సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

వెళ్లిన ప్రతిచోటా దర్శనమిస్తూ పర్యటనను పూర్తి చేయించిన బాబా




నేను ఒక సాయి భక్తురాలిని. సాయిబంధువులందరికీ నమస్కారం. బాబా కృపతో శిరిడీలో నిర్వహించే దివ్య పారాయణంలో నేను కూడా భాగస్వామినయ్యాను. దివ్య పారాయణ మొదలుపెట్టిన మొదటి గురువారంనాడు రోజా పువ్వులు, చామంతి పువ్వులతో బాబాకి పూజచేసి ముడుపు కట్టాను. మరుసటిరోజు దేవుని వద్ద శుభ్రం చేస్తూ, ముందురోజు పెట్టిన పువ్వులు తీస్తుండగా వేపాకు కనిపించింది. అది అక్కడికెలా వచ్చిందా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను పువ్వులు మాత్రమే ఏరుకొచ్చి బాబాకు పెట్టాను. ఆ పువ్వులలో పొరపాటుగా వేపాకు కలిసి రావడానికి మా ఇంట్లో వేపచెట్టు కూడా లేదు. కాబట్టి అది బాబా చేసిన చమత్కారమే! అప్పుడు నాకర్థమైంది, బాబా వేపాకు కానుకగా ఇచ్చి నా కోరికని ఆమోదించారని. ఇక నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.

తరువాత 2018, డిసెంబర్ నెల మొదటివారంలో మా కుటుంబమంతా కాణిపాకం, తమిళనాడు యాత్రలకి వెళ్ళాము. ముందుగా కాణిపాకంలో వినాయకుడి దర్శనం చేసుకున్నాము. తరువాత అక్కడ షాపింగ్ చేస్తుండగా బాబా పెద్ద విగ్రహరూపంలో దర్శనమిచ్చారు. బాబా మాకు తోడుగా ఉన్నారని ఎంతో ఆనందంగా అనిపించింది. తరువాత అక్కడికి దగ్గరలో ఉన్న అర్ధగిరిలో ఆంజనేయుడి దర్శనం చేసుకొని, అరుణాచలం వెళ్ళాము. కార్తీకమాసం చివరివారం కావడంతో బాగా జనం ఉన్నారు. అందువలన స్వామి దర్శనం మాకు కాలేదు. కానీ, అమ్మవారి దర్శనం, కార్తీక మహాదీప దర్శనం చేసుకున్నాం. తరువాత రూమ్ కోసం ఎంతగా ప్రయత్నించినా రూమ్ దొరకలేదు. కాస్త డబ్బు ఎక్కువైనా పర్వాలేదు అనుకున్నా కూడా దొరకలేదు. ఎక్కడో ఒకటి ఉన్నా కూడా మూడవ అంతస్తులో ఉన్నాయి. పోనీ అక్కడే దిగుదామనుకున్నా  అక్కడ లిఫ్ట్ సదుపాయం లేదు. మా అమ్మ తన మోకాళ్ళ నొప్పులతో మూడు అంతస్తులు ఎక్కలేదు. అందువలన ఆ రాత్రి అక్కడ ఉండటానికి కుదరక కంచి వెళ్ళిపోదామని రాత్రి 11 గంటల సమయంలో బయలుదేరాం. దారిలో ఒకచోట టీ త్రాగడానికి మా కారు ఆపి మా వాళ్ళు కిందకి దిగారు. అప్పుడు సమయం 3 గంటలై ఉండొచ్చు. నేను మంచి నిద్రలో ఉండగా, మా అమ్మ, "చూడు! నీ పక్కన మూడు బాబా ఫోటోలున్నాయి" అంటూ నన్ను లేపింది. వెంటనే నేను ఉలిక్కిపడి లేచి చూస్తే, అభయమిస్తున్న భంగిమలో ఉన్న మూడు పెద్ద బాబా ఫోటోలున్నాయి. నేను ఆశ్చర్యపోయాను. రోడ్డు ప్రక్కన ఆరుబయట బాబా ఫోటోలు ఉండటమేమిటి? సరిగ్గా బాబా ఫోటోల ప్రక్కనే మా కారు ఆపడమేమిటి? పోనీ, మా డ్రైవర్ బాబా ఫోటోలు చూసి అక్కడ ఆపాడనుకుందామంటే, 'అసలు అతను బాబా భక్తుడే కాదు కదా!' అని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏదేమైనా రూమ్ దొరకక మేము పడుతున్న కష్టానికి బాబా 'నేనున్నాన'ని అభయమిస్తున్నారనిపించింది నాకు. కాసేపు అలానే బాబాని చూస్తూ మరలా నిద్రపోయాను.

కొద్దిసేపటికి కంచి చేరుకున్నాము. మావారు, అతని స్నేహితుడు రూమ్ కోసం వెళ్లారు. కానీ, ఎంత వెతికినా కంచిలో కూడా మాకు రూమ్ దొరకలేదు. ఇక మావారు ఈ రాత్రికి సత్రంలో ఐనా ఉందామని నిర్ణయించుకుని అక్కడ మాట్లాడటానికి వెళ్లారు. నాకు మాత్రం సత్రంలో ఉండడం ఏమాత్రం ఇష్టంలేదు. నేను, మా అమ్మ, మా బాబు కారులో ఉన్నాం. మా నాన్న అప్పుడే కారు దిగారు. ఆ మరుక్షణమే ఒకాయన వచ్చి, "మీరు రూమ్ కోసం వెతుకుతున్నారు కదా?" అని అడిగాడు. ఆ మాట వింటూనే నాకు మెలకువ వచ్చింది. 'అవును' అన్నాడు నాన్న. ఆయన, "నాతో రండి, మీకు దేవస్థానం రూమ్ ఇప్పిస్తాను" అన్నాడు. మేము షాక్ అయ్యాం. ఎందుకంటే అంతకుముందే మావారు అక్కడకు వెళ్లి అడిగితే 'రూమ్స్ లేవ'ని చెప్పారు. మావారు రాగానే ఆయన మమ్మల్ని తమ వెంట రమ్మని అన్ని సదుపాయాలు ఉన్న ఒక మంచి రూమ్ చూపించి వెళ్లిపోయారు. తరువాత మళ్ళీ ఆయన కనిపించలేదు. ఆయన బాబానే! కంచి చేరడానికి ముందే ఫోటో రూపంలో కనిపించి అభయమిచ్చారు. మరల ఆ వ్యక్తి రూపంలో రూమ్ చూపించి సహాయం చేసారు. తరువాత మా నాన్న కూడా, "ఆయన ఖచ్చితంగా బాబానే!" అని అన్నారు.

మేము కంచిలో దర్శనం చేసుకున్నాక తిరుత్తణి వెళ్ళాము. అక్కడ కూడా బాబా మాకు చాలా సహాయం చేసారు. ఆరోజు ఆదివారం కావడంతో చాలా జనం ఉన్నారు. దర్శనం ఆలస్యం అవుతుంది, అమ్మ అంతసేపు లైన్లో ఉండలేదని చాలా ఆందోళనపడ్డాం. కానీ బాబా అద్భుతమే చేసారు. అక్కడున్న ఒక పోలీసు ఉద్యోగి తనంత తానుగా మేమెవరో అతనికి తెలియకపోయినా మాతో ఆప్యాయంగా మాట్లాడి, స్టేషన్లో కూర్చోబెట్టి మరీ మాకు మర్యాదలు చేసి మమ్మల్ని నేరుగా గర్భగుడిలోనికి తీసుకుని వెళ్లి కేవలం 5 నిమిషాల్లో దర్శనం చేయించారు. ఆ విషయం తలుచుకుంటే నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది.

చివరగా మేము తిరువళ్ళూరు వెళ్ళాము. అక్కడ కూడా బాబా ఫోటో రూపంలో దర్శనమిచ్చారు. ఇలా మేము వెళ్లిన ప్రతిచోటా బాబా దర్శనమిస్తూ మా పర్యటనను పూర్తి చేయించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo