సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 182వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. స్నేహితుని రూపధారిగా బాబా చేసిన ధనసహాయం
  2. సాయి లిఖిత అద్భుతశక్తి

స్నేహితుని రూపధారిగా బాబా చేసిన ధనసహాయం

సాయిభక్తుడు సత్యనారాయణ తన అనుభవాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు:

నేను 1980 నుండి సాయిని పూజిస్తున్నాను. నాకు సాయియే సర్వమూ. నాకు ఏ కష్టం వచ్చినా సాయి నన్ను ఆదుకుంటారని నా దృఢ విశ్వాసం. 1991లో జరిగిన ఒక అద్భుతమైన లీలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. సుమారు ౩౦ సంవత్సరాల వెనుకటి మధురానుభూతిని గుర్తుచేసుకుంటుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఈ లీలను చదివే మీరు కూడా ఆనందిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది.

నేను 1991లో జమ్మూ కాశ్మీర్ నుండి హైదరాబాదుకు బదిలీ అయి వచ్చాను. ఇక్కడికి వచ్చాక నాకు క్లిష్టపరిస్థితులు ఎదురయ్యాయి. ఆఫీసు నుండి రావలసిన డబ్బులు సమయానికి అందక చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! నాకు రావలసిన డబ్బులు త్వరగా వచ్చేలా చేయండి" అని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించాను. అలా నేను ప్రార్థించిన రెండుగంటల తర్వాత నా స్నేహితుడొకరు మా ఇంటికి వచ్చారు. పదేళ్లక్రితం నేను అతనికి ఐదువేల రూపాయలు అప్పుగా ఇచ్చాను. తర్వాత ఉద్యోగరీత్యా మేమిద్దరమూ వేర్వేరు ప్రదేశాల్లో స్థిరపడిపోయాము. మేము కలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఒకరినొకరం చూసుకొని చాలా ఆనందించాము. తరువాత తను నాతో మాట్లాడుతూ, "నన్ను క్షమించండి! మీరెక్కడున్నారో ఇన్నాళ్లూ నాకు తెలియలేదు. అందుకే నేను మీకు ఇవ్వవలసిన డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాను. ఇదిగో, మీ ఐదువేల రూపాయలు తీసుకోండి" అని డబ్బులు నా చేతిలో పెట్టారు. ఇంకా ఇలా చెప్పారు: "నేను మీరు పనిచేస్తున్న సంస్థలోనే పని చేస్తున్నాను. ఈమధ్యనే ఇక్కడికి బదిలీ అయి వచ్చాను. ప్రస్తుతం అక్కంపేటలో ఉంటున్నాను. మీరు కూడా ఇక్కడ ఉన్న వేరే బ్రాంచ్ కి బదిలీ అయి వచ్చారని తెలిసి, మిమ్మల్ని కలుసుకొని, మీకివ్వవలసిన డబ్బులు మీకిచ్చిపోదామని వచ్చాను" అని. నేను, "చాలా సంతోషం. ఇన్నాళ్లకు మనం కలిసే అవకాశం వచ్చింది. రేపు ఉదయం మీరు ఆఫీసుకు రండి. మనకు తెలిసిన వారినందరినీ పిలుస్తాను. అందరం ఒకసారి కలుద్దాం" అని చెప్పాను. అందుకు తను సరేనన్నారు. నేను, "భోజనం చేసి వెళ్ళండి" అని చెపితే, తను, "టీ మాత్రం త్రాగి వెళ్తాను" అన్నాడు. కాసేపు మాట్లాడుకున్నాక తను టీ త్రాగి వెళ్లిపోయాడు. "సమయానికి బాబా నా స్నేహితుడి ద్వారా డబ్బు సమకూర్చారు కదా!" అని అనుకొని సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

మరుసటిరోజు ఉదయం నేను ఆఫీసుకు వెళ్లి నా స్నేహితుని రాకకోసం ఎదురుచూశాను. అయితే సమయం గడుస్తున్నా తను రాలేదు. దాంతో, తను ఏ బ్రాంచ్ లో పనిచేస్తున్నానని చెప్పాడో అక్కడికి ఫోన్ చేసి, ఫలానా వ్యక్తి కొత్తగా అక్కడకు బదిలీ అయి వచ్చాడు, తనని నా దగ్గరకు పంపించమని చెప్పాను. వాళ్ళు, "ఆ పేరుగల వ్యక్తి ఎవరూ ఇక్కడ లేర"ని చెప్పారు. బహుశా హెడ్ ఆఫీసు అయివుండవచ్చని అక్కడికి ఫోన్ చేసి మాట్లాడాను. వాళ్ళు, "ఈమధ్యకాలంలో బదిలీ మీద ఇక్కడికి ఎవరూ రాలేదు. పైగా మీరు చెప్పిన పేరుగల వ్యక్తి ఆఫీసు మొత్తంలో అసలెవరూ లేరు" అని చెప్పారు. ఆశ్చర్యంతో నేను ఆలోచనలో పడ్డాను. ఒక్కసారిగా నా మనసులో బాబా మెదిలారు. ఆయనే నా స్నేహితుడి రూపంలో వచ్చి నాకు సహాయం చేశారని అర్థమై ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. కానీ అజ్ఞానంతో నేను బాబాను గుర్తించలేకపోయానని చాలా బాధపడ్డాను. కష్టం తీర్చమని అడిగినందుకు తానే స్వయంగా వచ్చి నన్ను ధన్యుణ్ణి చేసిన ఆ ప్రేమమూర్తికి శిరసా నా ధన్యవాదాలు.

సాయి లిఖిత అద్భుతశక్తి

బెంగుళూరు నుండి ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం శ్రీ సాయిరామ్! నేను నా సాయితండ్రికి సాధారణ భక్తుడిని. బ్లాగు వలన సాయితండ్రి పట్ల శ్రద్ధ, సబూరీ పెంపొందుతున్నాయి. 'సాయి లిఖిత' అంటే 48 రోజులపాటు "ఓం శ్రీ సాయిరామ్" అని 108సార్లు వ్రాయడం. దాని అద్భుతశక్తి కారణంగా నాకు జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

ప్రియమైన సాయితండ్రి నా ఇ.పి.ఎఫ్. ఖాతాలోని వివరాలను సరిచేయడానికి సహాయపడ్డారు. నా పి.ఎఫ్. ఖాతాలో నా పేరు, పుట్టినతేదీ తప్పుగా నమోదు చేయబడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో, ముఖ్యంగా ఇ.పి.ఎఫ్. కార్యాలయంలో ఇలాంటి పనులు చేయడం ఎంత కష్టమో చాలామందికి తెలుసు. ఆ వివరాలను పి.ఎఫ్. డేటాబేస్ లో సరిదిద్దడానికి నేను చాలా కష్టపడ్డాను. అలాంటి సమయంలో నా సాయితండ్రి నాకు సాయి లిఖిత మార్గం చూపించారు. నేను సాయి లిఖిత వ్రాయడం పూర్తి చేసినంతనే అద్భుతం జరిగింది. నా పి.ఎఫ్. ఖాతాలో నా వివరాలు సరిదిద్దబడ్డాయి. బాబా తనదైన పద్ధతిలో విశ్వం(ఇక్కడ విశ్వం అంటే మన సద్గురుసాయి తప్ప మరొకటి కాదు) ద్వారా కోరికలను నెరవేరుస్తూ నాలో సానుకూల ఆలోచనలను పెంపొందింపజేస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! దయచేసి మీ భక్తులందరితోపాటు ఈ ప్రపంచంలోని మానవులందరికీ మార్గనిర్దేశం చేయండి బాబా!"

ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీ సాయిరామ్. సద్గురు శ్రీ సాయిరామ్.

source: http://www.shirdisaibabaexperiences.org/2019/07/shirdi-sai-baba-miracles-part-2414.html

సాయిభక్తుల అనుభవమాలిక 181వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. ఊహకందనంత దూరంగా బాబా ఇచ్చిన మార్కులు
  2. బాబా మొత్తం ప్రపంచానికే సర్వశ్రేష్ఠమైన వైద్యులు

ఊహకందనంత దూరంగా బాబా ఇచ్చిన మార్కులు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సి.ఏ. చదువుతున్నాను. నేను నా సి.ఏ ఫైనల్ కి సంబంధించిన మొదటి గ్రూపు పరీక్షలను 4వ ప్రయత్నంలో పూర్తి చేశాను. ఆ తరువాత నేను రెండవ గ్రూపు పరీక్షలకు హాజరయ్యాను. కానీ మునుపటిలాగే నేను ఫెయిలయ్యాను. దానితో నాకు సహాయం చేయట్లేదని సాయి మీద ఒక నెలపాటు కోపంతో ఉన్నాను. "అందుకు నన్ను క్షమించండి సాయీ".

నెల తరువాత మళ్ళీ చదవడానికి కావలసిన మానసిక బలాన్ని బాబా ఇచ్చారు. ఈసారి నేను పరీక్షలకు చక్కగా సిద్ధమయ్యాను. పరీక్షలు మొదలయ్యాక మొదటి రెండు పేపర్లు బాగా వ్రాసాను. కానీ 3వ పేపర్‌ చూస్తూనే నేను చాలా కలవరపడ్డాను. ఎందుకంటే అందులోని ప్రశ్నలన్నీ చాలా కష్టంగా ఉన్నాయి. పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేనని నాకనిపించింది. మొత్తానికి ఏదో వ్రాసి, ఇంటికి వచ్చాక ఎన్ని మార్కులు వస్తాయని లెక్కించుకుంటే కేవలం 36 మార్కులు మాత్రమే వస్తాయనిపించింది. కనీసం 40 మార్కులు వస్తే గానీ పాస్ కాలేను. 3వ సబ్జెక్టుతో పోల్చితే 4వ సబ్జెక్టు బాగా చదవలేదు. అయినప్పటికీ ఆ పరీక్ష బాగా వ్రాశాను. ఎటొచ్చీ 3వ పేపర్ విషయంలోనే టెన్షన్ అంతా. నేను సాయిని ప్రార్థించి, "నేను నా కర్మ పూర్తిచేశాను, మిగతాది మీ చేతిలో వదిలిపెడుతున్నాను సాయీ!" అని చెప్పుకున్నాను. తరువాత 2 నెలలు నేను నా ఫలితాలకోసం ఎదురుచూస్తూ గడిపాను. ఆ సమయమంతా, "3వ పేపర్లో కనీసం 40 మార్కులు వచ్చేలా అనుగ్రహించమ"ని సాయిని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఆ విషయమై నేను క్వశ్చన్&ఆన్సర్ సైట్‌లో అడిగిన ప్రతిసారీ సానుకూలమైన సమాధానాలు వస్తుండేవి.

చివరికి ఫలితాలు రావడానికి ఒక వారం మాత్రమే ఉన్న సమయంలో నాకొక ఆలోచన వచ్చింది. "ఫలితాలు బుధవారం ప్రకటించబడతాయి. కాబట్టి ముందు గురువారంనుండి ఒక వారంపాటు సాయి ముందు ఒక దీపం వెలిగిస్తాను. చివరిరోజైన బుధవారంనాడు సి.ఏ. పూర్తిచేసిన వ్యక్తిగా ఆయన ముందు దీపం పెడతాను" అని నిర్ణయించుకున్నాను. అనుకున్నట్లుగానే రోజూ దీపం వెలిగించాను. చివరికి బుధవారం రానే వచ్చింది. భయం భయంగా సైట్ తెరిచాను. ఆశ్చర్యం! "పాస్" అని కనపడింది. నా ఆనందానికి హద్దుల్లేవు. నా ఊహకందనంత దూరంగా 3వ పేపర్‌లో 55 మార్కులు వచ్చాయి. అంతా బాబా ఆశీర్వాదఫలమే! అప్పుడు నేను అనుకున్నట్లుగానే సి.ఏ. పూర్తి చేసిన వ్యక్తిగా బాబా ముందు దీపం వెలిగించాను. "నాకు తెలుసు బాబా, మొత్తం నా సి.ఏ. ప్రయాణంలో మీరు నాకు తోడుగా ఉండి ధైర్యాన్నిచ్చారు. అందుకు నేను మీకు కేవలం కృతజ్ఞతలు చెప్పుకోలేను. నా జీవితమంతా మీకు ఋణపడివుంటాను. నేను మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇక నా భవిష్యత్తును మీరే నిర్ణయించండి. నాకేది శ్రేయస్కరమో అది చేస్తారని నా నమ్మకం. శ్రద్ధ, సబూరీల నిజమైన అర్థాన్ని నాకు అర్థమయ్యేలా చేసినందుకు చాలా ధన్యవాదాలు సాయీ!"

బాబా మొత్తం ప్రపంచానికే సర్వశ్రేష్ఠమైన వైద్యులు

బెంగుళూరు నుండి సాయిభక్తుడు సూరజ్ రావు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిబాబాకు అంకిత భక్తుడిని. ప్రతి విషయంలో నేను ఆయననే అంటిపెట్టుకుని ఉంటాను. ఆయనే నాకు దైవం, గురువు, తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, ప్రేమికుడు, స్నేహితుడు, వైద్యుడు, నన్ను నడిపించే ప్రేరణశక్తి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన నా సూపర్ హీరో.

ఓం శ్రీసాయినాథాయ నమః. నా అనుభవాన్ని వ్రాసే ముందు, నన్ను ఆశీర్వదించమని సాయిబాబాను, శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నాను. ఒకరోజు ఉదయం నా స్నానమయ్యాక నా మెడ భాగంలో ఒక రకమైన శబ్దం వినిపించింది. నేను దానిని అంతగా పట్టించుకోలేదు. కానీ ఆరోజు ముగిసే సమయానికి మెడ చుట్టూ నొప్పిగా అనిపించింది. కొన్నిరోజులకి నొప్పి తీవ్రంగా మారింది. దానివలన నేను కూర్చోలేను, నిలబడలేను, నిటారుగా నడవలేను, చివరికి సరిగ్గా నిద్రపోలేకపోయాను. నేను మందులు తీసుకున్నప్పటికీ నొప్పి పూర్తిగా తగ్గలేదు. ఆఖరి ప్రయత్నంగా నేను బాబాను ప్రార్థించి అగరుబత్తి నుండి రాలిన బూడిదను ఊదీగా తీసుకుని మెడ చుట్టూ రాసుకున్నాను. అలా ప్రతిరోజూ చేస్తుండేవాడిని. ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలో ఉన్నప్పుడు కలలో బాబా కనిపించి నా మెడ చుట్టూ సున్నితంగా తాకారు. నాకెంతో ఆశీర్వాదపూర్వకంగా అనిపించి సంతోషించాను. బాబా స్పర్శతో నా మెడనొప్పి పూర్తిగా అదృశ్యమైంది. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. బాబా మొత్తం ప్రపంచానికే సర్వశ్రేష్ఠమైన వైద్యులు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయిభక్తుల అనుభవమాలిక 180వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. బాబా ఇచ్చిన పునర్జీవితం
  2. సాయి ఆశీస్సులు

బాబా ఇచ్చిన పునర్జీవితం

విజయవాడ నుండి సాయిభక్తుడు నరేష్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని(జీవితాన్ని) మనతో పంచుకుంటున్నారు.

నా పేరు నరేష్ కుమార్. మాది విజయవాడ. మా నాన్నగారు బంగారపు పని చేస్తుంటారు. నాకు ఊహ తెలిసినప్పటికే మా తాతగారు బాబా భక్తులు. నా చిన్నవయసునుంచే మా అమ్మ నన్ను విద్యాధరపురంలో వున్న సాయిబాబా గుడికి తీసుకువెళ్తుండేది. బాబాని చూస్తూ వుంటే నాకు చెప్పలేని ఆనందం కలుగుతుండేది. మేము ఏ పనిమీద వెళ్తున్నా బాబా ఊదీ పెట్టుకొని వెళ్ళమని మా అమ్మ ఇప్పటికీ చెబుతుంటుంది.

2007వ సంవత్సరంలో నా మిత్రులు కొందరు నందిగామ దగ్గరలో వున్న (చందర్లపాడు వైపు) రామన్నపేట అనే గ్రామ సమీపాన కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వజ్రాలు దొరుకుతున్నాయని అనటంతో, ఒక ఆదివారం ఉదయం మిత్రులందరం కలిసి వజ్రాల వేటకు వెళ్ళాము. మధ్యాహ్నం వరకు కొన్ని రంగురంగుల రాళ్ళు సేకరించాము. తరువాత దగ్గరలోనే వున్న కృష్ణానదిలో స్నానం చేద్దామని ముందుగా నేను నదిలోకి దిగాను. ఆ చోట లోతు ఎక్కువగా(ఇరవై అడుగులు) ఉన్నందున దిగటం దిగటమే నేను నీట మునిగిపోయాను. ఈత రానందున ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను. అది చూసిన నా మిత్రులు కంగారుపడి సహాయంకోసం ఎవరైనైనా పిలుచుకు రావడానికి పరుగులు తీసారు. ఇక్కడ నేను ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోతున్నాను, ఎటువైపు చూసినా నల్లని చీకటి. దాదాపు నేను చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాను. ఆ స్థితిలో నాకు బాబా గుర్తుకొచ్చారు. వెంటనే నేను నా రెండు చేతులూ జోడించి, “నా పని అయిపోయింది బాబా, నన్ను మీరే కాపాడాలి” అని మనసులోనే అనుకున్నాను. అంతే! కేవలం కొద్ది సెకన్ల వ్యవధిలో బాబా బాబా నన్ను ఒడ్డుకు చేర్చారు. జరిగినదంతా కలో, నిజమో అర్థం కాలేదు. నెమ్మదిగా తేరుకుని, నా ప్రాణాలు కాపాడిన బాబాకు కన్నీళ్ళతో కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అంతలో నా మిత్రులు చుట్టుప్రక్కలవారిని పిలుచుకొచ్చారు. అప్పటికే నేను ఒడ్డున ఉండటం చూసి వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఇంతలో అక్కడికి ఒక పెద్దావిడ వచ్చి, “ఈ గోతిలో పడి చాలామంది చనిపోయారు బాబూ. నువ్వు ఒక్కడివే బ్రతికి బయటపడ్డావు” అన్నారు. నేను వారితో, “బాబానే నన్ను రక్షించి ఒడ్డుకు చేర్చారు” అని చెప్పాను. సాయిబాబా లీలలు సామాన్యులకు అంతుచిక్కనివి. ఆరోజు బాబా నన్ను కాపాడకపోయివుంటే ఈరోజు నేను మీముందు ఇలా ఉండేవాడిని కాదు. అంతటి ప్రమాదం నుండి నన్ను కాపాడి నాకు పునర్జన్మను ప్రసాదించిన సాయికి నేను నా జీవితాంతం ఋణపడివుంటాను. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”

సాయి ఆశీస్సులు

యు.ఎస్.ఎ. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:  


నేను చాలాకాలం నుండి సాయిభక్తురాలిని. నేను ఇతరులనుంచి అతితక్కువ సహాయాన్ని పొందుతూ ఒంటరిగా కష్టపడుతున్న మహిళను. స్వల్ప మార్గదర్శకత్వంతో జీవితంలో ప్రతిదీ నేనే ఒంటరిగా చేసుకుంటున్నాను. నేను చికాగోలో ఒక ప్రాజెక్టు మీద పనిచేస్తూ ఉండేదాన్ని. ఆ ప్రాజెక్టు ఒప్పందం ముగియనుండటంతో నేను ఆందోళనపడ్డాను. ఆ సమయంలో నేను క్వశ్చన్&ఆన్సర్ సైట్ లో అడగగా, 'నీకెందుకు ఆందోళన?' అని సమాధానం వచ్చింది. దాంతో 'అంతా బాబా చూసుకుంటారు' అని ధైర్యంగా ఉన్నాను. తరువాత నా ప్రాజెక్టు చివరిరోజున నేను నా మనసులో, 'తరువాత బ్యాంక్ ప్రాజెక్ట్ రావాల'ని అనుకుంటుండగా 'SAIA' అనే ట్రక్కు నా దృష్టిలో పడింది. అలా బాబా ఆశీర్వదించారని నేను చాలా సంతోషించాను. అద్భుతం! తదుపరి నాకు న్యూయార్కులో వచ్చిన ప్రాజెక్టు బ్యాంకు ప్రాజెక్టే! అక్కడి ప్రాజెక్టు మేనేజరు వీలైనంత త్వరగా నేను అక్కడికి చేరుకోవాలని కోరారు. అందువలన నేను వెంటనే చికాగో నుండి న్యూయార్కుకు మకాం మార్చాల్సిన అవసరం ఏర్పడింది. అయితే అంతకుముందెప్పుడూ నాకు స్థలమార్పిడి అనుభవం లేని కారణంగా చాలా టెన్షన్ పడ్డాను. ముఖ్యంగా నా కారును క్రొత్తచోటుకు ఎలా తీసుకుపోవాలో నాకు తెలియలేదు. సహాయం కోసం ఇంటర్నెట్‌లో పరిశోధించాను కానీ, ఏమాత్రం తెలియని కారు ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీలను నమ్మడంపై నాకు అనుమానాలు తలెత్తాయి. అటువంటి పరిస్థితిలో సహాయం కోసం నేను నా ప్రియమైన సాయిని ప్రార్థించి, ఆయన ఆశీస్సులను అభ్యర్ధించాను. ఆ విషయమై నేను క్వశ్చన్&ఆన్సర్ సైట్ లో బాబా సమాధానం కోసం చూస్తే, "నువ్వు ప్రయాణం చేస్తావు. ప్రయాణం సుఖంగా ముగుస్తుంది" అని వచ్చింది. వెంటనే నేను ఇంటర్నెట్ ద్వారా ఒక ఏజెన్సీని సంప్రదించి, ఆ వ్యక్తితో మాట్లాడాను. అతను చాలా స్నేహపూర్వకంగా మాట్లాడి చక్కగా సహాయం చేశాడు. అనేక ఇతర ఏజెన్సీలను కూడా నేను సంప్రదించినప్పటికీ అతనిపై నమ్మకం కలిగింది. అతను నామమాత్రంగా పైకం వసూలు చేసి 2 రోజుల్లో డ్రైవరును ఏర్పాటు చేశాడు. నిజంగా ఇది ఒక అద్భుతం! ఎందుకంటే సాధారణ ధరలో డ్రైవర్ దొరకాలంటే ఒక వారం పడుతుంది. 2 రోజుల్లో కావాలంటే చాలా ఎక్కువ ధర చెప్తారు. అలాంటిది బాబా నాకు స్వల్పసమయంలో సాధారణ రేటుతో డ్రైవరును చూపించారు. బాబా దయతో నేను చికాగోలో ఉండగానే న్యూయార్క్‌లో నాకు వసతి కూడా ఏర్పాటైంది. తరువాత నేను న్యూయార్క్ చేరుకున్నాను. అక్కడి స్టాఫ్ చాలా స్నేహపూర్వకంగా నన్ను ఆహ్వానించి, ఒక కుటుంబసభ్యురాలిలా పరిగణిస్తూ నాతోపాటు ఫ్లషింగ్ లో ఉన్న శిరిడీసాయి మందిరానికి కూడా వచ్చారు. నా ఊహకందని విధంగా నాకు ఎంతో సహాయం చేస్తూ ఎంతో బాగా చూసుకుంటున్నారు. ఇదంతా సాయి ఆశీస్సుల కారణంగానే. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా!" 

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 18వ భాగం


శ్రీసాయితో వీరేంద్ర స్వానుభవాలు 

అమూల్యమైన మా నాన్నగారి అనుభవాలను చదివిన తరువాత, శ్రీసాయిబాబాతో నాకు కూడా కొన్ని అనుభవాలు వుంటాయని మీరు ఆలోచిస్తుంటారని నాకు తెలుసు. నేనొకసారి మా నాన్నగారి అనుభవాలను ఒక భక్తురాలికి వివరించాను. అప్పుడు ఆమె నాతో, మా నాన్నగారు పొందినటువంటి అమూల్యమైన ఆధ్యాత్మిక అనుభవాలు నేను పొందివుండకపోవచ్చుననీ, కానీ నేను అటువంటి పుణ్యాత్మునికి జన్మించడంవల్ల ఆయన వారసత్వంగా, అణుమాత్రంగానైనా పొందిన పుణ్యం వల్ల ఈ తరానికి చెందిన సాయిభక్తులందరికీ వివరించదగిన కొన్ని అనుభవాలు ఖచ్చితంగా పొందే ఉంటానని అన్నది. ఆ అనుభవాలను పంచుకోవడం ద్వారా నేను కూడా ఆ పుణ్యాన్ని వారందరికీ పంచగలుగుతానని అన్నది. ఆ భక్తురాలు ఇచ్చిన ఆ సలహా నన్ను కదిలించడంతో, ఇంతవరకు నాకు కలిగిన చిన్న చిన్న అనుభవాలన్నింటినీ కూడా మీతో పంచుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ విధంగా బాబాపై నాకున్న ప్రేమను సాయిబాబా సేవగా వ్యక్తీకరించగలుగుతున్నాను. 

నా పూర్తి పేరు వీరేంద్ర జ్యోతీంద్ర తర్ఖడ్  మా పేర్ల వెనుక ఒక చిన్న కథ ఉన్నది. మా ముత్తాతగారు తన కొడుకులకందరికీ తమ పేరు చివర 'ద్ర' అనే అక్షరం వచ్చేటట్లుగా పెట్టారు. అలా నామకరణం చెయ్యటానికి మూలకారకులు నోబెల్ గ్రహీత అయిన శ్రీరవీంద్రనాథ్ ఠాగూర్.

శ్రీఠాగూర్ యునైటెడ్ కింగ్ డం (U.K.) వెళ్ళేముందు చౌపాటీలో నివసిస్తున్న మా ముత్తాతగారి బంగళాలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. మా ముత్తాతగారి కుటుంబానికి ఆంగ్లేయుల ఆచార వ్యవహారాలన్నీ బాగా తెలుసు కాబట్టి, వారి నుంచి వాటిని నేర్చుకోవాలనే యోచనతో ఆయన అక్కడకు వచ్చారు. ఠాగూర్ గారికి జ్యోతిష్యం పట్ల చాలా మక్కువ ఉండటంతో ఆయన దాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసారు.

ఆయన మా ముత్తాతగారి జాతకచక్రం వేసి, తర్ఖడ్  కుటుంబం వారంతా ఇంద్రుడి నుండి ఆవిర్భవించారనీ, అందుచేత వారంతా ఆ పేరుతోనే గుర్తింపుతో ఉండాలనీ చెప్పారు. ఆ విధంగా తన కొడుకులకు అలా (పేరు చివర ద్ర' అనే అక్షరం వచ్చేలా) పేర్లు పెట్టడానికి ఆయన మా ముత్తాతగారిని ప్రభావితం చేసారు. మా ముత్తాతగారు దానికి ఒప్పుకొని ఉండవచ్చు. ఆయన తన కొడుకులకు రామచంద్ర (మా తాతగారు), జ్ఞానేంద్ర  అని నామకరణం చేసారు. మా తాతగారు తన కుమారులిద్దరికీ సత్యేంద్ర, జ్యోతీంద్ర (మా నాన్నగారు) అని నామకరణం చేశారు. ఆ తరువాత జ్యోతీంద్ర తన కొడుకులకు రవీంద్ర (మా అన్నగారు), వీరేంద్ర (నేను) అనీ, రవీంద్ర తన కొడుకుకు దేవేంద్ర అని, నేను నా కొడుకుకు మహేంద్ర అని పేర్లను పెట్టడం జరిగింది.

నా చిన్నతనం నుండి నేను, ప్రతి గురువారం సాయంత్రం మా ఇంట్లో జరిగే సాయిబాబా ఆరతికి హాజరవుతూ ఉండేవాడిని. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. నేను మొట్టమొదటిసారిగా నాకు 18 సంవత్సరాల వయస్సున్నప్పుడు, నా స్నేహితులు అమర్ భగతాని, శశిభాటియాలతో కలసి శిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నా భార్య కూడా సాయిభక్తురాలు కావటం నా అదృష్టం. ఆమె తన 5వ యేట నుండి శిరిడీకి వెళ్లి బాబా దర్శనం చేసుకుంటోంది. ఆమె తన 5 సంవత్సరాల వయస్సులో తండ్రిని పోగొట్టుకుంది. మా వివాహం అయిన తరువాత మేము మా అత్తగారి ఫ్లాట్ లోనే నివసించడం మొదలుపెట్టాము. మా అత్తగారు, నా భార్య ఇద్దరూ కూడా సాయి భక్తులవడంతో నా 'సాయి సంస్కారం' ఇంకా వృద్ధిచెందింది. 

శిరిడీలో గురుపూర్ణిమ

శిరిడీలో జరిగే గురుపూర్ణిమ ఉత్సవాలకు మా అత్తగారితో కూడా కలసి వెళ్ళడం ప్రారంభించాను. క్రమం తప్పకుండా 18 గురుపూర్ణిమ ఉత్సవాలకు హాజరయ్యాను. శిరిడీలో గురుపూర్ణిమ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయని మీకు తెలిసేవుంటుంది. ఆ ఉత్సవాలలో 'అఖండ పారాయణ' అంటే, మసీదులోని బాబా చిత్రపటం ముందు నిరంతరాయంగా 'శ్రీసాయి సచ్చరిత్ర' పవిత్రగ్రంథాన్ని చదవడం ఒక అంశం. ఆ కార్యక్రమంలో పాల్గొనదలచిన సాయి భక్తులందరూ తమ తమ పేర్లు ఇస్తే, ఆ పేర్లలోనుంచి డ్రా ద్వారా 54 పేర్లు తీసి 'శ్రీసాయి సచ్చరిత్ర' అఖండ పారాయణలో ఎవరు ఏ అధ్యాయం చదవాలో నిర్ణయిస్తారు. 

అలా ఒక గురుపూర్ణిమనాడు నేను కూడా నా పేరు ఇచ్చినప్పుడు, నాకు 9వ నెంబరు కేటాయించబడింది. దీనర్ధం  నేను శ్రీసాయి సచ్చరిత్ర'లోని 9వ అధ్యాయం చదవాలి. ఈ అధ్యాయంలోనే సాయిబాబాపై తర్ఖడ్ కుటుంబానికి గల భక్తి, ప్రేమల గురించిన వివరణ ఉంది. అది నాకు మహదానందం కలిగించింది. మసీదులో నా భాగం పారాయణ పూర్తిచేసాక, నాకు ఒక కొబ్బరికాయ, శ్రీసాయిబాబా ఫోటో ప్రసాదంగా లభించాయి. ఈ ఫోటోని లామినేషన్ చేయించి, ఫ్రేమ్ కట్టించి ప్రతిరోజూ పూజించుకోవడానికి మా ఇంట్లో ఉంచాము. ప్రతిరోజూ ఉదయాన్నే నేను నిద్రనుండి లేవగానే, ఈ బాబా ఫోటో ముందు నిలబడి, నమస్కారం చేసుకొని, శ్రీసాయిని, “ఓ సాయి! నేను నిన్నెప్పటికీ మరవకుండా ఉండేలా వరమివ్వు!” (“హేఁచి దాన్ దేగా దేవా, తుఝా విసర్ నవావా) అని ప్రార్థిస్తూ వుంటాను.

అపురూపమైన వెండి భరిణె

తరతరాలుగా తర్ఖడ్ కుటుంబానికి శ్రీసాయిబాబా తమ ఆశీస్సులను అందజేస్తూనే ఉన్నారు. శ్రీసాయిబాబా మా కుటుంబదైవం. ప్రతి విషయంలోనూ ఆయన మమ్మల్ని రక్షిస్తూ ఉన్నారు. మేము అనుక్షణమూ ఆయన అనుగ్రహాన్ని చవిచూస్తున్నాము. భవిష్యత్తులో కూడా పొందుతామన్న విశ్వాసం మాకుంది. నేనిప్పుడు ఒక అద్భుతమైన అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను.

అది 1973వ సంవత్సరం నవంబరు నెల, దీపావళి రోజులు. నేను పనిచేసే కంపెనీవారు ట్రైనింగ్ నిమిత్తం నన్ను ఇంగ్లాండు పంపిస్తున్న సందర్భంగా నేను మొట్టమొదటిసారిగా విదేశాలకు వెళ్ళడానికి తయారవుతున్నాను. నేనక్కడ లండను నగరానికి 100 కి.మీ. దూరంలో ఉన్న ఒక ప్రాంతంలో మార్చి వరకు ఉండాలి. అందుచేత అవసరమయినవన్నీ సర్దుకోవడం చాలా ముఖ్యం. నేను శుక్రవారం బయలుదేరి శనివారం రాత్రికి లండను చేరుకున్నాను. ఆదివారం విశ్రాంతి తీసుకున్నాను. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు బాబా ఊదీ పెట్టుకొని వెళ్ళడం చిన్నప్పటి నుండి మాకు అలవాటు. సోమవారం ప్రొద్దున్నే ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతుండగా, నా దగ్గర బాబా ఊదీ లేదని గ్రహించి, ఎంతో నిరాశపడ్డాను. అంతలోనే, నా భార్యకు ట్రావెలింగ్ సూటుకేసు సర్దేటప్పుడు మొట్టమొదట బాబా ఊదీ ప్యాకెట్ పెట్టి, ఆ తరువాతనే మిగతా బట్టలు సర్దటం అలవాటని నాకు గుర్తుకొచ్చింది. వెంటనే నేను వెళ్ళి సూటుకేసు మొత్తం ఖాళీచేసి చూడగా, ఊదీ ప్యాకెట్ కనిపించింది. అది 5 నెలలవరకూ నాకు సరిపోతుంది. లండనులో ఈ చిన్న ఊదీ ప్యాకెట్టే నాకు పెద్ద అండ. ఉద్యోగరీత్యా ముంబయిలో కూడా తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండేవాడిని. అందుచేత ముంబయి తిరిగి వెళ్ళగానే ఊదీ దాచుకునేందుకు ఒక వెండి భరిణె కొనాలని నిర్ణయించుకున్నాను. లండనులో ట్రైనింగ్ పని పూర్తిచేసుకుని మార్చి నెలలో ముంబయి తిరిగి వచ్చాను. 

నా భార్య, అత్తగారితో కలసి వెండి భరిణె కొనడానికి ముంబయిలోని గిర్గాఁవ్ లో ఒక షాపుకు వెళ్ళాను. ఆ షాపులోని అబ్బాయి 7, 8 వెండిభరిణెలు చూపించాడు. కానీ అన్ని భరిణెలకూ మూతలు విడిగా వచ్చే విధంగా ఉన్నాయి. నాకు అలా మూత విడిగా రాకుండా భరిణెతోనే ఉండేలాగా కావాలని చెప్పాను. షాపు యజమాని, "భరిణె ఆర్డర్ ఇస్తే తయారు చేయిస్తాను” అని చెప్పాడు. అంత చిన్న పనికి ఆర్డర్ ఇవ్వడం ఎందుకని ఆలోచించి, మరో షాపులో చూద్దామని ప్రక్కషాపులోకి వెళ్ళాము. ప్రక్కషాపతనికి నాకు ఎటువంటి వెండిభరిణె కావాలో వివరించాను. షాపు యజమాని, "పాత భరిణె అయినా ఫరవాలేదా?" అని అడిగాడు. పాత భరిణె అంటే ఏమిటని అడిగాను. కొంతమంది పాత వెండి సామాన్లు అమ్మేస్తూ ఉంటారు, వాటిలో మీకు కావలసిన వెండిభరిణె ఉండవచ్చని అన్నాడు. ఇది విని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పవిత్రమయిన బాబా ఊదీ వేసుకోవడానికి పాత వెండిభరిణె కొనడమా? అదేమన్నా మంచి పనేనా? నా భార్య, అత్తగారు కూడా అలాగే ఆలోచించడంతో మరోషాపులో క్రొత్త భరిణె ఉంటుందేమో చూద్దామనుకున్నాము. ముందే వద్దని చెప్పి షాపు యజమానిని బాధపెట్టడం ఎందుకని, పాత భరిణె తీసుకొచ్చాక చూసి, ఆ తరువాత వద్దని చెప్పొచ్చులే అని అనుకొని, “సరే తీసుకురండి! చూస్తాము” అని చెప్పాము. ఆ షాపు యజమాని మాకు ఎలాంటి భరిణె కావాలో సరిగ్గా అటువంటిదే తెచ్చి ఇచ్చాడు. ఆ వెండిభరిణెను చూడగానే నాకు మతిపోయింది. ఎందుకంటే అది చాలా నల్లగా ఉంది. నా ముఖంలో భావాన్ని చూసి, షాపు యజమాని, "అయ్యా! ఒకవేళ మీరు కోరుకునే భరిణె ఇలాంటిదే అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికే మెరుగు పెట్టించి క్రొత్తదానిలా తయారు చేయించి ఇస్తాను" అన్నాడు. పాపం అతడు చాలా శ్రమ తీసుకుంటున్నాడనిపించింది. తరువాత ఆ వెండిభరిణె మూత తెరచి చూడగానే ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. దానివంకే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను. నా భార్య, అత్తగారు నన్ను చూసి, “ఏమయింది? ఎందుకు అలా ఉండిపోయావు? ఏమి జరిగింది?” అని ఆత్రుతగా అడిగారు. వారికి ఆ భరిణెను చూపించగానే వాళ్లకు కూడా నోటమాట రాలేదు. ఆ వెండిభరిణె మూతకు లోపలివైపు బాబా ఫోటో అతికించి ఉంది.

ఇదంతా నేను అతిశయంగా చెప్తున్నానని అనుకోవద్దు. అంత చిన్న భరిణెలో బాబా ఫోటో ఎవరు అతికిస్తారు? అది 1974వ సంవత్సరం. అప్పట్లో ఇప్పుడు ఉన్నంతమంది బాబా భక్తులు లేరు. పైగా బాబాపై భక్తిశ్రద్ధలు అంత ఎక్కువగా లేని కాలం. భక్తులు గణపతి, రాముడు, కృష్ణుడు, శంకరుడు మొదలయిన దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకుంటుండేవారు. అందుచేత ఎవరయినా బాబా భక్తుడు అంత శ్రమ తీసుకుని ఆ భరిణెలో బాబా బొమ్మ అతికించాడంటే నమ్మశక్యం కాలేదు. షాపు యజమాని ఆ వెండిభరిణెకు మెరుగు పెట్టించి ఇచ్చాడు. ఈరోజువరకూ కూడా అది ఏమాత్రం మెరుపు తగ్గకుండా అలాగే వుంది. మా ఇంట్లో ఇతర వెండి సామాన్లు, బొమ్మలూ ఉన్నాయి. అవి కొంతకాలమయిన తరువాత నల్లగా మారాయి, కానీ ఈ వెండిభరిణె మాత్రం ఇప్పటికీ మెరుపు తగ్గకుండా అలాగే వుంది. ఆ భరిణె ఎప్పుడూ నాతోనే ఉంటుంది. బాబా ఊదీ ఎప్పుడు పెట్టుకుందామని దానిని తెరిచినా, నాకు బాబా దర్శనం అవుతూనే ఉంటుంది.

ఒక్కసారి జరిగినదంతా గుర్తుచేసుకుంటే, బాబా నా కోసమే ఆ భరిణెను తయారుచేయించారేమోనని ఇప్పటికీ నేను అనుకుంటూ ఉంటాను. నేనే కనుక క్రొత్త వెండిభరిణెను ఆర్డర్ చేసి ఉంటే, అందులో బాబా ఫోటో ఉండేది కాదు. అలా తర్ఖడ్ కుటుంబంలో మూడవతరం వారమైన మాకు బాబా మీద నమ్మకం ఇంకా బలపడింది.

విజ్యోత్ ఆవిర్భావం

మనలో ప్రతి ఒక్కరికీ కూడా మనసులో ఒక బలీయమైన కోరిక ఉంటుందని నా అభిప్రాయం. మా నాన్నగారు తను ఒక ధనవంతుడిననీ, తనకు ఒక బంగళా, కారు ఉండేవని, ఒక స్టోర్ రూమ్ నిండా పింగాణీ పాత్రలలో సమృద్ధిగా ఆహార పదార్థాలు నిల్వ చేయబడి ఉండేవని చెబుతూ ఉండేవారు. కానీ తరువాతి కాలంలో అవన్నీ మృగ్యమైపోయాయి. నేను ఆయన ఆఖరి సంతానాన్ని. అందుచేత స్వశక్తితో బాగా కష్టపడి, మా కుటుంబం పోగొట్టుకున్న సంపదనంతా భగవంతుని దయతో తిరిగి సంపాదించాలనే బలీయమైన కోరిక ఉండేది. ముంబయిలో స్వంత బంగళా కలిగి ఉండటమంటే అసాధ్యం. నా భార్య కూడా ఖార్‌లో బంగళాలోనే పుట్టి పెరిగింది. అందుచేత మా కుటుంబానికి కూడా స్వంతంగా ఒక బంగళా ఉండాలనీ, వృద్ధాప్యంలో సుఖంగా జీవిద్దామని మా ఇద్దరి కోరిక. తరువాత, 1991లో మేము వనగాం (ముంబయి నుండి సుమారు 100 కి.మీ. దూరంలో వెస్ట్రన్ రైల్వే లైనులో ఉన్న స్టేషన్) గ్రామంలో 6 గుంటల (726 చదరపు గజాల) స్థలం కొన్నాము. నా కంపెనీలో ఋణం తీసుకుని, మేము 1993 కల్లా ఆ స్థలంలో ఒక బంగళా కట్టుకోగలిగాము. 1960లో ఒకసారి నేను పూనా వెళ్ళినప్పుడు, నా స్కూల్ స్నేహితుడు నాకు 'లకాకి' (LAKAKI) అనే బంగళా చూపించాడు. ఆ బంగళా ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన లక్ష్మణరావ్(ల) కాకాసాహెబ్(కా) కిర్లోస్కర్(కి) గారిది. ఆయన పేరులోని మొదటి అక్షరాలు (ల కా కి) తీసుకొనడమే ఆ పేరు వెనుకవున్న రహస్యం. 1959లో ఆర్థిక ఇబ్బందులవల్ల ఖార్‌లో వున్న మా బంగళాను అమ్మవలసివచ్చింది. నాకు 16 సంవత్సరాల వయస్సులో, 'లకాకి' బంగళాను చూశాక, నా జీవితంలో ఎప్పుడైనా బంగళా కట్టుకుంటే దానికి 'విజ్యోత్'(VIJYOT- VIrendra JYOtindra Tarkhad) అనే పేరు పెట్టాలనే ఆలోచన కలిగింది. అందుకే మేము కట్టుకున్న బంగళాకు 'విజ్యోత్' (VIJYOT) అని పేరు పెట్టుకున్నాము. 

అబా పన్షీకర్ నుంచి సాయి ప్రసాదం 

మా బంగళా బ్లూ ప్రింటు తయారుచేసినప్పుడు, ఆ బంగళాలో పూజ మరియు ధ్యానం చేసుకోవడానికి ఒక చిన్న పాలరాతిమందిరం కూడా ఉండాలని నిర్ణయించుకున్నాము. మందిరం తయారయింది. ఆ మందిరంలో నిలువెత్తు బాబా రంగుల ఫోటో ఉంచాలనే కోరిక మాకు బలంగా ఉండటంతో మేము చాలా గట్టి ప్రయత్నం చేశాము. కానీ మాకు అలాంటి బాబా ఫోటో ఒక్కటి కూడా లభించలేదు.

అది ఏప్రిల్, 1993. మార్చి నెలలో ముంబయి మహానగరం విషాదకరమైన బాంబుపేలుళ్ళకు సాక్షీభూతంగా నిలిచింది. దానివల్ల ప్రజలు, అపరిచితులతో మాట్లాడటానికి కూడా భయపడేవారు. అలాంటి పరిస్థితులలో, ఒకరోజు సాయంత్రం బాగా ప్రొద్దుపోయాక ఒక వ్యక్తి మా ఇంటి డోర్ బెల్ మ్రోగించాడు. నా భార్య తలుపుతీయగానే, ఒక అపరిచితవ్యక్తి నా గురించి అడిగి, నన్ను కలవాలని పట్టుబట్టాడు. కానీ, అతడు నా పేరు కూడా సరిగా చెప్పలేకపోవడంతో నా భార్య అతడిని అనుమానించింది. నేను అక్కడికి వెళ్ళగానే, అతడు నన్ను గుర్తుపట్టి పలకరించాడు. ఒకసారి అతడు శిరిడీలోని లెండీబాగులో నన్ను కలుసుకున్నానని, ఆ సమయంలో నేను బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని కూడా అతడితో పంచుకున్నట్లు గుర్తుచేశాడు. అతడు పూనా సాయిమందిరంలో సేవ చేస్తుండే వ్యక్తి అని నాకు స్పష్టంగా గుర్తుకొచ్చి, అతడిని మా ఇంట్లోకి రావడానికి అనుమతించాను. రాత్రి భోజనం చేసే సమయం అయినందువల్ల అతడిని భోజనానికి ఆహ్వానించగా, అతడు అంగీకరించాడు. 

మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, మా పాలరాతి మందిరానికి ఒక సాయిబాబా రంగుల చిత్రపటం కావాలనే మా కోరికను అతడితో వెల్లడించాను. మేము కనుక నిలువెత్తు రంగుల చిత్తరువు కోసం చూస్తూ ఉన్నట్లయితే, ఒక చిత్రకారుడి చేత నిలువెత్తు రంగుల చిత్రపటం గీయించుకోవచ్చనీ, అలాకాకుండా రంగుల ఫోటో కోసమే చూస్తున్నట్లయితే అబా పన్షీకర్ మాత్రమే మాకు సహాయం చేయగలరని అతడు చెప్పాడు. తన దగ్గర అబా పన్షీకర్ తమ్ముడు, ప్రముఖ మరాఠీ రంగస్థల నటుడయిన ప్రభాకర్ పన్షీకర్ ఫోన్ నంబరు ఉందని కూడా చెప్పాడు. నేను ప్రభాకర్ పన్షీకరుకు ఫోన్ చేసి, లండనులో ఉన్న అబా పన్షీకర్ టెలిఫోన్ నెంబరు తీసుకుని, ఆయనకు ఫోన్ చేశాను. 

బాబా రంగుల చిత్రపటం కావాలనే నా కోరికను విని ఆయన, తాను మే నెలలో ముంబయి వస్తున్నాననీ, తన తమ్ముడు నివాసముండే ప్రభాదేవి ప్రాంతంలో తనను కలుసుకోవచ్చుననీ చెప్పాడు. మే నెల దాకా నిరీక్షించి, ఆయన ముంబయి వచ్చిన తరువాత, ఒక శనివారం సాయంత్రం ఆయనను కలుసుకోవడానికి అనుమతి తీసుకున్నాను. మా కుటుంబసభ్యులు, అనగా నేను, నా భార్య కుందా, మా అమ్మాయి సుజల్ మరియు మా అబ్బాయి మహేంద్ర, అందరం కలిసి 1993 మే 22న వాళ్ళింటికి వెళ్ళాము. నాకు ఆయన గురించి ఏమీ తెలీదు. ఇంతలో కాషాయవస్త్రాలు ధరించి, మెడలో రుద్రాక్షమాలతో ఒకాయన మా ముందుకు వచ్చి, తనను తాను అబా పన్షీకరుగా పరిచయం చేసుకున్నారు. నేనాయనకు నమస్కారం చేసి నా కుటుంబాన్ని పరిచయం చేశాను. పూలదండలు కానీ, మిఠాయిలు కానీ ఏమీ లేకుండా వట్టిచేతులతో ఎలా వచ్చారని ఆయన నన్ను మందలించారు. కానీ ఆయన మాకోసం బాబా చిత్రపటం తెస్తున్నట్లు నాతో ఎప్పుడూ చెప్పని కారణంగా, ఆయన అలా మందలించడంతో నేను ఆశ్చర్యపోయాను.

ఏమయినప్పటికీ నా తప్పును మన్నించమని కోరి, వెంటనే సిద్ధివినాయక మందిర ప్రాంతానికి వెళ్ళి ఒక పూలదండ, కొన్ని పేడాలు తీసుకెళ్ళాను. ఆయన తన ఇంటి లోపలికి వెళ్ళి, చిత్రపటాలను వుంచే పెద్ద పెట్టెను తీసుకునివచ్చారు. దాని మూత తీసి, అందులోనుంచి ఒక డ్రాయింగ్ పేపర్ చుట్టను బయటకు తీశారు. ఆ చుట్టను విప్పగానే అందులో, సింహాసనం మీద కూర్చుని, తమ నిత్యమైన చిరునవ్వును మాపై వర్షిస్తూ ఉన్న శ్రీసాయిబాబా సాక్షాత్కరించారు. 1మి.మీ. దళసరి కొడాక్ పేపరు మీద ముద్రించిన బాబా రంగుల చిత్రపటం అది. అబా పన్షీకర్ సలహా ప్రకారం బాబా చిత్రపటానికి పూలమాల వేసి, అందరికీ పేడాలు పంచాను. అబాగారు ఆ చిత్రపటం క్రిందభాగంలో, “వీరేంద్ర, కుందా, సుజల్ మరియు మహేంద్రలకు.. అబా పన్షీకర్ నుంచి సాయిప్రసాదం” అనే సందేశాన్ని వ్రాసి సంతకం చేసిన తరువాత ఆ ఫోటోను మాకిస్తూ, "దయచేసి మీ నిధిని స్వీకరించండి" అని అన్నారు. 

అది నా జీవితంలోనే బంగారుక్షణం. నాకు నోట మాట రాలేదు. నిస్సందేహంగా నాకది విలువకట్టలేని సంపద. నేను నా పర్సులోనుంచి 1,001 రూపాయలు తీసి ఆయనకు ఇవ్వబోయాను. తాను బాబా ఫోటోలు అమ్మనని చెప్పి ఆయన ఆ డబ్బును స్వీకరించలేదు. కనీసం లండనులోని సాయిమందిరానికి విరాళంగానైనా ఆ డబ్బును తీసుకోమని నేను చెప్పాను. ఆయన అయిష్టంగానే అందుకు ఒప్పుకుని, తన చేతితో తీసుకోకుండా ఆ డబ్బును బల్లమీద పెట్టమన్నారు. తరువాత ఆయన మా నేపథ్యం గురించి అడిగారు.

అప్పుడు శ్రీసాయిబాబాతో మా నాన్నగారికి వున్న అనుబంధం గురించి నేను ఆయనకు చెప్పాను. నేను చెప్పినది వినగానే ఆయన నన్ను కౌగిలించుకుని, ఆరోజు తన జీవితంలోనే అత్యంత ఆనందాన్ని పొందిన రోజని చెప్పారు. ఆయన ఎంతో ఉద్విగ్నతతో లోపలకు వెళ్ళి రూపాయి నాణాలు రెండు తెచ్చి నాకిచ్చారు. నేను వాటిని స్వీకరించి, ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, “నేనిప్పుడు నిజమైన బాబా ప్రసాదాన్ని పొందాను” అన్నాను. ఆయన నా మాటలకు అర్థమేమిటని అడిగారు. నేను ఆయనతో, “ఈ రెండు నాణాలు శ్రీసాయిబాబా విశ్వవ్యాప్త సందేశాలైన శ్రద్ధ మరియు సబూరీ” అని చెప్పాను. నా వివరణతో అబా పన్షీకర్ సంతోషంలో మునిగిపోయారు. ఆయన కళ్ళనుండి ఆనందభాష్పాలు జాలువారుతుండగా, తాను ఈరోజు ఒక నిజమైన సాయిభక్తుడిని కలుసుకున్నానని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. 

అప్పుడు అబా పన్షీకర్ మాకు తన నేపథ్యం గురించి చెప్పారు. ఆయన తండ్రి గిర్గాఁవ్ లో వున్న గణపతి మందిరం ప్రధాన పూజారి. అబాకు 8 సంవత్సరాల వయస్సులో వారి ఇంటికి ఒక ముస్లిం ఫకీరు వచ్చి, అతడికి ఒక సాయిబాబా ఫోటోను ఇచ్చారు. ఆయన ఆ ఫకీరుతో, తాను బ్రాహ్మణుల ఇంట్లో జన్మించానని, తన ఇంట్లో ముస్లిమైన బాబా ఫోటోను పెట్టనివ్వరని అన్నాడు. అప్పుడా ఫకీరు, “బాబూ! నువ్వు ఇప్పుడు ఈ ఫోటోని తీసుకోకపోయినా నువ్వు జీవితాంతమూ బాబా సేవ చేస్తూవుంటావని నీ భవిష్యత్తులో వ్రాసివున్నది. నువ్వు బాబా ఫోటోలను ప్రజలకు పంచుతావు. (బేటే, అబ్ తూ ఇసే మత్ లే! తేరీ కిస్మత్ మే లిఖా హై కి తూ ఇస్కీ జిందగీ భర్ సేవా కరేగా! ఔర్ ఇస్కే ఫోటో లోగోంకో బాటా కరేగా!)” అని అన్నారు. ఆయన సూచించిన భవిష్యత్తు నూటికి నూరుపాళ్ళు యదార్థం. ఎందుకంటే, అబా పన్షీకర్ తమ చరమదశ వరకు శ్రీసాయిబాబా సేవలో ఉన్నారు. 

తరువాత ఆ అమూల్యమైన బాబా ఫోటోకు లామినేషన్ చేయించి, దానికి చక్కని చెక్కఫ్రేము తయారు చేయించి, 1993వ సంవత్సరం గురుపూర్ణిమనాడు, వనగాఁవ్ లోని మా 'విజ్యోత్' బంగళాలోని చిన్న సాయిబాబా మందిరంలో దానిని ప్రతిష్ఠించాము. అప్పటినుండి మేము క్రమం తప్పకుండా గురుపూర్ణిమను ఆ ఇంటిలోనే నిరాడంబరంగా జరుపుకుంటున్నాము. ఇది నా చిన్న స్వీయ అనుభవం.

నేను వెళ్ళాలని అనుకున్నప్పుడల్లా శిరిడీకి వెళుతూ ఉంటాను. ప్రస్తుతం నేను పదవీవిరమణ చేసి, బాబా అనుగ్రహంతో సౌకర్యవంతమైన జీవనం గడుపుతున్నాను. మా పిల్లలకు కూడా సాయిభక్తులే జీవితభాగస్వాములుగా రావాలని, తర్ఖడ్ కుటుంబంలోని మాకందరికీ శ్రీసాయిబాబాపై భక్తి, ప్రేమలు ఇలాగే నిరంతరం కొనసాగుతూ ఉండాలనీ మేము బాబాను ప్రార్థిస్తున్నాము. చివరగా, నేను సాయిభక్తులందరినీ కోరుకునేదేమిటంటే, సాయిబాబా మనకందించిన శ్రద్ధ, సబూరీ అనే మహామంత్రాలను ఎన్నటికీ మరవవద్దు. ఎవరైతే ఈ రెండు మంత్రాలకు నిజంగా కట్టుబడివుంటారో వారి కోరికలను శ్రీసాయిబాబా తప్పక నెరవేరుస్తారు. మనము నిత్యం ప్రేమించే శ్రీసాయిబాబాకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ గ్రంథాన్ని ముగిస్తున్నాను.

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై! 

శ్రీసాయిబాబాతో తర్ఖడ్ కుటుంబము వారి ప్రత్యక్ష అనుభవాలు సమాప్తం.

సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"



ముందు భాగం

కోసం

బాబా పాదుకలు

తాకండి.


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

సాయిభక్తుల అనుభవమాలిక 179వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. సాయిబాబా మా ఇంట కొలువైన తీరు
  2. 24 గంటల్లో సాయి చేసిన సహాయం

సాయిబాబా మా ఇంట కొలువైన తీరు

వైజాగ్ నుండి జయంతిప్రసాద్ గారు ఒక అద్భుతమైన సాయిలీలని మనతో పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ నమస్తే!

కొన్ని ఆశ్చర్యకర విషయాలు అందరూ వింటుంటారు, చదువుతుంటారు. విని 'ఔరా!' అనుకుంటారు. ఆ భగవంతుని కృపాకటాక్షాలుంటే ఏదైనా జరుగుతుంది అనటానికి ఉదాహరణే మీరిప్పుడు చదవబోయే అనుభవం.

శిరిడీ సమాధిమందిరంలో మురళీధరుని విగ్రహం ప్రతిష్ఠించాలని అనుకున్న స్థానంలో సాయిబాబా కొలువుదీరిన వివరాలు సచ్చరిత్రలో అందరూ చదివి వుంటారు. అలాంటి సంఘటన ఒకటి ఈరోజు నేను విని చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. నా స్నేహితుడు, వైజాగ్ నివాసస్తులైన శ్రీనివాస్ గారు తమ ఇంటి ప్రవేశద్వారం వద్ద చిన్న మందిరంలా కట్టి, అందులో అడుగున్నర ఎత్తున్న శిరిడీ సాయిబాబా విగ్రహం ప్రతిష్ఠించి ఉంచారు. ఎప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్లినా ఏదో ఆదరాబాదరాగా వెళ్ళి, పని చూసుకొని వచ్చేస్తుండేవాడినే కానీ, ఆ బాబా గురించి తెలుసుకోవాలన్న ఆలోచనే రాలేదు. అనుకోకుండా ఈరోజు, "బాబూ! ఇంత చిన్న జాగాలో బాబాను పెట్టారు. మీకు బాబా అంటే అంత ఇష్టమా? ఏమిటా కథ?" అని ఆరా తీసాను. అందుకతనిలా సెలవిచ్చారు:


  


"నాకు ఎప్పటినుంచో చేతిలో వేణువు ధరించి, వెనుక గోవు ఉన్న మురళీకృష్ణుని విగ్రహం ఒకటి సేకరించాలనే కోరిక ఉండేది. అందునిమిత్తం విగ్రహాల పరిజ్ఞానమున్న ఓ మనిషిని కలిసి విగ్రహం విషయం అతనికి పురమాయించాను. వారంరోజులు గడిచిన తరువాత ఆ వ్యక్తి వచ్చి, "పదండి సార్, విగ్రహాన్ని చూద్దాము" అని నన్ను ఓ చోటకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఓ విగ్రహాన్ని చూపిస్తూ, "సైజ్ సరిపోతుందాండీ?" అని అడిగాడు. విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోవడం నా వంతైంది! విషయం ఏమిటంటే, అది శిరిడీ సాయిబాబా విగ్రహం! నేను, "అదేంటి స్వామీ! నేను మురళీకృష్ణుని విగ్రహము, అది కూడా వెనుక గోవు ఉండాలని చెప్పాను కదా!" అంటే, అతను, "లేదండీ, మీరు చెప్పింది బాబా విగ్రహమే!" అంటాడు. నేను, "లేదయ్యా బాబూ! కృష్ణుడే" అంటే, మళ్లీ అతను, "లేదు సార్. మీరు బాబా విగ్రహం అన్నారు. కాలు మీద కాలు వేసుకొని కూర్చునే బాబా అనే నాకు చెప్పారు" అంటూ వాదించాడు. ఎంతకీ ఆ వాదులాట తెగలేదు. ఇక చేసేదేమీ లేక సరేనని బాధతో ఆ బాబా విగ్రహాన్ని ఇంటికి తెచ్చి అటక మీద పెట్టాను.

తరువాత దసరా సమయంలో మా ఇంటిలో ఏర్పాటు చేసిన బొమ్మలకొలువులో ఈ బాబా విగ్రహాన్ని కూడా పెట్టాము. బొమ్మలకొలువు చూడటానికి వచ్చిన పేరంటాళ్ళందరూ బాబా విగ్రహాన్ని భలేవుందని మెచ్చుకున్నారు. మా కాలనీలో ఉన్న ఒక 18 ఏళ్ళ అమ్మాయి కూడా వచ్చి బొమ్మలకొలువు చూసి ఫోటోలు తీసుకొని వెళ్ళింది. రెండురోజుల తరువాత ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి, "అంకుల్! చాలా పెద్ద విచిత్రం జరిగింది. మీరు వెంటనే బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయండి" అని హడావిడి చేసింది. నాకేం అర్థంకాక, "ఎందుకమ్మా అలా అంటున్నావు?" అని అడిగాను. ఆ అమ్మాయి తాను  తీసిన ఫోటోలు చూపించింది. అవి చూసి మేమంతా ఆశ్చర్యపోయాము. 36 ఫోటోలు వుండే  రీలులో 1 నుండి 15 వరకు, 17 నుండి 36 వరకు ఉన్న ఫోటోలన్నీ ఫుల్ బ్లాక్, అంటే పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఒక్క 16వ ఫోటోలో మాత్రం సాయిబాబా దర్శనమిస్తున్నారు. దాంతో ఆ బాబా విగ్రహంలో ఏదో మహత్యం ఉందని మాకనిపించి దానిని ఒకచోట ప్రతిష్ఠిద్దామని అనుకున్నాము".

"ఆ తరువాత పంచాంగం చూసి, "ఫలానా పౌర్ణమినాడు వచ్చి, సిమెంట్ పనిచేసి, సాయిబాబాను ఒక ఎత్తులో ప్రతిష్ఠించాలి" అని ఒక మేస్త్రీకి కబురుపెట్టాను. అతడు దానికి అంగీకరించి, పౌర్ణమినాడు రాకుండా, కబురూ కాకరకాయా లేకుండా అమావాస్యనాడు ఒక గునపం, పారతో వచ్చి 'పని మొదలుపెడతాన'ని అన్నాడు. నేను, "అదేంటయ్యా! మొన్న పౌర్ణమినాడు కదా నిన్ను రమ్మని చెప్పింది. అప్పుడు రాకపోగా అమావాస్యనాడు వస్తావా?" అని అంటే, అతడు, "లేదు సార్, మీరు ఈరోజే రమ్మన్నారు" అన్నాడు. ఎంత గదమాయించినా అతడు, "నేను నా డైరీలో కూడా వ్రాసుకున్నాను సార్" అని మరీ మరీ చెప్పాడు. ఇక నేను, "సరే, ఆ బాబా ఈరోజే కూర్చుంటానంటే నేనెందుకు వద్దనాలి?" అని ఊరుకున్నాను. అలా ఆరోజు ఈ బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించాము. అదీ సాయిబాబా మా ఇంట కొలువైన తీరు".

"ఆ తర్వాత కొన్నాళ్ళకి పైనున్న లింటల్(సన్ షేడ్)ను వెడల్పు చేసి బాబాకు ఎండనుండి, వాననుండి రక్షణ ఏర్పాటు చేశాము. అనూహ్యంగా మూడునెలల్లో మా అబ్బాయికి మా ఇంటిపై ఇల్లు కట్టాలని ఆలోచన రావడం, డబ్బు సమకూరడము, అవాంతరాలేవీ లేకుండా నిర్మాణం పూర్తి కావడం తలచుకొంటే ఆశ్చర్యంగా ఉంది. అంతా సాయిబాబా అనుగ్రహమే! అనుకోకుండా మా ఇంటికి వచ్చి మాకు అండగా నిలిచారు బాబా. నాకు తోచినంతలో ప్రతిరోజూ బాబా ముందు దీపం పెట్టి, బాబాకు ఒక పండు సమర్పించుకుంటాను".

24 గంటల్లో సాయి చేసిన సహాయం

సాయిభక్తుడు వెంకటేష్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను మన ప్రియమైన సాయికి సాధారణ భక్తుడిని. "సాయీ! మీ బిడ్డలమైన మేము చేసిన తప్పులన్నింటినీ దయతో క్షమించండి". నేనిప్పుడు చెప్పబోయే అనుభవం చాలా సరళంగా, చిన్నదిగా అనిపించవచ్చు కానీ, సాయిపై నాకున్న విశ్వాసాన్ని అది మరింత బలపరిచింది. కేవలం సాయి దయతో 2018 డిసెంబరులో మేము మా అబ్బాయి వివాహం చేశాము. వివాహానికి వచ్చే బంధువులకోసం మా ఇంటి మొదటి అంతస్తులో ఉన్న ఒక పోర్షన్ ను ఖాళీ చేయించాము. వివాహమయ్యాక నా కొడుకు, కోడలు ఢిల్లీ ప్రయాణమయ్యారు. తరువాత 2019, ఫిబ్రవరి నెలలో నేను ఆ పోర్షన్ ని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. సరైన వాళ్ళు అద్దెకు కుదరడంలో జాప్యం ఏర్పడుతుందేమోనని నేను ఆందోళనపడి బాబాను ప్రార్థించి, ఇల్లు అద్దెకు ఉందని తెలియజేస్తూ కొన్ని వెబ్‌సైట్లలో ప్రకటన పెట్టాను. ఆ పని నేను శనివారం సాయంత్రం చేశాను. నా ప్రియమైన మిత్రులారా! నన్ను నమ్మండి. మరుసటిరోజే నాకు 3 - 4 కాల్స్ వచ్చాయి. ఆరోజు సాయంత్రానికల్లా ఒక యువకుడు కొత్తగా కాపురం పెట్టడానికి 50% అడ్వాన్స్ ఇచ్చి మా ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అంత త్వరగా సాయి చేసిన సహాయానికి ఆనందంతో సాయిని స్మరించుకున్నాను. అది సాయి లీల తప్ప మరోటి కాదు. నెలల తరబడి ఇళ్ళు ఖాళీగా ఉండటం నేను ఎన్నోసార్లు చూశాను. కానీ నా విషయంలో ప్రకటన ఇచ్చిన 24 గంటల్లో నా సాయి తమ లీలను చూపారు. "బాబా! నా గుండె సవ్వడితో సదా మీ దివ్యనామం అనుసంధానం అవనీయండి. మీ భక్తులందరినీ మీ దివ్య నామస్మరణతో శుద్ధి చేసి అందరినీ ఆశీర్వదించండి".

బోలో శ్రీ జగదానందకర జగదోద్ధార శిరిడీవాస, దత్తావతార, అనంతకోటి బ్రహ్మాండనాయక రాజధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! జై సాయిరామ్! జై సాయిరామ్! జై సాయిరామ్!

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 17వ భాగం


సంత్ గాడ్గేమహరాజ్ తో అనుభవం

ఇంతకుముందు చెప్పినట్లుగా, మహారాష్ట్రలో గొప్ప సాధువయిన  గాడ్గేమహరాజ్ గురించి ఇప్పుడు తెలియచేస్తాను. ఆయన ఖార్ లో వున్న మా బంగళాకు తరచూ సాయంత్రం సమయంలో ముందుగా చెప్పకుండానే విచ్చేసి, రాత్రంతా వుండి, వేకువఝాముననే వెళ్ళిపోతూ ఉండేవారు. నేను ఆయనను స్వయంగా చూశాను. ఆయన వివిధ రంగుల గుడ్డముక్కలతో కుట్టబడిన కఫ్నీ ధరించి, తలకు ఒక గుడ్డముక్క కట్టుకునేవారు. ఈ వేషధారణ వల్ల ఆయనను 'గోధాడీ మహరాజ్' లేదా 'గోధాడీ  బాబా' అని పిలిచేవారు. ఆయన కాళ్ళకు తోలుచెప్పులు వేసుకుని, చేతిలో ఎప్పుడూ వెదురు కఱ్ఱని తీసుకుని వెళుతుండేవారు. వెదురుకఱ్ఱ అరిగిపోకుండా అడుగున ఇనుపతొడుగు బిగించబడివుండేది.

ఆయన విఠలుని(విష్ణువు) పరమభక్తుడు. ఎల్లప్పుడూ, “పాండురంగా! పాండురంగా!” అని జపిస్తుండేవారు. మహారాష్ట్ర అంతటా తన కీర్తనల ద్వారా సాయిమహిమను చాటిన దాసగణు మహరాజ్ ఆయనను మా కుటుంబానికి పరిచయం చేశారనుకుంటాను. గాడ్గేమహరాజ్ దృష్టి ఎల్లప్పుడూ అట్టడుగు వర్గాల ప్రజలకు అన్నివిధాలుగా సహాయం చేయడంపైనే కేంద్రీకృతమై వుండేది. ఆయన వారికి పరిశుభ్రత యొక్క ప్రాధాన్యాన్ని తెలియచేస్తూ, మహారాష్ట్ర అంతా వీధులు ఊడ్చి, తానే స్వయంగా ఆచరించి చూపేవారు. "పరిశుభ్రతే దైవం" అనేది ఆయన నినాదం. గ్రామాలను అంటువ్యాధుల బారినుండి, జబ్బుల నుండి “పరిశుభ్రతే" సురక్షితంగా ఉంచుతుందన్నది గ్రామస్థులందరికీ ఆయన ఇచ్చే సందేశం. ఈ కార్యక్రమానికి ఆయన ధనవంతుల నుంచి ఆర్థికసహాయం కూడా స్వీకరించేవారు. అలా స్వీకరించిన ధనాన్ని గ్రామాల్లో అవసరమైనవారికి ఆయన పంచుతూ ఉండేవారు.

శ్రీసాయిబాబా మహాసమాధియైన తరువాత మా తాతగారు గాడ్గేమహరాజుకు బట్టలతానులు విరాళంగా ఇస్తూవుండేవారు. మా అమ్మగారు తన చేతులతో స్వయంగా గోధాడీ కుట్టి, గాడ్గేమహరాజ్ మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఆయనకు సమర్పిస్తుండేవారు. ఆయన దానిని స్వీకరించి, మా అమ్మగారిని ఆశీర్వదించేవారు. ఆ కాలంలోని వారు కురిపించిన ప్రేమ, వాత్సల్యాలు ఈ రోజుల్లో చూడటం చాలా కష్టం.

ఇంతకుముందు చెప్పినట్లుగా మా నాన్నగారిచేత బంగళా కొనిపించడానికి ముఖ్యకారకులు సంత్  గాడ్గేమహరాజ్. ఆయన అన్నిచోట్లకు ఎక్కువగా కాలినడకనే తిరుగుతూ ఉండేవారు. ఆయన ఖార్ అనే ప్రాంతంలో ఒక బంగళాను చూశారు. దానినే మా నాన్నగారు 1923వ సంవత్సరంలో రూ.15,007 లకు కొన్నారు. అప్పట్లో ఓల్డ్ ఖార్ ప్రాంతంలో అదొక్కటే ఏకైక కట్టడం. మా బంగళా మిద్దెపై నుంచి మేము రైల్వేస్టేషన్, మౌంట్ మేరీ చర్చి మొదలైనవన్నీ ఎటువంటి అడ్డంకీ లేకుండా చూడగలిగేవారమని నాకు గుర్తు. ఎప్పుడైనా గాడ్గేబాబా మా బంగళాకు వచ్చినప్పుడు, జొన్నలతో రోటీ(భాకరీ), ఝుణకా(సంప్రదాయ మహారాష్ట్ర వంటకం) తయారుచేయమని మా అమ్మగారిని ఆదేశించేవారు. మేమంతా ఆ రాత్రికి 'ఝణకా భాకర్' తినేవాళ్ళం. ఆ పదార్థాల యొక్క అద్భుతమైన రుచి ఇప్పటికీ నా జ్ఞాపకాలలో అలాగే పదిలంగా ఉంది. రాత్రి భోజనం చేసిన తరువాత, గాడ్గేబాబా తాను వివిధ గ్రామాలలో చేసిన పాదయాత్రలలో తమ అనుభవాలను మాకు వివరిస్తూ ఉండేవారు. గాడ్గేబాబా సాధారణమైన వ్యక్తి కాదు, నిశ్చయంగా భగవంతుని దూతే. మా నాన్నగారు ఆయనతో కలసి పండరిపురం వెళ్ళినప్పుడు మా నాన్నగారికి కలిగిన దివ్యానుభవాన్ని మీకిప్పుడు వివరిస్తాను.

ఒకసారి మా నాన్నగారు ఆయనను, ఎప్పుడైనా పాండురంగ విఠలుని కలుసుకున్నారా అని అడిగారు. గాడ్గేబాబా మా నాన్నగారిని తనతో పాటు పుణ్యక్షేత్రమైన పండరిపురానికి రమ్మన్నారు. సౌఖ్యవంతమైన బంగళాలో ఉండేటటువంటి అన్ని సుఖాలకు దూరంగా, అక్కడ ఒక సాధారణ యాత్రికునిలా ఉండాలని ఆయన మా నాన్నగారితో చెప్పారు. అప్పుడు గాడ్గేబాబాతో కలిసి మా నాన్నగారు రెండవసారి పండరిపురానికి ప్రయాణమయ్యారు.

చంద్రభాగా నదీతీరంలో ఒక గుడారంలో వారికి బస ఏర్పాటు చేయబడింది. ఆయన రోజంతా గాడ్గేబాబాతో కలిసి తిరుగుతూ, ఆయన పరిశుభ్రతా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారో, ఆయన చుట్టూ గుమిగూడే పీడిత ప్రజానీకానికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారో, ప్రజలు ఆయన జ్ఞానోపదేశాలను ఎంత ఓపికగా వింటున్నారో అవన్నీ ప్రత్యక్షంగా చూశారు. సంత్ గాడ్గేమహరాజ్ చేసే సామాజిక కార్యక్రమాల మీద మా నాన్నగారికి చక్కని అవగాహన వచ్చింది. సాయంత్రానికి వారు తమ గుడారానికి తిరిగివచ్చారు. గుడారం లోపల ప్రతి పడక మీద నలుపురంగు కంబళి అమర్చబడివున్న మూడు పడకలు, గుడారం మధ్యలో వేలాడుతూవున్న ఒక కిరోసిన్ లాంతరు ఉండటం మా నాన్నగారు గమనించారు. గాడ్గేబాబా మా నాన్నగారిని విశ్రాంతి తీసుకోమని, తాను బయటకు వెళ్ళి తినడానికి 'ఝుణకా భాకర్' తెస్తానని చెప్పారు. ఖాళీగా వున్న మూడవ పడక ఎవరికోసమని మా నాన్నగారు ఆయనను అడిగినప్పుడు, గాడ్గేబాబా తాను చెప్పడం మరిచాననీ, ఆ రాత్రికి తన అతిథి ఒకరు వస్తారనీ, ఆ రాత్రికి అక్కడే వుండి సూర్యోదయానికి ముందే వెళ్ళిపోతారనీ చెప్పారు. ఆ అతిథి మనకు ఎటువంటి ఇబ్బంది కలిగించరని గాడ్గేబాబా చెప్పారు. తానెప్పుడు పండరిపురం వచ్చినా ఈ అతిథి ఆ రాత్రి తనకు తోడుగా ఉంటారని చెప్పి గాడ్గేబాబా గుడారం నుంచి బయటికి వెళ్ళారు. కొద్దిసేపటిలోనే గుడారంలో చీకటిపరచుకుంది. అలాగే రాత్రి ఉష్ణోగ్రత కూడా బాగా తగ్గిపోయింది. మా నాన్నగారు కొంతసేపు కునికిపాట్లుపడి వెంటనే నిద్రపోయారు.

తనకోసం ఝణకా భాకర్ తెచ్చిన గాడ్గేబాబా పిలుపుతో మా నాన్నగారు మేల్కొన్నారు. తన అతిథితో కలిసి తాను అప్పటికే భోజనం చేసినందుకు ఏమీ అనుకోవద్దని చెప్పి, మా నాన్నగారిని భోజనం పూర్తిచేయమనీ, ఈలోపల తాను అలా నది ఒడ్డున వాహ్యాళికి వెళ్ళి వస్తానని గాడ్గేబాబా చెప్పారు. మా నాన్నగారు ఆ అతిథివైపు చూశారు. అతడు ధోవతి కట్టుకుని, నడుము పైభాగంలో ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఉన్నాడు. అతడి శరీరం కారునలుపుతో ఉండి, చూడటానికి భిల్లజాతివాడిలా ఉన్నాడు. అతడి కళ్ళు ఎఱ్ఱగా మండుతున్న నిప్పుకణికల్లా ఉన్నాయి. అతడి భుజం మీద కంబళి ఉంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, గుడారం మొత్తం మా నాన్నగారు ఇంతకుముందెన్నడూ ఆఘ్రాణించని గాఢమైన కస్తూరి పరిమళంతో నిండిపోయింది. ఇంతలో వారిద్దరూ గుడారం నుంచి వెళ్ళిపోయారు. మా నాన్నగారు గాడ్గేబాబా తెచ్చిన భోజనాన్ని తినడం పూర్తిచేశారు. అటువంటి మధురమైన ఆహారాన్ని ఆయనెప్పుడూ రుచిచూసి వుండలేదు. భోజనం పూర్తిచేయగానే, గుడారంలోని కస్తూరి పరిమళం తన మత్తుప్రభావాన్ని చూపడంతో మా నాన్నగారు వెంటనే గాఢనిద్రలోకి జారుకున్నారు. ఉదయాన్నే కాకి అరుస్తున్న శబ్దానికి ఆయన నిద్ర లేచారు. గాడ్గేబాబా అప్పటికే నిద్ర లేచివున్నారు. ఆయన మా నాన్నగారిని ముఖం కడుక్కొని, ఆయనకోసం మట్టికుండలో ఉంచిన వేడి వేడి టీ త్రాగమన్నారు. మా నాన్నగారు రాత్రి వచ్చిన అతిథి గురించి ఆరా తీయగా, ఆ అతిథి తన కర్తవ్య నిర్వహణకోసం విఠోబా గుడి తెరవడానికి ముందే అక్కడ ఉండాలనీ, అందువలన అతడు అప్పటికే టీ త్రాగి వెళ్ళిపోయాడనీ గాడ్గేబాబా చెప్పారు. మా నాన్నగారు దానిని కొంచెం అమర్యాదగా భావించి, ఆ అతిథిని తనకెందుకు పరిచయం చేయలేదని గాడ్గేబాబాను అడిగారు. గాడ్గేబాబా మా నాన్నగారితో, అతడిని మీరు గుర్తించి ఉంటారని అనుకున్నాననీ, అతడిని పండరిపురంలో పరిచయం చేయాల్సిన అవసరం లేదనీ అన్నారు. మా నాన్నగారు ఆయనతో, రాత్రి చీకటిలో ఆ అతిథిని తాను సరిగా చూడలేదనీ, ఉదయాన్నే నిద్రలేచిన తరువాత అతడిని పరిచయం చేస్తారని అనుకున్నానని చెప్పారు. అప్పుడు గాడ్గేబాబా ఆ అతిథి మరెవరో కాదని, పండరిపురంలో వెలసిన శ్రీపాండురంగ విఠలుడేనని చెప్పారు. తరువాత గాడ్గేబాబా మా నాన్నగారితో, బంగళాలో తనను అడిగిన ప్రశ్నకు సమాధానం లభించిందా అని అడిగారు. రాత్రి మా నాన్నగారిని మంత్రముగ్ధుడిని చేసిన కస్తూరి పరిమళం అప్పుడు మళ్ళీ ఆయనను ఆవరించింది. తరువాత చాలాకాలంపాటు ఆ కస్తూరి పరిమళం తనని అనుసరించేదని, దాంతో లార్డ్ విఠోబా తనతోనే ఉన్నారనే భావన కలుగుతుండేదని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. సంత్ గాడ్గేబాబా ఇంకొక ఆహ్లాదకరమైన అనుభవాన్ని కూడా ఇచ్చారు.

కాలం గడిచేకొద్దీ గాడ్గేబాబా వృద్ధులయ్యారు. మా బంగళాకు ఆయన ఆఖరిరాక కూడా మరపురానిది. ఆయన ఎప్పుడు మా ఇంటికి వచ్చినా తనతోపాటు కంబళి, వెదురుకఱ్ఱను తీసుకొని వచ్చి, తిరిగి వెళ్ళేటప్పుడు వాటిని తనతోపాటు తీసుకుని వెళుతూ వుండేవారు. ఆయన చివరిసారి మా ఇంటికి వచ్చినప్పుడు తనతోపాటు వెదురుకఱ్ఱను తీసుకుని వెళ్ళడం మరచిపోయారు. నిజానికి ఆయన కఱ్ఱను తనతో తీసుకువెళ్ళడం మరచిపోలేదు. దానిని ఆయన జ్ఞాపకంగా ఉద్దేశ్యపూర్వకంగానే అక్కడ వదిలేశారు. నేనిది ఎందుకు చెబుతున్నానంటే ఆయన నడకతీరు, కఱ్ఱ సహాయం లేకుండా నడవలేరన్నట్లుగా వుండేది. నా తల్లిదండ్రులు తమలో తాము చర్చించుకుని, ఆయన ఆచూకీ తెలుసుకుని ఆయన కఱ్ఱని ఆయనకు తిరిగి ఇచ్చేద్దామనుకున్నారు. కానీ, ఆయన ఎల్లప్పుడూ మహారాష్ట్రలో సంచారం చేస్తూ వుండటం వలన ఆయనను వెదకి పట్టుకోవడం సాధ్యం కాలేదు. నా తల్లిదండ్రులు ఆ కఱ్ఱను ఎంతో పవిత్రమైనదిగా భావించి, దానిని చందనపు మందిరం దగ్గర వుంచారు. నా తల్లిదండ్రులు గాడ్గేబాబా చిత్రపటాన్ని ఒకటి కొని, దానిని కూడా చందనపు మందిరంలో ఉంచి, ప్రతిరోజూ పూజిస్తుండేవారు. గాడ్గేబాబాను కూడా వారు ఒక దైవంలా పూజించడాన్ని మీరు కూడా అభినందిస్తారు. ప్రియమైన పాఠకులారా! ఈ రోజుల్లో మన మధ్యన అటువంటి సాధువులుగాని, దేవదూతలుగాని ఎవరూ లేరని నేను అనుకుంటున్నాను. అటువంటి సాధువులకు నిస్వార్థసేవ చేసే అంకితభక్తుల ఉనికి కూడా కరువయింది.

సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"



ముందు భాగం

కోసం

బాబా పాదుకలు

తాకండి.


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 

 


తరువాయి భాగం

కోసం

బాబా పాదాలు

తాకండి.


సాయిభక్తుల అనుభవమాలిక 178వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. శిరిడీ దర్శనంతో చిక్కులన్నీ విడిపోయాయి
  2. కలల కంపెనీలో ఉద్యోగం ఇచ్చిన బాబా.

శిరిడీ దర్శనంతో చిక్కులన్నీ విడిపోయాయి

సాయిబంధువులందరికీ నా నమస్కారం. నా పేరు శిరీష. నేను నెల్లూరు నివాసిని. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనస్ఫూర్తిగా బాబాని నమ్ముకుంటే ఎంతటి కష్టమైనా తీరుతుందనటానికి నిదర్శనమైన నా అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.

మా అమ్మాయి బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. నెలసరి సమయంలో హార్మోన్ల ప్రాబ్లెమ్ వల్ల తను చాలా ఇబ్బందిపడుతుంటుంది. ఆ సమయంలో తనకి తీవ్రంగా జ్వరం రావడం, నోరంతా పొక్కి అల్సర్స్ రావడం జరుగుతుంటుంది. దాదాపు కదలలేని పరిస్థితి. ఎంతోమంది డాక్టర్లకు చూపించాము. కానీ పరిస్థితిలో ఏ మార్పూ లేదు. తనకున్న ఈ సమస్య కారణంగా నెలలో రెండుసార్లు కాలేజీకి హాజరు కాలేకపోయేది. తల్లిదండ్రులుగా మేము కాలేజీకి వెళ్లి తన తరపున లీవ్ లెటర్ ఇచ్చి, వాళ్ళను రిక్వెస్ట్ చేసేవాళ్ళం. ఇలా ఉండగా తనకి పరీక్షలు దగ్గరపడ్డాయి. తన ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ కష్టపడి చదివి పరీక్ష వ్రాయడానికి కాలేజీకి వెళ్ళింది. కానీ, కాలేజీ యాజమాన్యం కారణమేమీ చెప్పకుండానే తనని పరీక్షకు హాజరు కానివ్వకుండా ఆపేసారు. తనకేమీ అర్థంకాక అక్కడే ఏడుస్తూ కూర్చుంది. పరీక్ష అయిపోయాక కాలేజీ వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు. మేము వెళ్లి కారణమడిగితే, "పాపని డిటైన్(అంటే, పరీక్షలు వ్రాయనివ్వరు, రెండవ సంవత్సరానికి ప్రమోట్ చేయరు) చేశామ"ని చెప్పారు. ఆ క్షణం మేము పడ్డ బాధ వర్ణనాతీతం. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. కాలేజీలో ఒకరిని కాదు, అందరినీ కలిసి ప్రాధేయపడ్డాం. కానీ లాభం లేకపోయింది. అసలే ఆరోగ్యం బాగలేని మా అమ్మాయి ఈ సంఘటనతో బాగా కృంగిపోయింది. దిగులుతో అసలు మంచం దిగేది కాదు. మేము తననలా చూడలేకపోయేవాళ్ళం. పరీక్షలన్నీ అయిపోయాయి. ఒక సంవత్సరం వృధా అయిపోయింది. తరువాత కాలేజీవాళ్ళు 'ఫీజు కట్టి మళ్ళీ మొదటి సంవత్సరంలో చేర్పించమ'ని చెప్పారు. నిజానికి మా అమ్మాయికి ఫ్రీ సీటు వచ్చింది. అయినప్పటికీ ఫీజు కట్టమని చాలా కటువుగా మాతో మాట్లాడారు. పిల్లల భవిష్యత్తుపై వాళ్లకు కొంచెం కూడా కనికరం లేదు. దాంతో మావారు ఇక ఈ కాలేజీలో తనని ఉంచడం మంచిది కాదని, తన సర్టిఫికెట్స్ ఇచ్చేయమని అడిగారు. అందుకు వాళ్ళు ఏమీ పట్టనట్లు కూల్‌గా, "సర్టిఫికెట్స్ ఇవ్వము. మీరు ఫీజు కట్టి ఇక్కడే చదివించండి. కాదూ కూడదంటే 50,000 రూపాయలు కట్టి సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళండి" అని చెప్పారు. మాకు మతిపోయింది. ఒకవైపు వాళ్ళేమో అలా మాట్లాడుతున్నారు. మరోవైపు చూస్తే, మధ్యలో ఏ కాలేజీలో చేర్చుకోరు, ఒకవేళ చేర్చుకున్నా లక్షల్లో ఫీజు కట్టాలి, ఎలాగో ఒకలా దానికి కూడా సిద్ధపడ్డా అదే బ్రాంచ్ దొరకదు. అటువంటి క్లిష్ట పరిస్థితులలో, 'ఇక మాకు బాబాయే దిక్కు' అని పాపని తీసుకొని శిరిడీ వెళ్లడానికి నిర్ణయించుకున్నాము. బాబా కృపవలన ప్రయాణానికి అవసరమైన టికెట్స్ విషయంలోగాని, అక్కడ ఉండటానికిగాని మాకు ఎటువంటి ఇబ్బందీ కాలేదు. నిజానికి నాకు, మా పాపకు నెలసరి సమయమది. కానీ ప్రయాణానికి, దర్శనానికి ఇబ్బంది లేకుండా బాబా అనుగ్రహించారు. బాబా దర్శనం చేసుకొని, సమస్యను ఆయనకు విన్నవించుకొని ఆయన పాదాలకు శరణన్నాము.

శిరిడీ నుండి వచ్చాక నేను కాలేజీలు వెతకడం ప్రారంభించి, ఒక కాలేజీ అయితే మాకు అనుకూలంగా ఉంటుందని అనుకున్నాను. కానీ అక్కడ సేమ్ బ్రాంచ్ లేదు సరికదా ఫీజు లక్షల్లో ఉంది. ఏమీ అర్థంకాక నేను బాబాని, "పాప భవిష్యత్తు పాడవకుండా కాపాడండి" అని తీవ్రంగా ప్రార్థించాను. వెంటనే ఒక అద్భుతం జరిగింది. మేము కోరుకున్న కాలేజీవాళ్ళు వాళ్ళంతట వాళ్లే ఫోన్ చేసి, "మా కాలేజీలోని ఒక విద్యార్థి తండ్రికి వేరే ఊరికి బదిలీ అవడం వలన ఆ విద్యార్థి స్థానంలో మీ అమ్మాయిని తీసుకుంటాం. ఆ సీటు మీరు కోరుకునే బ్రాంచ్ లోనే ఉంది. ఫీజులో 75% కన్సెషన్ కూడా ఇస్తాము" అని చెప్పారు. పట్టలేని ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకొని వెంటనే కాలేజీకి వెళ్ళాము. మా అమ్మాయికి సీటు కేటాయించారు. ఫీజు కూడా మా స్థాయిలోనే ఉంది. ఇకపోతే నేను వాళ్లతో, "మా అమ్మాయి సర్టిఫికెట్స్ ప్రస్తుతం మావద్ద లేవు. పాత కాలేజీ వాళ్ళు వాటిని ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మీరు కొంచెం సమయమిస్తే వాటిని తెచ్చిస్తాన"ని చెప్పాను. వాళ్ళు అందుకు అంగీరించారు.

తరువాత మేము పాత కాలేజీకి వెళ్లి సర్టిఫికెట్స్ కోసం గట్టిగా అడిగాము. వాళ్ళు డబ్బులు ఇస్తే సర్టిఫికెట్స్ ఇస్తామని పాత పాటే పాడారు. వాళ్ళకి మాకు మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. ఆ సమయమంతా మేము మనసులో బాబా నామజపం ఆపకుండా చేస్తూనే వున్నాము. చివరికి వాళ్ళు, "రెండురోజుల తరువాత రండి, సర్టిఫికెట్స్ ఇస్తామ"ని చెప్పారు. నిజానికి మేము మూడునెలలనుంచి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా వాళ్ళనుండి సానుకూలమైన స్పందనలేదు. కానీ శిరిడీ వెళ్లి రాగానే మా సర్టిఫికెట్స్ మాకు వచ్చాయి. అంతా బాబా దయ. ఎంతో పెద్ద కష్టంనుంచి ఆయన మమ్మల్ని బయటపడేశారు.  "థాంక్యూ బాబా! మీరే మా తండ్రి. ఎల్లప్పుడూ ఇలాగే మాకు తోడుగా ఉండండి".

కలల కంపెనీలో ఉద్యోగం ఇచ్చిన బాబా.

హైదరాబాదు నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయిబాబా భక్తురాలినైన నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీరుని. సరైన సమయం వచ్చినప్పుడు సాయిబాబా మన ప్రార్థనలకు ఖచ్చితంగా సమాధానం ఇస్తారు. అందుకు మనం శ్రద్ధ, సబూరి కలిగి ఉండాలి. 2018, డిసెంబరులో నేను ఉద్యోగం చేయాలని కలలుగనే ఒక సంస్థలో మొదటి రౌండు ఇంటర్వ్యూకి హాజరయ్యాను. తరువాత అన్ని రౌండులు విజయవంతంగా పూర్తిచేసి ఆఫర్ లెటర్ కోసం ఎంతో ఆతృతగా నిరీక్షించాను. కానీ నెలరోజులు గడిచినా ఆఫర్ లెటర్ రాలేదు. అప్పుడు సచ్చరిత్ర సప్తాహ పారాయణ చేశాను. ఎనిమిదవరోజు గురువారంనాడు నేను పులిహోర తయారుచేసి బాబా మందిరానికి తీసుకెళ్ళాను. బాబాకు నా కోరికలు నివేదించుకుని కొంత డబ్బు అన్నదానానికి డొనేట్ చేశాను. నాతోపాటు తీసుకుని వెళ్లిన పులిహోరను అన్నదానంలో భక్తులకు పంపిణీ చేయమని మందిరంలో ఇచ్చాను. ఆ తరువాత సరిగ్గా రెండువారాలకి, రెండునెలల నిరీక్షణానంతరం నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. నేను కలలుగన్న కంపెనీలో ఉద్యోగం రావడంతో నా ఆనందానికి అవధుల్లేవు. మొదట్లో నేను ఈ కోరిక నెరవేర్చినట్లైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని నా మనసులో అనుకున్నాను. కానీ ఇప్పుడు, 'షరతులు పెట్టకుండా హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించడమే మనం చేయాల్సింది' అని గ్రహించాను. "అలా ఆలోచించినందుకు నన్ను క్షమించండి బాబా! ఈ బిడ్డకు తన కలల కంపెనీలో ఉద్యోగాన్నిచ్చి ఆశీర్వదించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. నాకున్న మరొక కోరిక కూడా మీకు తెలుసు. దయచేసి ఆ కోరికను కూడా నెరవేర్చండి. నాకు తెలుసు, మీరు నెరవేరుస్తారని. సర్వప్రాణులను ఆశీర్వదించండి బాబా!" బాబా ఆశీస్సులతో మరొక అనుభవాన్ని అతిత్వరలో మీతో పంచుకుంటాను.

ఓం సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సర్వేజనాః సుఖినోభవంతు. 

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo