సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్త అనుభవమాలిక 8వ భాగం....


బాబా చూపిన అపార అనుగ్రహం

నా పేరు పద్మ. మాది గుంటూరు. నేను పూజలు ఎక్కువగా చేయను గానీ, నిత్యం బాబా నాతో ఉన్నారన్న ధ్యాసతో ఆయనను తలుచుకుంటూ ఉంటాను. 2019, మార్చిలో మా అమ్మాయి మెడిసిన్ చివరి సంవత్సరం పరీక్షలు వ్రాసింది. తను చాలా బాగా చదువుతుంది. మొదటి రెండుపరీక్షలు బాగా వ్రాసింది కూడా. అయితే మూడవ పరీక్ష రేపనగా ముందురోజు ఉదయం తనకి వైరల్ ఫీవర్ వచ్చింది. దానికి తోడు విరోచనాలు మొదలయ్యాయి. దాదాపు పది, పదిహేనుసార్లు విరోచనాలు అయ్యేసరికి తను పూర్తిగా నీరసించిపోయింది. కనీసం పుస్తకం పట్టుకునే శక్తి కూడా లేక, పరీక్షకు ప్రిపేర్ కాలేక చాలా చాలా ఏడ్చింది. చివరికి పరీక్షమీద ఆశ వదిలేసుకుంది. మేము కూడా, "సరేలేమ్మా, పర్వాలేదు. వచ్చే సంవత్సరం వ్రాసుకుందువు" అని తనని ఓదార్చాము. ఆ రాత్రంతా తన పరిస్థితి అలానే ఉంది. టాయిలెట్‌కి వెళ్లడం, రావడం. అసలు రోజంతా ఆహారంలేక, ఆ విరోచనాలతో బాగా నీరసించిపోయి నడవలేని స్థితికి వచ్చింది. నిద్రమాత్ర వేసుకున్నా కాసేపు కూడా పడుకోలేక పోయింది. రాత్రంతా మాకెవరికీ కంటిమీద కునుకులేదు. "బాబా! మీరే ఏదో ఒకటి చేయండి" అని ప్రార్థిస్తూ ఉన్నాం. తను తెల్లవారాక కూడా పుస్తకం పట్టుకోలేక పోయింది. ఇక మేము పరీక్ష వ్రాయవద్దని పూర్తి నిర్ణయానికి వచ్చాము. తరువాత తన పరిస్థితి దారుణంగా ఉండటంతో 10 గంటలకి పరీక్షనగా 8 గంటల సమయంలో డాక్టరు వద్దకు తనని తీసుకుని వెళ్తూ డోర్ లాక్ చేస్తుండగా, తన ఫ్రెండ్ నుండి ఫోన్ వచ్చింది. మా అమ్మాయి అయితే మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. నేను తనతో మాట్లాడమని కాస్త నచ్చజెపితే మాట్లాడింది. పరీక్ష వ్రాయనని నిశ్చయించుకున్న తరువాత చివరి నిమిషంలో బాబా మిరాకిల్ చూపించారు. అందరి రూపంలో ఉన్న ఆ సాయినాథుడే తన ఫ్రెండ్ రూపంలో పరీక్షకు వెళ్లేందుకు తనని ఒప్పించారు. మేము వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి డాక్టరుని సంప్రదిస్తే, డాక్టరు కేవలం ఒకేఒక్క మాత్ర ఇచ్చారు. అంతవరకూ ఏ మందుకూ తగ్గనిది కాస్త ఉపశమనం కనిపించింది. మేము ఇంటికి వచ్చాక తన ఫ్రెండ్ కారు తీసుకుని మా ఇంటికి వచ్చి, మమ్మల్ని కారులో కాలేజీకి తీసుకుని వెళ్లారు. నేను కూడా తనతో పాటు కాలేజీకి వెళ్ళాను. ఏమాత్రం పరీక్షకు ప్రిపేర్ కానందున తను పరీక్షకు కూర్చోవడానికి ఇష్టపడకపోయినా తన ఫ్రెండ్స్ తనని ఒప్పించి కూర్చోబెట్టారు. అయినప్పటికీ దాదాపు అరగంటసేపు తను, "నేనేమీ చదవలేదు, నాకేమీ గుర్తురావడం లేదు" అని బాధపడుతూనే ఉండిపోయింది. బయట రిసెప్షన్ వద్ద కూర్చుని ఉన్న నాకు హఠాత్తుగా ఒక పెద్ద బాబా ఫోటో అక్కడ కనిపించింది. ఇక నేను ఆయనను చూస్తూ, "బాబా! తనకి సహాయం చేయండి" అని ప్రార్థించి, ఆయనను స్మరిస్తూ కూర్చున్నాను. చివరికి బాబా కృపతో తను పరీక్ష చాలా బాగా వ్రాసింది. ముందురోజంతా ఫీవర్, వాంతులు, విరోచనాలతో నీరసించిపోయిన అమ్మాయి, నడిచే ఓపికలేక, నడుము పట్టుకుని ఆపసోపాలు పడిన అమ్మాయి ఎటువంటి ఇబ్బందీ లేకుండా మూడు గంటల పాటు కూర్చుని పరీక్ష వ్రాసిందంటే అది బాబా అపార అనుగ్రహమే. ఆయన ఎప్పుడూ తన భక్తులకు అండగా ఉండి ఆదుకుంటారనడంలో సందేహమే లేదు.

సర్వం శ్రీ సాయినాథ దివ్యచరణారవిందార్పణమస్తు!

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo