సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

భక్తులపై బాబా చూపే ప్రేమ అద్భుతం ... అనిర్వచనీయం.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిసోదరి నీత తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

నేను చిన్ననాటి నుండి బాబాకు వినయపూర్వకమైన భక్తురాలిని. గతంలో ఆయనిచ్చిన అనుభవాలతో రోజురోజుకి నా భక్తి విశ్వాసాలు రెట్టింపు అయ్యాయి. జీవితంలోని ప్రతి సందర్భంలో నేను బాబా కృపను అనుభూతి చెందుతున్నాను.

నా జీవితంలో 1999వ సంవత్సరంలో బాబా ఇచ్చిన అనుభవాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. రోజూ బాబాకి పూజ, ప్రార్థన చేశాక ఊదీ తీసుకోవడం మాకు అలవాటు. 4 సంవత్సరాల 5 మాసాల మా పాపకి కూడా శ్రీసాయిబాబా అంటే అమితమైన భక్తి, ప్రేమలు. తను ఎప్పుడూ “సాయిరాం ధున్” సంగీతాన్ని వింటూ ఉండేది. ఎప్పుడు తనకి తీవ్రంగా జ్వరం(104°C) వచ్చినా, "ఊదీ ఇవ్వమ"ని తను అడిగేది, దానితో ఇట్టే జ్వరం తగ్గుముఖం పట్టేది. అలాంటి మా పాపకి హఠాత్తుగా 1999, నవంబర్ 17న బ్లడ్ కాన్సర్(లుకేమియా) ఉందని తెలిసింది. మాకున్న ఒక్కగానొక్క పాపకి హఠాత్తుగా భయంకరమైన వ్యాధి ఉందని తెలియడంతో ఒక్కసారిగా కుటుంబమంతా కృంగిపోయాము. కానీ తనకి నయమైపోతుందని తను నమ్మకంతో ఉండేది. మేము కూడా సాయినే నమ్ముకున్నాము. తనకి టాటా మెమోరియల్ హాస్పిటల్ లో 10సార్లు బోన్ మారో చికిత్స చేసారు. ఒకరోజు అంత చిన్నవయస్సులో తను పడుతున్న అవస్థ చూడలేక నేను కన్నీరు కారుస్తుంటే, తను, “మమ్మా(అమ్మా), ఏడవకు! సాయిని ప్రార్థించు!” అని చెప్పింది. తనకి సాయి అంటే అంత ప్రేమ.

తరువాత ఒకసారి తను టాటా హాస్పిటల్లో ఉన్న సమయంలో నా భర్త స్నేహితులొకరు తనని చూడటానికి వచ్చారు. మాటల సందర్భంలో అతను శిరిడీ వెళ్తునట్టుగా చెప్పగా, అది వింటూనే మా పాప అతనితో తను కూడా శిరిడీ వెళ్తానని ఏడవడం మొదలుపెట్టింది. మేము, "నీ చికిత్స పూర్తైన తరువాత మనం శిరిడీ వెళదాము" అని చెప్పి తనని బుజ్జగించాము. ఆరోజు గురువారం. డాక్టర్లు, "పాపకోసం ప్లేట్లెట్స్ ఏర్పాటు చేయండి" అని చెప్పారు. మేము ఆ మెసేజ్ ని పేజర్ లో పెట్టాము. అతితక్కువ సమయంలో చాలామంది దాతలు ప్లేట్లెట్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ముంబాయికి చెందిన ఒకామె ఫోన్ చేసి తన ప్లేట్లెట్స్ ఇస్తానని చెప్పారు. అయితే అప్పటికే మాకు ఒక దాత దొరికి ఉండడంతో మేము తనని సున్నితంగా తిరస్కరించాము. అయితే ఆమె మా పాపని ఒక్కసారి కలుస్తానని చెప్పి, అదేరోజు సాయంత్రం ఒక బాబా ఫోటో, ఊదీ ప్రసాదం పాపకు తీసుకొని వచ్చింది. బహుశా బాబాయే ఆమె ద్వారా వాటిని పంపారనిపించి మేము చాలా సంతోషించాము. తరువాత కొద్దిరోజులకి పాపకి కాథెటర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ తరువాత తను అంతటి నొప్పిని భరిస్తూ కూడా ఎంతో సంతోషంగా, “మమ్మా! నేను బాబాని చూసాను. ఆపరేషన్ థియేటర్ లో శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో బాబా తెల్లని వస్త్రాలు, ఎర్రగులాబీల మాల ధరించి కనిపించారు. నా తలపై నిమిరి, నన్ను శిరిడీ రమ్మని పిలిచారు" అని చెప్పింది.

దాదాపు 3 నెలల చికిత్స అనంతరం డాక్టర్లు, "ఇకపై పాపకి తదుపరి చికిత్స చేయలేము. ఎందుకంటే, తన శరీరం చికిత్సకి ఏమాత్రం సహకరించటం లేదు. కాబట్టి తనకి అనారోగ్య లక్షణాలని బట్టి ఏదయినా చికిత్స అందించాలంతే! ఇక తన ఆయుష్షు 3, 4 నెలలు మాత్రమే" అని చెప్పేసారు. ఇక మేము చేసేదిలేక భారమైన మనస్సుతో పాపని తీసుకుని శిరిడీ వెళ్ళాం. బాబా సమాధిపై ఉంచిన శాలువా, ఊదీ ప్రసాదంగా లభించాయి. సాయి దర్శనానంతరం మా ఇంటికి తిరిగి వచ్చేసాం.

రోజూ నేను పాప పక్కనే కూర్చుని “సాయి సచ్చరిత్ర” చదువుతూ ఉండేదాన్ని. చివరికి 2000, మే 21వ తేదీన మా పాప సాయిబాబా శాలువా తన ఒంటికి చుట్టుకొని, బాబా ఫోటో గుండెలకు హత్తుకుని(తనకి కాన్సర్ అని తెలిసినప్పటినుండి నేను తన గుండెలపై బాబా ఫోటో ఉంచేదాన్ని.) తుదిశ్వాస విడిచింది. తను చివరిగా పలికిన మాట: “మమ్మా! నాకు బాబా ఊదీ ఇవ్వు!” అని. వెంటనే నేను ఊదీని తన నుదుటిపై పెట్టి, కొంత ప్రసాదంగా ఇచ్చాను.

ఈ సంఘటనతో నాకు, మా వారికి అంతా శూన్యమైపోయింది. మేమెందుకు జీవిస్తున్నామో మాకే అర్థమయ్యేది కాదు. కానీ సాయిబాబా కృపతో ఎలాగో రోజులు గడిపేవాళ్ళం. మా పాప బాబాతో ఉందని నా గట్టినమ్మకం. నేనెప్పుడూ, "తనని జాగ్రత్తగా చూసుకోండి" అని బాబాని ప్రార్థిస్తూ, పాలు, ఆహారం మొదలయినవి బాబాకి నైవేద్యంగా పెట్టి, "ఇద్దరూ తీసుకోండి "అని వేడుకునేదాన్ని. కొద్దిరోజుల తరువాత ఒక గురువారంనాడు మేమొక బాబా భక్తుడైన ఒక బాబాని కలిసాము. ఆయన మాతో, “సరిగ్గా ఈరోజునుండి 8వ గురువారంనాడు సాయిబాబా మీ ఇంటికి ఏదో ఒక రూపంలో వస్తారు. అయితే, మీరు ఆయనని గుర్తించగలగాలి” అని చెప్పారు. తరువాత 8వ గురువారంనాడు నేను, మా వారు ఇద్దరం కలిసి మా పాపకి ఇష్టమైన ఆహారాన్ని తయారుచేసాం. ఎందుకంటే, మా పాప బాబాతోనే ఉందని మా దృఢవిశ్వాసం. ప్రతిరోజూ బాబాతోనే తన ఆహారం ఉంటుంది కాబట్టి బాబా ఒంటరిగా రారని మా అభిప్రాయం. ఆరోజు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు(శిరిడీలో సాయిబాబాకి నైవేద్యం ఇచ్చే సమయం) మా వీధిలో చూడగా, అంతా నిర్మానుష్యంగా ఉంది కానీ, ఒక తెల్లని ఆవు తన దూడతో మావైపు రావడం మాత్రం మేము గమనించాము. మేము వాటికి ఆహారం పెట్టిన మరుక్షణం మేడమీదకి వెళ్లి బాల్కనీ నుండి చూడగా అవి రెండూ మాయమైపోయాయి. వాటి రూపంలో బాబా, మా పాప వచ్చారు. ఇది బాబా మాకిచ్చిన అత్యంత మధురమైన అనుభవం. అది మాటలలో వర్ణించలేని భావం. ఎప్పుడు ఆ సంఘటనని తలుచుకున్నా నా కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఓం సాయిరాం! ఇంతకన్నా వివరించలేను. మా జీవితమంతా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నా ఏమాత్రం సరిపోవు.

ఇక అప్పటినుండి సచ్చరిత్ర పారాయణ చేయడం నిత్యకృత్యమైంది. ముఖ్యంగా 48వ అధ్యాయం పారాయణ చేస్తుండేదాన్ని. ఆ అధ్యాయంలో సపత్నేకర్ దంపతులు తమ బిడ్డ అనారోగ్యంతో చనిపోవడంతో, ఆ దిగులునుండి బయటకు రాలేని స్థితిలో ఉన్నప్పుడు బాబా వారితో, "వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను జంపెదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేల? అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరల దెచ్చెదను" అని ఆశీర్వదించిన వాక్యాలు బిడ్డని పోగొట్టుకున్న నాకెంతో ఊరటనిచ్చేవి. అదేవిధంగా బాబా నాకు కూడా నా బిడ్డని తిరిగి ఇస్తారనే నమ్మకంతో ఉండేదాన్ని. ప్రతిరోజూ నేను, "బాబా! మా పాపని మాకు తిరిగి ఇవ్వండి" అని ప్రార్థిస్తుండేదాన్ని.

2002, జూన్ 8 బాబా నా ప్రార్థనలకు సమాధానం ఇచ్చిన రోజు. బాబా కృపాశీస్సులతో మాకు బాబు పుట్టాడు. వాడి జుట్టునుండి గోళ్ళవరకు పోలికలన్నీ మా పాపవే. వాడికిప్పుడు 17 సంవత్సరాలు. వాడెప్పుడూ నాతో, “మమ్మా! నేను నీకు అబ్బాయిగా పుట్టడం ఎంతో మంచిదైంది. అదే నేను అమ్మాయిని అయుంటే పెళ్లి తరువాత నిన్ను వదిలి వేరే ఇంటికి పోవాల్సి వచ్చేది. ఇప్పుడు నేనెప్పటికీ నీతోనే ఉండొచ్చు” అంటూ ఉంటాడు.

భక్తులపై బాబా చూపే ప్రేమ అద్భుతం ... అనిర్వచనీయం.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo