సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 182వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. స్నేహితుని రూపధారిగా బాబా చేసిన ధనసహాయం
  2. సాయి లిఖిత అద్భుతశక్తి

స్నేహితుని రూపధారిగా బాబా చేసిన ధనసహాయం

సాయిభక్తుడు సత్యనారాయణ తన అనుభవాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు:

నేను 1980 నుండి సాయిని పూజిస్తున్నాను. నాకు సాయియే సర్వమూ. నాకు ఏ కష్టం వచ్చినా సాయి నన్ను ఆదుకుంటారని నా దృఢ విశ్వాసం. 1991లో జరిగిన ఒక అద్భుతమైన లీలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. సుమారు ౩౦ సంవత్సరాల వెనుకటి మధురానుభూతిని గుర్తుచేసుకుంటుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఈ లీలను చదివే మీరు కూడా ఆనందిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది.

నేను 1991లో జమ్మూ కాశ్మీర్ నుండి హైదరాబాదుకు బదిలీ అయి వచ్చాను. ఇక్కడికి వచ్చాక నాకు క్లిష్టపరిస్థితులు ఎదురయ్యాయి. ఆఫీసు నుండి రావలసిన డబ్బులు సమయానికి అందక చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! నాకు రావలసిన డబ్బులు త్వరగా వచ్చేలా చేయండి" అని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించాను. అలా నేను ప్రార్థించిన రెండుగంటల తర్వాత నా స్నేహితుడొకరు మా ఇంటికి వచ్చారు. పదేళ్లక్రితం నేను అతనికి ఐదువేల రూపాయలు అప్పుగా ఇచ్చాను. తర్వాత ఉద్యోగరీత్యా మేమిద్దరమూ వేర్వేరు ప్రదేశాల్లో స్థిరపడిపోయాము. మేము కలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఒకరినొకరం చూసుకొని చాలా ఆనందించాము. తరువాత తను నాతో మాట్లాడుతూ, "నన్ను క్షమించండి! మీరెక్కడున్నారో ఇన్నాళ్లూ నాకు తెలియలేదు. అందుకే నేను మీకు ఇవ్వవలసిన డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాను. ఇదిగో, మీ ఐదువేల రూపాయలు తీసుకోండి" అని డబ్బులు నా చేతిలో పెట్టారు. ఇంకా ఇలా చెప్పారు: "నేను మీరు పనిచేస్తున్న సంస్థలోనే పని చేస్తున్నాను. ఈమధ్యనే ఇక్కడికి బదిలీ అయి వచ్చాను. ప్రస్తుతం అక్కంపేటలో ఉంటున్నాను. మీరు కూడా ఇక్కడ ఉన్న వేరే బ్రాంచ్ కి బదిలీ అయి వచ్చారని తెలిసి, మిమ్మల్ని కలుసుకొని, మీకివ్వవలసిన డబ్బులు మీకిచ్చిపోదామని వచ్చాను" అని. నేను, "చాలా సంతోషం. ఇన్నాళ్లకు మనం కలిసే అవకాశం వచ్చింది. రేపు ఉదయం మీరు ఆఫీసుకు రండి. మనకు తెలిసిన వారినందరినీ పిలుస్తాను. అందరం ఒకసారి కలుద్దాం" అని చెప్పాను. అందుకు తను సరేనన్నారు. నేను, "భోజనం చేసి వెళ్ళండి" అని చెపితే, తను, "టీ మాత్రం త్రాగి వెళ్తాను" అన్నాడు. కాసేపు మాట్లాడుకున్నాక తను టీ త్రాగి వెళ్లిపోయాడు. "సమయానికి బాబా నా స్నేహితుడి ద్వారా డబ్బు సమకూర్చారు కదా!" అని అనుకొని సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

మరుసటిరోజు ఉదయం నేను ఆఫీసుకు వెళ్లి నా స్నేహితుని రాకకోసం ఎదురుచూశాను. అయితే సమయం గడుస్తున్నా తను రాలేదు. దాంతో, తను ఏ బ్రాంచ్ లో పనిచేస్తున్నానని చెప్పాడో అక్కడికి ఫోన్ చేసి, ఫలానా వ్యక్తి కొత్తగా అక్కడకు బదిలీ అయి వచ్చాడు, తనని నా దగ్గరకు పంపించమని చెప్పాను. వాళ్ళు, "ఆ పేరుగల వ్యక్తి ఎవరూ ఇక్కడ లేర"ని చెప్పారు. బహుశా హెడ్ ఆఫీసు అయివుండవచ్చని అక్కడికి ఫోన్ చేసి మాట్లాడాను. వాళ్ళు, "ఈమధ్యకాలంలో బదిలీ మీద ఇక్కడికి ఎవరూ రాలేదు. పైగా మీరు చెప్పిన పేరుగల వ్యక్తి ఆఫీసు మొత్తంలో అసలెవరూ లేరు" అని చెప్పారు. ఆశ్చర్యంతో నేను ఆలోచనలో పడ్డాను. ఒక్కసారిగా నా మనసులో బాబా మెదిలారు. ఆయనే నా స్నేహితుడి రూపంలో వచ్చి నాకు సహాయం చేశారని అర్థమై ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. కానీ అజ్ఞానంతో నేను బాబాను గుర్తించలేకపోయానని చాలా బాధపడ్డాను. కష్టం తీర్చమని అడిగినందుకు తానే స్వయంగా వచ్చి నన్ను ధన్యుణ్ణి చేసిన ఆ ప్రేమమూర్తికి శిరసా నా ధన్యవాదాలు.

సాయి లిఖిత అద్భుతశక్తి

బెంగుళూరు నుండి ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం శ్రీ సాయిరామ్! నేను నా సాయితండ్రికి సాధారణ భక్తుడిని. బ్లాగు వలన సాయితండ్రి పట్ల శ్రద్ధ, సబూరీ పెంపొందుతున్నాయి. 'సాయి లిఖిత' అంటే 48 రోజులపాటు "ఓం శ్రీ సాయిరామ్" అని 108సార్లు వ్రాయడం. దాని అద్భుతశక్తి కారణంగా నాకు జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

ప్రియమైన సాయితండ్రి నా ఇ.పి.ఎఫ్. ఖాతాలోని వివరాలను సరిచేయడానికి సహాయపడ్డారు. నా పి.ఎఫ్. ఖాతాలో నా పేరు, పుట్టినతేదీ తప్పుగా నమోదు చేయబడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో, ముఖ్యంగా ఇ.పి.ఎఫ్. కార్యాలయంలో ఇలాంటి పనులు చేయడం ఎంత కష్టమో చాలామందికి తెలుసు. ఆ వివరాలను పి.ఎఫ్. డేటాబేస్ లో సరిదిద్దడానికి నేను చాలా కష్టపడ్డాను. అలాంటి సమయంలో నా సాయితండ్రి నాకు సాయి లిఖిత మార్గం చూపించారు. నేను సాయి లిఖిత వ్రాయడం పూర్తి చేసినంతనే అద్భుతం జరిగింది. నా పి.ఎఫ్. ఖాతాలో నా వివరాలు సరిదిద్దబడ్డాయి. బాబా తనదైన పద్ధతిలో విశ్వం(ఇక్కడ విశ్వం అంటే మన సద్గురుసాయి తప్ప మరొకటి కాదు) ద్వారా కోరికలను నెరవేరుస్తూ నాలో సానుకూల ఆలోచనలను పెంపొందింపజేస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! దయచేసి మీ భక్తులందరితోపాటు ఈ ప్రపంచంలోని మానవులందరికీ మార్గనిర్దేశం చేయండి బాబా!"

ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీ సాయిరామ్. సద్గురు శ్రీ సాయిరామ్.

source: http://www.shirdisaibabaexperiences.org/2019/07/shirdi-sai-baba-miracles-part-2414.html

4 comments:

  1. ఓం శ్రీ సాయిరాం జీ 🙏

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌹🥰🌸🤗🌺

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo