శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
నిగూఢమైన సాయితత్త్వ సాగరగర్భంలో దాగిన ఆణిముత్యాలు
- (1990లో పూజ్యశ్రీ బాబూజీ సత్సంగ భాషణకు అక్షరరూపం)“నా చర్యలు అగాధాలు. ఎవరైతే నా లీలలను మననం చేస్తూ అందులోనే మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి” అన్నారు శ్రీ సాయిబాబా. సద్గురు వాక్యానికి, వారి చర్యలకు అనంతమైన అర్థాలు, అర్థవంతమైన 'పర'మార్థాలు ఉంటాయి. నిగూఢమైన సాయితత్త్వ సాగరగర్భంలో దాగిన ఆణిముత్యాలెన్నో. అందులోని శ్రీసాయి'పర'మైన తత్త్వం మానవాళికి వరమైన అమృతతత్త్వం. ఆ అమృతతత్త్వాన్ని మనకు అందించిన శ్రీబాబూజీ సత్సంగ భాషణం పాఠకుల ముందుంచటం జరిగింది. ఆ క్రమంలో శ్రీ బాబూజీ 1990వ దశకంలో చేసిన సత్సంగానికి అక్షరరూపమిది. అవధరించండి!
సాయిబాబా అగాధతత్త్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వారకామాయిలో కూర్చున్న సాయిబాబా లక్ష్మీబాయిషిండే తెచ్చిన నైవేద్యాన్ని కుక్కకు వేసి, "దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే" అన్నారు. ఆత్మారాం తర్ఖడ్ భార్య ఎక్కడో కుక్కకు రొట్టెముక్క పెడితే - సాయిబాబా “నాకు రొట్టె పెట్టావమ్మా” అన్నారు. శ్రీమతి ఖపర్డే కుక్కను కొడితే, తమనే కొట్టినట్లు చెప్పారు. వెంటనే మనమేం అనుకుంటాము? సాయిబాబా ఆయా జీవాల రూపం ధరించారనుకుంటాం. ఆయనేమీ ప్రత్యేకంగా కుక్క రూపంగానీ మరేజీవి రూపంగానీ ధరించలేదు. అక్కడ రోజూ తిరుగుతున్న కుక్కే అది. ఉబ్బస వ్యాధిగ్రస్తుడైన హంసరాజ్ పుల్లపెరుగు తినకుండా చేసేందుకు పిల్లి వచ్చి రోజూ పెరుగు తినేది. అక్కడ కూడా సాయిబాబా ఆ పిల్లి రూపం ఎత్తలేదు. అది రోజూ ఆ ఇంట్లో తిరుగుతున్న పిల్లే. మూగజీవాలను కొడితే మసీదులో ఉన్న తన వీపు మీదనే ఆ వాతలను చూపించారు. అలా అన్ని ప్రాణుల రూపంలోనూ నేనే సంచరిస్తూ ఉన్నాను అని అనుభవపూర్వక నిదర్శనం ఇచ్చిన సాయిబాబా స్థితి ఏమై ఉండాలి? అన్ని జీవుల రూపంలో ఉన్నది ఒకే చైతన్యమైతే ఆ విషయాన్ని గుర్తింపు కలిగి ఉండడమెట్లా? నా రూపంలో ఉండి మాట్లాడుతూ, మీ రూపంలో ఉండి వింటూ - రెంటినీ కలిపి సాక్షిగా చూస్తూ ఉన్న ఆ తత్త్వం ఎటువంటిదై ఉండాలి? ఈ విషయం అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. సులభంగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెపుతాను. ఇప్పుడు మనమందరము ఇక్కడ ఇలా కూర్చుని ఉన్నాము. రేపో, ఎల్లుండో ఇంటికి వెళతాము. వెళ్ళిన కొద్దిరోజులకు ఇక్కడ జరిగినదంతా జ్ఞప్తికొస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మనకు? కళ్ళు మూసుకుని ఊహించినట్లయితే ఈ గది, ఇక్కడ కూర్చున్న సాయిభక్తులు, ఈ పరిసరాలు అంతా మనసులో ఓ చలనచిత్రంలాగా కనబడతాయి. ఒక ఘట్టం గురించి, ఒక సందర్భం గురించి - ఇలా చేసాను గదా, అంత బాగుంది, అలా జరిగింది - అని మనము ఊహిస్తున్నాము. ఆలోచన సాగుతోంది. ఆ మనసుకొచ్చిన ఊహాచిత్రంలో మీరూ ఉంటారు. మనసులో మెదిలో ఆలోచనలో మిమ్ములను మీరు చూస్తున్నారు. ఊహలోనిదంతా మనసుకు సంబంధించినదే. ఏదీ బయటనుంచి రాలేదు. అక్కడున్న వ్యక్తుల రూపము, జడపదార్థాల రూపం- అన్నింటినీ మన మనస్సే ధరిస్తూ, దాంట్లో మనమూ ఒక భాగంగా ఉంటూ, ఈ మొత్తాన్ని మనసే మరలా సాక్షిగా చూస్తోంది. కానీ, సామాన్యంగా అలా చూస్తున్న గుర్తింపు ఉండదు. ఆ ఊహల్లో మనము తాదాత్మ్యం చెందుతాము.
అందుకే సాయిబాబా సూక్తులు చూసినట్లయితే, ఒకచోట - "నేను నిష్క్రియుడను, కేవలం సాక్షీభూతుడను” అంటారు. మరొకచోట - "అన్నీ చేసేది నేనే, అన్నీ నేనే” అంటారు. ఒకసారి - “అల్లాయే యజమాని” అంటే మరొకసారి - "నేనే అల్లాను” అంటారు. ఈ పరస్పర విరుద్ధమైన సాయిబాబా మాటల్లోని అంతరార్థమేమిటి? ఈ విషయాన్నే ఇంకొంచెం విపులంగా పరిశీలిద్దాం.
రచయిత నవల రాస్తున్నాడు - సీరియల్ వస్తోంది. ఇంతవరకూ చదివిన వాడికి ముందేమి జరుగుతుందో అని Tension గా ఉంటుంది. కథ నడిపే రచయితకు Tension ఉండదు. ఎందుకంటే నవల మొత్తం తన కల్పనే కదా? సినిమా చూస్తున్నాము, విలన్ పిస్టల్ తీస్తాడు. వాడు ట్రిగ్గర్ నొక్కుతాడేమో, హీరో చస్తాడేమో - అని చూసే వాళ్లకు టెన్షన్, కాని వాడు ట్రిగ్గర్ నొక్కడనే విషయం డైరెక్టర్‌కు తెలుసు. మధ్యలో ఏదో మెలిక పెడతాడన్నమాట. అందుకే డైరెక్టర్‌కు టెన్షన్ ఉండదు. డైరెక్టర్ ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు. అలా ఈ సృష్టి అంతా ఎవరి రచనో - ఎవరి మనసులో జనించిన ఊహో - ఆయన యొక్క ఆజ్ఞ లేక ఆకు కూడా కదలదు. సాయిబాబా “నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు” అనడంలో గూఢార్థమదే. అలా తానే సృష్టికర్తనని, అంతా నిండివున్న చైతన్యం తానేనని చెప్పకనే చెప్పారు సాయిబాబా.
ఈ సృష్టి అనే నవల సాయిబాబా యొక్క రచన. నవలలోని పాత్రలు, దేశకాల పరిస్థితులు ఆ నవలాకారుని మనసే అయినట్లు, ఈ సృష్టి, మనము అంతా సాయిబాబా అనే నవలాకారుని మనసులోని భాగాలే. ఇంతకుముందు ఉదాహరణ చెప్పుకున్నట్లు ఇపుడు మనమిలా కూర్చుని ఉన్న సంఘటన ఆ తరువాత మీ మనసుకొచ్చినపుడు ఇప్పటి ఈ దేశకాల పరిస్థితులు, ఇక్కడ కూర్చుని ఉన్న వ్యక్తులు, అందులోని మీరు, వీటి అన్నింటిని చూసే సాక్షి మీ మనసే అయినట్లు ఈ సృష్టి అంతా సాయిబాబా మనసులోని సంకల్పమే అవుతుంది. “ఊహించే మీకు, మీ ఊహల్లోని మీకు ఉన్న సంబంధమే అల్లాకు సాయిబాబాకు ఉన్న సంబంధం.”
కాబట్టి శిరిడీలో ఆ ఐదున్నర అడుగుల శరీరంలో ఉంటూనే, అన్ని జీవులలోనూ ఉన్నారాయన. అన్నిజీవుల రూపంలో చరిస్తూ ఉంటారాయన. ఆకు కదలాలన్నా ఆయన సంకల్పం అవసరం. ఈ సూక్ష్మం అర్థం ఐనపుడే పరస్పర విరుద్ధమైనవిగా కనిపించే సాయిబాబా మాటలకు సమన్వయం కుదురుతుంది.
ఈ అవగాహన మనసుకు వచ్చిన తరువాత సాయిబాబా చరిత్ర చదవటం మొదలుపెడితే - ఎంతో కొత్తగా ఉంటుంది. ఇంతకుముందు చేసిన పారాయణకు, ఈ అవగాహనతో, ఈ జిజ్ఞాసతో చేసే పారాయణకు హస్తిమశకాంతము తేడా ఉంటుంది.
చైతన్యానికి ఒక గుణమంటూ లేదు కనుక అది నిర్గుణము. అంతటా నిండిన చైతన్యానికి ఏ రూపమూ లేదు. అందుకే అది నిరాకారం. మరి ఆ చైతన్యం ఎట్లా ఉంటుందంటే చైతన్యం రూపంలోనే ఉంటుంది. చైతన్యానికి రూపమంటూ ఉంటే, ఆ రూపానికి అది పరిమితం కావాలి. ఇంకో రూపం ధరించే అవకాశం లేదు. చైతన్యానికి ఏ రూపమైనా ధరించే శక్తి ఉంది. అది ఏ రూపానికీ పరిమితం కాదు.
మీరు ఇంకో రూపం ధరించండి చూద్దాం. వీలుకాదు. ఈ పుస్తకం కానీ, కలం కానీ, ఏ వస్తువుకైనా ఒక నిర్ణీత రూపముంటుంది. కాబట్టి - అవి మరొక రూపాన్ని ధరించలేవు. మనసుకు ఏ రూపం లేదు. కనుకనే ఏ రూపం పడితే ఆ రూపాన్ని ధరిస్తుంది, నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపం ధరించినట్లు. అలాగే ఏ రూపమూ లేని చైతన్యమే ఏ రూపం కావాలంటే ఆ రూపం సంకల్పానుసారం ధరిస్తుంది.
ఒక స్వప్నం వచ్చిందనుకుందాం - ట్రైన్‌లో వెళుతున్నట్లు, దొంగలు రైలెక్కి దోచుకున్నట్లు. ఆ స్వప్నంలోనే ట్రైన్, దాని కదలిక, దాంట్లో మనం, దొంగలు రావడం, మనలను కొట్టి దోచుకోవడం, భయం, బాధ అన్నీ అనుభవమవుతున్నాయి. అక్కడ మన శరీరానికి నిజంగా దెబ్బ తగిలిందా? ఏ రూపమూ లేని మనసే అన్ని రూపాలు ధరించిందక్కడ. ఎంతగా ధరించిందంటే - మీరు దెబ్బలు తిన్నంత అనుభవం మీకు వచ్చేంతగా. కలలో జరిగిన సంఘటనలకు, మనకు ఎంత సంబంధం ఉన్నదో - అదే సంబంధం - శిరిడీలోని సాయిబాబా రూపానికి, అంతటా నిండిన చైతన్యానికి ఉంది.
కాబట్టి ఏ రూపమూ లేదు కనుకనే, ఆయన అన్ని రూపాలు ధరించారు. అంతటా ఉన్న చైతన్యం అదే కనుక - ఏ రూపంలో చూసినా మనకు సాయిబాబా యొక్క తత్త్వం కనిపించాలి.
అయితే సాయిబాబా రూపానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉన్నదని నా అనుభవం. మీరు కూడా గమనించండి. సాయిపూజ, చరిత్ర పారాయణ శ్రద్ధగా చేసేవాళ్ళకు ఇది అనుభవం అవుతుంది. ఏదైనా ఊరికి గాని, ఒక ఇంటికి గాని వెళ్ళామనుకోండి, ఉన్నట్లుండి సాయిబాబా మనసుకు వచ్చి, మనసులో ఒక మార్పు వచ్చి నిశ్చలమవుతుంది. ఏమిటా అని జాగ్రత్తగా గమనిస్తే - ఎక్కడో ఒకచోట కనీసం ఒక స్టిక్కర్ రూపంలోనన్నా సాయిబాబా ఫోటో కనిపిస్తుంది. అట్లా ఎందుకు అవుతుంది అన్నది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది.
ఒక్కటి మాత్రం స్పష్టం. ఈ సృష్టిలో సాయి రూపానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే సాయిబాబా అన్నారు - “నన్ను కేవలం ఆనందస్వరూపంగా ధ్యానించు. అది చేతగాకపోతే కనబడే నా ఈ రూపాన్ని ధ్యానించు!” అని.
"ఈ జీవితం మాయ, మిథ్య, అసత్యం, నిరుపయోగమైనదని త్రోసిపుచ్చవద్దు. జీవితంలో సంపూర్ణంగా పాలుపంచుకోవడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక సాధనలో గమ్యం చేరడానికి ప్రాపంచిక జీవితం, అవసరాలు, కోరికలు ఎవరికైనా అడ్డేమో కాని, సాయి భక్తునికి అవి అడ్డుకావు"
- పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ.
"నన్ను అనన్యంగా ప్రేమించేవారు, నన్నెప్పుడూ తమ ఎదుట దర్శిస్తూనే ఉంటారు. నేను లేనిదే వారికి లోకం ఉండదు. వారి పెదవులపైన కేవలం నా కథలే ఉంటాయి. నిరంతరం వారు నన్నే చింతన చేస్తుంటారు. వారి నాలుకపై నా నామమే ఉంటుంది. నా నామాన్నే జపిస్తుంటారు. వారు నా లీలలను కీర్తిస్తుంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా నా కార్యాలనే పాడుతుంటారు. వారు నాలో అలా పూర్తిగా లయించిపోతారు. తమ కార్యకలాపాలన్నింటినీ మరచిపోతారు. నా సేవయందే ఆదరంతో తత్పరులై ఉంటారు. అలాంటి వారుండే చోట నేనుంటాను. నన్ను పూర్తి శరణాగతి చేయాలి. నన్ను నిరంతరం స్మరించాలి. అప్పుడు నేనతనికి ఋణగ్రస్తుడనౌతాను. అతన్ని ఉద్ధరించి నేను ఋణవిముక్తుడనౌతాను. నాకు ముందుగా సమర్పించి ఆ తర్వాతే అన్నపానీయాలు గ్రహించే వారికి నేను బద్ధుడనౌతాను. నన్ను నిరంతరం ధ్యానించే అలాంటి వారి కోరికలు నేను తీరుస్తాను. నా కోసమే పరితపించే నా భక్తుల యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. వారికన్నా మించిన భక్తులు నాకెవరూ ఉండరు. నాకు మించిన దైవం కూడా వారికెవ్వరూ ఉండరు. నేను వారి ఆధీనంలో వర్తిస్తాను."
- సాయిబాబా
Om Sai Ram 🙏🌹🙏
ReplyDelete🕉 sai Ram
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete