సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 169వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. పైసా ఖర్చు లేకుండా బాబా నాన్నని కాపాడారు
  2. బాబా నాకు కొండంత అండ

పైసా ఖర్చు లేకుండా బాబా నాన్నని కాపాడారు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేనొక సాయి భక్తురాలిని. నేనెప్పుడు బాబాని పిలిచినా, ఏదైనా అడిగినా ఆయన తప్పక బదులిస్తారు. ముఖ్యంగా నేనుగాని, మా కుటుంబసభ్యులుగాని ఆపదలో ఉన్నప్పుడు ఆయన లీల తప్పక చూపిస్తారు.

రెండేళ్ల క్రితం నేను, మా అమ్మ శిరిడీ వెళ్లి వచ్చాము. ఇంటిలో అడుగుపెట్టి ప్రసాదాలు, ఊదీ దేవుడి దగ్గర పెట్టేంతలో మా నాన్నగారు ఉన్నట్టుండి క్రిందపడిపోయారు. మేము కంగారుగా ఆయన దగ్గరకు పరుగుతీశాము. ఆయన శరీరంలోని ఒక వైపంతా పక్షవాతం వచ్చి ఉండటంతో మేము నిర్ఘాంతపోయాము. ఆయన ఊపిరి తీసుకోవడానికి ఎంతో ఇబ్బందిపడుతున్నారు. ఆయనకి ఏమవుతుందోనని మేము చాలా భయపడిపోయాము. నేను వెంటనే పూజామందిరంలోకి వెళ్లి బాబా ఊదీ తెచ్చి నాన్న నుదుటిపై పెట్టాను. ఊదీ మహిమ ఎంత అద్భుతమంటే, క్షణాల్లో ఆయన సాధారణస్థితికి వచ్చి మామూలుగా కూర్చున్నారు. కొన్ని నిమిషాల వ్యవధిలో జరిగిన పరిణామాలను తలచుకుంటే నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆ క్షణంలో ఊదీ పెట్టాలని నాకెలా తట్టిందో! అంతా బాబా లీల. "థాంక్యూ బాబా! 'మీరసలు దైవమే కాదు, ఒక మాములు మనిషి' అని అంటారు మా నాన్న. అలాంటి ఆయనపై కూడా మా ప్రార్థనలను విని వెంటనే మీ కృప చూపారు".

అక్కడికి ఒక సంవత్సరం తరువాత నాన్న ఒక గ్రామానికి వెళ్లి హై బి.పి. కారణంగా క్రిందపడిపోయారు. అప్పటినుండి మా కుటుంబసభ్యులు ఎప్పుడు బయటకు వెళ్లినా, "వాళ్ళని క్షేమంగా ఇల్లు చేర్చమ"ని బాబాని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. చాలారోజుల తరువాత 2019, జనవరి 1 ఉదయాన మేమంతా నిద్రలేచాక నాన్న మాతో, "రాత్రి నా గుండెల్లో నొప్పి వచ్చింది. మీలో ఒక్కరి పెళ్లి కూడా చేయకుండా చనిపోతానేమోనని భయమేసింది" అన్నారు. మేము డాక్టరుని సంప్రదించమని సలహా ఇచ్చాము. కానీ ఆయన అందుకు అంగీకరించకుండా, "డాక్టరు దగ్గరకి వెళ్లితే డబ్బులు వృధా చేసుకోవడమే! అయినా మేనకోడలు వివాహానికి రెండు లక్షలు ఇవ్వాల్సి ఉంది" అన్నారు. 3, 4 రోజుల తరవాత ఆయన్ని ఒప్పించాము. నాన్న, మా బ్రదర్ హాస్పిటల్ కి వెళ్లారు. హార్ట్ స్పెషలిస్ట్ నాన్నను పరీక్షించి, "ఈమధ్య కాలంలో ఈయనకి తీవ్రమైన స్ట్రోక్ వచ్చింది. ఈయనకు బ్రతికే అవకాశం కేవలం 20% మాత్రమే ఉంది. కాబట్టి వెంటనే హాస్పిటల్లో చేర్చండి" అన్నారు. మేమంతా చాలా భయపడిపోయాము. ఆ సమయంలో మా వద్ద డబ్బులు కూడా అందుబాటులో లేవు. అయితే మా అదృష్టంకొద్దీ గవర్నమెంట్ ఉద్యోగి అయిన నాన్న చికిత్స ఏ ఖర్చూ లేకుండా ఉచితంగానే జరుగుతుంది. మా నాన్న హాస్పిటల్ కి వెళ్లడమే చేయాల్సింది. కానీ మా నాన్న ఒప్పుకునే స్థితిలో లేరు. మేము హాస్పిటల్ పేరు ఎత్తితేనే ఆయన మండిపడేవారు. ఆయన, "ఆపరేషన్ తరువాత బ్రతుకుతానని గ్యారెంటీ ఉందా? నేనేమైనా ఇప్పుడే చనిపోతున్నానా? ఎందుకు హాస్పిటల్ కి వెళ్లి డబ్బులు వృధాపరచుకోవడం?" అంటూ చాలా మొండిగా, వెర్రిగా మాట్లాడుతుండేవారు. అలా అరుస్తూ మా నోర్లు మూయించేస్తుండేవారు. ఆయనకు ఏమవుతుందోనని మేము ప్రతిక్షణం ఆందోళనపడుతూ ఉండేవాళ్ళం. నేను, "బాబా! ఈ రాతిమనిషిని మార్చి, హాస్పిటల్లో చేరేలా సహాయం చేయండి" అని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని.

ఒకరోజు క్వశ్చన్ & ఆన్సర్ సైట్ లో అడిగితే, "రెండు రోజుల్లో మీ బాధ తీరిపోతుంది" అని వచ్చింది. నేను రెండురోజుల్లో నాన్న హాస్పిటల్ లో చేరడానికి ఒప్పుకుంటారనుకున్నాను. కానీ, మా నాన్న విషయం మా అమ్మ ద్వారా తెలుసుకుని ఊరినుండి మా తాతగారు వచ్చారు. ఆయనకు ఆక్యుపంక్చర్‌ వైద్యం తెలుసు. ఆయన చాలామంది రోగులకు నరాలను సరిచేస్తూ వైద్యం చేస్తుంటారు. ఆయన నాన్నను పరిశీలించి చికిత్స చేశారు. పక్షవాతం ఉన్న నాన్న చేతిని రెండు నిమిషాల్లో సరిచేశారు. మూడురోజులు చికిత్స చేయించుకున్నాక ఆఫీసులో పనుందంటూ నాన్న ఆఫీసుకి వెళ్లిపోయారు. మా తాత అన్ని నరాలు సరిచేసి ఊరికి వెళ్లిపోయారు. ఆవిధంగా బాబా మా తాతని పంపి మొండిమనిషైన మా నాన్నకు చికిత్స చేయించారు. తరువాత పెళ్లిపనుల్లో కూడా నాన్న చురుకుగా పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన క్షేమంగా ఉన్నారు. అంతా బాబా కృప. హృదయపూర్వకమైన పిలుపు ఒక్కటి చాలు, ఆయన మనకోసం వస్తారు. ఆయనెప్పుడూ మనకోసం ఉన్నారు. ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా బాబా మా నాన్నని కాపాడారు. "థాంక్యూ బాబా! మీరు లేకపోతే ఈరోజు మేము ఉండేవాళ్ళం కాదు. మా అందరి జీవితాలు మీరు పెట్టిన భిక్షే. అంతులేని మీ అశీస్సులకు చాలా చాలా ధన్యవాదాలు!"

బాబా నాకు కొండంత అండ

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

చక్కటి బ్లాగులు నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. మీరు నిజంగా మంచిపని చేస్తున్నారు. భక్తుల విశ్వాసం వృద్ధి చెందడానికి ఈ బ్లాగులు ఎంతగానో సహకరిస్తున్నాయి. నేను సాయిబాబాకు చాలా సాధారణ భక్తురాలిని. మాటల్లో వివరించలేని ఎన్నో అనుభవాలు నాకున్నాయి. వాటిలో కొన్నింటిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

2016 నాకు చాలా కీలకమైన సంవత్సరం. నేను పరీక్షలలో విఫలమైనందున నా గ్రాడ్యుయేషన్ పూర్తిచేయలేకపోయాను. అందువలన నేను చాలా కలత చెందాను. అదే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. ఆ కారణాలచేత నాలో మానసిక ఒత్తిడి తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. అటువంటి చెడుదశలో ఒకరోజు నేను ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తుండగా సాయిబాబా ఫోటో నా దృష్టిలో పడింది. ఆ ఫోటోపై "నా లీలలు చదువు, నీ కోరిక నెరవేరుతుంది" అని ఉంది. వెంటనే నేను ఇంటర్నెట్‌లో వెతికి సాయిబాబాకు సంబంధించిన వెబ్‌సైట్ ను చూశాను. అందులోని భక్తుల అనుభవాలు చదివిన తరువాత నా మనసుకు చాలా శాంతి లభించింది. ఆ క్షణంనుండి నేను సదా "బాబా! నాకు నయం చేయండి" అని ప్రార్థిస్తుండేదాన్ని. ఒకరోజు ఆన్లైన్‌లో సాయిబాబా ప్రసాదం ఆర్డర్ చేశాను. ప్రసాదంతోపాటు ఊదీ కూడా వచ్చింది. నేను ఊదీని నా నుదుటిపై పెట్టుకుని, కొద్దిగా నీళ్లలో కలుపుకుని త్రాగాను. కొద్దిరోజుల్లో నా ఆరోగ్యం మెరుగుపడటం మొదలైంది. నా సంతోషానికి అవధుల్లేవు. బాబా చేసిన సహాయానికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అప్పటినుండి బాబాపట్ల నా విశ్వాసం దృఢమైంది.

2017లో మా నాన్నగారి కాలికి ఇన్ఫెక్షన్ అయ్యింది. దానితో అసలే షుగర్ వ్యాధిగ్రస్తుడైన ఆయన కాలు బాగా వాచిపోయింది. ఆయన కాలు తీసివేయాల్సి వస్తుందేమోనని నేను భయంతో, "బాబా! నాన్న కాలికి ఏమీ కాకుండా చూడండి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. బాబా కృపవలన మందులతో ఆయన కాలి ఇన్ఫెక్షన్ నయమైపోయింది. నేను సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నిజంగా బాబా కరుణామయులు. భక్తుల ఆపద సమయాలందు ఆయన తప్పక రక్షణనివ్వడానికి వస్తారు. మనం ఆయనపట్ల విశ్వాసంతో హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉండాలంతే! నేను మొదట్లో చాలా పిరికివ్యక్తిని. సాయిబాబాను ప్రార్థించిన తరువాత నా మీద నాకు చాలా నమ్మకం ఏర్పడింది. సాయి నాకు సహాయం చేసిన చిన్న సంఘటనలు చాలా ఉన్నాయి. నేనెప్పుడూ బాబా ఊదీని నాతో ఉంచుకుంటాను. "నాకు, నా కుటుంబసభ్యులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నందుకు ధన్యవాదాలు బాబా!"

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! 

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo