సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

“సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్” ఏర్పాటులో, నిర్వహణలో బాబా అభయహస్తం


ముందుగా సాయిభక్తులందరికీ బ్లాగు వార్షికోత్సవ శుభాకాంక్షలు. సాయిబంధువులందరిపై ఆ సద్గురు సాయినాథుని ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను.

బాబా కృపాకటాక్షములతో ఈ బ్లాగ్ ప్రారంభమై నేటికి సరిగ్గా ఒక సంవత్సరమయ్యింది. మొదటి వార్షికోత్సవ సందర్భంగా, ఈ బ్లాగ్ ఏర్పాటులో, నిర్వహణలో బాబా చూపిన అనుగ్రహాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 

బ్లాగ్ ప్రారంభించేముందు, "బ్లాగ్ నిర్వహించడం నా ఒక్కడి వల్ల ఎలా అవుతుందో?!" అని అనుకున్నాను. అలాంటిది ఒక్క రోజు కూడా మిస్ కాకుండా, ఈ ఏడాది కాలంలో 447 పోస్టింగ్స్ బ్లాగులో ప్రచురింపబడ్డాయంటే అదంతా ఆ సద్గురు సాయినాథుని అపార అనుగ్రహమే!  నిజానికి బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తలోనే ఈ వివరాలు ప్రచురిద్దామని టైపు చేయడం మొదలుపెట్టాను. కానీ అది సాధ్యపడలేదు. బహుశా వార్షికోత్సవ సందర్భంగా ప్రచురించాలన్నదే బాబా సంకల్పమేమో! ఇక వివరాల్లోకి వెళితే....

2017, అక్టోబర్ నెలలో బాబాకి సంబంధించిన ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయాలన్న ప్రేరణ నాలో కలిగింది. అది బాబా ఇస్తున్న ప్రేరణ అవునో, కాదో తెలుసుకోవాలని బాబానే అడిగాను. అందుకు ఆయన సచ్చరిత్రలో ఒక పేజీ సూచించారు. ఆ పేజీ తెరచి చూస్తే, బాబా సచ్చరిత్ర వ్రాయమని హేమాడ్‌పంత్‌కు అనుమతినిస్తున్న సన్నివేశం ఉంది. ఆ సంఘటనతో, ఇప్పటి సాయిభక్తుల అనుభవాలు పంచుకోవడం కోసం వెబ్‌సైట్ ఏర్పాటు చేయడానికి అది బాబా ఇస్తున్న ప్రేరణే అని నిర్ధారణ అయ్యింది.

అంతేకాకుండా, అదేరోజు మరోవిధంగా కూడా వెబ్‌సైట్‌కు బాబా తమ సమ్మతిని తెలియజేసారు. ఆరోజు రాత్రి సాయిబంధువు సుధాకర్ ఫోన్ చేసి తమ అనుభవాలు పంచుకున్నారు. నిజానికి అతను మూడు, నాలుగు నెలల క్రిందట జూన్ నెలలోనే తన అనుభవాలు పంచుకుంటానని నాతో చెప్పారు. కానీ ఏవో కారణాల వలన అతనికి వీలుపడక అసలు ఫోనే చేయలేదు. అన్ని రోజులుగా వీలుపడనిది, సరిగ్గా బ్లాగ్ క్రియేట్ చేయడానికి బాబా అనుమతినిచ్చిన కొద్దిసేపట్లో అతను ఫోన్ చేసి తన అనుభవాలు చెప్పడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బాబా హేమాడ్‌పంత్‌తో, “నా లీలలు నేనే వ్రాసుకుంటాను, నీవు నిమిత్తమాత్రుడివి” అని చెప్పినట్లుగా, ఆయన వెబ్‌సైట్‌కి అనుమతినివ్వడమే కాకుండా వెబ్‌సైట్‌లో ప్రచురించడానికి మొదటిలీలగా సుధాకర్ గారి అనుభవాన్ని కూడా ఇచ్చారు.

బాబా అనుమతి లభించడంతో నిజానికి వెబ్‌సైట్ డిజైన్‌పై నాకెటువంటి అవగాహన లేకపోయినా వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి పూనుకున్నాను. కానీ, నాకెలా చేయాలో అర్థంకాక ఎంత ప్రయత్నించినా పని ముందుకు సాగలేదు. సరే, సమయం వచ్చినప్పుడు బాబాయే చేయిస్తారనుకున్నాను. తరువాత కొన్ని అనుకోని సంఘటనలు జరిగి వెబ్‌సైట్ మొదలుపెట్టే పరిస్థితి కూడా లేకపోయింది. తరువాత మళ్ళీ 2018, మార్చి నెలలో వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి తగిన పరిస్థితులు బాబా కల్పించారు. "బాబా! నాకు సహాయం చేయండి" అని బాబాను ప్రార్థించి, వర్క్ మొదలుపెట్టాను. వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి మొదట ప్రయత్నించినప్పుడు కొంచెం కూడా ముందుకు సాగనిది, ఈసారి వర్క్ సాఫీగా ముందుకు సాగుతుంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఒకవైపు వెబ్‌సైట్ డిజైన్ చేస్తూనే, మరోవైపు బ్లాగ్ డిజైన్ కూడా ట్రై చేసాను. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి కలలో బాబా దర్శనమిచ్చి, "ఇక్కడ ఈ కలర్ తీసుకో, ఇక్కడ ఇలా పెట్టు" అంటూ వెబ్‌సైట్ డిజైన్ చేయడం చూపించారు. మొత్తానికి బ్లూ, గ్రే కలర్స్ కాంబినేషన్ కనిపించింది. ఉదయాన నిద్రలేచి కలలో బాబా వెబ్‌సైట్ డిజైన్ చూపించారని చాలా సంతోషపడ్డాను. మధ్యాహ్నానికి ఆ కల సంగతి పూర్తిగా మర్చిపోయి మాములుగా డిజైన్ వర్క్ చేసుకుంటున్నాను. కాసేపటికి, ఆశ్చర్యం! అద్భుతం! నాకు తెలియకుండానే రాత్రి కలలో బాబా చూపిన విధంగా అవే రంగుల కాంబినేషన్‌లో బ్లాగ్ డిజైన్ వచ్చింది. అది చూశాక నాకు రాత్రి వచ్చిన కల గుర్తుకు వచ్చింది. నేను మరచిపోయినప్పటికీ బాబా నా చేయిపట్టి డిజైన్ చేయించినట్లు సరిగ్గా కలలో చూపిన విధంగా చేయించారు. ఆ తరువాత వెబ్‌సైట్ కూడా అదే కలర్ కాంబినేషన్‌లో డిజైన్ చేద్దామని ప్రయత్నించాను కానీ, సంతృప్తికరంగా రాలేదు. దానితో 'బ్లాగ్ చాలు' అన్నది బాబా నిర్ణయమని నాకు అర్థమయింది.

తరువాత 'బ్లాగుకు ఏ పేరు పెట్టాలా?' అని అనుకున్నప్పుడు, ఒక సాయిబంధువు ద్వారా "సాయి మహరాజ్ సన్నిధి" అని బాబాయే సూచించారు. ఆ టైటిల్ తో 2018, ఏప్రిల్ 19న బాబా చూపించిన సుధాకర్ గారి అనుభవంతో బ్లాగ్ ప్రారంభమయ్యింది. మొదటి బాబా లీల పబ్లిష్ చేసి గ్రూపుల్లో లింక్ షేర్ చేసిన వెంటనే ఒక సాయిబంధువు, "బ్లాగ్ వర్క్ ఏదైనా ఉంటే ఇవ్వండి. నేను కూడా బాబా వర్క్ చేస్తాను" అని మెసేజ్ పెట్టారు. అలా బాబా తమ బ్లాగ్ వర్క్ ఆ సాయిబంధువుకు కూడా ఇచ్చారు. ఆ తరువాత ఒకరి తరువాత ఒకరు జతకూడుతూ ఇప్పుడు మొత్తం 7, 8 మందిమి బాబా వర్క్ చేసుకుంటున్నాము. తరువాత కూడా బాబా ఎప్పటికప్పుడు బ్లాగుకు అవసరమైన టెక్నికల్ నాలెడ్జ్ అందిస్తూ బ్లాగ్ నిర్వహణ చే(యి)స్తున్నారు.

అలా బాబా "సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్" (https://saimaharajsannidhi.blogspot.com/) ఏర్పాటు చేయించి, ఆయన భక్తుల అనుభవాలను సాటి సాయిభక్తులకు అందుబాటులో ఉండేవిధంగా బ్లాగులో ప్రచురింపజేయిస్తూ, సదా ఆయన స్మరణలో ఉండేలా మమ్మల్ని అనుగ్రహించారు. 

“బాబా! ఎప్పుడూ ఇలాగే మాపై అనుగ్రహాన్ని కురిపిస్తూ మమ్మల్ని నడిపించండి. పూర్ణమైన భక్తివిశ్వాసాలు మాకొసగి ఎప్పటికీ మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండేలా మమ్ము అనుగ్రహించండి. శతకోటి ప్రణామాలు సాయిదేవా!”

అనుభవాలు పంచుకుంటూ బ్లాగుకు సహకరిస్తున్న సాయి బంధువులందరికీ నా అభివందనాలు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

3 comments:

  1. Hearty Congratulations Sai.
    బాబా ఆశీస్సులతో ఇంకా ఎన్నో సాయి లీలలు మాతో పంచుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.

    ReplyDelete
  2. Thank you baba. Mi challini blessings yeppudu ilage unadani

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo