సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 821వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహంతో సానుకూలంగా జరిగిన కొన్ని అనుభవాలు
2. తలచిన తక్షణం సహాయం అందిస్తున్న బాబా
3. ప్రాణభిక్షను, ఉద్యోగాన్ని ప్రసాదించిన బాబా

బాబా అనుగ్రహంతో సానుకూలంగా జరిగిన కొన్ని అనుభవాలు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన మన సాయితండ్రికి పాదాభివందనాలు. ఈ సాయి బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు కొన్నిటిని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. 


మొదటి అనుభవం:


ఇటీవల మేము వేరే ఊరిలో కొంత పొలాన్ని కొన్నాము. ఆ పొలం రిజిస్ట్రేషన్ కోసం కాస్త ఎక్కువ మొత్తంలో డబ్బును వేరే ఊరికి పంపించాల్సి వచ్చింది. ప్రస్తుతం నెలకొనివున్న కరోనా పరిస్థితుల వల్ల, పైగా ఎలక్షన్స్ కూడా ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో డబ్బు వేరే ఊరికి పంపించాలంటే భయమేసి నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఈ డబ్బు వాళ్ళకు చేరేవరకు నీవు తోడుగా ఉండి, జాగ్రత్తగా డబ్బును వాళ్ళకు అందజేయి. నా ఈ అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. మాపై కరుణతో ఆ పొలం బాధ్యతనంతా బాబా తీసుకున్నారు. బాబానే మావాళ్ళకు తోడుగా వెళ్ళి డబ్బు ఇచ్చి వచ్చారు. డబ్బు జాగ్రత్తగా చేరాల్సిన చోటికి చేరడంతో ఎంతో భారం తగ్గినట్లనిపించి మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. 


మరొక అనుభవం:


ఈమధ్య నాకు, మావారికి కొద్దిగా నీరసంగా అనిపించింది. దానితో మా బాబు, “ఎందుకైనా మంచిది, అందరం కోవిడ్ టెస్ట్ చేయించుకుందాం” అన్నాడు. టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళేముందు నేను బాబాకు నమస్కరించుకుని, “టెస్ట్ రిపోర్టు నెగిటివ్ రావాలి బాబా. నెగెటివ్ వస్తే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని ప్రార్థించి, అందరికీ బాబా ఊదీని ఇచ్చాను. తరువాత అందరం కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాము. నాకు, మావారికి, మా కోడలికి నెగెటివ్ వచ్చింది. కానీ మా బాబుకి కొద్దిగా కౌంట్ ఎక్కువ అని వచ్చింది. దాంతో, ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నారని మేము కంగారుపడ్డాము. వెంటనే ఎందుకైనా మంచిదని బాబు వేరే రూములో ఉండి మరునాడు మరలా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు. ఈసారి నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ మరలా అనుమానంతో మూడోరోజు కూడా టెస్ట్ చేయించుకున్నాడు. మళ్ళీ నెగిటివ్ వచ్చింది. మా ఆనందం మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. బాబానే ఎంతో కరుణతో మమ్మల్ని కాపాడారు


ఇంకొక అనుభవం:


ఇటీవల మా పిల్లలు అమెరికా వెళ్ళారు. వాళ్ళు అమెరికా వెళ్ళాలంటే కంపల్సరీగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అందువల్ల మరలా అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. బాబా దయతో అందరికీ నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది. తరువాత పిల్లలు అమెరికా బయలుదేరేముందు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! పిల్లలు అమెరికా వెళుతున్నారు. మీరే వారికి తోడుగా ఉండి వారికి ఇమ్మిగ్రేషన్ ప్రాబ్లమ్ గానీ, కరోనా ప్రాబ్లమ్ గానీ ఏమీ లేకుండా జాగ్రత్తగా అమెరికా చేర్చండి. నా అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకుంటాన”ని ప్రార్థించాను. బాబా మీద భారం వేస్తే మనకు భయమేల? బాబా దయవల్ల పిల్లలకు ఏ ఇబ్బందీ రాలేదు. వాళ్ళు క్షేమంగా అమెరికా చేరుకున్నారు. అయితే, పాస్‌పోర్ట్ విషయంలో మా కోడలికి కొద్దిగా ప్రాబ్లమ్ వచ్చిందట. ఎయిర్‌పోర్ట్ అధికారులు చాలా హడావిడి చేశారట. “మీరు మా ఆఫీసరుతో మాట్లాడాలి” అన్నారట. దాంతో మా కోడలు చాలా భయపడిందట. అయితే, ఆ ఆఫీసరు వచ్చి అన్నీ పరిశీలించి చూసి, ‘నీకు ఏమీ ఫరవాలేదు’ అని చెప్పటమే కాకుండా, యు.ఎస్.ఏ. లో ఈ విషయం గురించి ఎలా చెప్పాలో వివరించి, తనకు ధైర్యం చెప్పి మరీ పంపించారట. మీ అందరికీ ఆ ఆఫీసరు ఎవరో అర్థమైంది కదా మిత్రులారా? ఆయన మన బాబానే


చివరిగా ఒక విషయం:


మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఒక పెళ్ళికి వెళితే తన బంగారు లాకెట్ పోయిందట. వాళ్ళు నాకు ఫోన్ చేసి, “అందరూ మీకు ఫోన్ చేయమన్నారు. మీరు బాబాను ప్రార్థిస్తే ఆ లాకెట్ దొరుకుతుందని మా ఆశ. ఆ బంగారు లాకెట్ దొరకాలని మీరు బాబాను ప్రార్థించండి” అని చెప్పారు. మిత్రులారా, మన బాబాపై వాళ్ళకు నమ్మకం ఉన్నందువల్ల, దయచేసి మీరందరూ ఆ బంగారు లాకెట్ దొరకాలని బాబాను ప్రార్థించమని మనవి చేస్తున్నాను. దీన్ని బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. అందుకే మీ అందరినీ అర్థిస్తున్నాను. తప్పయితే నన్ను క్షమించమని అందరినీ ప్రార్థిస్తూ..


మీ 

సాయిపాదదాసి.


తలచిన తక్షణం సహాయం అందిస్తున్న బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః.

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.


సాయిభక్తులకు నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. 2021, మే 26న మా అబ్బాయి వివాహం నిశ్చయించాము. కానీ లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల వివాహం వాయిదా వేస్తే బాగుంటుందని అనిపించింది. కానీ అమ్మాయి తరఫువాళ్ళు, "మాకు ఈ ముహూర్తమే బాగుంది. ఇది కాదంటే జూన్ 4న మరొక ముహూర్తం ఉంది" అన్నారు. జూన్ 4 అయినా కూడా లాక్‌డౌన్ సమస్య ఉంటుంది. మేము మా ఊరిలో పురోహితుడిని అడిగితే, "రెండు నెలల తర్వాత ఆగస్టులో అమ్మాయికి, అబ్బాయికి అనుకూలంగా మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి వివాహం జరిపించవచ్చు" అని చెప్పారు. కానీ అమ్మాయి తరఫువాళ్ళు వాళ్ళుండే సిటీలో పురోహితుడిని అడిగితే, "ఈ రెండు ముహుర్తాలు కాకుండా ఆగస్టులో ఏ ముహూర్తాలూ లేవనీ, మళ్ళీ డిసెంబరులోనే ముహూర్తం ఉంద"నీ చెప్పాడు. డిసెంబరులోని ముహూర్తం అంటే ఆలస్యం అవుతుందని, జూన్ 4న వివాహం జరిపిద్దామని అమ్మాయి తల్లి పట్టుబట్టింది. మేము ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోక చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ టెన్షన్ నేను భరించలేకపోయాను. ఇంక నేను, "బాబా! ఈ పరిస్థితుల్లో నీవే దిక్కు. నువ్వే మార్గం చూపాలి" అని బాబాకి మొరపెట్టుకుని బాబా చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. పారాయణ పూర్తయ్యేలోపే బాబా అనుగ్రహించారు. హఠాత్తుగా అమ్మాయి తరఫువాళ్ళు వేరే పురోహితుడిని సంప్రదించారు. ఆ పురోహితుడు మా పురోహితుడు చెప్పినట్లే చెప్పాడు. అలా బాబా  పరిస్థితిని నాకు అనుకూలంగా మార్చి నా టెన్షన్ తొలగించారు. తల్లి, తండ్రి లేని నాకు మనోధైర్యాన్నిచ్చారు. ఇంకో విషయం, ముందురోజు కలలో 'నన్ను మర్చిపోయావా?' అన్నట్టు బాబా నాకు దర్శనమిచ్చారు. "ధన్యవాదాలు బాబా. అన్నీ మంచిగా జరిగేటట్లు చూడండి బాబా".


ఈమధ్య మరోసారి బాబా నాకు కలలో దర్శనమిచ్చి నాచేత కుంకుమార్చన చేయించుకున్నారు. నేను ధన్యురాలిని. బాబాను తలచిన వెంటనే అనుగ్రహించిన మరో అనుభవం గురించి ఇప్పుడు చెప్తాను. మా అబ్బాయి మేనేజరుగా ఒక సంస్థలో పనిచేస్తున్నాడు. ప్రస్తుత కరోనా కాలంలో మేనేజర్ స్థాయి ఉద్యోగస్థుల నెల జీతం కరోనా సహాయార్థం ఇవ్వాలనుకుంటున్నట్లు పైస్థాయి అధికారులు ఈమధ్య చెప్పారు. ఆ విషయం మా అబ్బాయి నాతో చెప్పాడు. మా పిల్లల జీతం, మరికొంత మొత్తం కలిపి నేను ప్రతినెలా చీటీ కడుతూ సేవ్ చేస్తున్నాను. మా అబ్బాయికి జీతం రాకపోతే దాదాపు 40 వేల రూపాయలు నేను సర్దుబాటు చేయాలి. అందువలన 'అంత పెద్ద మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేయాలా' అని నేను కలవరపడ్డాను. అప్పుడు, "బాబా! నీవే దిక్కు, కనీసం సగం జీతమన్నా వచ్చేటట్లు చేయండి. అలా వస్తే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. ఎంత విచిత్రం అంటే, బాబుకి సగం జీతంతోపాటు 60,000 రూపాయల బోనస్ వచ్చింది. బాబా నన్ను ఎంతలా కరుణించారో చూడండి. "బాబా! ఎలా మిమ్మల్ని తలచినా మీరు తక్షణం మాకు సహాయం చేస్తున్నారు. మీ బిడ్డల్లా మమ్మల్ని చూసుకుంటున్నారు. మీరే నాకు దిక్కు తండ్రీ. నా మనస్సు ఎప్పుడూ మీ మీద నిలిచేటట్లు అనుగ్రహించండి బాబా"


ప్రాణభిక్షను, ఉద్యోగాన్ని ప్రసాదించిన బాబా


నా పేరు నీరజ. మాది కడప జిల్లాలోని బద్వేలు. నాకు బాబా గురించి మొదట పరిచయం చేసింది మా మేనమామగారి భార్య భ్రమరాంబగారు మరియు నా ఆప్తమిత్రురాలు ధనమ్మ అక్కగారు. వారిద్దరూ బాబాకు చాలా గొప్ప భక్తులు. నాకు ప్రాణమున్నంతవరకు వాళ్ళిద్దరికీ నేను ఋణపడివుంటాను. 2008వ సంవత్సరంలో మానసికంగా నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. చాలా డిప్రెషన్‌లో ఉన్న ఆ సమయంలో మా మేనత్త ‘సచ్చరిత్ర పారాయణ చేయమ’ని చెప్పి, ఆ గ్రంథాన్ని నాకు ఇచ్చింది. సరేనని సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. మొదటిసారి పారాయణ చేయడంతోనే నాకే తెలియకుండా నాలో ధైర్యం పెరిగింది. బాబా దయవలన కొద్దిరోజుల్లోనే నా మానసిక ఆరోగ్యం మెరుగుపడింది. అప్పటినుంచి బాబాపై నాకు నమ్మకం ఏర్పడింది. 2014లో ఒకసారి నా ఎడమచేయి చాలా నొప్పిగా అనిపించింది. టాబ్లెట్ వేసుకున్నా నొప్పి తగ్గలేదు. గంటగంటకూ నొప్పి పెరుగుతూ ఉండేసరికి నాకు ఏమి చేయాలో తోచలేదు. మావారికి చెబుదామంటే, నా నోటినుండి మాట కూడా రావడం లేదు. చాలా భయం వేసింది. ప్రాణాలు పోయేంత నొప్పితో విలవిలలాడిపోయాను. అటువంటి సమయంలో ‘బాబానే నాకు దిక్కు’ అనుకుని బాబా నామస్మరణ చేస్తూ, "బాబా! నా ప్రాణాలు కాపాడండి" అని వేడుకున్నాను. దయామయులైన బాబా నా ప్రార్థన ఆలకించి ఉదయానికల్లా నా చేయినొప్పి తగ్గేలా అనుగ్రహించారు. నిజంగా బాబా నాకు ప్రాణభిక్ష పెట్టారు. ఇలా బాబాతో నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. "బాబా! మీ అనుగ్రహం సదా నాపై ఉండాలి తండ్రీ".


ఇది ఇటీవల జరిగిన అనుభవం. 2021, జూన్ 12 ఉదయం నాకు 'సాయి స్తవనమంజరి' పారాయణ చేయాలని సంకల్పం కలిగింది. సాయంత్రం బాబాకు పూజచేసి స్తవనమంజరి పఠిద్దామని అనుకున్నాను. అయితే నేను సాయంత్రం పూజ మొదలుపెట్టేలోపే బాబా అనుగ్రహాన్ని ఒక శుభవార్త రూపంలో విన్నాను. మా బావగారి అబ్బాయి చాలా సంవత్సరాల నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. తనకు ఉద్యోగం వస్తే కుటుంబానికి చాలా అండగా ఉంటుందని మేము బాబాకి మొరపెట్టుకుంటుండేవాళ్ళము. నేను సాయంత్రం పూజ మొదలుపెట్టే ముందు తను ఫోన్ చేసి, "నాకు ఉద్యోగం వచ్చింది. ఈరోజే ఉద్యోగంలో చేరాను" అని చెప్పాడు. అది వింటూనే బాబా మా మొర ఆలకించారని చాలా సంతోషంగా అనిపించి సాయి మహరాజుకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. "బాబా! మీ కృప ఎల్లప్పుడూ మాపై ఇలాగే ఉండాలి. ప్రాణమున్నంతవరకు నేను మీ పాదాలను వదలను తండ్రీ".


సాయిభక్తుల అనుభవమాలిక 820వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. వైద్యులలో ధన్వంతరి నా సాయితండ్రి
  2. కృపతో కరోనా నుండి కాపాడిన బాబా

వైద్యులలో ధన్వంతరి నా సాయితండ్రి


సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు బాబాకు నా క్షమాపణలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఇందిర. ఇంతకుముందు నా అనుభవాలను కొన్నిటిని ఈ బ్లాగ్ ద్వారా పంచుకున్నాను. దానికి సంబంధించినవే ఇప్పుడు పంచుకోబోయే అనుభవాలు కూడా. 


మొదటి అనుభవం:


మావారు స్కూల్ టీచర్. ఒకసారి తనకు యాక్సిడెంట్ జరగటం వల్ల ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ, బాబా దయవల్ల పూర్వపుస్థితికి వచ్చామని ఇంతకుముందు అనుభవంలో తెలిపాను. అలాంటిదే ఇప్పటి నా అనుభవం కూడా. మావారికి యాక్సిడెంట్ అయినప్పుడు తన కాలికి రాడ్స్ వేశారు. ఇటీవల ఒకరోజు తను బైక్‌పై స్కూలుకి వెళుతున్నప్పుడు రాళ్ళలో బైక్ స్కిడ్ అయి ప్రక్కకు పడిపోయారు. దురదృష్టం ఏమిటంటే ఆ సమయంలో బైక్ మీద ఈయన వెనుక మరొకరు కూడా ఉన్నారు. ఇద్దరూ బైక్ మీదనుంచి ప్రక్కకు పడిన సమయంలో ఆ వెనుకనున్నవారి తలలో ఒక రాయి దిగబడిపోయింది. మావారికి రాడ్ ఉన్న కాలి పాదంలో ఒక రాయి దిగబడిపోయింది. దాదాపు అంగుళం లోతు గాయమైంది. మోచేతులు కూడా కొట్టుకుపోయాయి. మావారు ఆ గాయాలతోనే ఎలాగో స్కూలుకి వెళ్ళి, ఆ వెనుకనున్నవారిని ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్‌కి పంపించారు. మావారు టీచరుగా పనిచేస్తున్న ఊరిలోకి ఒక కాంపౌండర్ వస్తారు. మావారు అతనితో, “రెండు రోజుల్లో ఎలక్షన్ డ్యూటీ ఉంది. గాయం త్వరగా తగ్గిపోవాల”ని చెప్పారట. అతను మావారి కాలికి కట్టుకట్టి, ఇంజక్షన్ చేసి, టాబ్లెట్స్ ఇచ్చారు. సాయంత్రం ఇంటికి వచ్చిన మావారిని చూసి నాకు నోటమాట రాలేదు. అసలు ఆ రక్తపు బట్టల్లో ఆయనని చూసేసరికి నాకు వర్ణించలేని పరిస్థితి ఎదురైంది. ఈమధ్యనే తను ఒక యాక్సిడెంట్ నుంచి కోలుకున్నారు. మళ్ళీ యాక్సిడెంట్ అవడంతో నాకు చాలా భయమేసింది. మావారు చాలా మొండి. ఎంత బాధనైనా భరించగలరు. అలాంటి స్థితిలోనే తను 3 ఎలక్షన్ డ్యూటీలు చేసి వచ్చారు. తను డయాబెటిక్ అవటం వల్ల ఎక్కడ తనకు కాలు ఇన్ఫెక్ట్ అవుతుందోనని చాలా భయపడ్డాను. ఈ విషయం గురించి నేను ఎవ్వరికీ చెప్పలేదు. బాబాకు మాత్రమే నా పరిస్థితి చెప్పుకుని ఏడ్చేదాన్ని. మావారికి బాబా ఊదీ పెట్టుకుని బయటికి వెళ్ళే అలవాటు ఉంది. అలా చేయడం వల్లే పెద్ద ప్రమాదం జరగకుండా బాబా కాపాడారని అనుకుని, ప్రతిరోజూ తనకు ఊదీ పెట్టి, కాస్త ఊదీని నీటిలో కలిపి తనకు ఇచ్చి, కొద్దిగా ఊదీని తన కాలి గాయానికి రాసేదాన్ని. తను బైటికి వెళ్ళినప్పుడల్లా తిరిగి తను ఇంటికి వచ్చేదాకా బాబా నామస్మరణ చేసుకుంటూ ఎదురుచూసేదాన్ని. తన గురించి ఆలోచిస్తూ దిగులుతో సరిగా నిద్రపట్టేది కాదు. ఏమీ తినాలని అనిపించేది కాదు. గాయం పూర్తిగా మానడానికి దాదాపు నెలరోజుల పైనే పట్టింది. అది కూడా కేవలం సాయినాథుని దయవల్లే. నాకు ఏ కష్టం వచ్చినా మా అమ్మతో కూడా చెప్పను. బాబాకే చెప్పుకుని ధైర్యంగా ఉంటాను. ఎన్నో సందర్భాలలో నేను ఇబ్బందుల నుండి కేవలం బాబా దయవల్లే బయటపడ్డాను.


రెండవ అనుభవం:


ఇదిలా ఉన్న సందర్భంలోనే, హార్ట్ పేషంట్ అయిన మా నాన్నకు ఉన్నట్టుండి ఒళ్ళంతా అలెర్జీలా వచ్చి ఒకటే దురదలు రాసాగాయి. దురదలతో నాన్న ఎంతో ఇబ్బందిపడుతుంటే మా అమ్మ ఆయనను వెంటబెట్టుకుని ఆయుర్వేదం, హోమియో, అల్లోపతి.. ఇలా అన్ని రకాల డాక్టర్లను సంప్రదించింది. వారిచ్చిన మందులు వాడినప్పటికీ ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. దురదల వల్ల మా నాన్న రాత్రి, పగలు నిద్రపోయేవారుకాదు. నిద్రమాత్రలు వేసుకున్నా తనకు నిద్రపట్టేది కాదు. ఒకవేళ లివర్ ప్రాబ్లమ్ వల్ల ఈ అలెర్జీ వచ్చిందేనేమోనని నాన్నకు లివర్ టెస్ట్ చేయించారు. కానీ రిపోర్ట్ నార్మల్ అని వచ్చింది. మా అమ్మ కూడా షుగర్ పేషెంట్. నాన్నకున్న సమస్య వల్ల ఆయనను చూసుకునే క్రమంలో తనకు కూడా నిద్రలేక అమ్మ ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. అలాంటి పరిస్థితిలో నేను బాబానే నమ్ముకుని, “బాబా! నాన్నని, ఆయన ఆరోగ్యాన్ని నీ చేతిలో పెట్టాను. నీవే దారి చూపించి నాన్నకు అలెర్జీ తగ్గేలా చేయి తండ్రీ!” అని ప్రార్థించి, “నాన్నకు నయమైతే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాన”ని చెప్పుకున్నాను. మరుసటిరోజు అమ్మ ఫోన్ చేసి, “ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండటం లేదు. అందువల్ల మీ నాన్నని విజయవాడలోని స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్తున్నాను” అని చెప్పింది. కోవిడ్ పరిస్థితుల్లో హాస్పిటల్‌కి వెళ్ళడమంటే భయం వేసింది. కానీ బాబాపై భారం వేసి బాబా నామం చేస్తూ ఉన్నాను. ‘దైవం మానుష రూపేణ’ అంటారు కదా! మా పిన్ని రూపంలో బాబా మా నాన్నని విజయవాడలోని ఒక స్కిన్ స్పెషలిస్టుకి చూపించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకున్న వారంరోజుల్లో బాబా దయవల్ల నాన్న పూర్తిగా కోలుకొని మామూలు పరిస్థితికి వచ్చారు. 


నాకు పై రెండు పరిస్థితులూ ఒకే సమయంలో వచ్చాయి. ఒకవైపు నా భర్త పరిస్థితి, మరోవైపు నాన్న పరిస్థితి - తెల్లవారితే నాన్న గురించి ఏం వినాలో అని చాలా భయమేసేది. ఎవరి గురించి ఆలోచించాలో అర్థంకాక ఎంతో మనోవేదన అనుభవించాను. ఇటువంటి పరిస్థితుల్లో నేను చేసింది ఒక్కటే, నిత్యం బాబా స్మరణ. వైద్యులలో ధన్వంతరి అయిన నా సాయితండ్రి ఎంతో కరుణతో ఇద్దరి పరిస్థితినీ బాగుచేశారు.ప్పుడూ కూడా బాబాపై నమ్మకాన్ని ఉంచి ధైర్యంగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా భరించే శక్తిని ఆయనే మనకు అందిస్తారని నా నమ్మకం.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


కృపతో కరోనా నుండి కాపాడిన బాబా


సాయిబంధువులకు నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా అభినందనలు. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదువుతూ ఉంటాను. నా పేరు శ్రీవాణి. 2021, మే మూడవవారంలో మా అమ్మాయి, అబ్బాయి జ్వరం, తలనొప్పి, జలుబు సమస్యలతో బాధపడ్డారు. ప్రస్తుతం ఈ లక్షణాలంటేనే మనకు భయంతో కాళ్ళుచేతులు ఆడట్లేదు. పైగా నాలుగు రోజులైనా పిల్లలకు తగ్గలేదు. కోవిడ్ టెస్టుకి వెళదామంటే నాకు చాలా భయం వేసింది. అయినా ధైర్యం చేసి, "బాబా! నాకు, మా పిల్లలకు కరోనా టెస్టులో నెగిటివ్ వచ్చేలా అనుగ్రహించండి. నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను, సచ్చరిత్ర చదవడం కూడా ప్రారంభిస్తాను" అని బాబాను వేడుకుని 2021, మే 23న కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాము. మనసు నిండా సాయిని నిలుపుకుని, ఆయననే స్మరిస్తూ టెస్ట్ చేయించుకున్నాము. సాయిబాబా దయవలన అందరికీ నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అది తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది. "రేపు జరిగే మరో టెస్టులో కూడా మా అందరికీ నెగెటివ్ అని రిపోర్టు రావాల"ని సాయినాథునికి సాష్టాంగ నమస్కారం చేశాను. 


కానీ దురదృష్టం కొద్దీ నాకు, నా కూతురికి కరోనా పాజిటివ్ వచ్చింది. నేను చాలా ఆందోళనచెంది ఆరోగ్యప్రదాత అయిన నా సాయికి నమస్కరించుకుని, "మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడు సాయీ. నాకు తల్లి, తండ్రి, దైవం అన్నీ నీవే. నీ మీదే భారం వేస్తున్నాను. నన్ను, నా బిడ్డను కాపాడు తండ్రీ" అని దీనంగా వేడుకున్నాను. ఇన్ఫెక్షన్ నా ఊపిరితిత్తులకు చేరడంతో నాకు ఆయాసం, గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలయ్యాయి. అవి కాస్త ఎక్కువగా ఉండటంతో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎలాగో 15 రోజులు గడిచాక మరోసారి టెస్టుకు వెళ్ళాము. రిపోర్టు ఏవిధంగా ఉంటుందోనని భయంతో నాకు టెన్షన్ ఇంకా ఎక్కువైంది. సచ్చరిత్ర పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని, "బాబా! నీవే నాకు దిక్కు. నాకు, నా కూతురికి నెగిటివ్ రావాలి. ఇంకా ఈ ఆయాసం, గ్యాస్ట్రిక్ సమస్యల నుండి కూడా కాపాడు స్వామీ" అని వేడుకున్నాను. సాయి నాపై కరుణ చూపారు. కోవిడ్ టెస్ట్ రిపోర్టులో నాకు, నా కూతురుకి నెగిటివ్ వచ్చింది. సంతోషంగా బాబాకు నమస్కారాలు చెప్పుకొని, "ఆయాసం, గ్యాస్ట్రిక్ సమస్యల నుండి కూడా కాపాడు సాయీ. ఆయాసం పూర్తిగా తగ్గితే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను సాయీ" అని మ్రొక్కుకున్నాను. బాబా అపారమైన కృపవలన మరుసటిరోజు ఉదయం నుండి నాకు ఆయాసం, గ్యాస్ట్రిక్ సమస్యలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. నా సాయీ, మీకు నా పాదాభివందనాలు. నన్ను, నా కుటుంబాన్ని సదా నీవే కాపాడు సాయీ".

 

ఓం శ్రీ సాయినాథాయ నమః


సాయిభక్తుల అనుభవమాలిక 819వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఇచ్చిన సమాధానం
2. బాబా ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు

బాబా ఇచ్చిన సమాధానం


సాయిబంధువులకు నా నమస్కారం. నా పేరు సాయి సంహిత. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ బ్లాగ్ ద్వారా బాబా ఎప్పుడూ మాతోనే ఉంటూ, మాకు ఏదైనా కష్టం రాగానే ఈ బ్లాగ్ ద్వారానే సమాధానం ఇస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం లేవగానే ఈ బ్లాగులో వచ్చే సాయిభక్తుల అనుభవాలను చదువుతుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఎంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ధైర్యం కలుగుతుంది. 2021, మే 22వ తేదీన బాబా నాకు ప్రసాదించిన స్వప్నదర్శనం గురించి ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. ఇంతకుముందు కూడా బాబా నాకు ఎన్నో స్వప్నదర్శనాలు ప్రసాదించారు. కానీ ఆరోజు ఇచ్చిన దర్శనం మాత్రం చాలా ప్రత్యేకమైనది. నాకు ఇంకా పెళ్ళి కాలేదు. నా పెళ్ళి గురించి నేను రోజూ బాబాను అడుగుతున్నాను. ఇంతకుముందు కూడా ఒకసారి స్వప్నదర్శనంలో ‘నేను ఇష్టపడిన అబ్బాయితోనే నా వివాహం జరిపిస్తాన’ని బాబా చూపించారు. కానీ మళ్ళీ అన్ని దారులూ మూసేశారు. ‘బాబా అందరికీ సమాధానం ఇస్తున్నారు, కానీ నాకు మాత్రం అసలు ఇవ్వడం లేదు’ అని అనుకునేదాన్ని. సచ్చరిత్ర చదువుతున్నప్పుడు కూడా బాబా నా పెళ్ళికి సంబంధించి సానుకూలంగానే సమాధానమిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా, “నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్నదాన్ని నీకు ఇస్తాను” అని బాబా సమాధానం ఇస్తున్నారు.

కానీ పిచ్చిదాన్ని, అదంతా నా భ్రమేమో అని అనుకున్నాను. ఎంతకీ బాబా నుండి సమాధానం రావట్లేదనే ఆలోచనలతో, మే 22వ తేదీ రాత్రి పడుకోబోయేముందు బాబాతో, “బాబా! మీరు నా వివాహం ఆ అబ్బాయితోనే చేస్తానన్నారు. ఎన్నో సానుకూల సూచనలు కూడా చూపించారు. కానీ నా పెళ్ళి జరగటం లేదు. నాకంటే చిన్నవాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. నాకు ఇంకా పెళ్ళి కావట్లేదని అమ్మానాన్నలు ఒకటే టెన్షన్ పడుతున్నారు. మీరు కలలో ఒకసారి ‘నేను మాట్లాడేవి విని నాకు సమాధానం చెప్తాన’న్నారు. కానీ మీరు సమాధానమేమీ చెప్పడమే లేదు. ఇంకా ఇప్పటికీ ఆ అబ్బాయితోనే నా వివాహం జరుగుతుందని మీరు చూపిస్తున్నారు. కానీ ఎంతకీ మీరు చెప్పినట్లుగా జరగటంలేదనే కోపంలో మీ మందిరానికి రావడం కూడా మానేశాను. ఏం చెయ్యను? ఇంకా పెళ్ళి కావట్లేదనే ఆందోళనతో అలా చేశాను. ఇలా చేసినందుకు నన్ను క్షమించండి బాబా. ఇవాళ నాకు ఏదో ఒక సమాధానం చెప్పండి బాబా. ‘ఇస్తాను, ఇస్తాను’ అని ఎందుకు ఇవ్వటంలేదు? బాబా! ఇవాళైనా మీరు నాకు కలలో రావాలి” అని చెప్పుకుని పడుకున్నాను. తెల్లవారుఝామున 3.45 గంటలకు మెలకువ వచ్చింది. అంతవరకు బాబా కలలో రాకపోవడంతో, ‘ఇవాళ కూడా బాబా కలలో రాలేద’ని బాధపడుతూ, “బాబా! మిమ్మల్ని రోజూ అడుగుతున్నాను, నాకు ఎంత ఒత్తిడిగా ఉంటుందో మీకు తెలుసు. అయినా మీరు నా కలలో రావట్లేదు” అని బాబాకు చెప్పుకుంటూ మళ్ళీ పడుకున్నాను.


తరువాత సుమారు 4.30 గంటల సమయంలో నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను యూనిఫామ్ కుట్టించుకోవడానికి ఒక టైలర్ వద్దకు వెళ్ళాను. ఆ టైలర్ నా కొలతలు తీసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఎవరో అతనిని రమ్మని పిలిచారు. “పూజకి ఆలస్యం అవుతోంది, నేను వెళ్తున్నాను” అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అక్కడ ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుని పిలిచి, “ఏం పూజ?” అని అడిగాను. “బాబా పూజ అక్కా” అన్నాడు ఆ బాబు. బాబా పేరు వినగానే చాలా సంతోషంగా అనిపించింది. “బాబా పూజకి నేనూ వెళ్ళొచ్చా?” అని ఆ బాబుని అడిగాను. “ఎవరైనా వెళ్ళొచ్చక్కా” అని చెప్పాడు ఆ బాబు. నేను ఎంతో సంతోషంగా బాబా పూజ జరిగే చోటికి బయలుదేరాను. దారిలో, మా ఇంట్లో అద్దెకు ఉండే అమ్మాయి కలిసింది. “బాబా పూజ జరుగుతోందట. వెళదాం, రా” అని తనను పిలిస్తే, “మనల్ని పిలవలేదు కదా, ఎలా వెళ్తాం?” అని అన్నది తను. “బాబా పూజకి ఎవరైనా వెళ్ళొచ్చు, ఏం అవదు, రా” అని అంటే, తను రానంది. సరేనని నేను ఒక్కదాన్నే పూజ జరిగే చోటికి వెళ్ళాను. లోపలకు వెళ్ళగానే చుట్టూ చక్కని మొక్కల మధ్యన పెద్ద బాబా విగ్రహం కనిపించింది. విగ్రహం ముందు బాబా పాదాలు పెట్టారు. దీపాల వెలుగు, అగరుబత్తి, సాంబ్రాణి ధూపాలతో వాతావరణమంతా చాలా ఆహ్లాదంగా ఉంది. లోపల చాలామంది బాబా భక్తులు ఉన్నారు. వారంతా బాబా భజనలు చేస్తున్నారు. బాబా భజనలు వింటుంటే నా ఒళ్ళంతా పులకరించింది. నేనూ వెళ్ళి ఒక ప్రక్కన కూర్చుని వారితో పాటు బాబా భజనలు పాడసాగాను. అలా పాడుకుంటూనే, “మధుతో పెళ్ళయ్యాక ఇలానే మా ఇంట్లో కూడా బాబా భజనలు పెట్టుకోవాలి” అని అనుకుంటూ ఉన్నాను. అక్కడున్న భక్తులలో ‘బాబా మాల’ వేసుకుని నిష్ఠగా పూజలు చేసినవారు ఉన్నారు. వాళ్లను అందరూ పొగుడుతున్నారు. ఆ చోటు ఎంత బాగుందో! పూజ అయిపోయాక అందరూ ముందుగా బాబా పాదాలకు నమస్కరించుకుని, ఆ తరువాత బాబా విగ్రహం వద్దకు వెళ్ళి బాబాను దర్శించుకుంటున్నారు. నేను కూడా బాబా పాదాలకు నమస్కరించుకుని, బాబా విగ్రహం దగ్గరకు వెళ్ళాను. ఇంతలో, అప్పటివరకు విగ్రహంలా ఉన్న బాబా సజీవంగా మారి తమ ముఖాన్ని వేరేవైపుకు త్రిప్పుకున్నారు. బాబా ముఖాన్ని చూడాలనే ఆరాటంతో నేను వంగి వంగి బాబాను చూస్తున్నాను. అయితే, బాబా నాపై అలిగినట్లు మూతి ముడుచుకుంటూ తమ ముఖాన్ని మరోవైపుకు త్రిప్పుకున్నారు. దాంతో నేను కూడా ఆ వైపుకు వచ్చి బాబాను చూస్తూ, “బాబా! నేను మీ మీద అలిగి మీ మందిరానికి రావట్లేదని నా మీద మీకు కోపమా? ఇప్పుడు వచ్చాను కదా, మీ అలక మానండి బాబా” అని గోముగా అడిగాను. వెంటనే బాబా తమ అలక మాని నన్ను చూసి ప్రేమగా చిరునవ్వు నవ్వారు. నేను, “బాబా, మధుతో నా పెళ్ళి అవుతుందా? చెప్పండి బాబా” అని అడిగాను. బాబా కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నారు. నేను మళ్ళీ మళ్ళీ బాబాను సమాధానం చెప్పమని అడుగుతున్నాను. అప్పుడు బాబా ఎంతో ప్రేమగా తమ రెండు చేతులను నా తలమీద పెట్టి ‘నీ పెళ్ళి మధుతోనే అవుతుందిలే’ అని చెప్తున్నట్లు నన్ను ఆశీర్వదించారు. తరువాత బాబా విగ్రహంలా మారిపోయారు. నేను బాబాకు నమస్కరించుకుని వెనుకనున్న ద్వారం నుంచి బయటికి వెళ్ళాను. అక్కడ ఒక షాపు కనిపించింది. అందులో బాబా ఫోటో ఉన్న కీచైన్లు, పుస్తకాలు ఉన్నాయి. అంతటితో ఆ కల ముగిసింది.


ఉదయం నిద్రలేవగానే, “బాబా నా పెళ్ళి మధుతో చేస్తానన్నారు. కానీ అన్ని దారులూ మూసుకున్నాయి. ఇంపాజిబుల్ అనుకున్నది ఎలా పాజిబుల్ అవుతుంది? చాలా కష్టం కదా!” అనుకుంటూ, సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ ఓపెన్ చేశాను. ఆ ముందురోజు డ్యూటీలో బిజీగా ఉండటం వల్ల నేను బ్లాగ్ చదవలేదు. బ్లాగ్ ఓపెన్ చేయగానే బాబా మెసేజ్ ఇలా వచ్చింది: “నీకు అసాధ్యం అనిపించేది నేను సాధ్యం చేస్తాను, నేను దాన్ని పూర్తిచేస్తాను” అని.

ఆ మెసేజ్ చూడగానే, ‘బాబా నా మాటలన్నీ వింటున్నారు, నేనే బాబాను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను’ అని ఏడుపు వచ్చేసింది. “క్షమించండి బాబా. పెళ్ళి అనేది ప్రతి అమ్మాయి విషయంలో ఎంత ముఖ్యమో మీకు తెలుసు. అదీ ఇష్టపడినవాళ్ళతో పెళ్ళైతే ఆ సంతోషం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. బాబా, మధుతో నా పెళ్ళి మీరే దగ్గరుండి జరిపించాలి. నేను ఆ అనుభవాన్ని కూడా చాలా ఆనందంగా ఈ బ్లాగులో పంచుకోవాలి బాబా. మీ మెసేజ్ ద్వారా నాకు మీ ఆశీస్సులను ప్రసాదించారు. నా పెళ్ళి మిరాకిల్ కోసం ఎదురుచూస్తున్నాను బాబా. ఎవరితోనూ మాట రాకుండా అందరి ఆమోదంతో నా పెళ్ళి జరిపించండి”.


బాబా ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు


ఓం శ్రీ సాయినాథాయ నమః. బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను ఉద్యోగం చేస్తున్నాను. లాక్‌డౌన్ ఉన్నప్పటికీ అత్యవసర సేవలలో భాగంగా నేను రోజూ ఆఫీసుకి వెళ్ళాల్సి ఉంది. ఎప్పటిలాగే సోమవారంనాడు ఆఫీసుకి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేశాను. ఆరోజు రాత్రి మా బాబుకి జ్వరం వచ్చింది. జ్వర తీవ్రత అధికంగా ఉండటంతో బాబుని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. బాబు ఆరోగ్యం గురించి చాలా టెన్షన్ పడుతూనే మనసులో బాబాను తలచుకుంటూనే ఉన్నాను. బాబాను పరీక్షించిన డాక్టర్, “ఇది వైరల్ ఫీవర్ అయివుంటుంది” అని చెప్పి, కొన్ని మందులిచ్చి, బాబు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండమని చెప్పారు. మందులు వేశాక కూడా మంగళవారమంతా బాబుకి జ్వర తీవ్రత ఎక్కువగానే ఉంది. జ్వరం తగ్గడానికి బాబుకి తడిగుడ్డతో ఒళ్ళంతా తుడుస్తూ ఉన్నాము. ఆరోజు రాత్రి బాబా ఊదీని నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో బాబుకి ఒళ్ళంతా తుడిచాను. బాబా దయవల్ల అప్పటినుంచి బాబుకి శరీర ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టి, బుధవారానికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. బాబాకు నేను ఎల్లప్పుడూ ఋణపడివుంటాను. బాబా మా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటున్నారు, కాపాడుతూనే ఉంటారు.


అలాగే, మంగళవారంనాడే నాకు జలుబు చేసింది. నాకు మామూలుగా అలెర్జీతో జలుబు చేస్తూ ఉంటుంది, వెంటనే తగ్గిపోతుంటుంది. అలాంటి జలుబే అనుకుని మంగళవారం, బుధవారం తరచూ ఆవిరి పడుతూ, వేడినీళ్ళు త్రాగుతూ ఉన్నాను. గురువారం ఉదయం లేచేసరికి వాసన తెలియలేదు. దాంతో టెన్షన్ పడ్డాను. వాసన తెలియకపోవడం ఒకానొక కరోనా లక్షణం. వెంటనే డాక్టర్ని సంప్రదించాను. ఆయన నన్ను కోవిడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. దాంతో నేను కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. తరువాత మందులు వాడటం కూడా మొదలుపెట్టాను. టెస్ట్ రిజల్ట్ గురించి ఏమీ ఆలోచించలేదు, ‘అంతా బాబా చూసుకుంటారు’ అని అనుకున్నాను. వేడినీళ్ళలో బాబా ఊదీ వేసుకుని ఆవిరిపట్టాను. కాస్త టెన్షన్ గానే ఉంది. రాత్రంతా ‘ఓం శ్రీ సాయినాథాయ నమః’ చాంటింగ్ పెట్టి ఉంచాను. మరుసటి ఉదయం టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో నెగిటివ్ వచ్చింది. అది చూసి ఎంతో సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. “బాబా ఉండగా నాకు భయమెందుకు?” అనుకున్నాను. కానీ వాసన మాత్రం తెలియట్లేదు. శుక్రవారంనాడు, ఈ బ్లాగులో ప్రచురించిన వాసనకు సంబంధించిన ఒక అనుభవాన్ని మా సిస్టర్ నాకు పంపించింది. అది చదివి, “నాకు రేపు వాసన తెలిస్తే ఈ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని అనుకున్నాను. శనివారం ఉదయం నుంచి ఎదురుచూస్తూ ఉన్నాను, వాసన ఎప్పుడు వస్తుందా అని. రాత్రయినా వాసన తెలియలేదు. “ఈరోజు వాసన తెలియాలని బాబాకు చెప్పుకున్నాను కదా. అంతే, ఈరోజే నాకు వాసన తెలియాలి” అని అనుకుంటూ, వెళ్ళి బాత్రూములో డెట్టాల్ వాసన చూశాను. వాసన తెలిసింది. ‘బాబా మాట ఎన్నడూ అసత్యం కాదు’ అని ఎంతగానో ఆనందించాను. తరువాత చాలా పదార్థాలు వాసన చూశాను. చాలావరకు వాసన తెలిశాయి. ఆ రాత్రంతా ‘ఓం శ్రీ సాయినాథాయ నమః’ చాంటింగ్ అలా మ్రోగుతూనే ఉంది. బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. బాబా నన్ను, నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటున్నారు. నాకు ఏ కష్టం వచ్చినా బాబానే సహాయం చేస్తారు, చేస్తూనే ఉంటారు. బాబాకు నా జీవితాంతం ఋణపడివుంటాను.


ఓం శ్రీ సాయినాథాయ నమః.


సాయిభక్తుల అనుభవమాలిక 818వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎప్పుడూ మనల్ని కాపాడే బాబా ఉండగా మనకు భయమేల?
2. సాయిబాబా ఎన్నడూ మనల్ని విడిచిపెట్టరు
3. ఊదీతో ఛాతీనొప్పి నుండి ఉపశమనం

ఎప్పుడూ మనల్ని కాపాడే బాబా ఉండగా మనకు భయమేల?


సాయిభక్తులకు నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నేనొక సాయిభక్తురాలిని. రెండు నెలల క్రితం మా ఇంట్లో జరిగిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. మా వదినావాళ్ళ అబ్బాయి కొంతకాలం క్రితం కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అప్పుడుప్పుడు తను కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఎప్పటిలాగానే ఆరోజు కూడా పార్కింగ్ లాట్‌ నుంచి కారు బయటికి తీయడానికి రివర్స్ చేస్తూ ఉండగా అనుకోకుండా కారు విండ్ స్క్రీన్ గ్లాస్ పగిలిపోయింది. దాంతో మా అల్లుడు చాలా భయపడిపోయాడు. వెంటనే మా అత్తగారికి జరిగిన విషయం చెప్పాడు. ఆవిడ కూడా ‘ఇలా జరిగిందేమిటా’ అని బాధపడి, విషయం తెలిస్తే తన భర్త (మా మామయ్యగారు) ఏమంటారోనని చాలా కంగారుపడ్డారు. మా మామయ్యగారికి ఈ విషయం తెలిశాక ఆయన ఆ అబ్బాయిని బాగా కోప్పడ్డారు. “అసలు నువ్వెందుకు కారు బయటికి తీశావు? నాకు చెప్తే నేను తీసేవాడిని కదా? ఇప్పుడు చూడు ఏమయిందో, దానిని రిపేర్ చేయించటానికి లక్షరూపాయల దాకా ఖర్చవుతుంది” అని మండిపడ్డారు. రిపేరుకు అంత డబ్బు ఖర్చవుతుందని ఆయన అనగానే ఇంట్లో అందరూ కంగారుపడ్డారు. రెండు రోజుల తర్వాత షోరూమ్‌కి వెళ్ళి కారు రిపేర్ చేయడానికి ఎంత ఖర్చవుతుందని అడిగితే వాళ్ళు కూడా, “సార్, ఇన్స్యూరెన్స్ అమౌంట్ పోగా మీకు ఒక లక్షరూపాయలు అదనంగా ఖర్చవుతుందేమో!” అని అన్నారు. దాంతో, మా అత్తగారికి మళ్ళీ కంగారు మొదలైంది. వెంటనే ఆవిడ బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఎలాగైనా మీరే మా మీద దయ చూపించి, ఇన్స్యూరెన్స్ డబ్బు కాకుండా రిపేరు కోసం 25,000 రూపాయల లోపు మాత్రమే ఖర్చయ్యేలా అనుగ్రహిస్తే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. అలాగే, రిపేరు పూర్తయి కారు ఇంటికి వచ్చేదాకా రోజుకోసారి స్తవనమంజరి పారాయణ చేస్తాను” అని బాబాకు మ్రొక్కుకున్నారు. మా మావయ్యగారు కారును రిపేరుకు ఇచ్చారు. మా అత్తగారు బాబాకు మ్రొక్కుకున్నట్లుగా ప్రతిరోజూ శ్రద్ధగా స్తవనమంజరి పారాయణ చేస్తూ ఉన్నారు. ఇలా ఒక నెల రోజులు గడిచింది. తరువాత ఒకరోజు షోరూమ్ వాళ్ళు ఫోన్ చేసి, “కారు రెడీ అయింది, వచ్చి తీసుకెళ్ళండి” అని చెప్పారు. మా మామయ్యగారు అక్కడికి వెళ్ళి ‘రిపేరుకు ఎంత అమౌంట్ అయింద’ని అడిగితే, “ఇన్స్యూరెన్స్ అమౌంట్ కాకుండా 19,000 అయింది” అని చెప్పారు. మా మామయ్యగారు ఇంటికి వచ్చి ఆ మాటను మా అత్తగారికి, మా అల్లుడికి చెప్పగానే వాళ్ళిద్దరూ, ‘ఇదంతా కేవలం బాబా అనుగ్రహమే’ అనుకుంటూ ఎంతో సంతోషంతో మనసులోనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే కాపాడే బాబా ఉండగా మనకు భయమేల? “బాబా! మీకు చెప్పుకున్నట్టుగా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటున్నాము. కానీ కాస్త ఆలస్యంగా పంచుకుంటున్నందుకు మమ్మల్ని క్షమించండి బాబా”.


మరో అనుభవం:


మా వదినావాళ్ళ అబ్బాయి బి.టెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. కరోనా కారణంగా ఈమధ్యకాలంలో అందరూ ఇంటి వద్ద నుంచే క్లాసులు అటెండ్ అవుతున్నారు కదా. దానికోసం ఇంటర్నెట్ కనెక్షన్ ఎప్పుడూ ఉండాలి. 2021, మార్చి నెలలో శివరాత్రి మరుసటిరోజు ఆ అబ్బాయికి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది. కానీ శివరాత్రిరోజు సాయంత్రం నుంచి మా ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లంగా ఉంది. దాంతో ఆ అబ్బాయి, “అయ్యో, ఇదేంటి? ఇప్పుడు ఇంటర్నెట్ రాకపోతే రేపు ఉదయం పరీక్షకు హాజరవడం ఎలా?” అని ఆందోళనపడుతూ, “సరే, నెట్‌వర్క్ ఆఫీసుకి కాల్ చేసి ప్రాబ్లమ్ ఏమిటో తెలుసుకుందాం” అనుకుని రాత్రి 8 గంటల సమయంలో ఇంటర్నెట్ వాళ్ళకి కాల్ చేశాడు. కానీ, ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మామూలుగా నెట్‌వర్క్ ఆఫీసు రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుంది. కానీ, ఆరోజు శివరాత్రి అవటం వలన మధ్యాహ్నం 2 గంటలకే ఆఫీసు క్లోజ్ చేశారు. ఆ విషయం ఆ అబ్బాయికి తరువాత తెలిసింది. ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆ అబ్బాయి బాబాను వేడుకుని, “బాబా! రేపు ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు మీరే నాకు హెల్ప్ చేయగలరు. మీరు ఎలాగైనా నాకు ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేట్టు చేయండి బాబా. మీ దయవల్ల ఇంటర్నెట్ కనెక్షన్ వస్తే నేను ఈ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను వేడుకున్నాడు. ఒక పదినిమిషాల తరువాత చూస్తే ఇంటర్నెట్ రూటర్ లైట్ ఆన్ అయివుండటం కనిపించింది. తనకు చాలా ఆశ్చర్యం వేసింది. ‘ఇందాక చూస్తే లైట్ వెలిగి లేదు. ఇంతలోనే ఎవరూ రిపేర్ చేయకుండానే ఇంటర్నెట్ ఎలా పనిచేస్తోంది? ఇదంతా ఖచ్చితంగా బాబా దయే’ అని అనుకుని ఎంతో సంతోషంతో మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. “ఎప్పుడూ ఇలాగే మాకు తోడుగా ఉండండి బాబా! ఈ కరోనాను త్వరగా తరిమివేసి అందరినీ కాపాడండి బాబా!” 


సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జయహో!


సాయిబాబా ఎన్నడూ మనల్ని విడిచిపెట్టరు


సాయిబంధువులకు నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. నేను హైదరాబాదులో నివసిస్తున్నాను. సాయే నా దైవం, గురువు, సంరక్షకుడు. ఆయనే నాకు మంచి స్నేహితుడు. సాయి మన జీవితంలోకి వచ్చాక ప్రతీదీ మంచిగా మారుతుంది. బాబా పట్ల ఉండే అపారమైన విశ్వాసం, సహనం భక్తులను సరైన మార్గంలో నడిపిస్తాయి. "బాబా! ఈ అనుభవాన్ని వివరించడంలో ఏవైనా తప్పులు దొర్లితే దయచేసి నన్ను క్షమించండి".


నేను గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. వాటిలో కొన్ని చిన్నవి, కొన్ని చాలా తీవ్రమైనవి కూడా ఉన్నాయి. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఇటీవల మా అమ్మకి కరోనా వచ్చి తగ్గింది. కరోనా వచ్చిన సమయంలో మా అమ్మ 15 రోజుల పాటు క్వారంటైన్ అవడం వల్ల నేను అమ్మ దగ్గరకు వెళ్లలేకపోయాను. అయితే మా అమ్మ క్వారంటైన్లో ఉన్న 15 రోజులూ ఏమీ ఆహారం తీసుకోకపోవడం వల్ల అమ్మ పరిస్థితి విషమించింది. దాంతో తనను హాస్పిటల్‌కు తీసుకెళ్ళి టెస్ట్ చేయిస్తే, ‘సాధారణంగా ఆడవారిలో 45 నుండి 90 యూనిట్లు ఉండాల్సిన సీరమ్ క్రియాటినైన్ (serum creatinine) అమ్మకు 10.5 యూనిట్లు ఉంద’ని చెప్పారు. అంత తక్కువ యూనిట్లు వస్తే మనిషి బ్రతకడం కష్టం. కానీ మేమంతా బాబా మీదే భారం వేసి, High Risk Consent పత్రంపై సంతకం చేసి, అమ్మకు డయాలసిస్‌ చేయడానికి ఒప్పుకున్నాము. అమ్మకి డయాలసిస్ చికిత్స ప్రారంభమైంది. “చికిత్స సమయంలో కూడా ప్రాణాపాయ పరిస్థితులు రావొచ్చు” అని డాక్టర్ ముందే చెప్పారు. కానీ బాబా అద్భుతం చేశారు. మా అమ్మకి ఇప్పటివరకు సుమారుగా 15 సార్లు డయాలసిస్ చేశారు. కానీ తనకు ఏ సమస్యా ఎదురవలేదు. బాబా ఆశీస్సులతో అమ్మ ఆరోగ్య సమస్య పరిష్కారం అయింది. అంతేకాదు, చికిత్స మధ్యలో మా భూమి రిజిస్ట్రేషన్ కూడా చేసుకునేలా చేశారు బాబా. అమ్మకు ఆరోగ్యం చేకూరి, రిజిస్ట్రేషన్ పనులు సక్రమంగా జరిగితే నా అనుభవాలను మన 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటానని బాబాకు మ్రొక్కుకున్నాను. బ్లాగులో నా అనుభవాన్ని పంచుకోవాలంటే ఏ విధంగా వ్రాయాలో ముందు నాకు అసలు తెలియలేదు. అలాంటిది బాబానే నాకు దారి చూపించారు. అలా నేను ఈరోజు మీ ముందు నా అనుభవాన్ని పంచుకోగలిగాను. ఇంకా కొన్ని కోరికలు తీర్చమని బాబాకు మ్రొక్కుకొని ఉన్నాను. బాబా దయతో అవి నెరవేరిన తరువాత ఆ అనుభవాలను కూడా ఈ బ్లాగులో పంచుకుంటాను. “చాలా చాలా ధన్యవాదాలు బాబా”.


నేను చెప్పేది నమ్మండి. అనారోగ్యానికి గురైనప్పుడు, బాధలో ఉన్నప్పుడు సాయి మాతో ఉన్నారని మేము ఆయనపై విశ్వాసం ఉంచాము. ఈ పరీక్షలు మన కర్మల వల్లనే. ప్రతీదీ ఒక కారణం చేత జరుగుతుందని మేము నిజంగా నమ్మాము. కాబట్టి సాయిబాబా యందు విశ్వాసం, సహనం చెదరకుండా ఉంచుకోవాలి. మనం మంచి కర్మలు చేయటంలో దృష్టి పెడితే తదుపరి జన్మలో ఇలాంటి పరీక్షలు ఎదుర్కోకుండా ఉంటాము. మనం అంతటా సాయిని చూడాలి, మంచి జరగడం కోసం ఆయన బోధలను ఆచరించాలి. ఏ పని చేస్తున్నా సాయిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. "బాబా! మీ భక్తులందరినీ ఆశీర్వదించండి. మా సమస్యలకు ముగింపు ఇవ్వండి. దయచేసి ఎప్పుడూ మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని వదిలిపెట్టకండి". 


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! 

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


ఊదీతో ఛాతీనొప్పి నుండి ఉపశమనం


నా పేరు బాలాజీ. నేను సాయిభక్తుడిని. ముందుగా సాటి సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సాయిభక్తులకు తమ అనుభవాలను పంచుకునే అద్భుతమైన అవకాశాన్నిచ్చిన సాయికి నా కృతజ్ఞతలు. బాబా నాకు ఇటీవల ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. మా నాన్నగారికి 88 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఆయన రోజుకు ఆరు గంటలకు పైగా ఆధ్యాత్మిక గ్రంథాలు, ప్రత్యేకించి సాయిబాబా పుస్తకాలు చదవడంలో గడుపుతారు. సాయి కృపవలన ఆయనకి చెప్పుకోదగ్గ పెద్ద ఆరోగ్య సమస్యలేమీ లేవు. అయితే, 2021, మే 18న ఆయన తన ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పారు. కోవిడ్ సమయంలో చిన్న సమస్య కూడా మానసికంగా చాలా కలవరపెడుతుంది. మేము వెంటనే  ఇంట్లో అందుబాటులో ఉన్న మందులు నాన్నకి ఇచ్చాము. ఆ మందులకంటే ఎక్కువగా మేము బాబా ఊదీని నమ్ముతాము. అందువలన కొద్దిగా ఊదీని నీళ్లలో కలిపి నాన్నకి ఇచ్చి, "బాబా! నాన్నకి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉపశమనం ప్రసాదించినట్లయితే, ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని సాయిని ప్రార్థించాను. మరుసటిరోజుకల్లా నాన్నకి చాలావరకు ఉపశమనం లభించింది. బాబా దయవలన ఆయన ఇప్పుడు బాగున్నారు. "సాయిప్రభూ! మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


వినాయక్ దాజీభావే



సాయిభక్తుడు వినాయక్ దాజీభావే బ్రాహ్మణ కులస్థుడు. అతను మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని షిరోల్ గ్రామ నివాసి. అతనికి 1916వ సంవత్సరంలో శ్రీసాయిబాబా గురించి తెలిసింది. ఆ సంవత్సరమే అతని తల్లి శ్రీమతి అన్నపూర్ణాబాయి బాబా దర్శనానికి శిరిడీ వెళ్ళింది. ఆమె మసీదు మెట్లెక్కుతుండగా బాబా, "మశీదు అపవిత్రమవుతుంది" అంటూ ఆమెను మసీదులోకి రానివ్వలేదు. ఇక చేసేది లేక ఆమె వెనుతిరిగి శిరిడీ విడిచి ఏవలా వెళ్ళింది. ఆమె అక్కడుండగా, యవత్‌మాళ్‌లో ఉన్న తన కోడలు (వినాయక్ సోదరుని భార్య) చనిపోయిందనే విషయం తెలియజేస్తూ ఆమెకు ఒక ఉత్తరం వచ్చింది. తాను బాబా దర్శనార్థం మసీదుకు వెళ్ళిన ముందురోజే తన కోడలు చనిపోయిందని ఆమెకు అర్థమైంది. ఆ విషయం తనకు తెలియనప్పటికీ బాబాకు తెలుసుననీ, అందుకే తనను మసీదులోకి రానివ్వలేదనీ, వారు సర్వజ్ఞులనీ ఆమె అనుకుంది.

1932లో వినాయక్ దాజీభావే నెలకు 90 రూపాయల జీతానికి బి.బి.సి.ఐ. రైల్వే కంపెనీలో గుమస్తాగా పనిచేస్తుండేవాడు. ఆ సమయంలో అతను ఒక గురువు కోసం అన్వేషిస్తూ 1932, ఏప్రిల్ 13 నుండి ఒక నెలరోజుల పాటు ‘గురుగీత’ పారాయణ చేశాడు. కానీ అతను ఆశించినట్లు గురువు లభించలేదు, స్వప్నంలో దత్తదర్శనమూ కాలేదు. తరువాత గురువును పూజించడానికి పవిత్రమైన ఒక గురువారంనాడు అతను దత్తమందిరానికి వెళ్ళాడు. ఆ మందిరంలో దత్త విగ్రహమున్న చోట అతనికి చక్కగా మలచిన ఒక సమాధి దర్శనమైంది. మరుసటిరోజు అతను తన స్నేహితుని ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న అన్నాసాహెబ్ దభోల్కర్ రచించిన శ్రీసాయిసచ్చరిత్ర గ్రంథాన్ని తెరిచాడు. అందులో ఉన్న శ్రీసాయిబాబా సమాధి చిత్రం అతని దృష్టిని ఆకర్షించింది. అంతకుముందెన్నడూ అతను సాయిబాబా సమాధి చిత్రాన్ని చూడలేదు. దత్తమందిరంలో తనకు దర్శనమిచ్చింది సాయిబాబా సమాధేనని అతను గుర్తించాడు. అంతటితో ‘సాయిబాబానే తన గురువు’ అని అతను తలచాడు. అప్పటినుండి కొన్నిరోజులపాటు అతను బాబా ఊదీని ధరిస్తూ సాయిబాబాపై రచించిన కొన్ని పుస్తకాలు చదివాడు. కానీ కొంతకాలం తరువాత ‘సమాధి గురువెలా అవుతుంద’ని అతను అసంతృప్తి చెందాడు. తాను ఆశ్రయించేందుకు, తన భావాలు విన్నవించుకునేందుకు తనకు ఒక సజీవుడైన గురువు కావాలని అతను కోరుకున్నాడు. గురుగీత పారాయణ చేస్తే గురువు లభిస్తారన్న విషయం మళ్ళీ గుర్తొచ్చి వెంటనే గురుగీత పారాయణ ప్రారంభించాడు. ఒక వారం తరువాత అతనికి కలలో పూణే సమీపంలోని ఖేడ్‌గాఁవ్-భేట్‌కు చెందిన శ్రీనారాయణ మహరాజ్‌ దర్శనమిచ్చారు. దాంతో, వారే తన గురువని తలచి ఖేడ్‌గాఁవ్ వెళ్లి అక్కడ బసచేశాడు. ఆ రాత్రి అతనికి కలలో శ్రీనారాయణ్ మహరాజ్ దర్శనమిచ్చి, "నాకు, శ్రీసాయిబాబాకు ఎటువంటి భేదం లేదు! నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు?" అని ప్రశ్నించారు. అందుకతను, "నాకు మార్గం చూపేవారెవరూ లేరు" అని బదులిచ్చాడు. అంతటితో అతనికి మెలకువ వచ్చింది. ఆ తరువాత వినాయక్ శిరిడీ వెళ్లి శ్రీసాయిబాబానే గురువుగా తలచి పూజించసాగాడు. ఒకసారి ఒక సాధువు అతని చేయి చూసి, "నీ గురువు సాయిబాబా!" అని చెప్పాడు. 

1933లో వినాయక్ కొడుకుకి ప్లేగు వ్యాధి సోకి, కేవలం బాబా ఊదీతో కోలుకున్నాడు. ఒకసారి వినాయక్ సోదరి దుర్గాబాయి కాకత్కర్‌కు శ్రీరామ సాక్షాత్కారం ఇప్పిస్తానని ఒక దత్తమహరాజ్ మాట ఇచ్చాడు. ఆమె అందుకు సంతోషించి 100 రూపాయలు, ఒక వెండి కప్పు అతనికి ఇచ్చింది. కానీ ఆ సాధువు చెప్పినట్లు ఆమెకు శ్రీరామ సాక్షాత్కారం లభించలేదు. ఆ దత్తమహరాజ్ తానిచ్చిన వెండికప్పును తిరిగి ఇవ్వడేమోనని ఆమె భయపడింది. అప్పుడు వినాయక్ ఆమెతో, "వెండికప్పును దత్తమహరాజ్ తిరిగిస్తే దానిని శ్రీసాయిబాబా సంస్థాన్‌కు సమర్పిస్తానని మ్రొక్కుకో! అలా చేస్తే సాయిబాబా దాన్ని తిరిగి ఇప్పిస్తార"ని చెప్పాడు. ఆమె అలాగే మ్రొక్కుకుంది. దత్తమహరాజ్ ఆ వెండికప్పు, 100 రూపాయలు తిరిగి ఆమెకు ఇచ్చేశాడు. ఆమె ఆ వెండికప్పును శ్రీసాయిబాబా సంస్థాన్‌కు పంపి తన మ్రొక్కు తీర్చుకుంది.

వినాయక్ తన తల్లి చనిపోయినప్పుడు పిండప్రదానం చేశాడు. కానీ ఎంతసేపటికీ ఆ పిండాన్ని కాకులు ముట్టుకోలేదు. అప్పుడు ‘కాకులు పిండాన్ని తీసుకొని వెళితే 50 రూపాయలు సాయిబాబా సంస్థాన్‌కి పంపుతాన’ని అతని సోదరి మ్రొక్కుకుంది. వెంటనే కాకులు వచ్చి ఆ పిండాన్ని తిన్నాయి.

(మూలం: డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ అఫ్ సాయిబాబా బై బి.వి.నరసింహస్వామి)

సాయిభక్తుల అనుభవమాలిక 817వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అది బాబా ప్రేమ
2. బాబా రక్షణ ఉండగా భయమెందుకు?
3. కుటుంబమంతటినీ కరోనా నుండి కాపాడిన బాబా

అది బాబా ప్రేమ


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు వరలక్ష్మి. మాది విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోట గ్రామం. ప్రస్తుతం మేము కొత్తవలసలో నివాసముంటున్నాము. నాకు ఊహ తెలిసినప్పటినుండి మా ఇంట్లో అందరూ బాబానే నమ్ముతుండేవాళ్లు. నేను 'ఎంతమంది దేవతలు ఉన్నారో వాళ్ళందరూ బాబానే' అన్న నమ్మకంతో ఉంటాను. మా ఇంట్లో మా వారికి గానీ, పిల్లలకు గానీ ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా బాబా ఊదీ పెడతాను. బాబా దయవలన కొద్దిసేపట్లో వాళ్ళ ఆరోగ్యం కుదుటపడుతుంది. బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు. 'సాయీ' అని పిలవగానే తక్షణమే బాబా ప్రత్యక్షమైనట్లు అక్కడ పరిస్థితి మనకు అనుభవమవుతుంది. ఇకపోతే, ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


మా పెద్ద తమ్ముడు వాళ్ళు బొబ్బిలిలో ఉంటారు. 2021, మే మూడవ వారంలో తన కొడుకుకి జ్వరం వచ్చింది. డాక్టర్ సలహామేరకు మందులు వాడుతున్నా జ్వరం తగ్గలేదు. తమ్ముడు నాకు ఫోన్ చేసి, "అక్కా! జ్వరం తగ్గినట్లే తగ్గి, మళ్లీ వస్తోంది" అని చెప్పాడు. బాబుకి అలా జ్వరం తగ్గకపోవడంతో చుట్టుప్రక్కలవాళ్ళు కరోనా ఏమోనని తమ్ముడు వాళ్లతో మాట్లాడటం మానేశారు. ఇక మూడవరోజు రాత్రి 12 గంటలకు తమ్ముడు నాకు ఫోన్ చేసి, "అక్కా! బాబుకి జ్వరం 104 డిగ్రీలు ఉంది. నాకు భయమేస్తోంది. ఈ రాత్రివేళ ఏ డాక్టరూ చూడరు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి?" అంటూ బాధపడ్డాడు. అది విని తన్నుకొస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ, నా బాధను వాళ్ళకు తెలియనివ్వకుండా నేను తనతో, "భయపడొద్దు, తడిగుడ్డతో శరీరమంతా తుడుస్తూ ఉండండి. అదే తగ్గుతుంద"ని ధైర్యం చెప్పాను. ఆ తరువాత నేను, "బాబా! బాబుకి జ్వరం తగ్గిపోయేలా అనుగ్రహించు తండ్రీ. అలాగే, వాడికి కరోనా కాకుండా చూడు తండ్రీ" అని బాబాను వేడుకుంటూ, "అలా జరిగితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని ప్రార్థించాను. మరుసటిరోజు తమ్ముడు ఫోన్ చేసి, "బాబుకి జ్వరం తగ్గి, సాధారణ స్థితికి వచ్చాడు. అలాగే కరోనా పరీక్ష చేయిస్తే 'నెగిటివ్' వచ్చింది" అని చెప్పాడు. అది బాబా ప్రేమ! భక్తుల బాధలు తనవిగా తీసుకునే శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! మనందరినీ కరోనా బారినుండి రక్షించమని మనసా, వాచా, కర్మణా ఆ సచ్చిదానంద సద్గురువుని ప్రార్థిస్తున్నాను.


బాబా రక్షణ ఉండగా భయమెందుకు?


ముందుగా సాయినాథునికి నా నమస్కారాలు. నా పేరు లక్ష్మి. నేను బెంగుళూరు నివాసిని. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. 2021, ఏప్రిల్ నెలలో మా పెద్దబ్బాయి, చిన్నబ్బాయి తప్పనిసరై వేరే ఊళ్ళకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల వలన నేను చాలా భయపడుతూనే బాబా ఊదీ ప్యాకెట్లను వాళ్ళకు రక్షగా ఇచ్చి పంపాను. మన బాబా దయవలన వాళ్ళు ఊర్లు వెళ్లొచ్చాక ఎలాంటి భయాందోళనలు లేకుండా హాయిగా ఉన్నారు. బాబా రక్షణ ఉండగా మాకు భయమెందుకు?


మరో అనుభవం:


ఇటీవల నా పాదాలు వాచి నడవడానికి ఇబ్బందిగా ఉండటంతో నేను చాలా కష్టాన్ని అనుభవించాను. అప్పుడు నా కష్టాన్ని బాబాకు చెప్పుకుని, ఊదీని పాదాలకు రాసుకుంటూ, ఊదీ నీళ్ళు త్రాగుతూ ఉండేదాన్ని. అలా ఉండగా ఒకరోజు రాత్రి బాబా నాకు స్వప్నదర్శనమిచ్చారు. నేను బాబాను తన్మయత్వంతో చూస్తుండగా ఆయన తమకు నమస్కారం చేసుకోమని అన్నారు. అంతేకాదు, బాబా బలవంతంగా నా చేతులు పట్టుకుని, తమ పాదాలను తాకించి నాచేత నమస్కారం చేయించారు. ఆశ్చర్యంగా ఆరోజు నుండి నా పాదాల వాపు, నొప్పులు తగ్గుముఖం పట్టాయి. కొన్నిరోజులలో బాబా దయవలన పూర్తిగా తగ్గిపోతాయని నా నమ్మకం.


ఇంకో అనుభవం:


ఇటీవల మా చిన్నకోడలు తనకున్న అసిడిటీ సమస్య గురించి డాక్టరును సంప్రదిస్తే, తనకు కోవిడ్ టెస్ట్ చేయించారు. నాకు చాలా భయమేసి బాబాకు నమస్కరించుకుని, "రిపోర్టు నెగెటివ్ వచ్చేలా అనుగ్రహించండి బాబా" అని వేడుకున్నాను. బాబా మమ్మల్ని  కరుణించారు. ఆయన కృపవలన 2021, మే 20న రిపోర్టు నెగెటివ్ అని వచ్చింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ కృపాకటాక్షాలు ఎల్లవేళలా మా కుటుంబంపై ఇలాగే వర్షించు తండ్రీ".


మరో చిన్న అనుభవం:


ఈమధ్య మా మనవడికి, మనవరాలికి వ్యాక్సిన్ వేయించాం. ఆ సాయంకాలానికి పిల్లలిద్దరికీ 102 డిగ్రీల జ్వరం వచ్చింది. టాబ్లెట్స్ వేసినా రాత్రి వరకు జ్వరం తగ్గలేదు. నాకు చాలా భయమేసి, బాబా ఊదీని నీళ్లలో కలిపి పిల్లల చేత రెండుసార్లు త్రాగించి, మరికొంత ఊదీని పిల్లల  నుదుటన పెట్టి, "రేపు ఉదయానికల్లా పిల్లలిద్దరికీ జ్వరం తగ్గితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు దణ్ణం పెట్టుకుని పడుకున్నాను. ఉదయానికి జ్వరం పూర్తిగా తగ్గి పిల్లలు బాగున్నారు. అంతా సాయినాథుని కృప. "ధన్యవాదాలు తండ్రీ".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


కుటుంబమంతటినీ కరోనా నుండి కాపాడిన బాబా


సాయిబంధువులందరికీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నా పేరు సునీల్. ఇటీవల మా కుటుంబమంతా కరోనా మహమ్మారి బారినపడ్డాము. ఒక పని మీద మేము మా ఊరు వెళ్ళవలసి వచ్చింది. అయితే మేము ఊరు వెళ్లొచ్చినరోజు నుంచి మాకు జ్వరం, ఒళ్ళునొప్పులు మొదలయ్యాయి. లక్షణాలను బట్టి కరోనా ఏమోనని గృహనిర్బంధంలో ఉంటూ మందులు వాడటం మొదలుపెట్టాము. నేను నా మనసులో సాయిని ధ్యానించి, "మా కుటుంబమంతా ఈ మహమ్మారి నుండి బయటపడేలా అనుగ్రహించమ"ని ఆయననే శరణువేడాను. మేమంతా రోజూ బాబా ఊదీ ధరిస్తూ ఉండేవాళ్ళం. మూడు రోజుల తరువాత మా అత్తగారి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. నేను సాయిని వేడుకుని, ఆయనపై విశ్వాసముంచాను. నిజంగా నేను ఆ సమయంలో చాలా టెన్షన్ పడి, "బాబా! ఆమె పరిస్థితి బాగుంటే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాన"ని సాయితో చెప్పుకున్నాను. అప్పటినుండి బాబా దయవలన మా అత్తగారి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయి. క్రమంగా ఆమె పరిస్థితి మెరుగుపడింది. తరువాత ఒక్కొక్కరిని కరోనా మహమ్మారి నుండి బయటపడేశారు బాబా. ఇప్పుడు బాబా కృపవల్ల మా కుటుంబమంతా క్షేమంగా ఉంది. ఇదంతా సాయిబాబా మరియు వారి ఊదీ మహిమ.


ఓం శ్రీ సాయినాథాయ నమః.

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.



సాయిభక్తుల అనుభవమాలిక 816వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా ఇచ్చిన భరోసా - ప్రసాదించిన ఆరోగ్యం
  2. చెప్పినట్లే, వెంటే ఉంటూ అనుగ్రహించిన బాబా

బాబా ఇచ్చిన భరోసా - ప్రసాదించిన ఆరోగ్యం


ఓం శ్రీ సాయినాథాయ నమః


నా పరాత్పర గురువైన సాయినాథుని పాదపద్మములకు నమస్కరిస్తూ, సాయినాథుడు చూపిన మహత్యాన్ని మీతో పంచుకుంటున్నాను. నా పేరు కృష్ణ. 2021, మే నెల రెండవ  వారంలో మా అమ్మగారి ఒంటికి నీరు పట్టడంతో కొద్దిగా ఆయాసంతో వారం రోజులు బాధపడ్డారు. అదే సమయంలో నా ప్రాణస్నేహితుడు కూడా జ్వరంతో బాధపడుతున్నాడు. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు సాయిబాబా నా ప్రాణస్నేహితుని రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నారు. నేను వైద్యసంబంధ వృత్తిలో ఉన్నాను. వైద్యుడైన నా మరో స్నేహితుడు మా అమ్మకి, నా ప్రాణస్నేహితునికి వైద్యం చేస్తున్నాడు. నేనెప్పుడూ నా స్నేహితుడు వైద్యం చేస్తున్నాడని అనుకోను, నా స్నేహితుని ద్వారా సాయినాథుడే వైద్యం చేస్తున్నారని ప్రగాఢంగా విశ్వసిస్తాను. అందుకే నేను ఎప్పుడూ మా అమ్మగారితో, “అమ్మా! నువ్వు ముందుగా బాబా ఎదురుగా నిలుచుని నీ సమస్యలను బాబాకు విన్నవించుకుని, ఆ తర్వాత మాత్రమే నా స్నేహితుడితో మాట్లాడు” అని చెప్తాను. ముందుగా బాబాకు అన్ని బాధలూ నివేదించిన తర్వాత, వైద్యుడైన నా స్నేహితుడి ద్వారా బాబానే సరైన ఔషధాన్ని నిర్ణయిస్తారు. ఇది పరమ సత్యం. బాబానే వైద్యం చేస్తారు. ఇకపోతే వారం రోజుల నుండి నాకు ప్రియమైన ఇద్దరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో, ఒకరోజు నాకెందుకో చాలా బాధగానూ, భయంగానూ అనిపించింది. ఆరోజు రాత్రి మా అమ్మగారికి కాళ్ళు నొక్కుతూ సాయి మహరాజ్ సన్నిధి వాట్సాప్ గ్రూప్ చూస్తూ యథాలాపంగా స్క్రోల్ చేశాను. అప్పుడు ఈక్రింది మెసేజ్ కనబడింది: 


🔥సాయి వచనం:- “దయామయుడైన ఈ ఫకీరు నిన్ను తప్పక రక్షించును. నాయందు విశ్వాసముంచుము. భయపడకు, ఆందోళనపడవద్దు”. 


అది బాబా వచనమే అయినప్పటికీ, ‘ఏదో యాదృచ్ఛికంగా కనబడిందిలే’ అనుకుని మళ్లీ స్క్రోల్ చేశాను. విచిత్రంగా మళ్ళీ అదే మెసేజ్ వేరేచోట కనబడింది. దాంతో, బాబా నాకు భరోసా ఇస్తున్నారనిపించి కొంత ధైర్యం వచ్చింది. ఆ మర్నాడు సాయంత్రం నా ప్రార్థన ముగించుకుని నా పనిమీద బయలుదేరాను. వెళ్ళేదారిలో నా చిన్ననాటి మా స్కూల్ మాస్టారు కనపడ్డారు. ఆయన నాతో మామూలుగా మాట్లాడుతూ, “నీకు ఒక మహత్యం చెప్తాను” అన్నారు. ఆ మాస్టారు సాయిబాబా రూపంలో ఉన్న గురువుగారి శిష్యులు కాదు, వేరే రూపంలో ఉన్న గురువుగారి శిష్యుడు. అందువల్ల, ‘తన గురువు గురించిన మహత్యం ఏదో చెప్తారులే’ అనుకున్నాను. కానీ ఆయన చాలా చిత్రంగా మా ఊరి దగ్గరలో ఉన్నటువంటి ఒక గొప్ప సాయిభక్తుడికి జరిగిన యదార్థ సంఘటన చెప్పారు. ఆ ఊరిలో ఆ సాయిభక్తుడు సాయిబాబాను కొలుస్తూ, తన దగ్గరకు వచ్చేవాళ్ళందరికీ కూడా బాబా మహత్యాన్ని వివరిస్తూ, వారినందరినీ కూడా బాబా మార్గంలో నడిపిస్తూ ఉంటారు. ప్రతిరోజూ శ్రద్ధగా పూజచేసి బాబాను కొలుస్తూ ఉంటారు. ఆయనను గురువుగా భావించి ఎంతోమంది ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి తమ తమ కష్టాలను చెప్పుకుంటుంటారు. ఆ సాయిభక్తుని ద్వారా బాబా ఆ కష్టాలకు పరిష్కారాలు సూచిస్తారు. 


ఆ సాయిభక్తునికి జరిగిన యదార్థ సంఘటన:


ఆ సాయిభక్తుడు ఒకరోజు బాబాకు పూజ చేస్తూ ఉన్నారు. అప్పుడొక శిష్యుడు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి, “అయ్యా! నా బిడ్డ నూతిలో పడిపోయింది స్వామీ” అని చెప్పారు. ఆ సాయిభక్తుడు బాబాకు పూజ చేస్తూ చేస్తూ మధ్యలో ఒకసారి బాబా వైపు చూసి, "ఈపాటికి నువ్వు కాపాడి ఉంటావులే" అని, తను చేస్తున్న పూజను కొనసాగించసాగారు. ఆ వచ్చినాయన కూడా ఆ సాయిభక్తునిపై ఎంతో నమ్మకంతో పూజ అయ్యేంతవరకు అలాగే కూర్చున్నారు. ఈ సాయిభక్తునికి బాబా మీద ఎంత నమ్మకం! ‘నువ్వు రక్షించి ఉంటావులే’ అని చెప్పి తన పూజ కొనసాగిస్తున్నారు. ఆ వచ్చిన శిష్యునికి ఈయన మీద ఎంత నమ్మకం! ఎలాగైనా తన బిడ్డను ఆయనే కాపాడతారు అని ఎదురుచూస్తూ ఉన్నాడు. పూజ పూర్తయింది. ఆ సాయిభక్తుడు నిదానంగా లేచి బావి దగ్గరకు వెళ్ళారు. అప్పటికే ఆ బావిలో మూలనున్న ఒక రాతి మీద ఆ పాప కూర్చుని ఉంది. ఆ పాపను నిదానంగా బయటకు తీసి, ‘ఏం జరిగింద’ని అడిగారు. “నేను పడిపోగానే బాబా వచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు” అని చెప్పింది ఆ పాప. 


ఈ సంఘటన చెప్పిన తరువాత మా స్కూల్ మాస్టారు నాతో, “మీ గురువుగారి మీద నమ్మకం ఉంచు, ఇంకేమీ చేయాల్సిన పనిలేదు” అన్నారు. అసలు మా స్కూల్ మాస్టారికి నేను ఇలా నాకు ప్రియమైనవారికోసం బాధపడుతున్న సంగతిగానీ, భయపడుతున్న సంగతిగానీ తెలీదు. ఏమీ తెలియకుండానే, “మీ గురువు ఖచ్చితంగా రక్షిస్తారు” అని చెప్పారు. 


చాలా చిత్రంగా, ముందురోజు రాత్రి కనిపించిన బాబా మెసేజ్, స్కూల్ మాస్టారు చెప్పిన బాబా మహత్యం – ఈ రెండూ కలిసి నాలో ధైర్యాన్ని నింపాయి. ‘మా అమ్మగారిని, నా ప్రాణస్నేహితుడిని బాబా ఖచ్చితంగా రక్షిస్తారు’ అని నమ్మకం కలిగింది. దాంతో నేను కాస్త ప్రశాంతంగా ఉన్నాను. ఆరోజు నుండి నా ప్రాణస్నేహితుడి ఆరోగ్యం మెల్లమెల్లగా మెరుగవటం ప్రారంభమై, బాబా అనుగ్రహంతో 2021, మే 20 నాటికి తను పూర్తిగా కోలుకున్నాడు. మా అమ్మగారు కూడా కోలుకోవడం మొదలైంది. శ్రీసాయిసచ్చరిత్రలో కూడా ఒకసారి బూటీకి జ్వరం వస్తే బాబాగారు అతనితో, “నువ్వు ఇంటికి వెళ్లి శుభ్రంగా పాయసంలో బాదం, పిస్తా వేసుకుని తిను, తిరుగు, అదే తగ్గిపోతుందిలే” అన్నారు. బూటీ ఇంటికి వెళ్లి బాబా చెప్పినట్లు చేస్తుంటే డాక్టర్ వచ్చి, ‘ఇలా చేస్తే ఇబ్బంది కలుగుతుంది’ అని చెప్పినా సరే, బూటీ మాత్రం బాబా మాట మీద నమ్మకంతో బాబా చెప్పినట్టే చేశాడు. బాబా అనుగ్రహంతో బూటీకి నాలుగు రోజుల్లో జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. అదేవిధంగా, మా అమ్మగారిని బాబా ఖచ్చితంగా కాపాడుతారని నా నమ్మకం. ఇది నా సాయిబాబాపై నాకున్న నమ్మకం. పై రెండు సంఘటనలు చాలా యాదృచ్ఛికంగా జరిగినట్లు అనిపించినప్పటికీ బాబానే ఆయా రూపాల్లో నాకు భరోసానిచ్చారనేది నా అనుభవం. అందుకే బాబాపై భారం వేసి అమ్మకు త్వరగా ఆరోగ్యం చేకూరేలా అనుగ్రహించమని బాబాను ఆర్తిగా ప్రార్థించసాగాను. 


రెండు రోజుల తరువాత, అంటే మే 22న బాబా తమ మహత్యాన్ని చూపించారు. మా అమ్మగారికి ఒంటికి నీరు పట్టి కొద్దిగా ఆయాసంతో ఇబ్బందిపడుతున్నారని చెప్పాను కదా! మా అమ్మగారి ఆరోగ్య పరిస్థితిని చూసి, ‘తనకు లివర్ సమస్యగానీ, కిడ్నీ సమస్యగానీ ఉండవచ్చ’ని నేను, వైద్యుడైన నా స్నేహితుడు అనుకున్నాము. పై అనుభవాల ద్వారా బాబా నాకు భరోసా ఇచ్చారనే ధైర్యంతో నేను మా అమ్మగారికి అన్ని టెస్టులూ చేయించాను. సాయి మహరాజ్ మిరాకిల్ చూపించారు. అమ్మకి కిడ్నీ సమస్యగానీ, లివర్ సమస్యగానీ ఏదీ లేదు. మేజర్ ఆర్గాన్స్ అన్నీ బాగున్నాయి. కేవలం యూరిన్ ఇన్ఫెక్షన్, రక్తహీనత వల్ల మాత్రమే తనకు అలా జరిగిందని రిపోర్టులలో తెలిసింది. ఇది కేవలం సాయిబాబా మహత్యం మాత్రమే! నేను, నా స్నేహితుడు వైద్యసంబంధ వృత్తులలో ఉండటం వల్ల ఈ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. మా అమ్మకి మేజర్ ఆర్గాన్స్‌కి ఏ నష్టమూ వాటిల్లకుండా చాలా చిన్న సమస్యతో సరిపోయింది. బాబా దయవల్ల మరుసటి గురువారానికి అమ్మకు ఆయాసం పూర్తిగా తగ్గిపోయింది, శరీరంలోని నీరు 50 శాతం వరకు తగ్గింది. ఇంకో వారంలో పూర్తిగా తగ్గిపోతుందని అనుకున్నాం కానీ, ఆ 50 శాతం నీరు అలాగే ఉండిపోయింది. నా స్నేహితుని రూపంలో బాబా వైద్యం చేస్తున్నప్పటికీ నాకు కాస్త భయంగా అనిపించింది. ఒకరోజు బాబాను వేడుకుని సచ్చరిత్ర తెరిచాను. చాలా విచిత్రంగా, అంతకుముందు నేను సాయి మహరాజ్ సన్నిధి వాట్సాప్ గ్రూపులో స్క్రోల్ చేసినప్పుడు ఏ వాక్యమైతే వచ్చిందో అదే వాక్యం - "దయామయుడైన ఈ ఫకీరు నిన్ను తప్పక రక్షించును. నాయందు విశ్వాసముంచుము. భయపడకు, ఆందోళనపడవద్దు" అని సచ్చరిత్ర పుస్తకంలో మళ్ళీ కనిపించింది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అదే సమయంలో ధైర్యం కూడా కలిగింది. సాయిబాబా ఒక్కసారి అభయమిచ్చిన తర్వాత మనం నమ్మినా, నమ్మకపోయినా ఆయన మనల్ని ఖచ్చితంగా కాపాడి తీరుతారు. కాబట్టి నేను కొంచెం స్థిమితపడి బాబాపై నమ్మకంతో వేచి ఉండసాగాను. మరో వారం గడిచేటప్పటికి అమ్మకి చాలావరకు నార్మల్ అయింది. ప్రస్తుతం అమ్మకి పూర్తిగా ఆరోగ్యం చేకూరింది. కొద్దిపాటి నీరసం మాత్రమే ఉంది. మిగిలిన ఈ చిన్న సమస్య కూడా అతిత్వరలో తగ్గిపోయి మా అమ్మకి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. బాబా ఖచ్చితంగా తొందరలోనే అమ్మకు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారనే నమ్మకం నాకుంది. అంతా సాయి మహరాజ్ దయ. ఏది ఏమైనా మనల్ని రక్షించేది, కాపాడేది ఆ సాయినాథుడే! ఒకరోజు అటూ ఇటూ కావచ్చు, కానీ కాపాడటం మటుకు పక్కా. మా ఇంటిలోని వారందరినీ ఆ సాయినాథుడు ఎల్లవేళలా అనుక్షణం వెన్నంటి కాపాడుతూ, రక్షిస్తూ, సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నారు. మాకు ఆ సాయినాథుడే రక్ష. త్వరలో బాబా అనుగ్రహించిన మరొక లీలా మహత్యాన్ని మీతో పంచుకుంటాను. 


అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ 

తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయినాథ!


చెప్పినట్లే, వెంటే ఉంటూ అనుగ్రహించిన బాబా

 

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు గీత. నాకు బాబాతో అనుబంధం చిన్నప్పటినుంచి ఉంది. కానీ ఈమధ్య ఆ అనుబంధం చాలా బలపడింది. బాబా నాకు ఎన్నో సమస్యల్లో దారిచూపారు. అందులోనుండి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఈమధ్య, అనగా 2021, మే 10న మా అమ్మానాన్నలకు జ్వరం వచ్చింది. దాంతోపాటు ఒళ్ళునొప్పులు కూడా ఉన్నాయి. ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న నాకు ఏం చేయాలో తెలియలేదు. ఎందుకంటే, నేను వాళ్లకు చాలా దూరంలో ఉన్నాను. అసలే కరోనా కాలం. అయినా సరే, ధైర్యం చేసి మరుసటిరోజు బయలుదేరి వెళదామని అనుకున్నాను. కానీ అంతలోనే లాక్‌డౌన్ అని తెలిసి చాలా భయపడ్డాను. అయినప్పటికీ 2021, మే 11 మధ్యాహ్నం 4.30 గంటలకు ఇంటినుండి ఆటోలో బయలుదేరాము. నేను నా మనసులో బాబాను తలచుకుంటూ, "మేము బయలుదేరాం బాబా. బస్టాండుకి చేరుకునేలోపు మీరు దర్శనం ఇవ్వండి బాబా" అని అనుకుంటూ ఆటోలో కూర్చున్నాను. వెంటనే, బాబా నాట్యం చేస్తున్న ఫోటో నాకు కనిపించింది. దాంతోపాటు, "నీవు గమ్యస్థానం చేరేలోపు అంతా సర్దివుంచుతా! నేను నీ వెంటే ఉంటాను" అన్న బాబా సందేశం కూడా ఉంది. ఇంక నా ఆనందానికి అంతే లేదు. మేము మూడు బస్సులు మారి మా ప్రయాణం సాగించాము. చెప్పినట్లే, ప్రతి బస్సులోనూ బాబా మాకు దర్శనం ఇచ్చారు. బాబా ఆశీస్సులతో మా ప్రయాణం సౌఖ్యంగా సాగి క్షేమంగా గమ్యం చేరుకున్నాం. మరుసటిరోజు తెల్లవారాక అమ్మానాన్నలకు కోవిడ్ టెస్టు చేయించాము. మా నాన్నకు కొద్దిగా పాజిటివ్ వచ్చినప్పటికీ బాబా దయవలన అమ్మకు నెగిటివ్ వచ్చింది. అమ్మను వారం రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. బాబా దయతో నాన్న కూడా ఇంట్లోనే ఉంటూ వారం రోజులు మందులు వాడారు. ఆ తరువాత టెస్ట్ చేయిస్తే నెగిటివ్ వచ్చింది. కానీ నాన్న బాగా నీరసించిపోయారు. అయినప్పటికీ బాబా దయవల్ల తొందరగానే చాలావరకు కోలుకున్నారు. "బాబా! అమ్మానాన్నలకు తగ్గితే బ్లాగులో పంచుకుంటానని మీతో చెప్పాను, కానీ కొద్దిగా ఆలస్యమైంది. తండ్రీ! నీ చల్లని దృష్టితో మాకు ఎల్లప్పుడూ రక్షణనివ్వు. నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, మమ్మల్ని ఎన్నడూ మీ నుండి దూరం చేయకు తండ్రీ!"


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo