సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఎప్పటికప్పుడు బాబా తమ ఉనికిని తెలియజేస్తూ మా విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నేను నా చిన్నతనంనుండి బాబా భక్తురాలిని.  నాకు ఆయన పట్ల అపారమైన నమ్మకం. "బాబా! మీ దివ్య పాదాలకు నా ప్రణామములు". ఆయన నాపై, మా కుటుంబంపై కురిపిస్తున్న ఆశీస్సులకు మేమెంతో అదృష్టవంతులుగా భావిస్తున్నాం. బాబా గురించి తెలియజేస్తున్న బ్లాగును నిజంగా 'ఆధునిక సచ్చరిత్ర' అనవచ్చు. ఇక్కడ సాయిభక్తులు తమ అనుభవాలను పంచుకోవడం వలన అందరికీ బాబా గురించి తెలుసుకునే అవకాశం ఉంది. బ్లాగు ద్వారా మా భక్తి విశ్వాసాలు కూడా పెంపొందుతున్నాయి. జీవితంలో వచ్చే ఒడిదుడుకులకు సహనం సన్నగిల్లే  సమయంలో మళ్లీ సహనాన్ని నిలదొక్కుకోవడానికి బ్లాగు ఎంతగానో సహకరిస్తుంది.

బాబా "నా భక్తులను ఎప్పుడూ నిరుత్సాహపరచను" అని ప్రామిస్ చేశారు. ఆయనిచ్చిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మొదటి అనుభవం:

ప్రతి గురుపౌర్ణమికి మేము శిరిడీ, షేంగాఁవ్, గాణ్గాపూర్, అక్కల్‌కోటకు డొనేషన్స్ పోస్టల్ ద్వారా పంపిస్తూ ఉంటాం. తద్వారా మాకు ఊదీ, ప్రసాదములు వస్తాయి. 2017లో డొనేషన్ పంపేముందు శిరిడీ నుండి రెండు ఊదీ ప్యాకెట్లు ఆశించి నేను నాన్నతో, "నా పేరు మీద ఒకటి, రెండవది సిస్టర్ పేరుమీద గాని, ఇంకెవరి పేరుమీద గాని రెండు డొనేషన్స్ కట్టమని" చెప్పాను. కానీ నాన్న పట్టించుకోకుండా ఒక పేరు మీద మాత్రమే డొనేషన్ కట్టారు. అయితే గజానన్ మహరాజ్, స్వామిసమర్థ, దత్తాత్రేయ మహరాజ్ ల వద్దనుండి ఊదీ, ప్రసాదాలు వచ్చాయి గాని, బాబా వద్దనుండి రాలేదు. ఏరోజుకారోజు ఈరోజు వస్తుందేమో అనుకుంటూ ఎంతగానో ఎదురుచూస్తూ ఉండేవాళ్ళం. ఇలా రెండు నెలలు గడిచినా గాని ఊదీ, ప్రసాదాలు రాలేదు. రెండునెలల తర్వాత నా పుట్టినరోజు వచ్చింది. సరిగ్గా ఆ సమయానికి శిరిడీ నుండి ఊదీ ప్రసాదాలు అందాయి. పైగా ఆరోజు నేను ఏ రంగు దుస్తులు వేసుకున్నానో, అదే రంగు దుస్తుల్లో బాబా మధ్యాహ్న సమయంలో దర్శనమిచ్చారు. ఆ విధంగా బాబా ఆశీస్సులు లభించాయని ఎంతో సంతోషపడ్డాను. అలా ఉంటాయి మన బాబా ప్రణాళికలు.

రెండవ అనుభవం:

నాకు ద్వారకామాయిలో రాతిమీద కూర్చున్న బాబా ఫోటో అంటే చాలా ఇష్టం. 2016వ సంవత్సరంలో నా పుట్టినరోజుకు రెండువారాల ముందు, "బాబా! నా పుట్టినరోజు నాడు మీ ఉనికిని తెలియజేయండి. నాకిష్టమైన మీ ఫోటోని పుట్టినరోజు బహుమతిగా నాకు ఇవ్వండి" అని ప్రార్థించాను. నా పుట్టినరోజు శనివారం అనగా గురువారంనాడు మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా మందిరానికి వెళ్ళాం. సాధారణంగా మేము ఉదయాన్నే బాబా గుడికి వెళ్తాం. కానీ ఆరోజు కొన్ని కారణాలవలన సాయంత్రం వెళ్ళాం. బాబా దర్శనమైన తరువాత అక్కడ కొంతసమయం కూర్చున్నాము. కాసేపటికి ఒకతను నన్ను పిలిచి ఒక క్యాలెండర్ ఇచ్చారు. మేము మా చిన్నప్పటినుంచి అదే గుడికి వెళుతున్నా, ఆరోజు వరకు ఎవరూ ఒక ఫోటోగ్రాఫ్ కానీ, మరింకేదిగానీ ఇవ్వలేదు. ఆరోజే ఎందుకు ఇచ్చారన్నది నాకు అర్థం కాలేదు. కానీ ఆ ఫోటో తెరచి చూసి ఆశ్చర్యపోయాను. అది బాబా రాతిమీద కూర్చుని ఉన్న ఫోటో. ఇక నా ఆనందానికి అవధుల్లేవు. నా బర్త్‌డే గిఫ్ట్ గా బాబా నేను అడిగిన రూపంలో వచ్చారు. ఇంకేం కావాలి ఆయన ఆశీస్సులు లభించాయి అనడానికి?

మూడవ అనుభవం:

ఒకరోజు పారాయణ పూర్తిచేసి బాబాకి నైవేద్యంగా రెండు కోవాబిళ్ళలు పెట్టి, బాబాకి హారతి ఇచ్చాను. ప్రసాదం తరువాత తీసుకుందాం అనుకుని ఆ విషయం పూర్తిగా మరచిపోయాను. కొంతసమయం తర్వాత నేను, మా సిస్టర్ టీవీ చూస్తుండగా ఎక్కడినుంచి వచ్చిందో గాని ఒక నల్లపిల్లి వచ్చింది. మేమిద్దరం కాస్త కంగారుపడినా, అదే వెళ్లిపోతుందని సైలెంట్ గా టీవీ చూస్తూ కూర్చున్నాము. కొంతసేపటికి ఆ పిల్లి దానంతట అదే వెళ్ళిపోయింది. ఆ తరువాత కొంతసేపటికి నాకు ప్రసాదం గుర్తొచ్చి, వెళ్లి చూస్తే ఒక  కోవాబిళ్ళ మాత్రమే ఉంది. రెండవది ఏమైందని చుట్టూ చూసాను. కానీ ఎక్కడా కనబడలేదు. మా సిస్టర్ ని అడిగితే తను, "నాకు తెలియదు" అంది. అప్పుడు కాసేపటి క్రితం వచ్చిన పిల్లి సంగతి గుర్తొచ్చి, అదే ప్రసాదం తిని వెళ్ళిపోయి ఉంటుందని నాకర్థమైంది. బాబా ఆ పిల్లి రూపంలో వచ్చి ప్రసాదం స్వీకరించారని నాకెంతో ఆనందంగా అనిపించింది. సాధారణంగా అప్పుడప్పుడు పిల్లి మా ఇంట్లోకి వస్తుంది కాని, ఎప్పుడూ పూజగదిలోకి వెళ్ళలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఎప్పటికప్పుడు మీ ఉనికిని తెలియజేస్తూ మా విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. మీరు లేని జీవితాన్ని నేనసలు ఊహించలేను. ఎప్పుడూ మాకు తోడుగా ఉండండి".  మనం శ్రద్ధ, సబూరితో ఆయనను ప్రార్థిస్తే,  చాలినంత ఆశీస్సులు మనకు లభిస్తాయి.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo