సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 28వ భాగం....


ఈ భాగంలో అనుభవం: 
  • శ్రీసాయి కృప

పేరు వెల్లడించని సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

నేను గత తొమ్మిదేళ్లుగా బాబాని పూజిస్తున్నాను. ఆయన లేని నా జీవితం పరిపూర్ణం కాదు. మనం ఎలా ఉంటామంటే, ఆయన మన వంద కోరికలు తీర్చి, ఏదో ఒక కోరిక తీర్చకపోతే మనం ఆయనపై కోపగించుకుని అలుగుతాం. ఆయనను పూజించడం మానేస్తాం. కానీ ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టరు. నేను కూడా ఒకానొక కఠిన పరిస్థితిలో బాబాపై అలిగి ఆయనకు దూరంగా ఉన్నాను. కానీ తర్వాత నా తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాను. బాబా నాకు ఎంతగానో సహాయం చేశారు. నిజానికి మా నాన్నగారినుండి నాకు ఆర్థిక సహాయం లేనప్పటికీ నేను ఇంజనీరింగ్ పూర్తిచేయడానికి బాబా ఎన్నోవిధాల సహాయం చేశారు. ఆయన ఆశీస్సులతో  మంచి పర్సెంటేజ్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడమే కాకుండా కాలేజీ ప్లేస్‌మెంట్ లో ఉద్యోగం కూడా వచ్చింది. కానీ కొన్ని కారణాలవలన నేను ఉద్యోగాన్ని వదిలేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. బాబా ఇచ్చిన కొన్ని చిన్న చిన్న అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

1) 2018లో గురుపౌర్ణమి ముందురోజు నా ఫ్రెండుతో నేను మాటల సందర్భంలో, "గురుపౌర్ణమినాడు ఎవరైతే శిరిడీ దర్శిస్తారో వాళ్ళు నిజంగా బాబా ఆశీస్సులు పొందిన ధన్యాత్ములు" అన్నాను. అదేరోజు రాత్రి నాకొక కల వచ్చింది. కలలో నేను శిరిడీ సమాధిమందిరంలో హారతికి హాజరైవున్నాను. నేను సాయిబాబాకు ఎదురుగా నిల్చుని ఆయనను చాలా దగ్గరగా చూస్తున్నాను. హారతి తర్వాత అక్కడ పూజారి అందరికీ ప్రసాదం పంచుతూ నా చేతిలో కూడా ప్రసాదం పెట్టారు. నేను పొందిన ఆనందాన్ని, అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నాను. నేను పొందిన ఆ ఆనందం అన్నిటికన్నా ఎంతో అద్భుతమైనది. బాబాకు మన చిన్న చిన్న కోరికలతో సహా అన్నీ తెలుసు. ఆయన వాటిని నెరవేర్చి మనల్ని సంతృప్తి పరుస్తారు.

2) ఉద్యోగం విడిచిపెట్టాక, ఒకరోజు నేను సాయిబాబా సూక్తులు చదువుతున్నాను. అప్పుడే నాకు మొదటిసారి 'శ్రీసాయిసచ్చరిత్ర' గురించి తెలిసింది. వెంటనే ఆతృతగా ఇంటర్నెట్‌లో వెతికి సాఫ్ట్ కాపీ సంపాదించి చదవడం మొదలుపెట్టాను. మరుసటిరోజే నాకు   ట్యూషన్స్ చెప్పే ఉద్యోగాన్ని బాబా చూపించారు. ఆవిధంగా నేను బాబాను ఏమీ అడక్కుండానే నా ఆర్థిక సమస్యలు తీరిపోయాయి.

3) నా ఫ్రెండ్ తను చేస్తున్న ప్రాజెక్ట్ కంప్లీట్ కావడంతో ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. తను నోటీసు పీరియడ్‌లో ఉన్నాడు. అప్పుడు నేను తనకి, "సాయి సచ్చరిత్ర పారాయణ చేయమ"ని చెప్పాను. నేను చెప్పినట్లుగానే తను రెండుసార్లు సచ్చరిత్ర పారాయణ చేశాడు. ఇక రెండురోజుల్లో ఉద్యోగం వదిలిపెట్టాల్సి ఉందనగా ఒక పెద్ద కంపెనీలో 100% ఇంక్రిమెంటుతో తనకి చాలా మంచి ఉద్యోగం వచ్చింది.

4) నేనెప్పుడూ భోజనం చేసే ముందు బాబాకి సమర్పించి తరువాత తింటాను. అయితే ఒకరోజు ఏవో పనులలో బిజీగా ఉండి బాబాకి సమర్పించడం మర్చిపోయాను. వెంటనే నాకు ఎక్కిళ్ళు మొదలయ్యాయి. మరుక్షణం సాయిబాబాను తలుచుకున్నాను. అంతే! నన్ను నమ్మండి, ఒక్కసారి కూడా ఎక్కిళ్లు రాలేదు. బాబాను క్షమాపణ వేడుకున్నాను.

5) ఒకరోజు మానసిక ఒత్తిడి వలన రాత్రి 1:33 అవుతున్నా నాకు నిద్రపట్టక సాయిబాబా బ్లాగు చదువుతున్నాను. హఠాత్తుగా ఒక మెసేజ్ చూసి ఆశ్చర్యపోయాను. "నిద్రలేని రాత్రులు గడపకు. బిడ్డా! వెళ్లి పడుకో! నన్ను తలచుకుని నిద్రపో! అన్నీ సర్దుకుంటాయి. నాయందు విశ్వాసముంచు!" చూశారా, బాబా ఎంత దయార్ద్రహృదయులో!

ఇలా ఎన్నెన్నో అనుభవాలు. ఆయన తన భక్తులకు రకరకాల మార్గాల ద్వారా సహాయం చేస్తూ ఉంటారు. తన భక్తులు ఎక్కడున్నా, ఏ ఆపదలో ఉన్నా తక్షణం బాబా వారి చెంతనే వుండి రక్షణ ఇస్తారు. 

"బాబా! మీకన్నీ తెలుసు. నేను కష్టమైన రోజులని గడుపుతున్నాను. ఈ కష్టాలను ఎదుర్కోవడానికి తగిన శక్తినివ్వండి. మీరు నాతో ఉన్నారని నాకు తెలుసు. మీరు తోడుగా ఉంటే ఎంత పెద్ద కష్టమైనా అది అతిచిన్నదైపోతుంది. నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి. లవ్ యు బాబా! మా అందరినీ ఆశీర్వదించండి". బాబాకు ఏది ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. శ్రద్ధ, సహనం కలిగి ఉండటమే మనం చేయాల్సింది.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo