సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 797వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • కుటుంబానికి పెద్దదిక్కును కాపాడి ఆర్థికంగా చితికిపోకుండా ఆదుకున్న బాబా
  • బాబా-నేను ఆడుకున్న ఆటలు
  • మా యజమాని బాబా చూపిన అద్భుత లీల:

శ్రీగురుసాయిబంధువులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వాహకులందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు. నా పేరు భాస్కరాచార్యులు. మేము తాడేపల్లిగూడెంలో నివసిస్తున్నాము. బాబా నాకు చేసిన సహాయాలు, ప్రసాదించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో, బాబా-నేను ఆడుకున్న ఆటలు అవీ కూడా ఉన్నాయి. ప్రస్తుతం, మా కుటుంబానికి ఒక పెద్ద కష్టం వస్తే బాబా సహాయాన్ని అర్థించి మ్రొక్కుకున్న అనుభవాన్ని చెప్తాను.


2020, అక్టోబరులో నేను కరోనా బారినపడి హోమ్ ఐసొలేట్ అయ్యాను. అప్పుడు మా నాన్నగారు ఎక్కువగా ఆందోళనపడటంతో మొదటిసారిగా ఆయన గుండె కండరాలు ఫెయిలయ్యాయి. నేను ఐసొలేషన్ నుండి బయటకు రాగానే మా ఊరిలో ఉన్న డాక్టరుగారికి చూపించాము. ఆయన నాన్నగారికి అన్ని పరీక్షలూ చేసి, “ఇది చాలా సీరియస్ కేసు. మీరు రేపు తణుకు లేదా రాజమండ్రికి వెళ్ళి స్పెషలిస్ట్ డాక్టరుని సంప్రదించి హాస్పిటల్లో బెడ్ బుక్ చేయించుకోండి” అని చెప్పారు. ఆరోజు సోమవారం. బుధవారంనాడు రాజమండ్రి స్పెషలిస్ట్ మా ఊరిలో క్యాంప్ నిర్వహిస్తున్నారని తెలిసి నాన్నగారిని ఇక్కడే చూపిద్దామని నిర్ణయించుకున్నాము. కానీ మంగళవారం రాత్రి నాన్నగారికి ఎగశ్వాస వచ్చి ఒళ్ళు చల్లబడిపోయింది. దాంతో వెంటనే నాన్నగారిని రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలోని ఆ స్పెషలిస్ట్ డాక్టర్ ఉండే హాస్పిటల్‌కు తీసుకువెళ్ళాము. అయితే అప్పటికే ఆ డాక్టరుగారి డ్యూటీ (OP టైమింగ్స్) అయిపోయి వెళ్ళిపోయారట. నాన్నగారి కండిషన్ గమనిస్తున్న స్టాఫ్ డాక్టర్లు, “ఈ రాత్రి ఉండడం కష్టం. కరోనా టెస్టులూ, ఆ టెస్టులూ, ఈ టెస్టులూ, ICU ఛార్జీలు అన్నీ రోజుకి 30,000 రూపాయలు అవుతాయి. కనీసం 20 రోజులు ఆయనను హాస్పిటల్లో ఉంచాలి” అని చెప్పారు. నా దగ్గరున్న డబ్బంతా కలిపినా 10,000 రూపాయలు కూడా లేవు. ఏం చేయాలో తెలియక బిక్కమొహం వేశాను. ఇదంతా దూరంగా కారులోనే ఉండి గమనిస్తున్న మా నాన్నగారు నాతో, “ఇక్కడ జాయిన్ చేస్తే నేను మళ్ళీ వెనక్కి రానురా. ఏదైతే అది జరుగుతుంది. దైవంపై భారంవేసి ఇంటికి వెళ్ళిపోదాం” అన్నారు. మేమందరం నాన్నగారి ఆరోగ్యం బాగుండాలని చిన్నతిరుపతి (ద్వారకాతిరుమల) శ్రీవెంకటేశ్వరస్వామికి మ్రొక్కుకున్నాం. కానీ నేను మాత్రం నా ధైర్యం, నమ్మకం అయిన బాబాతో, “బాబా! నీవే మాకు దిక్కు. మీ దయవల్ల నాన్నగారు ఈ గండం నుండి బయటపడితే ఏడాదిపాటు నాకు ఇష్టమైన సున్నుండ, రవ్వలడ్డు తినను. ఈ అనుభవాన్ని వెంటనే మన బ్లాగులో చెప్పుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. ఎప్పుడైనా నేను సంపూర్ణంగా బాబాపై భారం వేస్తే, నేను మ్రొక్కినా, మ్రొక్కకపోయినా ఆయన ఖచ్చితంగా నేను ఊహించలేని మంచి ఫలితాలిస్తారని నాకు ఎన్నో అనుభవాలున్నాయి. ఇక నా చింత దూరమైపోయింది. భారం బాబాదే! అందరం ఇంటికి తిరిగి వచ్చేశాం. ఆ రాత్రి భారంగా గడిచింది. మరునాడు మా నాన్నగారిని తీసుకునివెళ్ళి మా ఊరికి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టరుకి చూపించాము. ఆయన నాన్నగారిని పరీక్షించి, కొన్ని మందులిచ్చి, ‘ఇప్పుడీ గండం గడిస్తే కొన్ని సంవత్సరాల పాటు మందులు వాడాల్సి ఉంటుంది’ అన్నారు. ఆ మందులు వాడటం ప్రారంభించాక బాబా అనుగ్రహంతో 15 రోజుల్లోనే నాన్నగారి ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. ఇప్పుడు ఆయన ఇంచుమించు సాధారణస్థితికి వచ్చేశారు. మందులు కూడా తగ్గించారు. “నన్ను క్షమించండి బాబా, ఈ అనుభవాన్ని పంచుకోవడంలో 8 నెలలు ఆలస్యం చేశాను. అయినా మీరు నాపై అలగరని నాకు తెలుసు. ఎందుకంటే, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో మీకు తెలుసుగా. నాకు తీరికలేకుండా చేసింది మీరే, ఇప్పుడు నాతో రాయించిందీ మీరే”. సాయి శరణం.


బాబా-నేను ఆడుకున్న ఆటలు


గురుబంధువులారా! మన బాబాకు, నాకు మధ్య చాలా బంధుత్వాలు (బంధాలు) ఉన్నాయి. బాబా దగ్గర నన్ను నేను ఒక్కోసారి మేనల్లుడిగా, కొడుకుగా, స్నేహితుడిగా, శిష్యుడిగా భావించుకుంటుంటాను. ఒక్కోసారి బాబాను చంటిపిల్లాడిలాగా, అమాయకుడిగా భావిస్తాను. ఎందుకంటే, “బాబా ఇది చెయ్యి, నిన్ను నమ్ముతాను; అది చెయ్యి, నిన్ను నమ్ముతాను” అంటూ నా ఊహ తెలిసినప్పటినుండి నేను బాబాను సతాయిస్తున్నాను. బాబా మాత్రం నేను పెట్టిన ప్రతి చిన్న పరీక్షను సైతం వదలకుండా తన ఉనికి సత్యమని నిరూపించుకుంటుంటారు. అప్పుడు మాత్రం ‘బాబా సాక్షాత్తూ పరమాత్మ’ అని అనిపిస్తుంది. మళ్ళా కొన్నాళ్లకి నాకు మాయ కమ్మి, బాబాకు మరొక పరీక్ష పెడతాను. బాబా మళ్ళీ అమాయకుడిలా నా వెంటపడతారు. అలాంటి సంఘటనలు కొన్ని చెప్తాను.


1) “స్తవనమంజరి సంవత్సర పారాయణ చేస్తే మనం ఏది కోరితే అది బాబా తీరుస్తాడట, అది బాబా వాగ్దానమట. నేను కూడా చేస్తాను, బాబా ఇస్తారో లేదో చూద్దాం” అని అనుకుని, “నాకు 100 కోట్ల రూపాయలు ఇవ్వు బాబా” అని సంకల్పం చెప్పి స్తవనమంజరి పారాయణ ప్రారంభించాను. కొన్ని నెలలు పారాయణ చేశాక నాకు పర్మినెంట్ ఉద్యోగం వచ్చింది. అది ఎలా జరిగిందంటే, బాబా గుడిలో పరిచయమైన ఒక వ్యక్తి ఒక బ్యాంకు క్రొత్త బ్రాంచి ప్రారంభోత్సవం రోజున ఆ బ్యాంకులో ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి నన్ను తీసుకువెళ్ళారు. బ్యాంకు కన్‌స్ట్రక్షన్ నుండి ఓపెనింగ్ వరకు ఆ ఉద్యోగం కోసం దాదాపు ఒక 20 మంది అభ్యర్థులు పెద్దవాళ్ళతో రికమెండేషన్లు, లక్షల్లో లంచాలు పట్టుకుని తిరిగారట. నాకివేమీ తెలియవు. ఆ బ్రాంచి ప్రారంభోత్సవం రోజున అప్లై చేసిన అభ్యర్థులలో ఏ ఒక్కరూ అక్కడికి రాలేదు. ఆ ఒక్కరోజు మాత్రమే వెళ్ళిన నన్ను బ్యాంకు అధికారులు ఆ సీటులో కూర్చోబెట్టి పోస్ట్ పర్మినెంట్ చేసేశారు. ఇక, నా భార్య తొలి బిడ్డను ప్రసవించే సమయంలో ప్రమాదం జరగబోతుంటే నేను బాబాకు నమస్కరించుకుని, “నాకు 100 కోట్లు వద్దు బాబా, నా బిడ్డని కాపాడు” అని ఆర్తిగా వేడుకున్నాను. ఎంతో కరుణతో బాబా మా బిడ్డను కాపాడారు. ఇలా నేను అత్యాశకు పోకుండా స్వంత సంపాదనతో గౌరవంగా బ్రతికేలా నా సాయితండ్రి నన్ను కరుణించారు.


2) ఉద్యోగరీత్యా నాకు రెవెన్యూ స్టాంపులు అవసరం. నేను వాటిని కస్టమర్లకి ఉచితంగానే ఇస్తాను. కానీ అవి పరిమితిగా దొరకుతుండటంతో ఒకరోజు బాబా ఉనికి నిజమో కాదో చూద్దామని, “బాబా, ఈ సమస్యను పరిష్కరించు” అని అనుకోగానే ఒక గంటలో ఒకాయన వచ్చి నాకు 50 స్టాంపులు ఇచ్చారు. అవి అయిపోయేలోపు ఒకాయన పరిచయమై 500 స్టాంపులు ఇచ్చారు. ఇలా నా దగ్గరున్న స్టాంపులు అయిపోయేలోపు మళ్ళీ స్టాంపులు వచ్చేసేవి. బాబా ఇంతగా తన ఉనికిని చూపిస్తున్నా, ఒకసారి నేను, “ఇదంతా కేవలం కాకతాళీయమేమో, బాబా మహిమ కాదేమో” అనుకున్నాను. ఆ తరువాత స్టాంపులు తెచ్చుకుందామని వెళితే ఇన్నాళ్ళూ నాకు సహాయం చేసిన ఆయన ట్రాన్స్‌ఫర్ అయి వెళ్ళిపోయారని తెలిసింది. క్రొత్తగా వచ్చినాయన ‘రోజుకు 5 స్టాంపులు మాత్రమే ఇస్తాన’న్నారు. అప్పుడు నాకు బాబా మహిమ అర్థమై బాబాతో, “సరేలే బాబా, నీ అలక ఆపు, నిన్ను నమ్ముతాలే” అన్నాను. పాపం, బాబా మళ్ళీ రెండు రోజుల్లో నా చిన్ననాటి స్నేహితుని బంధువు ద్వారా నాకు స్టాంపులు ఇప్పించారు. ఇప్పటికీ బాబా ఆయన ద్వారా నాకు కావాల్సిన స్టాంపులు అనాయాసంగా ఇస్తున్నారు.


3) 2 సంవత్సరాల క్రితం నాకు క్రొత్తగా రేషన్ కార్డు మంజూరయింది. కానీ ఆ డీలరు నన్ను పదేపదే తన చుట్టూ త్రిప్పుకుంటూ నాకు రేషన్ కార్డు ఇవ్వకుండా చాలా హింసపెట్టేవాడు. ఎందుకో అతను నన్ను శత్రువులా చూసేవాడు. తిరిగి తిరిగి విసిగిపోయిన నేను, “బాబా, ఇకపై ఇది నీ సమస్య. అతన్ని నాకు అనుకూలంగా మార్చి నా నమ్మకాన్ని నిలబెట్టండి” అని బాబాతో చెప్పుకున్నాను. మళ్ళీ నెల వచ్చేలోపు అతను ఒక లోన్ పనిమీద నేను పనిచేస్తున్న బ్యాంకుకు వచ్చాడు. నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నానని అతనికి తెలియదు. అక్కడ నన్ను చూసి, ‘ఇక తనకు రాబోయే లోన్ రాకుండా నేను చెడగొడతానేమో’నని సందేహించాడు. అయినా నా వద్దకు వచ్చి నా సహాయం కోరాడు. నేను అతనికి సహాయం చేయమని బాబాను ప్రార్థించి, అతని లోన్ విషయంలో మేనేజరుకు రికమెండ్ చేశాను. అతనికి 2 లక్షల లోన్ శాంక్షన్ అయింది. అప్పటినుండి అతను నాకు అత్యంత విధేయుడైన స్నేహితుడిలా మారిపోయి ఇంటికొచ్చి మరీ ఎక్స్‌ట్రా రేషన్ ఇస్తున్నాడు


ఇన్నిసార్లు బాబా తన ఉనికిని చాటుతున్నా కొన్నాళ్ళకు మళ్ళీ ఆయనకు ఇంకొక పరీక్ష పెట్టాను. అది తరువాత చెప్తాను. పాపం, ఇన్నిసార్లు ఇవన్నీ తీరుస్తున్న బాబా నాకెలా అనిపిస్తారో తెలుసా? మనం మన బిడ్డతో, “నాన్నా, నీకు చాక్లెట్ కొనిస్తా, ముద్దుపెట్టు, ఇంకోటి పెట్టు” అని ముద్దులు పెట్టించుకుని పాపం చాక్లెట్ ఇవ్వకపోతే జాలిగా చూసే పసిపిల్లాడిలా బాబా, “ఇంకా నన్ను పరీక్షిస్తావా?” అని అంటున్నట్లు ఉంటుంది. నా ముద్దులబాబు సాయిబాబాకు కోటి నమస్కారాలతో... సాయి శరణం.


మా యజమాని బాబా చూపిన అద్భుత లీల:


2020, అక్టోబరులో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మేము అనుకోకుండా అద్దె ఇంటిలోకి అత్యవసరంగా మారవలసిన పరిస్థితి వచ్చింది. కానీ నాకు కరోనా రావటం వల్ల ఇళ్ళు వెతికే ఓపిక లేదు. పైగా అద్దె ఇళ్ళు ఎవ్వరూ ఇవ్వని పరిస్థితి. కానీ, బాబాపై భారం మోపి ఒక పూట ప్రయత్నించేసరికే అతి తక్కువ అద్దెతో, ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఒక ఇండిపెండెంట్ ఇల్లు దొరికింది. పచ్చని చెట్లు, కావాల్సినంత ఆక్సిజన్, నిరంతరాయంగా స్వచ్ఛమైన నీరు, ఇంటి ముందరే అవసరమైన అన్నిరకాల షాపులు. ఇంత చక్కని ఇంటిని ప్రసాదించినందుకు బాబాకు మనసారా ధన్యవాదాలు తెలుపుకున్నాను. బాబా నాకు ఒక స్నేహితుడిలా అనిపించారు. ఇక క్రొత్త ఇంటికి పెద్దదిక్కు, సకలం బాబానే. అప్పుతో క్రొత్త జీవనం ప్రారంభించిన మమ్మల్ని కొద్ది నెలల్లోనే ఇంకొకరికి పెట్టగలిగే స్థాయికి బాబా తీసుకొచ్చారు


అదే నెలలో (అక్టోబరు) దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. నా భార్య పార్వతి అమ్మవారి భక్తురాలు కావడంతో, ‘నవరాత్రులు ఘనంగా చేసుకుందామండీ’ అని అడిగింది. “క్రొత్త సంసారం, ప్రతి వస్తువూ కొనాలి. ప్రస్తుతం ఉన్నదాంట్లో చేద్దాంలే. రోజూ బాబా పూజ చేస్తున్నాం కదా, బాబానే మన భవాని. నీకు అంతగా నవరాత్రులు చేసుకోవాలనుకుంటే ఈ ఇంటికి యజమాని బాబా, ఆయనే చేయిస్తాడులే” అన్నాను. తరువాత భరద్వాజ మాస్టరుగారి చరిత్ర కొంచెం చదివి, ‘బాబా లాగా మాస్టరుగారు కూడా ఏదైనా నిదర్శనం చూపిస్తే బాగుండును’ అని అనుకున్నాను. మరుసటిరోజు రాత్రి, అంటే తెల్లవారితే నవరాత్రులు ప్రారంభమవుతాయనగా, “ఒంగోలులోని మాస్టరుగారి సంస్థానం నుండి మాట్లాడుతున్నామండీ” అంటూ నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. “నా నెంబరు మీకు ఎలా వచ్చింది? మీకు ఏం కావాలండీ?” అని అడిగాను. వారు, “నేను మాస్టరుగారి పుస్తకాలకు సంబంధించిన విభాగంలో పనిచేస్తున్నాను. మీరు 3 సంవత్సరాల క్రితం ఒక పుస్తకం కోసం నాకు ఫోన్ చేశారు. అప్పుడు మీ ఫోన్ నెంబరు సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు మీతో ఒక పనిపడింది, సహాయం చేస్తారా?” అని అడిగారు. మాస్టరుగారి సంస్థానం నుండి ఫోన్ రావడమే ఒక ఆశ్చర్యం. మాస్టరుగారు తమ అపార కరుణాకటాక్షాలకు నిదర్శనంగా నా జీవితంలో మర్చిపోలేని విధంగా నాపై తమ అనుగ్రహాన్ని కురిపించారు. విషయమేమిటంటే, వేరే రాష్ట్రంలో ఉన్న చివటం అమ్మగారి భక్తుడు ఒకాయన ‘నవరాత్రులలో చివటం అమ్మకు 9 ఖరీదైన చీరలు బహుకరించాలి’ అని అనుకున్నారట. అయితే, అప్పుడున్న పరిస్థితులలో ఆయన రాలేక మాస్టరుగారి సంస్థానంవారిని సహాయం కోరారట. సంస్థానంవారు చివటం దగ్గరలోని తణుకు, రాజమండ్రి, భీమవరం, ఇంకా ఇతర ఊర్లలోని తమకు పరిచయం ఉన్నవారికి ఫోన్ చేసి, “ఆ తొమ్మిది చీరల ఖరీదు మేము ఇస్తాము, ఆ భక్తుని బదులు మీరు చివటం వెళ్ళి అమ్మకు సమర్పించగలరా?” అని అడుగుతున్నారట. అది కరోనా సమయం, పైగా తుఫాను ఉండటం వల్ల ఎవరూ అందుకు అంగీకరించలేదట. ఇక నేను గుర్తుకువచ్చి, నేనేమైనా సతీసమేతంగా చివటం అమ్మకు చీరసారెలు ఇవ్వగలనేమో కనుక్కుందామని నాకు ఫోన్ చేశారట. ఏమి నా మహాభాగ్యం! ఏమి లీల! ఏమి నిదర్శనం! ... జన్మధన్యం! 


మహాదాత బాబా కృపతో మాస్టరుగారి సంస్థానంవారు పంపిన సొమ్ముతో 3 మంచి నాణ్యమైన చీరలు కొని, పసుపుకుంకుమలు తీసుకుని తుఫానులోనే ఆనందంగా చివటం బయలుదేరాం. అక్కడ మాకు కలిగిన అదృష్టం ఏమని చెప్పగలను? దత్తస్వరూపిణి శ్రీచివటం అమ్మ నాకు ఇష్టమైన మహాలక్ష్మి అమ్మవారిలా బాజాభజంత్రీలతో ఊరేగింపుగా వచ్చారు. సమయం కాస్త అటూ ఇటూ అయితే జరుగబోయే కార్యక్రమాలలో మేము ఉండేవారం కాదు. చీరల విషయం అమ్మ సంస్థానంవారికి చెప్పాము. “ఓహో, అలాగా, మాస్టరుగారి నుండి వచ్చాయా! మేము కూడా ఈసారి కలశస్థాపనకు క్రొత్తజంట కోసం చూస్తున్నాము. సమయానికి వచ్చారు, రండి” అంటూ మాకు ఆహ్వానం పలికారు. మేము అమ్మవారి వస్త్రాలను తలపై ఉంచుకుని సమాధిమందిరం చుట్టూ మేళతాళాలతో ప్రదక్షిణలు చేయగా, మా దంపతుల కాళ్ళపై బిందెలతో నీళ్ళు పోసి ఆహ్వానించి, ప్రత్యేక మండపంలో అమ్మవారి కలశ ప్రతిష్ఠ మా చేతుల మీదుగా జరిపించారు. అమ్మవారి అలంకరణ మండపానికి మామిడి తోరణాలు, షామియానా సేవలు నాచేత చేయించారు. ఇంతకన్నా నా ఆనందాన్ని ఇక్కడ వర్ణించలేను. బాబా, మాస్టరుగారు, దత్తాత్రేయులవారు, చివటం అమ్మ, పరాశక్తి వీరంతా ఒక్కటే అనీ, వారంతా ఒక్కటై మా జన్మ తరించిపోయే కృపను మాపై కురిపించారనీ అర్థమైంది. బాబా మా యజమానిగా – మాస్టరుగారిని సరదాగా ఓ నిదర్శనం చూపమని – ఘనంగా నవరాత్రులు చేసుకుందామంటే పొదుపుగా చేయమన్న నా నిస్సహాయతా – చివటం అమ్మ శక్తి – ఇవన్నీ వెరసి అత్యద్భుతలీల చూపబడింది ఏ విధమైన అర్హతా లేని నాకు తమ అనుజ్ఞతో, మాస్టరుగారి సొమ్ముతో, శక్తిస్వరూపిణి దత్తావతారిణి చివటం అమ్మకు చీరసారెలతో (ఒక ముఖ్య అతిథిగా) పూజ జరిపించే భాగ్యాన్ని ప్రసాదించడం సర్వసమర్థులైన శ్రీసాయికే సాధ్యం. సాయి శరణం.


14 comments:

  1. Om sai ram today experiences are very nice.all devotees wrote very well.last sai leela is very nice.sarees offering to God is nice leela.sai arranges very thing in right time.if we trust him. He will take care. Om sai ram❤❤❤❤

    ReplyDelete
  2. Adbhutamaina cheerala leela. Baba ku saatileru .Jai Sairam

    ReplyDelete
  3. Kothakonda SrinivasJune 6, 2021 at 9:12 AM

    ఓం సాయిరాం! సాయి లీలలు అద్భుతము.

    ReplyDelete
  4. Heart touching experiences. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  5. Sairam today miracles are unbelievable, sai is great, very nice miracles, Jai Sairam , sai pls show your presence ,

    ReplyDelete
  6. 🌺🌺🙏🙏🙏OM SAI RAM🙏🙏🙏🌺🌺🌺

    ReplyDelete
  7. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  8. Sai ee gadda ni karginchu thandri nenne namukuna thandri

    ReplyDelete
  9. Santosh ki day shifts vachi salary hike avali thandri

    ReplyDelete
  10. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo