సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 22వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు: 
  • దసరా రోజు బాబా నాతో ఉన్నారు
  • సాయి ఊదీ మహిమ

దసరా రోజు బాబా నాతో ఉన్నారు

నా పేరు కమలిస్ దేవి. 2018 విజయదశమి రోజున మా ఇంట్లో జరిగిన ఒక మిరాకిల్ ను నేను మీ అందరితో ఇప్పుడు పంచుకుంటాను. నేను ఉద్యోగస్తురాలిని కావడంతో నేనెప్పుడూ గురువారం సాయంత్రం బాబాకి పూజ చేస్తూ ఉంటాను. ఉదయాన హడావిడిగా పూజ చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ప్రశాంతంగా సాయంత్రం వేళలో పూజ చేసుకుంటూ ఉంటాను. కాని ఈసారి దసరా గురువారంనాడు వచ్చింది. దసరా కదా, ఆరోజు ఉదయాన్నే 4.30 కి లేచి పూజ చేసుకుందామనుకున్నాను. ముందురోజు రాత్రి బాబా కోసం పూలమాలలు కట్టడంతో ఆలస్యమై 1.30కి పడుకున్నాను. పడుకునే ముందు ఉదయాన 5.00,  5.10, & 5.15కి మూడు అలారమ్స్ పెట్టుకున్నాను. ఉదయం అవి మ్రోగిన ప్రతిసారీ స్టాప్ చేసి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాను. 5.45 సమయంలో ఎవరో నన్ను కుదిపి, నిద్రలేవమని చెప్పినట్లు అనిపించింది. కానీ కళ్ళు తెరచి చూస్తే ఎవరూ లేరు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. త్వరత్వరగా స్నానం చేసి పూజ మొదలుపెట్టాను. బాబాకు డ్రెస్ మార్చి, నైవేద్యాలన్నీ సమర్పించి బాబా ముందు కూర్చుని ప్రార్థన చేస్తున్న సమయంలో హఠాత్తుగా బాబా విగ్రహం వెనక ఒక నీడను చూసాను. వెనుక్కి తిరిగి చూసాను, కానీ అక్కడ ఏమీ కనపడలేదు. సరేనని నేను ప్రార్థన చేసుకున్నాను. కాసేపటికి నా ప్రార్థనలు ముగించి చూసేసరికి పెద్ద బాబా విగ్రహం ముందున్న రెండు చిన్న విగ్రహాలు వాటి స్థానాలనుండి కదిలి ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను.  దీని అర్థం ఏమిటో నాకు తెలియదు గానీ, దసరా రోజు బాబా నాతో ఉన్నారని మాత్రం నాకు అర్థమయ్యింది. "నేను అనుకున్నట్లుగా ఉదయం పూజ చేయడంలో నాకు సహాయపడినందుకు మీకు ధన్యవాదాలు బాబా! మీరు నాపై, నా కుటుంబంపై ప్రేమతో కురిపిస్తున్న ఆశీస్సులకు కృతజ్ఞతలు బాబా! ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను బాబా!"

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయి ఊదీ మహిమ

అజ్ఞాత సాయిభక్తురాలు ఊదీ మహిమను ఇలా వివరిస్తున్నారు:

"మా అమ్మగారు ఒక గొప్ప సాయిభక్తురాలు. ఆమె 2009వ సంవత్సరం నుండి బాబాను పూజిస్తున్నారు. ఆమె తన జీవితంలో ప్రతిక్షణం బాబా కృపను అనుభూతి చెందుతూ ఉండేవారు. నేను చెప్పబోయే లీల బాబా ఊదీ మహిమకు సంబంధించినది.

ఒకరోజు హఠాత్తుగా మా అమ్మగారు ఛాతీనొప్పితో బాధపడసాగారు. మొదట మేము మాములు నొప్పి అనుకుని, మందులతో తగ్గుతుందని భావించాము. కానీ చీకటిపడేకొద్దీ నొప్పి తీవ్రం కాసాగింది. ఆమె ఆ బాధను తట్టుకోలేక చిన్నపిల్లలాగా ఏడుస్తూ క్రిందపడి దొర్లసాగింది. ఆవిడను అలా చూసేసరికి నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. నొప్పి తగ్గించమని దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఆమెకు బదులు ఆ నొప్పిని నాకు ఇవ్వమని అడిగాను. అమ్మ అలా ఏడుస్తుంటే చూడటం కంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? అలా మందులు పని చెయ్యని క్లిష్టమైన పరిస్థితిలో, హఠాత్తుగా ఒక ఆలోచన నా మెదడుకు తట్టింది - ఊదీని మందులా ఆమెకు ఇవ్వాలని. వెంటనే గదిలోకి వెళ్ళి ఊదీ తెచ్చి, బాబాను ప్రార్థించి ఆమెకు ఇచ్చాము. కాసేపట్లో అద్భుతం మొదలైంది. అరగంట తరువాత నొప్పి తీవ్రత తగ్గుతూ వచ్చింది. ఉదయానికి ఆమె పరిస్థితి ఏమీ జరగనట్లుగా మాములుగా ఉంది. ఆమెకు పూర్తిగా నయమైపోయింది. ఈ సంఘటన తరువాత బాబాపై మా విశ్వాసం దృఢమైంది. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా మా అమ్మకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను.

శ్రీ సాయినాథునికి జై!

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo