సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 11వ భాగం


శ్రీసాయిసచ్చరిత్ర 9వ అధ్యాయంలోని లీలలు

తర్ఖడ్  కుటుంబంవారి అనుభవాలు అనే భాండాగారాన్ని నేను మీముందు ఉంచాను. ఇవన్నీ చదివిన తరువాత బాబామీద మీ నమ్మకం రెట్టింపవుతుందని నాకు బాగా తెలుసు. ఇప్పుడు మనం శ్రీసాయిసచ్చరిత్ర 9వ అధ్యాయంలోని కొన్ని అనుభవాలు చూద్దాం. పాఠకులందరికీ దీని గురించి తెలిసేవుంటుందని, వారు ఒక్కసారైనా ఆ పవిత్రగ్రంథాన్ని చదివివుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా చదివి ఉండకపోతే, దయచేసి శ్రీసాయిసచ్చరిత్రని చదవమని నా వినయపూర్వకమైన అభ్యర్థన. 

ఆ గ్రంథం శ్రీసాయిబాబా జీవితం గురించి, తమ జీవితకాలంలో శిరిడీలో ఆయన చేసిన, భక్తులచే దర్శింపచేసిన అనేక దివ్యలీలల గురించి చాలా చక్కగా వివరిస్తుంది. ఈ పవిత్రగ్రంథంలోని 9వ అధ్యాయం ఎక్కువభాగం తర్ఖడ్ కుటుంబం(అంటే మా నానమ్మగారు, మా తాతగారు, మరియు మా నాన్నగారు) గురించి వివరిస్తుంది. ఇంతకుముందు వివరించినట్లుగా తర్ఖడ్ కుటుంబంలోని వారు బలమైన ప్రార్ధనా సమాజవాదులయినందువల్ల వారు విగ్రహారాధనని నమ్మేవారు కాదు. వారికి దేవునియందు నమ్మకం లేదు. అయినప్పటికీ విధి వారిని శ్రీసాయిబాబాతో కలిసేలా చేసి, వారిలో ఒక గొప్ప పరివర్తన తీసుకొచ్చింది. శ్రీసాయిబాబాపై వ్రాసిన ఒక ప్రముఖ ఆరతి గీతంలో ఆలపించినట్లుగా, “బాబా నాస్తికుణ్ణి కూడా ఆస్తికుడిగా మార్చే అవతారమూర్తి(నాస్తికా నాహీ తూ లావిసి నిజ భజని)” అన్న విషయం తర్ఖడ్  కుటుంబంలోని వారికి అనుభవపూర్వకంగా నిరూపితమైంది.

శ్రీసాయిసచ్చరిత్ర 9వ అధ్యాయంలో, పరమభక్తుడైన కుమారుడిని పొందినందుకు బాబాసాహెబ్ తర్ఖడ్ చాలా అదృష్టవంతులని శ్రీహేమాడ్పంత్ చెప్పారు. మా నాన్నగారు ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే లేచి, స్నానం చేసిన తరువాత, తమ ఇంటిలోని చందనపు మందిరంలో కొలువైవున్న బాబా ఫోటోకు చందనం అలంకరించి, బాబాకు ఆరతి ఇస్తూ వుండేవారు. ఆయన తమ మొదటి శిరిడీ దర్శనంలోనే బాబా పవిత్రం చేసి ఇచ్చిన ఒక పైసా నాణాన్ని ఉంచిన వెండి దీపాన్ని వెలిగించి బాబాకు ఆరతినిచ్చేవారు. ప్రతిరోజూ కలకండ పలుకులను బాబాకు నైవేద్యంగా సమర్పించి, వాటిని మధ్యాహ్న భోజన సమయంలో ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండేవారు.

పూజ పూర్తయిన తరువాత తండ్రీకొడుకులిద్దరూ ఉద్యోగ నిమిత్తం భైకలాలో ఉన్న టెక్స్ టైల్ మిల్లుకి వెళుతూ ఉండేవారు. బాబా అనుగ్రహంవల్ల ఆ రోజుల్లోనే మా తాతగారు నెలకు 5,000/- రూపాయలు, మా నాన్నగారు నెలకు 2,000/- రూపాయలు జీతం రూపంలో సంపాదిస్తూ ఉండేవారు. ఒకసారి బాబాకు కఫ్నీలు కుట్టించడానికి కాటన్ తానులు పంపిద్దామని మా తాతగారు అనుకున్నారు. ఆయన మా నాన్నగారిని, మా నానమ్మగారితో కలిసి శిరిడీ వెళ్ళి, బాబాకు కాటన్ తానులు సమర్పించి రమ్మని చెప్పారు. తాము శిరిడీకి వెళితే, తమ ఇంట్లోని బాబా ఫోటోకు పూజ ఎవరు చేస్తారన్న ప్రశ్న వచ్చి, మా నాన్నగారు శిరిడీ వెళ్ళడానికి సుముఖత చూపలేదు. అప్పుడు మా తాతగారు ఆ బాధ్యతను తాను తీసుకుని, తన కుమారుడు చేసినట్లే తాను కూడా నియమంగా ప్రతిరోజూ బాబా పూజ చేస్తాననీ, ఎటువంటి లోటూ జరగనివ్వనని హామీ ఇచ్చారు. మా తాతగారు ఇచ్చిన హామీతో మా నాన్నగారు తన తల్లితో కలిసి శిరిడీకి బయలుదేరి వెళ్ళారు. మొదటి రెండురోజులు పూజ ఎటువంటి లోటు లేకుండా బాగా జరిగింది. కానీ, మూడవరోజున మా తాతగారు పూజాసమయంలో కలకండ నైవేద్యం పెట్టడం మరచిపోయారు. మధ్యాహ్న భోజన సమయంలో తన పళ్ళెంలో కలకండ ప్రసాదం లేకపోవడంతో ఆయనకు ఆ విషయం గుర్తుకు వచ్చింది. ఆయన వెంటనే లేచి తాను చాలా పెద్ద తప్పు చేశానని, అందుకు బాబాను క్షమించమని అడగమని కోరుతూ శిరిడీలో వున్న మా నాన్నగారికి ఉత్తరం వ్రాశారు.

అదే సమయంలో, అక్కడ శిరిడీలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మధ్యాహ్న ఆరతి అయిన తరువాత మా నానమ్మగారు, మా నాన్నగారు బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళినప్పుడు, బాబా మా నానమ్మగారితో, “అమ్మా! ఈరోజు నాకు చాలా ఆకలిగా వుంది. ఎప్పటిలాగే బాంద్రాలోని మీ ఇంటికి వెళ్ళాను. తలుపుకు తాళం వేసివుండటం చూశాను. కానీ నన్నెవరూ ఆపలేరు, తలుపుకున్న చిన్న ఖాళీగుండా లోపలకు ప్రవేశించాను. కానీ అక్కడ తినడానికి ఏమీ లేకపోవడంతో పూర్తిగా నిరాశచెంది, ఖాళీకడుపుతో తిరిగి రావాల్సి వచ్చింది” అన్నారు. బాబా చెప్తున్నదేమిటో మా నానమ్మగారికి అర్థం కాలేదు. కానీ, ఉదయం పూజాసమయంలో తన తండ్రి బాబాకు నైవేద్యం సమర్పించడం మరచిపోయి వుంటారని మా నాన్నగారు వెంటనే అర్థం చేసుకున్నారు. ఆయన తన తండ్రి చేసిన తప్పును మన్నించమని బాబాను కోరి, వెంటనే ముంబాయి వెళ్ళడానికి తనకు అనుమతి ఇవ్వమని అడిగారు. కానీ, బాబా అనుమతినివ్వక ఇంకా కొన్నిరోజులు అక్కడే వుండమన్నారు. మా నాన్నగారు స్థిమితంగా ఉండలేకపోయారు. బాబా తమతో చెప్పినదంతా వివరంగా ఆయన తన తండ్రిగారికి ఉత్తరం వ్రాశారు. ఆ రెండు ఉత్తరాలు తమ తమ గమ్యస్థానం చేరగానే, వాటిని చదివిన తండ్రీకొడుకులిద్దరికీ కళ్ళనీళ్ళపర్యంతమయింది. బాబాకు తమపై గల అపరిమితమైన ప్రేమ గురించి వారికి అర్థమయ్యింది. ఆ విధంగా తాను బాంద్రాలోని వారి చందనపు మందిరంలో సజీవంగా కొలువై ఉన్నానని, ప్రతిరోజూ వారు సమర్పించే నైవేద్యాలని క్రమం తప్పకుండా స్వీకరిస్తున్నానని బాబా వారికి తెలియచేశారు.

ఒకసారి వారు శిరిడీలో ఉన్నప్పుడు, మా నానమ్మగారు మధ్యాహ్నం భోజనం తినబోతుండగా, ఒక కుక్క తోకాడించుకుంటూ ఆమె వద్దకు వచ్చింది. మా నానమ్మగారు దానికి ఒక చపాతీముక్క పెట్టారు. ఆ కుక్క సంతోషంగా ఆ చపాతీముక్క తిని అక్కడనుంచి వెళ్ళిపోయింది. కొంతసేపటి తరువాత ఒళ్ళంతా బురదతో నిండివున్న పంది ఒకటి అక్కడికి వచ్చింది. సాధారణంగా సగుణ్ మేరునాయక్ కు అటువంటి అసహ్యకరమైన ప్రాణిని చూసినప్పుడు ఆహారం కొంచెం కూడా తినబుద్దికాదు. కానీ మా నానమ్మ చాలా దయకలవారు, దేవుడంటే భయభక్తులు కలవారు. ఆమె ఆ అసహ్యకరమైన పందికి కూడా చపాతీముక్క పెట్టారు. ఆ పంది ఆ చపాతీముక్కను తిని వెళ్ళిపోయింది. 

తరువాత ఆమె మసీదుకు వెళ్ళి, బాబాకు నమస్కరించగానే బాబా ఆమెతో, “అమ్మా! ఈరోజు స్వయంగా నీ చేతులతో నాకు ఎంత దివ్యమైన విందుభోజనం పెట్టావంటే దానిని తిని నేనింకా త్రేన్పులు తీస్తూనే వున్నాను” అన్నారు. అది విని మా నానమ్మగారు ఆశ్చర్యపోయారు. ఆమె బాబాతో, “బాబా! మీరు పొరబడినట్టున్నారు. శిరిడీలో నేనింతవరకూ వంట చేయలేదు, మీకింతవరకూ నేను భోజనమూ పెట్టలేదు. నిజానికి నేనిక్కడ సగుణమేరు నాయక్ నడిపే హోటల్లో డబ్బు చెల్లించి భోజనం చేస్తున్నాను” అన్నారు. అప్పుడు బాబా, “అమ్మా! ఈరోజు మధ్యాహ్నం నువ్వు భోజనం చేసేటప్పుడు ముందు ఒక కుక్కకు, ఆ తరువాత ఒక పందికి రొట్టె పెట్టలేదా? ఆ ఆహారం నాకు చేరింది” అన్నారు. అప్పుడు మా నానమ్మగారు, “బాబా! మీరు రకరకాల ప్రాణుల రూపాలలో వచ్చి మీ భక్తులను పరీక్షిస్తూ ఉంటారన్నమాట” అని బాబాతో అన్నారు. అప్పుడు బాబా, “అమ్మా! అన్ని ప్రాణులమీద ఇలాగే దయచూపుతూ వుండు. భగవంతుడు నిన్ను అనుగ్రహించి, నీ ఇంటిలో ఆహారానికి ఎటువంటి కొరతా లేకుండా చూస్తాడు” అన్నారు.

తరువాత తర్ఖడ్ కుటుంబం, ఇతర సాయిభక్తులతో ఎక్కువ సన్నిహితంగా ఉండేవారు. వారిలో శ్రీదభోళ్కర్, శ్రీపురందరే, శ్రీటెండూల్కర్ ఉన్నారు. వీరంతా బాంద్రాలో మా నాన్నగారి ఇంటికి దగ్గరలోనే ఉండేవారు. అందరూ ఒకరినొకరు కలుసుకుంటూ బాబాతో తమకు కలిగిన మధురమైన అనుభవాలను పంచుకుంటూ ఉండేవారు. ఎప్పుడైనా వారు శిరిడీ వెళ్ళాలనుకున్నప్పుడు, ఒకరికొకరు తెలియచేసుకుంటూ, వారిలో ఎవరైనా బాబాకు ఏమైనా సమర్పించాలని అనుకుంటే, మిగతా వారు వాటిని ఆ భక్తుని తరఫున బాబాకు సమర్పిస్తూ ఉండేవారు. అలా చేయటంలో వారి ఉద్దేశ్యం కేవలం బాబాపై తమకున్న స్వచ్ఛమైన భక్తి ప్రేమలను తెలియచేయటమే.

ఒకసారి పురందరే తమ కుటుంబంతో సహా శిరిడీ వెళుతున్నప్పుడు, మా నానమ్మగారు రెండు పెద్ద నల్లని వంకాయలను శ్రీమతి పురందరే చేతికి ఇచ్చి, ఒక వంకాయతో భరీత్ (వంకాయ వాడ్చి నూరిన పచ్చడి), రెండవదానితో వంకాయ వేపుడుకూర చేసి సాయిబాబాకు భోజనంలో వడ్డించమని చెప్పింది. మొదటిరోజున పురందరే భార్య వంకాయతో భరీత్ చేసి, మిగతా పదార్థాలతోపాటు దానిని కూడా బాబా భోజనపళ్ళెంలో వడ్డించింది. బాబా వంకాయ భరీత్ తిని, వెంటనే తనకు వంకాయ వేపుడుకూర కావాలనే కోరికను వెలిబుచ్చారు. శిరిడీలో బాబా భోజన ఏర్పాట్లను చూసే రాధాకృష్ణమాయికి ఏం చేయాలో తోచలేదు. అది వంకాయలు దొరికే కాలం కూడా కాదు కనుక, శిరిడీలాంటి గ్రామంలో వంకాయలు దొరకడం కష్టం. అందువల్ల, ఆమె అక్కడవున్న ఆడవారిని అడిగి, వంకాయ భరీత్ తెచ్చింది శ్రీమతి పురందరే అని తెలుసుకుని, పరుగున ఆమె వద్దకు వెళ్ళి, వంకాయలు ఇంకా ఉన్నాయేమోనని అడిగింది. అప్పుడామె తన దగ్గర ఇంకొక వంకాయ ఉందనీ, దానితో మరునాడు వంకాయ వేపుడుకూర చేసి బాబాకు సమర్పించాలని ఉంచినట్లు చెప్పింది. అప్పుడు రాధాకృష్ణమాయి ఆమెతో, బాబా అప్పటికప్పుడే తమకు వంకాయ వేపుడుకూర కావాలన్నారని చెప్పి, ఆ వంకాయను తీసుకెళ్ళి, త్వరత్వరగా వేపుడుకూర చేసి బాబా కొరకు పంపింది. బాబా ఆ వంకాయకూర వడ్డించేవరకు వేచి చూసి, దానిని స్వీకరించిన తరువాతే తమ భోజనం ముగించి లేచారు. బాబా, తమ భక్తులపై స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తీకరించడమే కాకుండా, తమ భక్తుల భక్తి, ప్రేమలను తాము స్వీకరించినట్లు తెలియచేసే అద్భుతమైన సంఘటన ఇది. శ్రీమతి పురందరే బాంద్రాకు తిరిగివచ్చిన తరువాత ఈ సంఘటన గురించి మా నానమ్మకు చెప్పినప్పుడు, ఆమె ఎంతో సంతోషించి, మనస్ఫూర్తిగా బాబాకు కృతజ్ఞతలు తెలియజేసింది. 

ఇదే విధంగా ఒకరోజు సాయంత్రం గోవింద్ మాన్కర్ (బాలకరాం కుమారుడు) ఆ రాత్రికి శిరిడీకి వెళ్తూ, తర్ఖడ్  గారింటికి వచ్చాడు. గోవింద్ తన తండ్రి అస్థికలను నాసిక్ లో నిమజ్జనం చేసి, అక్కడనుండి శిరిడీ వెళతానని శ్రీమతి తర్ఖడ్ తో చెప్పాడు. అతడు చాలా త్వరగా వెళ్ళవలసి ఉన్నందువల్ల, సమయానికి బాబాకు నివేదించడానికి మా నానమ్మ ఏమీ సమకూర్చలేకపోయింది. అందువల్ల, బాబాకు సమర్పించడానికి ఏమైనా దొరుకుతుందేమోనని మా నానమ్మ ఇల్లంతా వెదకుతుండగా, చందనపు మందిరంలో బాబా చిత్రపటం దగ్గరున్న ప్రసాదం గిన్నెలో అప్పటికే నైవేద్యం పెట్టిన ఒక పేడా కనిపించింది. ఆ పేడాను అతడికిచ్చి, దానిని అంతకుముందే బాబాకు నైవేద్యంగా పెట్టడంవల్ల, మనస్ఫూర్తిగా ఇష్టంలేకపోయినప్పటికీ దానినే బాబాకు సమర్పించమని అతడితో చెప్పారు. గోవింద్ తన తండ్రి అస్థికలను నిమజ్జనం చేసిన తరువాత తాను శిరిడీ వెళదామని నిర్ణయించుకున్నాడు. భక్తశబరి తాను రుచి చూసి ఎంగిలి చేసిన రేగుపళ్ళను శ్రీరామునికి సమర్పించి తన భక్తిభావాన్ని చాటుకున్నట్లుగా, మా నానమ్మగారు తన భక్తిభావాన్ని ప్రకటించారు. 

గోవింద్ తన కార్యక్రమాలన్నిటినీ పూర్తిచేసుకుని శిరిడీలోని మసీదు చేరేసరికి పేడాను గురించి పూర్తిగా మరచిపోయాడు. బాబా అతడిని, తనకోసం ఏమైనా తెచ్చావా? అని అడిగారుగోవింద్ ఏమీ తేలేదని చెప్పాడు. అప్పుడు బాబా, తనకిమ్మని భక్తులెవరో ఒక వస్తువు అతడికి ఇచ్చారని గుర్తుచేశారు. అతడు నిశ్చేష్టుడై, ఎవరూ ఏమీ ఇవ్వలేదని చెప్పాడు. అప్పుడు బాబా కోపంతో అరుస్తూ, “ఏయ్! నువ్వు ముంబయినుండి బయలుదేరేటప్పుడు, నా తల్లి నాకు ఇమ్మని ఏదో ఇచ్చింది కదా! ఎక్కడది?” అని అన్నారు. అప్పుడు గోవిందుకు గుర్తుకు వచ్చి, తన బసకు పరుగున వెళ్ళి, మా నానమ్మగారు ఇచ్చిన పేడా తెచ్చి బాబాకు సమర్పించాడు. బాబా వెంటనే దానిని తిని అతడితో, ఆ పేడా చాలా మధురంగా వుందని తన తల్లితో (మా నానమ్మగారితో) చెప్పమని అన్నారు.

ప్రియమైన సాయిభక్తులారా! అటువంటి దివ్యమైన ప్రేమానురాగాలతో కూడిన దృష్టాంతాలను శ్రీఅన్నాసాహెబ్ దభోళ్కర్ తమ శ్రీసాయిసచ్చరిత్ర 9వ అధ్యాయంలో ఎంతో మనోజ్ఞంగా వర్ణించారు. మా నాన్నగారు వాటిని మాకు వివరించి చెబుతున్నప్పుడు ఆయన కళ్ళనుండి ఆనందభాష్పాలు జాలువారుతూ ఉండేవి. సాక్షాత్తు భగవంతుడి నుండి అటువంటి దివ్యానుభవాలు పొందిన తర్వాత ఏ భక్తుడైనా అలా ప్రతిస్పందించకుండా ఉండలేడని నాకు అనిపిస్తుంది. “అటువంటి ప్రజలంతా ఎక్కడికి వెళ్ళారు? వారందరికీ మా వందనాలు. ఈరోజుల్లో అటువంటి భక్తులెక్కడ ఉన్నారు? ఈరోజుల్లో అటువంటి భక్తి ఎక్కడ వున్నది? కానీ, శ్రీసాయిబాబా ప్రేమ మాత్రం తన భక్తులమీద ఎల్లప్పుడూ ప్రసరిస్తూనే వున్నది.

సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"



ముందు భాగం

కోసం

బాబా పాదుకలు

తాకండి.


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 

 


తరువాయి భాగం

కోసం

బాబా పాదాలు

తాకండి.


3 comments:

  1. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo