సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 819వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఇచ్చిన సమాధానం
2. బాబా ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు

బాబా ఇచ్చిన సమాధానం


సాయిబంధువులకు నా నమస్కారం. నా పేరు సాయి సంహిత. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ బ్లాగ్ ద్వారా బాబా ఎప్పుడూ మాతోనే ఉంటూ, మాకు ఏదైనా కష్టం రాగానే ఈ బ్లాగ్ ద్వారానే సమాధానం ఇస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం లేవగానే ఈ బ్లాగులో వచ్చే సాయిభక్తుల అనుభవాలను చదువుతుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఎంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ధైర్యం కలుగుతుంది. 2021, మే 22వ తేదీన బాబా నాకు ప్రసాదించిన స్వప్నదర్శనం గురించి ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. ఇంతకుముందు కూడా బాబా నాకు ఎన్నో స్వప్నదర్శనాలు ప్రసాదించారు. కానీ ఆరోజు ఇచ్చిన దర్శనం మాత్రం చాలా ప్రత్యేకమైనది. నాకు ఇంకా పెళ్ళి కాలేదు. నా పెళ్ళి గురించి నేను రోజూ బాబాను అడుగుతున్నాను. ఇంతకుముందు కూడా ఒకసారి స్వప్నదర్శనంలో ‘నేను ఇష్టపడిన అబ్బాయితోనే నా వివాహం జరిపిస్తాన’ని బాబా చూపించారు. కానీ మళ్ళీ అన్ని దారులూ మూసేశారు. ‘బాబా అందరికీ సమాధానం ఇస్తున్నారు, కానీ నాకు మాత్రం అసలు ఇవ్వడం లేదు’ అని అనుకునేదాన్ని. సచ్చరిత్ర చదువుతున్నప్పుడు కూడా బాబా నా పెళ్ళికి సంబంధించి సానుకూలంగానే సమాధానమిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా, “నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్నదాన్ని నీకు ఇస్తాను” అని బాబా సమాధానం ఇస్తున్నారు.

కానీ పిచ్చిదాన్ని, అదంతా నా భ్రమేమో అని అనుకున్నాను. ఎంతకీ బాబా నుండి సమాధానం రావట్లేదనే ఆలోచనలతో, మే 22వ తేదీ రాత్రి పడుకోబోయేముందు బాబాతో, “బాబా! మీరు నా వివాహం ఆ అబ్బాయితోనే చేస్తానన్నారు. ఎన్నో సానుకూల సూచనలు కూడా చూపించారు. కానీ నా పెళ్ళి జరగటం లేదు. నాకంటే చిన్నవాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. నాకు ఇంకా పెళ్ళి కావట్లేదని అమ్మానాన్నలు ఒకటే టెన్షన్ పడుతున్నారు. మీరు కలలో ఒకసారి ‘నేను మాట్లాడేవి విని నాకు సమాధానం చెప్తాన’న్నారు. కానీ మీరు సమాధానమేమీ చెప్పడమే లేదు. ఇంకా ఇప్పటికీ ఆ అబ్బాయితోనే నా వివాహం జరుగుతుందని మీరు చూపిస్తున్నారు. కానీ ఎంతకీ మీరు చెప్పినట్లుగా జరగటంలేదనే కోపంలో మీ మందిరానికి రావడం కూడా మానేశాను. ఏం చెయ్యను? ఇంకా పెళ్ళి కావట్లేదనే ఆందోళనతో అలా చేశాను. ఇలా చేసినందుకు నన్ను క్షమించండి బాబా. ఇవాళ నాకు ఏదో ఒక సమాధానం చెప్పండి బాబా. ‘ఇస్తాను, ఇస్తాను’ అని ఎందుకు ఇవ్వటంలేదు? బాబా! ఇవాళైనా మీరు నాకు కలలో రావాలి” అని చెప్పుకుని పడుకున్నాను. తెల్లవారుఝామున 3.45 గంటలకు మెలకువ వచ్చింది. అంతవరకు బాబా కలలో రాకపోవడంతో, ‘ఇవాళ కూడా బాబా కలలో రాలేద’ని బాధపడుతూ, “బాబా! మిమ్మల్ని రోజూ అడుగుతున్నాను, నాకు ఎంత ఒత్తిడిగా ఉంటుందో మీకు తెలుసు. అయినా మీరు నా కలలో రావట్లేదు” అని బాబాకు చెప్పుకుంటూ మళ్ళీ పడుకున్నాను.


తరువాత సుమారు 4.30 గంటల సమయంలో నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను యూనిఫామ్ కుట్టించుకోవడానికి ఒక టైలర్ వద్దకు వెళ్ళాను. ఆ టైలర్ నా కొలతలు తీసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఎవరో అతనిని రమ్మని పిలిచారు. “పూజకి ఆలస్యం అవుతోంది, నేను వెళ్తున్నాను” అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అక్కడ ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుని పిలిచి, “ఏం పూజ?” అని అడిగాను. “బాబా పూజ అక్కా” అన్నాడు ఆ బాబు. బాబా పేరు వినగానే చాలా సంతోషంగా అనిపించింది. “బాబా పూజకి నేనూ వెళ్ళొచ్చా?” అని ఆ బాబుని అడిగాను. “ఎవరైనా వెళ్ళొచ్చక్కా” అని చెప్పాడు ఆ బాబు. నేను ఎంతో సంతోషంగా బాబా పూజ జరిగే చోటికి బయలుదేరాను. దారిలో, మా ఇంట్లో అద్దెకు ఉండే అమ్మాయి కలిసింది. “బాబా పూజ జరుగుతోందట. వెళదాం, రా” అని తనను పిలిస్తే, “మనల్ని పిలవలేదు కదా, ఎలా వెళ్తాం?” అని అన్నది తను. “బాబా పూజకి ఎవరైనా వెళ్ళొచ్చు, ఏం అవదు, రా” అని అంటే, తను రానంది. సరేనని నేను ఒక్కదాన్నే పూజ జరిగే చోటికి వెళ్ళాను. లోపలకు వెళ్ళగానే చుట్టూ చక్కని మొక్కల మధ్యన పెద్ద బాబా విగ్రహం కనిపించింది. విగ్రహం ముందు బాబా పాదాలు పెట్టారు. దీపాల వెలుగు, అగరుబత్తి, సాంబ్రాణి ధూపాలతో వాతావరణమంతా చాలా ఆహ్లాదంగా ఉంది. లోపల చాలామంది బాబా భక్తులు ఉన్నారు. వారంతా బాబా భజనలు చేస్తున్నారు. బాబా భజనలు వింటుంటే నా ఒళ్ళంతా పులకరించింది. నేనూ వెళ్ళి ఒక ప్రక్కన కూర్చుని వారితో పాటు బాబా భజనలు పాడసాగాను. అలా పాడుకుంటూనే, “మధుతో పెళ్ళయ్యాక ఇలానే మా ఇంట్లో కూడా బాబా భజనలు పెట్టుకోవాలి” అని అనుకుంటూ ఉన్నాను. అక్కడున్న భక్తులలో ‘బాబా మాల’ వేసుకుని నిష్ఠగా పూజలు చేసినవారు ఉన్నారు. వాళ్లను అందరూ పొగుడుతున్నారు. ఆ చోటు ఎంత బాగుందో! పూజ అయిపోయాక అందరూ ముందుగా బాబా పాదాలకు నమస్కరించుకుని, ఆ తరువాత బాబా విగ్రహం వద్దకు వెళ్ళి బాబాను దర్శించుకుంటున్నారు. నేను కూడా బాబా పాదాలకు నమస్కరించుకుని, బాబా విగ్రహం దగ్గరకు వెళ్ళాను. ఇంతలో, అప్పటివరకు విగ్రహంలా ఉన్న బాబా సజీవంగా మారి తమ ముఖాన్ని వేరేవైపుకు త్రిప్పుకున్నారు. బాబా ముఖాన్ని చూడాలనే ఆరాటంతో నేను వంగి వంగి బాబాను చూస్తున్నాను. అయితే, బాబా నాపై అలిగినట్లు మూతి ముడుచుకుంటూ తమ ముఖాన్ని మరోవైపుకు త్రిప్పుకున్నారు. దాంతో నేను కూడా ఆ వైపుకు వచ్చి బాబాను చూస్తూ, “బాబా! నేను మీ మీద అలిగి మీ మందిరానికి రావట్లేదని నా మీద మీకు కోపమా? ఇప్పుడు వచ్చాను కదా, మీ అలక మానండి బాబా” అని గోముగా అడిగాను. వెంటనే బాబా తమ అలక మాని నన్ను చూసి ప్రేమగా చిరునవ్వు నవ్వారు. నేను, “బాబా, మధుతో నా పెళ్ళి అవుతుందా? చెప్పండి బాబా” అని అడిగాను. బాబా కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నారు. నేను మళ్ళీ మళ్ళీ బాబాను సమాధానం చెప్పమని అడుగుతున్నాను. అప్పుడు బాబా ఎంతో ప్రేమగా తమ రెండు చేతులను నా తలమీద పెట్టి ‘నీ పెళ్ళి మధుతోనే అవుతుందిలే’ అని చెప్తున్నట్లు నన్ను ఆశీర్వదించారు. తరువాత బాబా విగ్రహంలా మారిపోయారు. నేను బాబాకు నమస్కరించుకుని వెనుకనున్న ద్వారం నుంచి బయటికి వెళ్ళాను. అక్కడ ఒక షాపు కనిపించింది. అందులో బాబా ఫోటో ఉన్న కీచైన్లు, పుస్తకాలు ఉన్నాయి. అంతటితో ఆ కల ముగిసింది.


ఉదయం నిద్రలేవగానే, “బాబా నా పెళ్ళి మధుతో చేస్తానన్నారు. కానీ అన్ని దారులూ మూసుకున్నాయి. ఇంపాజిబుల్ అనుకున్నది ఎలా పాజిబుల్ అవుతుంది? చాలా కష్టం కదా!” అనుకుంటూ, సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ ఓపెన్ చేశాను. ఆ ముందురోజు డ్యూటీలో బిజీగా ఉండటం వల్ల నేను బ్లాగ్ చదవలేదు. బ్లాగ్ ఓపెన్ చేయగానే బాబా మెసేజ్ ఇలా వచ్చింది: “నీకు అసాధ్యం అనిపించేది నేను సాధ్యం చేస్తాను, నేను దాన్ని పూర్తిచేస్తాను” అని.

ఆ మెసేజ్ చూడగానే, ‘బాబా నా మాటలన్నీ వింటున్నారు, నేనే బాబాను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను’ అని ఏడుపు వచ్చేసింది. “క్షమించండి బాబా. పెళ్ళి అనేది ప్రతి అమ్మాయి విషయంలో ఎంత ముఖ్యమో మీకు తెలుసు. అదీ ఇష్టపడినవాళ్ళతో పెళ్ళైతే ఆ సంతోషం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. బాబా, మధుతో నా పెళ్ళి మీరే దగ్గరుండి జరిపించాలి. నేను ఆ అనుభవాన్ని కూడా చాలా ఆనందంగా ఈ బ్లాగులో పంచుకోవాలి బాబా. మీ మెసేజ్ ద్వారా నాకు మీ ఆశీస్సులను ప్రసాదించారు. నా పెళ్ళి మిరాకిల్ కోసం ఎదురుచూస్తున్నాను బాబా. ఎవరితోనూ మాట రాకుండా అందరి ఆమోదంతో నా పెళ్ళి జరిపించండి”.


బాబా ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు


ఓం శ్రీ సాయినాథాయ నమః. బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను ఉద్యోగం చేస్తున్నాను. లాక్‌డౌన్ ఉన్నప్పటికీ అత్యవసర సేవలలో భాగంగా నేను రోజూ ఆఫీసుకి వెళ్ళాల్సి ఉంది. ఎప్పటిలాగే సోమవారంనాడు ఆఫీసుకి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేశాను. ఆరోజు రాత్రి మా బాబుకి జ్వరం వచ్చింది. జ్వర తీవ్రత అధికంగా ఉండటంతో బాబుని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. బాబు ఆరోగ్యం గురించి చాలా టెన్షన్ పడుతూనే మనసులో బాబాను తలచుకుంటూనే ఉన్నాను. బాబాను పరీక్షించిన డాక్టర్, “ఇది వైరల్ ఫీవర్ అయివుంటుంది” అని చెప్పి, కొన్ని మందులిచ్చి, బాబు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండమని చెప్పారు. మందులు వేశాక కూడా మంగళవారమంతా బాబుకి జ్వర తీవ్రత ఎక్కువగానే ఉంది. జ్వరం తగ్గడానికి బాబుకి తడిగుడ్డతో ఒళ్ళంతా తుడుస్తూ ఉన్నాము. ఆరోజు రాత్రి బాబా ఊదీని నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో బాబుకి ఒళ్ళంతా తుడిచాను. బాబా దయవల్ల అప్పటినుంచి బాబుకి శరీర ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టి, బుధవారానికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. బాబాకు నేను ఎల్లప్పుడూ ఋణపడివుంటాను. బాబా మా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటున్నారు, కాపాడుతూనే ఉంటారు.


అలాగే, మంగళవారంనాడే నాకు జలుబు చేసింది. నాకు మామూలుగా అలెర్జీతో జలుబు చేస్తూ ఉంటుంది, వెంటనే తగ్గిపోతుంటుంది. అలాంటి జలుబే అనుకుని మంగళవారం, బుధవారం తరచూ ఆవిరి పడుతూ, వేడినీళ్ళు త్రాగుతూ ఉన్నాను. గురువారం ఉదయం లేచేసరికి వాసన తెలియలేదు. దాంతో టెన్షన్ పడ్డాను. వాసన తెలియకపోవడం ఒకానొక కరోనా లక్షణం. వెంటనే డాక్టర్ని సంప్రదించాను. ఆయన నన్ను కోవిడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. దాంతో నేను కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. తరువాత మందులు వాడటం కూడా మొదలుపెట్టాను. టెస్ట్ రిజల్ట్ గురించి ఏమీ ఆలోచించలేదు, ‘అంతా బాబా చూసుకుంటారు’ అని అనుకున్నాను. వేడినీళ్ళలో బాబా ఊదీ వేసుకుని ఆవిరిపట్టాను. కాస్త టెన్షన్ గానే ఉంది. రాత్రంతా ‘ఓం శ్రీ సాయినాథాయ నమః’ చాంటింగ్ పెట్టి ఉంచాను. మరుసటి ఉదయం టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో నెగిటివ్ వచ్చింది. అది చూసి ఎంతో సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. “బాబా ఉండగా నాకు భయమెందుకు?” అనుకున్నాను. కానీ వాసన మాత్రం తెలియట్లేదు. శుక్రవారంనాడు, ఈ బ్లాగులో ప్రచురించిన వాసనకు సంబంధించిన ఒక అనుభవాన్ని మా సిస్టర్ నాకు పంపించింది. అది చదివి, “నాకు రేపు వాసన తెలిస్తే ఈ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని అనుకున్నాను. శనివారం ఉదయం నుంచి ఎదురుచూస్తూ ఉన్నాను, వాసన ఎప్పుడు వస్తుందా అని. రాత్రయినా వాసన తెలియలేదు. “ఈరోజు వాసన తెలియాలని బాబాకు చెప్పుకున్నాను కదా. అంతే, ఈరోజే నాకు వాసన తెలియాలి” అని అనుకుంటూ, వెళ్ళి బాత్రూములో డెట్టాల్ వాసన చూశాను. వాసన తెలిసింది. ‘బాబా మాట ఎన్నడూ అసత్యం కాదు’ అని ఎంతగానో ఆనందించాను. తరువాత చాలా పదార్థాలు వాసన చూశాను. చాలావరకు వాసన తెలిశాయి. ఆ రాత్రంతా ‘ఓం శ్రీ సాయినాథాయ నమః’ చాంటింగ్ అలా మ్రోగుతూనే ఉంది. బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. బాబా నన్ను, నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటున్నారు. నాకు ఏ కష్టం వచ్చినా బాబానే సహాయం చేస్తారు, చేస్తూనే ఉంటారు. బాబాకు నా జీవితాంతం ఋణపడివుంటాను.


ఓం శ్రీ సాయినాథాయ నమః.


15 comments:

  1. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤
    Om Sree Sachidananda Samarda Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤

    ReplyDelete
  3. Kothakonda SrinivasJune 28, 2021 at 9:30 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  4. Om Sai ram baba please bless my family and be with us thank you baba for your help.udi is medicine to all health problems.it cures very good.may baba stay in all heart ❤️ 🌹🌸🌺🌷🌷

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. Baba amma arogyam bagundali thandri

    ReplyDelete
  7. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  8. Baba amma reports normal ga ravali thandri

    ReplyDelete
  9. Baba santosh health bagundali thandri pleaseeee

    ReplyDelete
  10. Baba amma ki sampurna arogyani prasadinchu thandri etuvanti ebandi lekundachudu thandri pleaseeee

    ReplyDelete
  11. Bayanga vundhi baba kapadu thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo