్రహం వలన నా డిజిటల్ సంతకం ఆమోదింపబడింది. దానితో ఎటువంటి అడ్డంకులు లేకుండా మా కంపెనీ రిజిస్ట్రేషన్ పనులు మొదలయ్యాయి. మా కంపెనీ పేరుని కూడా బాబా సహస్రనామాల నుండి ఎంపిక చేసుకున్నాము. తరువాత నేను, "మా కంపెనీ కనుక ఈ నెలలోనే ఏర్పడితే 'నవ గురువార వ్రతం' చేస్తాను, నా అనుభవాన్ని బ్లాగ్ ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాను" అని బాబాకు చెప్పుకున్నాను. ఆయన కృపతో నేను కోరుకునట్టుగా ఈ నెల మొదటివారంలోనే మా కంపెనీ రిజిస్ట్రేషన్ జరిగి, కంపెనీ ఏర్పడింది. నాకు తెలుసు బాబా ఆశీస్సులు సదా మాపై ఉంటాయని. ఆయన మంచి ప్రాజెక్టులు మాకు వచ్చేలా చేసి మా కంపెనీ విజయపథంలో ముందుకుసాగేలా అనుగ్రహిస్తారని నా గట్టి నమ్మకం. దయచేసి అందరూ బాబాపై నమ్మకం ఉంచండి. ఆయన మనకేది మంచిదో అది ఖచ్చితంగా మనకు ఇస్తారు.

ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి.

సమస్యను బాబాకు చెప్పుకోండి - ఆయన అంతా సజావుగా సాగేలా చూసుకుంటారు.

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిబాబా దివ్యచరణాలకు నా నమస్సుమాంజలులు. నేను ప్రతిరోజూ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతూ ఉంటాను. తద్వారా మానసిక ప్రశాంతత పొందడంతో పాటు, బాబాపట్ల విశ్వాసం దృఢతరం అవుతూ ఉంది. నేనిప్పుడు బాబాని ఎవరైనా ఏదైనా అడిగితే, ఆయన ఎలా సహాయం చేస్తారో తెలియజేసే అనుభవాన్ని మీతో పంచుకుంటాను.

గత ఏడాదిలో ఒకసారి మా సిస్టర్ తన ఫ్యామిలీతో పాటు ఒక వారంరోజులు మాతో గడపడానికి ప్లాన్ చేసుకుంది. ఈ వార్త వింటూనే నాకు ఆనందంగా అనిపించింది. అదేసమయంలో మావారు ఎలా స్పందిస్తారోనని చాలా ఆందోళనపడ్డాను. ఎందుకంటే ఆయనకి మా కుటుంబసభ్యులంటే అంతగా ఇష్టం ఉండదు. ఆయనకు ఛాందసభావాలు ఎక్కువ, నన్ను కూడా సరిగా చూసుకోరు. భార్యాబిడ్డలు అంటే ఆయనకు చిన్నచూపు. అందువలన ఎప్పుడూ నాపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు. నా తల్లిదండ్రులతో కూడా సరిగా మాట్లాడరు. అందువలన ఆయన మా సిస్టర్ వాళ్లతో ఎలా నడుచుకుంటారోనని చాలా భయమేసి, "బాబా! అంతా సక్రమంగా నడిచేలా మీరే చూసుకోండి" అని బాబాతో చెప్పుకున్నాను. ఇంకో విషయం, మొదటి రెండురోజుల్లో వాళ్ళు మాతోపాటు వేరే ప్రదేశానికి వెళ్లాలని అనుకున్నారు. అందుకు మావారు అంగీకరించకపోవడమే కాకుండా నన్ను కూడా హోటల్, క్యాబ్ బుక్ చేయకుండా అడ్డుపడ్డారు. కానీ బాబా కృపవలన నేను ఆయనకి తెలియకుండా నా డబ్బులతో ఆన్లైన్ ద్వారా వాటిని బుక్ చేశాను. తర్వాత మావారు రాకపోయినప్పటికీ ఆ రెండురోజులు బాబా దయతో మా ట్రిప్ హ్యాపీగా సాగింది. తిరిగి వచ్చేటప్పుడు రోడ్డుమీద ఒక చోట నా మొబైల్ ఫోన్ పడిపోయింది. ఆ విషయం దాదాపు ఆరు, ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాక మేము గుర్తించాం. మొబైల్ ఫోన్ దొరుకుతుందన్న ఆశ కూడా లేకపోయినప్పటికీ వెనక్కి తిరిగాము. నేను ఆపకుండా బాబాని స్మరిస్తూనే ఉన్నాను. బాబా కృప చూపించారు. దాదాపు 45 నిమిషాలు గడిచినప్పటికీ ఫోను రోడ్డుమీద అలానే ఉంది. మనసారా బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

ఇదంతా ఇలా నడుస్తుంటే, మనసులో మాత్రం "మిగిలిన రోజులు మావారు వాళ్లతో ఎలా ప్రవర్తిస్తారో"నని నేను ఆందోళనపడుతూనే ఉన్నాను. కానీ బాబా కృప, ఆయన చక్కగా మాతో సమయం గడిపారు. వాళ్లతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. దగ్గర్లో ఉన్న ప్రదేశాలు చూపించడమే కాకుండా షాపింగ్ కి కూడా తీసుకుని వెళ్లారు. చివరికి వాళ్లని ఎయిర్‌పోర్ట్ వరకు డ్రాప్ కూడా చేసారు. బాబాయే వాళ్లతో ఆప్యాయంగా మాట్లాడేలా మావారిని మలిచారు. నిజానికి ఆయన అంతకుముందు ఎప్పుడూ అలా నడుచుకోలేదు. బాబా వల్లనే ఇదంతా సాధ్యమైంది. వాళ్లు ఎంతో సంతోషంగా తిరిగి వెళ్లారు. ముఖ్యంగా నేను అమితానందాన్ని పొందాను. ఎందుకంటే, నేనెప్పుడూ "మావారు నాతో, నా కుటుంబ సభ్యులతో సరిగా నడుచుకోవాల"ని ఆశపడుతూ ఉండేదాన్ని. ఇకపై అంతా సజావుగా సాగేలా బాబా చూసుకుంటారని నాకు ప్రశాంతంగా అనిపించింది. చిన్నదైనా, పెద్దదైనా బాబా బాధ్యతగా నెరవేరుస్తారు. జీవితంలో ఏదైనా మన కంట్రోలులో లేని సమయంలో సమస్యను బాబాకు అప్పగించి మౌనంగా ఆయన స్మరణ చేసుకుంటే, ఆయన తప్పకుండా సమస్యను చాలా జాగ్రత్తగా పరిష్కరిస్తారు.

సాయిభక్తుల అనుభవమాలిక 23వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  • శ్రీసాయి ఆశీస్సులు
  • శ్రీసాయి దయాసాగరుడు


శ్రీసాయి ఆశీస్సులు

సీతారామాంజనేయులు గారు వాట్సాప్ ద్వారా పంపిన అనుభవాలు:

నాపేరు దివ్వెల సీతారామాంజనేయులు. నేను 25 సంవత్సరాల నుండి సాయిబాబా భక్తుడిని. నా జీవితంలో సాయిమహిమలు ఎన్నో చూశాను. 25 సంవత్సరాల క్రితం బాబా పరిచయమయ్యాక ఆయన దర్శనం కోసం శిరిడీ వెళ్ళడానికి ఎంతో ప్రయత్నం చేసాను. కానీ, ఐదేళ్ల పాటు నేనెంత ఆశపడినా ఏదో ఒక కారణం చేత శిరిడీ వెళ్లడం సాధ్యపడలేదు. చివరికి 2000 సంవత్సరంలో తొలిసారి బాబాను దర్శించుకున్నాను. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం శిరిడీ దర్శించుకునే భాగ్యాన్ని బాబా ఇచ్చారు. 25 ఏళ్లుగా నరసరావుపేట బాబా మందిరంలో సేవ చేసుకునేలా అవకాశమిచ్చి నన్నెంతగానో బాబా అనుగ్రహిస్తున్నారు. నేనిప్పుడు మీతో బాబా మహాసమాధి శతాబ్ది సంవత్సరంలో బాబా నాపై కురిపించిన ఆశీస్సులను పంచుకుంటాను.

2018 బాబా మహాసమాధి శతాబ్ది సంవత్సరంలో బాబా నాకు మూడు అద్భుతాలను చూపారు. అవి...

1)నరసరావుపేట సాయిమందిరంలో మహాసమాధి ఉత్సవాలలో భాగంగా భక్తులతో కోటి సాయి నామార్చన చేయించే కార్యక్రమాన్ని బాబా నాచేత మొదలుపెట్టించి, విజయవంతంగా పూర్తి చేయించి నన్ను అనుగ్రహించారు.

2) నరసరావుపేటకు దగ్గరలో ఉన్న కుంకలగుంట గ్రామంలో 1959లో మా నాన్నగారు నిర్మించిన శ్రీ వీరాంజనేయస్వామి వారి దేవస్థానం పున:నిర్మాణ పనులు నాచేత మొదలుపెట్టించి, 58 రోజులలో పూర్తి చేయించారు. అంతేకాదు, సాయిమందిర నిర్మాణాన్ని కూడా చేపట్టించి, 75,000 రూపాయలతో బాబా విగ్రహాన్ని కూడా ఇప్పించి ప్రతిష్ఠ కావించటం బాబా నాకిచ్చిన గొప్ప వరం. అప్పుడే ఆ మందిరానికి సంబంధించి 29-5-2019న జరగనున్న మొదటి వార్షికోత్సవానికి సన్నాహాలు మొదలయ్యాయి.

3) మరో అద్భుతమైన విషయం, బహుశా ఎవరికీ ఈ భాగ్యం దక్కి ఉండదు. బాబా ఆరతి పుస్తకములు 6000 కాపీలు వేయించి 260 సాయిమందిరాలలో దర్శనానికి వచ్చిన భక్తులకు అందజేసే మహత్తర కార్యాన్ని బాబా నాచేత చేయించారు. 25 సంవత్సరాల నా సేవకు ఫలితమా అన్నట్లు బాబా నాకీ మహద్భాగ్యాన్ని ప్రసాదించారు.

సద్గురువైన శ్రీ శిరిడీ సాయిబాబా సేవకులు:
దివ్వెల సీతారామాంజనేయులు,
విజయవాడ.

మొబైల్ నెంబర్ - 7396677167.

శ్రీసాయి దయాసాగరుడు

యు.ఎస్.ఏ నుండి శిరిడీ సాయిభక్తుడు హరీష్ తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
  
నేనొక సాధారణ భక్తుడిని. నాకు బాబా అంటే చాలా చాలా ఇష్టం. తరచూ ఆయనను తలచుకుంటూ ఉంటాను. ఏ పని మొదలుపెట్టినా పెద్దదైనా, చిన్నదైనా ముందు బాబాని తలచుకుని, ఆయన ఆశీస్సులతో మొదలుపెడతాను. సాయి లీలలు వినడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను.

ఇక నా అనుభవానికి వస్తే... ఒక వారాంతంలో నేను, నా భార్య ఇద్దరం ఒక ఫ్యామిలీని కలవాలని ఒక ప్రాంతానికి ప్రయాణమయ్యాం. ముందుగా వాళ్లు, అందరం ఒక గుడిలో కలుద్దామని, అక్కడనుంచి వాళ్ళ ఇంటికి వెళదామని చెప్పారు. మేము అక్కడికి చేరుకునే లోపల గుడిలో వాళ్ళ పని పూర్తి కావడంతో వాళ్ళు అక్కడనుండి వెళ్ళిపోయారు. మేము గుడి వద్దకు చేరుకుని కారు పార్కింగ్ చేస్తుండగా 'బాబా గుడికి దారి' అని వ్రాసి ఉన్న ఒక బోర్డు చూసి, బాబా దర్శనం చేసుకుని వెళదామని నేను, నా భార్య అనుకున్నాం. ఇంతలో వాళ్ళు ఫోన్ చేసి, "వాతావరణం బాగాలేదు, తుఫాను వచ్చేలా ఉంది. నేరుగా మీరు మా ఇంటికి వచ్చేయండి" అని చెప్పారు. మేము, "దర్శనం చేసుకుని వస్తాము" అని చెప్పి ముందుగా హనుమంతుని దర్శనం చేసుకున్నాం. గుడినుంచి బయటకు వచ్చేసరికి అంతా చీకటిగా అయిపోయి, జోరుగా వర్షం మొదలైంది. అయినా మేమిద్దరం, "బాబా దర్శనం వదులుకోవద్దు, దర్శనం చేసుకునే వాళ్ళ ఇంటికి వెళదామ"ని నిశ్చయించుకుని అంత వర్షంలో బాబా గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నాం. బాబా దర్శనంతో మాకు చాలా చాలా సంతోషం కలిగింది. తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షంలో బాబాని తలుచుకుని, ఫోనులో జి.పి.ఎస్ ఉపయోగించుకుంటూ వాళ్ళ ఇంటికి బయలుదేరాము.  ఇరుకైన గ్రామీణ రోడ్లపై ప్రయాణిస్తున్నాము. దట్టమైన చీకటివలన ఆ వర్షంలో కొద్ది అడుగుల దూరం తప్ప ఏమీ కనిపించట్లేదు. మా ఇద్దరికీ చాలా భయమేసి బాబా నామం తలచుకుంటూ వున్నాము. ఆయనే జాగ్రత్తగా మమ్మల్ని ఇంటికి చేర్చుతారని కారు నిదానంగా పోనిచ్చాను. అంతా అటవీ ప్రాంతం, ఎక్కడా ఒక్క మనిషి కూడా లేడు. బాబా కృపవలన మొత్తానికి 40 నిమిషాల ప్రయాణం తర్వాత క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. అంతటితో అయిపోలేదు, మేము వాళ్లతో జిపిఎస్ ఆధారంగా చేరుకున్నామని చెప్తే, వాళ్లంతా షాక్ అయ్యారు. ఎందుకంటే వర్షానికి ఆ రోడ్డు త్వరగా వరదతో నిండిపోతుందట. పైగా ఎక్కడికక్కడ చెట్లు పడిపోయి దారి మూసుకుపోతుందట. చెప్పాలంటే ఆ మార్గంగుండా వర్షంలో ప్రయాణం సాధ్యమయ్యే విషయం కాదట. ఆ విషయాలు వింటూనే నాకు, నా భార్యకు అర్థమైంది, "ఇక్కడికి వచ్చేముందు బాబా తమ దర్శనానికి రప్పించుకుని, మాకు ఆశీస్సులిచ్చి క్షేమంగా ఇల్లు చేర్చార"ని. ఇంతకన్నా దయగల వారెవరుంటారు? శ్రీసాయి దయాసాగరుడు.

రెండవ అనుభవం:

ఇటీవల మా నాన్నగారికి యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యింది. రోజుకు రెండు ఇంజక్షన్ల చొప్పున మొత్తం పది ఇంజక్షన్లు చేయించాలని డాక్టరు చెప్పారు. ఆ మాటే నాకెంతో కష్టంగా అనిపించింది. వెంటనే బాబాని ప్రార్థించి, నాన్న విషయం బాబాకు వదిలేసాను. ఆయన కృపతో అంతా సర్దుకుంది.

మూడవ అనుభవం:

హఠాత్తుగా ఒకసారి మా అమ్మగారికి బ్యాక్ పెయిన్ వచ్చి, ఆమె కాస్త కూడా వంగలేకపోయింది. కనీసం కదలలేక పోయింది. నేను మనసారా బాబాని ప్రార్థించి అమ్మకు ఊదీ పెట్టాను. తర్వాత ఆమె వేడినీళ్లతో మసాజ్ చేసుకుని, కొంచెం వేడినీళ్లలో జీలకర్ర వేసుకుని త్రాగింది. మరుసటిరోజుకి తన నొప్పి తగ్గిపోయింది.

"బాబా! ఎప్పుడూ నీ లీలలు వింటూ ఉండేలా నన్ను అనుగ్రహించండి. ఏమి జరిగినా కలతచెందకుండా మీ దివ్య పాదాలకు శరణాగతి చెందేలా నన్ను ఆశీర్వదించండి!"

సాయిభక్తుల అనుభవమాలిక 22వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు: 
  • దసరా రోజు బాబా నాతో ఉన్నారు
  • సాయి ఊదీ మహిమ

దసరా రోజు బాబా నాతో ఉన్నారు

నా పేరు కమలిస్ దేవి. 2018 విజయదశమి రోజున మా ఇంట్లో జరిగిన ఒక మిరాకిల్ ను నేను మీ అందరితో ఇప్పుడు పంచుకుంటాను. నేను ఉద్యోగస్తురాలిని కావడంతో నేనెప్పుడూ గురువారం సాయంత్రం బాబాకి పూజ చేస్తూ ఉంటాను. ఉదయాన హడావిడిగా పూజ చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ప్రశాంతంగా సాయంత్రం వేళలో పూజ చేసుకుంటూ ఉంటాను. కాని ఈసారి దసరా గురువారంనాడు వచ్చింది. దసరా కదా, ఆరోజు ఉదయాన్నే 4.30 కి లేచి పూజ చేసుకుందామనుకున్నాను. ముందురోజు రాత్రి బాబా కోసం పూలమాలలు కట్టడంతో ఆలస్యమై 1.30కి పడుకున్నాను. పడుకునే ముందు ఉదయాన 5.00,  5.10, & 5.15కి మూడు అలారమ్స్ పెట్టుకున్నాను. ఉదయం అవి మ్రోగిన ప్రతిసారీ స్టాప్ చేసి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాను. 5.45 సమయంలో ఎవరో నన్ను కుదిపి, నిద్రలేవమని చెప్పినట్లు అనిపించింది. కానీ కళ్ళు తెరచి చూస్తే ఎవరూ లేరు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. త్వరత్వరగా స్నానం చేసి పూజ మొదలుపెట్టాను. బాబాకు డ్రెస్ మార్చి, నైవేద్యాలన్నీ సమర్పించి బాబా ముందు కూర్చుని ప్రార్థన చేస్తున్న సమయంలో హఠాత్తుగా బాబా విగ్రహం వెనక ఒక నీడను చూసాను. వెనుక్కి తిరిగి చూసాను, కానీ అక్కడ ఏమీ కనపడలేదు. సరేనని నేను ప్రార్థన చేసుకున్నాను. కాసేపటికి నా ప్రార్థనలు ముగించి చూసేసరికి పెద్ద బాబా విగ్రహం ముందున్న రెండు చిన్న విగ్రహాలు వాటి స్థానాలనుండి కదిలి ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను.  దీని అర్థం ఏమిటో నాకు తెలియదు గానీ, దసరా రోజు బాబా నాతో ఉన్నారని మాత్రం నాకు అర్థమయ్యింది. "నేను అనుకున్నట్లుగా ఉదయం పూజ చేయడంలో నాకు సహాయపడినందుకు మీకు ధన్యవాదాలు బాబా! మీరు నాపై, నా కుటుంబంపై ప్రేమతో కురిపిస్తున్న ఆశీస్సులకు కృతజ్ఞతలు బాబా! ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను బాబా!"

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయి ఊదీ మహిమ

అజ్ఞాత సాయిభక్తురాలు ఊదీ మహిమను ఇలా వివరిస్తున్నారు:

"మా అమ్మగారు ఒక గొప్ప సాయిభక్తురాలు. ఆమె 2009వ సంవత్సరం నుండి బాబాను పూజిస్తున్నారు. ఆమె తన జీవితంలో ప్రతిక్షణం బాబా కృపను అనుభూతి చెందుతూ ఉండేవారు. నేను చెప్పబోయే లీల బాబా ఊదీ మహిమకు సంబంధించినది.

ఒకరోజు హఠాత్తుగా మా అమ్మగారు ఛాతీనొప్పితో బాధపడసాగారు. మొదట మేము మాములు నొప్పి అనుకుని, మందులతో తగ్గుతుందని భావించాము. కానీ చీకటిపడేకొద్దీ నొప్పి తీవ్రం కాసాగింది. ఆమె ఆ బాధను తట్టుకోలేక చిన్నపిల్లలాగా ఏడుస్తూ క్రిందపడి దొర్లసాగింది. ఆవిడను అలా చూసేసరికి నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. నొప్పి తగ్గించమని దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఆమెకు బదులు ఆ నొప్పిని నాకు ఇవ్వమని అడిగాను. అమ్మ అలా ఏడుస్తుంటే చూడటం కంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? అలా మందులు పని చెయ్యని క్లిష్టమైన పరిస్థితిలో, హఠాత్తుగా ఒక ఆలోచన నా మెదడుకు తట్టింది - ఊదీని మందులా ఆమెకు ఇవ్వాలని. వెంటనే గదిలోకి వెళ్ళి ఊదీ తెచ్చి, బాబాను ప్రార్థించి ఆమెకు ఇచ్చాము. కాసేపట్లో అద్భుతం మొదలైంది. అరగంట తరువాత నొప్పి తీవ్రత తగ్గుతూ వచ్చింది. ఉదయానికి ఆమె పరిస్థితి ఏమీ జరగనట్లుగా మాములుగా ఉంది. ఆమెకు పూర్తిగా నయమైపోయింది. ఈ సంఘటన తరువాత బాబాపై మా విశ్వాసం దృఢమైంది. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా మా అమ్మకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను.

శ్రీ సాయినాథునికి జై!

“సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్” ఏర్పాటులో, నిర్వహణలో బాబా అభయహస్తం


ముందుగా సాయిభక్తులందరికీ బ్లాగు వార్షికోత్సవ శుభాకాంక్షలు. సాయిబంధువులందరిపై ఆ సద్గురు సాయినాథుని ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను.

బాబా కృపాకటాక్షములతో ఈ బ్లాగ్ ప్రారంభమై నేటికి సరిగ్గా ఒక సంవత్సరమయ్యింది. మొదటి వార్షికోత్సవ సందర్భంగా, ఈ బ్లాగ్ ఏర్పాటులో, నిర్వహణలో బాబా చూపిన అనుగ్రహాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 

బ్లాగ్ ప్రారంభించేముందు, "బ్లాగ్ నిర్వహించడం నా ఒక్కడి వల్ల ఎలా అవుతుందో?!" అని అనుకున్నాను. అలాంటిది ఒక్క రోజు కూడా మిస్ కాకుండా, ఈ ఏడాది కాలంలో 447 పోస్టింగ్స్ బ్లాగులో ప్రచురింపబడ్డాయంటే అదంతా ఆ సద్గురు సాయినాథుని అపార అనుగ్రహమే!  నిజానికి బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తలోనే ఈ వివరాలు ప్రచురిద్దామని టైపు చేయడం మొదలుపెట్టాను. కానీ అది సాధ్యపడలేదు. బహుశా వార్షికోత్సవ సందర్భంగా ప్రచురించాలన్నదే బాబా సంకల్పమేమో! ఇక వివరాల్లోకి వెళితే....

2017, అక్టోబర్ నెలలో బాబాకి సంబంధించిన ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయాలన్న ప్రేరణ నాలో కలిగింది. అది బాబా ఇస్తున్న ప్రేరణ అవునో, కాదో తెలుసుకోవాలని బాబానే అడిగాను. అందుకు ఆయన సచ్చరిత్రలో ఒక పేజీ సూచించారు. ఆ పేజీ తెరచి చూస్తే, బాబా సచ్చరిత్ర వ్రాయమని హేమాడ్‌పంత్‌కు అనుమతినిస్తున్న సన్నివేశం ఉంది. ఆ సంఘటనతో, ఇప్పటి సాయిభక్తుల అనుభవాలు పంచుకోవడం కోసం వెబ్‌సైట్ ఏర్పాటు చేయడానికి అది బాబా ఇస్తున్న ప్రేరణే అని నిర్ధారణ అయ్యింది.

అంతేకాకుండా, అదేరోజు మరోవిధంగా కూడా వెబ్‌సైట్‌కు బాబా తమ సమ్మతిని తెలియజేసారు. ఆరోజు రాత్రి సాయిబంధువు సుధాకర్ ఫోన్ చేసి తమ అనుభవాలు పంచుకున్నారు. నిజానికి అతను మూడు, నాలుగు నెలల క్రిందట జూన్ నెలలోనే తన అనుభవాలు పంచుకుంటానని నాతో చెప్పారు. కానీ ఏవో కారణాల వలన అతనికి వీలుపడక అసలు ఫోనే చేయలేదు. అన్ని రోజులుగా వీలుపడనిది, సరిగ్గా బ్లాగ్ క్రియేట్ చేయడానికి బాబా అనుమతినిచ్చిన కొద్దిసేపట్లో అతను ఫోన్ చేసి తన అనుభవాలు చెప్పడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బాబా హేమాడ్‌పంత్‌తో, “నా లీలలు నేనే వ్రాసుకుంటాను, నీవు నిమిత్తమాత్రుడివి” అని చెప్పినట్లుగా, ఆయన వెబ్‌సైట్‌కి అనుమతినివ్వడమే కాకుండా వెబ్‌సైట్‌లో ప్రచురించడానికి మొదటిలీలగా సుధాకర్ గారి అనుభవాన్ని కూడా ఇచ్చారు.

బాబా అనుమతి లభించడంతో నిజానికి వెబ్‌సైట్ డిజైన్‌పై నాకెటువంటి అవగాహన లేకపోయినా వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి పూనుకున్నాను. కానీ, నాకెలా చేయాలో అర్థంకాక ఎంత ప్రయత్నించినా పని ముందుకు సాగలేదు. సరే, సమయం వచ్చినప్పుడు బాబాయే చేయిస్తారనుకున్నాను. తరువాత కొన్ని అనుకోని సంఘటనలు జరిగి వెబ్‌సైట్ మొదలుపెట్టే పరిస్థితి కూడా లేకపోయింది. తరువాత మళ్ళీ 2018, మార్చి నెలలో వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి తగిన పరిస్థితులు బాబా కల్పించారు. "బాబా! నాకు సహాయం చేయండి" అని బాబాను ప్రార్థించి, వర్క్ మొదలుపెట్టాను. వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి మొదట ప్రయత్నించినప్పుడు కొంచెం కూడా ముందుకు సాగనిది, ఈసారి వర్క్ సాఫీగా ముందుకు సాగుతుంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఒకవైపు వెబ్‌సైట్ డిజైన్ చేస్తూనే, మరోవైపు బ్లాగ్ డిజైన్ కూడా ట్రై చేసాను. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి కలలో బాబా దర్శనమిచ్చి, "ఇక్కడ ఈ కలర్ తీసుకో, ఇక్కడ ఇలా పెట్టు" అంటూ వెబ్‌సైట్ డిజైన్ చేయడం చూపించారు. మొత్తానికి బ్లూ, గ్రే కలర్స్ కాంబినేషన్ కనిపించింది. ఉదయాన నిద్రలేచి కలలో బాబా వెబ్‌సైట్ డిజైన్ చూపించారని చాలా సంతోషపడ్డాను. మధ్యాహ్నానికి ఆ కల సంగతి పూర్తిగా మర్చిపోయి మాములుగా డిజైన్ వర్క్ చేసుకుంటున్నాను. కాసేపటికి, ఆశ్చర్యం! అద్భుతం! నాకు తెలియకుండానే రాత్రి కలలో బాబా చూపిన విధంగా అవే రంగుల కాంబినేషన్‌లో బ్లాగ్ డిజైన్ వచ్చింది. అది చూశాక నాకు రాత్రి వచ్చిన కల గుర్తుకు వచ్చింది. నేను మరచిపోయినప్పటికీ బాబా నా చేయిపట్టి డిజైన్ చేయించినట్లు సరిగ్గా కలలో చూపిన విధంగా చేయించారు. ఆ తరువాత వెబ్‌సైట్ కూడా అదే కలర్ కాంబినేషన్‌లో డిజైన్ చేద్దామని ప్రయత్నించాను కానీ, సంతృప్తికరంగా రాలేదు. దానితో 'బ్లాగ్ చాలు' అన్నది బాబా నిర్ణయమని నాకు అర్థమయింది.

తరువాత 'బ్లాగుకు ఏ పేరు పెట్టాలా?' అని అనుకున్నప్పుడు, ఒక సాయిబంధువు ద్వారా "సాయి మహరాజ్ సన్నిధి" అని బాబాయే సూచించారు. ఆ టైటిల్ తో 2018, ఏప్రిల్ 19న బాబా చూపించిన సుధాకర్ గారి అనుభవంతో బ్లాగ్ ప్రారంభమయ్యింది. మొదటి బాబా లీల పబ్లిష్ చేసి గ్రూపుల్లో లింక్ షేర్ చేసిన వెంటనే ఒక సాయిబంధువు, "బ్లాగ్ వర్క్ ఏదైనా ఉంటే ఇవ్వండి. నేను కూడా బాబా వర్క్ చేస్తాను" అని మెసేజ్ పెట్టారు. అలా బాబా తమ బ్లాగ్ వర్క్ ఆ సాయిబంధువుకు కూడా ఇచ్చారు. ఆ తరువాత ఒకరి తరువాత ఒకరు జతకూడుతూ ఇప్పుడు మొత్తం 7, 8 మందిమి బాబా వర్క్ చేసుకుంటున్నాము. తరువాత కూడా బాబా ఎప్పటికప్పుడు బ్లాగుకు అవసరమైన టెక్నికల్ నాలెడ్జ్ అందిస్తూ బ్లాగ్ నిర్వహణ చే(యి)స్తున్నారు.

అలా బాబా "సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్" (https://saimaharajsannidhi.blogspot.com/) ఏర్పాటు చేయించి, ఆయన భక్తుల అనుభవాలను సాటి సాయిభక్తులకు అందుబాటులో ఉండేవిధంగా బ్లాగులో ప్రచురింపజేయిస్తూ, సదా ఆయన స్మరణలో ఉండేలా మమ్మల్ని అనుగ్రహించారు. 

“బాబా! ఎప్పుడూ ఇలాగే మాపై అనుగ్రహాన్ని కురిపిస్తూ మమ్మల్ని నడిపించండి. పూర్ణమైన భక్తివిశ్వాసాలు మాకొసగి ఎప్పటికీ మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండేలా మమ్ము అనుగ్రహించండి. శతకోటి ప్రణామాలు సాయిదేవా!”

అనుభవాలు పంచుకుంటూ బ్లాగుకు సహకరిస్తున్న సాయి బంధువులందరికీ నా అభివందనాలు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

భక్తితో పాటు ధైర్యం, పట్టుదల గల శ్రీమతి ప్రధాన్ పై బాబా అనుగ్రహం


భక్తితో పాటు, శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలన్న ధైర్యం, పట్టుదల గల ఒక మహిళ కథ ఇది. ఆమె కథను థానాలో నివసిస్తున్న భక్తురాలు శ్రీమతి మంగళ ప్రధాన్ వివరిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆ మహిళ మొదటి పేరు, ఆమె శిరిడీ వెళ్ళిన సంవత్సరం కూడా పేర్కొనలేదు. ఆ సాహసోపేతమైన స్త్రీ, మంగళ గారి భర్తకు నాయనమ్మ. ఆమెను శ్రీమతి ప్రధాన్ గా ప్రస్తావించారు.

రాయగఢ్ జిల్లాలోని పీణ్ అనే ఊరి సమీపంలో గల సవర్సాయి అనే గ్రామంలో శ్రీమతి ప్రధాన్ నివసించేవారు. బాబా దర్శనం చేసుకోవాలన్న ఆతృత కలిగివున్న ఆమె తన భర్తను శిరిడీ వెళ్ళడానికి అనుమతి ఇమ్మని అభ్యర్థిస్తూ ఉండేది. అందుకతను నిరాకరిస్తూ, "నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను. నీవు ఎలా వెళ్లగలవు?" అని అన్నాడు. అంతేకాకుండా కుటుంబమంతా ఆమెకు ఎదురు తిరిగి శిరిడీ వెళ్ళడానికి నిరాకరించారు. 

ఈ విషయమై శ్రీమతి మంగళ మామగారు(శ్రీమతి ప్రధాన్ కొడుకు) ఇలా తెలియజేసారు: "మా అమ్మ చాలా మొండిది. ఒకసారి శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నాక ఏవీ తనని ఆపలేకపోయాయి. కొన్నిరోజులపాటు అణిగి మౌనంగా ఉన్నా, తన మనస్సులో మాత్రం రహస్యంగా ఒక ప్రణాళిక వేసుకుంది. ఆమెకు శిరిడీ ఎక్కడ ఉందో తెలీదు, అక్కడికి వెళ్లడానికి ఎంత ఖర్చు అవుతుందన్నది కూడా తెలియదు. కాబట్టి పెద్ద మొత్తమే అవసరమవుతుందని ఆమె అనుకుంది. అందుకోసం తన తల్లిదండ్రులు తనకి కానుకగా ఇచ్చిన నగలన్నీ కుదువ(తాకట్టు) పెట్టింది. తరువాత తెలివిగా కొంత సమాచారం సేకరించి, శిరిడీ అహ్మద్‌నగర్ సమీపంలో ఉందని తెలుసుకుంది. అంతవరకే ఆమెకు తెలుసు. కానీ ఒక భక్తురాలు భగవంతుని చూడాలని గాఢంగా కాంక్షిస్తే, అన్నీ వాటంతటవే సమకూరుతాయి. అప్పటి నా వయస్సు 13 సంవత్సరాలు. ఆమె నన్ను వెంట తీసుకుని, బాగా శ్రమతో కూడుకున్న, సుదీర్ఘమైన దుర్భర ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

ముందుగా ఎడ్లబండిలో సవర్సాయి నుండి 100 మైళ్ళ దూరంలో ఉన్న ఖోపోలి కర్జత్ వరకు ప్రయాణించాము. కర్జత్ నుంచి రైలులో ప్రయాణం సాగించి ఎలాగో మొత్తానికి ఏ ఇబ్బందీ లేకుండా శిరిడీ చేరుకున్నాము. అయితే ప్రయాణంలో ఆమె మనస్సంతా, "శిరిడీలో కలరా వంటి అంటువ్యాధులు తరచూ వస్తుంటాయని విన్నాను. ఇప్పుడు నా కొడుకుకు కలరా వస్తే నేను ఏం చెయ్యాలి?" అన్న అనుమానంతో ఉంది. ఏదేమైనా శిరిడీ చేరాక, బాబా దర్శనం చేసుకుని నమస్కరించుకుందామని ద్వారకామాయికి వెళ్ళాము. మా అమ్మ ద్వారకామాయి మెట్లు ఎక్కిన వెంటనే బాబా, "నిన్ను ఎవరన్నా అడిగారా ఇక్కడకు రమ్మని? నీ నగలు కుదువపెట్టి ఇక్కడికెందుకు వచ్చావు? నీ భర్త నిరాకరించినా కూడా ఎందుకు వచ్చావు? నేనేమైనా నిన్ను ఇక్కడకు రమ్మన్నానా?" అని అరవడం మొదలుపెట్టారు. ఆ క్షణమే మా అమ్మ 'బాబా సర్వవ్యాపి' అని గుర్తించారు. ఆయనకు మా  ఇంట్లో జరిగిన ప్రతీ విషయం తెలుసు. ఆనందం పొంగిపొర్లగా ఆమె, "బాబా! నేను మీకు ఏ సేవ చేయగలను?" అని అడిగింది. అప్పుడు బాబా, "నీ కొడుకుకు కలరా సోకిందా? సరే, అలా ఉండనీ. అరే మాయీ(అమ్మా)! నీ ముందు ఉన్న ద్వారం ప్రక్కన అందమైన మారేడు చెట్టు ఉంది. నాకు దాని ఆకులు(బిల్వ పత్రాలు) సమర్పించు" అన్నారు. తరువాత బాబా మమ్మల్ని ఆశీర్వదించి, పిడికిలినిండా ఊదీ ఇచ్చారు. బాబా తమ స్వహస్తాలతో తమ చిత్రపటాన్ని కూడా మాకు ఇచ్చారు.

శిరిడీ యాత్ర తరువాత మా అమ్మ జీవితం మొత్తం మారిపోయింది. ఆమె తన తుదిశ్వాస వరకు మర్చిపోకుండా ప్రతిరోజూ బాబా చిత్రపటానికి ఆ చెట్టు ఆకులు సమర్పిస్తూ, తన సమయమంతా అవసరంలో ఉన్నవాళ్లకు సేవ చేసేవారు. అమ్మ తెలివిగా ఎక్కువగా కాకుండా మితంగా బాబా ఊదీని జబ్బులతో బాధపడుతున్నవాళ్లకు, ప్రసవం కష్టంగా ఉన్న తల్లులకు ఇస్తుండేవారు. దానితో వాళ్ళ సమస్యలు తీరిపోయేవి. తొందరలోనే ఆమె గ్రామస్థులందరికీ ఇష్టమైన పిన్ని(కాకు)గా మారింది. బాబా ఆమెకు ప్రసాదించిన ఇంకొక వరం ఏమిటంటే, ఉపాయం చెప్పడం(knack of predicting నేర్పుతో అంచనా వేయడం). గ్రామస్తులు ఆమె దగ్గరకు వచ్చి తప్పిపోయిన ఆవులు, దూడలు గురించి అడిగేవారు. అప్పుడు కాకు బాబాను ప్రార్థించి, అవి ఎక్కడ దొరుకుతాయో ఖచ్చితంగా చెప్పేవారు. ఆమె రైతులకు, గొర్రెల కాపరులకు, దళితులకు ఏదో ఒకరకంగా సహాయం చేసేవారు. ఆమె చనిపోయే చివరిరోజు వరకు కూడా ఎన్నడూ బాబా ఆమెకు ప్రసాదించిన చిత్రపటాన్ని పూజించకుండా ఉండలేదు. అది ఇప్పటికీ మాతోనే ఉంది." 

చివరిగా శ్రీమతి మంగళ ఇలా చెప్తున్నారు: "ఈ అద్భుత లీలలు విన్న తరువాత, నేను కూడా ఆ చెట్టు ఆకులు బాబాకు సమర్పించటం మొదలుపెట్టాను. నేను గర్వంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే, బాబా తమ స్వహస్తాలతో ఆమెకిచ్చిన చిత్రపటం ఇప్పటికీ మా వద్దనే ఉంది, దాన్ని మేము పూజిస్తున్నాము".

Ref: సాయిప్రసాద్ దీపావళి సంచిక, 1999.
సోర్స్: Baba’s Divine Manifestations by విన్నీ చిట్లూరి.

సాయిభక్తుల అనుభవమాలిక 21వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు: 
  • బాబా నా ప్రార్థన విన్నారు.
  • బాబా నా వైవాహిక జీవితాన్ని నిలబెట్టారు.

బాబా నా ప్రార్థన విన్నారు.

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు. నా భర్త బాబా భక్తుడు కాదు. అందువలన నేను తనతో నా అనుభవాలను పంచుకోలేను. కానీ ఈ బ్లాగు ద్వారా నా ఆనందాన్ని మీతో పంచుకుంటాను.

ఒకరోజు ఉదయం 5 గంటలకు హఠాత్తుగా నాకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. కనీసం మంచంమీదనుంచి లేవలేకపోయాను. మావారిని నిద్రలేపితే అతనికి నిద్ర సరిపోదు, తను ఆఫీసుకు వెళ్ళవలసి ఉంది కాబట్టి తనని మేల్కొల్పదలచుకోలేదు. ఖాళీ కడుపుతో పెయిన్ కిల్లర్స్ వేసుకోలేను. అలాగని కడుపునొప్పి భరించలేకున్నాను. ఆ స్థితిలో, 'ఓం సాయిరామ్' అని స్మరిస్తూ నా పడక పక్కన ఉన్న నీటిలో బాబా ఊదీ కలిపి నన్ను త్రాగమంటున్నట్లు ఊహించుకుని ఆ నీటిని త్రాగాను. నా కడుపుపై బాబా తమ మృదువైన చేతితో స్పృశించినట్లు భావించుకున్నాను. క్షణాల్లో నా కడుపునొప్పి అదృశ్యమైపోయింది. ఇక నా ఆనందాన్ని, ఆ క్షణాన నేను పొందిన భావోద్వేగాలను పదాలలో చెప్పలేను. చాలా చాలా ధన్యవాదాలు బాబా!

బాబా నా వైవాహిక జీవితాన్ని నిలబెట్టారు.

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

కొన్ని నెలల క్రితం బాబా ఇచ్చిన మొదటి అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నాకు వివాహమై ఐదేళ్లయినా సంతానం కలగలేదు. మొదట్లో మావారు చికిత్స కోసం నాతోపాటు డాక్టర్ వద్దకు వచ్చేవారు. కానీ, కొన్నాళ్ల తర్వాత రావడం మానేశారు. పిల్లలు లేరన్న ముఖ్యకారణంతో పాటు మరికొన్ని కారణాలవలన నా అత్తమామలు, ఇతర కుటుంబసభ్యులు నన్ను ప్రతిదానికీ అవమానిస్తూ ఉండేవారు. నేనసలే స్వశక్తిపై ఆధారపడలేని బలహీనురాలిని. అలాగని తల్లిదండ్రులకి భారం కాలేను. కానీ అత్తమామల టార్చర్ భరించలేక జనవరి నెలలో ఇల్లు వదిలి బయటకు వచ్చేసాను.



నా మేలుకోరే మా పనిమనిషి (అలా అనే కంటే తనని సహాయకురాలు అంటే బాగుంటుంది.) ఒకరోజు నాకు ఫోన్ చేసినా వైవాహిక జీవితాన్ని కాపాడుకోవడానికి 'నవ గురువార వ్రతం' చేయమని సలహా ఇచ్చింది. నన్ను కాపాడడానికి బాబాయే తన ద్వారా అలా చెప్పించారని నాకనిపించి వ్రతం మొదలుపెట్టాను. 8వ వారం వ్రతం చేసిన తర్వాత నాకెందుకో తిరిగి ఇంటికి వెళ్ళి నా హక్కు కోసం పోరాడాలనిపించింది. అప్పటికే వాళ్ళు నాకు ఎంతో కొంత మనోవర్తి చెల్లించి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు. ఆ సమయంలో నేను నా భర్త ఇంటికి మళ్ళీ వెళ్లాను. నేను వెళ్ళే సమయానికి నా భర్తగానీ, అత్తమామలుగానీ ఇంట్లో లేరు. నేను సాయి నామం తలుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళాను. కొద్దిసేపటికి నా భర్త, అత్తమామలు ఇంటికి వచ్చారు. మా అత్తగారు నేను నా భర్తతో కలిసి ఉండడానికి ఒప్పుకోలేదు. నా భర్త కనీసం నాతో మాట్లాడడానికి కూడా అంగీకరించలేదు. నేను బాబా ముందు కూర్చుని"బాబా! నాకెందుకు ఇంతటి అవమానం?" అని చాలా ఏడ్చాను. బాబా కృపవలన అద్భుతంగా నాలో ఏదో తెలియని శక్తి ప్రవేశించి నా హక్కులకోసం పోరాడడానికి మొండిగా నిల్చున్నాను. తొమ్మిదో వారం వ్రతం పూర్తి చేశాక హఠాత్తుగా మా అత్తగారిలో ఏ మార్పు వచ్చిందో గానీ, ఇల్లు వదిలి తన కూతురింటికి వెళ్ళిపోయింది. తర్వాత నిదానంగా అన్నీ సర్దుకున్నాయి. ఇప్పుడు నా భర్త నన్ను ఎంతగానో గౌరవిస్తున్నారు. ఇదంతా బాబా కృపే. త్వరలోనే బాబా మాకు సంతానాన్ని కూడా అనుగ్రహిస్తారని నాకు తెలుసు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

సాయిభక్తుల అనుభవమాలిక 20వ భాగం....


సాయి ఒక్కరే మాకు ఉన్న తోడు

మలేషియానుండి సాయిభక్తురాలు కన్మణి తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను బాబాకు చిన్న భక్తురాలిని. మా అమ్మ మాత్రం సాయిబాబాకు పరమభక్తురాలు. బాబా పాదాలు కడగడం, ఆయన కోసం టీ, టిఫిన్ తయారుచేయడంతో తన రోజు మొదలై, సాయికి సంబంధించిన పుస్తకాలు చదవడంతో ముగుస్తుంది. ఆమె త్రికరణశుద్ధిగా బాబాను ప్రార్థిస్తూ ఉంటుంది. మా జీవితాలలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. అయితే బాబా మాకెంతో సహాయం చేశారు.

2016, ఏప్రిల్ లో హఠాత్తుగా మా నాన్నగారు చనిపోయారు. దానితో మా అమ్మ చాలా కృంగిపోయింది. అప్పటికి నాకు ఉద్యోగం కూడా లేదు. ఫైనాన్షియల్ గా అంతంత మాత్రమే ఉన్న మేము జీవితాలను ఎలా కొనసాగించాలో అర్థం కాలేదు. అటువంటి స్థితిలో సాయి ఒక్కరే మాకు ఉన్న తోడు. నేను, "బాబా! మీ మీద నమ్మకంతోనే మా జీవితాలను కొనసాగిస్తాము" అని ప్రార్థించాను. బాబా ఇచ్చిన ధైర్యంతోనే మేము ఆ విషాదకర పరిస్థితినుండి బయటపడగలిగాం. ఒక శుభదినాన మా అమ్మ ట్యూషన్ టీచర్ కావాలని ఇచ్చిన ఒక పాంప్లెట్ నాకు చూపించి, నన్ను ప్రయత్నించమంది. బాబా కృపవలన నాకు ఆ ఉద్యోగం వచ్చింది. కానీ నాకు ఏ అనుభవం లేనందున 30 మంది టీనేజర్స్ ముందు నిలిచి బోధించడానికి చాలా భయపడ్డాను. కానీ బాబా ఇచ్చిన ధైర్యంతో నిలదొక్కుకోగలిగాను. బాబా నాకొక ఉద్యోగాన్ని చూపి మా జీవితాలకు ఒక భరోసా కల్పించారు. ఆయన కృపవలన ఇప్పుడంతా సవ్యంగా సాగుతోంది.

2018లో ఒకసారి మా అమ్మ తీవ్రమైన చేయినొప్పితో బాధపడ్డారు. కొంచెం కూడా చెయ్యి పైకి ఎత్తలేకపోయేది. తను పడుతున్న బాధ చూడలేక నేను చాలా ఆందోళనపడి, "బాబాను ప్రార్థించమ"ని తనకి సలహా ఇచ్చాను. అయితే తను బాబాను ప్రార్థించినప్పటికీ నొప్పి ఏమాత్రం తగ్గలేదు. మరుసటిరోజు నేను ఆఫీసునుంచి వచ్చేసరికి కూడా తనకు నొప్పి అలాగే ఉండటంతో నాకు చాలా దిగులుగా అనిపించింది. వెంటనే ఫ్రెషప్ అయ్యి బాబా ముందు కూర్చుని, "బాబా! అమ్మ చేయినొప్పి తగ్గించండి, తన నొప్పి తగ్గితే జీవితాంతం సచ్చరిత్ర చదువుతాను" అని బాబాకు వాగ్దానం చేశాను. తర్వాత రాత్రి పడుకోబోయే ముందు అమ్మ చేతికి బాబా ఊదీ పూసాను. అద్భుతం! తెల్లవారేసరికి ఆమె చేయినొప్పి పూర్తిగా తగ్గిపోయింది. నాలాంటి మామూలు భక్తురాలి మాట కూడా వింటానని బాబా నాకు ఋజువు చేయడమే కాకుండా, "స్వయంగా నువ్వే హృదయపూర్వకంగా నన్ను ప్రార్థించి అద్భుతాన్ని చూడు!" అనే పాఠాన్ని కూడా నేర్పించారు. 

మరోసారి, నేను నా ఆఫీసు పని అయిపోయాక ఫోన్ చూస్తుండగా నా మెడభాగం నుండి తల వరకు లాగేస్తున్నట్లుగా ఉన్నట్లుండి నొప్పి రావడం మొదలైంది. దానితో నేను నా తల పైకి ఎత్తడం గాని, కిందకు దించడం గాని చేయలేకపోయాను. కానీ నేనేమీ ఆందోళనపడలేదు. ఎందుకంటే మా ఇంట్లో అద్భుతమైన ఔషధం(ఊదీ)ఉంది. ఇంటికి వెళ్లాక, బాబా ఊదీ తీసి నొప్పి ఉన్న ప్రాంతమంతా రాశాను. అంతే! కొద్దినిమిషాల్లో నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. నా జీవితంలో బాబా ఉండటం చాలా చాలా గొప్ప విషయం. "బాబా! తెలిసీ తెలియక చేసిన నా తప్పులు మన్నించి, ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండండి. లవ్ యు సో మచ్ బాబా!"

సాయిభక్తుల అనుభవమాలిక 19వ భాగం....


సరైన సమయంలో బాబా అందించిన సహాయం

యు.ఎస్. నుండి అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! హాయ్! నేను సాయి బిడ్డని. 'ఓం సాయి రాం' అన్న మూడు మ్యాజికల్ పదాలు నాకెంతో సంతోషాన్నిస్తాయి. ఆ మూడు పదాలే నా ఊపిరి(om sAIRam).

ఒకసారి నేను దౌత్య(రాయబార) కార్యాలయంలో వీసా ఇంటర్వ్యూ కోసం కెనడా బయలుదేరాను. నా టికెట్స్ నేరుగా కెనడాకు కాకుండా, మధ్యలో ఒకచోట దిగి, అక్కడినుండి వేరే కనెక్టివిటీ ఫ్లైట్ ఎక్కేలా బుక్ చేయబడ్డాయి. ఫ్లైట్ సమయానికన్నా 4 గంటలు ముందు ఎయిర్‌పోర్ట్ చేరుకుని, చెక్-ఇన్ కూడా అయ్యి, టెర్మినల్ గేటు వద్ద సిబ్బందికి నా టికెట్ చూపించాను. వాళ్లు, "ఫ్లైట్ 30 నిమిషాలు ఆలస్యం. కాబట్టి వేచి ఉండండి" అని చెప్పారు. నేను వాళ్ళ ఎదురుగా కూర్చుని నా భర్తతో ఫోనులో కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటున్నాను. నేను అలా మాటల్లో ఉంటుండగా, ఎయిర్‌లైన్స్ సిబ్బంది కస్టమర్స్‌ని పిలిచి గేట్ క్లోజ్ చేసారు. నేను ముఖ్యమైన వ్యక్తులను ముందుగా పిలుస్తున్నారేమో అనుకున్నాను. కానీ అనుమానం వచ్చి వాళ్లని అడిగాను. వాళ్ళు, "అందర్నీ పంపించేసి గేట్లు క్లోజ్ చేసాం. ఇక మిమ్మల్ని పంపలేము" అన్నారు. నేను వాళ్లకి నా టికెట్ చూపించి, వాళ్ల ముందే కూర్చుని ఉన్నప్పటికీ వాళ్లు నిర్లక్ష్యంగా నన్ను పిలవకుండా వదిలేశారు. నాకు చాలా దిగులుగా అనిపించింది. మరుసటిరోజే ఇంటర్వ్యూ ఉంది. దానికోసం నేనెంతో కష్టపడి ప్రత్యేకమైన కెనడా వీసా కూడా సంపాదించాను. కానీ చివరిక్షణంలో ఇలా అయ్యేసరికి నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. సాయిని ప్రార్థించి, మళ్లీ సిబ్బందిని సంప్రదించి, "వేరే ఫ్లైట్‌లో వెళ్ళడానికి ఏమైనా సర్దుబాటు చేయగలరా?" అని అడిగాను. కానీ వాళ్లు అందుకు కూడా 'నో' అన్నారు. ఏం చేయాలో అర్థంకాక మౌనంగా కూర్చుని, "బాబా! నేనెలాగైనా ఈరోజు ప్రయాణం చేయగలిగితే నా అనుభవాన్ని సైటు ద్వారా పంచుకుంటాను" అని ప్రార్థించాను.

తర్వాత ఎయిర్‌లైన్స్ లేడీ సిబ్బందితో మాట్లాడటానికి ప్రయత్నించాను. తను నన్ను చాలాసేపు వెయిట్ చేయించిన తరువాత కూడా అడ్డంగా వాదించింది. అయినా సహనంతో నా పరిస్థితి అంతా వివరించి, "ఏదో ఒక సహాయం చేయమ"ని అభ్యర్థించాను. చివరికి బాబా కృపవలన ఆమె తన మేనేజరుతో మాట్లాడి, వేరే ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన డైరెక్ట్ ఫ్లైట్‌లో నేను వెళ్లేందుకు ఏర్పాటు చేసింది. అప్పుడు అసలు విషయం తెలిసింది, ప్రతికూల వాతావరణం కారణంగా వేరే చోట నేను ఎక్కవలసిన కనెక్టివిటీ ఫ్లైటు ఆరోజు రద్దు చేయబడిందని. నేను గనక ఫ్లైట్ మిస్ కాకపోయి ఉంటే, అటూ ఇటూ కాకుండా మధ్యలో ఇరుక్కుపోయేదాన్ని. నేను ఎక్కిన ఫ్లైట్ ఒక్కటే ఆరోజు నేరుగా కెనడా వెళ్లే ఫ్లైట్. అది కూడా వాతావరణం కారణంగా 5 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. మిగతా అన్ని ఫ్లైట్లు రద్దు చేయబడ్డాయి. ఆవిధంగా బాబా నా ఫ్లైట్ మిస్ అయ్యేలా చేసి, డైరెక్ట్ ఫ్లైట్ అందించి సరైన సమయంలో ఇంటర్వ్యూకు హాజరయ్యేలా చేసారు. ఆయన కృపతో నా స్టూడెంట్ వీసా ఆమోదించబడింది. అంతా బాబా లీల. ఆయనకు భూత, భవిష్యత్, వర్తమానాలు తెలుసు. తదనుగుణంగా ఆయన అన్నీ చేస్తారు. ఆయనే తన భక్తులను నడిపిస్తారు. తన భక్తులకు ఏది అవసరమో అది అందిస్తారు. "థాంక్యూ సో మచ్ బాబా!"

మరో అనుభవం:

నేను కొన్ని నెలలుగా డ్రైవింగ్ చేస్తున్నాను. వాస్తవానికి ఎవరి సూచనలు లేకుండా ఒక్కదాన్నే చాలా బాగా డ్రైవ్ చేయగలను. అలాంటిది నేను డ్రైవింగ్ టెస్టుకి వెళితే, కొన్ని సూచనలిచ్చి మళ్ళీ రమ్మని చెప్పారు. నేను 3-4 సార్లు వెళ్లినా ప్రతిసారీ ఇదే చెప్తుండేవారు. దానితో నేను విసుగుచెంది కొన్ని నెలల పాటు టెస్టుకు వెళ్లడమే మానేసాను.

ఒకరోజు ఉదయం ఆలస్యంగా లేచినప్పటికీ లేస్తూనే ఆరోజెందుకో డ్రైవింగ్ టెస్టుకు వెళ్లాలనిపించింది. తరువాత వెళ్తున్నప్పుడు కూడా నా మనసులో చాలా సందేహాలు చోటుచేసుకున్నాయి. నేను అక్కడికి చేరాక, ఒక వ్యక్తి సిస్టమ్స్ డౌన్ కారణంగా ఈరోజు ఎవరికీ టెస్టులు తీసుకోవడం లేదని చెప్పారు. కానీ నేను వినిపించుకోకుండా లోపలికి వెళ్లి, పరీక్ష తీసుకోమని బలవంతపెట్టాను. సరే, వేచి ఉండమని చెప్పారు. 2 గంటల కంటే ఎక్కువ సేపు వేచి ఉన్న తరువాత డ్రైవింగ్ టెస్టంటే ఆసక్తి కోల్పోయాను. కొంతసేపటి తరవాత మొత్తానికి నన్ను పిలిస్తే, వెళ్లి క్యూలో నిల్చున్నాను. ఆరోజు ఇద్దరు పరిశీలకులు ఉన్నారు. మొదటి వ్యక్తి కాస్త కూల్ గా కనిపించడంతో తనే నా పరీక్ష తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాను కానీ, రెండో వ్యక్తి నా దగ్గరకు వచ్చి తనని అనుసరించమని చెప్పాడు. అప్పుడు నేను, "బాబా! ఈసారి నేనెలాగైనా పాస్ కావాలి. అలా అయితే నా అనుభవాన్ని వెబ్‌సైట్‌లో షేర్ చేస్తాను" అని ప్రార్థించి పరీక్షకు హాజరయ్యాను. డ్రైవింగులో ఒకటి, రెండు చిన్న పొరపాట్లు చేయడంతో, ఖచ్చితంగా మళ్ళీ రమ్మంటారని అనుకున్నాను. అయితే ఆశ్చర్యంగా అతను, "మీరు పాసయ్యారు" అన్నాడు. నేను 6 నెలలుగా ఈ పదాలు వినడానికి వేచి చూస్తున్నాను. చివరకు సాయి ఎంతో కృపతో నాకు సహాయం చేసి డ్రైవింగ్ పరీక్షలో పాస్ చేసారు.

నేను దాదాపు 9 నెలల నుండి మరో విషయంలో సాయి కృప కోసం ఎదురుచూస్తున్నాను. అందుకు సహనంతో ఉండాలి నేను. సహనం అంటే నా ఉద్దేశ్యం - "సంతోషంతో కూడిన సహనం". "బాబా! నా చిన్నప్పటినుండి ఎప్పుడూ నా కోరిక తీర్చడంలో మీరు ఇంత సమయం తీసుకోగా నేను చూడలేదు. కానీ ఇది నా జీవితానికి సంబంధించిన ముఖ్య విషయం. ప్లీజ్ సాయీ! నన్ను ఆశీర్వదించండి".

సాయిభక్తుల అనుభవమాలిక 18వ భాగం....


బాబా చెంతకు చేరిన రెండు పిచ్చుకలు

సాయిభక్తురాలు హేతల్ పాటిల్ రావత్ గారు చెప్తున్న మరికొన్ని అనుభవాలు.

"పిచ్చుక కాలికి దారంకట్టి ఈడ్చునట్లు నా భక్తులను నేను నా వద్దకు లాగుకుంటాను" అని బాబా చెప్పారు. అలా బాబా చెంతకు చేరిన రెండు పిచ్చుకల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అతుల్ అనే వ్యక్తి ఒక ఫార్మా కంపెనీలో పని చేస్తుండేవాడు. అతనికి బాబాతో ఏ మాత్రం పరిచయం లేదు. ఒకసారి మందులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో అతనిని సస్పెండ్ చేయడమే కాకుండా, అతనిపై కేసు కూడా నమోదు చేసింది కంపెనీ. దాంతో అతను తనపై ఆధారపడివున్న కుటుంబం గురించి చాలా కలతచెందాడు. అటువంటి సమయంలో సాయిబాబాకు అంకిత భక్తుడైన అతని స్నేహితుడు, "ఈ విపత్తునుండి బయటపడటానికి సాయిబాబా పేరుమీద ఉపవాసం ఉండమ"ని సలహా ఇచ్చాడు. తన స్నేహితుని సలహా ప్రకారం అతుల్ 11 గురువారాలు ఉపవాసం పాటించి, సాయి మందిరానికి కాలినడకన వెళ్తుండేవాడు. కొద్దిరోజులు గడిచిన తరువాత కంపెనీనుండి అతనికి ఫోన్ వచ్చింది. విషయమేమిటంటే, అతనిపై పెట్టిన ఆరోపణలను, కేసును కంపెనీ ఉపసంహరించుకోవడమే కాకుండా అతనిని మునుపటి కన్నా చాలా ఎక్కువ జీతంతో తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఆ సంఘటన అతనిలో బాబాపట్ల పూర్తి విశ్వాసాన్ని నింపింది. ఇప్పుడతడు తరచూ శిరిడీ సందర్శిస్తూ ఎన్నో అనుభవాలను మూటకట్టుకున్నాడు.

మరో అనుభవం:


సాయిబాబా కృపను ఆయన భక్తులు పొందడం సాధారణమైన విషయమే. కానీ ఆయనను విశ్వసించని వాళ్ళపై కూడా ఆయన అంతే కృప చూపుతున్నారు. ఆ విషయాన్నే స్పష్టం చేస్తుంది నేనిప్పుడు చెప్పబోయే నా మేనమామ సునీల్ కలే గారి అనుభవం. ఆయన తన 50 ఏళ్ళ వయస్సులో ఏనాడూ దేవుడిని నమ్మేవారు కాదు. ఎప్పుడూ ఏ దేవుడినీ ప్రార్థించలేదు, పూజించలేదు. కనీసం అన్నేళ్లలో ఒక్కసారి కూడా దేవాలయానికి వెళ్ళలేదు. అలాంటతను ఇప్పుడు సాయిబాబాకి గొప్ప భక్తుడు. 2007 - 2008 లో ఆయన కొడుకు MCA చేస్తున్నాడు. తనకి కంప్యూటర్స్‌లో బాగా ఆసక్తి ఉన్నప్పటికీ కామర్స్ బ్యాగ్రౌండ్ నుండి వచ్చినందువలన MCA సబ్జెక్ట్స్ విషయంలో బాగా కష్టపడాల్సి వచ్చింది. కష్టపడి చదివినప్పటికీ మొదటి సెమిస్టర్ లోని ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. దాంతో మా మామయ్య చాలా ఆందోళన చెంది మా అమ్మకు ఫోన్ చేసి, "నా కొడుకు చాలా కష్టపడి చదువుతున్నప్పటికీ కావలసిన ఫలితం పొందలేకపోతున్నాడు. ఏదైనా పరిష్కారం చూపించు" అని అడిగారు. సాయిభక్తురాలైన అమ్మ మా ఆంటీతో, 9 గురువారాలు ఉపవాసం పాటించి సాయిబాబాను ప్రార్థించి, సాయి మందిరానికి వెళ్ళమని చెప్పింది. ఆమె తక్షణమే అందుకు అంగీకరించి అమ్మ చెప్పినట్లు చేసింది. బాబా వారికి తోడుగా నిలిచారు. అంకితభావంతో మా ఆంటీ చేసిన ప్రార్థనలకు బాబా 9 గురువారాలలోపే సమాధానం ఇచ్చారు. ఆ సంఘటనతో మా మామయ్యకు బాబా యందు నమ్మకం కుదిరింది. ఇప్పుడు ఆయన ప్రతి గురువారం సాయి మందిరానికి వెళుతున్నారు. ప్రతి గురువారంనాడు బాబాకు సమర్పించడం కోసం కొబ్బరికాయ, కోవా, పూలు, అగరుబత్తీలు ముందురోజే తెచ్చిపెట్టుకుంటున్నారు. అంతలా ఆయనలో మార్పు వచ్చింది. అంతా బాబా లీల.


గమనిక: ఎన్నో లీలల ద్వారా బాబా ఉపవాసాలు ఉండవద్దని సూచించారు. అందువలన ఉపవాసం ఉండటానికి బాబా అనుగ్రహానికి ఏ సంబంధం లేదు. బాబాకు ఒక చిన్న ప్రార్ధన సరిపోతుంది. బాబా ఇష్టానుకనుగుణముగా నడుచుకోవడం వలన బాబా అపార అనుగ్రహానికి పాత్రులం కాగలం.

సాయిభక్తుల అనుభవమాలిక 17వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  • ఫకీరుబాబా వేరెవరో కాదు, సాయిబాబాయే.
  • మానసికంగా గుర్తు పెట్టుకుంటే చాలు బాబా ఎప్పుడూ భక్తునికి అండగా ఉంటారు.


ఫకీరుబాబా వేరెవరో కాదు, సాయిబాబాయే

సాయిభక్తురాలు, సాయియుగ నెట్‌వర్క్ (www.shirdisaibabaexperiences.org) బ్లాగు నిర్వాహకురాలు హేతల్ పాటిల్ రావత్ గారి అనుభవాలు:

2007, జనవరి 14 మకరసంక్రాంతికి నేను మా కుటుంబంతో పాటు శిరిడీ వెళ్ళాను. మా అమ్మ బాబాకు సమర్పించేందుకు నువ్వుల లడ్డూలు తయారుచేసింది. మేము కాకడ ఆరతికి హాజరయ్యాము. ఆరతి తరువాత బాబాకు మంగళస్నానం చేయించడం కూడా చూసాం. ఆ తరువాత సమాధిమందిరంలో బాబాకు లడ్డూ ప్రసాదం సమర్పించుకున్నాము. తరువాత మేము ద్వారకామాయికి వెళ్లి అక్కడ ప్రసాదం పంపిణీ చేయగా, రెండు లడ్డూలు మాత్రం మిగిలిపోయాయి. నా సహోద్యోగి ఒకరు బాయజాబాయి ఇంటిని సందర్శించమని సలహా ఇచ్చివుండటంతో  అక్కడికి వెళ్ళాలని మేము ద్వారకామాయి ఎదురుగా ఉన్న లైన్లోకి వెళ్ళాము. మేము ఒక స్థలానికి చేరుకున్నాము, అక్కడనుండి లక్ష్మీబాయిషిండే ఇంటిని చూడవచ్చు, కానీ మాకు ఆ విషయం తెలియదు. అక్కడ కూర్చునివున్న ఒక ఫకీరుబాబా, "మీ కళ్ళముందే లక్ష్మీబాయి ఇల్లు ఉంది" అని చెప్పారు. మేము వెంటనే లోపలికి వెళ్లి లక్ష్మీబాయికి సాయిబాబా ఇచ్చిన పవిత్ర నాణేలను దర్శించుకుని ఆనందించాము. తరువాత ఆ ఫకీరుబాబా తనంతట తానే మాతో వచ్చి మహల్సాపతి ఇంటిని, మాధవరావు దేశ్‌పాండే మనుమడి ఇంటిని మాకు చూపించారు. మా నాన్నగారు అతను చేసిన సహాయానికి డబ్బులు ఇవ్వబోయారు, కానీ అతను తిరస్కరించి, తనకు ఆహారం కావాలని చెప్పారు. మా ఆహారపదార్ధాలు హోటల్లో ఉన్నాయి. హోటల్ కూడా మేమున్న చోటుకు దూరంగా ఉంది. అంతలో మా అమ్మకు లడ్డూలు గుర్తుకువచ్చి వాటిని అతనికి ఇచ్చింది. లడ్డూలు స్వీకరించాక అతని ముఖంలో సంతృప్తి స్పష్టంగా కనిపించింది. అప్పుడు ఆ ఫకీరుబాబా వేరెవరో కాదు, మన సాయిబాబాయే అని గ్రహించి, ఆయన స్వయంగా మానవరూపంలో వచ్చి మా ప్రసాదం స్వీకరించారని మేమంతా చాలా సంతోషించాము.


మానసికంగా గుర్తు పెట్టుకుంటే చాలు బాబా ఎప్పుడూ భక్తునికి అండగా ఉంటారు.

సాయి భక్తుడు హితేష్(dhara) ఖేరాడియా గారి అనుభవం:
"నాకు పూజాసామాగ్రి గాని, అష్టోపచార షోడశోపచార పూజలు గాని అవసరం లేదు. అపరిమితమైన భక్తి ఉన్నచోటే నా నివాసం" అన్న సాయి సచ్చరిత్రలోని వాక్యాలు ఎంత సత్యమో అనడానికి మీరిప్పుడు చదవబోయే అబ్బురపరిచే లీలే సాక్ష్యం!

బరోడా(గుజరాత్)లో నివసిస్తున్న ఒక సాయిభక్తుడు వ్యాపారనిమిత్తంగా తరచూ జామ్‌నగర్(సౌరాష్ట్ర ప్రాంతం, గుజరాత్) వెళ్తుండేవాడు. అలా ఒకసారి జామ్‌నగర్ వెళ్లి పని పూర్తి చేసుకుని తన సొంత కారులో ఒంటరిగా బరోడాకు తిరిగి ప్రయాణమయ్యాడు. బాగా అలసిపోయి ఉండటం వలన అర్థరాత్రి సమయంలో నిద్ర కమ్ముకొచ్చింది. తనకు తెలియకుండానే డ్రైవ్ చేస్తూ నిద్రపోయాడు. కొంతసేపటికి ప్రక్కనుండి ఓవర్‌టేక్ చేస్తున్న ఒక ట్రక్కు కారు యొక్క ఎడమ భాగాన్ని తాకడంతో అతనికి మెలుకువ వచ్చింది. వెంటనే తను అహ్మదాబాదు హైవే మీద ఉండటం గమనించి, బరోడా మార్గంలోకి కారు మళ్ళించాడు. కానీ, జరిగిన అద్భుతానికి ఆశ్చర్యపోయాడు. "నిద్రలో 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించానా?" అని నిర్ఘాంతపోయాడు. మార్గంలో చాలా మలుపులున్నాయి కానీ, కారు సాఫీగా ముందుకెళ్ళింది. దారిపొడవునా ఇతర వాహనాలు ప్రయాణిస్తున్నాయి. అయినప్పటికీ తన శరీరంపై చిన్న గీత కూడా కాకుండా సురక్షితంగా ప్రయాణం సాగింది. అంచనాలకు అందని అద్భుతం! అదెలా సాధ్యమో ఎవరైనా ఊహించగలరా? అవును... మీ ఆలోచన నిజం! సాయే స్వయంగా అతని కారు నడిపారు. ఆ భక్తుడెప్పుడూ సాయి ముందు ఎటువంటి ప్రార్థనలు చేసి ఎరుగడు. కనీసం తరచూ బాబా మందిరానికి వెళ్లిన వ్యక్తి  కూడా కాదు. కానీ అతను మనసారా సాయిని తలుచుకుంటాడు. తన ఆఫీసుకు వెళ్ళినప్పుడు లేదా ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు తన కారులో సాయి హారతి గాని, సాయి భజనలు గాని పెట్టుకుంటాడు. అంతే అతను చేసేది. కానీ బాబా ఎంతలా అండగా ఉన్నారో చూసారా?

ఈ అనుభవం ద్వారా బాబా, తమను మానసికంగా గుర్తు పెట్టుకుంటే చాలు, తామెప్పుడూ భక్తునికి అండగా ఉంటామని నిరూపించారు.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo