సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 23వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  • శ్రీసాయి ఆశీస్సులు
  • శ్రీసాయి దయాసాగరుడు


శ్రీసాయి ఆశీస్సులు

సీతారామాంజనేయులు గారు వాట్సాప్ ద్వారా పంపిన అనుభవాలు:

నాపేరు దివ్వెల సీతారామాంజనేయులు. నేను 25 సంవత్సరాల నుండి సాయిబాబా భక్తుడిని. నా జీవితంలో సాయిమహిమలు ఎన్నో చూశాను. 25 సంవత్సరాల క్రితం బాబా పరిచయమయ్యాక ఆయన దర్శనం కోసం శిరిడీ వెళ్ళడానికి ఎంతో ప్రయత్నం చేసాను. కానీ, ఐదేళ్ల పాటు నేనెంత ఆశపడినా ఏదో ఒక కారణం చేత శిరిడీ వెళ్లడం సాధ్యపడలేదు. చివరికి 2000 సంవత్సరంలో తొలిసారి బాబాను దర్శించుకున్నాను. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం శిరిడీ దర్శించుకునే భాగ్యాన్ని బాబా ఇచ్చారు. 25 ఏళ్లుగా నరసరావుపేట బాబా మందిరంలో సేవ చేసుకునేలా అవకాశమిచ్చి నన్నెంతగానో బాబా అనుగ్రహిస్తున్నారు. నేనిప్పుడు మీతో బాబా మహాసమాధి శతాబ్ది సంవత్సరంలో బాబా నాపై కురిపించిన ఆశీస్సులను పంచుకుంటాను.

2018 బాబా మహాసమాధి శతాబ్ది సంవత్సరంలో బాబా నాకు మూడు అద్భుతాలను చూపారు. అవి...

1)నరసరావుపేట సాయిమందిరంలో మహాసమాధి ఉత్సవాలలో భాగంగా భక్తులతో కోటి సాయి నామార్చన చేయించే కార్యక్రమాన్ని బాబా నాచేత మొదలుపెట్టించి, విజయవంతంగా పూర్తి చేయించి నన్ను అనుగ్రహించారు.

2) నరసరావుపేటకు దగ్గరలో ఉన్న కుంకలగుంట గ్రామంలో 1959లో మా నాన్నగారు నిర్మించిన శ్రీ వీరాంజనేయస్వామి వారి దేవస్థానం పున:నిర్మాణ పనులు నాచేత మొదలుపెట్టించి, 58 రోజులలో పూర్తి చేయించారు. అంతేకాదు, సాయిమందిర నిర్మాణాన్ని కూడా చేపట్టించి, 75,000 రూపాయలతో బాబా విగ్రహాన్ని కూడా ఇప్పించి ప్రతిష్ఠ కావించటం బాబా నాకిచ్చిన గొప్ప వరం. అప్పుడే ఆ మందిరానికి సంబంధించి 29-5-2019న జరగనున్న మొదటి వార్షికోత్సవానికి సన్నాహాలు మొదలయ్యాయి.

3) మరో అద్భుతమైన విషయం, బహుశా ఎవరికీ ఈ భాగ్యం దక్కి ఉండదు. బాబా ఆరతి పుస్తకములు 6000 కాపీలు వేయించి 260 సాయిమందిరాలలో దర్శనానికి వచ్చిన భక్తులకు అందజేసే మహత్తర కార్యాన్ని బాబా నాచేత చేయించారు. 25 సంవత్సరాల నా సేవకు ఫలితమా అన్నట్లు బాబా నాకీ మహద్భాగ్యాన్ని ప్రసాదించారు.

సద్గురువైన శ్రీ శిరిడీ సాయిబాబా సేవకులు:
దివ్వెల సీతారామాంజనేయులు,
విజయవాడ.

మొబైల్ నెంబర్ - 7396677167.

శ్రీసాయి దయాసాగరుడు

యు.ఎస్.ఏ నుండి శిరిడీ సాయిభక్తుడు హరీష్ తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
  
నేనొక సాధారణ భక్తుడిని. నాకు బాబా అంటే చాలా చాలా ఇష్టం. తరచూ ఆయనను తలచుకుంటూ ఉంటాను. ఏ పని మొదలుపెట్టినా పెద్దదైనా, చిన్నదైనా ముందు బాబాని తలచుకుని, ఆయన ఆశీస్సులతో మొదలుపెడతాను. సాయి లీలలు వినడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను.

ఇక నా అనుభవానికి వస్తే... ఒక వారాంతంలో నేను, నా భార్య ఇద్దరం ఒక ఫ్యామిలీని కలవాలని ఒక ప్రాంతానికి ప్రయాణమయ్యాం. ముందుగా వాళ్లు, అందరం ఒక గుడిలో కలుద్దామని, అక్కడనుంచి వాళ్ళ ఇంటికి వెళదామని చెప్పారు. మేము అక్కడికి చేరుకునే లోపల గుడిలో వాళ్ళ పని పూర్తి కావడంతో వాళ్ళు అక్కడనుండి వెళ్ళిపోయారు. మేము గుడి వద్దకు చేరుకుని కారు పార్కింగ్ చేస్తుండగా 'బాబా గుడికి దారి' అని వ్రాసి ఉన్న ఒక బోర్డు చూసి, బాబా దర్శనం చేసుకుని వెళదామని నేను, నా భార్య అనుకున్నాం. ఇంతలో వాళ్ళు ఫోన్ చేసి, "వాతావరణం బాగాలేదు, తుఫాను వచ్చేలా ఉంది. నేరుగా మీరు మా ఇంటికి వచ్చేయండి" అని చెప్పారు. మేము, "దర్శనం చేసుకుని వస్తాము" అని చెప్పి ముందుగా హనుమంతుని దర్శనం చేసుకున్నాం. గుడినుంచి బయటకు వచ్చేసరికి అంతా చీకటిగా అయిపోయి, జోరుగా వర్షం మొదలైంది. అయినా మేమిద్దరం, "బాబా దర్శనం వదులుకోవద్దు, దర్శనం చేసుకునే వాళ్ళ ఇంటికి వెళదామ"ని నిశ్చయించుకుని అంత వర్షంలో బాబా గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నాం. బాబా దర్శనంతో మాకు చాలా చాలా సంతోషం కలిగింది. తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షంలో బాబాని తలుచుకుని, ఫోనులో జి.పి.ఎస్ ఉపయోగించుకుంటూ వాళ్ళ ఇంటికి బయలుదేరాము.  ఇరుకైన గ్రామీణ రోడ్లపై ప్రయాణిస్తున్నాము. దట్టమైన చీకటివలన ఆ వర్షంలో కొద్ది అడుగుల దూరం తప్ప ఏమీ కనిపించట్లేదు. మా ఇద్దరికీ చాలా భయమేసి బాబా నామం తలచుకుంటూ వున్నాము. ఆయనే జాగ్రత్తగా మమ్మల్ని ఇంటికి చేర్చుతారని కారు నిదానంగా పోనిచ్చాను. అంతా అటవీ ప్రాంతం, ఎక్కడా ఒక్క మనిషి కూడా లేడు. బాబా కృపవలన మొత్తానికి 40 నిమిషాల ప్రయాణం తర్వాత క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. అంతటితో అయిపోలేదు, మేము వాళ్లతో జిపిఎస్ ఆధారంగా చేరుకున్నామని చెప్తే, వాళ్లంతా షాక్ అయ్యారు. ఎందుకంటే వర్షానికి ఆ రోడ్డు త్వరగా వరదతో నిండిపోతుందట. పైగా ఎక్కడికక్కడ చెట్లు పడిపోయి దారి మూసుకుపోతుందట. చెప్పాలంటే ఆ మార్గంగుండా వర్షంలో ప్రయాణం సాధ్యమయ్యే విషయం కాదట. ఆ విషయాలు వింటూనే నాకు, నా భార్యకు అర్థమైంది, "ఇక్కడికి వచ్చేముందు బాబా తమ దర్శనానికి రప్పించుకుని, మాకు ఆశీస్సులిచ్చి క్షేమంగా ఇల్లు చేర్చార"ని. ఇంతకన్నా దయగల వారెవరుంటారు? శ్రీసాయి దయాసాగరుడు.

రెండవ అనుభవం:

ఇటీవల మా నాన్నగారికి యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యింది. రోజుకు రెండు ఇంజక్షన్ల చొప్పున మొత్తం పది ఇంజక్షన్లు చేయించాలని డాక్టరు చెప్పారు. ఆ మాటే నాకెంతో కష్టంగా అనిపించింది. వెంటనే బాబాని ప్రార్థించి, నాన్న విషయం బాబాకు వదిలేసాను. ఆయన కృపతో అంతా సర్దుకుంది.

మూడవ అనుభవం:

హఠాత్తుగా ఒకసారి మా అమ్మగారికి బ్యాక్ పెయిన్ వచ్చి, ఆమె కాస్త కూడా వంగలేకపోయింది. కనీసం కదలలేక పోయింది. నేను మనసారా బాబాని ప్రార్థించి అమ్మకు ఊదీ పెట్టాను. తర్వాత ఆమె వేడినీళ్లతో మసాజ్ చేసుకుని, కొంచెం వేడినీళ్లలో జీలకర్ర వేసుకుని త్రాగింది. మరుసటిరోజుకి తన నొప్పి తగ్గిపోయింది.

"బాబా! ఎప్పుడూ నీ లీలలు వింటూ ఉండేలా నన్ను అనుగ్రహించండి. ఏమి జరిగినా కలతచెందకుండా మీ దివ్య పాదాలకు శరణాగతి చెందేలా నన్ను ఆశీర్వదించండి!"

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo