సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 17వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  • ఫకీరుబాబా వేరెవరో కాదు, సాయిబాబాయే.
  • మానసికంగా గుర్తు పెట్టుకుంటే చాలు బాబా ఎప్పుడూ భక్తునికి అండగా ఉంటారు.


ఫకీరుబాబా వేరెవరో కాదు, సాయిబాబాయే

సాయిభక్తురాలు, సాయియుగ నెట్‌వర్క్ (www.shirdisaibabaexperiences.org) బ్లాగు నిర్వాహకురాలు హేతల్ పాటిల్ రావత్ గారి అనుభవాలు:

2007, జనవరి 14 మకరసంక్రాంతికి నేను మా కుటుంబంతో పాటు శిరిడీ వెళ్ళాను. మా అమ్మ బాబాకు సమర్పించేందుకు నువ్వుల లడ్డూలు తయారుచేసింది. మేము కాకడ ఆరతికి హాజరయ్యాము. ఆరతి తరువాత బాబాకు మంగళస్నానం చేయించడం కూడా చూసాం. ఆ తరువాత సమాధిమందిరంలో బాబాకు లడ్డూ ప్రసాదం సమర్పించుకున్నాము. తరువాత మేము ద్వారకామాయికి వెళ్లి అక్కడ ప్రసాదం పంపిణీ చేయగా, రెండు లడ్డూలు మాత్రం మిగిలిపోయాయి. నా సహోద్యోగి ఒకరు బాయజాబాయి ఇంటిని సందర్శించమని సలహా ఇచ్చివుండటంతో  అక్కడికి వెళ్ళాలని మేము ద్వారకామాయి ఎదురుగా ఉన్న లైన్లోకి వెళ్ళాము. మేము ఒక స్థలానికి చేరుకున్నాము, అక్కడనుండి లక్ష్మీబాయిషిండే ఇంటిని చూడవచ్చు, కానీ మాకు ఆ విషయం తెలియదు. అక్కడ కూర్చునివున్న ఒక ఫకీరుబాబా, "మీ కళ్ళముందే లక్ష్మీబాయి ఇల్లు ఉంది" అని చెప్పారు. మేము వెంటనే లోపలికి వెళ్లి లక్ష్మీబాయికి సాయిబాబా ఇచ్చిన పవిత్ర నాణేలను దర్శించుకుని ఆనందించాము. తరువాత ఆ ఫకీరుబాబా తనంతట తానే మాతో వచ్చి మహల్సాపతి ఇంటిని, మాధవరావు దేశ్‌పాండే మనుమడి ఇంటిని మాకు చూపించారు. మా నాన్నగారు అతను చేసిన సహాయానికి డబ్బులు ఇవ్వబోయారు, కానీ అతను తిరస్కరించి, తనకు ఆహారం కావాలని చెప్పారు. మా ఆహారపదార్ధాలు హోటల్లో ఉన్నాయి. హోటల్ కూడా మేమున్న చోటుకు దూరంగా ఉంది. అంతలో మా అమ్మకు లడ్డూలు గుర్తుకువచ్చి వాటిని అతనికి ఇచ్చింది. లడ్డూలు స్వీకరించాక అతని ముఖంలో సంతృప్తి స్పష్టంగా కనిపించింది. అప్పుడు ఆ ఫకీరుబాబా వేరెవరో కాదు, మన సాయిబాబాయే అని గ్రహించి, ఆయన స్వయంగా మానవరూపంలో వచ్చి మా ప్రసాదం స్వీకరించారని మేమంతా చాలా సంతోషించాము.


మానసికంగా గుర్తు పెట్టుకుంటే చాలు బాబా ఎప్పుడూ భక్తునికి అండగా ఉంటారు.

సాయి భక్తుడు హితేష్(dhara) ఖేరాడియా గారి అనుభవం:
"నాకు పూజాసామాగ్రి గాని, అష్టోపచార షోడశోపచార పూజలు గాని అవసరం లేదు. అపరిమితమైన భక్తి ఉన్నచోటే నా నివాసం" అన్న సాయి సచ్చరిత్రలోని వాక్యాలు ఎంత సత్యమో అనడానికి మీరిప్పుడు చదవబోయే అబ్బురపరిచే లీలే సాక్ష్యం!

బరోడా(గుజరాత్)లో నివసిస్తున్న ఒక సాయిభక్తుడు వ్యాపారనిమిత్తంగా తరచూ జామ్‌నగర్(సౌరాష్ట్ర ప్రాంతం, గుజరాత్) వెళ్తుండేవాడు. అలా ఒకసారి జామ్‌నగర్ వెళ్లి పని పూర్తి చేసుకుని తన సొంత కారులో ఒంటరిగా బరోడాకు తిరిగి ప్రయాణమయ్యాడు. బాగా అలసిపోయి ఉండటం వలన అర్థరాత్రి సమయంలో నిద్ర కమ్ముకొచ్చింది. తనకు తెలియకుండానే డ్రైవ్ చేస్తూ నిద్రపోయాడు. కొంతసేపటికి ప్రక్కనుండి ఓవర్‌టేక్ చేస్తున్న ఒక ట్రక్కు కారు యొక్క ఎడమ భాగాన్ని తాకడంతో అతనికి మెలుకువ వచ్చింది. వెంటనే తను అహ్మదాబాదు హైవే మీద ఉండటం గమనించి, బరోడా మార్గంలోకి కారు మళ్ళించాడు. కానీ, జరిగిన అద్భుతానికి ఆశ్చర్యపోయాడు. "నిద్రలో 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించానా?" అని నిర్ఘాంతపోయాడు. మార్గంలో చాలా మలుపులున్నాయి కానీ, కారు సాఫీగా ముందుకెళ్ళింది. దారిపొడవునా ఇతర వాహనాలు ప్రయాణిస్తున్నాయి. అయినప్పటికీ తన శరీరంపై చిన్న గీత కూడా కాకుండా సురక్షితంగా ప్రయాణం సాగింది. అంచనాలకు అందని అద్భుతం! అదెలా సాధ్యమో ఎవరైనా ఊహించగలరా? అవును... మీ ఆలోచన నిజం! సాయే స్వయంగా అతని కారు నడిపారు. ఆ భక్తుడెప్పుడూ సాయి ముందు ఎటువంటి ప్రార్థనలు చేసి ఎరుగడు. కనీసం తరచూ బాబా మందిరానికి వెళ్లిన వ్యక్తి  కూడా కాదు. కానీ అతను మనసారా సాయిని తలుచుకుంటాడు. తన ఆఫీసుకు వెళ్ళినప్పుడు లేదా ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు తన కారులో సాయి హారతి గాని, సాయి భజనలు గాని పెట్టుకుంటాడు. అంతే అతను చేసేది. కానీ బాబా ఎంతలా అండగా ఉన్నారో చూసారా?

ఈ అనుభవం ద్వారా బాబా, తమను మానసికంగా గుర్తు పెట్టుకుంటే చాలు, తామెప్పుడూ భక్తునికి అండగా ఉంటామని నిరూపించారు.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo