ఈరోజు భాగంలో అనుభవాలు:
- బాబా నా ప్రార్థన విన్నారు.
- బాబా నా వైవాహిక జీవితాన్ని
నిలబెట్టారు.
బాబా నా ప్రార్థన
విన్నారు.
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
బ్లాగు
నిర్వాహకులకు ధన్యవాదాలు. నా భర్త బాబా భక్తుడు కాదు. అందువలన నేను తనతో నా
అనుభవాలను పంచుకోలేను. కానీ ఈ బ్లాగు ద్వారా నా ఆనందాన్ని మీతో పంచుకుంటాను.
ఒకరోజు
ఉదయం 5 గంటలకు
హఠాత్తుగా నాకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. కనీసం మంచంమీదనుంచి లేవలేకపోయాను.
మావారిని నిద్రలేపితే అతనికి నిద్ర సరిపోదు, తను ఆఫీసుకు
వెళ్ళవలసి ఉంది కాబట్టి తనని మేల్కొల్పదలచుకోలేదు. ఖాళీ కడుపుతో పెయిన్ కిల్లర్స్
వేసుకోలేను. అలాగని కడుపునొప్పి భరించలేకున్నాను. ఆ స్థితిలో, 'ఓం సాయిరామ్' అని స్మరిస్తూ నా పడక పక్కన ఉన్న
నీటిలో బాబా ఊదీ కలిపి నన్ను త్రాగమంటున్నట్లు ఊహించుకుని ఆ నీటిని త్రాగాను. నా
కడుపుపై బాబా తమ మృదువైన చేతితో స్పృశించినట్లు భావించుకున్నాను. క్షణాల్లో నా
కడుపునొప్పి అదృశ్యమైపోయింది. ఇక నా ఆనందాన్ని, ఆ క్షణాన
నేను పొందిన భావోద్వేగాలను పదాలలో చెప్పలేను. చాలా చాలా ధన్యవాదాలు బాబా!
బాబా నా వైవాహిక జీవితాన్ని నిలబెట్టారు.
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
కొన్ని నెలల క్రితం బాబా ఇచ్చిన మొదటి అనుభవాన్ని నేనిప్పుడు మీతో
పంచుకుంటాను. నాకు వివాహమై ఐదేళ్లయినా సంతానం కలగలేదు. మొదట్లో మావారు చికిత్స
కోసం నాతోపాటు డాక్టర్ వద్దకు వచ్చేవారు. కానీ, కొన్నాళ్ల
తర్వాత రావడం మానేశారు. పిల్లలు లేరన్న ముఖ్యకారణంతో పాటు మరికొన్ని కారణాలవలన నా
అత్తమామలు, ఇతర కుటుంబసభ్యులు నన్ను ప్రతిదానికీ అవమానిస్తూ
ఉండేవారు. నేనసలే స్వశక్తిపై ఆధారపడలేని బలహీనురాలిని. అలాగని తల్లిదండ్రులకి భారం
కాలేను. కానీ అత్తమామల టార్చర్ భరించలేక జనవరి నెలలో ఇల్లు వదిలి బయటకు వచ్చేసాను.
నా
మేలుకోరే మా పనిమనిషి (అలా అనే కంటే తనని సహాయకురాలు అంటే బాగుంటుంది.) ఒకరోజు
నాకు ఫోన్ చేసి, నా
వైవాహిక జీవితాన్ని కాపాడుకోవడానికి 'నవ గురువార వ్రతం'
చేయమని సలహా ఇచ్చింది. నన్ను
కాపాడడానికి బాబాయే తన ద్వారా అలా చెప్పించారని నాకనిపించి వ్రతం మొదలుపెట్టాను. 8వ వారం వ్రతం చేసిన తర్వాత నాకెందుకో తిరిగి ఇంటికి వెళ్ళి నా హక్కు కోసం
పోరాడాలనిపించింది. అప్పటికే వాళ్ళు నాకు ఎంతో కొంత మనోవర్తి చెల్లించి నన్ను
వదిలించుకోవాలని చూస్తున్నారు. ఆ సమయంలో నేను నా భర్త ఇంటికి మళ్ళీ వెళ్లాను. నేను
వెళ్ళే సమయానికి నా భర్తగానీ, అత్తమామలుగానీ ఇంట్లో లేరు.
నేను సాయి నామం తలుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళాను. కొద్దిసేపటికి నా భర్త, అత్తమామలు ఇంటికి వచ్చారు. మా అత్తగారు నేను
నా భర్తతో కలిసి ఉండడానికి ఒప్పుకోలేదు. నా భర్త కనీసం నాతో మాట్లాడడానికి కూడా
అంగీకరించలేదు. నేను బాబా ముందు కూర్చుని, "బాబా! నాకెందుకు ఇంతటి అవమానం?" అని
చాలా ఏడ్చాను. బాబా కృపవలన అద్భుతంగా నాలో ఏదో
తెలియని శక్తి ప్రవేశించి నా హక్కులకోసం పోరాడడానికి మొండిగా నిల్చున్నాను. తొమ్మిదో వారం వ్రతం పూర్తి చేశాక హఠాత్తుగా
మా అత్తగారిలో ఏ మార్పు వచ్చిందో గానీ, ఇల్లు వదిలి తన
కూతురింటికి వెళ్ళిపోయింది. తర్వాత నిదానంగా అన్నీ
సర్దుకున్నాయి. ఇప్పుడు నా భర్త నన్ను ఎంతగానో గౌరవిస్తున్నారు. ఇదంతా బాబా కృపే.
త్వరలోనే బాబా మాకు సంతానాన్ని కూడా అనుగ్రహిస్తారని నాకు తెలుసు. "చాలా చాలా
ధన్యవాదాలు బాబా!"
Baba is great
ReplyDelete