సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 24వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  • చిన్న ఐటీ కంపెనీ స్థాపనలో బాబా అనుగ్రహం.
  • సమస్యను బాబాకు చెప్పుకోండి - ఆయన అంతా సజావుగా సాగేలా చూసుకుంటారు.

చిన్న ఐటీ కంపెనీ స్థాపనలో బాబా అనుగ్రహం.

సాయిబంధువు శైలజ గారు తమ అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నా జీవితంలో బాబా నా వెన్నంటి ఉండి నాకు సహాయం చేసిన అనుభవాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.

ఇటీవల మావారు ఒక చిన్న ఐటీ కంపెనీ ప్రారంభించి నన్ను కో-డైరెక్టర్ గా నియమించదలిచారు. అందుకోసం కంపెనీ నియమాల ప్రకారం నా డిజిటల్ సంతకం అవసరం ఉండటంతో కావలసిన పత్రాలన్నింటినీ సిద్ధంచేసి, సంబంధిత అధికారికి అందజేశాము. కానీ నా సంతకం నా పాన్‌ కార్డులో ఉండే సంతకంతో సరిపోకపోవడంతో పరిశ్రమల మంత్రిత్వశాఖ కార్యాలయం వాళ్ళు నా పత్రాలను తిరస్కరించారు. మళ్ళీ మావారు ఆ పత్రాలను ఇంటర్నెట్‌లో డౌన్లోడ్ చేసి, పాన్‌ కార్డులో ఉన్నట్టుగా సంతకం చేయమని నాకు చెప్పారు. నేనెంత శ్రద్ధగా ప్రయత్నించినప్పటికీ ఖచ్చితంగా పాన్‌ కార్డులో ఉన్నట్టు సంతకం చేయలేకపోయాను. దాంతో మావారికి చాలా కోపం వచ్చి వేరే పేపర్ మీద సంతకాన్ని ప్రాక్టీస్ చేయించారు. అయితే, ఆ పేపర్ల మీద నేను కరెక్టుగానే సంతకం పెడుతున్నా, అసలు పత్రాలపై పెట్టేసరికి సరిగ్గా వచ్చేది కాదు. చివరిగా మావారు రెండురోజులు సమయమిచ్చి పాన్ కార్డులో ఉన్నట్టుగా సంతకం పెట్టడం నేర్చుకోమని చెప్పారు. అయితే ఉన్నది ఉన్నట్లుగా సంతకం చేయడం నావల్ల కాదని నాకనిపించి నేను చాలా ఆందోళనపడ్డాను. రెండురోజుల తరువాత మావారు ఇంటినుంచి బయటకు వెళ్తూ తను వచ్చేసరికి ఆ పత్రాల్లో సంతకం చేసి ఉంచమని చెప్పి వెళ్లారు. నాకు ఏమి చేయాలో అర్థంకాక బాబా ముందు కూర్చుని ఏడుస్తూ, "బాబా! నాకు సహాయం చేయండి" అని ప్రార్థించి, కొంచెం ఊదీ ఆ పత్రాలకు పెట్టి, బాబా ముందరే ఆ పత్రాలలో సంతకం పెట్టాను. నేను పెట్టిన సంతకం పాన్ కార్డులో ఉన్నట్టుగానే ఉందని నాకనిపించింది. కానీ మావారు ఏమంటారోనన్న ఆందోళనతో, తను ఏమీ అనకుండా ఉండేలా చూడమని ఆపకుండా బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. కొంతసేపటికి మావారు వచ్చి సంతకం చూసి ఒక్క మాటైనా మాట్లాడకుండా వాటిని తీసుకుని వెళ్ళి సంబంధిత అధికారికి అందజేశారు. నేను, "బాబా! నా సంతకాన్ని ఆమోదింపజేసి, నాకు డిజిటల్ సంతకం వచ్చేలా చూడండి" అని బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను. బాబా ఖచ్చితంగా ఈసారి సహాయం చేస్తారని నా మనసుకు అనిపిస్తూ ఉంది. అదే నిజమైంది. ఆశ్చర్యం! బాబా అద్భుతమే చేశారని చెప్పాలి. నిజానికి పాన్ కార్డులోని సంతకంతో పోలిస్తే నా సంతకంలో చిన్న చిన్న తేడాలున్నాయి. అయినప్పటికీ బాబా అనుగ్రహం వలన నా డిజిటల్ సంతకం ఆమోదింపబడింది. దానితో ఎటువంటి అడ్డంకులు లేకుండా మా కంపెనీ రిజిస్ట్రేషన్ పనులు మొదలయ్యాయి. మా కంపెనీ పేరుని కూడా బాబా సహస్రనామాల నుండి ఎంపిక చేసుకున్నాము. తరువాత నేను, "మా కంపెనీ కనుక ఈ నెలలోనే ఏర్పడితే 'నవ గురువార వ్రతం' చేస్తాను, నా అనుభవాన్ని బ్లాగ్ ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాను" అని బాబాకు చెప్పుకున్నాను. ఆయన కృపతో నేను కోరుకునట్టుగా ఈ నెల మొదటివారంలోనే మా కంపెనీ రిజిస్ట్రేషన్ జరిగి, కంపెనీ ఏర్పడింది. నాకు తెలుసు బాబా ఆశీస్సులు సదా మాపై ఉంటాయని. ఆయన మంచి ప్రాజెక్టులు మాకు వచ్చేలా చేసి మా కంపెనీ విజయపథంలో ముందుకుసాగేలా అనుగ్రహిస్తారని నా గట్టి నమ్మకం. దయచేసి అందరూ బాబాపై నమ్మకం ఉంచండి. ఆయన మనకేది మంచిదో అది ఖచ్చితంగా మనకు ఇస్తారు.

ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి.

సమస్యను బాబాకు చెప్పుకోండి - ఆయన అంతా సజావుగా సాగేలా చూసుకుంటారు.

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిబాబా దివ్యచరణాలకు నా నమస్సుమాంజలులు. నేను ప్రతిరోజూ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతూ ఉంటాను. తద్వారా మానసిక ప్రశాంతత పొందడంతో పాటు, బాబాపట్ల విశ్వాసం దృఢతరం అవుతూ ఉంది. నేనిప్పుడు బాబాని ఎవరైనా ఏదైనా అడిగితే, ఆయన ఎలా సహాయం చేస్తారో తెలియజేసే అనుభవాన్ని మీతో పంచుకుంటాను.

గత ఏడాదిలో ఒకసారి మా సిస్టర్ తన ఫ్యామిలీతో పాటు ఒక వారంరోజులు మాతో గడపడానికి ప్లాన్ చేసుకుంది. ఈ వార్త వింటూనే నాకు ఆనందంగా అనిపించింది. అదేసమయంలో మావారు ఎలా స్పందిస్తారోనని చాలా ఆందోళనపడ్డాను. ఎందుకంటే ఆయనకి మా కుటుంబసభ్యులంటే అంతగా ఇష్టం ఉండదు. ఆయనకు ఛాందసభావాలు ఎక్కువ, నన్ను కూడా సరిగా చూసుకోరు. భార్యాబిడ్డలు అంటే ఆయనకు చిన్నచూపు. అందువలన ఎప్పుడూ నాపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు. నా తల్లిదండ్రులతో కూడా సరిగా మాట్లాడరు. అందువలన ఆయన మా సిస్టర్ వాళ్లతో ఎలా నడుచుకుంటారోనని చాలా భయమేసి, "బాబా! అంతా సక్రమంగా నడిచేలా మీరే చూసుకోండి" అని బాబాతో చెప్పుకున్నాను. ఇంకో విషయం, మొదటి రెండురోజుల్లో వాళ్ళు మాతోపాటు వేరే ప్రదేశానికి వెళ్లాలని అనుకున్నారు. అందుకు మావారు అంగీకరించకపోవడమే కాకుండా నన్ను కూడా హోటల్, క్యాబ్ బుక్ చేయకుండా అడ్డుపడ్డారు. కానీ బాబా కృపవలన నేను ఆయనకి తెలియకుండా నా డబ్బులతో ఆన్లైన్ ద్వారా వాటిని బుక్ చేశాను. తర్వాత మావారు రాకపోయినప్పటికీ ఆ రెండురోజులు బాబా దయతో మా ట్రిప్ హ్యాపీగా సాగింది. తిరిగి వచ్చేటప్పుడు రోడ్డుమీద ఒక చోట నా మొబైల్ ఫోన్ పడిపోయింది. ఆ విషయం దాదాపు ఆరు, ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాక మేము గుర్తించాం. మొబైల్ ఫోన్ దొరుకుతుందన్న ఆశ కూడా లేకపోయినప్పటికీ వెనక్కి తిరిగాము. నేను ఆపకుండా బాబాని స్మరిస్తూనే ఉన్నాను. బాబా కృప చూపించారు. దాదాపు 45 నిమిషాలు గడిచినప్పటికీ ఫోను రోడ్డుమీద అలానే ఉంది. మనసారా బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

ఇదంతా ఇలా నడుస్తుంటే, మనసులో మాత్రం "మిగిలిన రోజులు మావారు వాళ్లతో ఎలా ప్రవర్తిస్తారో"నని నేను ఆందోళనపడుతూనే ఉన్నాను. కానీ బాబా కృప, ఆయన చక్కగా మాతో సమయం గడిపారు. వాళ్లతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. దగ్గర్లో ఉన్న ప్రదేశాలు చూపించడమే కాకుండా షాపింగ్ కి కూడా తీసుకుని వెళ్లారు. చివరికి వాళ్లని ఎయిర్‌పోర్ట్ వరకు డ్రాప్ కూడా చేసారు. బాబాయే వాళ్లతో ఆప్యాయంగా మాట్లాడేలా మావారిని మలిచారు. నిజానికి ఆయన అంతకుముందు ఎప్పుడూ అలా నడుచుకోలేదు. బాబా వల్లనే ఇదంతా సాధ్యమైంది. వాళ్లు ఎంతో సంతోషంగా తిరిగి వెళ్లారు. ముఖ్యంగా నేను అమితానందాన్ని పొందాను. ఎందుకంటే, నేనెప్పుడూ "మావారు నాతో, నా కుటుంబ సభ్యులతో సరిగా నడుచుకోవాల"ని ఆశపడుతూ ఉండేదాన్ని. ఇకపై అంతా సజావుగా సాగేలా బాబా చూసుకుంటారని నాకు ప్రశాంతంగా అనిపించింది. చిన్నదైనా, పెద్దదైనా బాబా బాధ్యతగా నెరవేరుస్తారు. జీవితంలో ఏదైనా మన కంట్రోలులో లేని సమయంలో సమస్యను బాబాకు అప్పగించి మౌనంగా ఆయన స్మరణ చేసుకుంటే, ఆయన తప్పకుండా సమస్యను చాలా జాగ్రత్తగా పరిష్కరిస్తారు.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo