సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 26వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. బాబాయే తోడుగా ఉండి నన్ను కాపాడారు
  2. సాయిస్మరణతో మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం.

బాబాయే తోడుగా ఉండి నన్ను కాపాడారు

యు.ఎస్.ఏ నుండి సాయిబంధువు సాయిశ్రీ తన అనుభవాన్ని మనతో పంచుకోవడానికి మెయిల్ ద్వారా పంపించారు. చదివి ఆనందించండి...

సాయిబంధువులందరికీ నమస్కారం.

బాబాకున్న అనేకమంది భక్తులలో నేనూ ఒకదాన్ని. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా సాయిభక్తులు తమ అనుభవాలు పంచుకునేందుకు అనుకూలంగా బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదములు.

నేను యు.ఎస్.ఏ లో నివసిస్తున్నాను. యు.ఎస్.ఏ లో వీసా కష్టాలు అందరికీ తెలిసినవే. అవి H1 స్టాంపింగ్ నియమాలు కఠినం చేసినందున వీసా సమస్యలు ఎక్కువగా ఉన్న రోజులు. అటువంటి సమయంలో మా చెల్లి పెళ్లి నిశ్చయం అయింది. అప్పటికి నేను ఇండియా వెళ్లి 4 సంవత్సరాలైంది. ఈ పెళ్లి ద్వారా నావాళ్ళందరినీ కలవాలి, అమ్మా వాళ్ళతో కాస్త సమయం గడపాలి, పెళ్ళిలో అన్నీ దగ్గరుండి చూసుకోవాలి అని నేను ఆశపడ్డాను. చెల్లి పెళ్లి చూసుకొని, అలాగే ఇండియాలో H1 స్టాంపింగ్ కూడా చేయించుకుని తిరిగి రావొచ్చని నేను అనుకున్నాను. అయితే నా భర్తకి నేను ఇండియా వెళ్లడం అస్సలు ఇష్టం లేదు. మా చెల్లి పెళ్ళికి వెళ్లడం అంతకంటే ఇష్టం లేదు. దాంతో చెల్లి పెళ్లికి వెళ్లాలని నాకెంతో ఆశగా ఉన్నా కూడా మావారికి ఇష్టం లేకుండా వెళ్ళలేనని అర్థమై చాలా నిరాశపడ్డాను. కానీ బాబా నా మనసులో మాట విన్నారనుకుంటా! ఏం జరిగిందో తెలీదు గానీ, మరుసటిరోజు మావారు తనంతట తానుగా నావద్దకొచ్చి, "పెళ్ళికి వెళ్తానంటే వెళ్లిరా! నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను" అన్నారు. అంతే! పట్టరాని ఆనందంతో మనసులోనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని, వీసా అవైలబుల్ డేట్స్ కోసం వెతకడం మొదలుపెట్టాను. అయితే నాకు అనుకూలంగా ఏ తేదీలూ లేవు. దాంతో మావారు, "వీసా డేట్ దొరక్కపోతే నువ్వు వెళ్ళేది లేద"ని ఖచ్చితంగా చెప్పేసారు. నేను, "ఎందుకు బాబా ఇండియా వెళ్తానని నాకు ఆశ కల్పించి, ఆనందపడేలోపే మళ్ళీ వీసా డేట్స్ లేవని చూపించావు?" అని బాధపడ్డాను. కానీ శ్రీసాయి కరుణామయుడు. మరుసటిరోజు వీసా స్లాట్స్ కోసం చూస్తుంటే నాక్కావాల్సిన తేదీలో నాకు అనుకూలమైన సిటీలో ఒకటే ఒక స్లాట్ అందుబాటులో ఉన్నట్లు కన్పించింది. నా సంతోషానికి అవధుల్లేవు. వెంటనే ఆ స్లాట్ బుక్ చేసుకున్నాను. అయితే,  డాక్యుమెంట్స్ అన్నీ సమయానికి వస్తాయో రావో అని భయం మొదలైంది. అందుకు తగ్గట్టే మా ఎంప్లోయర్, "డాక్యుమెంట్స్ అన్నీ రావడానికి ఆలస్యమవుతుంది" అని ఖచ్చితంగా చెప్పాడు. దాంతో నా భయం రెట్టింపై రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. ఇక నేను, "బాబా! నేను ఫ్లైట్ ఎక్కేలోగా అన్ని డాక్యుమెంట్స్ నా చేతికి అందేలా చూడండి, వీసాకి కావలసిన డాక్యుమెంట్స్ రాకపోతే నేను ఇండియా వెళ్ళలేను. ఖచ్చితంగా వీసా స్టాంపింగ్ చేయించాలి. నువ్వు ఒక్కడివే నాకు దిక్కు, నాకు వేరే ఏం తెలియదు. ఎలాగైనా నువ్వే డాకుమెంట్స్ సమయానికి అందేలా చేయాలి, నన్ను క్షేమంగా ఇండియా తీసుకెళ్లి, అంతే క్షేమంగా ఇక్కడికి తీసుకుని రావాలి" అని బాబాను వేడుకున్నాను. రెండురోజుల్లో తెల్లవారితే ఫ్లైట్ అనగా పోస్టులో డాక్యుమెంట్స్ వచ్చాయి. తరువాత క్షేమంగా ఇండియా చేరుకున్నాను. చెల్లి పెళ్లి నేను అనుకున్నట్టుగా ఘనంగా జరిగింది. చాలా రోజుల తరువాత నా కుటుంబంతో సమయం గడపడం చాలా సంతోషాన్నిచ్చింది. తరువాత వీసా డేట్ రానే వచ్చింది. భయంగా అనిపించినా, బాబా ఉన్నారనే ధైర్యంతో వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను. కష్టమైన ప్రశ్నలు ఏమాత్రం అడగకుండానే, 'వీసా అప్రూవ్డ్' అని చెప్పాడు ఆఫీసర్. మనసులోనే "బాబా! మీరే దగ్గరుండి వీసా ఇప్పించారు. జన్మజన్మలకి మీకు ఋణపడి ఉంటాను" అని బాబాకి సాష్టాంగ ప్రణామాలు అర్పించుకున్నాను. తరువాత సాయి క్షేమంగా నన్ను యు.ఎస్.ఏ చేర్చారు. వీసా స్టాంపింగ్ కాకపోయుంటే, మావారు 'వద్దంటున్నా వెళ్ళావు ఇండియాకి' అంటూ నన్ను మాటలతో గుచ్చిగుచ్చి చంపేవారు. అది తలచుకుంటే ఈరోజుకీ నాకు చాలా భయం వేస్తుంది. బాబాయే తోడుగా ఉండి నన్ను కాపాడారు. "థాంక్యూ సో మచ్ సాయీ! చాలా చాలా కృతజ్ఞతలు సాయీ! ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు". 

నా ఆనందాన్ని సాయిబంధువులందరితో ఇలా పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ నా ధన్యవాదములు.

సాయిస్మరణతో మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం

సాయిభక్తుడు సుశాంత్ తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

నేను పూణేలో నివాసముంటున్న సాయిబాబా భక్తుడిని. 2017వ సంవత్సరంలో కొన్ని పరిస్థితుల వలన నేను తీవ్రమైన మనస్తాపానికి గురై చాలా వేదనను అనుభవిస్తూ ఉండేవాడిని. అలాంటి సమయంలో ఒక అర్థరాత్రివేళ హఠాత్తుగా నా కాళ్లు వణికిపోవడం మొదలయ్యాయి. అప్పటికప్పుడే నేను చనిపోబోతున్నాననిపించింది. భయంతో ఆత్రంగా మా సిస్టర్ తో, "నాకెందుకో చాలా ఆందోళనగా ఉంద"ని చెప్పాను. ఆ మాటలు వింటూనే తను కూడా చాలా భయపడిపోయింది. కానీ వెంటనే, "సాయిరామ్, సాయిరామ్" అని స్మరించుకోమని చెప్పింది. నేను తను చెప్పినట్లే చేసాను. అంతే! మరుక్షణంలో నాకు ఉపశమనంగా అనిపించి మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను. మరుసటిరోజు నేను, మా సిస్టర్ కలిసి హాస్పిటల్‌ కి వెళ్లి, రాత్రి జరిగిన విషయం గురించి డాక్టరుతో చెప్పాము. ఆయన, మానసిక ఒత్తిడి వలన అలా జరిగిందని చెప్పి, కొన్ని మందులు వ్రాసిచ్చారు. కానీ ఆ మందుల వలన నాకు తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే కనిపిస్తూ ఉండేది. దాంతో, ఏం జరుగుతుందో ఏమోనన్న భయంతో, "బాబా! నేను ఈ స్థితిలో బ్రతకలేను. దయచేసి నాకు నయం చేయండి" అని రోజూ ప్రార్థిస్తూ ఉండేవాడిని. క్రమంగా నా పరిస్థితిలో మార్పు వచ్చింది. బాబా కృపవలన కొద్దిరోజుల్లో నేను ఆ స్థితి నుండి పూర్తిగా బయటపడ్డాను. ఎవరైతే మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారో వాళ్లు గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ మధనపడకుండా సదా సాయిస్మరణ చేస్తూ ఉంటే బాబా తప్పక అండగా నిలుస్తారు. మీ మానసిక పరిస్థితిలో మార్పు తీసుకువస్తారు.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo