సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 812వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఏ కష్టం వచ్చినా నా ప్రక్కనే నిలబడి నన్ను గట్టెక్కించే సాయినాథుడు
2. బాబా, గురువుగారి అనుగ్రహం

ఏ కష్టం వచ్చినా నా ప్రక్కనే నిలబడి నన్ను గట్టెక్కించే సాయినాథుడు


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు సౌదామిని. మేము గుంటూరు జిల్లా ప్రక్కన రేపల్లెలో గత 3 సంవత్సరాలుగా ఉంటున్నాము. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. మీకు కృతజ్ఞతలు తెలపడం ఈ విధంగా అయినా జరుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నేను 1996-97లో మొట్టమొదటిసారిగా నా స్నేహితురాలితో కలిసి బాబాను దర్శించుకున్నాను. ప్రథమ దర్శనంతోనే బాబా పట్ల నాకు భక్తిశ్రద్ధలు ఏర్పడ్డాయి. ఆ తరువాత నుంచి మా అన్నయ్యతో కలిసి బాబా మందిరానికి ప్రతిరోజూ ఆరతికి వెళ్ళివస్తుండేదాన్ని. అలా బాబాపై నా భక్తిశ్రద్ధలు మరింత పెరిగాయి. ప్రతి విషయంలోనూ బాబా నాతోనే ఉన్నట్టు అనిపించేది. 2002వ సంవత్సరంలో మొట్టమొదటిసారి నా చదువు కోసం హాస్టల్లో ఉండాల్సి రావడంతో నాకు చాలా క్రొత్తగానూ, భయంగానూ ఉండేది. మా అమ్మానాన్నలకు నాతోపాటు హాస్టల్‌కి రావడానికి వీలుకాలేదు. నేనొక్కదాన్నే హాస్టల్‌కి వెళ్ళాల్సి వచ్చింది. హాస్టల్‌కి వెళ్ళేటప్పుడు మా అమ్మ నాకు ‘శ్రీసాయిలీలామృతం’ ఇచ్చింది. అప్పటినుండి ప్రతిరోజూ శ్రీసాయిలీలామృతం నిత్యపారాయణ నా దినచర్యలో భాగం అయింది. నా చదువు పూర్తయ్యాక, 2 సంవత్సరాల పాటు ఉద్యోగం చేశాను. అక్కడ కూడా నాకు ఏ కష్టం కలుగకుండా అన్నివేళలా నాకు అండగా నిలిచారు ఆ సాయినాథుడు. 


2007వ సంవత్సరంలో నాకు వివాహం అయింది. వివాహమైన నెలరోజుల తరువాత, నాకు తెలిసిన అమ్మాయి నా పుట్టినరోజునాడు ‘శ్రీసాయిసచ్చరిత్ర’ను నాకు కానుకగా ఇచ్చింది. అంతే! ఆరోజు నుండి, మాకు పిల్లలు పుట్టే విషయంలోనూ, వారి రక్షణ, ఆరోగ్యం, ఇలా అన్ని విషయాలలోనూ బాబా నా ప్రక్కనే ఉండి, ఏదో ఒక రూపంలో నాకు దర్శనం అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే నాది ఒక్కటే మాట – “నాకు ఏమీ కాదు, అంతా బాబానే చూసుకుంటారు” అని. అదే విశ్వాసం నాకు ఉంది. ఈమధ్య కరోనా కాలంలో మా నాన్నగారి ఆరోగ్యం విషయంలోనూ ఆ విశ్వాసమే నన్ను నడిపించింది. ఆ తర్వాత, కరోనా పరిస్థితుల కారణంగా మా అక్క, అన్నయ్యల ఉద్యోగాలు కూడా ఇబ్బందులలో పడ్డాయి. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “మీ దయవల్ల అక్కకి, అన్నయ్యకి ఉద్యోగాలు వస్తే నా అనుభవాలను ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగులో పంచుకుంటాను” అని నా సాయినాథ్ మహరాజుకి మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహంతో కేవలం 10 రోజులలో వారిద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఎంతటి సమస్య వచ్చినా, “నా భక్తులను చివరికంటా గమ్యం చేరుస్తాను” అనే బాబా వాక్యం నన్ను ఆ సమస్య నుండి బయటపడేస్తూనే ఉంది. 


ఇక ఇప్పుడే మొదలైంది అసలు కథ. 2021, మే 13న నాకు జలుబు లక్షణాలు, ఒళ్ళునొప్పులు, జ్వరం వచ్చాయి. డాక్టరుగారికి ఫోన్ చేస్తే, నన్ను కోవిడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. ఇప్పుడు మొదలైంది అసలు టెన్షన్. మా ముందున్న దారి, ‘సాయి పాదాలు పట్టుకుని శరణు వేడడం’ మాత్రమే. బాబాపై భారం వేసి కోవిడ్ పరీక్ష చేయించుకున్నాను. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. బాబా నా ప్రక్కనే ఉన్నారన్న ధైర్యంతో ఇంటి వద్దనే ఉంటూ, డాక్టర్ సూచించిన మందులు వాడాను. సాయి దయవలన కొద్దిరోజుల్లోనే ఏ విధమైన ఇబ్బందీ లేకుండా, ఇతర సమస్యలు ఏమీ లేకుండా కరోనా నుండి పూర్తిగా కోలుకున్నాను. నాకు కరోనా పాజిటివ్ రావటంతో మా కుటుంబసభ్యులంతా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. అందరికీ నెగిటివ్ వచ్చింది, కానీ మా అత్తయ్యకు మాత్రం కరోనా పాజిటివ్ వచ్చింది. నా ద్వారా మా అత్తయ్యకు కరోనా రావడంతో నా భయం, ఆందోళన మరింత పెరిగాయి. మిగిలిన అందరికీ నెగిటివ్ రిపోర్ట్ రావడం మా కుటుంబానికి బాబా పెట్టిన భిక్షే. మా అత్తయ్యను కూడా బాబా త్వరలోనే మాకు క్షేమంగా, ఆరోగ్యంగా తిరిగి అప్పజెప్తారని నాకు చాలా నమ్మకంగా, ధైర్యంగా ఉంది. మా కుటుంబాన్ని ఈ కరోనా బాధతో అల్లాడిపోతున్న ప్రజలందరినీ కూడా బాబా కాపాడతారని నమ్ముతున్నాను.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా, గురువుగారి అనుగ్రహం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!


నేను సాయిభక్తురాలిని. మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ సాయితండ్రి, గురువుగారే. బాబా మాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. వాటిలో నుండి ఇటీవల జరిగిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. మా పాపకు ఈమధ్య జ్వరం వచ్చింది. అప్పుడు నేను, "ఇది కరోనా కాకుండా ఉండేలా అనుగ్రహించు తండ్రీ. మీ దయవల్ల ఇది కరోనా కాకుండా ఉంటే నా ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మనస్ఫూర్తిగా బాబా, గురువుగారికి దండం పెట్టుకున్నాను. తరువాత పాపను తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లి రాగానే తన జ్వరం తగ్గిపోయింది. సాయితండ్రి, గురువుగారి ఆశీస్సులు, అనుగ్రహంతోనే మా పాపకు తగ్గిపోయిందని చాలా సంతోషించాము. ఈ అనుభవం చిన్నదే అయినా మనం పొందే ఫలితం మాత్రం చాలా అమోఘమైనది. "సాయితండ్రీ! గురువుగారూ! మీ ఆశీస్సులు, అనుగ్రహంతో మేము, మా తోటి సాయిభక్తులందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలి తండ్రీ!"


మరో అనుభవం:


ఈమధ్య ఒకసారి అనుకోకుండా మేము హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని మేము కారులో హైదరాబాద్ వెళ్ళొచ్చాము. మరుసటిరోజు నాకు కొంచెం తలనొప్పి, ఒళ్ళునొప్పులుగా అనిపించింది. ప్రయాణం వలన అలసట అనుకున్నాము. మరునాటికి తగ్గినట్లు అనిపించింది. అంతలో మేము వెళ్లొచ్చిన కారు డ్రైవరుకి కరోనా పాజిటివ్ అని తెలిసింది. దాంతో నేను ఆందోళన చెంది, "సాయితండ్రీ! ఏమిటి నాయనా ఈ పరీక్షలు? మీ ఆశీర్వాదంతోనే కదా తండ్రీ మేము క్షేమంగా వెళ్ళొస్తామని అనుకున్నాము. ఎందుకు బాబా ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? మమ్మల్ని కాపాడండి తండ్రీ" అని బాబా, గురువుగారికి ఎన్నిసార్లు దండం పెట్టుకున్నానో లెక్కలేదు. ఇక టెన్షన్ పడుతూనే అందరమూ మా ఆరోగ్య పరిస్థితిని గమనించుకుంటూ ఉన్నాము. దురదృష్టంకొద్దీ మూడవరోజు మా పాపకి చాలా చాలా స్వల్ప లక్షణాలు కనిపించాయి. హైదరాబాద్ వెళ్లేటప్పుడు నాతోపాటు బాబా పారాయణ గ్రంథం తీసుకుని వెళ్ళాను, కారులో చదివాను కూడా. అయినా ఎందుకిలా జరిగిందని బాధపడుతూ, చాలా టెన్షన్ పడ్డాను. అయితే ఏవో కొద్దిపాటి మందులు వాడటంతో మా పాప చాలా సురక్షితంగా బయటపడింది.  తర్వాత తనకు టెస్ట్ చేయిస్తే నెగిటివ్ వచ్చింది. సాయితండ్రి, గురువుగారే మా పాపకి పెద్దగా సమస్యేమీ లేకుండా కాపాడారని నాకు చాలా చాలా నమ్మకం. ఎందుకంటే, డ్రైవరుకి పాజిటివ్ అని తెలిసినరోజే నేను నిద్రిస్తున్నప్పుడు గురువుగారు స్వప్నదర్శనం ఇచ్చారు. మేల్కొన్న తరువాత 'గురువుగారు ఎందుకు కనిపించారా?' అని అనుకున్నాను. తర్వాత ఇవన్నీ జరిగాయి. అప్పుడు నాకు బాబా, గురువుగారి అనుగ్రహం అర్థమైంది. మాలో ఇంకెవరికీ ఎటువంటి ఇబ్బందీ లేకుండా సురక్షితంగా బయటపడ్డామంటే అది కేవలం సాయితండ్రి, గురువుగారి ఆశీస్సులు, అనుగ్రహం వల్లనే అని మా అందరి నమ్మకం. "సాయితండ్రీ! గురువుగారూ! చాలా చాలా ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఇలాగే అందరమూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా మీ స్మరణలో ఉంటాను".



10 comments:

  1. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  2. Kothakonda SrinivasJune 21, 2021 at 9:58 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  3. Om sai ram baba amma arogyam bagundali thandri

    ReplyDelete
  4. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  5. Baba santosh ki dqy shifts ravali arogyanga vundali thandri

    ReplyDelete
  6. 🌷🌺🌷🌟🙏🙏🙏🌟🌷🌺🌷 🌺🌷Om Sri SaiRam🌷🌺

    ReplyDelete
  7. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  8. Om Sai Sri Sai Jaya Jaya Sai.🔥🔥🔥🌼🌼🌼🌺🌺🌺🌹🌹🌹💐💐💐🙏🙏🙏

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo