సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 178వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. శిరిడీ దర్శనంతో చిక్కులన్నీ విడిపోయాయి
  2. కలల కంపెనీలో ఉద్యోగం ఇచ్చిన బాబా.

శిరిడీ దర్శనంతో చిక్కులన్నీ విడిపోయాయి

సాయిబంధువులందరికీ నా నమస్కారం. నా పేరు శిరీష. నేను నెల్లూరు నివాసిని. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనస్ఫూర్తిగా బాబాని నమ్ముకుంటే ఎంతటి కష్టమైనా తీరుతుందనటానికి నిదర్శనమైన నా అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.

మా అమ్మాయి బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. నెలసరి సమయంలో హార్మోన్ల ప్రాబ్లెమ్ వల్ల తను చాలా ఇబ్బందిపడుతుంటుంది. ఆ సమయంలో తనకి తీవ్రంగా జ్వరం రావడం, నోరంతా పొక్కి అల్సర్స్ రావడం జరుగుతుంటుంది. దాదాపు కదలలేని పరిస్థితి. ఎంతోమంది డాక్టర్లకు చూపించాము. కానీ పరిస్థితిలో ఏ మార్పూ లేదు. తనకున్న ఈ సమస్య కారణంగా నెలలో రెండుసార్లు కాలేజీకి హాజరు కాలేకపోయేది. తల్లిదండ్రులుగా మేము కాలేజీకి వెళ్లి తన తరపున లీవ్ లెటర్ ఇచ్చి, వాళ్ళను రిక్వెస్ట్ చేసేవాళ్ళం. ఇలా ఉండగా తనకి పరీక్షలు దగ్గరపడ్డాయి. తన ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ కష్టపడి చదివి పరీక్ష వ్రాయడానికి కాలేజీకి వెళ్ళింది. కానీ, కాలేజీ యాజమాన్యం కారణమేమీ చెప్పకుండానే తనని పరీక్షకు హాజరు కానివ్వకుండా ఆపేసారు. తనకేమీ అర్థంకాక అక్కడే ఏడుస్తూ కూర్చుంది. పరీక్ష అయిపోయాక కాలేజీ వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు. మేము వెళ్లి కారణమడిగితే, "పాపని డిటైన్(అంటే, పరీక్షలు వ్రాయనివ్వరు, రెండవ సంవత్సరానికి ప్రమోట్ చేయరు) చేశామ"ని చెప్పారు. ఆ క్షణం మేము పడ్డ బాధ వర్ణనాతీతం. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. కాలేజీలో ఒకరిని కాదు, అందరినీ కలిసి ప్రాధేయపడ్డాం. కానీ లాభం లేకపోయింది. అసలే ఆరోగ్యం బాగలేని మా అమ్మాయి ఈ సంఘటనతో బాగా కృంగిపోయింది. దిగులుతో అసలు మంచం దిగేది కాదు. మేము తననలా చూడలేకపోయేవాళ్ళం. పరీక్షలన్నీ అయిపోయాయి. ఒక సంవత్సరం వృధా అయిపోయింది. తరువాత కాలేజీవాళ్ళు 'ఫీజు కట్టి మళ్ళీ మొదటి సంవత్సరంలో చేర్పించమ'ని చెప్పారు. నిజానికి మా అమ్మాయికి ఫ్రీ సీటు వచ్చింది. అయినప్పటికీ ఫీజు కట్టమని చాలా కటువుగా మాతో మాట్లాడారు. పిల్లల భవిష్యత్తుపై వాళ్లకు కొంచెం కూడా కనికరం లేదు. దాంతో మావారు ఇక ఈ కాలేజీలో తనని ఉంచడం మంచిది కాదని, తన సర్టిఫికెట్స్ ఇచ్చేయమని అడిగారు. అందుకు వాళ్ళు ఏమీ పట్టనట్లు కూల్‌గా, "సర్టిఫికెట్స్ ఇవ్వము. మీరు ఫీజు కట్టి ఇక్కడే చదివించండి. కాదూ కూడదంటే 50,000 రూపాయలు కట్టి సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళండి" అని చెప్పారు. మాకు మతిపోయింది. ఒకవైపు వాళ్ళేమో అలా మాట్లాడుతున్నారు. మరోవైపు చూస్తే, మధ్యలో ఏ కాలేజీలో చేర్చుకోరు, ఒకవేళ చేర్చుకున్నా లక్షల్లో ఫీజు కట్టాలి, ఎలాగో ఒకలా దానికి కూడా సిద్ధపడ్డా అదే బ్రాంచ్ దొరకదు. అటువంటి క్లిష్ట పరిస్థితులలో, 'ఇక మాకు బాబాయే దిక్కు' అని పాపని తీసుకొని శిరిడీ వెళ్లడానికి నిర్ణయించుకున్నాము. బాబా కృపవలన ప్రయాణానికి అవసరమైన టికెట్స్ విషయంలోగాని, అక్కడ ఉండటానికిగాని మాకు ఎటువంటి ఇబ్బందీ కాలేదు. నిజానికి నాకు, మా పాపకు నెలసరి సమయమది. కానీ ప్రయాణానికి, దర్శనానికి ఇబ్బంది లేకుండా బాబా అనుగ్రహించారు. బాబా దర్శనం చేసుకొని, సమస్యను ఆయనకు విన్నవించుకొని ఆయన పాదాలకు శరణన్నాము.

శిరిడీ నుండి వచ్చాక నేను కాలేజీలు వెతకడం ప్రారంభించి, ఒక కాలేజీ అయితే మాకు అనుకూలంగా ఉంటుందని అనుకున్నాను. కానీ అక్కడ సేమ్ బ్రాంచ్ లేదు సరికదా ఫీజు లక్షల్లో ఉంది. ఏమీ అర్థంకాక నేను బాబాని, "పాప భవిష్యత్తు పాడవకుండా కాపాడండి" అని తీవ్రంగా ప్రార్థించాను. వెంటనే ఒక అద్భుతం జరిగింది. మేము కోరుకున్న కాలేజీవాళ్ళు వాళ్ళంతట వాళ్లే ఫోన్ చేసి, "మా కాలేజీలోని ఒక విద్యార్థి తండ్రికి వేరే ఊరికి బదిలీ అవడం వలన ఆ విద్యార్థి స్థానంలో మీ అమ్మాయిని తీసుకుంటాం. ఆ సీటు మీరు కోరుకునే బ్రాంచ్ లోనే ఉంది. ఫీజులో 75% కన్సెషన్ కూడా ఇస్తాము" అని చెప్పారు. పట్టలేని ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకొని వెంటనే కాలేజీకి వెళ్ళాము. మా అమ్మాయికి సీటు కేటాయించారు. ఫీజు కూడా మా స్థాయిలోనే ఉంది. ఇకపోతే నేను వాళ్లతో, "మా అమ్మాయి సర్టిఫికెట్స్ ప్రస్తుతం మావద్ద లేవు. పాత కాలేజీ వాళ్ళు వాటిని ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మీరు కొంచెం సమయమిస్తే వాటిని తెచ్చిస్తాన"ని చెప్పాను. వాళ్ళు అందుకు అంగీరించారు.

తరువాత మేము పాత కాలేజీకి వెళ్లి సర్టిఫికెట్స్ కోసం గట్టిగా అడిగాము. వాళ్ళు డబ్బులు ఇస్తే సర్టిఫికెట్స్ ఇస్తామని పాత పాటే పాడారు. వాళ్ళకి మాకు మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. ఆ సమయమంతా మేము మనసులో బాబా నామజపం ఆపకుండా చేస్తూనే వున్నాము. చివరికి వాళ్ళు, "రెండురోజుల తరువాత రండి, సర్టిఫికెట్స్ ఇస్తామ"ని చెప్పారు. నిజానికి మేము మూడునెలలనుంచి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా వాళ్ళనుండి సానుకూలమైన స్పందనలేదు. కానీ శిరిడీ వెళ్లి రాగానే మా సర్టిఫికెట్స్ మాకు వచ్చాయి. అంతా బాబా దయ. ఎంతో పెద్ద కష్టంనుంచి ఆయన మమ్మల్ని బయటపడేశారు.  "థాంక్యూ బాబా! మీరే మా తండ్రి. ఎల్లప్పుడూ ఇలాగే మాకు తోడుగా ఉండండి".

కలల కంపెనీలో ఉద్యోగం ఇచ్చిన బాబా.

హైదరాబాదు నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయిబాబా భక్తురాలినైన నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీరుని. సరైన సమయం వచ్చినప్పుడు సాయిబాబా మన ప్రార్థనలకు ఖచ్చితంగా సమాధానం ఇస్తారు. అందుకు మనం శ్రద్ధ, సబూరి కలిగి ఉండాలి. 2018, డిసెంబరులో నేను ఉద్యోగం చేయాలని కలలుగనే ఒక సంస్థలో మొదటి రౌండు ఇంటర్వ్యూకి హాజరయ్యాను. తరువాత అన్ని రౌండులు విజయవంతంగా పూర్తిచేసి ఆఫర్ లెటర్ కోసం ఎంతో ఆతృతగా నిరీక్షించాను. కానీ నెలరోజులు గడిచినా ఆఫర్ లెటర్ రాలేదు. అప్పుడు సచ్చరిత్ర సప్తాహ పారాయణ చేశాను. ఎనిమిదవరోజు గురువారంనాడు నేను పులిహోర తయారుచేసి బాబా మందిరానికి తీసుకెళ్ళాను. బాబాకు నా కోరికలు నివేదించుకుని కొంత డబ్బు అన్నదానానికి డొనేట్ చేశాను. నాతోపాటు తీసుకుని వెళ్లిన పులిహోరను అన్నదానంలో భక్తులకు పంపిణీ చేయమని మందిరంలో ఇచ్చాను. ఆ తరువాత సరిగ్గా రెండువారాలకి, రెండునెలల నిరీక్షణానంతరం నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. నేను కలలుగన్న కంపెనీలో ఉద్యోగం రావడంతో నా ఆనందానికి అవధుల్లేవు. మొదట్లో నేను ఈ కోరిక నెరవేర్చినట్లైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని నా మనసులో అనుకున్నాను. కానీ ఇప్పుడు, 'షరతులు పెట్టకుండా హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించడమే మనం చేయాల్సింది' అని గ్రహించాను. "అలా ఆలోచించినందుకు నన్ను క్షమించండి బాబా! ఈ బిడ్డకు తన కలల కంపెనీలో ఉద్యోగాన్నిచ్చి ఆశీర్వదించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. నాకున్న మరొక కోరిక కూడా మీకు తెలుసు. దయచేసి ఆ కోరికను కూడా నెరవేర్చండి. నాకు తెలుసు, మీరు నెరవేరుస్తారని. సర్వప్రాణులను ఆశీర్వదించండి బాబా!" బాబా ఆశీస్సులతో మరొక అనుభవాన్ని అతిత్వరలో మీతో పంచుకుంటాను.

ఓం సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సర్వేజనాః సుఖినోభవంతు. 

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo