చందనపు మందిరంలో కొలువైన శ్రీసాయి
ఆ తరువాత తర్ఖడ్ కుటుంబసభ్యులు తరచుగా శిరిడీ దర్శించసాగారు. బాబాపై వారి ప్రేమ శుక్లపక్షపు చంద్రుడిలా దినదినాభివృద్ధి చెందుతున్నది. వారు జీవితాంతమూ బాబా పాదాల వద్దే శిరిడీలో ఉండిపోదామని అనుకున్నప్పటికీ, అది సాధ్యం కాకపోవటం వలన బాంద్రాలోని తమ ఇంటిలో ఒక పెద్ద బాబా ఫోటో పెట్టుకొని పూజించుకోవాలనే బలమైన కోరిక వారికి కలిగింది. వారి కోరిక వెనుక ఉన్న ఉద్దేశ్యం, వారు శిరిడీకి దూరంగా ఉన్నా బాబా తమ స్మృతిపథం నుండి దూరంగా వెళ్ళకుండా, తమ మనసులలో కొలువై ఉండాలనే. మా తాతగారిది, మా నాన్నగారిది విచిత్రమైన మనస్తత్వం. వారికి బాబా మీద అపారమైన నమ్మకం వున్నప్పటికీ వారెప్పుడూ బాబాపై తమకున్న ప్రేమను మాటల్లో వ్యక్తపరిచేవారు కాదు. బాబా సర్వాంతర్యామి అని, తమ మనసులను పూర్తిగా తెలుసుకొని సరైన సమయంలో తమ కోరికలను తప్పక నెరవేరుస్తారని వారికి బాగా తెలుసు. 'శ్రద్ద - సబూరి' - ఈ రెండే కదా బాబా బోధించిన ముఖ్యమైన విషయాలు.
ఒకరోజు తెల్లవారుఝామున మా తాతగారికి, మా నాన్నగారికి ఒకే విధమైన కల వచ్చింది. కలలో వారు అందంగా మలచబడిన మందిరంలో బాబా కూర్చుని ఉండటం చూసారు. ఆ కల వారి మనసులపై గాఢమైన ముద్ర వేసింది. నిద్ర నుండి లేచిన తరువాత, మంచి చిత్రకారుల్లాగా వారిద్దరూ విడివిడిగా తాము కలలో చూసిన మందిరం చిత్రాన్ని గీసారు. ఫలహారం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కలిసినప్పుడు, వారిద్దరూ ఆ రోజు ఉదయం తమకు వచ్చిన కల గురించి ఒకరితో ఒకరు పంచుకున్నారు. తరువాత ఇద్దరూ వారు వారు గీసిన చిత్రాలను తీసుకొని వచ్చి చూసి, రెండూ అచ్చు గుద్దినట్లు ఒక్కలాగే ఉండటంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వెంటనే అటువంటి మందిరం తమ ఇంటిలో ఉండాలనే నిర్ణయానికి వారు వచ్చారు. బాబా మందిరానికి కావలసిన మంచి చందనపు కలపను కొన్నారు. ఒక మంచి నైపుణ్యమైన వడ్రంగిని కలిసి, వారు గీసిన మందిరం చిత్రాన్ని చూపించి, అటువంటి మందిరం ఒకటి తయారుచేయమని పురమాయించారు. బాంద్రాలో వాళ్ళ ఇంటి మేడపైన చందనపు మందిరం తయారుచేసే పని ప్రారంభమయింది.
మందిరం పూర్తిగా తయారవడానికి ఒక సంవత్సరంపైనే పట్టిందనుకుంటాను. చివరకు 9 అడుగుల ఎత్తు, 2.5x2.5 చదరపు అడుగులతో చందనపు మందిరం తయారయింది. ఆ మందిరంలో ఉంచి పూజించడానికి బాబా పటాన్ని ఎక్కడ్నుంచి తేవాలి అనే సమస్య వారికి ఎదురైంది. ఎందుకంటే బాబా ఎప్పుడూ తమ ఫోటో తీయనిచ్చేవారు కాదని అందరికీ తెలిసిన విషయమే. అందుచేత ఆయన ఫోటో సంపాదించడమనేది చాలా కష్టమయిన విషయం. కానీ తమకు కల రావడం కూడా బాబా సంకల్పమే కాబట్టి, తమ కోరికను బాబా తప్పక నెరవేరుస్తారనే నమ్మకంతో వారు ఉన్నారు.
అలవాటు ప్రకారం వారిద్దరూ ఒక శుక్రవారము రోజు మధ్యాహ్నం ముంబయిలోని చోర్ బజారుకు వెళ్ళారు. వారెప్పుడూ వేసుకునే దుస్తులు అంటే మా తాతగారు - కోటు, పైజామా, ఆంగ్ల టోపీ; మా నాన్నగారు - కోటు, పైజామా, నలుపురంగు గాంధీ టోపీ ధరించారు. వారిద్దరూ చోర్ బజార్ సందులలో తిరుగుతున్నప్పుడు ఒక అద్వితీయమైన సంఘటన జరిగింది. ముస్లిం అయిన ఒక షాపు యజమాని పెద్దగా పిలుస్తూ వారి వద్దకు వచ్చి, "అయ్యా! ఎన్నో రోజులుగా మిమ్మల్ని కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాను. మీకివ్వడానికి నా దుకాణంలో ఒక పార్సెల్ ఉంది” అన్నాడు. మా తాతగారు, మా నాన్నగారు ఉలిక్కిపడి అతడు తమకేదో దొంగిలింపబడిన సరకు అంటగట్టాలని చూస్తున్నాడని ఆందోళన పడ్డారు.
కానీ వెంటనే తేరుకొని, బజార్లో అంతమంది జనం ఉండగా మమ్మల్నే ఎందుకు పిలిచారని వారు అతణ్ణి ప్రశ్నించారు. ఆ షాపతను, వారిని ముందు తన షాపులోకి రమ్మని, అక్కడికి వెళ్ళిన తరువాత అంతా వివరంగా చెపుతానని అన్నాడు. షాపుకి వెళ్ళిన తరువాత అతడు, కొద్దిరోజుల క్రితం సాధువులా కనిపించే వయసుమళ్ళిన ఒక పెద్ద మనిషి వచ్చి తనకు ఒక పార్సెల్ ఇచ్చాడని, ఒక శుక్రవారం నాడు హిందువులైన తండ్రి, కొడుకులు ఈ ప్రదేశానికి వస్తారని, తండ్రేమో ఇంగ్లీషు టోపి, కొడుకేమో నల్లటి గాంధీ టోపి ధరించి ఉంటారని, వారికి ఆ పార్సెల్ అందచేయమని చెప్పాడని అన్నాడు. ఆ పని చేసి పెట్టినందుకుగాను తనకు రూ.50/- ఇచ్చినట్లు కూడా చెప్పాడు. అందుచేత ఆయన చెప్పిన గుర్తుల ప్రకారం బజార్లో వెళ్ళే అందరినీ జాగ్రత్తగా గమనిస్తున్నాననీ, చివరికి వారిని సరిగా గుర్తించినట్లు చెప్పాడు. అతడు చెప్పిన జవాబుతో వారు అతణ్ణి విశ్వసించారు.
అప్పుడు ఆ షాపు యజమాని ఆ సాధువు ఇచ్చిన పార్సెల్ తీసుకువచ్చి వారికందించాడు. అది దొంగిలించిన సొత్తేమోనని వారికింకా అనుమానంగా వుండటంతో, దానిని తీసుకునే ముందు అతడి చేతనే ఆ పార్సెల్ విప్పించారు. అందులో నాణ్యమైన చెక్కఫ్రేములో అమర్చబడి, నలుపు తెలుపు రంగులలో ఉన్న సాయిబాబా చిత్రపటం ఉన్నది. అది చూచిన వెంటనే వారిద్దరి కళ్ళు ఆనందభాష్పాలతో నిండగా ఆ పార్సెల్ తమకు సంబంధించినదేనని ఆ షాపు యజమానితో నిర్ధారించారు. వారు అతడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి, కొంత డబ్బు ఇవ్వచూపారు. ఆ పార్సెల్ ఇచ్చిన వ్యక్తి ఖచ్చితమైన సూచనలు ఇవ్వడం వల్ల ఆ డబ్బు తీసుకోవటానికి ఆ షాపతను నిరాకరించాడు.
మా తాతగారు, నాన్నగారు తమ స్టుడ్ బేకర్ ఛాంపియన్ కారులో ఆ ఫోటోను ఎంతో జాగ్రత్తగా తమ ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఎటువంటి మార్పులు చేయకుండానే ఆ ఫోటో వారింట్లోని చందనపు మందిరంలో సరిగ్గా సరిపోయేసరికి వారి ఆశ్చర్యానికి అంతులేదు. తర్జడ్ కుటుంబమంతా అవధులు లేని సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆ సాయిబాబా ఫోటోను వారు చందనపు మందిరంలో ప్రతిష్ఠించారు.
చందన మందిరం |
త్వరలోనే వారు శిరిడీ వెళ్ళి మసీదులో ప్రవేశించి, బాబాకు కానుకలు సమర్పించారు. బాబా వారిని అక్కడ కూర్చోమని చెప్పారు. అదే సమయంలో శిరిడీలో నివసిస్తున్న ఒక సాయి భక్తుడు, గత కొద్ది రోజులుగా బాబాను కెమెరాతో ఫోటో తీయాలని ప్రయత్నం చేసి చేసి విఫలమై, తన ఆఖరి ప్రయత్నంగా బాబా దగ్గరకు వచ్చి ఆయన అనుమతి కోరాడు. బాబా అకస్మాత్తుగా అతడిపై కోపగించి గట్టిగా అరుస్తూ, “ఏయ్! నువ్వు నా ఫోటో తీయాలని ఎందుకు ఆరాటపడుతున్నావు? నువ్వు నా భావూ ఇంటికి వెళ్ళు! వాళ్ళింట్లోని మందిరంలో ఉన్న ఫోటోలో నేను సజీవంగా కొలువైవున్నాను!” అన్నారు. బాబా మాటలు వినగానే, తాము చేసే పూజలన్నీ స్వీకరిస్తున్నానని బాబా నిర్ధారిస్తున్నారని అర్థమై అంతులేని ఆనందంతో మా నాన్నగారు వెంటనే లేచి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసారు. తాను వారిని ఎప్పటికీ మరచిపోకుండా, ఎల్లప్పుడూ ఆయననే ప్రార్థించుకుంటూ ఉండేలా వరమివ్వమని మా నాన్నగారు మనసులోనే బాబాను ప్రార్థించారు (హేచి దాన్ దేగా దేవా తుఝా విసర్ న వ్హావా).
ఈ విధంగా శ్రీసాయిబాబా తర్ఖడ్ ఇంటిలోని చందనపు మందిరంలో స్వయంగా తామే కొలువైనారు. ప్రస్తుతం ఈ మందిరాన్ని ముంబయి నగరశివార్లలోని వసయిలో ఉన్న నా సోదరుడు రవీంద్ర ఇంటిలో దర్శించవచ్చు.
సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
ఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDeleteOm sri sachidananda Samartha sadguru sainath maharaja ki jai
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sai arogya kshemadaya namaha