1. కోవిడ్ నుండి కాపాడిన బాబా
2. సాయి మహిమ
3. నిరంతర సాయి చింతనతో కోవిడ్ నెగిటివ్
కోవిడ్ నుండి కాపాడిన బాబా
నేను సాయిభక్తురాలిని. ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. బాబా మాకు ప్రసాదించిన అనుభవాలను తోటి భక్తులతో పంచుకోవడానికి, తోటి భక్తుల అనుభవాలను చదివి బాబా ప్రేమను ఆస్వాదించడానికి ఈ బ్లాగ్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రస్తుత కరోనా కాలంలో బాబా మాకు ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. మా అబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు. ఈమధ్య తనతోపాటు చదివే బెంచ్‌మేట్స్‌కి, క్లాస్‌మేట్స్‌కి, కలిసి లంచ్ చేసే పిల్లలకి, వాళ్ళ కుటుంబసభ్యులకి కరోనా వచ్చింది. వాళ్ళు మాకు ఫోన్ చేసి, "మాకు, మా పిల్లలందరికీ కరోనా వచ్చింది. ఎందుకైనా మంచిది, మీ అబ్బాయికి కూడా ఒకసారి కరోనా టెస్ట్ చేయించండి" అని చెప్పారు. సరిగ్గా అదే సమయంలో మా బాబుకి కూడా జ్వరం, దగ్గు, జలుబు ఉన్నాయి. దాంతో మాకు చాలా భయం వేసింది. అయినప్పటికీ నేను నా భర్తతో, మా బాబుతో, "బాబా ఉన్నారు. ఏమీ కాదు, చాలా ధైర్యంగా ఉండండి. సాయిబాబా ఊదీని పెట్టుకుని, 'ఓం శ్రీ సాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రం చెప్పుకుని, మరికొంత ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగితే ఏమీ కాద"ని చెప్పాను. అయినా అందరూ కంగారుపడుతున్నారు. తరువాత బాబుకి కరోనా టెస్ట్ చేయించాము. మరుసటిరోజు రిపోర్టు వచ్చేవరకు అందరూ చాలా ఆందోళనపడ్డారు. నేను మాత్రం ధైర్యంగా, 'బాబా ఉన్నారు. ఆయనే మనల్ని రక్షిస్తారు. మనకి ఏం కాద'ని వాళ్ళతో చెప్పాను. బాబా దయవల్ల మరుసటిరోజు నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. అందరూ చాలా సంతోషించి, 'సాయిబాబాకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పమ'ని అన్నారు. బాబా మా వెన్నంటి ఉండి చాలా చాలా ధైర్యాన్నిచ్చి, ఎల్లవేళలా మమ్మల్ని కాపాడుతున్నారు. అందరికీ కరోనా పాజిటివ్ వచ్చి మా బాబుకి రాకపోవడం బాబా చేసిన అద్భుతం.
మరో అనుభవం:
2021, ఏప్రిల్ నెల చివరిలో మా నాన్నగారికి బాగా జలుబు, దగ్గు, జ్వరం వచ్చాయి. జ్వరం ఎక్కువగా ఉండి, తగ్గకపోతుండేసరికి కారణమేంటని టెస్ట్ చేయిస్తే ఆయనకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లో మా అమ్మ, నాన్న మాత్రమే ఉంటారు. అందువల్ల ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఉంటారోనని మాకు చాలా భయమేసింది. వారమైనా జ్వరం తగ్గలేదు. ఆయనకి షుగర్ కూడా ఉంది. షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతుండటంతో, నాన్నను హాస్పిటల్లో చేర్పిస్తే మంచిదని అందరూ అన్నారు. సరేనని ఆయనను హాస్పిటల్లో చేర్చారు. తరువాత మా అమ్మకి కరోనా టెస్ట్ చేయిస్తే ఆమెకి కూడా పాజిటివ్ వచ్చింది. దాంతో మాకు చాలా భయమేసింది. అయితే అమ్మకి కరోనా లక్షణాలు ఏమీ లేవు. అందువలన మరోసారి కరోనా టెస్ట్ చేయిస్తే, బాబా దయవలన నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ తను భయపడుతూ ఉంటే, "నీకెందుకు భయం? బాబా ఉన్నారు, నీకేమీ కాదు. నీకంతా బాగుంటుంది. నీకు నెగిటివ్ వచ్చింది. నీకు కరోనా ఏమీ ఎఫెక్ట్ కాలేదు. ధైర్యంగా ఉండమ"ని చెప్పాము. అయినా తను భయపడుతూ ఉండేది. కానీ బాబా దయవలన తనకు కరోనా రాలేదు. తను చాలా ఆరోగ్యంగా ఉంది. నాన్న మాత్రం ఒక్కరే హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అయితే బాబా దయవల్ల ఒక్క వారంలోనే ఆయన ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చారు. అమ్మ బాబాకు గొప్ప భక్తురాలు. తను టిఫిన్, భోజనం మొదలుకుని ఏమి చేసినా బాబాకు నివేదించనిదే తినదు. బాబాకు సమర్పించాకే తాను తింటుంది. తను బాబాకి అంత గొప్ప భక్తురాలు. పాజిటివ్ వచ్చిన నాన్నతో వారం, పదిరోజులు ఉండి, అన్నీ అమ్మే చూసుకుంది. అయినా తనకు నెగిటివ్ రావడం, తనపై కరోనా ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం బాబా చేసిన అద్భుతం. "నన్ను బాబానే కాపాడారు, లేకపోతే ఇదెలా సాధ్యం? ఆయన మమ్మల్ని కనిపెట్టుకుని కాపాడుతున్నారు" అని అమ్మ చాలా చాలా సంతోషపడింది. ఇప్పుడు అమ్మానాన్నలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. బాబాను ప్రేమించేవారికి బాబా ఇలాంటి అనుభవాలు ఎన్నో ప్రసాదిస్తారు. "బాబా! మీకు శతకోటి ధన్యవాదాలు".
సాయి మహిమ
"సాయినాథా! నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ఎల్లప్పుడూ ఋణపడివుంటాను. అందరినీ చల్లగా కాపాడు సాయీ. నీ దయ, ప్రేమ మాపై చూపించు. ఈ భయంకరమైన విపత్తు నుండి ప్రపంచాన్ని కాపాడు బాబా". నా పేరు భాను. ప్రస్తుతం మేము యు.ఎస్.ఏ.లో ఉంటున్నాం. నేను కొన్ని సంవత్సరాలుగా సాయిబాబాను పూజిస్తున్నాను. కానీ ఏనాడూ అంత నమ్మకంగా పూజించేదాన్ని కాదు. కేవలం గురువారంరోజున బాబా ముందు దీపం పెట్టి, బాబాకు నైవేద్యం పెట్టేదాన్ని, అంతే. నెమ్మదిగా, నేనేమి కోరినా తాము ప్రసాదిస్తామన్న నమ్మకాన్ని బాబా నాకు కలిగించారు. నేను యు.ఎస్.ఏ వచ్చాక నా స్నేహితుల ద్వారా సాయి మహిమలు నాకు బాగా అర్థమయ్యాయి. అప్పుడు నేను బాబాపై దృఢమైన నమ్మకంతో సాయి వ్రతములు చేశాను. బాబా నా సమస్యలెన్నో తీర్చారు. వాటిలో కొన్నిటిని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా ఇటీవల జరిగిన సాయి మహిమల గురించి చెప్తాను.
మేము మా వీసా ఎక్స్‌టెన్షన్‌కి దరఖాస్తు చేసుకున్నాము. బాబా దయవల్ల నా భర్త వీసా కేవలం మూడు రోజుల్లోనే ఆమోదం పొందింది. నాది, మా బాబుది మాత్రం పది నెలలు గడిచినా అలాగే ఉండిపోయింది. ఏ మాత్రం ముందుకు పోలేదు. అప్పుడు నేను 5 వారాల సాయి వ్రతం మొదలుపెట్టాను. వ్రతం ముగియకముందే వారం రోజుల వ్యవధిలో నాది, మా బాబుది వీసా, ఇంకా వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్ అన్నీ వచ్చాయి. ఇదంతా సాయి మహిమ. ఒకసారి మేము ఇల్లు కొనుక్కోవాలని సాయి వ్రతం మొదలుపెట్టాను. వ్రతం చేసిన మొదటిరోజునే మేము ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాము. బాబాను నమ్మినవారికి నిజంగా ఎలాంటి భయాలు, అపోహలు ఉండవు. కొన్నిసార్లు బాబా మనల్ని పరీక్షిస్తున్నారనీ, అందుకే మనం అనుకున్నవి జరగట్లేదనీ అనిపిస్తుంది. కానీ మనం బాబాపై నమ్మకం ఉంచాలి. అన్నీ ఆయనే చూసుకుంటారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ దయ ఇలానే నా కుటుంబం మీద, ఇంకా అందరిమీదా ఉండాలి తండ్రీ".
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
నిరంతర సాయి చింతనతో కోవిడ్ నెగిటివ్
ఓం శ్రీ శిరిడీ సాయి పరమగురుభ్యో నమః.
'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. నేను ఒక సాయిభక్తురాలిని. నేనిప్పుడు ఇటీవల నాకు జరిగిన ఒక అనుభవాన్ని సాటి సాయిభక్తులతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 2021, ఏప్రిల్ 20వ తేదీ రాత్రి మా అమ్మాయి తనకు వాసన, రుచి తెలియడంలేదని అంది. ఆ మాట విన్న మాకు చాలా భయం వేసింది. మరుసటిరోజు మాకు తెలిసిన ఒక డాక్టరుకి చెప్తే, కోవిడ్ అని చెప్పి మందులిచ్చారు. ఎందుకైనా మంచిదని ఆ మరుసటిరోజు నేను, మావారు, మా అమ్మాయి కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాము. బాబా దయవలన నాకు, మా అమ్మాయికి నెగిటివ్ వచ్చింది, కానీ మావారికి పాజిటివ్ వచ్చింది. నేను బాబాపై భారం వేసి, ఆరోజు నుంచి మావారికి ఆవిరిపట్టే నీళ్లలో, త్రాగే నీళ్లలో బాబా ఊదీ వేసి ఇవ్వడం మొదలుపెట్టాను. నేను, మావారు సచ్చరిత్ర పుస్తకానికి ప్రదక్షిణలు చేసి, బాబా నామస్మరణ చేస్తూ గడిపాము. చివరికి బాబా దయవల్ల మావారికి నెగిటివ్ వచ్చింది. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు తండ్రీ. మీ రక్షణవలయంలో మమ్ము సర్వకాల సర్వావస్థలందు సురక్షితంగా ఉంచండి. మా సమస్యలన్నీ మీ పాదాల చెంత పెట్టాము. మాకు తోడుగా, రక్షణగా ఉంటూ మమ్ము కాపాడు తండ్రీ. కోవిడ్‌ను తొందరగా తరిమికొట్టు తండ్రీ".
ఓం శ్రీ సాయినాథాయ నమః
ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః
Om Sai Ram 🌹🙏🌹🙏🌹🙏🌹
ReplyDeleteOm Sri Sai Ram ��������
ReplyDeleteOm sai ram your udi is medicine to all devotees. Baba bless my family. Om sai maa
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda tondarga karginchu thandri sai ram
ReplyDeleteBaba santosh life happy ga vundali day shifts ravali thandri
ReplyDelete🌺🌟🌺🙏🙏🙏Om Sri SaiRam🙏🙏🙏🌺🌟🌺
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete