ఈరోజు భాగంలో అనుభవాలు:
- నిద్రలేపి పారాయణ పూర్తిచేయించిన బాబా
- వస్తుందో, రాదో అనుకున్న ప్రమోషన్ వచ్చేలా చేసారు బాబా
నిద్రలేపి పారాయణ పూర్తిచేయించిన బాబా
సాయిబంధువు శిరీషగారు తన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:
అందరికీ సాయిరాం! నేను పారాయణ పూర్తిచేయడంలో బాబా నాకు ఎలా సహాయం చేశారో ఇప్పుడు మీ అందరితో పంచుకుంటాను.
2018, మార్చి 7వ తేదీ రాత్రి నేను కొందరు సాయిభక్తులతో చాటింగ్ చేస్తూ, వారి అనుభవాలను వేర్వేరు గ్రూపులలో చదువుతూ ఉన్నాను. ఒక్కసారిగా ఎందుకో సమయం చూస్తే అప్పటికే అర్థరాత్రి ఒంటిగంట దాటింది. వెంటనే పడుకోవడానికి ప్రయత్నించాను గానీ, తీవ్రమైన కాలునొప్పి వలన నిద్రపట్టలేదు. సమయం చూస్తే 1.30 కూడా అయింది. గురువారం కావడం వలన వేకువఝామున 3 గంటలకే లేచి 'కిచిడీ పారాయణ'(కిచిడీ పారాయణ అంటే గురువారంనాడు వేకువఝామున 3 గంటలకు లేచి, వాళ్లకు కేటాయించిన సచ్చరిత్రలోని అధ్యాయాలు పారాయణచేసి బాబాకు కిచిడీ నైవేద్యం పెడతారు.) చేయవలసి ఉంది. వెంటనే, “బాబా! ఇప్పటికే అర్థరాత్రి 1.30 అయ్యింది. నేను 3 గంటలకు లేవడం అనేది అసాధ్యమేమో! అందువలన ఈరోజు నా పారాయణ పూర్తిచెయ్యలేనని అనిపిస్తోంది. కాబట్టి నేను నా సిస్టర్ సహాయం తీసుకోనా? బాబా! ఏమి చేయాలో తెలియడంలేదు. ఇప్పటిదాక నేను ఏరోజూ పారాయణ మిస్ చెయ్యలేదు. మూడు గంటలకి ఎలా లేవగలను బాబా?" అని చెప్పుకుని, అదే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను.
నేను నిద్రలో ఉండగా స్వప్నంలో బాబా నన్ను నిద్రలేపుతున్నారు. నేను బాబాతో, "నన్ను కాసేపు నిద్రపోనివ్వండి, నాకు చాలా నిద్రమత్తుగా ఉంది బాబా!" అని చెబుతున్నాను. బాబా వెంటనే ఒక గిన్నె తన చేతిలోకి తీసుకుని, “ఏమిటి? ఈరోజు నువ్వు నాకు కిచిడీ పెట్టవా?” అని అడుగుతున్నారు. ఆ మాటలు వినగానే నాకు మెలకువ వచ్చి సమయం చూస్తే 2.55am అయ్యింది. నన్ను నిద్రలేపినందుకు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. సమయానికి బాబా నన్ను మేలుకొలపడంతో కిచిడీ పారాయణతోపాటు సప్తాహపారాయణ, మహాపారాయణ అన్నీ నిరాటంకంగా పూర్తిచేసుకోగలిగాను. రాత్రి నిద్ర సరిగా లేకపోయినప్పటికీ రోజంతా నిద్రమత్తుగా అనిపించలేదు, ఇంకా కాలినొప్పి కూడా లేకుండా చాలా హుషారుగా ఉన్నాను.
"చాలా చాలా ధన్యవాదాలు బాబా! నా జీవితంలో ఆరోజుని అందంగా మలచినందుకు, ఇంకా ఏ అలసటా తెలియనీయకుండా పారాయణలన్నీ పూర్తిచేయడంలో నాకు సహాయం చేసినందుకు. రోజంతా ఎప్పుడూ లేనంత ఉల్లాసంగా ఉండేలా చేసారు. ఆవిధంగా నన్ను ఆశీర్వదించినందుకు నా కృతజ్ఞతలు బాబా!" నా అనుభవాన్ని చదివిన మీకు కూడా నా ధన్యవాదాలు.
వస్తుందో, రాదో అనుకున్న ప్రమోషన్ వచ్చేలా చేసారు బాబా
పేరు వెల్లడించని ఒక సాయిబంధువు తన అనుభవాల్ని మనతో ఇలా పంచుకుంటున్నారు..
ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారికి నా ప్రణామాలు. ఇంటర్నెట్ లో సాయిభక్తుల అనుభవాలకు సంబంధించిన బ్లాగు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బ్లాగు లభించినప్పటినుండి నాలో బాబాపై ఉన్న భక్తి విశ్వాసాలు ఇంకా ఇంకా రెట్టింపు అయ్యాయి. సాయితో నాకు చాలా అనుభవాలున్నాయి. ఆయనెప్పుడూ నాకు తోడుగా ఉన్నారు. సంతోషం, బాధ ఏదైనా సాయితో చెప్పుకుంటూ ఉంటాను. అన్ని పరిస్థితులలో ఆయన నాకు తోడుగా ఉండి నా సమస్యలకి పరిష్కారం చూపిస్తూ, నాకు మార్గదర్శనం చేస్తూ ఉంటారు. ఈమధ్యకాలంలో బాబా నాకు ఇచ్చిన అనుభవాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను.
నేను బెంగళూరులోని ఒక పెద్ద సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాను. సాయి నాకు ప్రమోషన్ రావడంలో ఎలా సహాయం చేశారో మీ అందరికీ చెప్తాను. నాకు ప్రమోషన్ రావడానికి అన్ని అర్హతలూ వున్నాయి. మా మేనేజర్ కూడా ఖచ్చితంగా నాకు ప్రమోషన్ వస్తుందని హామీ ఇచ్చారు. కానీ ఈమధ్యలో మా సంస్థ ప్రమోషన్ విధానంలో కొత్తగా కొన్ని మార్పులు తీసుకుని వచ్చింది. కొత్త విధానంలో ప్రమోషన్ పొందేవారి సంఖ్యను 9కి కుదించేసారు. ఈ హఠాత్పరిణామంతో మా మేనేజర్ నాకు ఫోన్ చేసి, "నీకు ప్రమోషన్ వస్తుందో, రాదో అని అనుమానంగా ఉంది. నీ పొజిషన్ 10 లేక 11వ ర్యాంకులో ఉంది. చెప్పాలంటే, అదృష్టం కలిసివస్తే గానీ నీకు ప్రమోషన్ రాదు. అందుకోసం ఎదురుచూడు, మంచే జరుగుతుందని ఆశిద్దాం" అని చెప్పారు. ఆ మాట వినగానే నాకు చెప్పలేనంత బాధగా అనిపించి మనసులోనే సాయికి చెప్పుకున్నాను. సచ్చరిత్ర పారాయణ కూడా మొదలుపెట్టాను. శ్రద్ధ, సబూరీలతో నేను నా సమస్యని బాబా పాదాల వద్ద ఉంచి ప్రశాంతంగా ఉన్నాను. సచ్చరిత్ర రెండు పారాయణలు పూర్తిచేసి మూడవ పారాయణ మధ్యలో ఉండగా ప్రమోషన్ లిస్టు వెలువడింది. ఆశ్చర్యం! ఆ జాబితాలో నా పేరు కూడా ఉంది. సంస్థ నియమానుసారం 9 మందికి మాత్రమే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో 11 మందికి ప్రమోషన్స్ వచ్చాయి. ఇది బాబా కృపతోనే సాధ్యమైంది. ఆయన మనకోసం ఏదైనా మారుస్తారు. జీవితంలో మర్చిపోలేని మిరాకిల్ చేసారు బాబా. బాబాకి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఆయన నా వెన్నంటే ఉన్నారు.
ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!
Om sai ram
ReplyDelete🕉 sai Ram
ReplyDelete