సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా ఇచ్చిన హామీ - మా పాప మాకు దక్కింది.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన స్వీయ అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సుమారు 5 సంవత్సరాల క్రితం జరిగిన నా అనుభవాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను.

నాకు 7వ నెలలోనే కాన్పు జరిగింది. పాప నెలలు నిండకుండానే పుట్టినందువల్ల తన బరువు 1.2 కేజీలు మాత్రమే ఉంది. అన్నిటికంటే భయానక విషయం ఏమిటంటే పాప పుట్టినప్పుడు తన ప్రేగులన్నీ బయటకు ఉన్నాయి. దాంతో డాక్టర్లు మావారితో, "పాప జీవించే అవకాశం 0.001% మాత్రమే ఉంది. కాబట్టి తనకి మెర్సీ ఇంజెక్షన్ ఇవ్వడం మంచిది. ఒకవేళ ఆపరేషన్ కనుక చేయించాలని మీరు అనుకుంటే, అందుకు 2 నుండి 3 లక్షల వరకు ఖర్చవుతుంది. అయినా ఆపరేషన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందువలన అంతా వృధా ప్రయత్నం. మేము ఇలాంటి కేసులు చూస్తూనే ఉంటామ"ని చెప్పారు. మావారు వాళ్ళు చెప్పేదేమీ వినిపించుకోకుండా, "ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. పాపకి ఆపరేషన్ చేయండి" అని చెప్పారు. దాంతో డాక్టర్లు పెద్ద మందుల జాబితా ఒకటి రాసి, మావారి చేతిలో పెట్టి, వాటిని వెంటనే తీసుకుని రమ్మని చెప్పారు. వెంటనే మావారు ఆలస్యం చేయకుండా హాస్పిటల్ కాంపౌండులో ఉన్న మందులషాపుకి పరుగులు తీసారు.

అప్పటికే మావారు చాలా కృంగిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో మందులిచ్చే వ్యక్తి కోసం ఎదురుచూస్తుండగా, ఎవరో వెనకనుండి భుజంపై తట్టడంతో తను వెనక్కి తిరిగి చూస్తే, బాబా ఎరుపురంగు కఫ్నీ ధరించి తమ నిజరూపంలో నిలబడి ఉన్నారు. మావారు ఆశ్చర్యంతో చూస్తుండగా, బాబా, “బిడ్డా! నీ బిడ్డకి ఏ హానీ జరగదు. తన విషయంలో నేను జాగ్రత్త తీసుకుంటాను” అని చెప్పారు. అలా చెప్పిన మరుక్షణంలో ఆయన అదృశ్యమైపోయారు. మావారు ఇక మా పాపకి ఏమీ జరగదన్న నమ్మకంతో చాలా సంతోషంగా మందులు తీసుకుని హాస్పిటల్‌‌కి వెళ్లారు. డాక్టర్లు, “మీరు చాలా అదృష్టవంతులు. డాక్టర్ శర్మగారు సిటీలోనే ఉన్నారు. ఆయన తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఈరోజే ఢిల్లీకి వెళ్ళాల్సి ఉంది. అయినప్పటికీ మీ పాపకి ఆపరేషన్ చేసేందుకు ఆయన అంగీకరించారు” అని చెప్పారు.

తరువాత మేమెంతో ఆశగా శర్మగారి రాకకోసం ఎదురుచూస్తుండగా, సుమారు 70 సంవత్సరాల వయస్సున్న ఒక వృద్దుడు ఆపరేషన్ థియేటర్ వైపు వెళ్ళడం చూసాము. ఆయన చేతులు వణుకుతూ ఉన్నాయి. కొంతమంది డాక్టర్లు లోపలినుండి బయటకి వచ్చి ఆయనకి స్వాగతం చెప్తుంటే, ఆయనే డాక్టరు శర్మ అని మేము గ్రహించాం. నేను మావారితో, "ఆయన చాలా పెద్దవయస్సు వ్యక్తిలా కనిపిస్తున్నారు. పైగా ఆయన వణికిపోతున్నారు. ఇక అరచేతిలో ఒదిగిపోయే బొమ్మలాంటి మన పాపకి ఆయనెలా ఆపరేషన్ చేయగలరు?" అని నా సందేహాన్ని వ్యక్తపరిచాను. ఇంతలో ఆపరేషన్ మొదలుపెట్టే ముందు మరొకసారి డాక్టర్లు మావారితో, "పాప బ్రతికేందుకు పెద్దగా ఆశలు లేవు. కేవలం 0.001% మాత్రమే, అంటే పూర్తిగా లేనట్టే" అని చెప్పేసారు.

కొంతసేపటికి ఆపరేషన్ పూర్తై డాక్టరు శర్మ నవ్వుతూ బయటకి వచ్చి, ఆపరేషన్ విజయవంతమైనందుకు మావారికి శుభాకాంక్షలు తెలిపారు. మిగతా వైద్యులంతా చాలా ఆశ్చర్యానికి లోనై మూగబోయారు. మాకు తెలుసు! మా పాపకి ఆపరేషన్ చేసిన ఆ వృద్ధ డాక్టరు మరెవరో కాదు, డాక్టరు సాయియే. సాక్షాత్తూ ఆ సాయినాథుడే స్వయంగా వచ్చి మా పాపకి ఆపరేషన్ చేసారు. అందుకే మా పాపకి 'సాయినా' అని పేరు పెట్టుకున్నాం. మా పాప మాకు సాయినాథుడు ప్రసాదించిన అపురూపమైన కానుక.

ఇప్పుడు మా పాపకి 5 సంవత్సరాలు. చాలా ఆరోగ్యంగా ఉంది. అదొక్కటే కాదు, తను చిన్నతనంనుండి బాబా భక్తురాలు. తనకి మరాఠీలో ఉండే బాబా ఆరతి పాటలు, భజనలు చక్కగా వచ్చు. చాలాసార్లు తను మంచి నిద్రలో ఉన్నప్పుడు 'సాయి సాయి సాయి' అని కలవరిస్తూ ఉంటుంది. బాబా తమ దివ్యహస్తాలతో మా పాపకి ఆపరేషన్ చేసి ప్రాణదానం చేసారు.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo