సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 27వ భాగం....


ఈ భాగంలో అనుభవం : 
  • బాబా కోపంగా చూసి కడుపులో ఉన్న రాళ్లను తొలగించిన లీల.


సాయిభక్తుడు సురేష్ తుకారాం తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

నాకు ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉండేది. 2007లో ఒకసారి నా దగ్గరకి శిరిడీ వెళ్ళడానికి 20 మంది ఒక గ్రూపుగా వచ్చారు. కానీ ఏదో కారణం వలన వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్లిపోయారు. దానితో ఆరోజు నేను శిరిడీ వెళ్లవలసిన ట్రిప్ రద్దయ్యింది. నా మనసొప్పక 'పోనీ నేనొక్కడినే శిరిడీ వెళ్ళివస్తా'నంటే నా భార్య అభ్యంతరం చెప్పింది. కానీ నేను ఊరుకోలేదు. తనని ఒప్పించి మా 3 సంవత్సరాల బాబును, నా భార్యను తీసుకుని శిరిడీకి ప్రయాణమయ్యాను. మేము ముగ్గురం దాదర్ నుంచి శిరిడీకి బయలుదేరాం. నాకప్పటికే 6 నెలల ముందు నుండి కడుపునొప్పి వుంది. డాక్టర్ దగ్గరకి వెళితే కొన్ని టెస్టులు చేయించమన్నారు. టెస్టులు చేస్తే, కడుపులో రాళ్ళు (చిన్నవి) ఉన్నాయని తెలిసి, డాక్టరు కొన్ని రోజుల తరువాత ఆపరేషన్ చేద్దామన్నారు. మేము రైల్లో కూర్చున్న కాసేపటికి నాకు కడుపునొప్పి మొదలై, కూర్చోవడం కూడా కష్టంగా అనిపించింది. రానురాను నొప్పి ఎక్కువైంది. అలాగే మొత్తానికి ఎలాగో శిరిడీ చేరుకున్నాము. నేను బ్యాగు కూడా ఎత్తలేని పరిస్థితిలో వున్నాను. మెల్లగా ఎలాగో బ్యాగు పట్టుకుని, రూమ్ తీసుకుని త్వరగా స్నానాలు ముగించుకుని నేను, నా భార్య, మా బాబు వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాం. తరువాత నా భార్య, "బాబా మహాప్రసాదం తిని చాలా సంవత్సరాలు అయింది, తిని వెళ్దా"మనడంతో ప్రసాదాలయానికి వెళ్లి మహాప్రసాదం తిని రూముకి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. కడుపులో నొప్పి అలానే వుంది. సాయంత్రం ద్వారకామాయికి వెళ్ళి కూర్చున్నాం. బాబా ఎప్పుడూ కూర్చునే రాయి దగ్గరకి వెళ్ళి, "బాబా! నా కడుపునొప్పి తగ్గడం లేదు" అనుకుంటూ బాబా పటంవైపు చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. బాబా గడ్డం, మీసాలు పెద్దవిగా అయినట్లు అనిపించింది. బాబా నావైపు కోపంగా చూస్తున్నారు. నాకు భయమేసి, "బాబా! నేనింక ఇక్కడికి రాను" అని అనుకుంటూ బయటికి వచ్చేసాము. నా భార్య లెండీబాగ్ వెళ్దామని అంటే, నేను, "వద్దు, నాకు టాయిలెట్ వస్తుంది, రూముకు వెళ్దామ"ని వెంటనే రూముకు వచ్చేశాము. నేను టాయిలెట్‌కి వెళ్దామని వెళ్తే టాయిలెట్‌లో రాళ్ళు పడిపోతున్నట్లనిపించింది. ఇంతకుముందు టాయిలెట్‌కి వెళ్ళినప్పుడు చాలా నొప్పి వేసేది. ఇప్పుడసలు నొప్పివేయడం లేదు. "హమ్మయ్య! ఈ నొప్పినుంచి విముక్తి బాబానే ఇచ్చారు" అనుకున్నాను. ఆరోజు నాకు మంచి నిద్ర పట్టింది. పొద్దున్నే లేచి బాబాను క్షమించమని అడిగాను. నాకప్పుడు శ్యామాను పాము కరిచిన కథ గుర్తుకొచ్చింది. ఆ కథలో బాబా శ్యామాని పైకెక్కవద్దని కోపగించుకుంటారు. కానీ నిజానికి ఆయన పైకెక్కవద్దని కసిరినది పాము విషాన్నే! అదేవిధంగా ఇప్పుడు బాబా కోపంగా చూసినది నన్ను కాదని, నా శరీరంలో ఉన్న రాళ్లనని నాకర్థమయ్యింది. "ఇలాగే మీ కృపాదృష్టి ఎప్పుడూ మా మీద ఉండనీ బాబా!" అనుకుంటూ ఇంటిదారి పట్టాము.

తెలుగు అనువాదం: శ్రీమతి మాధవి.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo