సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శిరిడీ సమాధి మందిరంలోని బాబా విగ్రహము వెనుక దాగి ఉన్న లీలలు - రెండవ భాగం...






బాబా విగ్రహం వెనుక దాగివున్న లీల - మొదటి భాగం.. అక్టోబర్ నెలలో ప్రచురించాం. దానికి సంబందించిన మరికొంత సమాచారం లభించడంతో రెండవ భాగంగా ఈరోజు ప్రచురిస్తున్నాము. చదివి ఆనందించండి....

1954వ సంవత్సరంలో సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని చెక్కుతున్న బాలాజీ తాలిమ్ తన పనివాళ్ళతో చివరిదశ పనులు చేయిస్తున్నారు. అయితే ఆ చివరి సమయంలో సాయిబాబా విగ్రహం యొక్క ఎడమ మోకాలి క్రింది భాగంలో కొంచెం గాలి చేరినట్లు (ఒక చిన్న గాలిబుడగ ఉన్నట్లు) గుర్తించారు. అది తొలగించాల్సిన అవసరం వచ్చింది. కానీ పూర్తవుతున్న స్థితిలో విగ్రహంనుండి గాలి ఉన్న రాతి భాగాన్ని తొలగించాలంటే పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్లే. ఎందుకంటే, ఆ భాగంతో పాటు దాని చుట్టూ ఉన్న భాగం కూడా పడిపోయే ప్రమాదం ఉంది. పోనీ అలా ఉంచేద్దామంటే, విగ్రహం పగిలిపోయి ఇక పూజించడానికి పనికిరాకుండా పోతుంది. అందువలన బాలాజీ తాలిమ్ గాలి చేరుకున్న భాగాన్ని తీసివేయడానికి భయపడి ఏమి చేయాలో అర్థంకాక పని ఆపివేశాడు. కానీ తన శ్రమ, సమయం అంతా వృధా ఐపోతుందని చాలా ఆందోళనలో పడ్డాడు. ఆ స్థితిలో, "బాబా! నా మీద కరుణ చూపండి. మీ మూర్తి మొత్తం తయారుగా ఉంది. దయచేసి కరుణ చూపండి బాబా!" అని ప్రార్థించాడు. మరుక్షణంలో, "బాలాజీ! కొనసాగించు" అని ఒక కంఠధ్వని వినిపించింది.

వెంటనే తాలిమ్, "పని కొనసాగించండి. గాలి చేరుకున్న రాతిభాగాన్ని చెక్కి తొలగించండి" అని పనివాళ్లను ఆదేశించాడు. కానీ పనివాళ్ళు మోకాలి భాగమంతా పడిపోతుందన్న భయంతో పని చేయడానికి నిరాకరించారు. ఇక తప్పనిసరై, స్వయంగా బాలాజీ భయపడుతూనే ఉలిని, సుత్తిని చేతిలోకి తీసుకుని, "బాబా! సహాయం చెయ్యండి" అని ప్రార్థిస్తూ మోకాలి క్రింద ఉన్న అదనపు భాగంపై ఒక చిన్న దెబ్బ వేసాడు. ఆశ్చర్యం! అద్భుతం! ఆ అదనపుభాగం మాత్రమే క్రింద పడింది, మిగతా బాబా విగ్రహం చెక్కు చెదరకుండా వుంది. అది చూసిన అతను కళ్ళనుండి నీళ్ళు జలజలా రాలుతుండగా  బాబా ముందర సాష్టాంగపడ్డాడు. తరువాత పట్టలేని ఆనందంతో నృత్యం చేస్తూ అందరికీ మిఠాయిలు పంచిపెట్టాడు. అంతటి అద్భుతమైన సాయి లీలను బాలాజీ పొందాడు.

పూర్తైన 5.5 అడుగుల సాయిబాబా విగ్రహాన్ని ఉత్సాహంతో గ్రామంలో ఉరేగిస్తూ వేడుక చేసారు. సజీవకళ ఉట్టిపడుతున్న బాబా విగ్రహాన్ని చూసి, బాబాను సజీవంగా ఉన్నప్పుడు దర్శించుకున్న స్వామి శ్రీసాయిశరణానంద, లక్ష్మీబాయి వంటి భక్తులు బాబా విగ్రహరూపంలో తిరిగి వచ్చారని ఎంతగానో ఆనందించారు.

1954 అక్టోబర్ 7, విజయదశమి రోజున పాలరాతితో తయారుచేయబడిన సాయిబాబా సజీవ మూర్తిని సమాధి వెనుక పశ్చిమభాగంలో ప్రతిష్ఠించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని స్వామి సాయిశరణానంద చేతులమీదుగా నిర్వహించారు.

బాబా విగ్రహాన్ని తయారుచేస్తున్న సమయంలో ఒకసారి శ్రీ బాలాజీ తాలిమ్‌కు బాబా దర్శనమిచ్చి, "పనిని పూర్తి చెయ్యి, భవిష్యత్తులో నువ్వు ఏ విగ్రహాన్నీ చేయవు" అని చెప్పారు. అందువలన తాలిమ్ బాబా విగ్రహం చేసిన తరువాత మరే విగ్రహం చెయ్యలేదు. చివరిగా తాలిమ్ తన 82 సం౹౹ వయస్సులో 1970, డిసెంబర్ 25న తుదిశ్వాస విడిచారు.

ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. 

భక్తులపై బాబా చూపే ప్రేమ అద్భుతం ... అనిర్వచనీయం.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిసోదరి నీత తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

నేను చిన్ననాటి నుండి బాబాకు వినయపూర్వకమైన భక్తురాలిని. గతంలో ఆయనిచ్చిన అనుభవాలతో రోజురోజుకి నా భక్తి విశ్వాసాలు రెట్టింపు అయ్యాయి. జీవితంలోని ప్రతి సందర్భంలో నేను బాబా కృపను అనుభూతి చెందుతున్నాను.

నా జీవితంలో 1999వ సంవత్సరంలో బాబా ఇచ్చిన అనుభవాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. రోజూ బాబాకి పూజ, ప్రార్థన చేశాక ఊదీ తీసుకోవడం మాకు అలవాటు. 4 సంవత్సరాల 5 మాసాల మా పాపకి కూడా శ్రీసాయిబాబా అంటే అమితమైన భక్తి, ప్రేమలు. తను ఎప్పుడూ “సాయిరాం ధున్” సంగీతాన్ని వింటూ ఉండేది. ఎప్పుడు తనకి తీవ్రంగా జ్వరం(104°C) వచ్చినా, "ఊదీ ఇవ్వమ"ని తను అడిగేది, దానితో ఇట్టే జ్వరం తగ్గుముఖం పట్టేది. అలాంటి మా పాపకి హఠాత్తుగా 1999, నవంబర్ 17న బ్లడ్ కాన్సర్(లుకేమియా) ఉందని తెలిసింది. మాకున్న ఒక్కగానొక్క పాపకి హఠాత్తుగా భయంకరమైన వ్యాధి ఉందని తెలియడంతో ఒక్కసారిగా కుటుంబమంతా కృంగిపోయాము. కానీ తనకి నయమైపోతుందని తను నమ్మకంతో ఉండేది. మేము కూడా సాయినే నమ్ముకున్నాము. తనకి టాటా మెమోరియల్ హాస్పిటల్ లో 10సార్లు బోన్ మారో చికిత్స చేసారు. ఒకరోజు అంత చిన్నవయస్సులో తను పడుతున్న అవస్థ చూడలేక నేను కన్నీరు కారుస్తుంటే, తను, “మమ్మా(అమ్మా), ఏడవకు! సాయిని ప్రార్థించు!” అని చెప్పింది. తనకి సాయి అంటే అంత ప్రేమ.

తరువాత ఒకసారి తను టాటా హాస్పిటల్లో ఉన్న సమయంలో నా భర్త స్నేహితులొకరు తనని చూడటానికి వచ్చారు. మాటల సందర్భంలో అతను శిరిడీ వెళ్తునట్టుగా చెప్పగా, అది వింటూనే మా పాప అతనితో తను కూడా శిరిడీ వెళ్తానని ఏడవడం మొదలుపెట్టింది. మేము, "నీ చికిత్స పూర్తైన తరువాత మనం శిరిడీ వెళదాము" అని చెప్పి తనని బుజ్జగించాము. ఆరోజు గురువారం. డాక్టర్లు, "పాపకోసం ప్లేట్లెట్స్ ఏర్పాటు చేయండి" అని చెప్పారు. మేము ఆ మెసేజ్ ని పేజర్ లో పెట్టాము. అతితక్కువ సమయంలో చాలామంది దాతలు ప్లేట్లెట్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ముంబాయికి చెందిన ఒకామె ఫోన్ చేసి తన ప్లేట్లెట్స్ ఇస్తానని చెప్పారు. అయితే అప్పటికే మాకు ఒక దాత దొరికి ఉండడంతో మేము తనని సున్నితంగా తిరస్కరించాము. అయితే ఆమె మా పాపని ఒక్కసారి కలుస్తానని చెప్పి, అదేరోజు సాయంత్రం ఒక బాబా ఫోటో, ఊదీ ప్రసాదం పాపకు తీసుకొని వచ్చింది. బహుశా బాబాయే ఆమె ద్వారా వాటిని పంపారనిపించి మేము చాలా సంతోషించాము. తరువాత కొద్దిరోజులకి పాపకి కాథెటర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ తరువాత తను అంతటి నొప్పిని భరిస్తూ కూడా ఎంతో సంతోషంగా, “మమ్మా! నేను బాబాని చూసాను. ఆపరేషన్ థియేటర్ లో శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో బాబా తెల్లని వస్త్రాలు, ఎర్రగులాబీల మాల ధరించి కనిపించారు. నా తలపై నిమిరి, నన్ను శిరిడీ రమ్మని పిలిచారు" అని చెప్పింది.

దాదాపు 3 నెలల చికిత్స అనంతరం డాక్టర్లు, "ఇకపై పాపకి తదుపరి చికిత్స చేయలేము. ఎందుకంటే, తన శరీరం చికిత్సకి ఏమాత్రం సహకరించటం లేదు. కాబట్టి తనకి అనారోగ్య లక్షణాలని బట్టి ఏదయినా చికిత్స అందించాలంతే! ఇక తన ఆయుష్షు 3, 4 నెలలు మాత్రమే" అని చెప్పేసారు. ఇక మేము చేసేదిలేక భారమైన మనస్సుతో పాపని తీసుకుని శిరిడీ వెళ్ళాం. బాబా సమాధిపై ఉంచిన శాలువా, ఊదీ ప్రసాదంగా లభించాయి. సాయి దర్శనానంతరం మా ఇంటికి తిరిగి వచ్చేసాం.

రోజూ నేను పాప పక్కనే కూర్చుని “సాయి సచ్చరిత్ర” చదువుతూ ఉండేదాన్ని. చివరికి 2000, మే 21వ తేదీన మా పాప సాయిబాబా శాలువా తన ఒంటికి చుట్టుకొని, బాబా ఫోటో గుండెలకు హత్తుకుని(తనకి కాన్సర్ అని తెలిసినప్పటినుండి నేను తన గుండెలపై బాబా ఫోటో ఉంచేదాన్ని.) తుదిశ్వాస విడిచింది. తను చివరిగా పలికిన మాట: “మమ్మా! నాకు బాబా ఊదీ ఇవ్వు!” అని. వెంటనే నేను ఊదీని తన నుదుటిపై పెట్టి, కొంత ప్రసాదంగా ఇచ్చాను.

ఈ సంఘటనతో నాకు, మా వారికి అంతా శూన్యమైపోయింది. మేమెందుకు జీవిస్తున్నామో మాకే అర్థమయ్యేది కాదు. కానీ సాయిబాబా కృపతో ఎలాగో రోజులు గడిపేవాళ్ళం. మా పాప బాబాతో ఉందని నా గట్టినమ్మకం. నేనెప్పుడూ, "తనని జాగ్రత్తగా చూసుకోండి" అని బాబాని ప్రార్థిస్తూ, పాలు, ఆహారం మొదలయినవి బాబాకి నైవేద్యంగా పెట్టి, "ఇద్దరూ తీసుకోండి "అని వేడుకునేదాన్ని. కొద్దిరోజుల తరువాత ఒక గురువారంనాడు మేమొక బాబా భక్తుడైన ఒక బాబాని కలిసాము. ఆయన మాతో, “సరిగ్గా ఈరోజునుండి 8వ గురువారంనాడు సాయిబాబా మీ ఇంటికి ఏదో ఒక రూపంలో వస్తారు. అయితే, మీరు ఆయనని గుర్తించగలగాలి” అని చెప్పారు. తరువాత 8వ గురువారంనాడు నేను, మా వారు ఇద్దరం కలిసి మా పాపకి ఇష్టమైన ఆహారాన్ని తయారుచేసాం. ఎందుకంటే, మా పాప బాబాతోనే ఉందని మా దృఢవిశ్వాసం. ప్రతిరోజూ బాబాతోనే తన ఆహారం ఉంటుంది కాబట్టి బాబా ఒంటరిగా రారని మా అభిప్రాయం. ఆరోజు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు(శిరిడీలో సాయిబాబాకి నైవేద్యం ఇచ్చే సమయం) మా వీధిలో చూడగా, అంతా నిర్మానుష్యంగా ఉంది కానీ, ఒక తెల్లని ఆవు తన దూడతో మావైపు రావడం మాత్రం మేము గమనించాము. మేము వాటికి ఆహారం పెట్టిన మరుక్షణం మేడమీదకి వెళ్లి బాల్కనీ నుండి చూడగా అవి రెండూ మాయమైపోయాయి. వాటి రూపంలో బాబా, మా పాప వచ్చారు. ఇది బాబా మాకిచ్చిన అత్యంత మధురమైన అనుభవం. అది మాటలలో వర్ణించలేని భావం. ఎప్పుడు ఆ సంఘటనని తలుచుకున్నా నా కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఓం సాయిరాం! ఇంతకన్నా వివరించలేను. మా జీవితమంతా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నా ఏమాత్రం సరిపోవు.

ఇక అప్పటినుండి సచ్చరిత్ర పారాయణ చేయడం నిత్యకృత్యమైంది. ముఖ్యంగా 48వ అధ్యాయం పారాయణ చేస్తుండేదాన్ని. ఆ అధ్యాయంలో సపత్నేకర్ దంపతులు తమ బిడ్డ అనారోగ్యంతో చనిపోవడంతో, ఆ దిగులునుండి బయటకు రాలేని స్థితిలో ఉన్నప్పుడు బాబా వారితో, "వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను జంపెదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేల? అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరల దెచ్చెదను" అని ఆశీర్వదించిన వాక్యాలు బిడ్డని పోగొట్టుకున్న నాకెంతో ఊరటనిచ్చేవి. అదేవిధంగా బాబా నాకు కూడా నా బిడ్డని తిరిగి ఇస్తారనే నమ్మకంతో ఉండేదాన్ని. ప్రతిరోజూ నేను, "బాబా! మా పాపని మాకు తిరిగి ఇవ్వండి" అని ప్రార్థిస్తుండేదాన్ని.

2002, జూన్ 8 బాబా నా ప్రార్థనలకు సమాధానం ఇచ్చిన రోజు. బాబా కృపాశీస్సులతో మాకు బాబు పుట్టాడు. వాడి జుట్టునుండి గోళ్ళవరకు పోలికలన్నీ మా పాపవే. వాడికిప్పుడు 17 సంవత్సరాలు. వాడెప్పుడూ నాతో, “మమ్మా! నేను నీకు అబ్బాయిగా పుట్టడం ఎంతో మంచిదైంది. అదే నేను అమ్మాయిని అయుంటే పెళ్లి తరువాత నిన్ను వదిలి వేరే ఇంటికి పోవాల్సి వచ్చేది. ఇప్పుడు నేనెప్పటికీ నీతోనే ఉండొచ్చు” అంటూ ఉంటాడు.

భక్తులపై బాబా చూపే ప్రేమ అద్భుతం ... అనిర్వచనీయం.

బాబా మహిమ ఎంతటిదో అర్థమయ్యేలా తెలియజేసిన అనుభవాలు.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు కమల. ముందుగా ఈ వెబ్‌సైట్ ద్వారా, వాట్సాప్ ద్వారా సాయిబంధువులందరినీ కలుపుతున్న బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక అభినందనలు. మొదటిసారిగా నేను నా అనుభవాన్ని ఈమెయిల్ ద్వారా పంపి మీ అందరితో పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది.

నా చిన్నతనం నుండి మా కుటుంబంలోని వారంతా సాయినాథుడిని అందరి దేవుళ్ళతో పాటు పూజించేవాళ్ళు. నేనెప్పుడు ఇంటినుండి బయటకి వెళ్లినా నుదుటన కుంకుమతోపాటు బాబా ఊదీ ధరించకుండా వెళ్లేదాన్ని కాదు. నా భక్తి అంతవరకు మాత్రమే, బాబా గురించి నాకు ఏమీ తెలీదు. బహుశా నాకు అప్పట్లో అంత వయస్సు, జ్ఞానం లేవేమో! కానీ మొట్టమొదటిసారిగా 2008లో బాబా లీలను చవిచూశాను. అప్పుడు నేను నా ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాను. ఇంకో 15 రోజుల్లో నా సెమిస్టరు పరీక్షలు వ్రాయాల్సి ఉందనగా ఆ సమయంలో నాకు ఒళ్ళంతా చికెన్‌పాక్స్ వచ్చి, విపరీతమైన జ్వరంతో బాధపడ్డాను. పుస్తకం తెరచి చదువుదామంటే చదవలేని పరిస్థితి. ఏమి చేయాలో అర్థంకాక ఆందోళనపడేదాన్ని.అయినా సరే ధైర్యంచేసి ఆ స్థితిలోనే పరీక్షలకి వెళ్ళాను. అందరూ, "ఈ పరిస్థితుల్లో ఎందుకు వచ్చావు? సప్లిమెంటరీ వ్రాసుకోవచ్చు కదా!" అని అన్నారు. అయినా కూడా నేను అలాగే మొండిగా పరీక్షలన్నీ వ్రాసాను గాని, అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణురాలిని అవుతానన్న నమ్మకం నాకే లేదు. కానీ నేను చేసేది ఏమీ లేక ఫలితం ఏదైనా పరవాలేదు అనుకుని అక్కడితో ఆ విషయాన్ని వదిలేసాను. కొన్నిరోజులకి మా ఇంటిలో 'సాయి సచ్చరిత్ర' పుస్తకం దొరికింది. నేను ఏదో సరదాగా పారాయణ చేద్దామనుకుని మొదలుపెట్టాను. అసలు పారాయణ మొదలుపెట్టేముందు 'నాకు ఇది కావాలి' అని కూడా నేను బాబాని కోరుకోలేదు. గురువారం పారాయణ మొదలుపెట్టాను. అనుకోకుండా శుక్రవారమే నా పరీక్షాఫలితాలు వచ్చాయి. అన్ని సబ్జెక్టుల్లో నేను ఉత్తీర్ణురాలిని అయ్యానన్న మెసేజ్ చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. అసలు నేను ఏం వ్రాసానో కూడా నాకు తెలీదు, అలాంటిది నేను అన్ని సబ్జెక్టులూ పాసయ్యానంటే అది బాబా దయవల్లే అని నాకర్థమై బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

రెండవ అనుభవం:

అదే సమయంలో మా అమ్మగారు యూరిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. నేను సచ్చరిత్ర పారాయణ చేస్తున్నాను కదా, అందులో బాబా ఊదీ మహిమలకు సంబంధించిన అధ్యాయాలు చదివి బాబాకి నమస్కరించుకుని, "బాబా! అమ్మ నెలరోజులనుండి ఈ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంది. నీ ఊదీలో మహిమ ఉండడం నిజమే అయితే, అమ్మ పడుతున్న బాధ తగ్గించండి" అని చెప్పుకుని బాబా ఊదీ నీళ్లలో కలిపి అమ్మ చేత త్రాగించాను. ఎంత అద్భుతమంటే, నెలరోజులుగా బాధపడుతున్న అమ్మకి ఒక్కసారిగా పెద్ద వాంతి అయిపోయి, నీరసంగా ఉన్న తను 15 నిమిషాల్లో లేచి ఆరోగ్యంగా తిరగడం చూసిన మాకు నోట మాట రాలేదు. అప్పటినుండి నాకు బాబా మహిమ ఎంతటిదో అర్థమైంది. ఈరోజుకీ నా సాయినాథుడు నా వెంట ఉండి చాలా విషయాల్లో చేయూత అందిస్తున్నారు. "బాబా! ఇదేవిధంగా జీవితాంతం నా చేయి వదలకుండా నాకు తోడుగా ఉండి, మాకు మీ మీద ఉండే భక్తి రెట్టింపవుతూ ఉండేలా ఆశీర్వదించండి బాబా!"

ఓం శ్రీ సాయినాథాయ నమః

మొదటిసారిగా నేను చవిచూసిన బాబా ఊదీ మహిమ.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

కొన్ని కారణాలవలన నా పేరు తెలియజేయడం లేదు. అయినా పేరుదేముంది? బాబా లీలల ద్వారా ఆయన ప్రేమను ఆస్వాదించడమే కదా ప్రధానం! సాయి సచ్చరిత్రలోని ప్రతి పదం ఎంత సత్యమో కదా! బాబా తమ స్వహస్తాలతో ఇచ్చిన ఊదీయే కాదు, ఆయనను తలచుకుని ఆయన ముందు వెలిగించిన అగరుబత్తీ బూడిద, నేలపై మట్టి సైతం అంతే ప్రభావం చూపడం ఎంత అద్భుతమో కదా! ఈరోజు మొదటిసారిగా నేను చవిచూసిన బాబా ఊదీ మహిమకు సంబంధించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఈ బ్లాగు ద్వారా నేను పంచుకుంటున్న రెండవ అనుభవం ఇది.

మా కుటుంబంలో మా అత్తగారు తప్ప నా భర్త, పిల్లలు, మిగతా అందరూ దేవుడిని నమ్మరు. మా కుటుంబంలో నేను ఒక్కదాన్నే సాయిని నమ్ముతాను. ఇక నా అనుభవానికొస్తే, 2019, ఫిబ్రవరి 19, ఆదివారంనాడు మా పాప పొత్తికడుపు నొప్పితో బాధపడింది. ఆ నొప్పికి తోడు తనకి జ్వరం కూడా వచ్చింది. నేను, మావారు ఇద్దరమూ వైద్యులమే. నేనే తనకి చికిత్స చేసేదాన్ని. మధ్యాహ్నం తనకి పారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తే తను పడుకుంది. ఆ సమయంలో మొదటిసారిగా నేను ఊదీని పరీక్షిద్దామని తన నుదుటిన ఊదీ పెట్టి, తన ఆరోగ్యం గురించి బాబాని ప్రార్థించాను. రోజూ నేను నా స్నానం తరువాత నుదుటిన ఊదీ పెట్టుకుంటానుగాని, ఇలా ఎప్పుడూ మెడికల్ సమస్యలకి ఉపయోగించలేదు. బాబా కృపతో తన పరిస్థితిలో మెరుగుదల కనిపించింది.

ఐతే మూడురోజుల తర్వాత కూడా మందులకి తన పొత్తికడుపు నొప్పి తగ్గలేదు. అందువలన మేము స్కానింగ్ చేయిస్తే, తన పొత్తికడుపులో ఏదో ద్రవం ఉన్నట్టు తెలిసింది. మేము ఇంకా మంచి స్కానింగ్ సెంటర్ కి తీసుకుని వెళ్లి సి.టి. అబ్డోమెన్ పరీక్ష చేయించాలని అనుకున్నాం. అయితే ఆరోజు తను నొప్పివలన ఆహారం కూడా తీసుకోలేకపోయింది. దానితో మేము ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించాం. ఆ రాత్రి  తను నిద్రలో ఉండగా నేను తన ఆరోగ్యం కోసం సాయిని ప్రార్థించి, తన నుదుటిన ఊదీ పెట్టాను. ఒక వాటర్ బాటిల్ నీటిలో ఊదీ కలిపి తన దగ్గర పెట్టాను. మరుసటిరోజు ఉదయం తను లేచిన తరువాత ఆ నీటిలో కొంత త్రాగింది. దానితో తనకి కొంత ఉపశమనం కలిగింది. తర్వాత  తను ఆహారం కూడా తీసుకుంది. బాబా ఆశీస్సులతో మూడురోజుల్లో తను సాధారణస్థితికి చేరుకుంది. ఈ అనుభవం ద్వారా సాయి నాకు ఊదీ శక్తిని తెలియజేశారు. "థాంక్యూ సో మచ్ బాబా!" నేను ఇంకో విషయం కూడా చెప్పాలి, నేను ఉపయోగించినది శిరిడీ ఊదీ కాదు. స్థానిక బాబా మందిరంలోనిది. ఏ మందిరంలోని ఊదీ ఐనా అంతే ప్రభావశాలి అని నాకు ఋజువు చేసింది ఈ అనుభవం.

ఎప్పటికప్పుడు బాబా తమ ఉనికిని తెలియజేస్తూ మా విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నేను నా చిన్నతనంనుండి బాబా భక్తురాలిని.  నాకు ఆయన పట్ల అపారమైన నమ్మకం. "బాబా! మీ దివ్య పాదాలకు నా ప్రణామములు". ఆయన నాపై, మా కుటుంబంపై కురిపిస్తున్న ఆశీస్సులకు మేమెంతో అదృష్టవంతులుగా భావిస్తున్నాం. బాబా గురించి తెలియజేస్తున్న బ్లాగును నిజంగా 'ఆధునిక సచ్చరిత్ర' అనవచ్చు. ఇక్కడ సాయిభక్తులు తమ అనుభవాలను పంచుకోవడం వలన అందరికీ బాబా గురించి తెలుసుకునే అవకాశం ఉంది. బ్లాగు ద్వారా మా భక్తి విశ్వాసాలు కూడా పెంపొందుతున్నాయి. జీవితంలో వచ్చే ఒడిదుడుకులకు సహనం సన్నగిల్లే  సమయంలో మళ్లీ సహనాన్ని నిలదొక్కుకోవడానికి బ్లాగు ఎంతగానో సహకరిస్తుంది.

బాబా "నా భక్తులను ఎప్పుడూ నిరుత్సాహపరచను" అని ప్రామిస్ చేశారు. ఆయనిచ్చిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మొదటి అనుభవం:

ప్రతి గురుపౌర్ణమికి మేము శిరిడీ, షేంగాఁవ్, గాణ్గాపూర్, అక్కల్‌కోటకు డొనేషన్స్ పోస్టల్ ద్వారా పంపిస్తూ ఉంటాం. తద్వారా మాకు ఊదీ, ప్రసాదములు వస్తాయి. 2017లో డొనేషన్ పంపేముందు శిరిడీ నుండి రెండు ఊదీ ప్యాకెట్లు ఆశించి నేను నాన్నతో, "నా పేరు మీద ఒకటి, రెండవది సిస్టర్ పేరుమీద గాని, ఇంకెవరి పేరుమీద గాని రెండు డొనేషన్స్ కట్టమని" చెప్పాను. కానీ నాన్న పట్టించుకోకుండా ఒక పేరు మీద మాత్రమే డొనేషన్ కట్టారు. అయితే గజానన్ మహరాజ్, స్వామిసమర్థ, దత్తాత్రేయ మహరాజ్ ల వద్దనుండి ఊదీ, ప్రసాదాలు వచ్చాయి గాని, బాబా వద్దనుండి రాలేదు. ఏరోజుకారోజు ఈరోజు వస్తుందేమో అనుకుంటూ ఎంతగానో ఎదురుచూస్తూ ఉండేవాళ్ళం. ఇలా రెండు నెలలు గడిచినా గాని ఊదీ, ప్రసాదాలు రాలేదు. రెండునెలల తర్వాత నా పుట్టినరోజు వచ్చింది. సరిగ్గా ఆ సమయానికి శిరిడీ నుండి ఊదీ ప్రసాదాలు అందాయి. పైగా ఆరోజు నేను ఏ రంగు దుస్తులు వేసుకున్నానో, అదే రంగు దుస్తుల్లో బాబా మధ్యాహ్న సమయంలో దర్శనమిచ్చారు. ఆ విధంగా బాబా ఆశీస్సులు లభించాయని ఎంతో సంతోషపడ్డాను. అలా ఉంటాయి మన బాబా ప్రణాళికలు.

రెండవ అనుభవం:

నాకు ద్వారకామాయిలో రాతిమీద కూర్చున్న బాబా ఫోటో అంటే చాలా ఇష్టం. 2016వ సంవత్సరంలో నా పుట్టినరోజుకు రెండువారాల ముందు, "బాబా! నా పుట్టినరోజు నాడు మీ ఉనికిని తెలియజేయండి. నాకిష్టమైన మీ ఫోటోని పుట్టినరోజు బహుమతిగా నాకు ఇవ్వండి" అని ప్రార్థించాను. నా పుట్టినరోజు శనివారం అనగా గురువారంనాడు మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా మందిరానికి వెళ్ళాం. సాధారణంగా మేము ఉదయాన్నే బాబా గుడికి వెళ్తాం. కానీ ఆరోజు కొన్ని కారణాలవలన సాయంత్రం వెళ్ళాం. బాబా దర్శనమైన తరువాత అక్కడ కొంతసమయం కూర్చున్నాము. కాసేపటికి ఒకతను నన్ను పిలిచి ఒక క్యాలెండర్ ఇచ్చారు. మేము మా చిన్నప్పటినుంచి అదే గుడికి వెళుతున్నా, ఆరోజు వరకు ఎవరూ ఒక ఫోటోగ్రాఫ్ కానీ, మరింకేదిగానీ ఇవ్వలేదు. ఆరోజే ఎందుకు ఇచ్చారన్నది నాకు అర్థం కాలేదు. కానీ ఆ ఫోటో తెరచి చూసి ఆశ్చర్యపోయాను. అది బాబా రాతిమీద కూర్చుని ఉన్న ఫోటో. ఇక నా ఆనందానికి అవధుల్లేవు. నా బర్త్‌డే గిఫ్ట్ గా బాబా నేను అడిగిన రూపంలో వచ్చారు. ఇంకేం కావాలి ఆయన ఆశీస్సులు లభించాయి అనడానికి?

మూడవ అనుభవం:

ఒకరోజు పారాయణ పూర్తిచేసి బాబాకి నైవేద్యంగా రెండు కోవాబిళ్ళలు పెట్టి, బాబాకి హారతి ఇచ్చాను. ప్రసాదం తరువాత తీసుకుందాం అనుకుని ఆ విషయం పూర్తిగా మరచిపోయాను. కొంతసమయం తర్వాత నేను, మా సిస్టర్ టీవీ చూస్తుండగా ఎక్కడినుంచి వచ్చిందో గాని ఒక నల్లపిల్లి వచ్చింది. మేమిద్దరం కాస్త కంగారుపడినా, అదే వెళ్లిపోతుందని సైలెంట్ గా టీవీ చూస్తూ కూర్చున్నాము. కొంతసేపటికి ఆ పిల్లి దానంతట అదే వెళ్ళిపోయింది. ఆ తరువాత కొంతసేపటికి నాకు ప్రసాదం గుర్తొచ్చి, వెళ్లి చూస్తే ఒక  కోవాబిళ్ళ మాత్రమే ఉంది. రెండవది ఏమైందని చుట్టూ చూసాను. కానీ ఎక్కడా కనబడలేదు. మా సిస్టర్ ని అడిగితే తను, "నాకు తెలియదు" అంది. అప్పుడు కాసేపటి క్రితం వచ్చిన పిల్లి సంగతి గుర్తొచ్చి, అదే ప్రసాదం తిని వెళ్ళిపోయి ఉంటుందని నాకర్థమైంది. బాబా ఆ పిల్లి రూపంలో వచ్చి ప్రసాదం స్వీకరించారని నాకెంతో ఆనందంగా అనిపించింది. సాధారణంగా అప్పుడప్పుడు పిల్లి మా ఇంట్లోకి వస్తుంది కాని, ఎప్పుడూ పూజగదిలోకి వెళ్ళలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఎప్పటికప్పుడు మీ ఉనికిని తెలియజేస్తూ మా విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. మీరు లేని జీవితాన్ని నేనసలు ఊహించలేను. ఎప్పుడూ మాకు తోడుగా ఉండండి".  మనం శ్రద్ధ, సబూరితో ఆయనను ప్రార్థిస్తే,  చాలినంత ఆశీస్సులు మనకు లభిస్తాయి.

బాబా కృపతో దొరికిన పాస్‌పోర్ట్




నేను సాయి భక్తురాలిని. నేను, నా భర్త ఇండియాకు చెందినవాళ్ళమయినా, ప్రస్తుతం యు.ఎస్.ఏ, పోర్ట్‌లాండ్ లోని ఒరెగాన్ లో ఉంటున్నాము.  నేను ఇప్పుడు చెప్పబోయే అనుభవం 2018 జూలై నెలలో మేము శాన్‌ఫ్రాన్సిస్కో పర్యటన నిమిత్తం వెళ్ళినప్పుడు జరిగింది.

జూలై నెల, ఒక వారాంతంలో పర్యటన నిమిత్తం మేము పోర్ట్‌లాండ్ నుండి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్ళాం. ఆ పర్యటనలో చివరిరోజు ఉదయం 10 గంటలకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విన్ పీక్స్ చూడటానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేముందు అటునుంచి అటే ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళిపోయే ఉద్దేశ్యంతో మేముండే చోటు ఖాళీ చేసి బ్యాగులతో సహా ఆ చోటు చేరుకున్నాము. బ్యాగులు నేలపై పెట్టి, అక్కడి అందాలు చూస్తూ ఆనందంలో మునిగిపోయాము. ఆ బ్యాగుల్లోనే నా పర్సు, మెడికల్ ఇన్సూరెన్స్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, కొంత క్యాష్, బాబా ఊదీ, పాస్‌పోర్ట్స్.. ఇలా చాలా ముఖ్యమైనవన్నీ ఉన్నాయి. బ్యాగుల మీద ఓ కన్నేసి గమనిస్తూనే ఫొటోలు తీసుకుంటున్నాము. కాసేపు తరువాత హఠాత్తుగా చూసేసరికి బ్యాగులు అక్కడ లేవు. నేను గట్టిగా అరచి, అక్కడున్న ఇతర పర్యాటకులను మా బ్యాగులు ఎవరైనా చూశారా అని అడిగాము. ఒకామె, "ఒక వ్యక్తి బ్యాగులు తీసుకుని కారులో వెళ్ళిపోతున్నట్టు చూశాను" అని చెప్పి, "ఈ చోట కెమెరాలు ఉన్నాయి. మీరు వెంటనే పోలీసులకి తెలియజేయండి" అని చెప్పింది. మావారు కార్డ్స్ బ్లాక్ చేసే పనిలో బిజీ కాగా, నేను బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను."బాబా! డబ్బులు పోతే పోయాయి కానీ, నా పాస్‌పోర్ట్ తో ఆ దొంగ ఏం చేసుకుంటాడు? అతనికి దానితో పనేమీ లేదు. మాకు మాత్రం ఆ పాస్‌పోర్టులు చాలా అవసరం. ఎందుకంటే సాయంత్రం మాకు ఇంటికి వెళ్ళడానికి ఫ్లైట్ ఉంది. పాస్‌పోర్ట్ తప్ప ఇంకే ఐడెంటిటీ మా దగ్గర లేవు. ఇక్కడ లోకల్ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేసి, ఐడెంటిటీ డాక్యుమెంట్ ఇస్తామన్నారు. కానీ దానికి సమయం పడుతుంది. మీ కృపవలన పాస్‌పోర్ట్స్ దొరికినట్లైతే 9 గురువారాలు సాయి వ్రతం చేస్తాను" అని మొక్కుకున్నాను. నాకు ఎంత బాధగా ఉంది అంటే మాటల్లో చెప్పలేను. ముఖ్యంగా బాబా ఊదీ ప్యాకెట్ కూడా అందులోనే ఉండిపోయింది. దాన్ని నేను చివరిసారి శిరిడీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. దాన్ని నేను బాబా ఆశీర్వాదచిహ్నంగా భావిస్తాను. నాకు దిగులుగా ఉన్నప్పుడు ఊదీ నీళ్ళలో కలుపుకుని త్రాగి ఉపశమనం పొందుతాను. మేము పోలీసులకి కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉన్నాం కానీ, వాళ్లు "సమయం పడుతుంది. ఎంత సమయం అన్నది చెప్పలేము" అని చెప్తున్నారు. ఇంక లాభంలేదని, ఫిర్యాదు చేయడానికి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం. మేము పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు ఇచ్చే లోపల మాకు ఫోన్ వచ్చింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఎవరైతే మాకు ఆతిథ్యం ఇచ్చారో ఆ ఇంటినుండి వచ్చిన ఫోన్ అది. నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే, తను "ఎవరో ఒక యువతి ఇంటికి వచ్చి మీ రెండు బ్యాగులు ఇచ్చి వెళ్ళింది" అని చెప్పారు. అసలు సంగతి ఏమిటంటే, ఆ దొంగ మా బ్యాగులు ఒకచోట విసిరేస్తే, ఆ యువతి బ్యాగులో ఉన్న పేపర్స్ ఆధారంగా ఆ అడ్రసుకి వచ్చి బ్యాగులు ఇచ్చి వెళ్ళింది. నేను ఆ విషయం పోలీసులకు చెప్తే, 'ఇది మిరాకిల్' అన్నారు. అవును, నాకు తెలుసు, అది సాయిబాబా మిరాకిల్. శాన్‌ఫ్రాన్సిస్కో చాలా పెద్ద నగరం. ఈ సంఘటనలు జరిగిన స్థలాల మధ్య చాలా దూరం ఉంటుంది. బాబా కృపవలన రెండు గంటలలోపే మేము పోగొట్టుకున్న బ్యాగులు దొరికాయి. నిజంగా ఇది అద్భుతం! మేము వెంటనే అక్కడకు చేరుకుని బ్యాగులో చూస్తే క్యాష్ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి.  కానీ బాబా కృప వలన ఊదీ, పాస్‌పోర్ట్స్ దొరికాయి, అది చాలు. ఇక మేము సంతోషంగా శాన్‌ఫ్రాన్సిస్కో నుండి సాయంత్రం ఫ్లైట్ కి వచ్చేసాం. ఇంటికి చేరుకున్నాక మా ఫోటోలు చూస్తూనే ఆ దొంగ ఆనవాళ్ళతో ఉన్న వ్యక్తి మా వెనుకే ఉన్నాడు. మేము ఆన్లైన్ లో ఆ దొంగ గురించి ఫిర్యాదు చేసాం. కానీ  నిజంగా బాబా మమ్మల్ని ఆ దారుణమైన పరిస్థితి నుండి కాపాడారు. లేకుంటే యు.ఎస్.ఏ లో పాస్‌పోర్ట్ దొరకడం, వీసా స్టాంపింగ్ చేయించుకోవడం పెద్ద తలనొప్పితో కూడుకున్న పని. నేను మ్రొక్కుకున్నట్లుగానే వ్రతం మొదలుపెట్టాను.

లవ్ యు సాయిబాబా! లవ్ యు సాయి అమ్మా!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

హైదరాబాద్ నుండి అర్చనగారు తమ అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

నా ఉద్యోగ విషయంలో అడుగడుగునా బాబా సహాయం అందిస్తున్నారు. ఇంతకుముందు అలాంటి కొన్ని అనుభవాలు ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో కంపెనీలో రేటింగ్స్ ఇస్తారు. ఆ రేటింగుని బట్టి శాలరీ పెంచి, బోనస్ ఇస్తారు. నాలుగు సంవత్సరాలనుండి నేను ఇంటినుండి పనిచేస్తుండటం వలన రేటింగ్ తక్కువ ఇస్తూ, శాలరీ పెంచట్లేదు, బోనస్ కూడా ఇవ్వట్లేదు. నాకు చాలా బాధగా ఉండేది. ఇతరులు అడిగినప్పుడు వాళ్ళకి చెప్పలేక చాలా ఇబ్బందిపడేదాన్ని. 2018లో మరీ దారుణమైన రేటింగ్ ఇచ్చారు. నేను వాళ్లతో ఎందుకు ఇంత తక్కువ ఇచ్చారని గట్టిగా వాదించేదాన్ని కూడా కాదు. కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చెప్పి నన్ను పంపేసేవారు. అయితే 2018లో నేను వర్క్ బాగా చేసినందువల్ల 2019లో బాగానే ఇస్తారని ఊహించాను. కానీ హఠాత్తుగా డిసెంబర్ నెలలో నన్ను ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేసి కొత్త ప్రాజెక్ట్‌లో వేశారు. దానితో కొత్త మేనేజర్, "నేను రేటింగ్ ఇవ్వలేను, మీ పాత మేనేజరే ఇవ్వాలి" అని చెప్పారు. ప్రాజెక్ట్‌లో ఉన్నప్పుడే సరిగా ఇవ్వలేదు, ఇక బయటకి వచ్చాక అసలివ్వరని నాకు బాధతో పూర్తిగా నిరాశ కలిగింది. దానికి తోడు ఇంట్లో గొడవలు. మనసు ప్రశాంతంగా ఉండేది కాదు. అలా ఉండగా 2019 ఫిబ్రవరి 15న రేటింగ్స్ ఇచ్చారు. నాతోపాటు, ముందు ప్రాజెక్ట్ నుండి బయటకి వచ్చిన కొంతమందికి దారుణమైన రేటింగ్ ఇచ్చారు. దానితో నాకు ఇంకా టెన్షన్‌గా అనిపించింది. తరువాత నన్ను పిలిచారు. నేను బాబా విగ్రహంతో పాటు కాల్ లో జాయిన్ అయ్యాను. "నువ్వు 2018లో బాగా చేసావు. అందరితో పోలిస్తే నీ శాలరీ చాలా తక్కువ. కానీ ఇపుడు నీ శాలరీ పెంచలేము" అని చెప్పారు. నాకు ఏమీ అర్థం కావటంలేదు. చివరికి ఆయన మీడియం రేటింగ్ ఇచ్చి, కొంచెం శాలరీ పెంచి, బోనస్ కూడా ఇచ్చారు. ఆశ్చర్యం! కాల్ అయ్యాక నా సీటు దగ్గరకి వస్తుంటే, మూడుచోట్ల మూడు బాబా ఫొటోలు కనిపించాయి. నేను తరుచూ వెళ్లే దారే అది. కానీ నేనెప్పుడూ అంతకుముందు ఆ మూడు బాబా ఫోటోలను చూడలేదు. దానితో నాకు, 'ఈ రేటింగ్, బోనస్ ఆయన దయవల్లే' అని అర్థమైంది. ఒకవేళ దారుణమైన రేటింగ్ ఇస్తే, కొత్త మేనేజర్ దగ్గర నాకసలు విలువ ఉండేది కాదు. అమ్మలా బాబా నా మనస్సునెరిగి నన్ను క్లిష్ట పరిస్థితి నుంచి కాపాడారు.

రెండవ అనుభవం:

నాకు బాధ వచ్చినా, ఆనందం వచ్చినా పంచుకోవటానికి బాబా ఉన్నారని నా నమ్మకం. కొన్ని విషయాలు మన సన్నిహితులకి కూడా చెప్పుకోలేము. కానీ సర్వం తెలిసిన బాబాకి మన మనసు కూడా తెలుసు. ఇంట్లో గొడవల కారణంగా మనశ్శాంతి ఉండేదికాదు. నన్ను అత్తగారు వాళ్ళు చులకన చేయటం వలన బయటవాళ్ళు కూడా లెక్కలేనట్లు మాట్లాడేవారు. అది నాకు చాలా కష్టంగా అనిపించి బాధపడేదాన్ని. కొన్నిసార్లు పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఈమధ్య వారి మాటలు మరీ శృతి మించిపోవడంతో చాలా బాధపడ్డాను. కనీసం అమ్మా వాళ్ళకి కూడా చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి సమయంలో ఒకరోజు పూజ చేస్తూ, "బాబా! నేను మీ కూతురినే అయితే నేనిలా బాధపడుతూ ఉంటే మీరు చూస్తూ ఉండేవారా? చూడండి నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో? మీ కూతురు బాధపడుతుంటే పట్టించుకోరా?" అని నా బాధలు చెప్పుకున్నాను. కొంతసేపటికి ఆఫీసుకి వెళ్తూ, దారిలో గుడిలో బాబా దర్శనం చేసుకుని వెళ్తుంటే, చాలా ట్రాఫిక్ జామ్ ఉంటే వేరే మార్గంగుండా వెళ్తున్నాను. హఠాత్తుగా ఒక కారు వెనుకభాగం చూసి ఆశ్చర్యపోయాను. ఆ కారు వెనుక భాగంపై ఒక బాబా బొమ్మ, దాని కింద 'తల్లి దీవెన' అని వ్రాసి ఉంది. అలా చూడగానే ఆనందంతో కన్నీళ్లు వచ్చేసాయి. అప్పటికి కొంతసేపటి క్రితమే పూజలో, "నేను నీ కూతుర్నే అయితే ఇలానే చూస్తావా?" అని బాబాని అడిగాను. అంతలోనే ఆయన, "నేను నీ తల్లి స్థానంలోనే ఉన్నాను" అని చెప్పారు. "లవ్ యు సాయిబాబా! లవ్ యు సాయి అమ్మా!"

మూడవ అనుభవం:

అమ్మలా బాబా చూపే ప్రేమ గురించి చెపుతూ ఉంటే చిన్ననాటి ఓ సంఘటన గుర్తుకు వచ్చింది. అదేమిటంటే, నా చిన్నపుడు, బాబా గురించి అంతగా తెలియని సమయంలో ఒకసారి బాబాకోసం ఉపవాసం ఉన్నాను. ఆరోజు 9 గంటల సమయంలో బజ్జీలు తినాలనిపించింది. కానీ ఆ సమయంలో నాన్నని బయటకి పంపడం ఇష్టంలేక ఊరుకున్నాను. 10 గంటల సమయంలో నలతగా ఉందని అమ్మ పడుకున్నారు. నాకేమో బాగా ఆకలిగా ఉన్నా తనని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నాను. హఠాత్తుగా అమ్మ లేచి బయటకు వచ్చి, "అమ్మాయికి ఆకలి వేస్తుంటుంది, వెళ్లి బజ్జీలు తీసుకుని రండి" అని మా నాన్నతో చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను. వెంటనే నాన్న వెళ్లి నాకోసం బజ్జీలు తెచ్చారు. కానీ ఆ వయస్సులో నాకు తెలియలేదు, నా సాయితల్లి అమ్మతో అలా చెప్పించి నా ఆకలి తీర్చిందని. "లవ్ యు సాయిబాబా! లవ్ యు సాయి అమ్మా!"

భక్తురాలి వివాహ వేడుకలో కనిపించిన సాయిబాబా.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఈ సంఘటన, దీనికి సంబంధించిన ఫోటో సాయిబాబాకు తమ భక్తులపై ఉండే ప్రేమాభిమానాలకు స్పష్టమైన నిదర్శనం.

ఒక బాబా భక్తురాలికి వివాహం నిశ్చయమయ్యింది. వివాహానికి కొద్దిరోజుల ముందు ఆమె తన తల్లిదండ్రులతో శిరిడీ వెళ్ళింది. సమాధి ముందు నిలుచుని, బాబాను చూస్తూ ఆమె తీవ్రమైన భావోద్వేగాలకు లోనై కన్నీళ్ళతో తన వివాహానికి హాజరు కావలసిందిగా బాబాను ప్రార్థించింది. ఆ తర్వాత నిశ్చయించిన ముహూర్తానికి వివాహం జరిగింది. పెళ్ళి వేడుకలు ముగిసిన తరువాత, ఆ రాత్రి తను పడుకోబోయేముందు శిరిడీలో బాబాకి చేసిన ప్రార్థనను గుర్తుచేసుకుని, వివాహ సమయంలో బాబా ఉనికి తనకి తెలియలేదని ఏడుస్తూ పడుకుంది. తరువాత కలలో బాబా కన్పించి, "విచారించకు, నీ వివాహసమయంలో నేను అక్కడే ఉన్నాను. నీ పెళ్ళి ఆల్బమ్ తెరిచి, మీరు ఊరేగింపుగా వెళ్తున్న ఫోటోను చూడు, ఆ ఫొటోలో నేను కనిపిస్తాను" అని చెప్పారు. ఆమె నిద్ర లేస్తూనే ఆత్రంగా ఆల్బం తెరిచి చూస్తే, బాబా సూచించిన ఫోటోలో ఆయన దర్శనమిచ్చారు. ఆనందాశ్చర్యాలతో తన కళ్ళలో నీళ్ళు తిరగగా మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంది. బాబా లీలలు అమోఘం.


శ్రీతుకారాం మహరాజ్ అజ్‌గాఁవ్‌కర్

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

హరిభక్త పరాయణుడు, శ్రీతుకారాం మహరాజ్ అజ్‌గాఁవ్‌కర్ 1910వ సంవత్సరంలో జన్మించాడు. అతను ఋగ్వేద బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతని తండ్రి శ్రీకేశవ్ గురు అజ్‌గాఁవ్‌కర్ గొప్ప వైదిక పండితుడు. స్వామి వాసుదేవానంద సరస్వతి(ఈయన సాయిబాబా సమకాలీకులు, వీరి మరో నామధేయం టెంబె స్వామి) గారి శిష్యుడు.

శ్రీతుకారాం మహరాజ్ అజ్‌గాఁవ్‌కర్ దాసగణు మహరాజ్ యొక్క ప్రధాన శిష్యుడు. అతను, అతని భార్య శ్రీమతి రమబాయి అజ్‌గాఁవ్‌కర్ ఇరువురూ దాసగణు మహరాజ్ తో కలిసి అనేక సంవత్సరాలు నివసించారు. వీరు క్రమంతప్పకుండా శిరిడీలోని రామనవమి ఉత్సవాలకు హాజరయ్యేవారు.

శ్రీసాయిబాబా ఆదేశానుసారం దాసగణు మహరాజ్ మహారాష్ట్ర అంతటా తిరుగుతూ కీర్తనలు చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా మహాత్ముల చరిత్రలకి సంబంధించిన వివరాలు సేకరిస్తూ ఉండేవారు. ఇలా సంచరిస్తున్న తరుణంలోనే దాసగణు ఒకానొకప్పుడు మరాట్వాడా ప్రాంతంలోని హింగోలి తాలూకాలో 'అజ్‌గాఁవ్' అనే చోటుకి వెళ్లారు. అక్కడ కేశవ్ గురు అను కేశవరాజ్ దైవవిగ్రహ భక్తుడిని కలుసుకున్నారు. అతని పూర్వీకులు కులగురువులుగా ఉండేవారు. అంటే, నామదేవ్ మహరాజ్ తెగకు చెందిన అన్ని మతపరమైన ఆచారాల కొరకు కులగురువుగా ఉండి అందరినీ మార్గనిర్దేశం చేసేవారు. కేశవరాజ్ విగ్రహం నామదేవుని కాలంలో నదిలో వారికి దొరికింది. కేశవ్ గురు ఆ విగ్రహానికి స్వయంగా పాలు పట్టేవారు. శ్రీకేశవ్ గురు మూడవ కుమారుడైన శ్రీతుకారాంని 8 సంవత్సరాల వయస్సులో శ్రీదాసగణు మహరాజ్ తన శిష్యుడిగా స్వీకరించారు. బాబా మహాసమాధికి కొద్దిగా ముందు, అంటే 1918వ సంవత్సరంలో రామనవమి పండుగ సందర్భంగా శ్రీసాయిబాబా సమక్షంలో దాసగణు మహరాజ్‌తో పాటు తుకారాం బువా కీర్తనలు చేసారు. ఆ కీర్తనలకు సాయిబాబా ఎంతో సంతోషించి తుకారాం తలపై తమ చేయి ఉంచి ఆశీర్వదించారు. బాబా సమాధి అనంతరం దాసగణు ఆ యువకుడికి కీర్తనలలో మంచి శిక్షణ ఇచ్చారు. అతనిని సుమారు 15-20 సంవత్సరాలు ఇండోర్, వారణాసి, బరోడా మరియు పూనా వంటి వివిధ ప్రదేశాలలో వివిధ గురువుల వద్ద విస్తృతంగా శిక్షణ ఇప్పించారు. ఆ విధంగా తుకారాం బువాను గొప్ప కీర్తనకారుడిగా తీర్చిదిద్దారు దాసగణు. తరువాత ఆ బాలుడు 'హరిభక్త పరాయణ తుకారాం బువా అజ్‌గాఁవ్‌కర్'గా ప్రాచుర్యం పొందారు. తరువాత రామనవమి పండుగ సందర్భంగా శిరిడీలో దాసగణు మహరాజ్ మరియు అతని ప్రముఖ శిష్యుడైన శ్రీదామోదర్ వామన్ అతవలే('దాము అన్నా' అని పిలుస్తారు)తో కలిసి కీర్తనలను చేయడం ప్రారంభించారు. శ్రీదామోదర్ వామన్ అతవలే చాలా చిన్న వయస్సులోనే 1924లో మరణించారు. అప్పటినుండి శ్రీతుకారాం బువా దాసగణు మహరాజ్‌తో పాటు కీర్తనలు ప్రదర్శించేవారు. 15 ఏళ్ల వయస్సులోనే స్వతంత్రంగా శిరిడీలో కీర్తనలు ప్రదర్శించారు(ref: శ్రీ సాయిలీల మ్యాగజైన్, 1925).

శ్రీదాసగణు మహరాజ్ తన 70 సంవత్సరాల వయస్సు వరకు కీర్తనలు చేశారు. 1935 లేదా 1940 తరువాత శ్రీతుకారాం బువా దాసగణు మహరాజ్ గారి కీర్తన సాంప్రదాయాన్ని కొనసాగించారు. 1988 వరకు ఈ కీర్తన సంప్రదాయం కొనసాగింది. 65 సంవత్సరాలకు పైగా దాసగణు మహరాజు యొక్క సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారతదేశం అంతటా మరాఠీ మరియు హిందీ భాషల్లో పదివేల కన్నా ఎక్కువ కీర్తనలు చేశారు. అతడు రామదాసి సంప్రదాయాన్ని అనుసరిస్తూ తద్వారా వచ్చే ఆదాయంతోనే జీవనం సాగించారు. అదే అతని జీవనోపాధిగా ఉండేది. అతని జీవితంలో చివరి 20-25 సంవత్సరాలలో అతను కేవలం ధోతి, తువ్వాలు మాత్రమే ధరించేవారు. అతను పండిట్ శ్రీరాజేశ్వరశాస్త్రి ద్రావిడ్ యొక్క సంరక్షణలో సంస్కృత లేఖనాలు, వేదాలు మొదలైన వాటిని నేర్చుకున్నారు. పూనాలోని గంధర్వ మహావిద్యాలయ ప్రిన్సిపాల్ అయిన పండిట్ వినాయకరావు పట్వర్ధన్ మార్గదర్శకంలో వద్ద సంగీతం కూడా నేర్చుకున్నారు. అతను 81 ఏళ్ళ వయసులో 1991వ సంవత్సరంలో ప్రశాంతంగా మరణించారు.

తుకారాం కుమారులు శ్రీ మాధవరావు తుకారాం(కీర్తనాకారుడు) మరియు శ్రీ ప్రభాకర్ తుకారాం లు తండ్రి బాధ్యతలను స్వీకరించి భారతదేశం అంతటా మరియు విదేశాలలోను కీర్తనలను చేస్తున్నారు.

(మూలం: శ్రీ మాధవరావు తుకారాం అజ్‌గాఁవ్‌కర్, S/o. స్వర్గీయ శ్రీ తుకారాం మహరాజ్ అజ్‌గాఁవ్‌కర్,  http://www.saiamrithadhara.com/mahabhakthas/tukaram_maharaj_ajegaonkar.html

బాబా అనుగ్రహం.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

యు.కే. నుండి సాయిభక్తుడు సుబ్బు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయినాథాయ నమః

నా పేరు సుబ్బు. నేను లండన్‌లో నివాసం ఉంటున్నాను. నేను బాబాకు చిన్న భక్తుడిని. బాబా నా జీవితంలో అనేక అద్భుతాలు చేసారు. వాస్తవానికి బాబా నా బాధ్యత తీసుకుని నన్ను, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సాయి తన భక్తులందరినీ ఆదరించినట్లే, నాకు మంచి యూనివర్సిటీలో సీటు, మొదటి ఉద్యోగం, కేవలం 2 నెలల్లో యు.కే. వీసా ఇచ్చారు. మొదటి ఉద్యోగంలో కొన్ని సంవత్సరాలు పనిచేసిన తరువాత ఎలాంటి వేతనాలు, ప్రశంసలు లేకుండా కష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు రెండవ ఉద్యోగం ఇచ్చారు. మంచి భార్యను, ఒక అందమైన కూతురిని కూడా ఇచ్చారు. భవిష్యత్తులో కూడా నాకు అవసరమైనవన్నీ ఖచ్చితంగా ఇస్తారు. నేనిప్పుడు ఈ భక్తుడికోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన బాబా లీలను మీతో పంచుకుంటాను.

చాలా సంవత్సరాల నుండి స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలన్నది నా కోరిక. నాకు పెట్టుబడులు పెట్టడంలో ఉన్న ఆసక్తి వలన నేను హెడ్జ్ ఫండ్(వివిధ సంస్థలకు, వ్యాపారవేత్తలకు ల్యాండ్ వంటి వాటికి పెట్టుబడులు పెట్టడం) మొదలుపెట్టడానికి సహాయం చేయమని బాబాను ప్రార్థించాను. అయితే హెడ్జ్ ఫండ్ ప్రారంభించటానికి కనీసం 5 మిలియన్ యూరోలు అవసరం. ఈ డబ్బును నేనెక్కడినుండీ సంపాదించలేకపోయాను. 3 సంవత్సరాల కాలం చాలా బాధాకరంగా సాగిపోయింది. ఎంత బాధాకరమైనప్పటికీ నేను సచ్చరిత్ర పారాయణ చేస్తూ, బాబాను ప్రార్థిస్తూ ఉండేవాడిని. చివరికి 3 సంవత్సరాల తరువాత బాబా నా కలలో దర్శనమిచ్చి 7 నెంబర్లు సూచించారు. వాటి ఆధారంగా నేను యు.కే.లో లాటరీ గెలుచుకోగలిగాను. ఆ డబ్బుతో నేను 'సాయిన్ క్యాపిటల్' పేరుతో హెడ్జ్ ఫండ్ సంస్థను ప్రారంభించి బాబాకి అంకితం చేశాను. లాటరీ గెలవడం మాటలు కాదు. లక్షలాదిమందిలో ఒకరికి వస్తుందని అందరికీ తెలుసు. అందుకే ఖచ్చితంగా ఆ మొత్తాన్ని బాబా ఇచ్చారని నా నమ్మకం. ఈ ప్రపంచమంతా బాబాకు చెందినది. కాబట్టి  ఈ డబ్బు కూడా బాబాకే చెందినది. ఆయనిచ్చిన డబ్బును ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించాలని నేను ఆశిస్తున్నాను. ఇంకో విషయం, ఇప్పుడు బాబా నాకు స్వంత వ్యాపారాన్ని ఇచ్చారు కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే బాబాకు మరింత ఎక్కువ సమయాన్ని వెచ్చించి, ఆయనకు దగ్గర కాగలను.

బాబా మననుండి ప్రేమ, విశ్వాసం, కృతజ్ఞతాభావాలను తప్ప వేరేమీ ఆశించరు. మన ఇల్లు చేర్చుతాడని పైలట్ యందు విశ్వాసముంచుతామా? లేక ఒడిదుడుకులు వచ్చిన ప్రతిసారీ పైలట్ తలుపు తట్టి ఫిర్యాదు చేస్తామా? బాబా మన జీవితపు పైలట్. ఆయన ఉద్యోగాన్ని ఆయన్ని చేయనిద్దాం. ఆయన మనల్ని ఏ స్థితిలో ఉంచినా దాన్ని స్వీకరిద్దాము. బాబాకు మన గతజన్మలు, మన భవిష్యత్తుజన్మలు తెలుసు. అందుకు అనుగుణంగా మనకేది ఉత్తమ మార్గమో కూడా ఆయనకు తెలుసు. ఆయన ఉద్యోగం - మన అంతిమ గమ్యస్థానమైన ఆయన దివ్యపాదాల వద్దకు చేర్చడం. ఈ ప్రక్రియలో మనం చేయాల్సింది - మంచి ఆలోచనలు కలిగి ఉండటం, మంచిపనులు చేయటం; దురాశ, స్వార్థం, కోపం మొదలైనవాటిని తొలగించుకోవటం; అందుకోసం సచ్చరిత్ర చదువుతూ ఉండటం. కొన్నిసార్లు బాబా మనల్ని విడిచిపెట్టినట్లు, మన సమస్యలను వినిపించుకోనట్లు కనిపించినప్పటికీ అది నిజం కాదు. ఈ జన్మలో మనం అనుభవిస్తున్న ఆటుపోట్లన్నీ గతంలో మన చర్యల ఫలితాలు. బాబా తమ పాదాల చెంతకు చేర్చుకునే ప్రయత్నంలో మనం స్వచ్ఛం, పవిత్రం కావాల్సి ఉంటుంది. మనం కష్టకాలంలో ఉన్నప్పుడు స్థిరచిత్తంతో బాబా మీద దృష్టి నిలిపి, ఆయనకు చేరువ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలని గుర్తుంచుకోండి. కాబట్టి దయచేసి శ్రద్ధ, సహనాలతో ఉండండి. ఆయనకు దగ్గర అయ్యేందుకు ఆ పరిస్థితులను ఆయన ప్రసాదంగా పరిగణించండి. బాబా మన తండ్రి, ఈ సృష్టికి కర్త. ఆయన తన బిడ్డలకు ఉత్తమమైనదే చేస్తారనడంలో సందేహం లేదు. "బాబా! ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించి, వాళ్ళు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించండి".

బాబా ఫోటో మొబైల్‌లోకి ఎలా వచ్చిందో!?

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయి అంకితభక్తులైన తండ్రీకొడుకులకు బాబా చేసిన సహాయం.

మా కుటుంబమంతా సాయిబాబాకు పరమభక్తులం. మాకు కలిగే కష్టాలన్నీ బాబా మీద మాకున్న భక్తి, శ్రద్ధల వలన వాటంతట అవే నివారణ అవుతూ ఉంటాయి. మేము వార్దా పట్టణ వాసులం. మా ఇంట్లో అమ్మ, నాన్న, మా చెల్లి, తమ్ముడు (కవలపిల్లలు) ఉంటాము. చిన్ననాటినుండి మేము మంచి మంచి బాబా అనుభూతులను పొంది ఉన్నాం. ఆయన లీలలు వర్ణనాతీతం. నేను పదవ తరగతి ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాను. తరువాత పాలిటెక్నిక్ కూడా ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడనయ్యాను. తరువాత డిగ్రీ చేద్దామని రెండో సంవత్సరం(Lateral entry) ద్వారా ఒక కాలేజీలో చేరాను. నాకు అడ్మిషన్ అయ్యేసరికి మ్యాథ్స్‌లో 4 చాప్టర్లు అయిపోయాయి. అందువలన నేను వెనకబడిపోయాను. అందరూ, 'నీవు ఫెయిల్ అవుతావ'ని అంటూ ఉండేవారు. నాకు మంచి ట్యూషన్ కూడా దొరకనందువలన సెమిస్టర్ ప్రిపరేషన్ సరిగా అవలేకపోయాను. దానితో నాకు చాలా భయంగా ఉండేది. మొత్తానికి అలాగే సెమిస్టర్ పరీక్షలు వ్రాసాను. అందరూ అన్నట్లుగానే మ్యాథ్స్‌లో ఫెయిల్ కూడా అయ్యాను. మళ్ళీ పరీక్ష వ్రాయడానికి దరఖాస్తు  చేసుకున్నాను. "బాబా! నిజంగా నీ ఆశీర్వాదం ఉంటే నన్ను పాసయ్యేట్లు చేయి స్వామీ!" అని మనసులో అనుకుంటూ బాబాను సదా స్మరిస్తూ ఉండేవాడిని. బాబా కృప అపారమైనది. ఆశ్చర్యంగా నేను 10కి 9 మార్కులతో పాసయ్యాను. ఆ సాయినాథుడు నాకు సంవత్సరం వృధా కాకుండా చేశారు.

మా నాన్నగారి అనుభవం: 2009వ సంవత్సరంలో మా నాన్నగారికి వీపు మీద నరాల సమస్య వచ్చి, ఆయనకు పాపం టాయిలెట్ వచ్చేది కాదు. డాక్టరు దగ్గరకి వెళ్తే NRI చేయమన్నారు, అది చేయించాము. డాక్టరు రిపోర్ట్ చూసి, "సమస్య ఉంది. ఒక చిన్న ఆపరేషన్ చేయాలి" అన్నారు. మా అమ్మ చాలా భయపడిపోయింది. ఆమె బాబాను ప్రార్థించి, నాన్న నుదుటిమీద ఊదీ పెట్టి, కొంచెం ఊదీ వీపుమీద రాసి, మరికొంత నీళ్ళలో కలిపి త్రాగించింది. తరువాత నాన్నని ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకుని వెళ్ళారు. ఇంతలో నాన్న ఫోన్ మ్రోగింది. చూస్తే చిత్రంగా నాన్న ఫోనులో బాబా ఫోటో కనపడింది. బాబాని చూసి మేము ఆశ్చర్యపోయాము. ఎందుకంటే నాన్న బాబా ఫోటో మొబైల్‌లో పెట్టుకోలేదు. అసలు ఆ ఫోటో ఎలా వచ్చిందో ఇప్పటికీ మాకు అంతుబట్టని విషయమే. అది మంచిశకునంగా భావించింది అమ్మ. ఆశ్చర్యం! కొద్దిక్షణాలలోనే నాన్నని ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు తీసుకుని వచ్చారు. 'ఏం జరిగింద'ని అడిగితే, "ఆపరేషన్ అవసరం లేదు, మందులతో తగ్గుతుంది" అన్నారు. తరువాత మందులతో నాన్నకు నయమైపోయింది. ఇది సాయినాథుని కృప కాకుంటే మరేమిటి? మాకు వచ్చే అన్ని చిన్న, పెద్ద కష్టాలను ఆయనే తీరుస్తాడు. మాకు జరిగిన అన్ని అనుభూతులు రాయాలంటే అదో పుస్తకం అవుతుంది.

ఋతుజా కృష్ణారావ్ దేవడే,
వార్దా,
మహారాష్ట్ర.

తెలుగు అనువాదం : శ్రీమతి మాధవి.

ఒక్క పిలుపు చాలు, తప్పకుండా బాబా సహాయం అందిస్తారు.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

బెంగళూరు నుండి వి.వెంకటేశన్ తమ అనుభవాన్నిలా చెప్తున్నారు:

నా పేరు వెంకటేశన్. నేను మాత్రమే కాదు, మా కుటుంబమంతా శిరిడీ సాయి భక్తులం.

ఇటీవల మా అబ్బాయికి ఒక చిన్న శస్త్రచికిత్స జరిగింది. సాధారణంగా చిన్న శస్త్రచికిత్సలు కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతాయి. రోగిని కొద్ది గంటలు పర్యవేక్షణలో ఉంచి సాయంత్రానికి ఇంటికి పంపించేస్తారు. అయితే, మా అబ్బాయి విషయంలో శస్త్రచికిత్స విజయవంతమైనప్పటికీ, తన ఊపిరితిత్తులలో ఏవో ద్రవపదార్థాలు చేరుకోవడం వలన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. కావల్సినంత ఆక్సిజన్ తీసుకోవడానికి తన ఊపిరితిత్తులు వ్యాకోచించడం మానేశాయి. వైద్యులు తనని ఐ.సి.యు.కి తరలించి చికిత్స చేస్తున్నారు. కానీ వాళ్ళ ముఖాలు భయం భయంగా, చాలా ఆందోళనగా కనిపిస్తున్నాయి. మాకు మాత్రం ఏమీ చెప్పట్లేదు. మాకేమీ అర్థంకాక చాలా ఆందోళన చెందాము. మా జీవితాలలోనే అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి అది. నేను మా అబ్బాయి గురించి ప్రార్థించమని కొందరు సాయిభక్తులను అభ్యర్థించాను. వాళ్ళలో ఒక సాయిభక్తురాలు నాకు ఫోన్ చేసి, "బాబా ఊదీ అబ్బాయి నుదుటి మీద, నాలుక మీద ఉంచండి" అని సూచించారు.

నేను, నా భార్య ఇటువంటి పరిణామాలను ఉహించనేలేదు. అందువలన మేము మాతో ఊదీ తీసుకుని వెళ్ళలేదు. అప్పటికే రాత్రి పదిగంటలైంది. పోనీ ఊదీ తీసుకుని రావడానికి ఇంటికి వెళదామంటే నా భార్య తీవ్రంగా టెన్షన్‌పడుతూ,తనని ఒంటరిగా వదిలి వెళ్ళొద్దని ప్రాధేయపడింది. నాకు ఏమీ అర్థంకాక నా మనసుకెందుకనిపించిందో గాని, నా పర్సు తీసి అందులో వెతికితే, ఆశ్చర్యంగా ఒక చిన్న ఊదీ ప్యాకెట్ కనిపించింది.

వెంటనే వైద్యుల అనుమతితో ఐ.సి.యు. లోపలికి వెళ్లి, మా అబ్బాయి నుదుటిపైన, నాలుకపైన కొంచెం ఊదీ పెట్టి, "బాబా! మా అబ్బాయిని కాపాడండి" అని ప్రార్థించాను. తరువాత రాత్రంతా నేను, నా భార్య బాబాను ప్రార్థిస్తూ హాస్పిటల్ కారిడార్‌లో కూర్చున్నాము. మరుసటి ఉదయం నేను మళ్ళీ లోపలికి వెళ్లి మా అబ్బాయికి బాబా ఊదీ పెట్టి వచ్చాను. మధ్యాహ్నానికి మా అబ్బాయి పరిస్థితి బాగా మెరుగుపడింది. 4 రోజులలో డిశ్చార్జ్ కూడా అయ్యాడు.

పరిస్థితి క్రిటికల్‌గా ఉండటంతో బాబానే నా జేబులో ఊదీ పెట్టి మా అబ్బాయిని కాపాడారని నా పూర్తి నమ్మకం. ఎందుకంటే, ఊదీ పర్సులో పెట్టుకునే అలవాటు నాకు లేదు. ఒకవేళ ఎప్పుడైనా పెట్టిన గుర్తు కూడా నాకు లేదు. బాబా మార్గాలు అనూహ్యమైనవి. ఆయన మనకి తోడుగా మన చుట్టూ ఉన్నారని నిరూపించింది ఈ అనుభవం. ఒక్క పిలుపు చాలు, తప్పకుండా ఆయన వస్తారు, మనకి సహాయం అందిస్తారు.

బాబా రాకకు హృదయపూర్వకమైన ఒక్క పిలుపు చాలు.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిబంధువు తేజు తరుణి పుప్పాల తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ నమస్కారం. ఇటీవల జరిగిన ఒక బాబా లీలను మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా కుటుంబమంతా 2018, డిసెంబర్ 25న ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం 'బుర్జ్ ఖలీఫా' సందర్శించడానికి వెళ్ళాము. ఆరోజు సెలవుదినం కావడంతో అక్కడ భారీగా జనసమూహం ఉంది. అందువలన 124వ అంతస్తుకి వెళ్ళడానికి ఎలివేటర్(లిఫ్ట్) కోసం చాలా సమయం క్యూలో ఉండాల్సి వచ్చింది. మొత్తానికి చాలా సమయం వేచి 124వ అంతస్తుకి వెళ్ళాము. తరువాత మళ్ళీ క్రిందికి రావడానికి కూడా పెద్ద క్యూ ఉంది. అప్పటికే మాకు బాగా అలసటగా ఉండి, ఊపిరాడనంత ఇబ్బందిగా ఉంది. పైగా పాదాలు తీవ్రంగా నొప్పిపుడుతున్నాయి. పిల్లలు నిద్రమత్తులో పడి ఏమాత్రం నడవడానికి ఇష్టపడటం లేదు. మావారు మా 5 సంవత్సరాల బిడ్డని తన భుజాల మీద పడుకోబెట్టుకున్నారు. నాకు నిజంగా నిస్సహాయంగా అనిపించి, "బాబా! మాకు సహాయం చేయండి" అని ప్రార్థించాను. "విశ్వాసంతో భక్తిపూర్వకమైన ఒక్క పిలుపు చాలు" అని బాబా ఎల్లప్పుడూ చెప్తారు. అలా భక్తులు చేసే ప్రార్థనలకు ఆయన వెంటనే స్పందిస్తారు. నేను ప్రార్థించిన ఒక నిమిషంలోపు ఒక పొడవాటి స్త్రీ మా వద్దకు వచ్చి, "మీరు ఎంతమంది?" అని అడిగి, "మీరు క్యూ నుండి బయటకు రండి" అని పిలిచారు. తరువాత మాకు, మాతోపాటు మరికొందరికి మార్గదర్శనం చేస్తూ సర్వీస్ లిఫ్ట్ వరకు తీసుకుని వెళ్ళారు. ఆ లిఫ్ట్ ద్వారా మేము కొన్నిక్షణాల్లో క్రిందకు చేరుకున్నాము. నా కళ్ళలో నీళ్ళు కదిలాయి. ఆ మహిళ అంత జనంలో నేరుగా మాకు సహాయం చేయడానికి ఎలా వచ్చింది? పిలిచిన వెంటనే బాబాయే ఆ పొడవాటి స్త్రీ రూపంలో మా దగ్గరకు వచ్చి సహాయం చేసారు. ఈ సంఘటన గురించి ఆలోచిస్తే ఇప్పటికీ నా శరీరం రోమాంచితమవుతుంది. బాబా రాకకు హృదయపూర్వకమైన ఒక్క పిలుపు చాలని నిరూపించింది ఈ అనుభవం.

పునర్జన్మని ప్రసాదించిన బాబా




గత మూడు సంవత్సరాలుగా నేను బాబా భక్తురాలిని. బాబా మా నాన్నగారికి పునర్జన్మను ఎలా ప్రసాదించారో ఇప్పుడు మీతో పంచుకుంటాను. 2017 అక్టోబర్ 12, గురువారంనాడు మా నాన్నగారు చనిపోయినట్లుగా నాకొక కల వచ్చింది. ఆ కలలోనే నేను, "ఎందుకు బాబా‌, మాకు, మా కుటుంబానికి ఇంత కష్టం కలిగించారు?" అని గట్టిగా ఏడుస్తున్నాను కూడా. ఆ పీడకలతో నా నిద్ర చెదిరి, మెలకువ వచ్చింది. లేచిన తరువాత మావారిని పట్టుకొని గట్టిగా ఏడ్చేసాను. అదేరోజు సాయంత్రం నాన్నకి గుండెకు సంబంధించిన స్ట్రెస్ పరీక్ష చేయాల్సి వచ్చింది.

ఆరోజు నాన్నని హాస్పిటల్‌‌కి తీసుకునివెళ్లేముందు దత్తాత్రేయ మందిరానికి, బాబా మందిరానికి వెళ్లి,  "నాన్నకేమీ కష్టం లేకుండా చూడండి" అని ప్రార్థించాను. తర్వాత నాన్నని తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టరు నాన్నని పరీక్షించి, "ఆంజియోగ్రాఫీ చేయాల"ని చెప్పారు. డాక్టరు సూచన మేరకు ఆంజియోగ్రాఫీ చేయిస్తే ఆ రిపోర్టులో నాన్నగారి గుండెకు సమస్య ఉందని తెలిసింది. డాక్టరు, "ఆయనకు శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయాలి. నవంబర్ నెలలో ఆంజియోప్లాస్టీ చేద్దామ"ని చెప్పారు. డాక్టరు చెప్పినట్లుగానే నవంబరులో ఆపరేషన్ జరిగింది. కానీ, ఆరోజునుండి మూడు రోజులపాటు నాన్న వాంతులు, గ్యాస్టిక్ సమస్యలతోపాటు ఆపరేషన్ జరిగిన చేతికి విపరీతమైన నొప్పితో బాధపడ్డారు. డాక్టర్స్, "కంగారుపడాల్సింది ఏమీలేదు, ఇది సాధారణమైన విషయమే, ఇటువంటి ఆపరేషన్ జరిగిన తరువాత సైడ్ ఎఫెక్ట్స్ గా ఇలాంటి సమస్యలు వస్తాయి. కొన్నిరోజుల్లో అంతా నార్మల్ అయిపోతుంద"ని చెప్పారు.

తరువాత ఐదవరోజు నాన్నని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చిన రెండురోజుల తర్వాత నాన్న పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. ఆగకుండా వాంతులవుతూ ఆయన శరీరం  డీహైడ్రేట్‌కి గురైంది. సోడియం లెవెల్స్ కూడా పడిపోయాయి. గురువారంనాడు నాన్నని మళ్లీ సీరియస్ కండిషన్లో హాస్పిటల్‌కి తీసుకుని బయలుదేరాం. హాస్పిటల్‌కి వెళ్తూ మార్గంలో నేను, "బాబా! మీరు నాన్నతో ఉన్నట్లైతే, దర్శనమివ్వండి" అని ప్రార్థించాను. మరుక్షణంలో అందమైన బాబా చిత్రం ఒక బస్సుపై ఉండటం చూశాను. దాంతో 'నాన్నకి తోడుగా బాబా ఉన్నారు' అని నాకు ధైర్యం కలిగింది. నాన్నను హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాం. సమయం గడుస్తున్నకొద్దీ ఆయన పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. మూత్రం ద్వారా సోడియం చాలా ఎక్కువగా పోయింది. క్రమంగా ఆయన తన జ్ఞాపకశక్తి కోల్పోతున్నారు. చిన్నపిల్లల్లా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కంటిచూపు కూడా మందగించింది. ఆ విషాదకరమైన స్థితిలో నేను, మా సిస్టర్ చాలా ఏడ్చాము. అసలు మొదట్లో డాక్టర్లకి కూడా ఏమీ అర్థం కాలేదు. మొత్తానికి బాబా దయవల్ల కొంతసేపటి తరువాత ఆయన శరీరంలో సోడియం లెవల్స్ బాగా పడిపోవడమే ఆ పరిస్థితికి కారణమని తెలిసింది. ఆ రాత్రి మా జీవితాలలో చాలా బాధాకరమైన రాత్రి. రాత్రంతా నేను బాబా భజనలు, పాటలు, సచ్చరిత్రలోని అధ్యాయాలు, ఇంకా ఇతర దేవతల పాటలు వింటూ అస్సలు నిద్రపోలేదు.

మరుసటిరోజు శుక్రవారంనాడు నాన్న ఆరోగ్యపరిస్థితి చాలా దిగజారిపోవడంతో డాక్టర్లు ఆయనను 'ఎంఐసీయూ'లో పెట్టి, "48 గంటల్లో ఆయన కోలుకోవాలి, లేదంటే మేము చేయడానికి ఏమీ లేద"ని చెప్పేసారు. ఆ సమయంలో నాకు అక్టోబర్ నెలలో వచ్చిన కల గుర్తుకు వచ్చి, "సాయిదేవా! నేనేదైతే ఆరోజు కలలో చూసానో, ఇప్పుడు ఆ స్థితిలో నేనున్నాను. హాస్పిటల్‌‌కి వస్తున్న సమయంలో మీరు నాన్నతో ఉన్నానని మీ దర్శనంతో నాకు సూచించారు కదా,  ప్లీజ్...రండి. నాన్నని కాపాడండి బాబా!" అని ప్రార్థించాను. మా సిస్టర్, బావ హాస్పిటల్‌‌లో నాన్నవద్ద ఉండగా, నేను, అమ్మ ఆ రాత్రి ఇంటికి బయలుదేరాము. దారంతా భారమైన హృదయంతో కన్నీళ్లు ఆగలేదు. ఇంటికి చేరిన వెంటనే దేవుడు ముందు దీపం పెట్టి బిగ్గరగా ఏడుస్తూ, "రేపు ఉదయం ఏదైనా అద్భుతాన్ని చూపించండి" అని ప్రార్థించాను. తరువాత ఏం జరిగిందో తెలుసా? మన దైవం పట్ల పూర్ణమైన విశ్వాసముంటే ప్రతి చీకటిరాత్రి తర్వాత  అందమైన ఉదయం ఉంటుంది. మా విషయంలో కూడా అదే జరిగింది. ఉదయానికల్లా నాన్న శరీరం మందులకు అనుకూలంగా స్పందించడం మొదలుపెట్టింది. నేనొక చిన్న బాబా ఫోటో తీసుకుని వెళ్లి నాన్న మంచం పక్కన పెట్టి, "బాబా! నాన్న ఆరోగ్యం కుదుటపడేలా చూడండి" అని ప్రార్థించి, మా బాధనంతా ఆయన పాదాలచెంత పెట్టాను. నిదానంగా ఆయన పరిస్థితి మెరుగుపడుతూ వచ్చింది. ఏడురోజుల తరువాత ఆయన పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.

ఆరోజు ఆ భయానక కల ద్వారా కొద్దిరోజుల్లో నాన్నకు రాబోయే ప్రమాదాన్ని బాబా ముందుగానే సూచించారు. నిజంగా బాబా మా నాన్నని మృత్యుముఖంనుంచి కాపాడి, ఆయనకు పునర్జన్మనిచ్చారు. ఆయన కృప అపారం. "కోటి కోటి ప్రణామాలు బాబా! ఎప్పుడూ ఇలాగే మా కుటుంబంపై మీ చల్లని ఆశీస్సులు కురిపిస్తూ ఉండండి!"

ఓం సాయి.. శ్రీ సాయి.. జయ జయ సాయి

సర్వేజనా సుఖినోభవంతు!

బాబా ఎప్పుడూ తన బిడ్డలను విడిచిపెట్టరు.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

పేరు వెల్లడించని సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు.

సమస్యల వలన దిగులుగా ఉన్నప్పుడు  సాయిపై విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఈ బ్లాగు ఎంతగానో  ఉపకరిస్తుంది.  బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. 

నేను ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను. అయితే ఒకసారి మూడునెలల పాటు మా డిపార్టుమెంటుకి  పెద్దగా వర్కు లేదు.  ఆ సమయంలో హఠాత్తుగా ఒకరోజు మా మేనేజరు‌, "ఈ డిపార్టుమెంటులో వర్క్ లేదు, వేరే డిపార్టుమెంటులో ఎక్కువ వర్క్ ఉంది. కాబట్టి అందులోకి మారండి" అని చెప్పారు. కానీ, ఆ డిపార్టుమెంటులో పని చేయడం అంత సులువేం కాదు. పైగా నేనొకవేళ ఆ డిపార్టుమెంటులోకి మారితే ఇంటి పనులు, ఆఫీసు పనులు రెండూ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఇంకా ఆ డిపార్టుమెంటులో ఉండే వర్క్‌లో నాకెటువంటి అనుభవం లేదు.  ఏమి చేయాలో అర్థం కాలేదు. ఈ ఆలోచనలతో బుర్రంతా పిచ్చెక్కినట్లయింది. నేను మా మేనేజరుతో, "వేరే ఉద్యోగం చూసుకోవడానికి రెండు నెలల సమయం కావాలి" అని అడిగాను.  అందుకాయన, ఒక నెల మాత్రం ఇవ్వగలనని చెప్పారు. "సరే సార్! చాలా థాంక్స్" అని చెప్పి నేను బయటకు వచ్చాను. కానీ నెల గడుస్తున్నా ఉద్యోగ అవకాశం ఏదీ రాలేదు. చాలా  ఇంటర్వ్యూలకి హాజరైనా ఏ ఉపయోగం లేకుండా పోయింది. నేను, "బాబా! మీరే నాకున్న ఆశ. నేనింక తట్టుకోలేను, నన్ను పరీక్షించకండి. దయచేసి నాకు ఏదో ఒక ఉద్యోగం  ఇవ్వండి" అని ప్రార్థించాను. నేను ఎప్పుడూ ప్రోడక్ట్ ఆధారిత కంపెనీలోనే పని చేసి ఉన్నందువలన, అదే ఫీల్డ్‌‌లో ఉద్యోగం రావాలని నాకు ఆశగా ఉండేది. 'క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సైట్' లో బాబాని అడిగిన ప్రతిసారీ అనుకూలమైన సమాధానాలే వచ్చేవి. ఇలా ఉండగా ఒకరోజు నేను బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతున్నప్పుడు, ఒక భక్తురాలు తన అనుభవంలో 'సప్తాహ పారాయణం' చేసిన 15 రోజుల్లో తనకి ఉద్యోగం వచ్చినట్టు వ్రాసారు. ఆ అనుభవం ద్వారా బాబా నన్ను కూడా సప్తాహ పారాయణం చేయమని సూచిస్తున్నట్లుగా అనిపించింది. వెంటనే నేను ఆలస్యం చేయకుండా గురువారం నుండి పారాయణ మొదలుపెట్టాను. వెంటనే అద్భుతం మొదలైంది. పారాయణ మొదలుపెట్టిన రెండోరోజు రాత్రి 7:30కి మరుసటిరోజు ఇంటర్వ్యూ  ఉందని కాల్ లెటర్ వచ్చింది.  ఆరోజు నన్ను ఇంటర్వ్యూ చేసే గదిలో బాబా ఫోటో దర్శనమిచ్చింది. దాంతో, "బాబా నాతో ఉన్నారు. ఇక దిగులుపడాల్సిన అవసరం లేద"ని నాకెంతో ధైర్యం వచ్చింది. తరువాత మూడు రౌండ్ల ఇంటర్వ్యూ బాగా జరిగింది.

తరువాత ఒకరోజు నాకొక కల వచ్చింది. కలలో నేను కూర్చుని ఉద్యోగం గురించి ఆందోళన పడుతున్నాను. అంతలో బాబా వచ్చి, "నేనుండగా, నువ్వెందుకు దిగులుపడుతున్నావు?" అని అన్నారు. ఆ మాటలు నాకెంతో సంతోషాన్నివ్వడంతో ఆందోళనపడటం మానుకున్నాను.  అంతటితో కల ముగిసింది.

సరిగ్గా ఇంటర్వ్యూ జరిగిన వారంరోజుల తరువాత నేను సెలెక్ట్ అయినట్లు కంపెనీ వాళ్ళు తెలియజేసారు. నేను కోరుకున్న విధంగా బాబా నాకు యం.యన్.సి. ప్రోడక్ట్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చారు. "థాంక్యూ బాబా! కృతజ్ఞత తెలుపుకోవడానికి నాకు మాటలు కూడా రావడం లేదు. బాబా! నా చిన్న చిన్న సమస్యలు మీకు తెలుసు. దయచేసి నాకు తోడుగా ఉండి వాటిని పరిష్కరించండి. నా ఒకేఒక కోరిక - నిత్యం మీ నామస్మరణ చేసేలా అనుగ్రహించండి." బాబా ఎప్పుడూ తన బిడ్డలను విడిచిపెట్టరు. సాయి నామస్మరణ చేస్తూ ఉండండి, అంతా మంచి జరుగుతుంది.

యోగిరాజు ముంగిట మ్రోకరిల్లిన మృగరాజు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

1918 అక్టోబరు 15వ తేదీన శ్రీసాయిబాబా మహాసమాధి చెందారు. బాబా మహాసమాధికి ఒక వారంరోజుల ముందు ఒక పెద్దపులి శ్రీసాయిసన్నిధిలో మసీదు మెట్లపై మ్రోకరిల్లి ప్రాణాలు విడిచింది. బాబా ఆదేశానుసారం ఆ మృగరాజును శిరిడీలోని మహాదేవ మందిర సమీపాన సమాధి చేసారు. ఆ విశేష సంఘటనకు గుర్తుగా ఆ పులి యొక్క విగ్రహం ద్వారకామాయిలో ప్రతిష్ఠించబడిందంటే, ఆ వ్యాఘ్రలీలకు సాయిచరిత్రలోను, సాయిభక్తుల హృదయాలలోను ఎంతటి విశేష స్థానముందో అవగతమవుతుంది.

"పులి వంటి క్రూరజంతువుకు మానవులకు ఉండే జ్ఞానం ఉంటుందా? అటువంటి ఒక క్రూరజంతువు బాబా పాదాల వద్ద శరణాగతి పొందింది. బాబా చర్యలు అంతుపట్టనివి. ఈ విషయానికి సంబంధించిన కథను శ్రద్ధగా వినండి. ఈ కథ మీకు బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని, అన్ని జీవులపట్ల ఆయనకు గల సమదృష్టిని తెలియజేస్తుంది.

బాబా మహాసమాధి చెందడానికి ఏడురోజుల ముందు సాయిసన్నిధిలో ఓ అద్భుతం జరిగింది. ఒక ఎద్దులబండి వచ్చి మసీదు ముంగిట్లో ఆగింది. ఆ బండిలో బలమైన ఇనుప గొలుసులతో బంధింపబడి ఉన్న ఒక పెద్దపులి ఉంది. అది వ్యాధిగ్రస్తమై ఉంది. చూసేందుకు చాలా రౌద్రంగా, అసహనంగా భయంగొల్పుతూ ఉంది. దానిపై జీవిస్తూ ఉన్న ముగ్గురు దర్వేషులు (జంతు ప్రదర్శకులు) బండిపై దానిని పల్లె పల్లెకూ తిప్పుతూ, ఆ ఆదాయంతో పొట్టపోసుకునేవారు. జబ్బుపడిన ఆ పులికి వారు ఎన్నో చికిత్సలు చేయించారు. కానీ దాని వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. చివరకు ఎవరైనా ఒక మహాత్ముని దర్శనభాగ్యం చేతనైనా ఆ పులికి స్వస్థత చేకూరుతుందని ఆశపడ్డారు. అదే సమయంలో బాబా అద్భుత లీలలు వారి చెవినపడ్డాయి. వారు తమతో పాటు పులిని తీసుకుని బాబా దర్శనార్థం శిరిడీ వచ్చారు. మసీదు ముంగిట్లో పులిని బండి నుండి క్రిందికి దించారు. పులిని గొలుసులతో కట్టిపట్టుకుని మసీదు ద్వారం వద్ద వేచివున్నారు. దర్వేషులు బాబా వద్దకు వచ్చి నమస్కరించి పులి పరిస్థితిని బాబాకు విన్నవించారు.

ప్రజలంతా ఈ దృశ్యాన్ని చోద్యంగా చూస్తున్నారు. బాబా అనుమతి తీసుకుని, పులిని గొలుసులతో గట్టిగా పట్టుకుని, జాగ్రత్తగా బాబా ముందుకు తెచ్చారు. పులి మసీదు మెట్ల వద్దకు వచ్చి, ఒక్కసారి బాబావైపు చూచింది. అద్భుతమైన బాబా దివ్య తేజస్సుకు తట్టుకోలేనట్లు శిరస్సు వంచింది. మసీదు మెట్లు ఎక్కుతున్న పెద్దపులిని బాబా చూశారు. పులి కూడా బాబా వంక ప్రేమతో చూసింది. బాబా చూపులో చూపు కలిసిన వెంటనే, ఆ పులి తోకతో నేలను మూడుసార్లు కొట్టి బాబా ముందు మ్రోకరిల్లింది. తరువాత ఒక్కసారి పెద్దగా గర్జించి, ప్రాణాలు విడిచింది. అక్కడున్నవారంతా ఆశ్చర్యచకితులయ్యారు.

దర్వేషులు తమ జీవనాధారం పోయినందుకు ముందు దిగులుపడ్డారు. కానీ జబ్బుతో ఉన్న ఆ పులి మరణించే సమయానికి దాని పూర్వపుణ్యం వలన బాబావంటి మహాత్ముని సన్నిధి చేరి ఉత్తమగతులు పొందిందని ఆనందించారు. మహాత్ముల సన్నిధిలో మరణించిన జీవి క్రిమి అయినా, కీటకమైనా, వ్యాఘ్రమైనా వాటి పాపాలన్నీ పరిహారమవుతాయి.

బాబా పాదాలు కోరికలన్నీ తీర్చే చింతామణి వంటివి. అష్టసిద్ధులు ఆయన పాదాలకు ప్రణామాలర్పిస్తాయి. నవనిధులు ఆయన పాదాలముందు సాగిలపడి ఆయన పాదతీర్థాన్ని స్వీకరిస్తాయి.

ఏ జీవి మహాత్ముల పాదాలవద్ద శిరస్సు ఉంచి మరణిస్తుందో అది తప్పక ఉద్ధరింపబడుతుంది. ఎంతో పూర్వపుణ్యం చేసుకుంటే తప్ప ఏ జీవికైనా మహాత్ముల కనులముందు దేహత్యాగం చేసే అవకాశం రాదు. మహాత్ముల సన్నిధిలో విషం కూడా అమృతంలా మారుతుంది. ఆ సన్నిధిలో మరణించిన వారికి మరుజన్మ అంటూ ఉండదు. వారి పాపాలన్నీ నశిస్తాయి. వారు ముక్తులౌతారు. మహాత్ములను కనులారా నఖశిఖపర్యంతం చూస్తూ శరీరాన్ని వదలటాన్ని మరణమంటారా? కాదు, దాన్ని 'సద్గతి' అంటారు.

బహుశా ఈ పులి గతజన్మలో కొంత పుణ్యం చేసుకున్న జీవి అయివుంటుంది. తన పాండిత్య గర్వంతో హరిభక్తుణ్ణి కించపరచి ఉంటుంది. ఆ హరిభక్తుని శాపం వల్ల క్రూరజంతువుగా జన్మించిందేమో! అదృష్టవశాత్తూ బాబాను దర్శించటంతో ఆ పాపాలన్నీ దహింపబడ్డాయి. ఆ  జీవి ఉద్ధరింపబడింది. అలా ఆ పులి సాయిపాదాల చెంత ముక్తి చెందటం చూసి ఆ దర్వేషులు సంతోషించారు.

పులి దేహాన్ని ఎక్కడ పూడ్చిపెట్టాలని వారు బాబాను అడిగారు. అప్పుడు సాయిమహరాజ్, “ఈ పులి పుణ్యజీవి. దాని మరణానికి చింతించవద్దు. దాని మరణం ఇక్కడ జరగాల్సి ఉంది. అది శాశ్వతానందాన్ని పొందింది. తకియా వెనుక శివాలయం ఉంది. అక్కడున్న నంది సమీపంలో దాని అంత్యక్రియలు జరపండి” అని ఆదేశించారు. "అలా చేస్తే పులి సద్గతి పొందుతుంది. దానితో మీకు గల ఋణానుబంధం తీరుతుంది. గతజన్మలో అది మీకు ఋణపడి ఉంది. ఆ ఋణాన్ని తీర్చుకోవడానికి ఈరోజువరకు అది మీకు సేవచేసింది” అని బాబా వివరించారు. (తమ జీవనోపాధి కోల్పోయి దిగులుగా ఉన్న దర్వేషులకు బాబా 150 రూపాయలు కానుకగా ఇచ్చారు.)

తరువాత ఆ దర్వేషులు ఆ పులి కళేబరాన్ని మోసుకువెళ్ళి నంది విగ్రహం వెనుకగా సమాధిచేసారు. అంతకు ముందు వరకు ప్రాణాలతో ఉన్న పులి హఠాత్తుగా ప్రాణత్యాగం చేయడం ఎంత అద్భుతమైన సంఘటనో కదా! ఈ సంఘటన ఇంతటితో ఆగివుంటే ప్రజలు దాన్ని గుర్తుంచుకునేవారు కాదు. కానీ, సరిగ్గా పులి మరణించిన ఏడవరోజున బాబా మహాసమాధి చెందారు. కనుకనే ఈ సంఘటన అందరి మనసుల్లో చెదరకుండా నిలిచిపోయింది”.

- శ్రీసాయిసచ్చరిత్ర 31వ అధ్యాయం.

బాబా మహాసమాధికి సరిగ్గా ఏడురోజుల ముందు బాబా మసీదు ముంగిట శ్రీసాయి సన్నిధిలో జరిగిన ఈ సంఘటనకు గుర్తుగా 1969 నవంబర్ 12వ తేదీన ఓజార్ గ్రామానికి చెందిన శ్రీత్రయంబకరావుచే ద్వారకామాయిలో పులి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది.

సోర్సు: సాయిపథం ప్రథమ సంపుటం.

నేను (శ్రీ అనంత జయదేవ్ చితాంబర్) ప్రత్యక్షంగా దర్శించుకున్న శ్రీసాయినాథ్ మహరాజ్.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

అహ్మద్‌నగర్ నివాసియైన శ్రీఅనంత జయదేవ్ చితాంబర్ చిన్నతనంలోనే శ్రీసాయిని ప్రత్యక్షంగా దర్శించుకున్న భాగ్యశాలి. వీరి తండ్రిగారైన శ్రీజయదేవ్ చితాంబర్ శిరిడీలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా 1912 సంవత్సరం నుండి 1927 సంవత్సరం వరకు పనిచేసారు. ఈ విద్యాశాలలోనే అంతకు పూర్వం మాధవరావు దేశ్‌పాండే (షామా) అధ్యాపకునిగా పనిచేసారు. అందువలన శ్రీఅనంత చితాంబర్‌గారి బాల్యం అంతా సాయి సమక్షంలోనే గడిచింది. ఆ సమర్థ సద్గురుని ప్రత్యక్ష సన్నిధి ప్రభావం పసిమనసులను కూడా ఎంతగా ప్రభావితం చేస్తుందో శ్రీఅనంత్‌గారు అందించిన మధురస్మృతుల ద్వారా తెలుసుకోవచ్చు. 1975 సంవత్సరంలో సాయిలీలా మాసిక్ (మరాఠీ)లో తన స్మృతులను ఉటంకిస్తూ శ్రీఅనంత్‌గారు వ్రాసిన వ్యాసాన్ని యథాతథంగా అనువదించి సాయిపథం పాఠకులకు సవినయంగా సమర్పిస్తున్నాము.

- ఎడిటర్: పూజ్యశ్రీ  సాయినాథుని శరత్‌బాబూజీ.
శ్రీఅనంత జయదేవ్ చితాంబర్

నాకు 15 నెలల వయస్సున్నప్పుడు (1912వ సంవత్సరంలో) మా తండ్రిగారికి శిరిడీకి బదిలీ అయ్యింది. అప్పటినుండి 1927 వరకు శిరిడీలోని ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టరుగా సుమారు 14 సం||లు మా తండ్రిగారు పనిచేసారు. ఆ పాఠశాల మారుతి మందిరానికి సమీపంలో ఉండేది. నా బాల్యం అంతా శిరిడీలోనే గడిచిపోయింది. శ్రీసాయిబాబా 1918లో దేహత్యాగం చేసేనాటికి నా వయస్సు 8 సంవత్సరాలు. అంటే పూర్తిగా ఊహ తెలియని బాల్యదశ కాదు. నాకు 7-8 సంవత్సరాల వయస్సున్నప్పుడు నేను శ్రీసాయినాథ్ మహరాజ్‌తో గడిపిన క్షణాలు పూర్తిగా ఈరోజుకు కూడా గుర్తున్నాయి. ప్రతిరోజు నియమంగా ద్వారకామాయికి వెళ్ళి, ఆయన పాదాలమీద నా శిరస్సు ఉంచి నమస్కరించుకోవడం, అక్కడ జరిగే ఆరతులలో పాలుపంచుకుని ఆరతి పాటలు పాడటం నాకు అలవాటుగా ఉండేది. బాబా గ్రామంలో భిక్ష చేయడం, భక్తులకు దర్శనం ఇవ్వడం, లెండీకి వెళ్ళి తిరిగిరావడం లాంటి ఎన్నో సంఘటనలకు నేను ప్రత్యక్షసాక్షిని. ఆయన తమ సన్నిహిత భక్తులతో కలిసి ద్వారకామాయిలో కూర్చోవడం, చిలుము త్రాగడం మొదలైన దృశ్యాలు ఇప్పటికీ నా కళ్ళముందు కదలాడుతున్నాయి.

శ్రీదాసగణు మహరాజ్ ఆధ్వర్యంలో బాబా ప్రత్యక్ష సన్నిధిలో శ్రీతుకారామ్ బువా ఆజ్‌గావ్‌కర్ చేసిన కీర్తన వినడం ఈరోజుకూ నాకు జ్ఞాపకం ఉంది. అప్పుడు శ్రీ బువాగారి వయస్సు ఏడెనిమిది సంవత్సరాలు ఉండవచ్చు! (శ్రీతుకారామ్ బువాగారి మనవడు శ్రీధర్మాధికారి ప్రస్తుతం(1975) శిరిడీ సాయిబాబా సంస్థాన్‌లో పూజారిగా పనిచేస్తున్నారు.) శ్రీసాయినాథ్ మహరాజ్‌తో సన్నిహితంగా మెలిగిన భక్తులను నేను నా బాల్యంలోనే చూచాను. శ్రీయుతులు కాకాసాహెబ్ దీక్షిత్, జోగ్, మాధవరావ్ దేశ్‌పాండే, తాత్యాకోతేపాటిల్, గోపాలరావు బూటీ, అబ్దుల్ బాబా, ధాబోల్కర్, పురంధరే, దాసగణు మహరాజ్ లాంటి భక్తులను సన్నిహితంగా దర్శించుకునే మహాభాగ్యం నాకు దొరికింది.

ఈ మహాభక్తులందరూ శ్రీసాయితో కలిసి  ద్వారకామాయిలో కూర్చోవడం, చావడిలో శేజారతిలో పాల్గొనడం మొ||న దృశ్యాలను ఇప్పుడు కూడా నా మనఃచక్షువులు దర్శనం చేసుకుని నన్ను కృతార్థుని చేస్తున్నాయి. ఇదెలా లభ్యమయింది? అనేక జన్మల సుకృత ఫలితంగా శ్రీసాయి నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించారేమో! నేను ఎనిమిదేళ్ళ వయస్సు ఉన్న బాలుడిని. కాని నేను చేసుకున్న బాబా ప్రత్యక్ష దర్శనం ఫలితంగా, బాబా ఇచ్చిన ఆశీర్వాదం నా మనస్సులో ముద్రించుకుపోయినందువలన నేను ఎప్పటికీ పై సంఘటనలను మరువలేను. అవి చిరస్మరణీయమైనవి కావడం కోసమేనేమో బాబా దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకునే మహద్భాగ్యం బాబా నాకు ప్రసాదించి, ఎప్పటికీ ఆరని మధురస్మృతుల జ్యోతిని నా హృదయంలో వెలిగించారు. అది కేవలం శ్రీసాయికృప.

శిరిడీలో అవతరించి, అక్కడనుండి జగదోద్ధారణ గావిస్తూ, భక్తుల కోరికలు నెరవేరుస్తూ, వారి దుఃఖాలను హరించి వారి మనసులకు శాంతి ప్రసాదించారు శ్రీసాయిబాబా. ఇప్పటికీ సమాధిరూపంలో ఎందరో భక్తుల అనుభవాల సాక్షిగా శిరిడీలో నిత్యసత్యులై ఉన్నారు. సర్వహృదయాంతరస్థుడైన బాబా ప్రతి భక్తునిపై అనుగ్రహాన్ని ప్రసరింపచేసి, అద్భుత  అనుభవాలను ప్రసాదిస్తున్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన దేహత్యాగం చేసి ఇప్పటికి 57 సం||లు కావస్తున్నప్పటికీ ఆయన సమాధిరూపంలో శిరిడీలోనే ఉన్నారన్నది నిత్యసత్యం. ఆయన కాలానికి అతీతుడు. మనల్ని వదలి ఆయన ఎక్కడకు వెళ్ళగలరు? ఆయన భక్తులు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఆయనను స్మరించినంతనే వారితోనే బాబా ఉన్నారన్న విషయం అవగతమవుతుంది. వారి రక్షణకు ఆయన పరిగెత్తుకుంటూ వస్తారు. ఆయనపై మనకు గల భక్తి, ప్రేమలకు ప్రతిఫలం వెనువెంటనే లభిస్తుంది.

మా తల్లిగారు ప్రతిరోజు బాబా దర్శనం చేసుకునేవారు. ప్రతిసారి బాబా చరణాలపై పసుపు కుంకుమలను అద్ది నమస్కారం చేసుకునేవారు. ఒకసారి బాబాను “పసుపు, కుంకుమలను మీ పాదాలకు పూస్తే మీకు ఇష్టమేనా?” అని ఆవిడ అడిగింది. “భక్తితో మీరు ఏం చేసినా నాకు ఇష్టమే” అని బాబా సమాధానం ఇచ్చారు. బాబా అప్పుడప్పుడు మా తల్లిగారిని దక్షిణ అడిగేవారు. అప్పుడు ఆమె మా తండ్రిగారి వద్దనుండి నాలుగు అణాలు తీసుకుని బాబాకు దక్షిణ సమర్పించేవారు. మా తల్లిగారు బాబాకు చేసుకున్న సేవాఫలితంగా ఆమె అవసానదశలో ఆమె చిత్తం స్థిరమై, రామనామాన్ని జపిస్తూ ప్రాణం విడిచారు. 

బాబా ఆగ్రహం -భక్తులకు అనుగ్రహం!

బెత్తం దెబ్బకు పెరిగిన బత్యం!

మా తండ్రిగారికి కూడా బాబాపై అపారమైన భక్తిశ్రద్ధలుండేవి. ఆయన బాబాను సాక్షాత్తు పరమేశ్వరునిగా భావించేవారు. ఒకరోజు ఉదయం ఆరతి అనంతరం బాబా చావడినుండి మశీదుకు బయలుదేరుతూ, తమ ప్రక్కనేవున్న మా తండ్రిగారి తలమీద సటకా (చేతికఱ్ఱ)తో కొట్టారు. మా తండ్రిగారి తలమీద చిన్న గాయం అయింది. కానీ, ఆయన దానిని బాబా ప్రసాదంగా స్వీకరించారు. బాబా ఊదీని ఆ గాయంపై పూయడంతో ఆ గాయం మానిపోయింది. తరువాత 15 రోజులలోనే మా తండ్రిగారి జీతం నెలకు రూ 15/- చొప్పున పెరిగింది. బాబా కోపాన్ని భక్తులు మహాప్రసాదంగా భావించేవారు. దాన్ని నేను స్వయంగా చూసాను. బాబా కోపం భక్తుల ఉద్ధరణకే అన్న మాట అక్షరసత్యం.

శ్రీసాయి స్వయంభువు. ఆయన తమ సమాధి అనే అఖండజ్యోతి రూపంలో వెలుగుతూ సర్వమానవాళికి అనుభవాలనే ఆనందపు వెలుగులను సదా పంచి ఇస్తున్నారు. శ్రీసాయి సర్వశ్రేష్ఠమైన పరమాత్మ స్వరూపం. శ్రీమద్భగవద్గీతలో పరమపురుషుడు, సర్వగత పరబ్రహ్మల గురించి చేసిన వర్ణనలకు శ్రీసాయి సజీవసాక్ష్యమనే విషయం ఎందరో భక్తులకు అనుభవైకవేద్యం. బాల్యంలో దర్శించుకున్న ఆయన రూపం గుర్తుకు వచ్చినప్పుడు నేను మైమరచిపోతాను. ఆయన తత్త్వాన్ని ఆకళింపు చేసుకుని, ఆయన కృపాభిక్ష లభించే మార్గంలో సదా వసించాలనే సద్బుద్ధిని శ్రీసాయియే ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

'జయామని జైసాభావ, తయా తైసానుభవ' - అనే ఆరతి వాక్యాలు శ్రీసాయిభక్తులకు నిత్యానుభవాలు. ఏ దేవతామూర్తులను పూజించే భక్తులకైనా, వారి వారి ఆరాధ్యదైవాల రూపంలో బాబాయే దర్శనమిచ్చి, సకల దేవతాస్వరూపం తానే అను దృష్టాంతమిచ్చినట్లు ఎందరో భక్తుల అనుభవాలు నేను విన్నాను. స్వయంగా ఆ అనుభవాన్ని పొందాను. ఆ అనుభవమే మనకు జ్ఞానప్రకాశమిచ్చి మార్గదర్శకత్వం వహిస్తుంది. శ్రీసాయిని ఆశ్రయించిన తరువాత, అన్యయోగాలతో పనిలేదు. కారణం- సాక్షాత్తూ ఆయన సర్వవ్యాపి అయిన పరమాత్ముడు కనుక.

శ్రీసాయి కృపవలన నాకు, మా కుటుంబానికి వచ్చిన అనుభవాలను ప్రచురించడానికి అనేక పేజీలు కావాలి. అనేక మతధర్మాలకు చెందిన భక్తులు శ్రీసాయిబాబా దర్శనానికి రావడం నేను స్వయంగా చూసాను. ఈరోజుకి కూడా అలానే వస్తున్నారు. ఇది బాబాయొక్క అగమ్యమైన లీల. బాబా పాదాలవద్ద జాతి, మతం, వర్ణం లాంటి వాటికి చోటులేదు. ఎవరైనా కొంతమంది కేవలం కుతూహలంకొద్దీ అయినా సరే ఆయన దర్శనం చేసుకుంటే, వారి పూర్వసంస్కారాలు మాయమై బాబాపై అపారమైన శ్రద్ధ కుదిరేది. శ్రీసాయిబాబా స్వరూపం అత్యంత గంభీరమైనది. ఆయన గంభీరత్వాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. దర్శనానికి వచ్చే భక్తులు ఏ ధర్మానికి లేదా మతానికి చెందినవారైనా, ఉదాహరణకు హిందూ సన్యాసియైనా, ముస్లిం ఫకీరైనా, వారు శ్రీసాయిని దర్శించిన మరుక్షణం, వారెవరో వారే మరిచిపోయేవారు. శ్రీసాయిపట్ల ఎంతగా ఆకర్షితులవుతారంటే వారు తమకు తెలియకుండానే సచ్చిదానంద సద్గురుడైన ఆ సాయి చరణకమలాలకు శరణాగతి చెందుతారు. వారివారి మతధర్మాలపై వారికుండే అభిమానం (దురభిమానం) శ్రీసాయి సన్నిధిలో దూరంగా పారిపోతాయి.

శ్రీసాయిని ముస్లిం అందామంటే ఆయన నుదుటిమీద త్రిపుండ్రం కనిపించేది. ఎదురుగా అఖండ అగ్నిగుండం ఉండేది. భక్తులను “అల్లా అచ్ఛాకరేగా!” అంటూ ఆశీర్వదించే ఆ ఘటనాఘటన సమర్థునికి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఆరతులు జరిగేవి. ఈ రోజుకి కూడా జరుగుతూనే వున్నాయి. ఆయన హిందువా? ముస్లిమా? అనే విషయం ఈనాటికీ ఎవరికీ అంతుబట్టలేదు. ముస్లిములు ఆయన ముందు నమాజ్ చదివితే, వేదపండితులు వేదాన్ని వల్లించేవారు. ఇదంతా నేను చూసింది చెబుతున్నాను, విన్నది కాదు. పరబ్రహ్మతత్వం సగుణసాకారరూపంలో అవతరించిన ఆ రూపాన్ని ప్రత్యక్షంగా దర్శించుకోవడం నా మహద్భాగ్యం. బ్రహ్మీస్థితి, జీవన్ముక్తావస్థ, విదేహిఅవస్థలాంటి వాటిని ఎవరయినా చిత్రించగలరా? ఆ ప్రశ్న శ్రీసాయిని దర్శించుకుంటే అదృశ్యమవుతుంది. శ్రీసాయిలాంటి సమర్థ సద్గురుని దర్శించుకుని ఆయనను సదా ధ్యానించుకోవడం వలన ఆయన స్వరూపం ఏమిటో బోధపడుతుంది. ఇది ఆయన యొక్క నిజమైన లీల. అటువంటప్పుడు శ్రీదాసగణు మహరాజ్ 'శిరిడి మాఝే పండరీపూర్, సాయిబాబా రమావర' అని వ్రాయడంలో ఆశ్చర్యం ఏముంది? శ్రీసాయినాథ్ మహరాజ్ ప్రత్యక్ష అవధూత. ఆరతిగీతంలో రచించిన 'దత్తావధూత, సాయి అవధూత' అనే వాక్యం అక్షరసత్యం. శ్రీదత్తదేవులు సద్గురు సాయిబాబా స్వరూపంలో శిరిడీలో నివసించారు.

ఆనాటి సంఘటనకు గుర్తుగా ద్వారకామాయిలో ప్రతిష్ఠించబడిన పులి విగ్రహం.

శ్రీసాయి మానవాళిని ఉద్ధరించడమే కాక తమ దర్శనానికి వచ్చిన ఒక పులిని కూడా ఆయన ఉద్ధరించారు. ఆ పులి ద్వారకామాయిలో బాబా ముందు మరణించడం శిరిడీలో నేను ప్రత్యక్షంగా చూసాను. బాబా నాపై కురిపించిన అనుగ్రహవర్షం వలననే జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యే ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూచే అదృష్టం నాకు లభించింది. ఆ సంఘటన ఇలా జరిగింది.

ఒకరోజు బాబా ద్వారకామాయిలో మధ్యాహ్నహారతికి ముందు ఉదయంవేళలో మసీదు కఠడా (చేపట్టు) పై చేయివేసి కూర్చుని ఉండగా, క్రిందిప్రాంగణంలో ఎద్దులబండిలో కట్టి తీసుకువచ్చిన పులి తన ఆటను ప్రదర్శించింది. ఆట అయిపోగానే దానిని లోపలికి తీసుకువెళ్ళి బాబా చరణాలపై దాని శిరస్సు ఉంచాల్సిందిగా అక్కడ కూర్చుని ఉన్న భక్తులు ఆ పులి యజమానికి సలహా ఇచ్చారు. అందువలన ఆ యజమాని పులిని బాబా వద్దకు తీసుకువెళుతుండగా, దర్శనం కోసం మొదటిమెట్టు మీద మనిషిలాగానే తల ఆనించి నమస్కరిస్తుండగా, ఏమి ఆశ్చర్యం! పులి ఏరకమైన వేదన లేకుండా మరణించింది. బాబా దానిని ఆ దేహం నుండి విముక్తురాలను చేసారు. పులి చనిపోవటం చూసి, దానిని ఆటలాడిస్తూ పొట్టపోసుకునే దాని  యజమాని పెద్దపెట్టున ఏడవటం మొదలుపెట్టాడు. 'అరే, ఆ పులికి ముక్తి లభించింది. అది ఎంతో అదృష్టవంతురాలు. ఏడవవద్దు!' అని భక్తులు అతనిని ఓదార్చసాగారు. ఆ సమయంలో శ్రీసాయిని ఎవరూ, ఏమీ అడగలేకపోయారు. ఆ గాంభీర్యము, ఆ కరుణ ముల్లోకాలలో ఎక్కడ వెదికినా కనిపించదు. ఆయనవైపు చూస్తే ఏర్పడే ఆ భావం అనిర్వచనీయం. ఆ దృశ్యం చూసినపుడు నా వయస్సు చిన్నది కావడం వలన దానర్థం నాకప్పుడు బోధపడలేదు.

ఇప్పుడు నా మనస్సులో (ఆ పులిలాగే) శ్రీసాయి దర్శన భాగ్యం పొందుతుండగా తనువు చాలిస్తే ఎంత బాగుండునో కదా అని అనిపిస్తుంది. శ్రీసాయినాథ్ మహరాజ్ స్వయంగా పరమధామము. ఆయనే పురుషోత్తముడు, పరమాత్మ. భవసాగరాన్నుండి నన్ను తరింపచేసి, సదా నా హృదయంలో వసించే నా సద్గురువుకు వివేకపూర్వకమైన నమస్కారం చేస్తూ, ఆయన మహిమకు జయజయకారాలర్పిస్తూ, ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.

శ్రీఅనంత జయదేవ్  చితాంబర్ (1976 మార్చి, సాయిలీలామాసిక్  సౌజన్యంతో) 

శ్రీసాయి సన్నిధిలో కన్నుమూసిన పులి గురించిన శ్రీచితాంబర్ జ్ఞాపకాలకు, యీ సంఘటన గూర్చి అధికారిక సాయిచరిత్రలలో గ్రంథస్థం చేయబడ్డ వివరాలకు కొంచెం తేడా కనిపిస్తున్నది. శ్రీ సాయిసచ్చరిత్రలో గ్రంథస్థం చేయబడిన ఈ లీల యొక్క పూర్తి వివరాలతో గూడిన వ్యాసం రేపటి భాగంలో.....

సోర్సు: సాయిపథం ప్రథమ సంపుటం.

భక్తుడి భోజనం పూర్తయ్యేవరకు వేచి ఉన్న బాబా


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిబంధువు ద్వారకసాయి తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు: .

2019, ఫిబ్రవరి 10, ఆదివారంనాడు నేను దిల్‌షుక్‌నగర్ బాబా గుడికి వెళ్లాలనుకున్నాను. కానీ అనుకోని కారణాలవలన బాగా ఆలస్యమైపోయింది. దానితో మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి బయలుదేరాను. దారిలో బాబాకు కోవా తీసుకుని వెళ్తూ, "బాబా! నేను వచ్చేవరకు హారతి మొదలుకాకుండా చూడండి" అని ప్రార్థించాను. బాబా నా ప్రార్థన మన్నించారు. సరిగ్గా నేను మందిరం గేటు దగ్గరకు రాగానే హారతి మొదలైంది. తరువాత నేను లోపలకి అడుగుపెడుతూనే పూజారి నన్ను చూసి, పరుగున వచ్చి నా చేతిలోని కోవా తీసుకుని బాబాకి నైవేద్యం పెట్టారు. నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే, అప్పటికే బాబాకు నైవేద్యం పెట్టి, హారతి మొదలుపెట్టారు. ఇంకో విషయం ఏమిటంటే, నా తరువాత వచ్చిన భక్తులు తెచ్చిన పదార్థాలు కూడా బాబాకు పెట్టారు. కానీ, పూజారి నావద్ద తీసుకున్నంత ఆత్రంగా వాళ్ళవద్ద తీసుకోలేదు. భక్తులు తెచ్చే నైవేద్యం కోసం బాబా ఆత్రంగా ఎదురుచూసి, వాటిని ఎంతో ఇష్టంగా ఆరగించిన సన్నివేశాలు మనకు శ్రీసాయిసచ్చరిత్రలో ఉన్నాయి. అదేవిధంగా బాబా నేను తీసుకుని వెళ్ళిన నైవేద్యాన్ని ఆత్రంగా స్వీకరించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఆ ఆనందంలో హారతి పాడుతూ ఉండగా ఆయన చూపిన ప్రేమకు నా కళ్ళనుండి ఆనందభాష్పాలు వచ్చేసాయి. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా!" అని చెప్పుకుని, బయటకి వస్తూనే మా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఆ ఆనందాన్ని పంచుకున్నాను.

తర్వాత ఇంటికి చేరాక మళ్ళీ మొబైల్‌లో శిరిడీ ప్రత్యక్ష ప్రసారం పెట్టుకుని, శేజారతి చూశాను. ఆరతి పూర్తయ్యేసరికి గం.10:50ని. అయ్యింది. ఆ సమయంలో మా చెల్లి, "అన్నయ్యా, భోజనం చేసేయొచ్చు కదా" అని అంది. నేను కాసేపట్లో ప్రత్యక్ష ప్రసారం ఆగిపోతుంది కదా, తరువాత తిందామనే ఉద్దేశ్యంతో బాబాని చూస్తూ ఉన్నాను. 11గంటలవుతుండగా, సరే, మొబైల్ పక్కన పెట్టుకుని, చూస్తూ భోజనం చేద్దామని కూర్చున్నాను. సాధారణంగా పదకొండు గంటలకి ప్రత్యక్ష ప్రసారం ఆగిపోవాలి. కానీ,11:10 దాటుతున్నా ఆగకపోయేసరికి, "ఏమిటి బాబా! నా భోజనం అయ్యేవరకు ఉంటారా ఏమిటి?" అని అనుకున్నాను. తరువాత ఐదు నిమిషాలకి సమాధిమందిరంలో లైట్లు ఆఫ్ చేస్తుంటే, ఇక ప్రత్యక్ష ప్రసారం ఆగిపోతుందని నేను నా మొబైల్‌లో ఆఫ్ చేయడానికి మొబైల్ తాకబోతుండగా అంతా చీకటిగా అయిపోయి, బాబా విగ్రహం, సమాధి మాత్రం బ్లాక్&వైట్ లోకి మారి ప్రత్యక్ష ప్రసారం అలానే వస్తోంది. ఒకవేళ ప్రత్యక్ష ప్రసారం స్టక్ అయిందేమోనని సందేహం వచ్చి, రెండు, మూడుసార్లు రిఫ్రెష్ చేసినా కూడా బాబా దర్శనం ఇస్తూనే ఉన్నారు. ఇక నేను కూడా ఆఫ్ చేయకుండా అలానే చూస్తూ ఉన్నాను. గం.11:30ని. దాటుతుండగా నా మనస్సులో, "బాబా! అక్కడ మీ బిడ్డ ఎవరో ప్రత్యక్ష ప్రసారం ఆఫ్ చేయడం మర్చిపోయినట్లున్నారు. పాపం, అనవసరంగా అతను తిట్లు తింటాడు బాబా" అని అనుకున్నాను. కాసేపటికి ఇక్కడ నా భోజనం పూర్తికావడం, అక్కడ ప్రత్యక్ష ప్రసారం ఆగిపోవడం రెండూ ఒక్కసారే జరిగాయి. బాబా నాపై చూపిన కరుణకు, ప్రేమకు ఆనందాశ్చర్యాలతో నా కళ్ళనుండి కన్నీళ్లు రాబోయాయి. కాని, మా చెల్లి వాళ్ళు 'ఎందుకు ఏడుస్తున్నావు?' అని అంటారని కంట్రోల్ చేసుకున్నాను. నిజానికి కొన్నిరోజులుగా, "బాబా నా మాటలు వింటున్నారా, లేదా?!" అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఈ రెండు అనుభవాల ద్వారా నా ప్రతి మాట తాను వింటున్నానని బాబా నిదర్శనం ఇచ్చారు.

2019, ఫిబ్రవరి 7, గురువారంనాడు నేను ఆఫీసునుండి తిరిగి వస్తూ బస్సులో కూర్చుని మొబైల్‌లో శిరిడీ ప్రత్యక్ష దర్శనం పెట్టుకుని హారతి చూస్తూ పాడుకుంటున్నాను. ఆశ్చర్యం! హారతి మొదలైన దగ్గరనుండి హారతి ముగిసి, తెరలు వేసి, ప్రత్యక్ష ప్రసారం ఆగిపోయేవరకు ఊదీ వాసన గుబాళించింది. ఆవిధంగా బాబా నన్ను ఆశీర్వదించారనిపించి సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

కొన్నిరోజుల క్రిందట ఒకసారి నేను షర్ట్ తీసుకుందామని ఒక షాపుకి వెళ్ళాను. అక్కడ నాకు ఒక ఆక్సమ్‌బర్గ్ షర్ట్ బాగా నచ్చి, ధర చూస్తే చాలా ఎక్కువ ఉంది. అంతపెట్టి తీసుకోలేక తిరిగి వచ్చేసాను. ఒక వారం తరువాత వేరే షాపుకి వెళ్ళి షర్ట్స్ వెతుకుతూ ఉంటే, వారం క్రితం ధర ఎక్కువ అని వదిలేసిన షర్ట్ లాంటి షర్టే ఉంది. షాపు అతనిని ధర ఎంతో చెప్పమంటే, "అది నాకోసమని ఉంచుకున్నాను. మీకు అదే నచ్చిందా?" అని అడిగాడు. మళ్ళీ తానే, "సరే, మీకు నచ్చింది కదా, తీసుకోండి" అని చాలా చాలా తక్కువ ధర చెప్పారు. నేను ఆశ్చర్యపోతూ ఆ షర్ట్ తీసేసుకున్నాను. ధర ఎక్కువ అని నేను వదిలేస్తే, బాబా నాకు అతితక్కువ ధరలో ఆ షర్ట్ ఇప్పించారు. "చాలా చాలా కృతఙ్ఞతలు బాబా".

బాబా ఇచ్చిన హామీ - మా పాప మాకు దక్కింది.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన స్వీయ అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సుమారు 5 సంవత్సరాల క్రితం జరిగిన నా అనుభవాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను.

నాకు 7వ నెలలోనే కాన్పు జరిగింది. పాప నెలలు నిండకుండానే పుట్టినందువల్ల తన బరువు 1.2 కేజీలు మాత్రమే ఉంది. అన్నిటికంటే భయానక విషయం ఏమిటంటే పాప పుట్టినప్పుడు తన ప్రేగులన్నీ బయటకు ఉన్నాయి. దాంతో డాక్టర్లు మావారితో, "పాప జీవించే అవకాశం 0.001% మాత్రమే ఉంది. కాబట్టి తనకి మెర్సీ ఇంజెక్షన్ ఇవ్వడం మంచిది. ఒకవేళ ఆపరేషన్ కనుక చేయించాలని మీరు అనుకుంటే, అందుకు 2 నుండి 3 లక్షల వరకు ఖర్చవుతుంది. అయినా ఆపరేషన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందువలన అంతా వృధా ప్రయత్నం. మేము ఇలాంటి కేసులు చూస్తూనే ఉంటామ"ని చెప్పారు. మావారు వాళ్ళు చెప్పేదేమీ వినిపించుకోకుండా, "ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. పాపకి ఆపరేషన్ చేయండి" అని చెప్పారు. దాంతో డాక్టర్లు పెద్ద మందుల జాబితా ఒకటి రాసి, మావారి చేతిలో పెట్టి, వాటిని వెంటనే తీసుకుని రమ్మని చెప్పారు. వెంటనే మావారు ఆలస్యం చేయకుండా హాస్పిటల్ కాంపౌండులో ఉన్న మందులషాపుకి పరుగులు తీసారు.

అప్పటికే మావారు చాలా కృంగిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో మందులిచ్చే వ్యక్తి కోసం ఎదురుచూస్తుండగా, ఎవరో వెనకనుండి భుజంపై తట్టడంతో తను వెనక్కి తిరిగి చూస్తే, బాబా ఎరుపురంగు కఫ్నీ ధరించి తమ నిజరూపంలో నిలబడి ఉన్నారు. మావారు ఆశ్చర్యంతో చూస్తుండగా, బాబా, “బిడ్డా! నీ బిడ్డకి ఏ హానీ జరగదు. తన విషయంలో నేను జాగ్రత్త తీసుకుంటాను” అని చెప్పారు. అలా చెప్పిన మరుక్షణంలో ఆయన అదృశ్యమైపోయారు. మావారు ఇక మా పాపకి ఏమీ జరగదన్న నమ్మకంతో చాలా సంతోషంగా మందులు తీసుకుని హాస్పిటల్‌‌కి వెళ్లారు. డాక్టర్లు, “మీరు చాలా అదృష్టవంతులు. డాక్టర్ శర్మగారు సిటీలోనే ఉన్నారు. ఆయన తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఈరోజే ఢిల్లీకి వెళ్ళాల్సి ఉంది. అయినప్పటికీ మీ పాపకి ఆపరేషన్ చేసేందుకు ఆయన అంగీకరించారు” అని చెప్పారు.

తరువాత మేమెంతో ఆశగా శర్మగారి రాకకోసం ఎదురుచూస్తుండగా, సుమారు 70 సంవత్సరాల వయస్సున్న ఒక వృద్దుడు ఆపరేషన్ థియేటర్ వైపు వెళ్ళడం చూసాము. ఆయన చేతులు వణుకుతూ ఉన్నాయి. కొంతమంది డాక్టర్లు లోపలినుండి బయటకి వచ్చి ఆయనకి స్వాగతం చెప్తుంటే, ఆయనే డాక్టరు శర్మ అని మేము గ్రహించాం. నేను మావారితో, "ఆయన చాలా పెద్దవయస్సు వ్యక్తిలా కనిపిస్తున్నారు. పైగా ఆయన వణికిపోతున్నారు. ఇక అరచేతిలో ఒదిగిపోయే బొమ్మలాంటి మన పాపకి ఆయనెలా ఆపరేషన్ చేయగలరు?" అని నా సందేహాన్ని వ్యక్తపరిచాను. ఇంతలో ఆపరేషన్ మొదలుపెట్టే ముందు మరొకసారి డాక్టర్లు మావారితో, "పాప బ్రతికేందుకు పెద్దగా ఆశలు లేవు. కేవలం 0.001% మాత్రమే, అంటే పూర్తిగా లేనట్టే" అని చెప్పేసారు.

కొంతసేపటికి ఆపరేషన్ పూర్తై డాక్టరు శర్మ నవ్వుతూ బయటకి వచ్చి, ఆపరేషన్ విజయవంతమైనందుకు మావారికి శుభాకాంక్షలు తెలిపారు. మిగతా వైద్యులంతా చాలా ఆశ్చర్యానికి లోనై మూగబోయారు. మాకు తెలుసు! మా పాపకి ఆపరేషన్ చేసిన ఆ వృద్ధ డాక్టరు మరెవరో కాదు, డాక్టరు సాయియే. సాక్షాత్తూ ఆ సాయినాథుడే స్వయంగా వచ్చి మా పాపకి ఆపరేషన్ చేసారు. అందుకే మా పాపకి 'సాయినా' అని పేరు పెట్టుకున్నాం. మా పాప మాకు సాయినాథుడు ప్రసాదించిన అపురూపమైన కానుక.

ఇప్పుడు మా పాపకి 5 సంవత్సరాలు. చాలా ఆరోగ్యంగా ఉంది. అదొక్కటే కాదు, తను చిన్నతనంనుండి బాబా భక్తురాలు. తనకి మరాఠీలో ఉండే బాబా ఆరతి పాటలు, భజనలు చక్కగా వచ్చు. చాలాసార్లు తను మంచి నిద్రలో ఉన్నప్పుడు 'సాయి సాయి సాయి' అని కలవరిస్తూ ఉంటుంది. బాబా తమ దివ్యహస్తాలతో మా పాపకి ఆపరేషన్ చేసి ప్రాణదానం చేసారు.

సాయి దీవెనలతో మా వారికి ఉద్యోగం వచ్చింది.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్. మా అనుభవాలను పంచుకోవడానికి, సాయిపట్ల మా విశ్వాసాన్ని పటిష్ఠం చేసుకోవడానికి అద్భుతమైన బ్లాగులు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. సాయి లీలలను కేవలం మాటలలో వివరించలేము.

సాయి నా జీవితంలోకి 2018, జనవరిలో వచ్చారు. నిజంగా ఆయన రావడం న్యూ ఇయర్ బహుమతి అని నా నమ్మకం. ఆరోజు నుంచి సాయిపై నా విశ్వాసం పెరగడం ప్రారంభమైంది. ఆ సమయంలో నేను కఠినమైన పరిస్థితుల నడుమ చాలా ఆందోళనలో ఉన్నాను. నా భర్త తన ఉద్యోగాన్ని కోల్పోయి ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నారు. దానికి తోడు అనేకమైన వ్యక్తిగత సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో 'నవ గురువార వ్రతం' గురించి తెలిసి మేమిద్దరం వ్రతం మొదలుపెట్టాం. కానీ, తరువాత కూడా నెలలు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. 41 రోజుల సాయి పూజ కూడా చేసాము. అయినా కూడా పరిస్థితి మారలేదు. నిజంగా నేను ఆ సమయంలో నిరాశకు గురయ్యాను. అయితే విశ్వాసాన్ని కోల్పోకుండా సాయి దయతో సచ్చరిత్ర చాలాసార్లు చదివాను. ఒక్క ఆశాకిరణం కూడా కనపడనప్పటికీ, బాబా ఆ పరిస్థితులనుండి మమ్మల్ని రక్షిస్తారనే నమ్మకం ఉండేది. చివరికి అదే నిజమైంది. నా భర్తకి ఒక్క ఇంటర్వ్యూ కూడా లేకుండా టాప్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దానితోపాటు మా వ్యక్తిగత జీవితాలలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఆ కష్టసమయంలో సాయి శక్తిని మేము పూర్తిగా అనుభవించాం. మాకు ఆదాయం లేకపోయినా, ఇంకే ఇతర వనరులు కూడా లేనప్పటికీ, సాయి దయతో మేము మా జీవితాలను ఇబ్బంది పడకుండా నడపగలిగాము.

జూలై 5, గురువారంనాడు నా భర్త తన క్రొత్త ఉద్యోగంలో చేరారు. నిజంగా అది సాయి దీవెనే. ఉద్యోగం చేసే చోట తనకి వసతి విషయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ తన బిడ్డకు ఏమి అవసరమో సాయికి బాగా తెలుసు, అందుకు తగిన ఏర్పాట్లు ఆయనే చేసారు. అదే రోజు మా వారికి 'ఓం సాయిరామ్' అనే భవంతిలో వసతి దొరికింది. అన్నీ బాబా చేసే అద్భుతాలే అని నాకు తెలుసు. ఆయన చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకు తెలియడంలేదు.

నేను ఒక విషయం బాగా అర్థం చేసుకున్నాను. బాబా ఖచ్చితంగా కఠినమైన పరిస్థితులనుండి మనల్ని రక్షిస్తారు. అయితే మనం సహనం, విశ్వాసాలతో ఉండాలి. మనము ఈ రెండూ కలిగి ఉండి, దేనికీ భయపడకుండా అన్నీ ఆయనకే విడిచిపెడితే ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ అనుభవాన్ని చదివే వాళ్ళందరికీ నేను చెప్పేదొక్కటే. సాయి సచ్చరిత్ర ఒక అద్భుతం. అది మన ఆందోళనలను దూరం చేసి మానసిక ధైర్యాన్నిస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. "బాబా! మేము మీ పాదాలకు శరణాగతి చెందుతున్నాము. దయచేసి ఎల్లప్పుడూ మాతో ఉండండి". శ్రీసాయిబాబా, హనుమంతులకు వేల వేల ప్రణామాలు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo