ఈరోజు భాగంలో అనుభవాలు:
- సిల్లీ కోరికను కూడా బాబా నెరవేర్చారు.
దయాసముద్రుడైన సాయిబాబా నా కొడుకుని ప్రమాదం నుండి కాపాడారు.
సిల్లీ కోరికను కూడా బాబా నెరవేర్చారు.
యూఏఈ నుండి సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
ఓం సాయిరాం. నేను నా భర్త, ఐదు సంవత్సరాల కొడుకుతో యూఏఈ లో నివసిస్తున్నాము. నేను ప్రతి గురువారం బాబా గుడికి వెళ్తుంటాను. గత సంవత్సరంలో ఒకసారి నేను సాయి నవగురువార వ్రతం మొదలుపెట్టాను. 8వ గురువారంనాడు నేను చాలా బిజీగా ఉన్నాను. ఎందుకంటే, రెండు రోజుల్లో ఇండియాకి వెళుతుండటం వలన గిఫ్ట్స్ తీసుకోవడం కోసం షాపింగుకి వెళ్ళాల్సి ఉంది. అయినప్పటికీ ఆరోజు బాబా గుడికి వెళ్ళే అవకాశం మాత్రం నేను వదులుకోదలుచుకోలేదు. సమయం తక్కువగా ఉండటంతో నా భర్త నన్ను టెంపుల్ దగ్గర విడిచిపెట్టి, తను మాత్రమే షాపింగుకి వెళ్తానన్నారు. కానీ నాక్కూడా షాపింగుకి వెళ్లాలని ఉంది. ఎందుకంటే గిఫ్టులతోపాటు నేను తీసుకోవలసిన వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. అందువలన ఇద్దరం కలిసి షాపింగుకి వెళ్తే మొత్తం పని అయిపోతుందని నా ఆలోచన. కానీ ఆ విషయం మావారికి చెప్తే ఆయన కోప్పడతారని నేను మౌనంగా ఉండిపోయాను. కానీ త్వరగా గుడికి వెళ్లి, దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేస్తే మావారితో కలిసి షాపింగుకి వెళ్లొచ్చని ఆలోచించి నేను వెంటనే గుడికి వెళ్ళాను. నేను గుడిలో అడుగుపెట్టేసరికి మధ్యాహ్న ఆరతి మొదలుకాబోతోంది. దాంతో నేను పెద్ద సందిగ్ధంలో పడ్డాను. అప్పటికి నేను హారతికి హాజరై చాలారోజులై ఉండటంతో హారతిలో పాల్గొనే అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు. కాబట్టి షాపింగుకి వెళ్లే అవకాశాన్ని కోల్పోతానని అనుకున్నాను. నవగురువార వ్రతం చేస్తున్న 8వ గురువారంనాడు నాకు ఆరతిలో పాల్గొనే అవకాశం రావడం ఆశీర్వాదపూర్వకంగా అనిపించి చాలా సంతోషించాను. హారతి కొనసాగుతుండగా, "బాబా! నాకు షాపింగుకి వెళ్లాలని ఉంది. మీరు ఏదైనా చేసి మావారు ఇంట్లో వేచి ఉండేలా చూడండి" అని ప్రార్థించాను. అలా జరిగితే ఈ అనుభవాన్ని పంచుకుంటానని కూడా బాబాను అడగబోయాను, కానీ సిల్లీగా ఉంటుందేమోనని ఆగిపోయాను. హారతి పూర్తయ్యాక నేను మావారికి ఫోన్ చేశాను కానీ, ఆయన ఫోన్ కట్ చేశారు. నేను త్వరత్వరగా ఇంటికి వెళితే మావారు ఇంట్లోనే కూర్చుని ఫోనులో మాట్లాడుతూ కనిపించారు. అనుకోకుండా తన సహోద్యోగి నుండి ఫోన్ వస్తే, ఆఫీస్ విషయాలు డిస్కస్ చేస్తున్నందున బయటకు వెళ్లలేకపోయానని మావారు చెప్పారు. బాబా నా సిల్లీ కోరికను కూడా నెరవేర్చారని నేను పట్టరాని సంతోషంతో, "థాంక్యూ సో మచ్ బాబా! నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. కోటి కోటి ప్రణామాలు బాబా!" అని చెప్పుకున్నాను.
దయాసముద్రుడైన సాయిబాబా నా కొడుకుని ప్రమాదం నుండి కాపాడారు.
"సాయీ! మాకు తోడుగా ఉంటూ, మార్గనిర్దేశం చేస్తూ, ఎల్లవేళలా రక్షణనిస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదములు".నేను, నా ఐదేళ్ల కొడుకు, ఒక సహాయకునితో యు.ఏ.ఈ నుండి ఇండియాకు బయలుదేరాము. ఏడేళ్ల కాలంలో నేనెప్పుడూ బాబా ఊదీగాని, ఆయనకు సంబంధించిన ఏ వస్తువుగాని తీసుకుని ప్రయాణం చేయలేదు. కానీ ఈసారి నా నవ గురువార వ్రతాన్ని ఇండియాలో ముగించాల్సి ఉండటంతో నేను ఒక పసుపు రంగు క్లాత్, ఊదీ, బాబా ఫోటో ఒకటి నా హేండ్‌బ్యాగులో పెట్టుకున్నాను. మేము ఫ్లైట్ ఎక్కిన తర్వాత మా అబ్బాయి నిద్రపోయాడు. తను ఇండియా చేరుకునేవరకు పడుకునే ఉంటాడని నేను అనుకున్నాను. కానీ, ఒక గంటలోనే వాడు లేచాడు. ఇంకో గంటలో ఇండియాకి చేరుకుంటామనగా నాకెందుకో మా అబ్బాయి విషయంలో ఏదో జరగబోతుందన్న ప్రతికూల ఆలోచనలతో గుండె వేగంగా కొట్టుకోసాగింది. తన టెంపరేచర్ చూస్తే నార్మల్‌గానే ఉంది. నా మనసులో మాత్రం ఆందోళనగా ఉండడంతో వెంటనే ఊదీ తీసి వాడికి పెట్టి, "బాబా! మీరు మాకు తోడుగా ఉండి రక్షించండి" అని ప్రార్థించాను. మేము ముందు సీట్లలో ఉన్నందున ఫ్లైట్ ల్యాండ్ అవుతూనే త్వరగా బయటకు వచ్చాము. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ ఖాళీగా ఉండడంతో ముందు ఆ పని పూర్తి చేద్దామని నేను అనుకున్నాను. మా అబ్బాయి ఎప్పుడూ చలాకీగా ఆటలు ఆడుతూనే ఉంటాడు. అందువలన ఎస్కలేటర్ మీద కుదురుగా ఉండమని వాడిని హెచ్చరించి ఎస్కలేటర్ పైకి వెళ్ళాం. ఇంతలో మా వారు ఫోన్ చేస్తే, "మేము ఇండియా చేరుకున్నాము. ఇమ్మిగ్రేషన్ గురించి వెళ్తున్నాన"ని చెప్తున్నాను. ఇంతలో మా వాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఏమిటా అని చూస్తే, వాడి కాలు ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయి, కాలు బయటికి తీయలేక ఏడుస్తున్నాడు. ఎస్కలేటర్‌లో పిల్లల కాళ్లు ఇరుక్కోవడం వలన జరిగే పరిణామాలకు సంబంధించిన వీడియోలు నా మదిలో మెదిలి, ఏమైనా జరుగుతుందేమోనని భయంతో చాలా కంగారుపడ్డాను. "బాబా! ఎటువంటి చెడు పరిణామాలు జరగకుండా మీరు మాకు సహాయం చేయండి" అని ప్రార్థించాను. ఇంతలో ఎస్కలేటర్ ఆగింది. వాడి కాలు బయటికి తీయడానికి ప్రయత్నిస్తే, ముందు షూ వచ్చింది కానీ, కాలు బయటికి రాలేదు. నెమ్మదిగా ప్రయత్నించగా కాలు బయటకు వచ్చింది. తన కాలికేమైనా గాయం అయివుంటుందేమోనని సాక్స్ తీసి చూసాను. ఆశ్చర్యం! తన కాలిపై చిన్నగా గీసుకున్న ఆనవాలు కూడా లేదు. అంతా బాబా కృప. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఈ పరిస్థితిలో మీరు లేకపోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉండేదో నేనసలు ఊహించలేను కూడా. మీరు మాపై చూపే ప్రేమకి థాంక్స్ అన్నమాట చాలా చిన్నది".
🕉 sai Ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me