సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 30వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం: 
  • నమ్మినంతనే బాబా నడిపించారు

శ్రీమతి గీత తనను శ్రీసాయికి అంకిత భక్తురాలిగా మార్చిన బాబా లీలను మనతో పంచుకుంటున్నారు.

మానవుడు తను పూర్వజన్మలో చేసిన చెడు కర్మల ఫలితాలను ఈ జన్మలో కష్టాల రూపంలో అనుభవిస్తాడని పెద్దలంటారు. ఆ కష్టం మా కుటుంబంలోకి మా అమ్మాయి అనారోగ్యం రూపంలో వచ్చింది. మా పాపకి 9ఏళ్ళు వచ్చేవరకు ఎంతో చురుకుగానూ, అన్నింటిలో ఎంతో ఉన్నతంగానూ రాణించేది. కానీ, తన పదవ ఏట ఒకసారి క్రిందపడి తన ఎడమ మోచేయి ఫ్రాక్చర్ అయింది. రెండు సర్జరీలు జరిగాయి. సర్జరీల తర్వాత అంతా బాగవుతుందని అందరం అనుకున్నాము. కానీ అక్కడే సమస్య మొదలైంది. మూడు నెలల్లో తన కీళ్ళన్నీ వాచిపోయాయి. మేము ఆసియాలోనే ఎంతో పేరున్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర తనకు ట్రీట్‌మెంట్ ఇప్పించాము. కానీ ఐదు సంవత్సరాల చికిత్స తరువాత కూడా తన బాధ తగ్గలేదు సరికదా పరిస్థితి ఇంకా విషమించింది. దాంతో తను తన మోకాళ్లను వంచితే గానీ నడవలేకపోయేది. మిగతా పిల్లలలాగా నేలమీద కూర్చోలేకపోయేది. దాంతో తను చదువు మీద కూడా శ్రద్ధపెట్టలేకపోయేది.

ఇలా ఉండగా ఒకరోజు నా స్నేహితురాలు నాకు 'శ్రీసాయిసచ్చరిత్ర' పుస్తకం ఇచ్చింది. కానీ నాకు బాబాను నమ్మాలని అనిపించక ఆ పుస్తకం చదవకుండా అలమరాలో పెట్టేసాను. నేను నా ఇష్టదైవమైన గురువాయురప్పన్ నే ఈ కష్టాల నుండి గట్టెక్కించమని ప్రార్థించసాగాను. ఇంతలో నా స్నేహితురాలి తండ్రి ఒకరోజు కిందపడి స్పృహకోల్పోయారు. దాంతో ఆయన్ను ఒక వారంరోజులపైనే హాస్పిటల్లో ఉంచారు. సీటీ స్కాన్ చేసిన డాక్టర్లు ఆయనకు బ్రెయిన్లో ట్యూమర్ ఉందని, దానికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు నా స్నేహితురాలు, తన కుటుంబసభ్యులంతా కలిసి ఆయన్ను కాపాడమని బాబాను ప్రార్థిస్తూ రాత్రి పగలు సాయి సచ్చరిత్ర పారాయణ చేశారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడితే శిరిడీకి వస్తామని బాబాకు మొక్కుకున్నారు. ఆయన స్పృహలో లేని స్థితిలో వున్నప్పుడు నేను కూడా ఆయనను చూడడానికి వెళ్ళాను. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన ఆరోగ్యం మెరుగుపడసాగింది. ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత డాక్టర్లు ఇంకోసారి సీటీ స్కాన్ చేసి, బ్రెయిన్ ట్యూమర్ ఉన్న లక్షణాలేవీ లేవని, మామూలు మందులతోనే ఆయన ఆరోగ్యం బాగవుతుందని చెప్పారు. ఆ తర్వాత నా స్నేహితురాలు నావద్దకు వచ్చి, తన తండ్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని, ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని, ఇదంతా బాబా తమ కుటుంబంపై చూపిన అనుగ్రహమేనని ఎంతో ఆనందంగా చెప్పింది. ఆ తరువాత నేను సాయిసచ్చరిత్ర చదవడం ప్రారంభించాను. పారాయణ పూర్తికాబోతుండగా మావారి స్నేహితుడైన గోపాలకృష్ణన్ మమ్మల్ని త్రివేండ్రంలో ఉన్న డాక్టర్ హరిహరన్ దగ్గరకు మా అమ్మాయిని తీసుకెళ్ళమని చెప్పారు. అప్పుడు నేను, ఈ డాక్టర్ ఇచ్చే ట్రీట్‌మెంట్‌తో మా పాప ఆరోగ్యం మెరుగుపడితే శిరిడీ వస్తామని బాబాకు మొక్కుకున్నాను. డాక్టర్ని సంప్రదించేముందు బాబాయే ఆ డాక్టర్ రూపంలో ఉన్నారని నాకు అనిపించింది. ఆశ్చర్యంగా, కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు, "నీకు ఏ దేవుడంటే బాగా ఇష్టం?" అని ఆ డాక్టర్ మా పాపని అడిగారు. తను, "నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం" అని చెప్పింది. డాక్టర్ ఎంతో సంతోషించారు, ఎందుకంటే ఆయన కూడా బాబా భక్తుడే. ఆయన మా పాపతో, బాబాపై నమ్మకాన్ని వదలద్దనీ, బాబా పాదాలు గట్టిగా పట్టుకోమనీ, ఆ కరుణామూర్తి తనను అనుగ్రహిస్తారనీ చెప్పారు. తర్వాత ఒక మందు ఇచ్చి, ఒక వారంలో పాప పరిస్థితి మెరుగవుతుందనీ, కానీ మరో 3 నెలలపాటు 2 మందులను మాత్రం (ఐరన్ టాబ్లెట్ + ఇంకొక టాబ్లెట్) క్రమం తప్పకుండా వాడాలనీ సూచించారు.

ఆ టాబ్లెట్ వాడటం మొదలుపెట్టిన మూడు రోజుల్లో మా పాప మామూలుగా నడవడం ప్రారంభించింది. అందరం ఎంతో సంతోషించాము. తర్వాత మేము శిరిడీకి వెళ్ళాము. ద్వారకామాయిలో మా పాప తన కాళ్ళని మడిచి నేలపై కూర్చోగలిగింది. నేను ఆనందంతో కన్నీటిపర్యంతమయ్యాను. మా పాప ద్వారకామాయిలో కూర్చున్నప్పటినుంచి తన కష్టాలు తీరిపోయాయని నాకు అనిపించింది. మేము చేసే అన్ని పనులలోనూ బాబా ఎప్పుడూ మా కుటుంబానికి తోడుగా ఉన్నారని నా నమ్మకం.

ఈమధ్య నేను మైలాపూర్(చెన్నె) లోని సాయిబాబా మందిరానికి వెళ్ళినప్పుడు కొంతమంది కొన్ని పాంప్లెట్లని అందరికీ పంచుతున్నారు. అందులో, ఒక భక్తుని ఇంటికి ఒక పాము వచ్చిందని, బాబాయే ఆ పాము రూపంలో వచ్చారని, ఈ వార్తని ఎవరైనా అందరికీ తెలియచేయకపోతే (ఇలా కాగితాలు పంచి) బాబా వాళ్లను శిక్షిస్తారని, వాళ్లు జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తారని ఉన్నది. ఎవరైనా అద్భుతమైన బాబా లీలలను అందరికీ పంచాలనుకుంటే, చక్కగా సాయి సచ్చరిత్ర పుస్తకం గానీ, బాబా లీలలను గానీ, లైఫ్ ఆఫ్ సాయిబాబా పుస్తకంగానీ పంచితే బాగుంటుందని నా అభిప్రాయం. బాబాయే తన భక్తులను తన వద్దకు రప్పించుకుంటారు. బాబా ఎవరినీ శిక్షించరు. తన భక్తుల క్షేమంకోసం ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో బాబాయే నిర్ణయిస్తారు. మనం శ్రద్ధ, సబూరీలతో ఉంటే చాలు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


3 comments:

  1. మది లో సాయినామము ,కనులలో సాయి రూపము,చేతల్లో సాయి కార్యము,వాక్కులో సాయిలీలా గానము తరింప చేయును భవసాగరము 🙏🙏🙏

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😀❤🤗🌸😊🌺🥰🌹😃🌼

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo