ఈరోజు భాగంలో అనుభవం:
- చిన్న ప్రార్థనకు సైతం పలికే ఇలవేల్పు శ్రీసాయి
ఓం సాయిరాం. నా పేరు లక్ష్మి. మాది మచిలీపట్నం. ఎందరో సాటి సాయిబంధువులు సాయితో తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటే నాకు కూడా నా అనుభవాలను అందరితో పంచుకోవాలని ఆశ కలిగింది. 1991 నుండి శ్రీసాయితో నాకు అనుబంధం ఉంది. ఆయన నాకెన్నో అనుభవాలు ఇచ్చారు. వాటిలో కొన్నింటిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. మచిలీపట్నం దగ్గర ఉన్న గూడూరు నివాసి అయిన మా మావయ్యగారు శ్రీ రతన్ జీ గారు 'సాయిమహారాజ్' అనే పుస్తకం ప్రచురించేవాళ్లు. ఆయన ఒకసారి నాతో, "నీకు ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా లేక బాధ కలిగినా మనసారా బాబాని తలచుకో, తక్షణం ఆయన నీకు రక్షణనిస్తారు" అని చెప్పారు.
మేము అప్పట్లో ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం. మాకు ఒక చిన్నపాప ఉంది. ఒకరోజు రాత్రి కరెంటు పోయింది. రాత్రంతా పవర్ రాదన్నారు. నేను "పాప ఎలా పడుకుంటుందో ఏమిటో" అని చాలా భయపడ్డాను. అంతలోనే తను ఏడవటం మొదలుపెట్టింది. తననెలా నిద్రపుచ్చాలో అర్థం కాలేదు. ఆ సమయంలో రతన్ జీ మావయ్యగారు చెప్పిన మాట గుర్తుకు వచ్చి, "సాయి, సాయి" అనుకుంటూ కూర్చున్నాను. కొద్దిక్షణాల్లో రేపటివరకు రాదన్న పవర్ వచ్చేసింది. నాకు చాలా సంతోషం కలిగింది. మావయ్యగారికి ఫోన్ చేసి నా సంతోషాన్ని పంచుకున్నాను. ఆయన సాయిమహారాజ్ పుస్తకంలో నా అనుభవాన్ని ప్రింట్ చేసారు.
నాలుగు రోజుల క్రిందట జరిగిన మరో చిన్న అనుభవాన్ని కూడా పంచుకుంటాను.
ఈరోజు(2019, ఏప్రిల్ 24) ఉదయాన మా ఇంటి ఆవరణలోకి ఒక పిల్లి నాలుగు పిల్లలని తెచ్చి గోడకున్న కన్నంలో దాచిపెట్టింది. అది చూసిన మావారు చిరాకుగా వాటిని బయటకు తోలి, మళ్ళీ అక్కడ చేరకుండా ఆ కన్నంలో రాళ్ళు పెట్టారు. అయితే ఆ కన్నంలో ఒక పిల్లి పిల్ల ఉండిపోయిందేమోననే అనుమానంతో నాకు భయం, పాపభీతి కలిగాయి. దానితో చాలా టెన్షన్ పడ్డాను. సాయంత్రానికి తల్లిపిల్లి ఏడుస్తూ తిరుగుతుండటం కనిపించింది. దాన్నలా చూసి నాకు చాలా బాధగా అనిపించింది. చాలాసేపు 'పాపం పిల్లలు కదా' అని దిగులుపడి బాబాకు నమస్కరించుకుని, "పిల్లలు కనిపించేలా చేయి తండ్రీ, దాని పిల్లలు దానికి కనిపిస్తే దక్షిణ సమర్పించుకుంటాను" అని ప్రార్థించాను. ఆశ్చర్యం! గంట తరువాత తల్లిపిల్లి కేరింతలు కొడుతూ కనిపించింది. ఏమిటా అని చూస్తే దాని నాలుగు పిల్లలు పాలు త్రాగుతూ కనిపించాయి. అది చూసి నా మనసుకెంతో సంతోషంగా అనిపించింది. వెంటనే, "చాలా చాలా కృతజ్ఞతలు తండ్రీ!" అని బాబాకు చెప్పుకున్నాను. నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని వెంటనే బ్లాగుకు పంపించాను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
🕉 sai Ram
ReplyDeleteసర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
ReplyDelete