సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 798వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ఆరోగ్యాన్ని ప్రసాదించిన ప్రేమమూర్తి
  2. బాబానే మా జీవితాలకు రక్ష!
  3. సాయిపై విశ్వాసమే ఆరోగ్యాన్ని ప్రసాదించింది


ఆరోగ్యాన్ని ప్రసాదించిన ప్రేమమూర్తి


అందరికీ నమస్కారం. నా పేరు రఘు, మేము హైదరాబాదులో ఉంటాము. ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నా దినచర్య, ఈ బ్లాగులో ప్రచురించే సాయిలీలలను చదవటంతో ప్రారంభమై సాయిసచ్చరిత్ర చదవటంతో ముగుస్తుంది. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను, నా ఆలోచనలను, అభిప్రాయలను ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటాను.


నా సిస్టర్ ప్రభుత్వోద్యోగం చేస్తోంది. ఒకరోజు వాళ్ళ ఆఫీసులో తనకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మూడు రోజుల వరకు తన ఆరోగ్యం బాగానే ఉంది. నాలుగవ రోజు నుంచి తనకు ఆరోగ్యం దెబ్బతిన్నది. జ్వరం, వాంతులు, విరేచనాలతో తను ఎంతో బాధపడింది. ఏమి తిన్నా, ఏమి త్రాగినా వాంతులు అవుతుండేవి. మందులు వేసుకున్నప్పటికీ వాంతులు, విరేచనాలు తగ్గటం లేదు. తన పరిస్థితి చూసి నేను బాబాకు నమస్కరించుకుని, ‘తనకు ఆరోగ్యాన్ని ప్రసాదించమ’ని ప్రార్థించి, ‘తను త్వరగా ఆరోగ్యవంతురాలైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని బాబాకు మాటిచ్చాను. బాబా దయవలన రెండు రోజుల్లో తనకు జ్వరం, వాంతులు తగ్గిపోయాయి. విరేచనాలు మాత్రం మరో రెండు రోజుల పాటు తనను ఇబ్బందిపెట్టి ఆ తరువాత తగ్గాయి. “చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీకు మాటిచ్చినట్లు నా అనుభవాన్ని బ్లాగులో పంచుకున్నాను”.


మరొక అనుభవం:


ఒకరోజు ఉదయం నేను పళ్ళుతోముకున్న తరువాత ఎందుకో గొంతులో ఏదో పట్టేసినట్టు, ఏదో అడ్డంగా ఉన్నట్టు అనిపించింది. దాంతో నాకు ఒక్కసారిగా భయం వేసింది. అసలే కరోనా కాలం. వెంటనే వేడినీళ్లతో నోరు పుక్కిలించాను. తరువాత వేడినీళ్ళు త్రాగాను. కానీ ఏమీ ఉపశమనం కలుగలేదు. గొంతులో ఇంకా అలాగే ఉంది. గత సంవత్సరం నాకు కరోనా వచ్చి బాబా దయవల్ల తగ్గింది. అందువల్ల ఇప్పుడు భయం ఇంకా ఎక్కువైంది. వెంటనే స్నానం చేసి, బాబా వద్దకు వెళ్ళి బాబాకు నమస్కరించుకుని, మంచినీళ్ళలో బాబా ఊదీని వేసుకుని ఆ ఊదీనీళ్లు త్రాగి, కొద్దిగా ఊదీని గొంతుకి రాసుకున్నాను. తరువాత నా సమస్యను బాబాకు చెప్పుకుని, నాకు సహాయం చేయమని ప్రార్థించి, ‘మీ దయవల్ల ఈ సమస్య సమసిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని బాబాకు మాటిచ్చాను. ఆ తరువాత కొద్దికొద్దిగా వేడినీళ్ళు త్రాగుతూ, ‘ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయక నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాను. బాబా అద్భుతం చేశారు. కేవలం రెండు గంటల్లో నా గొంతు నార్మల్‌గా అయింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. 


ఇలా నాకు ఏ చిన్న సమస్య వచ్చినా నేను బాబాకు చెప్పుకుంటాను. నా సమస్యను బాబాకు అప్పగించి నేను ప్రశాంతంగా పారాయణ బ్లాగులో సభ్యుడిగా ప్రతివారం పారాయణ చేస్తాను. మా కుటుంబాన్నంతటినీ బాబా ఏ ఆపదా లేకుండా చూసుకుంటున్నారు. ఎల్లప్పుడూ బాబా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. “బాబా! శాలరీ హైక్ విషయంలో నాకు మీ సహాయం కావాలి బాబా. నేను కోరుకున్న హైక్ నాకు ఇప్పించి నాకు సహాయం చేయండి బాబా. మా ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుండాలని దీవించండి. ఎల్లప్పుడూ మేము మీతోనే ఉండేలా దీవించి, మమ్మల్ని మీ దారిలో నడిపించండి. నా అనుభవాలను పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా”


సాయి సర్వాంతర్యామి! సర్వజీవ హృదయనివాసి! మనం అడిగేవాటికి, అడగనివాటికి కూడా సమాధానమిచ్చే ప్రేమమూర్తి!


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు! శుభం భవతు!


బాబానే మా జీవితాలకు రక్ష!


సాయిభక్తులందరికీ మరియు సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. నేను ఇటీవల చాలా అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా వయస్సు పెరుగుతున్నా నాకు ఎక్కడా సంబంధాలు కుదరక నేను, నా కుటుంబం ఎంతో ఆందోళన చెందేవాళ్ళం. అటువంటి సమయంలో నేను 'సాయి పూజ' చేశాను. బాబా దయవల్ల నాకు తొందరలోనే ఒక సంబంధం కుదిరి నా వివాహం నిశ్చయమైంది. నేను చేసిన సాయి పూజ వలనే నాకు సంబంధం కుదిరిందని నా గట్టి నమ్మకం. ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని, "ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అన్నీ సమయానికి  సమకూరి నా పెళ్లి బాగా జరిగినట్లయితే నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా కృపతో నా పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా బాగా జరిగింది. "ధన్యవాదాలు బాబా. ఆలస్యంగా ఈ అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి. మా వైవాహిక జీవితం ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండేలా అనుగ్రహించండి బాబా. మేము ఆర్థికంగా కాస్త బాధపడుతున్నాము. నా భర్త బిజినెస్ బాగా నడవాలి. ఆయన అనవసరపు ఖర్చులు మానుకోవాలి. నేను ఏమి కోరుకుంటున్నానో మీకు తెలుసు. వాటిని త్వరగా నెరవేర్చండి బాబా".


మరొక అనుభవం:


మేము ఇంటినుండే ఒక ప్రాజెక్ట్ వర్క్‌లో పనిచేస్తున్నాము. కరోనా సమయంలో ఉపాధి లేని మాకు అదే ఆధారమైంది. అయితే అది మధ్యలోనే ఆగిపోతుందని తెలిసి మేము చాలా కంగారుపడ్డాము. వెంటనే, "వర్క్ ఆగిపోకుండా ఈ సంవత్సరమంతా చక్కగా కొనసాగాల"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవలన వర్క్ ఆగిపోకుండా ఇప్పటివరకూ ప్రాజెక్ట్ కొనసాగుతూనే ఉంది. "అందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా". అయితే, మధ్యలో ఒకరోజు సాయంత్రం వరకు వర్క్ రాలేదు. దాంతో వర్క్ ఆగిపోయిందేమోనని భయపడి, "బాబా! వర్క్ వచ్చేలా అనుగ్రహించండి" అని వేడుకుని, "వర్క్ వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని  బాబాకు చెప్పుకున్నాను. వెంటనే వర్క్ రావడం మొదలైంది. ఆ వర్క్ మీదనే ఆధారపడి ఉన్న మా కుటుంబమంతా బాబా దయవలన ఇలా బ్రతుకుతున్నాము. ఏ చిన్న ఆపద వచ్చినా, బాధ కలిగినా నా నోటి నుండి వచ్చే మొదటి పదం 'బాబా'. నేను నాకొచ్చిన సమస్యను బాబాకు చెప్పుకుంటాను. "నేనున్నాను" అంటూ బాబా నాకు అనుభవమిస్తారు. బాబానే మా జీవితాలకు రక్ష. "బాబా! మా అందరికీ ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. మీ దయతో త్వరలోనే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. మా పెద్దక్కవాళ్ళకి చాలా అప్పులు ఉన్నాయి. వాళ్ళంతా సర్వం నీవే అనుకుని బ్రతుకుతున్నారు. మీరే వాళ్ళకు మార్గం చూపించాలి బాబా. వాళ్లకు రావాల్సిన డబ్బు త్వరగా అంది, వాళ్ళ ఇబ్బందులు తీరేలా అనుగ్రహించండి. ఇకపోతే, నా పెళ్లి చేసి మా అమ్మానాన్నలు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. పెళ్లికోసం చేసిన అప్పులు త్వరగా తీరేలా ఆశీర్వదించండి. నాకు సర్వం నీవే బాబా. కరోనా మహమ్మారి త్వరగా అంతరించిపోయి అందరూ బాగుండేలా అనుగ్రహించండి బాబా".


సాయిపై విశ్వాసమే ఆరోగ్యాన్ని ప్రసాదించింది


సాయిబంధువులకు నమస్కారం. నేను సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 2021, మే నెల మొదటివారంలో నా ఆరోగ్యం దెబ్బతింది. ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు, అసిడిటీ మరియు జ్వరం మొదలయ్యేసరికి నాకు చాలా భయం వేసింది. అసలే కరోనా సమయం, బయటికి వెళ్లాలంటేనే భయం. అటువంటి సమయంలో నా ఆరోగ్యం పాడయ్యేసరికి నాకేమీ తోచలేదు. జ్వరం ఉన్నందువల్ల కరోనా ఏమోనని కరోనా పరీక్ష చేయించుకున్నాను. బాబా దయవల్ల నాకు కరోనా లేదు. అంతేకాక, ఆయన అనుగ్రహం వల్ల అసలు సమస్య ఏమిటో కూడా తెలిసింది, 'పొట్టలో ఇన్ఫెక్షన్ వల్ల నాకు ఆరోగ్యం దెబ్బతింది' అని. నేను ఒకటే అనుకున్నాను, 'బాబా మీద నాకున్న నమ్మకమే నన్ను కాపాడుతుంది' అని. అదే నిజమైంది. ఆ విశ్వాసమే నన్ను నాకొచ్చిన ఆరోగ్య సమస్యల నుండి బయటపడేసింది. బాబా అనుగ్రహంతో నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. "థాంక్యూ బాబా". మరో అనుభవంతో మళ్లీ మీ ముందుకు వస్తాను.


15 comments:

  1. Om Sai ram 🙏🏽🙏🏽🌹🙌❤️😀

    ReplyDelete
  2. Om Sai baba please bless my family.Tandri please give blessings to be healthy and safe.Om Sai baba 🙏🏽🙏🏽🙏🏽🌹🙌❤️👏

    ReplyDelete
  3. Kothakonda SrinivasJune 7, 2021 at 7:08 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  4. Om sai ram 🙏 baba ma amma ki nanna ki annayya ki carona vachi vunnaru vallu mugguriki vachi 14 days ayipoyaayi e roju tho valla ki thondarga negative vachi na anubhavanni e blog lo share chesukune adrushtani prasadinchandi baba 🙏🙏🙏

    ReplyDelete
  5. Sai Naa marriage kosam kuda wait chestuna , sai pls Naa parents Naa marriage kosam matches chustunaru, pls sai show good person to me

    ReplyDelete
  6. Om sairam
    Sai always be with me

    ReplyDelete
  7. jai sairam
    jai sairam
    jai sairam

    ReplyDelete
  8. Om sai ram baba amma arogyam bagundela chudu thandri

    ReplyDelete
  9. Sai ee gadda ni karginchu thandri nenne namukuna thandri kapadu thandri

    ReplyDelete
  10. Baba santosh ki day shifts ravali salary hike avali thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo