సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 177వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. ఖండయోగం ద్వారా భక్తునిగా మలచుకున్న శ్రీసాయి
  2. బాబాను ప్రార్థించినంతనే అంతా సజావుగా మారిపోయింది

ఖండయోగం ద్వారా భక్తునిగా మలచుకున్న శ్రీసాయి

ఓం సాయిరామ్! శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

మెడికల్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న విశ్వనాథంగారు తన జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. బాబా తన బిడ్డలకు తోడుగా ఉంటూ, వారు చేసిన తప్పులను క్షమించి సన్మార్గంలో ఎలా నడిపిస్తారో ఈ లీల తెలియజేస్తుంది. ఇక వివరాలలోకి వెళదాం..

నేను మొదట్లో ఏసుప్రభువుని నమ్మి కొలిచేవాడిని. బాబా అంటే అసలు ఇష్టం ఉండేదికాదు. అలాంటి నన్ను ఆసక్తికరంగా తమ పాదాల చెంతకు లాక్కున్నారు బాబా. ఒకసారి ఎందుకో తెలియదుగానీ, 'శిరిడీ సాయిబాబా విగ్రహాన్ని' కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలని నా మనసుకి దృఢంగా అనిపించింది. అనుకున్నదే తడవుగా బజారుకు వెళ్లి బాబా విగ్రహం కొని ఇంటికి తెచ్చుకున్నాను. కొన్నిరోజులు బాగానే గడిచాక ఎందుకో  చెప్పలేనంత అసహనం, చిరాకు, కోపం నాలో చోటుచేసుకున్నాయి. నా అసమర్థతనంతా  బాబా విగ్రహంపై చూపిస్తూ కోపంతో దాన్ని దూరంగా విసిరేసాను. ఆ విగ్రహం తల, మొండెం, కాళ్లుగా మూడుముక్కలైపోయింది.

తరువాత నా మనస్సు అదివరకటికంటే ఇంకా ఎక్కువగా అల్లకల్లోలమైపోయింది. ఆ రాత్రి నాకు కలలో బాబా దర్శనమిచ్చారు. బాబా విగ్రహం ఎలా అయితే ముక్కలుగా విడిపోయిందో, అచ్చం అలాగే బాబా శరీరం కూడా తల, మొండెం, కాళ్ళు దేనికవి విడివిడిగా పడివుండటం స్పష్టంగా కనిపించింది. ఆ క్షణం నుండి నా మనసంతా ఆయన మీదకి మళ్ళింది. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా నాకు తెలియకుండానే ఆయన  ధ్యాసలోకే వెళ్లిపోతుండేవాడిని. నేను పడిన వేదన మాటల్లో వర్ణించలేను. ఎంతగా ఏడ్చానో నాకు తెలుసు. ఎందుకంటే, నేను చేసిన తప్పు అలాంటిది. ఖండయోగం ద్వారా బాబా తన శరీరభాగాలను వేరుపరచి మళ్లీ ఒక్కటిగా చేసేవారని నాకు తెలుసు. కానీ నేను బాబా విగ్రహాన్ని విసిరేసినందుకు కలలో ఆయన ఖండ ఖండాలుగా కనిపించడం నాకు భరించలేనంత బాధను తెచ్చిపెట్టింది. రోజులు గడుస్తున్నా నేను ఆ బాధనుండి బయటకు రాలేకపోయాను. ఇదిలా ఉంటే, ఒకసారి నేను వ్రాతపరీక్ష నిమిత్తమై ఔరంగాబాద్ సమీపంలో ఉన్న ధూప్‌ఖేడా వెళ్ళాను. అక్కడినుండి శిరిడీ చాలా దగ్గరే కాబట్టి శిరిడీ వెళదామని నేను ఎంతగా ప్రయత్నించినా, ఈ పాపాత్ముడిని బాబా శిరిడీకి అస్సలు రానీయలేదు. దాంతో నా బాధ ఇంకా తీవ్రమైంది. దానికితోడు అదే సమయంలో మా అమ్మగారు మరణించారు. నేను ఏకాకినైపోయాను, లోకమంతా చీకటి అయిపోయింది.

ఒంటరితనాన్ని భరించలేక ఒకరోజు నేను గుండెలనిండా భారంతో బాబా ముందు విలపిస్తూ, "తెలిసీ తెలియక నేను చేసిన ఆ  తప్పును క్షమించండి బాబా" అని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించాను. ఇంకా, "ఈ దుఃఖంనుండి నన్ను బయటపడేస్తే నా ప్రాణం పోయేంతవరకు మీ పాదాలు విడువను" అని వాగ్దానం కూడా చేశాను. బాబా నేను చేసిన తప్పులను క్షమించి తల్లిలా నన్ను అక్కున చేర్చుకున్నారు.ఒంటరితనంలో నేను బాబాకు దగ్గరయ్యాను, కాదు కాదు, బాబానే నన్ను దగ్గరకు తీసుకున్నారు. ఇప్పుడు నాకన్నీ తానై నన్ను చూసుకుంటున్నారు. ఎవరూ లేని నేను సాయి తోడుతో అదృష్టవంతుడనైనాను. ఇప్పుడెంతో సంతోషంగా ఉన్నాను. ఔరంగాబాద్ వరకు వెళ్లి శిరిడీ వెళ్లలేకపోయానని బాధపడిన నాకు బాబా చాలాసార్లు దర్శనమిచ్చారు. వీలుకుదిరినప్పుడల్లా శిరిడీకి పిలిపించుకుంటున్నారు. ఇప్పటివరకు పదహారుసార్లు శిరిడీ దర్శనం జరిగింది. అంతేకాదు, ఒకసారి నేను శిరిడీ వెళ్ళినప్పుడు ధూప్‌ఖేడా వెళ్లి చాంద్‌పాటిల్ సమాధిని, బాబాకు నీడనిచ్చిన మామిడిచెట్టును చూశాను. అక్కడున్న బాబా హస్తస్పర్శ పొందిన చిలుము గొట్టాలను, సటకాను తాకిన అనుభూతి నాకెంతో ఆనందాన్నిస్తుంది. "బాబా! నేను చేసిన పెద్ద తప్పును క్షమించి నన్ను మీ ఒడిలోకి చేర్చుకున్నారు. నా జన్మకు ఇది చాలు. మీకు నా శతకోటి ప్రణామాలు బాబా".

బాబాను ప్రార్థించినంతనే అంతా సజావుగా మారిపోయింది

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయికి చాలా సాధారణ భక్తురాలిని. ఆయన ఆశీస్సులతో నేనొక మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాను. నేను పనిచేస్తున్న ప్రాజెక్టులో నా సహోద్యోగులందరికన్నా నేనే చిన్నదాన్ని, పైగా క్రొత్తగా చేరాను. ఒకరోజు మా మేనేజర్ అధిక ప్రాధాన్యత గల ఒక పనిని నాకు, ఒక సహోద్యోగికి అప్పగించారు. కానీ నా సహోద్యోగితో ఆ విషయం మాట్లాడితే, తాను ఆరోజు ఇంటినుంచి పనిచేస్తానని, మరుసటిరోజు తాను సెలవు పెట్టానని చెప్పారు. అయితే ఇంటినుండి పని మాట అటుంచి, ఆమె ఆరోజు అసలు సిస్టంలోకి లాగిన్ కూడా కాలేదు. నేను ఆ పనికి క్రొత్త అయినందున దాని గురించి నాకు సరిగా తెలియదు. కానీ నాకు చేతనైనదేదో చేసి రోజు ముగిసే సమయంలో చేసిన పని గురించి మేనేజరుకు ఒక మెయిల్ పెట్టాను. అయితే నేను చేసిన పొరపాటు ఏమిటంటే, 'అధిక ప్రాధాన్యత' అన్న పదాన్ని ప్రస్తావించలేదు. మేనేజర్ ఆన్‌సైట్‌లో ఉంటారు కాబట్టి, ఇక్కడ పరిస్థితులేవీ అతనికి తెలియని కారణంగా మెయిల్ చూసి చాలా తీవ్రంగా స్పందించారు. మరుసటిరోజు ఉదయం అంటే తేదీ.01/02/19న నేను చాలా భయపడుతూ మేనేజర్ ఫోన్ కాల్‌ లిఫ్ట్ కూడా చేయలేదు. తరువాత నేను, "ఎటువంటి సమస్యా లేకుండా అంతా సజావుగా సాగేలా చూడమ"ని బాబాను ప్రార్థించి మేనేజరుకి ఫోన్ చేశాను. అతను చాలా సౌమ్యంగా స్పందించారు. కనీసం ముందురోజు విషయం గురించి ఒక్క మాట కూడా అడగలేదు. నిజంగా బాబా గ్రేట్. "మీరు నన్ను పెద్ద టెన్షన్ నుండి కాపాడినందుకు ధన్యవాదాలు బాబా!" 

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo